విలియం టిండేల్ | William Tyndale Life History Telugu 0

Written by biblesamacharam.com

Published on:

విలియం టిండేల్

William Tyndale Life History Telugu

విలియం టిండేల్ జన్మ స్థానమును గురించియు, జన్మ కాలమును గురించియు తేట తెల్లముగా తెలియక పోయినను, ఇతడు “గ్లాష్టర్ షైర్” లోని “స్లింబ్రిడ్జి” లో 1495 వ సంవత్సరములో జన్మించి యుండవచ్చును. ఇతనికి చిన్న వయస్సు నుంచి దేవుని గ్రంథాలు చదవాలంటే ఎంతో ఆశ. “ఆక్స్ ఫర్డ్” విశ్వవిద్యాలయంలో మంచి విద్యనభ్యసించెను. టిండేల్ నూతన నిబంధనను గ్రీకు భాషలో చదివెను. ఈ గ్రంథమును చదివినప్పుడు అతనికది మానసిక శక్తిని గాక హృదయ మార్పును కలుగజేసెను. 

అంతేగాక తన హృదయాన్ని ఆకర్షించిన ఆ గ్రంథం దేవుని వాక్యమని, అది ప్రతి వారు చదివి మేలు పొందునట్లు తన మాతృభాష అయిన ఆంగ్లంలోనికి అనువదించాలని పూనుకున్నాడు. ఆ గ్రంథంలో తాను చదివిన సత్యాలను బోధించుటకు కూడా ప్రారంభించెను. 

అయితే ఆ దినములలో బైబిల్ గ్రంథమును సామాన్యులు చదువకూడదను చట్టం కలదు. ప్రభువు నేర్పిన ప్రార్థనను, పది ఆజ్ఞలను తమ పిల్లలకు ఇంగ్లీషులో నేర్పించారని నేరము మోపబడిన ఏడుగురు వ్యక్తులను కర్రకు కట్టి కాల్చి చంపిరి. అటువంటి భయంకరమైన దినములలో ‘టిండేల్’ ఆంగ్లములోనికి క్రొత్త నిబంధనను తర్జుమా చేయదలచెను. అయితే ఆ దేశంలో అది సాధ్యం కానందున అతడు జర్మనీకి తప్పించుకొనిపోయి పని ప్రారంభించెను. కొలగ్నే అను పట్టణములో అధికారులు నూతన నిబంధన కాగితాలను అపహరించుట చూచినపుడు టిండేల్ దానిని అచ్చు వేయుటకు మరొక పట్టణమునకు పోవలసి వచ్చెను. 

ఆలాగు అనేక శ్రమల మధ్య క్రొత్త నిబంధన మొదటి రెండు ముద్రణలను 1525 లో ముగించెను. ఆ పై వేల కొలది నూతన నిబంధనలు పెద్ద పెద్ద సంచులలో, మూటలలో కట్టి ఓడలపై ఇంగ్లాండు దేశమునకు పంపుటలో టిండేల్ విజయము సాధించెను. మతాధికారులు వాటిని కాల్చివేయు ఉద్దేశ్యముతో ఎంతో వెల చెల్లించి, దొంగచాటుగా కొనిరి. కాని ఆ డబ్బు మరిన్ని బైబిల్స్ ప్రింట్ చేయుటకు సహాయపడెను. అతడు ఒక నూతన నిబంధన గ్రంథమును అప్పటి రాణియగు “ఆనీ బోలన్”కు బహూకరించెను. ఆ గ్రంథము నేటికీ బ్రిటిష్ ప్రదర్శన శాలలో ఉన్నది. మత గురువులు అతనిపై పగబట్టి అతనిని చంపుటకు పన్నాగము పన్ని అతనిని బంధించి చెరసాలలో వేసిరి. టిండేల్ 15 నెలలు జైలులో గడిపెను. ఆ సమయములో కూడా అతడు తర్జుమా పనిని కొనసాగించెను. 

చివరికి 1536 అక్టోబర్లో ఒక శుక్రవారమున ఆ చీకటి బిలము నుండి అతనిని వెలుపలికి తీసి గొంతు పిసికి, అతని శరీరము బూడిద అగు వరకు దహించిరి. అతడి చివరి మాటలు- “ప్రభువా! ఇంగ్లాండ్ రాజు నేత్రములు తెరువుము!” టిండేల్ తాను చనిపోవుటకు 10 సంవత్సరాల ముందే, “నేను తర్జుమా చేసిన క్రొత్త నిబంధన గ్రంథమును కాల్చిన మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చెదరు. అయిననేమి నేను ఈ నూతన నిబంధన గ్రంథమును తర్జుమా చేయుటలో నా పనిని మానను” అనెను. 

టిండేల్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరములకే ఇంగ్లాండ్లోని సాధారణ ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిలును కలిగి యుండే మార్గము ఏర్పడినది. టిండేల్ బైబిల్లోని 90% పదములు వంద సంవత్సరాల తర్వాత వెలువడిన “కింగ్ జేమ్స్” తర్జుమాలో కూడా కనబడినవి. క్రైస్తవ హతసాక్షి అనగా, క్రీస్తును త్యజించుట కంటె ఆయన కొరకు మరణించుటకే ఎన్నిక చేసుకొనుట; దేవుని రాజ్యము విస్తరింప చేయుటకై ప్రాణమును కూడా అర్పించుటకు తెగించుట!  క్రైస్తవ సాక్ష్యము ఘోర శ్రమను భరించుట; మరణము వరకు నమ్మకముగా ఉండుట


Download Pdf..Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted