యేసుక్రీస్తు గాడిదపై ఎందుకు ప్రయాణించెను|Telugu Christian Message 1

    యేసుక్రీస్తు గాడిదపై ఎందుకు ప్రయాణించెను?

ప్రజలు బట్టలు ఎందుకు పరిచారు?

Telugu Christian Message:

     యేసుక్రీస్తు ప్రభువువారు యెరూషలేములోనికి విజయోత్సవముతో ప్రవేశించిన శుభసందర్భాన్ని మనము ధ్యానం చేయడం ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవచ్చు. ఆయన యొక్క జీవితము ఈ రోజున అనేకమందికి మాదిరిగా, మార్గదర్శకముగా ఉన్నది అనుటలో సందేహమేలేదు. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన 331/2 సం॥ల జీవన ప్రస్థానము మానవుల జీవిత సమస్యలకు, ప్రశ్నలకు అద్భుతమైన సమాధానమునిచ్చింది. ఆయన జన్మ, ఆయన బోధలు, మరణము, ఆయన పునరుత్థానము ప్రతీది కూడా మానవునికి సమాధానములిస్తూ ఉన్నవి. యేసుప్రభువు మరణము మనిషి పాపములను తీసివేయగలిగింది. ఆయన రక్తము మనిషి పాపాన్ని పరిహరించగలిగింది. యేసుప్రభువు వారు ఈ లోకములో జీవించే కాలములో ఆయన చేసిన కొన్ని పనులు, ఆయన సందర్శించిన కొన్ని పట్టణాలు, కొన్ని ప్రాంతాలు మనకు అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పిస్తున్నాయి. 

     యేసుప్రభువువారు జయోత్సాహముతో యెరూషలేములోనికి ప్రవేశించారు. ఆనాడు కొంతమంది ఖర్జూరపు మట్టలు యేసుప్రభువు వెళుతుంటే దారిపొడుగునా పరిచారు గనుక మట్టల ఆదివారము అని పేరు దీనికి వచ్చింది. యేసుప్రభువు జీవితప్రస్థానములో ఆయన యొక్క జీవితములో చివరి వారము అనగా చివరి ఏడు రోజులలో జరిగిన కార్యాలు బైబిల్లో స్పష్టముగా మనము చూడగలము. యేసుప్రభువు యెరూషలేములో ప్రవేశించి ఏమిచేశారు? ఆయన ఎందుకు ప్రవేశించవలసి వచ్చింది? ఎలా ప్రవేశించారు? ఇవన్నీ మనము తెలుసుకోగలిగితే కొన్ని పాఠాలు నేర్చుకొని ప్రభువుకు దగ్గరగా మనము జీవించగలము Telugu Christian Message

    మత్తయి సువార్త 21వ అధ్యాయమును క్షుణ్ణంగా చదివితే యేసుప్రభువు యెరూషలేములో జయోత్సాహముతో ప్రవేశించిన సందర్భము అక్కడ వ్రాయబడింది. అప్పటికి బహుశా ఆయన చాలాసార్లు యెరూషలేమునకు వెళ్ళారు. అయితే వాటన్నింటికీ లేనంత ప్రాముఖ్యత ఆయన చివరిసారిగా యెరూషలేములో ప్రవేశించే ఈ సందర్భానికి ఎందుకు వచ్చింది? 

    ఆయన యెరూషలేమునకు వచ్చి కొన్ని ప్రాముఖ్యమైన పనులు చేసారు. ఆయన తానెవరో, ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఆయన ఏమి చేయాలనుకుంటున్నారో, ప్రజల మనస్సులలో ఆయనకెలాంటి స్థానముందో ఆయన తెలియజేయడానికి ఆయన యెరూషలేమునకు గాడిదను యెంచుకొని గాడిదపిల్ల మీద కూర్చొని ఆయన యెరూషలేములో ప్రవేశించారు. ఆయన యెరికో నుండి యెరూషలేముకు వస్తూ ఉన్నారు, వస్తూ ఉన్నప్పుడు మధ్యలో బేతనియ బేత్ఫగే అనే గ్రామాల వద్ద ప్రభువు ఆగారు. ఆ రెండూ జంట గ్రామాలు. అక్కడ శిష్యులతో – “మీ ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళుడి ఆ గ్రామములో కట్టబడి ఉన్న గాడిదను, దాని పిల్లను తీసుకొని రండి, నేను దాన్నెక్కి యెరూషలేములోకి వెళ్ళాలి” అని యేసుప్రభువు చెప్పారు. యేసుప్రభువు యెరూషలేములోనికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత మొట్టమొదటిగా జరిగిన ఒక అద్భుతం కట్టబడిన ఒక గాడిద విప్పబడింది, అనగా విడుదల ప్రకటింపబడింది.Telugu Christian Message 

     యేసుప్రభువు ఎందుకు గాడిద పిల్లమీద యెరూషలేముకు వెళ్ళారు? ఆయనకు గుఱ్ఱాలు దొరకవా? ఆయన అనుకుంటే ఏనుగుల మీద ప్రయాణము చేయలేడా? చరిత్ర మనము గమనిస్తే చాలామంది రాజులు గుఱ్ఱాలను ఉపయోగించారు. ఇంకా రకరకాలైన జంతువులను వారు వాహనాలుగా చేసుకున్నారు. అయితే దేవదేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు గాడిదనే ఎంచుకున్నాడు, గాడిద పిల్లమీద కూర్చొని ఎందుకు యెరూషలేము వెళ్ళాలనుకున్నాడంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనము బైబిల్ నుంచి తెలుసుకోవచ్చు. Telugu Christian Message

     మొట్టమొదటిగా ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన గాడిద మీద ప్రయాణం చేశారు. “సీయోను కుమార్తెలారా! మీరందరు సంతోషించండి నీ రాజు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు” అని కొన్ని వందల సంవత్సరాల క్రితం జెకర్యా ప్రవక్త ప్రవచించాడు (జెకర్యా 9:9). యేసుప్రభు ఈ లోకము లోనికి వచ్చి చేసిన ప్రతీ కార్యము కూడా ప్రవక్తల ద్వారా ప్రవచించబడిందే. అందును బట్టి యేసుప్రభు ప్రవచన సారం. ఆయన ప్రవక్త కాదు గానీ ప్రవక్తలు ఎవరిని గూర్చి అయితే చెప్పారో ఆ ప్రవచన సారం. జెకర్యా ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు ఇష్టపడి ఆ గాడిద పిల్లను ఎంచుకున్నాడు. Telugu Christian Message

     రెండవ విషయానికొస్తే… పూర్వదినాలలో ఒక రాజు ఒక పట్టణానికి వెళ్ళాలనుకుంటే, ఒక స్థలాన్ని సందర్శించాలనుకుంటే అతడు వచ్చేవిధానం అతని ఉఉద్దేశ్యాన్ని తెలియచేసేది. గుఱ్ఱము మీద వస్తున్నారు అంటే ఆ దేశం మీద యుద్ధం ప్రకటించడానికి వస్తున్నట్లుగా గ్రహించేవారు. ఎవరైనా గొప్ప వ్యక్తి, ప్రఖ్యాతిగాంచినవాడు, విప్లవకారుడు లేదా రాజు గాని గాడిద మీద వస్తున్నారంటే ఈసారి వారు యుద్ధానికి కాదుగాని శాంతి, సమాధానానికే వస్తున్నారని భావం. యేసుప్రభువు గాడిదపిల్లను యెంచుకోవడానికి కారణం ఆయన శాంతిదాత అని లోకానికి తెలియచేయడానికే. 

     అప్పటికే చాలామంది రాజులు యెరూషలేముకు దండెత్తి వచ్చారు, పట్టణాన్ని కొల్లగొట్టారు, దేవాలయములోని ఉపకరణాలు తీసుకెళ్ళి వారివారి దేశాలలో పెట్టుకున్నారు. ఎవరైనా గుఱ్ఱముమీద యెరూషలేముకు వస్తున్నారంటే యుద్ధముచేయటానికి వస్తున్నారని ప్రజలు కలవరపడుతుండేవారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు గాడిదపిల్లమీద రావడంద్వారా అందరిలాగా నేను యెరూషలేమును నాశనము చేయడానికి రావట్లేదు, అందరి రాజులవలె యెరూషలేమును దండెత్తి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి రావట్లేదు, పాడైపోయిన, శిధిలమైన యెరూషలేమును బాగుచేయడానికి శాంతిదాతగా వస్తున్నాను అని ప్రకటించడానికి గాడిదపిల్లమీద వచ్చారు. Telugu Christian Message

     ఆయన ఉద్దేశ్యం చాలా గొప్పది. ఆయన ఈ లోకానికి వచ్చింది ఏ ఒక్కరిని శిక్షించడానికి కాదు, బాధపెట్టడానికి కాదు, అణగద్రొక్కడానికి కాదు, ఆయన ఈ లోకానికి వచ్చింది శాంతిని, సమాధానాన్ని ప్రసాదించడానికి. “ప్రయాసపడి భారముమోయుచున్న సమస్తజనులారా! నాయొద్దకురండి అని ప్రభువు పిలుచుచున్నాడు” (మత్తయి 11:28). ఆయన ఉద్దేశ్యమే శాంతిని ప్రకటించుట, ఆయన అశాంతిని సృష్టించడానికి రాలేదు. ప్రతీవ్యక్తి గుండెల్లో, ప్రతీ వ్యక్తి కుటుంబములో, సమాజములో, సంఘములో ఆయనను చేర్చుకొనుటలో మనిషికి గొప్ప సమాధానం లభిస్తుంది. అందునుబట్టే నేను శాంతితో వస్తున్నాను, నేను పట్టణాన్ని నాశనము చేయడానికి రావట్లేదు, పట్టణముమీద దండెత్తి ఈ పట్టణాన్ని పాడుచేయడానికి రావట్లేదు అన్న వార్తను యెరూషలేము ప్రజలకు చెప్పాలని యేసుప్రభువు గాడిదపిల్లను యెంచుకున్నాడనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. 

     మూడవదిగా నిర్గమకాండము 34:19, 20 వచనముల ప్రకారం ఇశ్రాయేలీయులకు పుట్టిన ప్రతి తొలిచూలు దేవునికి చెందాలి. అయితే గాడిద పిల్లను ఇవ్వటానికి లేదు. గాడిదపిల్లకు బదులుగా గొఱ్ఱపిల్లను ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఆ గొట్టెపిల్లను ఇవ్వలేకపోతే ఆ గాడిదయొక్క మెడను విరగదీసి చంపేయాలి. బహుశా బేతనియలో గాడిదను కట్టియుంచడానికి కారణం కూడా అదియే కావచ్చు. ఆ గ్రామములోని కట్టబడిన గాడిదపిల్లను విడిపించమనడంలో ప్రభువు ఉద్దేశ్యమేమిటనగా, దానికి బదులుగా గొట్టెపిల్లయైన యేసుప్రభువువారు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. 

     లోకపాపములను మోసికొనిపోయే దేవుని గొట్టెపిల్లయైన క్రీస్తు యెరూషలేముకు ప్రవేశించడంద్వారా గాడిదకు విడుదల దొరికింది. నిజమే, కొన్నిసార్లు మనము కూడా గాడిద వంటి స్వభావము కలిగినవారమే. అటువంటి మనలను విడిపించాలని సర్వపాపములను మోసికొనిపోయే దేవుని గొఱ్ఱపిల్లయైన యేసుప్రభువువారు మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. 

    యెరూషలేముకు వెళ్ళే ముందు బేతనియ, బేత్పగేలో ఉన్న ఆ గాడిదపిల్ల విడుదల పొందకపోతే అది మెడ విరగదీయబడి చచ్చిపోవాలి. గొఱ్ఱపిల్లగా నేను వచ్చాను గనుక ఇంక ఆ గాడిదను చంపనవసరంలేదు అని యేసు తెలియచేశారు. ఆయన యొక్క త్యాగము ద్వారా మనకు విడుదల, విమోచన ఉన్నవి. హల్లెలూయ! Telugu Christian Message

    ఈ మూడు ప్రధాన ఉద్దేశ్యాలతో ఆయన గాడిదపిల్ల మీద ఎక్కి యెరూషలేముకు ప్రయాణముకట్టారు. గాడిదపిల్లను విడిపించిన తర్వాత యేసుప్రభువు ప్రయాణమై వెళుతున్నప్పుడు ప్రజలందరూ గుమిగూడారు. ఆయన వెళుతున్న మార్గములో ప్రజలందరు వారి వస్త్రాలు తీసి పరిచారు, ఆ తర్వాత ఖర్జూర కొమ్మలు తీసి పరిచారని బైబిల్ లో స్పష్టముగా వ్రాయబడింది. బట్టలు, వస్త్రాలు తీసి పరచడం, పై వస్త్రాలు తీసి క్రింద వేయడం దేనికి సాదృశ్యం? యూదా రాజ్యంలో ఒక వ్యక్తి రాజుగా ప్రకటించబడినప్పుడు గాని, పట్టాభిషేకం పొందినప్పుడు గాని ప్రజలు తమ వస్త్రములు తీసి క్రింద పరిచేవారు. పాతనిబంధనలో యెహూ అనబడే వ్యక్తి రాజుగా పట్టాభిషేకం చేయబడే సందర్భములో తన చుట్టూ ఉన్న స్నేహితులు, ప్రజలు తమ బట్టలు పరిచి ఆయనను రాజుగా ప్రకటించారు. యూదా సాంప్రదాయం ప్రకారం, ఎవరైనా ఒక వ్యక్తిని రాజుగా గుర్తించగానే, రాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు, రాజుగా ప్రకటించాల్సి వచ్చినప్పుడు వారి యొక్క పై వస్త్రము తీసి క్రింద పరచడమనేది ఒక ఆనవాయితీ, 

     2 రాజులు 9:13 ప్రకారం నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఇశ్రాయేలీయులమీద రాజుగా పట్టాభిషేకం చేయబడే సమయంలో ఒక ప్రవక్త వచ్చి యెహును అభిషేకించెను. తర్వాత ఆయన స్నేహితులందరూ వచ్చి ప్రవక్త ఎందుకు వచ్చాడని అడిగినప్పుడు తనను రాజుగా పట్టాభిషేకం చేయడానికి వచ్చెననగానే, స్నేహితులు, అక్కడున్నవారంతా కూడా తమ వస్త్రములు మెట్లక్రింద పరిచి ఆయన రాజుగా అయ్యాడని ప్రకటించారు. యెహు పట్టాభిషేకం జరిగింది.Telugu Christian Message

     యేసుప్రభువు యెరూషలేముకు వస్తుంటే ప్రజలందరూ యేసుప్రభువును రాజని గుర్తించారు. హల్లెలూయా! అవును…యేసు ఇశ్రాయేలీయులకు రాజు, యూదా ప్రజలకు రాజు. ఒక్కమాటలో చెప్పాలంటే సర్వప్రపంచానికే రాజు అని ప్రజలు గుర్తించి బట్టలు పరిచారు. 

     బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన చాలామంది యేసుప్రభువును రాజుగా గుర్తించారు. ఆయన పుట్టగానే జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు. యేసుప్రభువే రాజని వారి మనస్సాక్షి ఒప్పింపజేసింది. యేసుక్రీస్తు ప్రభువువారు చాలా సందర్భాలలో తను రాజుగా ప్రకటించాడు. యూదులరాజువు నీవేనా అని పిలాతు అడిగిన ప్రశ్నకు యేసు అవునని తన రాజరికాన్ని అంగీకరించెను. ఆయన రాజ్యము చాలా ఉన్నతమైనది. ఆయన రాజ్యం భౌతిక సంబంధమైనది కాదు. మొదటి శతాబ్దకాలంలో హేరోదు యూదులకు రాజుగా నియమించబడ్డాడు. హేరోదు సగం యూదుడు. అయితే హేరోదు మహారాజుకు, రాజులకు రాజైన యేసుక్రీస్తునకు చాలా వ్యత్యాసాలున్నాయి. హేరోదు భౌతికసంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికివస్తే, యేసుప్రభువు వారు ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చారు. 

     హేరోదు తనకున్న అధికారం ద్వారా, దర్పముద్వారా, తనకున్న సార్వభౌమాధికారంద్వారా ప్రజలందరినీ చంపించాడు, అనేకమందిని శిరఛ్ఛేదనం చేయించాడు, గొంతుకలు కోసాడు, భయంకర కార్యాలు జరిగించాడు కాని యేసుక్రీస్తు ప్రభువువారు తనకున్న అధికారంద్వారా ప్రజలను బ్రతికించారు. ఆయన అనేకమందిని స్వస్థపరిచారు. ఆయనకున్న అధికారాన్ని ఏనాడూ దుర్వినియోగం చేసుకోలేదు. ఆయనకున్న అధికారాన్ని ఏనాడూ తప్పుత్రోవలో ఉపయోగించుకోలేదు, ప్రజల జీవితాలను వెలిగించాడు. 

    హేరోదు మహారాజు సువర్ణ సింహాసనమేసుకొని, సువర్ణ కిరీటము పెట్టుకొని తనకున్న దర్పాన్ని ప్రదర్శిస్తే యేసుక్రీస్తు ప్రభువువారు మనకోసం ముళ్ళకిరీటం ధరించాడు . సిలువనే సింహాసనముగా మార్చుకున్నాడు. ఎందుకంటే… ఆయన రాజ్యము ప్రేమ సామ్రాజ్యము. ఈ మాటలు చదువుతున్న నీవు యేసుక్రీస్తు ప్రభువువారిని నీ రాజుగా గుర్తించావా? నీ రక్షకుడుగా గుర్తించావా? ఆయన నీ రాజు అయితే ఆయన మాటలకు నీవు లోబడతావు. ఆయన పరిపాలనలో నీవుంటే ఆయన చిత్తానుసారముగా జీవిస్తావు. చాలాసార్లు యేసుప్రభువు నా రాజండి, ఆయనే నా నాయకుడండి, ఆయనే నా ప్రభువండి అని మాటలతో అంటూంటావు గాని ప్రవర్తనకు వచ్చేసరికి నీ యిష్టానుసారముగా జీవిస్తున్నావు. “నీ ప్రవర్తనీయంతటియందు దేవుని అధికారముకు ఒప్పుకొనుము” (సామెతలు 3:6). కొంతమంది కొన్ని విషయములలోనే దేవుని అధికారానికి లోబడతారు. మిగతా విషయాలు నా వ్యక్తిగతమైనవి… ఎవ్వరి జోక్యాన్ని సహించను అని అంటారు. అయితే నిన్ను నీవు సజీవయాగముగా సమర్పించుకోవాలని బైబిల్ బోధిస్తుంది. ఆయన నీ రాజుగా అంగీకరించగలిగితే ప్రభువు నీ జీవితములో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రజలందరూ తమ వస్త్రములను పరిచి దారి పొడుగునా ఖర్జూరమట్టలను పరిచి దావీదు కుమారునికి జయము అని కేకలు వేసిరి. హోసన్నా అను మాటకు ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక! నీవు దేవుని స్తుతిస్తున్నావా? ఆయనను మహిమపరుస్తున్నావా? నన్ను రక్షించు ప్రభువా అని ఎప్పుడైనా అడిగావా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. సమయము దాటిపోతే నీకు రక్షణ దొరకదేమో! కృపాద్వారాలు తెరవబడియుండగానే ఆయనను నీ రక్షకునిగా అంగీకరించు.Telugu Christian Message

    ఇంతకాలం నీ యిష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడి ఎంతో నష్టపోయావు. నీవు బాధపడ్డావు, ఎంతోమందిని బాధపరిచావు. ఈ రోజైనా నీ జీవితాన్ని ప్రభువుచేతికి అప్పగించు. ఆయనను నీ రాజుగా నీ హృదయములో ప్రతిష్టించి, దేవుని పరిపాలనలో జీవించినట్లయితే ఈ లోకములో మాత్రమేకాకుండా రాబోతున్న క్రీస్తు రాజ్యములోకూడా యుగయుగములు ఏలే ఆధిక్యతను ప్రభువు నీకు దయచేయును. Telugu Christian Message

    బలియాగముగా వధకు తేబడుతున్న గొట్టెగా మానవ పాపప్రక్షాళన నిమిత్తమై యెరూషములో ప్రవేశించిన యేసయ్య రాక అక్కడి ప్రజలలో ఆనందసంభ్రమాలు కలుగజేశాయి. అట్టి సంతోషము, సమాధానము ప్రభువు తన బిడ్డలకు అనుగ్రహించును గాక! ఆమెన్!! 


ప్రత్యక్ష గుడారం subjcet  నేర్చుకోవడానికి click చేయండి.. click  here 

Leave a comment

error: dont try to copy others subjcet.