Can a man marry an older woman bible|పెళ్లి1

Written by biblesamacharam.com

Updated on:

పెద్ద వయస్సు కలిగిన అమ్మాయి తక్కువ వయస్సు అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చా

Can a man marry an older woman bible

ప్రశ్న : పెద్దవయస్సు కలిగిన అమ్మాయిని, చిన్న (తక్కువ) వయస్సు కలిగిన అబ్బాయి పెళ్ళాడవచ్చునా? అది లేఖన సమ్మతమేనా? 

    జవాబు : 2తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో – “మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?” అంటూ లేఖనం సెలవిస్తోంది. భార్య కంటె భర్త పెద్దవాడైనప్పుడు భర్తయొక్క పెద్దరికమూ మరియు అతనికి భార్య లోబడుట సహజముగానూ సులభతరముగానూ ఉంటుంది. అయితే…

   నేటి సమాజములో పెద్దలు ఏర్పాటు చేసిన వివాహాలు మనకు అరుదుగా కానవస్తున్నాయి. యౌవన బాల బాలికలూ వారి జీవిత భాగస్వాములను, వారు చదివే కళాశాలలోనూ, లేదా ఉద్యోగ స్థలములలోను వారికై వారే ఎన్నుకొంటున్నారు.

   వెనుకటి కాలంలో అమ్మాయి బయట ఉద్యోగ స్థలములలో కాకుండా, ఇంటిలోనే తల్లితోపాటూ అన్ని పనులు నేర్చుకుంటూ, చేదోడు వాదోడుగా వుంటూ ఉండేది. కానీ, నేటి సామాజిక పరిస్థితిని బట్టి అమ్మాయి కూడా కళాశాలల్లోనూ, బయట ఉద్యోగ స్థలాలలోను గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. 17వ సంవత్సరము దాటినప్పట్నించీ 5 నుంచి 7 సంవత్సరముల కాలము కళాశాలల్లో గడుపుచున్నారు.

    ఈ సామాజిక మార్పులను బట్టి, ఈ రోజుల్లో దాంపత్య భాగస్వాముల మధ్యగల వయోభేదము కొంచెముగా ఉన్నట్లు కనిపిస్తుంది.

     పురుషుడు తనకంటే పెద్ద వయస్సుగల స్త్రీని వివాహమాడుటను బైబిలు ఏమి వ్యతిరేకించుట లేదు. నరహత్య చేయకూడదు! అబద్ధ సాక్ష్యము పలుకకూడదు! అని ఆజ్ఞలు ఉన్నట్టుగా, వయస్సులో పెద్దది అయిన అమ్మాయిని పెళ్లాడకూడదు అంటూ ఆజ్ఞ బైబిలులో రాయబడిలేదు.

    యూదా జనాంగములో ఒక ఆచారం ఉండేది. అన్నయ్య చనిపోయిన తరువాత తమ్ముడు అయినవాడు వదినను పెళ్ళిచేసుకొని మరిది ధర్మం జరిగించి, చనిపోయినఅన్నయ్య పేరుతో అతనికొక సంతానము కనియివ్వాలి. ఆ విధంగా పుట్టిన “సంతానం” తనది కాకుండా అన్నదే అవుతుంది. కాబట్టి, అన్నయ్య వంశం చరిత్రలో కనుమరుగు కాక, నిలబడిపోతుంది.అన్నయ్య చనిపోయాక అతని తమ్ముళ్లు సంతానోత్పత్తి నిమిత్తం విధవరాలైన తమ వదినను వివాహమాడుట సర్వ సాధారణమై యున్నది.

   యేసుక్రీస్తు కాలంలో సద్దూకయ్యులు తీసికొనివచ్చిన వివాదములో – “బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లిచేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే (ధర్మశాస్త్రం) చెప్పెను. మాలో ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. రెండవవాడును మూడవవాడును ఏడవవాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను” అంటూ పునరుత్థానాన్ని గూర్చిన వివాదాన్ని లేవదీసారు (మత్తయి 22:24-26).

    మనం కాసేపు పునరుత్థానాన్ని పక్కనబెడితే, యేసు కూడ వారు చెప్పింది నిజమా? కాదా? అంటూ ఏ విధమైన ఆక్షేపణ చేయలేదు. వారు చెప్పిన దానికి, అలా జరిగిఉండదు. మీరు ఒక కథ అల్లి చెబుతున్నారు అంటూ ప్రభువు దానిని కొట్టిపారేయలేదు. అది జరిగిన సన్నివేశం లాగానే ఆయన దాని విషయంలోఊరకుండిపోయాడు.

     ఆ స్త్రీ  కంటే ముందుగా చనిపోయిన ఆరవవాడు ఉన్నాడే! అతడు ఆమెకు భర్తే గదా! మరి అతని వయస్సు విషయానికి వస్తే, ఆమె కంటే చిన్నవాడుగానే ఉంటాడు. అది ధర్మశాస్త్రమండీ, ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం అంటారా? పోనీ, క్రొత్త నిబంధనలో ఎక్కడైన పెద్దవయస్సు కలిగిన స్త్రీ (అమ్మాయి)ని పెళ్ళాడవద్దు అనే ఆజ్ఞ ఏమైన స్పష్టంగా రాయబడివుందా? ఆలోచించాలి.

   కొన్ని భారతీయ సామాజిక వర్గాలలో అమ్మాయి పెళ్లి ఖర్చు భారీగా కూడుకొని యుండుట వలన, తండ్రి సంపాదన చాలక, తను కూడ జాబు చేయవలసిన పరిస్థితి తప్పడంలేదు. ఆ విధంగా 5,6 సంవత్సరములు వయస్సు మీద పడ్తుంది. వారి సొంత కులంలోని అంతర్గత సమస్యలూ, దానికితోడు క్రైస్తవులైన యువకులు చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవటమూ, వయస్సులో పెద్దదై నూతనముగా క్రీస్తునంగీకరించిన అమ్మాయిని వివాహము చేసుకొనుటకు ఇష్టపడకపోవటం వలనను, అన్యులలో నుంచి క్రీస్తునంగీకరించిన అనేకమంది బాలికల వివాహ విషయంలో చాలా ఆలస్యము జరుగుచున్నది. వయస్సు మించిపోతుంది.

   ఇటువంటి సందర్భములలో క్రైస్తవ యువకులు వయోభేదమును చూడకూడదు. వయస్సులో తమకంటే పెద్దది అయినప్పటికీ పెళ్లాడవచ్చు. అది నేరమేమి కాదు. అయ్యో, నువ్వు పెద్ద వయస్సు అమ్మాయిని పెళ్లిచేసుకున్నావా? నిన్ను నరకములో పడేస్తాను అని ప్రభువు ఏమి అనడు! అది నరకప్రాప్తమైన పాపమేమి కాదు. అలాగనీ, చేసుకోవాలనే రూలు కూడ లేదు. మీ ఇంగితానికి వదిలివేయబడిన విషయమిది!

   నేను ఎరిగిన కొంతమంది క్రైస్తవ దంపతులు, తమ వయస్సుకంటే తమ భార్యల వయస్సు ఎక్కువ ఉన్నవారు ఉన్నారు. క్రీస్తును కేంద్రముగా చేసుకొని వారు ఎంతో సమాధానముతో సంసార జీవితాలు చేస్తున్నారు. ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా వారి కుటుంబాలు నేడు మన మధ్యలో ఉన్నాయి.

   నాదో సలహా ఏమిటంటే – పరిస్థితిని బట్టి, ప్రభువు చిత్తప్రకారముగా కార్యము కానీయండి. పెద్ద వయస్సు కలిగిన స్త్రీని పెళ్ళాడితే, పెళ్లాడండి. అయితే మరీ పె…ద్ద ఏజ్ కలిగిన బామ్మను చేసుకొని బాధపడకండి!    వినుటకు మనస్సు ఉంటే విందురు గాక!


ప్రసంగ శాస్త్రం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “Can a man marry an older woman bible|పెళ్లి1”

Leave a comment

error: restricted