వ్యాఖ్యాన శాస్త్రము | hermeneutics-vyakyanasastram-part-1-2023| PART-1 | 2023

వ్యాఖ్యాన శాస్త్రము 

(HERMENEUTICS) 

hermeneutics-vyakyanasastram-part-1-2023| PART-1 | 2023

 ఉపోద్ఘాతము-:

     ‘HERMENEUTICS’ అనే-సదము ‘Hermeneai’ అనే గ్రీకు భాషా పదము నుండి వచ్చినది. దీని భావము- వ్యాఖ్యానించుట (Interpretation), వివరించుట (Explanation). ఒక వాక్యభాగమును సరియైన విధముగను మరియు తప్పులు లేకుండునట్లును ( ఖచ్చితముగా) వ్యాఖ్యానించు నిమిత్తము ఆ వాక్యభాగమునకు అన్వయింపజేయవలసిన పద్ధతులు, మెళకువలు, ప్రమాణాలు/ సూత్రాలను నిర్థిష్టపర్చు (లేక) నిర్ణయించు శాస్త్రమే ‘వ్యాఖ్యాన శాస్త్రము”. ఇది స్వరూప స్వభావానికి సైద్ధాంతిక మైనదిగా కన్పించును. 

A} “A Tool in His Hand” – వ్యాఖ్యాన శాస్త్రము మనుష్యుని చేతిలో ఓ సాధనము. దేవుని వాక్యమును నిర్థిష్టమైన ప్రమాణాలకూ, సత్యానికీ అనుగుణంగా వినియోగించవలెను. చేతిలోని సాధనం కదా అని ఎలాపడితే అలా వినియోగించకూడదు. (Handling Accurately God’s Word). 

    దేవుడు లిఖితరూపకమైన ఆయన నాక్యమును ఎందుకు ప్రత్యక్షపరచాడు ? 

     “ఓ పెద్ద చిత్ర రూపం” (The Big Picture) – “దేవుని నుండి నీకు” : దేవుని వాక్యము యొక్క ఆచరణాత్మక (లేక) అభ్యాస సంబంధమైన లక్ష్యము (లేక) ఉద్దేశ్యము. 

“సమయోచితముగా జీవితాలను మార్చే అన్వయం కొరకైన అనంతమైన సూత్రాలను మనం తీసుకొనుటకుగాను చరిత్రరూపకమైన కాలంలో దేవుడు వాక్యరూపకమైన సత్యాన్ని ఇచ్చాడు.” 

B) వ్యాఖ్యాన శాస్త్రము యొక్క ఆవశ్యకత:

1) దేవుని వాక్యాన్ని ఎవరికిష్టమొచ్చిన (లేక) అనుకూలించిన (లేక) నచ్చిన రీతిలో వ్యాఖ్యానిస్తున్న ఈ రోజుల్లో దేవుని వాక్యసత్యానికి కట్టుబడి వ్యాఖ్యానించవలసిన అవశ్యకత ఎంతైనా ఉంది. మనము జీవిస్తున్న ఈ కాలం చాలా విపరీతమైన పోకడతో నున్నది. మనకు కేవలము నాలుగు ముక్కలు ఉంటే / తింటే చాలదు గాని ఘనాహారం అవసరం. పాలసీసాలు పట్టుకొని తిరగడం కాదు గాని నమిలే (లేక) నెమరువేయు / ధ్యానించు కళను నేర్చుకోవలసి యున్నది. 

2) ఒకప్పుడు క్రైస్తవ్యము పరిశుద్ధత కొరకైన, గట్టిపని కొరకైన, ఉన్నతస్థాయి ఆలోచన కొరకైన, పటిష్టమైన బైబిలు పఠనం కొరకైన గంభీర బూరధ్వని పిలుపులా ఉండెడిది. కానీ, ఇప్పుడు సరియైన పునాది లేని రాజీ ధోరణితో, సరియైన పట్టులేకుండా ఉన్నది. కాబట్టి ఇలాంటి దినాల్లో ఉంటున్న మనం వ్యాఖ్యానించుట కవసరమైన సూత్రములను.నియమములను జాగ్రత్తగా గమనించవలెను, పాటించవలెను. 

3) రోమా. 10:13:15- ప్రార్థన చేస్తే రక్షించబడతాడు. ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి. విశ్వసించాలి అంటే దేవుని వాక్యం వినాలి. వాక్యము వినాలి అంటే వాక్యము చెప్పేవారుండాలి. వాక్యము చెప్పేవారుండాలంటే పంపించేవారుండాలి. పంపించేవాడు దేవుడు ఉండనే ఉన్నాడు. కానీ, చెప్పేవారు సరిగా చెప్పినపుడే దేవుని కార్యం జరుగుతుంది. అందుకు వ్యాఖ్యాన శాస్త్రం ఎంతో అవసరం… 

4) అపో.కా. 8:30-35 = ఈ భాగములో నపుంసకునికి సువార్తికుడైన ఫిలిప్పు యెషయా గ్రంథ భాగాన్ని వ్యాఖ్యానించి (వివరించి) సువార్తను వినిపించాడు. అప్పటి వరకు నపుంసకుడు చదువుచున్నాడు గాని గ్రహించలేక పోయాడు. చదువుచున్నదానికి సరియైన వివరణ అవసరమైనది. అది జరిగినప్పుడు దేవుని కార్యం ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్తి కావడానికి అవకాశమేర్పడినది. 

5) దేవుని వాక్యాన్ని ఖచ్చితమైన / సరియైన / సమగ్రమైన రీతిలో అర్థం చేసుకొని అందరికి అర్థమయ్యేలా బోధించడం ఎంతో అవసరం. 

6) దైవిక సంబంధమైన విషయములను విశిష్టమైనవిగాను, శ్రేష్టమైనవిగాను గుర్తించి, వాటిని సామాన్య మానవుడు సహితము అర్థం చేస్కొనే రీతిగా బోధించటం ఎంతో అవసరం. ఆ విధముగా చేసినప్పుడు సరిగా లేని, భిన్నమైన పద్ధతులను విడనాడటానికి, పారద్రోలడాన్కి దోహదమగును. 

7) సరియైన రీతిలో వాక్యాన్ని విభజించి బోధించుట క్రైస్తవ ఉపదేశకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని వాక్యము మానవులకివ్వబడిన నిర్దిష్టమైన మార్పులేని దేవుని వర్తమానమై యుంటే దాన్ని ఉపదేశించువాడు ఎంత ఖచ్చితముగా ఉండాలో, దానిని ఎంత సరిగా విభజించి అందించాలో గుర్తించవలెను గదా! 

C) వ్యాఖ్యాన కర్తయొక్క కర్తవ్యం (The Task)

   “వర్తమానము యొక్క ఖచ్చితమైన అర్థభావములను గ్రంథకర్త, మొదటి వినువరుల మరియు చదువరుల యొద్దనుండి గ్రహించి (లేక) కనుగొని వాటిని జాగ్రత్తగా నేటి వినుపరులు మరియు చదువరులకు అందించుట”. ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యాఖ్యాన కర్త మధ్యవర్తి లాంటివాడు. అతడు వర్తమానం ఇచ్చిన గ్రంథకర్త యొక్క, ఆ వర్తమానం ఎవరికివ్వబడెనో వారి యొక్క పూర్వాపరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలెను. 

D) బైబిలు వ్యాఖ్యాన సూత్రాలను నేర్చుకొనేముందు మనము గమనించవలసిన కొన్ని ముఖ్య విషయాలు. 

    “ ప్రతి ఒక్కరు వారివారి సొంత ధోరణిలో దేవుని వాక్యమును వివరిస్తారనో” (లేక)  మతము మరియు రాజకీయములు అనే రెండింటి విషయాలలో ప్రజలు ఏకాభిప్రాయానికి రాలేరు” అని మనం తరచుగా వింటాం. ఈ అభిప్రాయాలే నిజమైతే క్రైస్తవ్యమే అర్థరహితం, బైబిలు మనకిచ్చే వర్తమానమంటూ ఏమీ ఉండదు. ఒక వ్యక్తి తానేది చెప్పాలనుకొంటున్నాడో దానిని బైబిలు చెప్పేదిగా చూపిస్తే బైబిలు అతనికేమాత్రం మార్గదర్శకాన్ని ఇవ్వలేదు. అలాంటి స్థితిలో బైబిలు కేవలం అతని భావాలను బలపరచటానికిగాను అతని చేతిలో యున్న ఆయుధం మాత్రమే అవుతుంది, కానీ, బైబిలు ఆ ఉద్దేశ్యంతో వ్రాయబడలేదు. 

   ఈ రోజుల్లో కొందరు ఉపదేశకుల విషయాని కొస్తే, వారు చెప్పదలచుకొన్న (లేక) తాము రుద్దదలచుకొన్న మాటలకు బైబిలును ఆధారంగా చేసుకొంటున్నారు. ఇదెంతో విచారకరం. దేవుని పక్షముగా నిలబడుటయే ఓ ఆధిక్యత కాగా ఆయన మాటలు వినిపించుట మరింత ఆధిక్యతయై యున్నది. దీనిని మన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించడం దురదృష్టకరం., దేవుని తీర్పుకు యోగ్యం. దేవుని వాక్యము నేర్చించే సత్యాలకు మన అనుభవాలను జోడించి చెప్పాలే గాని, మన అనుభవాల  వెలుగులో దేవుని వాక్యాన్ని జోడించి చెప్పరాదు. 

   ప్రతి వ్యక్తి జీవితము తాను కలిగియున్న ఆలోచనలను ఆధారం చేసుకొని ముందుకు సాగును. (ఉదా:-ఒక వ్యక్తి ఓ స్థలానికి వెళ్ళి దేన్నైనా సాధించుకురావాలని సంకల్పిస్తే దానికి తగినట్టుగా కొన్ని విషయాలను ముందుగానే ఊహించును.) అదే విధముగా వ్యాఖ్యానకర్త తాను దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించుటకు సమాయత్తమయ్యే ముందు కలిగియుండవలసిన కొన్ని ప్రాథమిక ఆలోచనలు గమనిద్దాము. 

1) దేవుని వాక్యం అధికార పూర్వకమైనదని విశ్వసించాలి. దేవునిచే ఇది ఆదేశించబడింది. మనుష్యుల చమత్కారపు, చాతుర్యపు మాటలతో కూడినది కాదనే ఆలోచన మొదట మనకుండాలి. 

2) దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించే సూత్రాలు, పద్ధతులు బైబిలులోనే పొందుపర్చబడి యున్నాయని, వాటినెప్పుడైతే సరిగా అర్థం చేసుకొని అన్వయించుదుమో అప్పుడే ఎంచుకొన్న భాగానికి సరియైన భావం కలుగునని విశ్వసించాలి. 

3) గ్రంథకర్త యొక్క అర్ధ, భావములను కనుగొనుటయే వ్యాఖ్యాన కర్త యొక్క ప్రథమ కర్తవ్యం అని ఎరిగి యుండాలి.

4) దేవుని వాక్యాన్ని సరిగా విభజించి చదువుట, గ్రహించుట ప్రతి క్రైస్తవుని యొక్క విధియని తెలుసుకోవాలి.

5) భాష ఆత్మీయ సత్యములను అందించగలదని (Communicate చేయునని) మనము ఎరిగియుండాలి. 

A.) అది ఏ భాషలో వ్రాయబడెనో ఆ భాషాపదము )ను అధ్యయనం చేయుట అవసరము. ఉదా: మార్కు 4:39లో యేసు సముద్రాన్ని “నిశ్శబ్దమై ఊరుకొండుమని గద్దించాడు. కానీ, అక్కడ వాడబడిన గ్రీకు పదం యొక్క అర్థం ” నీ మూతికి చిక్కం పెట్టుకో”. 

B.)  మనము కలిగియున్న మరియు అలవర్చుకొన్న భాష ఎంతో ప్రాముఖ్యం. ఆత్మీయ సత్యాలను అందించుటకు భాష చక్కని మార్గం వేస్తుంది.

E.) దైవ గ్రంథాన్ని సరియైన విధానంలో అధ్యయనం చేయుటకుగుర్తుంచుకోవలసిన నాలుగు ప్రముఖ విషయాలు 

  1) పరిశీలన (Observation)- ఇందు బైబిలు విద్యార్థి యొక్క పాత్ర అపరాధ పరిశోధకుని (Detective) పాత్ర విషయ పరిశీలన అతని బాధ్యత. పరిశోధకునికి ప్రతి చిన్న విషయము ప్రాముఖ్యమైనదే. అయితే దేనికెంత ప్రాధాన్యత నివ్వాలి అనేది తరువాతి విషయం. దేవుని వాక్యాన్ని మనము అధ్యయనం చేసేటప్పుడు మనకు ఏ విషయము అప్రాముఖ్యమైనది కాదు. ‘పరిశీలన’ అంటే ఏమిటి? ‘ఏదైన సత్యాన్ని (లేక) సంభవాన్ని గమనించి, గుర్తించి వ్రాసే ప్రక్రియయే పరిశీలన’. పరిశీలనలో తప్పులు లేకుండుట యనేది ఎంతో ప్రాముఖ్యం (Accuracy is important). దీనికి సాధన మరియు ఏకాగ్రత / కేంద్రీ కరణ శక్తి (Practice and Concentration) ఎంతో అవసరం. అన్నిటి కంటే పైగా మనం పరిశుద్ధాత్ముని సహాయాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలి. మనం పరిశీలించిన ప్రతిదానిని మరింత ఆలోచన కొరకు, ఇతరమైన వాటితో పోల్చుట కొరకు ఒక పేపరు తీసుకొని దానిపై వ్రాసిపెట్టుకోవాలి, ఇలా రికార్డు చేసిపెట్టుట ద్వారా మన మనస్సు మరిన్నింటిని పరిశీలించటానికి సిద్దము (Firee) గా ఉండును. 

A.) పరిశీలనకు అవసరమైన విషయములు 

1.) ప్రార్థనా పూర్వకముగా పరిశుద్ధాత్మపై ఆధారపడవలయును(యోహా. 14:26; 16:13). మన తెలివి తేటలపై కాదు. 

2.) సరియైన మనోవైఖరి అవసరం అనగా సరియైన ఆలోచనలతో లేఖనాలను పరిశీలించుట. 

3.)  పరిశీలన చేయాలన్న ఆలోచన (లేక) కోరిక మరియు చిత్తము అవసరము. 

4.) ‘నేర్చుకోవాలి’, ‘తెలుసుకోవాలి’ అనే పట్టుదల / నిశ్చయత అవసరం. నేర్చుకో వడం అనేది అంత తేలికైనదేమీ కాదు. అందుకు ఎంతో శ్రద్ధ మరియు క్రమశిక్షణ అవసరం. అప్పుడే అనేక విషయాలు తెలుసుకోగలం.

5.)  పరిశీలనకు సహనం ఎంతో అవసరం. బైబిలు సంబంధిత జ్ఞానమును పొందుకోవడానికి ఓర్పు ప్రాముఖ్యం.. దాని కొరకు మనం కొంత సమయాన్ని వెచ్చించాలి. నేర్చుకొనే విధానంలో (Learning Process) అడ్డదారులు (Short Cuts) ఏమీ లేవు. ఒక వేళ అడ్డదారులు ఉంటే అవి ఇరుకున (Short circuit) పడవేస్తాయి. ఈ అడ్డదారులు మనలను అబద్ధ బోధల వైపు తీసుకు వెళ్తాయేగాని సర్వసత్యములోనికి నడిపించవు. మనం చేసే దానికి వచ్చే ఫలితం (Product) ఎంత ప్రాముఖ్యమో, మనమెళ్ళే దారి (Process) కూడా అంతే ప్రాముఖ్యము.

6.)  పరిశీలనకు శ్రద్ధతో కూడిన రికార్డు ఎంతో అవసరం. పరిశీలించినది శ్రద్ధగా వ్రాసియుంచినట్లయితే అది ఎంతయో ఉపయోగపడును. 

vii) పరిశీలనలో జాగరూకత/మెళకువ ఎంతో అవసరం. ఈ పరిశీలన అధ్యయనంలో మొదటి మెట్టే. ఇంకా చేయవలసిన పనులు (వ్యాఖ్యానం, సమన్వయం, అన్వయం) ఉన్నాయి. ఈ పరిశీలనకే సమయమంతా- ఖర్చుచేస్తే మిగతా పనులు మరుగున పడును. ఇచ్చోట మూడు విషయాలు గమనించాలి. 

  • అనవసరమైన వివరాల కోసం పోవద్దు.
  • పరిశీలనతో ఆపివేయవద్దు.
  • ప్రతీ దానికీ సమానమైన విలువను ఇవ్వద్దు. ఏది అవసరమో, ఏది అవసరము కాదో కనుగొనాలి. అన్నిటి విలువ ఒకటిగా ఉండదు.

ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవడానికి ఇక్కడ ప్రెస్ చేయండి

click here

 

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “వ్యాఖ్యాన శాస్త్రము | hermeneutics-vyakyanasastram-part-1-2023| PART-1 | 2023”

Leave a comment

error: dont try to copy others subjcet.