ప్రశ్న: దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎలా?
HOW TO KNOW THE WILL OF GOD
జవాబు: ఈ ప్రశ్నకు జవాబు పొందుకోవాలంటే ముందుగా దేవుని చిత్తము చేయగోరువారు క్రీస్తు రక్తములో కడగబడి ప్రతిదినము ఆయనను మహిమ పరిచే జీవితము కలిగియున్నవారు మాత్రమే దేవుని చిత్తమును తెలుసుకొన యోగ్యులు. అనగా చాలామంది ఇష్టానుసారముగా తిరిగి, లెక్కలేకుండా బ్రతికి తమ వివాహములో మాత్రం దేవుని చిత్తము జరగాలని ఆశించేవారు చాలా మందిని మనము చూస్తాము. అంటే హైదరాబాద్లో ఉండే వ్యక్తి ఇష్టమొచ్చినట్లు ఇలా తిరుగుచూ అలా తిరుగుచూ బొంబాయి వెళ్ళి నేను చార్మినార్ని తప్పక చూడాలంటే అది సాధ్యము కాదు. అతను చార్మినార్కు చాలా దూరమైపోయాడు. అలానే దేవుని చిత్తమునకు, ఆయన ఇష్టమునకు బహు దూరంగా తిరిగే వ్యక్తి వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో దేవుని చిత్తము జరగాలంటే అది సాధ్యము కాదు. చార్మినార్ చూడాలంటే వదిలి వెళ్ళిన హైదరాబాద్ రావాలి. దేవుని చిత్తము చేయాలంటే వదిలి వెళ్ళిన దేవుని పాదాల చెంతకు పశ్చాత్తాపముతో తిరిగి రావాలి. మొదటిగా దేవుని చిత్తము అంటే ఏమిటి?
దేవుని ఉద్దేశ్యము, దేవుని ప్రణాళిక, దేవుని హృదయము ఏమై యున్నదో మనకు కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథమే దేవుని చిత్తమును, ఆయన మనిషి పట్ల కలిగియున్న ప్రణాళికను వివరిస్తుంది. దేవుని చిత్తమనగా… దేవుడు ఆశించినట్లుగా, ఆయనకు మహిమకరముగా జీవించడం, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, ఏయే పరిస్థితులకు ఎలా ప్రతిస్పందించాలో బైబిల్ గ్రంథమందు ప్రవక్తలు, భక్తులు, సేవకుల జీవితముల ద్వారా తన చిత్తమును దేవుడు తెలియజేశాడు.
అందుకే ప్రభువు ఇలా అన్నాడు: నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. (యోహాను 15:7) దేవుని మాటలు అనగా ఆయన చిత్తమైయున్న ఆయన వాక్యము మనలో ఉంటే ఆయన వాక్యమునకు వ్యతిరేకమైన దానిని మనము కోరలేము. ఆయన చిత్తానుసారమైన వాక్యము మనలో ఉంటే దావీదు చెప్పినట్లు “పాపము చేయకుండునట్లు నీ వాక్యము నా హృదయములో దాచుకొంటిని” (కీర్తన 119:11) అనగా మనము పరిశుద్ధముగా జీవింపజేసేది వాక్యము. ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన కోరికలు, మన నిర్ణయములు పరిశుద్ధముగా ఉంటాయి.
అంతేకాకుండా యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. (కీర్తన 25:12) మన జీవితము ఆయనకు అంగీకారముగా ఉన్నప్పుడు ఏ మార్గము ఎన్నుకోవాలో, వివాహ విషయములో ఎవరిని చేసుకోవాలో ఆయనే మనకు బోధిస్తాడు, తెలియజేస్తాడు. మొదట మనము ఆయన చిత్తము చేయుటకు నూటికి నూరు శాతం ఇష్టపడేవారిగా ఉన్నట్లయితే ఆయన తప్పక మనలను తన చిత్తము గుండా నడిపిస్తాడు. అంతేకాదు, తన చిత్తమునకు వ్యతిరేకమైన ప్రతి ద్వారము మూసివేసి మనము వెళ్ళవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడు. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెదకిన యెడల అవన్నియు (మనకేది అవసరమో) అనుగ్రహించబడును. (మత్తయి 6:33) యేసయ్య దేవుని చిత్తమును చేయుట మనకు మాదిరి:
“నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగిపోనిమ్ము. అయినను నా యిష్ట ప్రకారము కాదు, నీ చిత్తప్రకారమే కానిమ్ము.” (మత్తయి 26:39) ప్రభువు యొక్క ఆత్మ సిద్ధముగా ఉన్నప్పటికీ శరీరము బలహీనముగా ఉన్నప్పుడు ఆ సిలువపైన అనుభవించబోతున్న ఆ భయంకరమైన వేదన భరించుటకు బహు కష్టతరమైనప్పుడు ప్రభువు శరీరమేమో భరించలేను అంటుండగా ఆయన ఆత్మ “నీ చిత్తము జరుగనిమ్ము” అని ప్రార్ధించడం
యేసయ్య సంపూర్ణముగా దేవుని చిత్తమునకు తనను అప్పగించుకోవడం మనకు తెలుసు. అదేరీతిగా కొన్నిసార్లు మన కోరికలు, ఇష్టాలు, ఉద్దేశాలు, నిర్ణయాలు శరీరానుసారమైనప్పుడు శరీరము తొందర చేస్తున్నప్పుడు యేసయ్యవలె సంపూర్ణముగా తండ్రి చిత్తమునకు లోబడి “తండ్రీ, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగనిమ్ము” అని ప్రార్ధించినచో తప్పక దేవున్ని మహిమపరచినవారమై ఆయన చిత్తము చేయుదుము.
బైబిల్ ప్రశ్నలు – జవాబుల కొరకు .. click here