Sevakula Prasangaalu Telugu – రక్త స్రావం దాని లక్షణాలు – Telugu

Written by biblesamacharam.com

Published on:

రక్త స్రావం – దాని లక్షణాలు 

Sevakula Prasangaalu Telugu

   రక్త స్రావం ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన వ్యాధి. బైబిలు స్త్రీని మానవజాతికీ, సమాజానికీ, సంఘానికీ పోల్చింది. స్త్రీ మానవజాతికీ – వ్యాధి పాపానికి సాదృశ్యం. రక్తస్రావ రోగ లక్షణాలు కొన్ని చూద్దాం! 

1.) ఈ వ్యాధి అపవిత్రమైనది!

(స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లమూ అపవిత్రము అంటోంది లేఖనం – లేవీ 15:9; అపవిత్రులు యెహోవాకు హేయులు. అపవిత్రుడు పవిత్రుడైన దేవున్ని కలుసుకోలేడు – యెష. 1:12, కీర్తన 50:16, లేవీ 21:23, యెహె. 36:17 చూడండి. అపవిత్రతకు చాలా పేర్లున్నాయి – అవినీతి, జారత్వం, లైంగిక దోషం, శుభ్రంలేని, మలినమైన, మర్యాదలేమి, కామాతురత, మితిమీరిన మమకారం, స్వాధీనంలేని వాంఛ, దురాశ, చెడు వాంఛ ఇవన్నీ అపవిత్రతలోనికే వస్తాయి. అయితే ఆయన మాట మనలను పవిత్ర పరుస్తుంది – యోహాను 15:3)

2.) ఈ వ్యాధి అవమానకరమైనది!

(పాపము ప్రజలకు అవమానం తెచ్చును అని బైబిలు చెబుతోంది సామె. 14:34. పదిమందిలో ఈ వ్యాధిగలవారు బయటపడలేరు – అది వారికి  అవమానకరం. దేవుని బిడ్డ, నీకు అవమానం రాకముందే పాపాన్ని విడిచిపెట్టు) 

3. ఈ వ్యాధి అసహ్యకరమైనది! 

 (పాపము చేయువారందరు నీకసహ్యులు – కీర్తన 5:5; కొన్ని వ్యాధులు చెప్పుకోవచ్చు- కాని ఈ వ్యాధిని గూర్చి మనం ఎవరికీ చెప్పుకోలేం. ఇది రోత పుట్టించేది. పిల్లలు రోత చేసుకుంటే – రోతను అసహ్యించుకుంటాం. పిల్లలను హత్తుకుంటాం – ఎప్పుడు? శుభ్రంగా కడిగాక. దేవునికి అసహ్యం పుట్టించే కొన్ని ఉన్నాయి చూడండి – సామె. 3:32, 8:7, కీర్తన 101:3, 119:163, యెష. 61:8, ఆమోసు 6:7, జెకర్యా 8:7) 

4. ఈ వ్యాధి బలహీనత తీసుకొస్తుంది!

(సింహాన్ని చీల్చేసినవాడు, 300 నక్కలను పట్టుకున్నవాడు, గాడిదయొక్క పచ్చిదవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు, గాజా పట్టణపు తలుపులను రెండు ద్వార బంధములను ఊడబెరికి హెబ్రోనుకు ఎదురుగా నున్న కొండకు తెచ్చినవాడు బలహీనుడైపోయాడు – ఎవరో ఆ హీరో మీకు తెల్సే ఉంటుందిగా! మన సంసోను సారండీ! వ్రతం తప్పాడు. బలం తొలగింది. వ్యాధి అతన్ని బలహీనం చేసింది – వ్రతం పోగొట్టుకోకు మిత్రమా!) 

5.) ఈ వ్యాధి దుర్వాసన కలిగిస్తుంది!

(రక్తస్రావ వ్యాధి వాసన – దుర్వాసన, నీచువాసన. పాపం వలన కలిగే గాయాలు దుర్వాసనే మరి! నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటుంది లేఖనం – కీర్తన 38:5. దుర్వాసనను అందరు అసహ్యించుకుంటారు. పాపం ద్వారా వచ్చే ప్రభావాన్ని కూడా అందరు అసహ్యించుకుంటారు. క్రీస్తు కొరకు పరిమళ వాసనగా ఉందాం!) 

6.) ఈ వ్యాధి అనైక్యత కలిగిస్తుంది!

(సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! కీర్తన 133:1; ఈ వ్యాధి ఉంటే భార్య భర్తలు కలుసుకోకూడదు. ఈ వ్యాధి భార్య భర్తల్ని విడదీస్తుంది. అనైక్యతకు మొదటి కారణం – పాపం! ఎన్నో కుటుంబాలు ఈ పాపపు వ్యాధి వలన విడిపోయాయి. పతనమయ్యాయి) 

7. ఈ వ్యాధి వలన సంతానం కలుగదు! 

(సంతానం అంటే అభివృద్ధి, విస్తరణ, సఫలత, ఎదుగుదల అని అర్థం. మనలో రహస్యంగా దాచబడిన పాప వ్యాధివలన సంతాన హీనులమగుచున్నాం. చివరికి వారు – సంతానహీనులై మరణమగుదురు – లేవీ. 10:17 చొప్పున జరుగుతుంది) 

  • బలమైన విశ్వాసిని బలహీనపర్చేది, బలమైన ప్రసంగికున్ని ఎండుటాకులా మార్చేది, పరిశుద్ధుని పడగొట్టేది, పోరాట పటిమగల యోధున్ని పరాజితునిగా చేసేది ఒక్కటే – అదే పాపం! 

All Pdf Files….Download

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “Sevakula Prasangaalu Telugu – రక్త స్రావం దాని లక్షణాలు – Telugu”

  1. యేసు క్రీస్తు ప్రభువు నామమున మీకు వందనాలు బ్రదర్

    Reply

Leave a comment

error: restricted