tabernacle |telugu |complete |history|- ప్రత్యక్షపు గుడారము చరిత్ర తెలుగులో-2023

Written by biblesamacharam.com

Updated on:

ప్రత్యక్షపు గుడారము 

 Tabernacle | Complete history | telugu

ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి ప్రయాణము చేసి సీనాయి పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా మోషేను సీనాయి పర్వతము మీదికి పిలిచెను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుటకై ఒక మందిరమును నిర్మంప వలెనని ఆజ్ఞాపించి, చేయవలసిన మాదిరి చూపించెను. అప్పుడు మోషే, దేవుడు సీనాయి పర్వతము మీద తనకు చూపిన విధముగా మందిరమును నిర్మించెను. ఈ మందిరమే ప్రత్యక్షపు గుడారము. ఇశ్రాయేలీయులు ఈ ప్రయాణము నందు గుడారములలో నివసించిరి. మరియు యెహోవా ప్రత్యక్షమగును గనుక ఈ మందిరమునకు ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టబడి యున్నది (నిర్గ 25:8; 29:30-42; 35:21; 40:34). అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు తమది కాని దేశంలో పరవాసులుగా 430 సం॥ జీవించిరి (ని.కా. 12:40,41;గలతీ3:17,18).

అబ్రహాము పిలుపు BC 1921 

ఐగుప్తు నుండి బయలుదేరుట BC 1491 (1921-1491 = 430) యాకోబు ఐగుప్తుకు వచ్చినది BC 1706 ఇశ్రాయేలీయులు బయలు దేరుట BC 1491 (1706-1491=215) ఈ రీతిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 215 సం||లు వుండిరి.

ప్రత్యక్షపు గుడారము యొక్క నాలుగు వైపులు అన్ని గోత్రముల వారు నివసించుచుండిరి. లేవీ గోత్రము గుడారమునకు చాలా సమీపముగా నుండిరి. లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కించబడలేదు (సంఖ్యా 1:47,53)

సూచనగా నున్న గురుతు

తూర్పు : 

  1. ఇశ్శాఖారు సంఖ్యా 2:5
  2. యూదా (మధ్యలో) సింహము 2:3
  3. జెబూలూను 2:7

దక్షిణము : 

  1. షిమ్యోను 2:12
  2. రూబేను (మధ్యలో) మనుష్యుడు 2:10
  3. గాదు 2:14

పడమర: 

  1. మనష్హే 2:20
  2. ఎఫ్రాయిము (మధ్యలో) ఎద్దు 2:18
  3. బెన్యామీను 2:22

ఉత్తరం :

  1. ఆషేరు 2:27
  2. దాను (మధ్యలో) పక్షిరాజు 2:25
  3. నఫ్తాలి 2:29

గుడారపు పనివారు:

1) బెసలేలు : – ఈయనది యూదా గోత్రము హూరు మనవడు. ఊరు కుమారుడు (నిర్గ 31:1-11; 35:30)

2) అహో లియాబు :- దాను గోత్రమునకు చెందిన అహీసామాకు కుమారుడు (నిర్గ 31:6; 35:34)

I ప్రాకారము – ద్వారము (EX 27:9-19; 38:9-20)

దాదాపు 2500,000ల మంది ప్రజల మధ్య ప్రత్యక్షపు గుడారము నిర్మించబడినది. వారు నలువైపుల నుండి గుడారములోనికి వచ్చుటకు విశాలమైన రోడ్లు సిద్ధ పరచిరి. భూమిపై కనిపించే ఇతర కట్టడముల కంటే ఈ కట్టడమునకు ప్రత్యేకత యేదనగా, 150 అడుగుల పొడవు 75 అడుగుల వెడల్పుగల ఈ గుడారమునకు ఒకే ద్వారమే ఉండెను. ఈ ద్వారము తూర్పు భాగమున వున్నది. దేవునిలోనికి లేక దేవుని సంఘములోనికి ఏకైక ద్వారమైయున్న యేసుక్రీస్తుకు సాదృశ్యముగా వున్నది (యోహాను 10:9, 14:6, 10:7)

ప్రత్యక్షపు గుడారము మూడు భాగములుగా విభజింప బడియున్నది.1) ప్రాకారము 2) పరిశుద్ద స్థలము 3) అతి పరిశుద్ధ స్థలము.

  1. ప్రాకారము :- ఈ ప్రాకారము నూరు మూరల పొడవు 50 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తును కలిగి యున్నది. వీనికి 60 స్తంభములున్నవి. వీని మీద పేనిన సన్ననారబట్ట తెరలుగా వేయ బడెను. ఇదే ప్రాకారము. ఇది సంఘమునకు సాదృశ్యమైయున్నది.
  2. ప్రాకార ద్వారము :- ఈ ప్రాకారమునకు ఒక ద్వారము మాత్రమే. నూరు మూరలు పొడవు, యేబది యూరల వెడల్పు గల ఈ ప్రాకారమునకు నాలుగు వైపుల నున్న జనులు ప్రవేశించుటకు ఒకే ద్వారము కలదు.
  3. విశాల మైన ద్వారము :- 20 మూరల పొడవున్నది. ఈ ద్వారము క్రీస్తే. 20 మూరల వెడల్పు 5 మూరల ఎత్తు ఈ ద్వారమునకుండెను. ఏ పరిస్థితిలో నున్న వారైనను ఏ విధమైన ఇబ్బంది లేకుండా లో నికి వేశించుట సాధ్యమౌతుంది. సర్వలోకము కొరకై తెరువబడిన ద్వారము. ఈ ద్వారము క్రీస్తే (యెషయా 55:1; రోమా 10:12; మత్తయి 11:28).
  4. తెరువబడియున్న ద్వారము :- దీనికి తాళము, తాళపు చెవి లేదు. పగలు రాత్రియు, చిన్నలకు పెద్దలకు, పురుషులకు స్త్రీలకు వ్యత్యాసము లేక స్వేచ్ఛగా ప్రవేశించుటకు అందరికిని స్వాతంత్య్రము కలదు. పాప ద్వారము మూయబడియున్న తలుపును క్రీస్తు ప్రభువు సిలువ అను తాళపు చెవి ద్వారా (యెషయ 22:22) తెరచి యున్నాడు. ఇది కృపా ద్వారమైయున్నది. (ప్రక 3:7,8; యోహాను 7:37; రోమా 5:12; II కొరింతి 6:2; ప్రక 21:25).
  5. అందమైన ద్వారము :- గుడారమునకు అన్ని వైపులను సన్నని నారబట్ట లేదు. గాని ఈ ద్వారమునకు విచిత్రమైన తెర వేయబడియున్నది. ఇది నీల, ధూమ్రరక్త వర్ణపు సన్నని నారతో చేయబడియున్నది. చూచుటకు ఎంతో అందంగా ఈ ద్వారము కనిపించెడిది. ఇది యేసుక్రీస్తు యొక్క సౌందర్యమును సూచిస్తున్నది (పరమ 5:10).

నీల వర్ణము = దేవుని మహాకృపకు గుర్తు. 

ధూమ్రము = నీల, రక్తములు కలిగిన మిళిత వర్ణము. ఇది దేవునికిని మనుష్యులకును మధ్య వర్తిని సూచించు చున్నది. 

రక్త వర్ణము = యేసు ప్రభువు మన పాపాలకై చిందించిన పవిత్ర రక్తమునకు గురుతు. 

సన్నపునార (తెలుపు) – ఇది పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు గుర్తు. 

  1. ప్రతిగృహమునకు ద్వార భందపు పైకమ్ములు (దర్వాజ) నిలువు కమ్ములు ఉండును గానీ గుడారమునకు ఇవి యేమియు లేదు. లోనికి ప్రవేశించు వారియొక్క పాదములు వాటికి తగిలి క్రింద పడతారనే భయం లేకుండా సాఫీగా వెళ్ళవచ్చును (గలతీ 2:16; తీతు 3:5). విశ్వాసముద్వారా ప్రవేశించే స్వాతంత్ర్యమును ఇది సూచిస్తుంది.
  2. నాలుగు స్థంబములపై వ్రేలాడదీయబడిన తెర. ద్వారపు తెర యేసుక్రీస్తును సూచిస్తున్నది. నాలుగు స్థంభములు లోకరక్షకుడైన యేసుక్రీస్తును చూపించే నాలుగు సువార్తలకు సాదృశ్యమైయున్నది.
  3. తూర్పు భాగమున ద్వారముండెను. నీతి సూర్యుని కిరణములు ద్వారమునకు ప్రకాశమిచ్చుచుండెను.

ప్రాకారము దేవుని సంఘమును సూచిస్తున్నది:

  1. ప్రాకారము ఎడారిలో నున్నది. ఈలోకమనే ఎడారిలో దేవుని సంఘము వున్నది.
  2. ఎడారిలో గాలి, దుమ్ము, దూళి అను వాటిలో నుండి ప్రాకారపు తెర గుడారమును, ప్రాకారములో నున్న వారికి హాని కలుగకుండా కాపాడుచున్నది. రక్షించబడిన విశ్వాసి ప్రభువు ఇచ్చే నీతి వస్త్రములచే పొదుగ బడి వున్నాడు.
  3. ప్రాకారము వేరైయున్న స్థలము (ప్రత్యేకమైన) విశాలమైన ఎడారిలో కళ్ళకు, చెవులకు ఇంపుగా నున్న అనేక విషయములున్నవి. అయితే ఈ ప్రాకారపు తెరచాటున ప్రవేశించిన వారిని ఎడారిలో నుండి ప్రత్యేక పరచి, మరుగుపరచినందున శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమనే లోక సంబంధమైన ఇంపైన వాటిలో నుండి తప్పింపబడుదురు (ఆది 1:4; కీర్తన 42:1, 50:5, 1:1-3; II కొరింథి 6:14-18; I పేతురు 2:11, I కొరింథి 7:29-32)
  4. మందిరావరణము యొక్క రమ్యతను రాజులు సహాచూడవలెనని ఆశించిరి (కీర్తన 65:4, 84:1-4). అవిశ్వాసి విశ్వాసుల ఆరాధనకు వచ్చినప్పుడు పాపముల విషయమై పశ్చాత్తాప బడి మోకరించి తన తప్పులను ఒప్పుకొనును మీ మధ్య దేవుడున్నాడని దేవుని స్తుతించుదురు. (1 కొరింథి 14వ అధ్యా॥) .

II బలి పీఠము, బలులు (EX 27:2-8; 38:1-7)

అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మొదటి మెట్టు బలి పీఠము. ఇతర వస్తువులన్నింటికంటే ఇది చాలా పెద్దది. బలి పీఠము క్రీస్తును సూచిస్తున్నది. పాపంద్వారా దేవునికి దూరమై పోయిన మానవుని మరలా తిరిగి దేవునితో సత్సహవాసము పొందు కొనుటకును దేవుని సన్నిదికి సమీపించి ఆయనను ఆరాధించుటకును ఆయన ద్వారా ఆశీర్వాదములు పొందుకొనుటకును యోగ్యులగుటకు మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నొద్దకు రావలసియున్నది కలువరిలో పరమ యాగమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మూలముగా మాత్రమే తండ్రి సన్నిదికి వెళ్ళగలము.

1.) ఈ బలి పీఠము యేసు క్రీస్తుకు ముంగుర్తుగా నున్నది (హెబ్రీ 13:10) మొదటి బలి దేవుడు తానే అర్పించిన రీతిగా, చివరి బలి పీఠము బలియు ఆయనే (యేసు క్రీస్తు) సమర్పించి సంపూర్ణము చేసి యున్నాడు.

2.) ఈ బలి పీఠము రెండు విధములైన వస్తువులతో చేయబడి యున్నది.

A.) తుమ్మ కర్ర : – ఈ కర్ర ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మనుష్యత్వమును చూపించును. (యెషయ4:2; 11:1; యిర్మియా 23:5; జెకర్యా 3:8. బలిపీఠము తుమ్మకర్రతో చేయబడెను (నిర్గమ 27:1). తుమ్మకర్ర ఎడారిలో పెరిగి చూపునకు పెద్ద అందంగా ఉండదు. ఇది యేసుక్రీస్తు యొక్క మనుష్యుత్వానికి గురుతు (యెషయా 53:2,3) అతనికి స్వరూపమైననూ బెత్లహేములో జన్మించెను. ఒక సామాన్యమైన మానవుని వలే పెరిగెను. భుజించెను, నిదురించెను, ఏడ్చెను, దెబ్బలు తినెను, సిలువలో మేకులచే కొట్టబడెను, చనిపోయెను, సమాధిచేయబడెను. ఇవన్ని ఆయన సంపూర్ణ మనుష్యుడని ఋజువు చేయుచున్నవి.

B.) ఇత్తడి :- ఈ ఇత్తడి దైవత్వమును చూపించును. బలి పీఠము (అనగా దేవుని కుమారుడు) కర్ర మాత్రమైన యెడల అగ్నికి కాలిపోవును కనుక కర్రపైన ఇత్తడిని పొదగ వలయును (అ.కా. 2:24; యోహాను 1:14; 1 యోహాను 5:20; తీతు 2:1,2).

3) బలి పీఠము యొక్క కొలతలు :- పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తు 3 మూరలు, ఈ బలి పీఠము చచ్చౌకముగా నుండ వలయును. ఈ బలిపీఠము లోకమంతటి కొరకు ఇవ్వబడినది. భూలోకము ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా అను ఈ ఐదు ఖండములకు ఇవ్వబడెను. పంచ ఖండముల కొరకై ఇవ్వబడిన బలిపీఠమైయున్నది. యేసుక్రీస్తు యొక్క నాలుగు సువార్తలకు సూచనయైయున్నది. పొడవు, వెడల్పుల వలే ఎత్తుకూడా ఐదుమూరలు ( ఏడున్నర అడుగులు) ఉండి వుంటే యాగవస్తువు పైకిచేర్చుట కొరకు మరొక వస్తువు ఏర్పాటు చేయవలసి వచ్చేది (నిర్గమ 20:25) బలిపీఠము నెక్కుటకు మెట్లు కట్టరాదనే విషయాన్ని ఈ వాక్యము ఋజువు చేయుచున్నది.

4) ఈ బలిపీఠమునకు నాలుగు కొమ్ములున్నవి : తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు ఈ భూలోకము సూచనగానున్నది. భూదిగంతముల నివాసులందరు ఆయనను చూచి రక్షింప బడవలయును.

  1. ఒక్కొక్క మూలను ఆమూల కొమ్ము వెలుపలకు వంగియుండ వలెను. ఈ కొమ్ములకు రక్షణశృంగమని అర్థము (లూక 1:69; మత్తయి 11:28, 29;                     1 కొరింతి 1:18).
  2. ఈ కొమ్ములు మరణ శిక్షలో నుండి విమోచన నిచ్చును (I రాజు 1:50; 2:28). ఇశ్రాయేలీయులలో నెవడైనను మరణ కరమైన నేరము చేసినప్పుడు పరుగెత్తి పోయి బలిపీఠము యొక్క కొమ్ములను ముట్టుకొనిన యెడల వానికి మరణ శిక్షలేదు. అది దేవుని ప్రమాణమై యున్నది (రోమా 6:23; రోమా 8:1; హెబ్రీ 2:15, 6:18).
  3. ఈ కొమ్ములు బలి పశువును త్రాళ్ళతో కట్టుటకు వుపయోగించును (కీర్తనలు 118:27; ఆది 22:9). యేసు క్రీస్తను గొర్రె పిల్ల బలిపీఠమైన సిలువకు మేకులతో అంట గొట్టబడెను (గలతీ 2:20,5:24, 6:14).

5) బలి పీఠము పెద్దది :- గుడారములోని పనిముట్లు దీనియందుంచబడును. విశ్వాసులకు కావలసిన సమస్తము కలువరి గిరి పైనున్న సిలువలో దొరుకును.

ఏకైక బలిపీఠము:- ఎక్కువ జనసమూహములున్ననూ బలులర్పించుటకు అక్కడక్కడ బలిపీఠములు ఉండి ఉంటేచాలా సౌకర్యంగా ఉండి ఉండెడిదని భావించవచ్చుగాని దేవుని వుద్దేశ్యములు వేరుగా ఉండును. బలి పీఠము క్రీస్తును సూచిస్తున్నది. ప్రభువు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, ఒకని ద్వారా మాత్రమే రక్షణ కలుగునన్న సత్యమును ఈ బలిపీఠము తెలియజేయుచున్నది. (హెబ్రీ 10:12; ద్వితీ 12:13) కనిపించే ప్రతి స్థలమున దహన బలులను అర్పించకుండా జాగ్రత్తగా వుండాలి.

6) బలి పీఠ సంబంధమైన ఉపకరణములు :- (నిర్గ 27:3) 

A.) కుండ : – బలి పీఠము మీదనున్న బలిని దేవుడం గీకరించునప్పుడు ఆ బలి దహించబడి బూడిదగును (Ps 20:3). ఆ బూడిదెను ఈ కుండలోనికి యెత్తుదురు (1 రాజు 18వ అధ్యాయము; లేవీ 6:10,11). అలాగే మనము ప్రభువు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండవలెను (అ.కా. 9:15; రోమా 9:23; 2 తిమో 2:27)

B.) గరిటెలు : – బలి పీఠము మీద నున్న బూడిదెను గరిటెలతో తీసి కుండలో వేయవలెను ( లీవీ 6:10)

C.) గిన్నె : – యాజకుడు బలి పశువును బలి పీఠముమీద కట్టి కత్తితో ముక్కలు ముక్కలుగా చేయవలెను (లేవీ 1:5; ఆది 22:10) అప్పుడు రక్తము నదివలె ప్రవహించును. దానిని గిన్నెలోనికి తీసి బలి పీఠము నుండి మహా పరిశుద్ధ స్థలము వరకు పరిశుద్ధ పరచుటకీ రక్తమును వుపయోగ పరచవలెను (లేవీ 4:7; నిర్గ 12:22).

యేసు యొక్క రక్తమునకు గల ప్రత్యేకతలు :- 

  1. అమూల్యమైన రక్తము (1 పేతురు 1:19)
  2. సంఘము యొక్క విలువైన రక్తము (అ.కా. 20:28)
  3. నీతిమంతులుగా తీర్చేరక్తము (రోమా 5:9, 3:11)
  4. విమోచనారక్తము (ఎఫెసి 1:7; I పేతురు 1:18,19)
  5. పరిశుద్ధ పరచేరక్తము (హెబ్రీ 13:12, 1 యోహాను 1:7)
  6. సమాధానము (సంధిచేయు) రక్తము (కొలస్సీ 1:20; ఎఫెసీ 2:14)
  7. సమీపస్తులుగా చేయురక్తము (ఎఫెసి 2:13-18)
  8. ప్రవేశింపజేసే రక్తము (హెబ్రీ 10:19,20)
  9. వస్త్రములను ఉతుక్కొని వాటిని తెల్లగా చేయురక్తము (ప్రకటన 7:14)
  10. జయించురక్తము (ప్రకటన 12:11)
  11. రాజుల యాజక సమూహముగా చేసిన రక్తము (ప్రకటన 1:6, 5:9)
  12. శ్రేష్టముగా పలుకు ప్రోక్షణరక్తము (హెబ్రీ 12:24)
  13. క్రొత్త నిబంధన రక్తము ( లూక 22:20; 1 కొరింధి 11:25)

D.) ముండ్లు :- పరలోకము నుండి అగ్నిదిగి వచ్చి, బలి అర్పణమును దహించునప్పుడు, కొన్ని ముక్కలు దహింపబడకుండ మిగిలిపోవును. అట్లు దహింపబడని  వాటిని సంపూర్ణముగా దహింప చేయుటకీ ముండ్లు పనికి వచ్చును (I సమూయేలు 2:13,14; యూదా 4; గలతీ 5:24, 6:14). సంపూర్ణ   సమర్పణ (ప్రతిష్ట) ను ఇది సూచిస్తున్నది.

E.) అగ్నిపాత్ర:- (1) ఇశ్రాయేలీయులు పాళెముమారి, వేరు ప్రదేశముల యందుడేరాలు వేయునప్పుడు అగ్ని తీసుకొని వెళ్ళుటకీ పాత్ర ఉపయోగ పడుచున్నది. (2)ఈ పాత్రలోనున్న (బలిపీఠమునందలి) అగ్నియేగాని, అన్యాగ్ని బలికి  ఉపయోగింపకూడదు. అట్లు చేసిన యెడల మరణము సంభవించును (లేవీ 10:1). (3) అగ్ని ఆరి పోకుండా ఈ పాత్ర ఉపయోగపడును (లేవీ 6:12,13). (4) ఈ అగ్ని దహన బలిలోనే గాక ధూప వేదిక పైనకూడా ఉపయోగ పరచుట అవసరము. అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యము (లూకా3:16, 12:49; 1 పేతురు 1:7, II థెస్స 2:13). దేవుని పరిశుద్ధాత్మ అనే  అగ్ని దైవప్రజలను శుద్దీకరించుచున్నది.

F.) ఉంగరములు మోత కర్రలు :- బలి పీఠమునకు ఒక్కొక్క ప్రక్కన ఒక్కొక్క మోతకర్ర పెట్టి బలి పీఠమును మోసి కొనిపోవలెను, ఈ బలిపీఠము క్రీస్తే (యోహాను 20:15).

G.) దూమ్ర వస్త్రము, సముద్రవత్సల చర్మము :- బలి పీఠమును మోసికొని పోవునప్పుడు దాని సామానులన్నియు ఒకదానిలో పెట్టి దూమ్ర వస్త్రము దాని మీద కప్పి దానిపై సముద్రవత్సల చర్మమును కప్పవలయును  (సంఖ్య 4:13,14).

B.) బలులు

బలి పీఠము నందు ఐదు విధములైన బలులు ఇశ్రాయేలీయులు క్రమముగా అర్పింప వలెనని, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెను. ఈ ఐదు గొప్ప అర్పణలు యేసు క్రీస్తు ప్రభువును ఆయన సేవను చూపును.

I దహన బలి :-   ఆయన నిర్దోషియైన బలి

II నైవేద్యము :- సంపూర్ణుడు (సంపూర్ణత)

III సమాధాన బలి :-   మానవునికిని దేవునికిని మధ్య సమాధాన కర్త

IV పాప పరిహారార్థ బలి :-   దేవునితో పాపము చేసినవారు వారి పాపముల విమోచనార్థమై అర్పించవలసినది.

V అపరాధ పరిహారార్థ బలి – మనుష్యులతో పరిశుద్ధ వస్తువులతో చేసిన  తప్పిదములకు అర్పించవలసినది.

I దహన బలి (లేవీ 1వ అధ్యాయము) 

దేవుడు మానవుల భయంకర పాపములను బట్టి జల ప్రళయమను ఘోర శిక్షను పంపుట వలనను, ఒకనికి దేవుని దర్శనము కలిగి నందు వలనను, తెగులు లేక యుద్దము కలిగి నందు వలనను పుట్టు నట్టి భయముగల వాడై ఆరాధికుడు ఈ బలి నర్పించును (ఆది 8:20; 22:13; న్యాయ 6:22,23). దేవుడు పరిశుద్ధుడని తెలిసికొని ఆయన సన్నిధిని పాపాత్ములు నిలువ లేరని గ్రహించుకొనిన వారాయనను సమీపించు సదుపాయము దీని మూలమున దొరికెను. ఈ బలి, దేవుడు దాని నర్పించిన వారికి, తన్నంగీకరించినాడను విశ్వాసమును వానిలో కలుగ జేయును. ఈ బలి యొక్క ఫలితములు మూడు.

  1. ఇది యెహోవాకు యింపైనది (లేవీ. 1:9)
  2. ఆరాధికునకు ప్రాయశ్చిత్తము కలుగ జేయునది (లేవీ 1:4)
  3. ఆచార సంబంధమైన అపవిత్రతను పవిత్రపర్చునది. (లేవీ 14:20)

దహన బలి ప్రజలందరి కొరకైనది (నిర్గ 29:38-42) ప్రతి యొక్కరు చేయవలసినది. (లేవీ 22:18; సంఖ్య 15:3) దీనిని చేయుటలో నొకడు దేవునికి తన్ను సంపూర్ణముగా ప్రతిష్టించుకొనవలెను. మన కొరకే క్రీస్తు బలియగుటలోనిది సంపూర్ణముగా నెరవేరెను (ఎఫెసీ 5:2; హెబ్రీ 10:10). ఈ దహన బలి యాగమునకు మూడు విధములుగా అర్పించబడుచున్నవి.

A.) గోవు :- (లేవీ 1:3) ఈ బలిని ధనవంతుడు అర్పింపవలెను.

B.) గొర్రె లేక మేక – (లేవీ 1:10-13) మధ్య తరగతి జనులు (బీదలు కాదు, ధనికులుకాదు)

C.) పక్షులు :- (లేవీ 1:14-17) బీదలర్పింప వలసిన బలి.

లేవీ 1:3 ‘దహనబలి’ లేవీ 6:8-13 శబ్దార్థముగా ఇది సువాసన ధూమముగా పరలోకమునకెగయు సాంబ్రాణి పొగవలెనుండును. ఆయన సింహాసనము చెంత చేరునొక ప్రార్థన (కీర్తన 141:2) “నిర్దోషమైనది” (లేవీ 22:20-25) కొన్ని సార్లు యోగ్యతను మనఃపూర్వకముగా ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యము చేసిరి. (మలాకీ 1:7) “ప్రత్యక్షపు గుడారము ద్వారము నొద్దనుండు బలిపీఠము” దహన బలులర్పించు బలి పీఠముండు చోటు ఇదే (నిర్గమ 40:28,29) యెహోవాను సంధించుటకీ బలిపీఠము, దాని మీదనుండు హోమ ద్రవ్యములే మూలము. “యెహోవా సన్నిధిని” ఇదే ప్రత్యక్షపు గుడారమునకు ముందున్న ఆవరణము.

దహన బలి (లేవీ 1:1-17) 

1.) బలి మృగము నిర్ధోషమైన మగదై ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషమైన స్థితిని తెలుపుచున్నది (ఎఫెసీ 5:2; హెబ్రీ 9:14)

2.) బలి పీఠపు ఉత్తర దిక్కున వదింపవలెను. ఇది గొల్గొతాను సూచించు చున్నది.

3.) రక్తము బలిపీఠము చుట్టూ ప్రోక్షింపవలయును. యేసు రక్తము వలన శుద్దీకరించబడేదానిని సూచించు చున్నది (I యోహాను 1:7; హెబ్రీ 9:22)

4.)  చర్మమును వలువ వలెను. రంగులో తేడా ఉండకుండా కనబడుట కీలాగు

చేయవలెను. క్రీస్తులో జాతి, మత, కుల బేదమునకు తావులేదు. తోలు వలిచినట్లయితే రంగు బేదమువదలి పోవును.

5.) ముక్కలు ముక్కలుగా వధించవలెను. విరిగి నలిగిన హృదయమునుసూచిస్తున్నది (కీర్తన 51:17; అ.కా. 2:37)

6.) నీళ్ళతో కడుగవలెను. తోలు వలిచిన తరువాత మృగము యొక్క రోమాలు,అపవిత్రమైన మరేదైనా మాంసము పై ఉండవచ్చును అది అలాగుండ  కుండుటకుగాను నీళ్ళతో కడుగ వలెను. వాక్య మనే నీళ్ళతో కడుగు దానిని  ఇది సూచిస్తున్నది (హెబ్రీ 12:1; తీతు 3:5; కీర్తనలు 51:7)

7.) తల, క్రొవ్వు, ఆంత్రములు, కాళ్ళు అన్నియును దహించవలయున (1 యోహాను 2:16; రోమా 12:1,2).

II నైవేద్యము (లేవీ 2వ అధ్యాయము) 

హెబ్రీ బాషలో దీనిని ‘మించా’ అనగా పై అధికారులకు తమ కాపుదల కొఱకుగాని వారి దయను సంపాదించుకొనుటకు గాని, సామాన్యుడిచ్చు ఒక బహుమతి యని అర్థము. ఐదు విధములైన బలులలో యిది ఒకటి మాత్రమే రక్తము చిందింప బడకుండ చేయు బలి.

ఈ నైవేద్యము మూడు విధములుగా చేయుదురు. 
  1. గొధుమ పిండి నైవేద్యము (లేవీ 2:1-3)
  2. పెనము మీద కాల్చబడిన అప్పడము (లేవీ 2:4-13)
  3. ప్రథమ ఫలముల నైవేద్యము (లేవీ 2:14,15)

ఈ మూడు విధములైన నైవేద్యములకు నూనె, ఉప్పు, సాంబ్రాణి ఉపయోగింపవలెను. పులుపు, తేనె ఉపయోగింప కూడదు. ఈ నైవేధ్యమును కూడా యాజకుల యొద్దకు తీసుకొని రావలయును, యాజకుడు దానిలోని ఒక భాగమును బలి పీఠము మీద దహింప వలెను. మిగిలినవి యాజకులు తిందురు (లేవీ 2:10; 6:16) ఈ నైవేద్యము యేసు క్రీస్తు యొక్క పరమ యాగమునకు గుర్తు.

1.) ఈ నైవేద్యము గోధుమ పిండిదై యుండవలెను. (లేవీ 2:1-4) యేసు ప్రభువేఈ గోధుమ పిండి. (యోహాను 12:24, 6:27) జీవపు రొట్టె.

2.) ఈ గోధుమ పిండి మెత్తని పిండియై యుండవలెను (Fine Flour)  పిండిలో యేమియు గరుకు పిండి (చిన్న చిన్న ముక్కలు) యుండ కూడదు. ఇది దేవుని గొర్రె పిల్లయైన క్రీస్తు యొక్క నిష్కళంకత్వమును మరియు యేసు పరిపూర్ణ జీవితమును సూచించు చున్నది. ఈ విధముగానే ఆయన విశ్వాసులు కూడా యుండవలెను (మత్తయి 5:48; I పేతురు 1:16; ఎఫెసీ 4:13-16; 1 కొరింథి 12:12; గలతీ 5:23).

3) ఈ నైవేద్యపు రొట్టెలలో నూనెకలుపవలెను. ఈ నూనె పరిశుద్ధత్మా యొక్క సంపూర్ణతకు గుర్తు (కీర్తన 45:7; ఆపొ.కా. 4:28, 10:38) నైవేధ్యమునకు తెచ్చిన రొట్టెలు ముక్కలుగా త్రుంచి నూనె పోయవలెను (లేవీ 2:6).

4) ఈ నైవేధ్యయాగమునకు అప్పడములు, పూరీలు పులుపులేనివై యుండ వలెను (లేవీ 2:11; 10:12). పులుపు పిండి యున్న యెడల అదంతయు పులిసి. ఉబ్బును కాబట్టి నైవేధ్యములో దీనిని నిషేదించిరి. పులుపనునది అపరిశుద్ధతను, దుష్టత్వమును, చెడ్డనడవడిని, అవినీతిని చూపించు చున్నది. (మత్తయి 16:6, 12; 1 కొరింథి 5:7,8).

రెండు విధములైన పులుపులున్నవి. (1) జీవితము (గలతి 5:24, 5:9; 1 కొరిం 5:6) (2) బోధ (మత్తయి 16:5-12).

5) ఉప్పునుపయోగించుట :- ఉప్పును (a) రుచికొరకు (b) వస్తువులు చెడ కుండా వుండుటకు (c) పులుపు లేకుండా ఉండుటకు వాడుదురు. (యోహాను 6:6; 6:68, 7:46; లూక 4:22; కీర్తన 42:2) ఒక్కొక్క విశ్వాసి ఈ విధముగా రుచి కలిగి యుండవలెను (మార్కు 9:49; కొలసీ 4:6)

6) సువాసన నిచ్చుటకు సాంబ్రాణి వేయ వలెను:- (నిర్గ 30:34; మత్తయి 2:11) ఈ సాంబ్రాణి ప్రభువైన యేసు యొక్క యాజకత్వమును చూపించు చున్నది. యేసు మరణము దేవునికి మిక్కిలి సువాసనగా నున్నది (ఎఫెసీ 5:2).

7) తేనె కలుప కూడదు :– తేనెను అగ్నిలో వేయగానే పొంగి మాడిపోయి పుల్లగా నుండును.

8) దహించిన తరువాత మిగతా భాగమును యాజకులు తినవలెను:-  (లేవీ 6:16) విశ్వాసులు అంతరంగిక (ఆత్మను) పురుషుని బలపర్చుటకు జీవపు రొట్టెను తినవలెను (యోహాను 6!35,36).

III సమాధాన బలి (లేవీ 3:1-17, 7:11-34) 

దహన బలికిని దీనికి వ్యత్యాసమున్నది. ఈ సమాధాన బలి యెహోవాకు సువాసనగల హోమరూపమైన ఆహారము, ఇది స్తోత్రరూపమైన బలిగా చేయవలెను. సమాధాన బలి, ప్రభువు మన సమాధానమని యాగమని బయలు పరచు చున్నది (ఎఫెసీ 2:14) క్రీస్తు తన మరణము ద్వారా మనుష్యుని దేవుని ఐక్య పరచియున్నాడు (రోమా 5:1; ఎఫెసీ 2:13-17; కొలసీ 1:20-22).

1) బలి అర్పింప బడుదానిలో నున్న క్రొవ్విన ముక్కలు, శ్రేష్టమైన మంచి భాగములు యెహోవావి (కీర్త 50:9-10)

2) బోర, ముందు కుడికాలు లేక జబ్బ యాజకుల కొరకైనవి.

3) శేషించిన భాగములు ఆరాధికునివి సమాధాన యాగమునకు వేరొక పేరు  స్తోత్రయాగము (హెబ్రీ 13:15; I పేతురు 2:5)

IV పాప పరిహారార్థబలి (లేవీ 4:1-35; 6:24-30; సంఖ్యా 29:7-11) 

ఈ బలి సువాసన లేని బలియై యున్నది. ఈ బలిని, ప్రాయశ్చిత్త బలిని, ఆజ్ఞాను సారముగా నర్పింపవలెను. మిగతా బలులు మానవులు స్వయంగా తమ యిష్ట ప్రకారము అర్పింప వచ్చును, ఇశ్రాయేలీయులు, యాజకులు చేయకూడదని దేవుడు చెప్పిన దేదైన చేసిన యెడల ఈ బలి నర్పింపవలెను.

ఈ బలి నర్పించు వారు నాలుగు రీతులుగా యున్నారు : 

1) యాజకులు పొరపాటు చేసిన యెడల (లేవీ 4:13-12)

2) ఇశ్రాయేలీయులు పొరపాటు చేసిన యెడల (లేవీ 4:13-21)

3) పెద్దలు పొరపాటు చేసిన యెడల (లేవీ 4:22-26)

4) సామాన్యులు పొరపాటు చేసిన యెడల (లేవీ 4:27-36)

యాజకుడు రక్తమును, పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు పర్చిన అడ్డు తెర యెదుట యేడు మారులు ప్రోక్షింపవలెను. తరువాత పరిశుద్ధ స్థలములో నున్న దూపవేదిక కొమ్ముల మీద కొంత రక్తమును చమిరెను (నిర్గ 30:1-10; యోహాను 17వ అధ్యా॥) మిగిలినది ప్రత్యక్షపు గుడారపు ఆవరణములోని దహన బలి పీఠము అడుగును పోయవలెను. పాప పరిహారార్థ బలి చేయకుండా యెవరు తప్పించుకొన కూడదు. అందరు చేయవలెన (రోమా 3:25). వ్యత్యాసము లేకుండా అందరు అర్పించ వలయును. ఈ యాగము యేసు క్రీస్తు మన పాపముల కొరకు బలిగా అర్పింప బడుటను తేటపరచు చున్నది (యోహాను 1:29; II కొరింథి 5:19; ఫిలిప్పీ 2:8; హెబ్రీ 13:11, 12; 1 పేతురు 2:4).

V అపరాధ పరిహారార్ధబలి – ప్రాయశ్చిత్త బలి (లేవీ 6,7 అధ్యాయములు) 

పాప పరిహారార్థ బలి యనగా ప్రభువే మన పాపములను మోయుట. అయితే అపరాధ పరిహారార్థ బలి అనగా క్రీస్తు మన పాపములకు ప్రాయశ్చిత్త బలియాయెనని అర్థము. పాపమనునది ప్రతి వారికి స్వభావ సిద్ధము. అపరాధమనగా స్వభావముద్వారా చేసిన క్రియయై యున్నది.

ఈ అపరాధ పరిహారార్థబలి, మనము చేసిన సమస్త పాపములకు ఆయనే తన మరణముద్వారా పరిహారము చేసియున్నాడని చూపుచున్నది. ఈ బలి నర్పించు వాడు తాను చేసిన తప్పునకు నష్టపరిహార మివ్వవలెను. ప్రభువు మరణము ద్వారా పాపుల నష్టపరిహారమును తీర్చెను (ఎఫేసీ 1:3-7) క్రీస్తు అపరాధ పరిహారార్థ బలి అర్పించి ఆయన రక్తమును వెలగా ఇచ్చి మన నష్టపరిహారమును తానే తీర్చి, ఆదాము ద్వారా పోగొట్టు కొనబడిన ఆశీర్వాదములను తిరిగి దయచేసెను.

గంగాళము:  (నిర్గ 30:17-21, 38:8, 40:7):- వెలుపలి ఆవరణములో ఇత్తడి బలిపీఠమునకును గుడారమునకును మద్యనుండును. బలి పీఠమును దాటిన తరువాత పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుటకు ముందుగా గంగాళము నొద్దకు రావలెను. ఈ గంగాళము పరిశుద్ధాత్మకు సాదృశ్యమై యున్నది (యెహెజ్కేలు 47 వ అద్యా॥; యోహాను 7:37-39).

1) ఈ గంగాళములో నీళ్ళు ఎల్లప్పుడు నిండుగా నుండవలయును (నిర్గమ 17:6) ఈ బండ కల్వరి గిరి యందున్న సిల్వలో కొట్టబడిన యేసే, ఆయన నుంచి పరిశుద్ధాత్మయను నీరు ప్రవహించు చున్నది (యోహాను 1:33; అ.కా. 2:33).

2) యాజకులు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు వెళ్ళేముందు ఈ నీళ్ళతో తమను కడుగుకొని ప్రవేశింప వలయును. ఏదైన కారణముచేత కాళ్ళు, చేతులు కడుక్కోకుండా లోపలికి ప్రవేశిస్తే శిక్షింపబడుదురు. కడుగుకొనుట పరిశుద్ధతకు గురుతు (1 థెస్స 4:3; హెబ్రీ 10:22, 12:14) (నిర్గ 30:20,21; 29:24; లేవీ 8:6) నిజమైన దేవుని సంఘస్తులందరూ యాజకులే (ప్రకటన 1:6) ప్రత్యేకముగా ఈ పనికి పిలువ బడిన వారు పరిశుద్ధ స్థలములో దేవుని ఆరాధించుటకు ముందు నీళ్ళలో తమ్మును కడుగు కొనవలయును.

3) గంగాళమునకు ఇత్తడి పీట యుండవలెను. గంగాళము కదలకుండా స్థిరముగా నుండుటకు ఒక పీఠయుండ

4) ఈ గంగాళము అద్దములతో చేయ బడినది (నిర్గమ 38:8) పూర్వ కాలమున ముఖమును చూచుకొనుటకు ఒక విధమైన మెత్తని యిత్తడి అద్దములు ఉపయోగించినారు. దేవుని వాక్యమే అద్దము (యాకోబు 1:23-24; యోహాను 6:63).

మందిరపు పలకలు (నిర్గమ 26:15-30; 36:20-34) :- ఈ గుడారమునకు మూడు వైపుల పలకలును, తూర్పువైపున ఐదు స్థంబముల మీద వ్రేలాడు చున్న ద్వారపు తెరయును ఉన్నది. దక్షిణమున 20 పలకలును,

ఉత్తరమున 20 పలకలును పడమర ఆరు పలకలు, రెండు మూలల యందు రెండేసి మొత్తం 48 పలకలు. ఈ పలకలు తుమ్మకర్రతో చేయవలెను. ఈ గుడారము (మందిరము) దేవుని సంఘమునకు సాదృశ్యము. పాత నిబంధన కొలమునందు మందిరములో దేవుడు నివాసము చేసెను. గాని క్రొత్త నిబంధన కాలములో హస్త కృత్యములైన ఆలయము లందు ఆయన నివాసము చేయడు (అ.కా. 7:48; యోహాను 4:22-44). మన దేహము దేవుని ఆలయము (ఎఫేసీ 2:20-22; 1 తిమోతి 3:15; I పేతురు 2:5; 1 కొరింథి 3:16) 12 అనెడు సంఖ్య మనుష్యుని సంపూర్ణ సంఖ్య. నాలుగు దిక్కులనున్న అనగా ప్రపంచమున నున్న సమస్త విశ్వాసులకు సాదృశ్యముగా నున్నది 12X4 = 48.

1) ఈ మందిరపు పలకలు తుమ్మ కర్రతో చేయబడియున్నవి. ఇది అరేబియా దేశములో షిద్దమను మైదానమున బాగుగా పెరుగు వృక్షమై యున్నది భూలోకములో సహారా ఎడారి వంటి వేడిమిగల ప్రదేశము మరియెక్కడను లేదు. ఈ తుమ్మ కర్ర భయంకరులైన పాపులకు సాదృశ్యము (I తిమోతి 1:15,16; 1 కొరింథి 5:17).

2) ఈ పలకలకు బంగారు రేకు పొదిగింప వలెను (నిర్గమ 26:29) ఈ బంగారు దేవుని మహిమను చూపించు చున్నది (హెబ్రీ 1:3; ఎఫేసీ 1:18, 19) పాపిలోని స్వభావములన్నియు బయటికి కనబడకుండ, బంగారముతో పొదగ వలయును (గలతీ 3:27; ఎఫేసీ 4:24).

3) ఈ పలకలు వెండి దిమ్మెల మీద నిలువ బెట్టవలెను (నిర్గమ 26:19) ఈ వెండి సాధారణమైనది కాదు. ఇది ప్రాణ పరిక్రయదనము (నిర్గమ 30:11,12) పాత నిబంధనలో ప్రాణ పరిక్రయ ధనము గొర్రె పిల్ల యైన క్రీస్తు యొక్క విలువైన పవిత్ర రక్తమే (1 పేతురు 1:18,19).

4) పలకలు తిన్నగా నిలువ వలయును (నిర్గమ 26:15) విశ్వాసులు కూడా భయము లేకుండా ధైర్యముతో స్థిరముగా కుడికిగాని ఎడమకుగాని ఒరుగ కుండ నిలువ వలెను.

5) పలకలకు కుసులుండ వలెను (నిర్గ 26:17). కుసులు లేక పోయినచో పలకలు పడిపోవును. అంతేకాక పలకలు సరిగా కలుపబడక పోవుటచే గాలి, దూళి మొదలగునవి పలకల సందుల గుండా లోనికి వచ్చును. ఎప్పుడు విశ్వాసులు (కుసులు) ఐక్యతగా లేరో అప్పుడు వారు పరిశుద్ధ జీవితం నుండి పడిపోవుదురు. దురుపదేశములను విషముగాని, దుమ్మనెడు పాపముకాని లోపల ప్రవేశించి సమస్తమును పాడు చేయును (యోహాను 17:14, 21:23; అ.కా. 2:42, 4:32; ఎఫెసీ 4:2)

6) పలకలకు అడ్డు కర్రలుండ వలెను (నిర్గమ 26:27,28) ఐదు వరుసల అడ్డు కర్రలు ఉండవలెను. మధ్య అడ్డు కర్ర ఈ కొసనుండి ఆకొస వరకు నుండ వలెను. మిగతా నాలుగు అడ్డు కర్రలు నిలువు పలకలకు పైన రెండును, క్రింద రెండును అడ్డముగా బిగించ వలెను. అప్పుడు పలకలు కదలకుండ ధృడముగా నుండును. క్రీస్తు సంఘమునకు అడ్డు కర్రలు అవసరము. అవి లేక పోయిన యెడల సంఘమను పలకలు పడిపోయి లోపలికి అశుభ్రత ప్రవేశించి సంఘము నాశనమగును.

7) ఈ పలకలు దేవుని కొలత ప్రకారముండ వలయును (నిర్గమ 26:16). ఈ పలకలు (విశ్వాసులు) మందిరములో (సంఘములో) ఎక్కువ, తక్కువ లేకుండా కొలత ప్రకారముండ వలెను. ఆ కొలత దేవుని వాక్యమే (ద్వితీ 4:2; 1 తిమోతి 6:2,3; ప్రకటన 22:19).

 

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

5 thoughts on “tabernacle |telugu |complete |history|- ప్రత్యక్షపు గుడారము చరిత్ర తెలుగులో-2023”

  1. Praise God brother. I am praising God about your ministry. God bless you abundantly. These articles are so useful to me and all. I am happy to learn.
    ఎంత నేర్చుకున్న నేర్చుకోవాలి అనేదే దేవుని వాక్యం. దేవుడు మిమ్ములను దీవించును గాక.

    Reply

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted