ప్రసంగ శాస్త్రం | homiletics-prasanga-sastram-telugu-pastors |PART1| 2023

Written by biblesamacharam.com

Updated on:

ప్రసంగ శాస్త్రము

homiletics-prasanga-sastram-telugu-pastors

రచయిత: యమ్. ప్రసాద్ గారు.

పరిచయము :

ప్రసంగ శాస్త్రమును ఇంగ్లీషులో హోమిలీటిక్స్ అందురు. ఈ మాట గ్రీకు భాషలో నుండి ఉద్భవించినది. గ్రీకులో హోమిలియో అందురు దీని అర్ధము ఏమిటంటే ‘అన్యోన్యత కలిగిన వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ ఇది క్రైస్తవ్యంలో నీవు ఇతరులకు తెలియచెప్పాలనుకున్నది ఒక పద్ధతి ప్రకారముగా వరుస క్రమంలో తెలియచేయుటయే. ప్రసంగించుట లేక భోదించుట అనునది దేవుని యొక్క ఉచిత వరం ప్రసంగ శాస్త్రమునకు శిరస్సు వంటి ఓ దివ్య వచనం బైబిల్ నందు నిక్షిప్తమై ఎంతో ఘనముగా లిఖించబడియున్నది (2తిమోతి 2:15). ప్రసంగీకునికి ఈ వచనం ప్రాతిపతికగాను ఎంతో పారదర్శకముగా ఉండును. వర్తమానికుని అత్యంత ఆవశ్యకమైన ప్రాధమిక వచనమిది. 

ఇందు గమనించదగిన ఐదు విషయాలు 

1. దేవుని ఎదుట యోగ్యునిగా ఉండవలెను.

2. సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండవలెను. – యిర్మియా, యెషయా.

3. సత్యవాక్యమును సరిగా విభజించువానిగా ఉండవలెను.

4. ఉత్తమమైన రీతిలో ఉపదేశించువానిగా ఉండవలెను. యేసు క్రీస్తు.

5. దేవుడు చూస్తున్నాడనే మెళకువ కలిగి ఉండవలెను.

A) ప్రసంగమనగానేమి ?

       ప్రసంగం అనేది మానవ వ్యక్తిత్వం ద్వారా దైవిక సత్యాన్ని తెలియచేసే ఒక కళ మానవునికి ఇవ్వబడిన గొప్ప ఆదిక్యతలలో సువార్త ప్రకటన.ఇది ఒక గురుతర భాద్యతయై ఉన్నది. దేవుని పక్షముగా నిలువబడే వర్తమానికుడు దేవుని ప్రతినిధియై ఉండవలెను. మత సంబంధమైన విషయాలను నిలువబడి ప్రసంగించుట ప్రపంచానికి పరిచయము చేసింది కేవలం క్రైస్తవ్యమే. లోకానికి నిలువబడి ప్రసంగించుట ఎంత మాత్రమును తెలియదు.ఏదైనా తెలియచేయాలన్న ఆలోచన తడితే వారు పద్యాల ద్వారానో, కథల ద్వారానో, పాటల ద్వారానో తర్కిక వాదాల ద్వారానో మరియు నాటికల ద్వారానో తెలియచేస్తూ ఉండేవారు. అయితే నిలువబడి ప్రసంగించుట ప్రపంచానికి పరిచయము చేసింది ఖచ్చితంగా క్రైస్తవ్యమే. ఉదా (అపో2:13-20) ఇది చారిత్రక సత్యమే 

B) ప్రసంగ శాస్త్రము యొక్క ప్రాముఖ్యత

1. సువార్త ప్రకటన ద్వారా దేవుడు తన్ను తాను బయలుపరచుకొనవలెనని సంకల్పించాడు. (1 కొరింథీ 1:20,21) 

 ఉదా:- మనుష్యుల వెట్టితనము కంటే వెట్టితనము కాదు దేవుని వెర్రితనము 

2. ప్రసంగించుట లేక భోదించుట ద్వారా కలిగే దైవావగాహన వలన ప్రజలు దేవునియందు, క్రీస్తునందు విశ్వాసముంచి తద్వారా శాశ్వత రక్షణను  పొందుకుంటారు. (రోమా 10:13-15) 

C) ప్రసంగించుట యొక్క ఉద్దేశ్యము ఏమై ఉండాలి.

    నేటి వాక్యోపదేశకులు ఉపదేశమును అందించు తరుణములో గురి,లక్ష్యము మరియు ఉద్ధేశ్యాలు కలిగి ఉంటే అది ఎంతో ప్రయోజనకారి. అయితే ఇప్పటి ఉపదేశకులు గురి, లక్ష్యము మరియు ఉద్దేశ్యాలు లేని వర్తమానాలు పుంకాలు పుంకాలుగా ప్రజల ఎదుట ప్రసంగించుచున్నారు. దీని వలన పరిచర్య పరశూన్యముగాను, విమర్శలకు తావిచ్చేది గానూ మిగిలిపోవుచున్నది. ఇలాంటి వర్తమానాల వలన ప్రజల జీవితాలు ఇహలోక సంబంధాల నుండి ఆచరణాత్మకమైన లేక క్రియా రూపకమైన జీవిత విధానములోనికి మార్చబడుట అనునది ఎంతో కష్టతరమవుతున్నది. 

1. ప్రజలను దైవోన్ముఖులునుగా చేయాలి

ప్రజలు దేవుని వైపు తిరిగే విధముగాను ఆయన వైపు చూచే విధముగాను  చేయవలసిన భాద్యత ప్రసంగికుని ప్రసంగముపై ఆధారపడి ఉన్నది. (కొలస్సీ 3:2) (అపో॥ 7:55-56)   

2. సువార్తను ఆధునిక భాషలోనికి రూపాంతరీకరించాలి.

ఎ) ప్రసంగీకుడు సువార్త ప్రకటించడం మాత్రమే కాదు గాని ఆ సువార్తను   తేలికగాను తెలివిగాను ప్రజలకు అందించే ప్రభావిత పరిచే విధానాన్ని అలవరచుకోవాలి. 

బి) దేవుని వాక్యం దైవావేశము వలన కలిగిన తప్పులు లేనిదైనప్పటికిని నేటి మనుష్యులు అర్ధం చేసుకొనలేని పాఠాలు, వాక్యాలు, పదాలు మరియు   భావాలతో నిండియున్నదని వర్తమానికుడు మొదటగా గుర్తించాలి. 

సి) ఉపదేశకుని వాక్యం పురాతనానికి అధునాతనానికి, గతానికి ప్రస్తుతానికి వారధిని నిర్మించే విధముగా ఉండాలి. ఈ కర్తవ్యమును గుర్తెరిగి ఆధునిక భాషలోనికి రూపికరించాలి. (మత్తయి8:21-22) ఆత్మీయముగా చనిపోయిన వారు శారీరకముగా చనిపోయిన వారిని పాతిపెట్టుకుంటారు. నీవు వచ్చి నన్ను వెంబడించుము అన్నాడు యేసు. 

3. సువార్త ప్రస్తుతానికి కూడా తగినదే, చెందినదేనని రుజువు చేయాలి.

ఎ) సువార్త యనునది నేటి మన పరిస్థితులకు అనుగుణమైన రీతిలో ఉన్నది.ఇప్పటి పరిస్థితులకు సువార్త చక్కగా తగినది. 

బి) ఎప్పటికో కాదు గాని నేటి ప్రపంచానికి ప్రస్తుత సమాజానికి సువార్త చాలా అవసరం.

4) సువార్తను విశ్వసించి దానిని అనుసరించే, జీవించే విధముగా ఒప్పింపచేయాలి. 

      ప్రజలు నిర్ణయాలతో కూడిన జీవిత విధానం అలవరచుకొనే విధముగా ప్రసంగీకుడు ప్రయాసపడాలి. క్రీస్తు మాత్రమే మన రక్షణకు కారకుడు ఆయన మాత్రమే పరలోకానికి మార్గమని రూడిగా, ధృఢముగా ప్రసంగీకుని హృదయములో నాటుకుపోవాలి. 

5) పాపాత్ములైన మనుష్యులకు నిరీక్షణ చూపించాలి. 

(రోమా 3:23,6:23) యేసు క్రీస్తు పేతురును ఏ రీతిగా చూశాడంటే మనుష్యులను పట్టే జాలరునిగా.

D) ప్రసంగీకుడు అనగా ఎవరు?

దైవ లేఖనములలో ప్రసంగీకులు పలు విధములైన పేర్లతో పిలువబడినారు:

 1)  వెట్టివాడు

అంటే ఎ. దండోర వేయువాడు

బి. డప్పు వేయువాడు 

  సి. చాటింపు వేయువాడు 

దేవుని ద్వారా తాను పొందుకున్నది బహిరంగంగా సమాజంలో నిర్భయంగా ఎలుగెత్తి చాటువాడు.  I కొరింథీ 1:25, II కొరిందీ 4:5. యెషయా 40:9, 52:7 

2. విత్తువాడు: వ్యవసాయదారుడు.

 పొలములో విత్తనములు విత్తువిధముగా లోకమనే పొలములో దేవుని వాక్యమును ప్రార్థన పూర్వకముగా విత్తవలెను. లూకా 8:11, ప్రస11:1

3. గృహ నిర్వహకుడు: గృహ బాధ్యతలు నిర్వర్తించువాడు.

 దేవుని యింటిలో ఉన్నవారిపై నిర్వహకుడుగా నియమించబడినవాడే  గృహనిర్వహకుడు ఎఫె 3:1,2, 2:19, I పేతు 4:16, 1 కొరింథీ 4:2,1 తిమో 3:4,5 తీతు 1:7. 

4.కారి:

ప్రధాన కాపరియైన యేసు క్రీస్తు తాను చేసిన పనిని మనకు అప్పగించి మనల్ని కాపరులుగా నియమించాడు. కాపరి గొజ్జెలను, తోడేళ్ళ బారిన పడకుండా కాపాడాలి (యెహెజ్కెలు 34 అధ్యాయము). పచ్చిక స్థలములకు నడిపించాలి అనగా చక్కని సుబోధలోనికి తీసుకువెళ్ళాలి. 

5.రాయబారి:

పరదేశంలో (లోకం) మనం దేవుని ప్రతినిధులుగా నియమించబడినవారము.  ఎఫె 6:20, II. కొరి – 5:20 

6.పనివాడు: సిగ్గుపడనక్కరలేని పనివానిగా జీవించాలి II తిమో 2:15

E) ప్రసంగీకుని అత్యంత ఆవశ్యకమైన అర్హతలు:

1. మీరు మారుమనస్సు అనుభవం కలిగియుండాలి

ఒక దైవ జనుడు మారుమనస్సు పొంది అసలు, సిసలైన జన్మను కలిగియుండాలి. 

ఉదా: చెట్టును బట్టియే ఫలము రూచి అర్థమౌతుంది. 

– ఆత్మచేత నింపబడాలి

– ఆత్మ చేత బోధింపబడేవాడై యుండాలి.

– “ప్రభువును” ఎల్లప్పుడు ప్రేమించాలి. (కేవలం యేసును మాత్రమే)

– దేవుని ఆజ్ఞానుసారముగా నడిపించబడాలి

– దేవునికి లోబడేవాడై యుండాలి (పిలుపుకు స్పందించాలి)

2.శుద్ధియైన జీవితం కలిగియుండాలి.

 ఉదా:- విలియంకేరి నేర్పించిన నల్లబోర్డుపై చుక్క II కొరింథీ 7:1, ఎఫె 5:27        

3. బైబిలు అధ్యయనము చేయువాడై యుండాలి.

“వేద విద్యార్థులు బైబిలును గూర్చి చదువుతారు గాని బైబిల్ను ఎంత మాత్రమును చదవరు’ 

4. ప్రార్థనా పరుడై యుండాలి

ప్రార్థన లేని పరిచర్య శక్తిహీనముగాను మరియు ఫల శూన్యముగాను మిగిలిపోవును. ఉపయోగకరముగాలేని / నిష్ప్రయోజనముగాను ఉండుటకు ప్రార్థన లేమియే కారణం. ప్రార్థనలేని పరిచర్య నీటియోరనకాక ఇసుక ఎడారిలో నున్నట్లుగా నుండును. 

5.సామర్థ్యముగల వ్యక్తియై యుండాలి.

ఉదా: బస్సు చూచుటకు అందమైనదిగా నున్నను కదలేని స్థితిల పడియుంది (ఫిట్నేస్ సర్టిఫికెట్ లేదు) II తిమో 2:2. 

1. పరిచర్యయొక్క విశిష్టతను గుర్తించాలి

  నెహెమ్య తనకు అప్పగించిన పనిని గుర్తించి, నేను చేయుచున్న పని ‘బహుగొప్పది’ యని పలికాడు. 

 యేసుక్రీస్తు తాను జరిగించిన పనిని మనకు అప్పగించాడు. ఇప్పుడు ‘క్రీస్తు యేసు స్థానములో’ నిలువబడి సువార్త పనిని జరిగించాలి. శ్రేష్టమైన ప్రతి వర్తమానము దేవుని హృదయమునుండి పుట్టును. దేవుని హృదయమును తెలుసుకోవాలంటే క్రీస్తు నియమించిన స్థలములో నిలచి యుండాలి ఇదియే సర్వలోకములో శ్రేష్టమైన పనియని గుర్తించాలి. 

G. ఉపదేశకుల్లోనున్న విభిన్న అభిప్రాయాలు:

1. సిద్ధపాటుతో నిమిత్తములేదని అభిప్రాయం:

  వర్తమానికుడు వేధిక పైకి వెళ్ళగానే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. “సిద్ధపాటు మన విశ్వాస లోపాన్ని తెలియజేస్తుందంటారు”. కీర్త 81:10 

2. మానవ సామర్థ్యం చాలు:

  జ్ఞానం, బలం కల్గియుంటే వర్తమానాలు అవే ప్రవాహము వలె పుట్టుకొస్తాయని అంటారు.

3. ప్రాపంచిక విషయ పరిజ్ఞానం:

 ప్రపంచములో జరుగు వాటిని గూర్చిన అవగాహన వుంటే చాలు వర్తమానములు    కుప్పలు తెప్పలుగా వస్తాయనేవారు ఉన్నారు. 

4. ప్రార్థన పూర్వకమైన సిద్ధపాటు:

ధ్యానించే, నెమరు వేయు మనస్సుకావాలి. సిద్ధపాటు దిద్దుబాటుకు కారణమౌతుంది. 

H. ప్రసంగీకుని అత్యంత కీలకమైన వనరులు

1.దర్శనం.

వర్తమానికుడు తన పరిచర్యలో తాను ఏమి సాధించబోతున్నాడో ఒక దర్శనం కలిగియుండాలి. దేవుని కొరకు మనము ఎట్టకేలకు ఏ శిఖరములను అందుకోగలమో వాటిని మన కన్నుల ముందుంచేదే దర్శనం. ప్రసంగీకున్ని ఆగిపోకుండా ముందుకు నడిపించేది కేవలం పరలోకపు దర్శనమే. 

2. భాష: 

తనకు తెలిసిన ఎంతో పరిచయమున్న అనేక పదాల్ని ప్రసంగీకుడు వాడతాడు. “నిజానికి పదాలు ప్రసంగీకునికి సాధనాలు” ఎంతగానైతే మాటల్ని, వాటి అర్థాల్ని తెలుసుకుంటాడో అంత ధారళంగా, అనర్గళంగా ప్రసంగించోచ్చు. ఒక చిత్రకారునికి రంగు, కుంచె ఎటువంటివో ప్రంగీకుడికి మాటలు అటువంటివి. “మాటలు లేని ప్రసంగీకుడు పరికరాలు లేని శిల్పివంటివాడు”. ఉదా: నిగ్గుదేలుస్తూన్నా, సూత్రధారులు, పాత్రధారులు, కొలిక్కి, అక్కసు, వెసులుబాటు.

3. స్వరం:

నిజముగా కంఠమనేది ప్రసంగీకునికి ” గొప్ప సహజ సంపద”, కాబట్టి దానికి చాలా జాగ్రత్తలు అవసరం. నీకంఠాన్ని గుర్తించు మరింత మెరుగు పరచుటకు ప్రయత్నించు. ఉదా:- “అన్నియు ఒక్కసారిగా మ్రింగరాదు” నూనె, పులుపు, వగరు 


ప్రసంగ శాస్త్రం ఉపోద్గాతం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి……click here

11 thoughts on “ప్రసంగ శాస్త్రం | homiletics-prasanga-sastram-telugu-pastors |PART1| 2023”

  1. చాలా చక్కగా,వివర్ణాత్మకంగా తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏

    Reply

Leave a comment