John Gibson Paton Missionary Telugu – జాన్ గిబ్సన్ పాటన్

జాన్ జి. పేటన్ (1824-1907)

John Gibson Paton Missionary Telugu

 జాన్ జి. పేటన్ స్కాట్లాండ్లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో 1824 వ సంవత్సరములో జన్మించెను. ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్థుడు. అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు. తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూచిన పేటన్ చిన్న వయస్సులోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించెను. పన్నెండు సంవత్సరాల వయస్సులోనే గ్రీకు, లాటిన్ భాషలు అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారములో తోడ్పడేవాడు. తరువాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యను కూడా అభ్యసించెను. పేదవారి మధ్య సేవచేస్తూ; త్రాగుబోతులు, వ్యభిచారులు, నాస్తికులుగా ఉన్నవారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను యేసువైపు త్రిప్పెడివాడు. 

 అంతేగాక ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తు నెరుగకనే మరణిస్తున్నారని తెలుసుకున్న పేటన్ వారి మధ్యకు మిషనెరీగా వెళ్ళి సేవ చేయాలని 

 ఆశపడి ప్రార్ధించెను. “న్యూ హైబ్రిడీస్” దీవులలో మిషనెరీ అవసరతను గుర్తించెను. దేవుని పిలుపును విని నరమాంస భక్షకులు జీవించే ఆ దీవులకు వెళ్ళుటకు సిద్ధపడెను. కొందరు నీవు వాళ్ళ మధ్యకు వెళితే “నిన్ను వాళ్ళు చంపుకు తినేస్తారని” భయపెట్టారు. అయితే జాన్ పేటన్ ధైర్యంగా, “ఏలాగూ నేను చనిపోయిన తర్వాత సమాధిలో నన్ను పాతిపెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు. కాబట్టి క్రీస్తుకొరకు నేను జీవించినపుడు నన్ను నరమాంస భక్షకులు తిన్నా చింతెందుకు?” అనేవాడు. 

 “నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తుకొరకే!” అంటూ తన ముప్ఫైమూడవ ఏట అనగా 1857 వ సంవత్సరములో వారి మధ్యకు, తన భార్యతో పాటు సేవకు వెళ్ళెను. టానా అనే ద్వీపములో ప్రవేశించెను. ఆ దీవులలో అనేక తెగల ప్రజలు జీవించెడివారు. ఒక తెగతో మరొక తెగవారు పోరాడుకొనుచు, జయించినవారు మరణించినవారి శరీరాలను భక్షించుచుండెడివారు. వారి క్రూరత్వాన్ని, మూఢత్వాన్ని చూచిన పేటన్ కన్నీటితో వారికొరకు ప్రార్థిస్తూ, ధైర్యముగా అటువంటి నరమాంస భక్షకుల మధ్య పరిచర్య చేయుటకు ముందుకు సాగెను. 

 వారు బహుమూఢ ఆచారములు కల్గిన జనులు! మంత్రములు, తంత్రములు నమ్ముచు, బలులు అర్పించుచుండెడివారు. అచ్చట వాతావరణము బహు కలుషితమైనదైనందున; పేటన్ భార్య, చిన్న బిడ్డ కూడా వ్యాధిగ్రస్థులై త్వరలోనే మరణించిరి. జ్వరముతో పేటన్ కూడా బాధపడుచున్నను, తానే స్వయంగా తన చేతులతో సమాధులు త్రవ్వి తనభార్యను, బిడ్డను పాతి పెట్టవలసి వచ్చినది. అయినను ‘ప్రభువే నన్ను ఆదరిస్తున్నాడు ఆయన సాన్నిధ్యం నాతో లేనియెడల నాకు మతి చలించి యుండును’ అంటూ పట్టువిడువని పేటన్ నరమాంస భక్షకుల మార్పుకొరకు పట్టుదలతో ప్రార్థించుచుండెను. 

 ఆ జనుల మధ్య బహు సహనముతో క్రీస్తు ప్రేమను చూపించుచు, సంజ్ఞల ద్వారా యేసు ప్రభువును గురించి చెప్పుచు వారి భాష నేర్చుకొనుచుండెను. అనేకసార్లు అతనిని చంపడానికి వచ్చిన ఆ నరమాంస భక్షకుల బారి నుండి ప్రభువే తప్పించెను. ఆ తరువాత దగ్గరగా ఉన్న “అనీవా” ద్వీపమునకు కూడా వెళ్ళి వారి భాష నేర్చుకొని వారి మధ్య బహు సహనముతో ప్రయాసపడెను. 

 ఆ అనాగరికులు నీరు ఆకాశం నుండి కురుస్తుందని మాత్రమే ఎరుగుదురు. ఒకప్పుడు నీటికి బహు కొరత కలుగగా పేటన్ ఒక బావిని త్రవ్వడం ప్రారంభించాడు. ఆయన చేస్తున్నది ఎవరికీ అర్ధం కానందున భయపడి వారెవరూ బావి దగ్గరకు రాకపోగా, ఇంచు మించు ఆయన ఒక్కడే బావిని త్రవ్వి ఆ బావి నీటిని వారికందించెను. అది చూచిన ఆ ప్రజలు ఆశ్చర్యపడి “పేటన్ దేవుడే నిజమైన దేవుడు” అని అనుచు క్రీస్తును తమ ప్రభువుగా అంగీకరించిరి. 

 “అనీవా” ప్రజలు బహు అనాగరికులు. స్త్రీలు కొద్ది వస్త్రధారణ చేసెడివారు; పురుషులు, చిన్న బిడ్డలు దాదాపు దిగంబరులుగా ఉండెడివారు. వీరు పాములను ఆరాధించెడివారు. చిన్న బిడ్డలను బలి ఇచ్చెడివారు. అయితే జాన్ పేటన్ ప్రయాస, ప్రార్థనల వలన వీరు ఆ కార్యములను విడిచి రక్షించబడిరి. “అనీవా” యందు నమాకై అను నాయకుడు మొదట ప్రభువు నంగీకరించెను. తద్వారా అనేకులు మారిరి. 

 చివరికి కన్నీటి ప్రార్ధనతో, పట్టుదలతో వారి మధ్య చేసిన పరిచర్యవలన ఆ న్యూహైబ్రిడీస్ దీవులలోని 7 మైళ్ళ పొడవు 2 మైళ్ళ వెడల్పు ఉన్న “అనీవా” ద్వీప వాసులంతా క్రీస్తును అంగీకరించారు. 

 1899 లో పేటన్ “అనివా” భాషలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని సిద్ధపరచెను. యెనుబది యేండ్ల వయస్సులో పేటన్ ను విశ్రాంతి తీసుకొనుమని వైద్యులు ఎంతగా చెప్పినను లెక్క చేయక; ఉత్తరములు వ్రాయుటలోను, కాలినడకన గృహాలు సంధించి ప్రార్థించుటలోను, అర్థరాత్రి వరకు లేఖలు వ్రాయుచు బైబిలును తర్జుమా చేయుటలోను గడిపెడివాడు. ప్రతిరోజు ఏదో ఒక పని దేవుని కొరకు చేయనిదే కొంచెమైనా విశ్రాంతి తీసుకొనుటకు ఇష్టపడెడివాడు కాడు. ఆలాగు “నా అంతిమశ్వాస వరకు నేను సేవలో కొనసాగుతా”నన్న జాన్ పేటన్ ప్రపంచములోని పలు ప్రాంతములను సంచరించి ప్రభువు తనకు అప్పగించిన గొప్ప సేవచేసెను. తన 83 వ యేట అనగా 1907 జనవరి 28వ తేదీన ప్రభువు సన్నిధికి చేరెను. అచ్చట నున్నవారు అతడు మరణించుచుండగా, ఆయన ముఖముపై పరలోకపు వెలుగును చూచి, పరిశుద్ధ స్థలములో నిలిచియున్న అనుభవమును పొందిరి. 


All Pdf Download…….Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.