సేవ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది
Sevakula Prasangalu
యేసుప్రభువు చేసిన కొండమీది ప్రసంగంలో చివరి అంశం – బుద్ధిమంతుడు మరియు బుద్ధిహీనుడు ఇద్దరు కట్టిన ఇండ్లతో తన ప్రసంగాన్ని ముగించాడు. ప్రభువు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు “ఇల్లు” కట్టుకొనిన “విధానము” ను గురించి వివరిస్తున్నాడు. బుద్ధిమంతుడికీ, బుద్ధిహీనునికీ మధ్యగల ఒక వ్యత్యాసమును, లేదా తేడాను గూర్చి ప్రభువు స్పష్టముగా బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఇద్దరికీ ఒకే రకమైన ఆశలూ, కోరికలూ ఉన్నాయి. రెండు రకాల వాళ్లూ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు అంటే క్రీస్తులో తాను కట్టుకొన్న అధ్యాత్మిక జీవితం కావొచ్చు, లేదా పరిచర్య కావొచ్చు! ఇక మనం చెప్పుకోవాలంటే – అది ఒక వివాహ జీవితానికైనా పోలిక కావొచ్చు!
ఇది సేవకులకు సంబంధించిన ఆర్టికల్ గనుక మనం దీనిని పరిచర్యకు పరిమితం చేసుకుందాం! ప్రభువు మాట్లాడుతూ – ఆ రెండు ఇండ్ల పునాదులను గూర్చి నొక్కి వక్కాణిస్తూ – ఒకడు “బండ” మీద పునాది వేశాడు. మరొకడు “ఇసుక” మీద పునాది వేశాడు అన్నాడు. ఒకడు పునాది కొరకు బండను వాడుకున్నాడు. మరొకడేమో ఇసుకను వాడుకున్నాడు. పునాది విషయంలో ఇసుకను మించింది బండయే కదా! నాసిరకముతో కూడినది ఇసుకైతే – నాణ్యత గలది బండ!
ఇద్దరి ఇళ్లమధ్య ఉన్న పెద్ద తేడా వారు తీసిన పునాదిలోనే ఉంది. పునాది ఒక ఇంటిలో కంటికి కనిపించని భాగం. అది భూమిలోపలే ఉంటుంది గానీ, ఇల్లంతటికీ అదే ఆధారం.
కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు అని ప్రభువు అన్నాడు. మొదటి వ్యక్తి ప్రభువు మాటలకు చెవియొగ్గి వాటికి విధేయత చూపించడం ద్వారా తన జీవితమునూ పరిచర్యనూ బలమైన పునాది మీద కట్టుకున్నాడు. అతడు జ్ఞానవంతుడు అంటూ ప్రభువుచే ప్రశంసలందుకున్నాడు. లూకా 6:48లో ప్రభువు ఇలా చెప్పాడు – లోతుగా త్రవ్వి బండమీద పునాది వేశాడని బోధించాడు.
ప్రియ దైవజనులారా! మనమును మన పరిచర్యను “విధేయత” అను బండపై పునాది వేసుకోవాలి! కాదు కాదు – విధేయత చూపుట ద్వారా – బండపై పునాది వేసుకోవాలి! మన పరిచర్య యేసు రాకడ వరకు నిలబడాలంటే పునాది ముఖ్యం!
మన స్వంత తలంపులూ ఊహలూ మనోభావాలూ ఆలోచనలూ ఇవన్నీ ఇసుకపై పునాది వేయడం లాంటివి. దేవుని సేవ దేవుని పద్ధతిలోనే కొనసాగాలి. దేవుని నిర్ణయ విధానంలోనే అది సాగిపోవాలి. ఆయన బయలు పరచిన సంకల్పం చొప్పుననే అది జరిగిపోవాలి. అప్పుడది బలమైనదిగాను, బండపై కట్టబడినదిగాను నిలిచిపోతుంది.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వరకు గల వాక్య భాగంలో మనం చూచినప్పుడు ఆ రెండు ఇళ్లకూ పరీక్షలు ఎదురైనాయి. ప్రియ సేవకులారా! ఒకటి గుర్తుంచుకుందాం. ప్రతి ఇల్లూ పరీక్షింపబడుతుంది. ఇది తప్పకుండా జరిగే కార్యము – దీనికెలాంటి సందేహము లేదు. ఆ రెండు ఇళ్లను వాన, గాలి మరియు వరదలు పరీక్షించాయి. ఏమిటీ వానలు? ఏమిటీ గాలులు? ఏమిటీ వరదలూ? Sevakula Prasangalu
వాన పైనించి కురుస్తుంది. అంటే పైనించి వచ్చే పరీక్ష, లేదా పరిశోధన! పైనించి అంటే దేవుని దగ్గర నుంచి అన్నమాట! దేవుడు మనలను, మన పరిచర్యలను పరీక్షిస్తాడు. ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రాహామును పరిశోధించాడు. ఆ పరిశోధనలో అబ్రాహాము నెగ్గాడు. జయ జీవితమును అనుభవించాడు.
దేవుడు మనలను ఖచ్చితంగా పరిశోధిస్తాడు. పరిశోధన లేకుండా మనలను ప్రమోట్ చెయ్యడు. దేవుని సేవలో ఆకలి పరిశోధన, ఆర్థిక పరిశోధన, ఎంత ప్రార్థించినా జవాబులు కంటికి కనిపించకుండా ఇంకా ఆలస్యం అవుతూ ఉండే పరిశోధన, మనలను ఇంకేదో త్యాగము చేయుమని ఆయన కోరుకునే పరిశోధన…యిలాంటివి ఎన్నో పరిశోధనలు పైనుంచి వస్తూ వుంటాయి. ఆయన వాగ్దానాలపై మనం నిలిచియుంటే వాటన్నిటిపై జయమును మనం పొందుకుంటాం. Sevakula Prasangalu
మనలనూ – మన సేవలను పరిశోధించే పరంపరలో రెండవది – గాలి! గాలి అంటే ఏమిటి? ఎవరికైన దయ్యం పట్టిందనుకోండి – వాళ్లు అనే మాట – గాలి పట్టింది అంటారు. ఇప్పుడర్థమైందా? గాలి అంటే సాతాను అని అర్థం. సాతాను కూడా పరీక్షిస్తాడు. అంటే శోధిస్తాడన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువును కూడా శోధించినట్లుగా మనం చూడగలం! సేవకులమైన మనలను వాడు తరచుగా మనం గర్వించేట్టుగా పక్కా ప్రణాళికతో సిద్ధమై వస్తాడు. గర్వం మహా ప్రమాదం! దేనిని బట్టి మనం గర్వించకూడదు. ఎందుకంటే గర్వించేందుకు మనది అంటూ ఏదీ లేదు. అన్నీ ఆయనవే, ఆయనిచ్చినవే! ఇంక అపవాది స్త్రీ విషయంలోను శోధించడంలో దిట్ట. ఎందరో ఈ శోధన ద్వారా పడిపోయారు, పాడైపోయారు, పాడెపై మోసికొని పోబడ్డారు. ఈ శోధన విషయంలో అక్కన్నించి యోసేపు వలె పారిపోవడమే పరిష్కారం. ఇంక చెప్పుకుంటూ పోతే – సిరి విషయంలో కూడా శోధించి దెబ్బ కొడతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటోంది లేఖనం. ఇదంతా గాలి ద్వారా వచ్చే పరీక్షలు.
చివరగా – వరదలు కూడా మనలను పరీక్షిస్తాయి. వరదలంటే ఏమిటి? వరదలు భూమి మీద పారుతాయి. కీర్తనాకారుడైన దావీదు 18వ కీర్తనలో – “భక్తిహీనులు వరద పొర్లువలె నా మీద పడి బెదిరింపగను….” అంటూ నాలుగవ చరణంలో గానం చేశాడు. వరదలు అంటే భక్తిహీనులైన సమాజము అని అర్థం. మనుష్యుల నుంచి మనకు కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అయితే మనం వీటిని జయించాలంటే దీనికి విరుగుడు ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థనలే కారణం! Sevakula Prasangalu
ప్రియ సేవకులారా! ప్రభువు కొరకు మనం ఎంతో ఆసక్తితో “సేవ” అనే ఇల్లు కడుతున్నాం. దేవుని మాటలపై, ఆయన సెలవిచ్చిన దానిపై విధేయతతో పునాది లోతుగా త్రవ్వి ఇల్లు కడుతున్నామా? పేరు ప్రఖ్యాతుల కోసం – అట్టహాసం ఆడంబరాలతో పైపైన పునాది వేసి ఇల్లు కట్టుకుంటున్నామా? ఈ రోజున ఎందరో కూలిపోయిన ఇళ్లతో సేవలన్ని వెలవెలబోయి తలవంచుకొనిన స్థితిలో దిక్కుతోచక తిరుగుతూ ఉన్నారు. రేపు న్యాయపీఠం ముందు నించొని మనం ఏమని సమాధానం చెప్పగలం? ఆలోచించండి!
పునాది ఎప్పుడు కూడా బయటకు కనిపించదు. అది భూమిలోపలే ఉంటుంది. దానికి హంగు ఆర్భాటములు ఉండవు. ప్రభువు సన్నిధిలో మనం సిద్ధపడిన సిద్ధపాటే బండపై వేసిన పునాది అని మరచిపోవద్దు.
- రహస్యముగా దేవునితో నీవు గడిపిన సమయాలు
- నీ పరిచర్యకు మణి భూషణములని గుర్తుంచుకో!!
For Pdf Download ….Click Here