క్రైస్తవమతం విదేశాల నుండి వచ్చిందా?
Bible Telugu Question Answers
ప్రశ్న: క్రైస్తవమతం విదేశాల నుండి వచ్చింది కదా! మరి అలాంటప్పుడు ఇండియాలో దానిని ఎందుకు ప్రకటిస్తున్నారు? స్వదేశంలోనే చాలినంత ఆధ్యాత్మికత ఉండగా, విదేశీ మతం మనకెందుకు?
జవాబు : “మత్యుద్భవతి ఇతి మతః” అంటూ ఒక సామెత ఉంది. దాని భావం – “మతి నుంచి పుట్టింది మతం” అని ! “లోకోభిన్న మనః భిన్న మతః” అంటూ పెద్దలు మరొక మాట కూడా చెప్పారు – అంటే, “లోకులు భిన్నవిభిన్న మనస్తత్వాలు కల్గియుండుట చేత భిన్న మతాలు ఆవిర్భవించెను” అని దాని భావం! ఎవరో అంటూండగా విన్నాను – “మతం మత్తు, మనిషి మాయ, ధనం దగా, కులం కుళ్లు, దేవుడే దిక్కు” అని! క్రైస్తవ్యం ఒక మతం కానే కాదు. మతం ఎప్పుడూ మనిషిని బాగుచేయలేకపోయింది అన్నది నిరూపించబడిన నిజం! ఆ మాటకొస్తే మతం పేరిట జరిగిన మారణ హోమాలు చెప్పనలవి కానన్ని ఉన్నాయి. (Bible Telugu Question Answers)
బైబిల్లో మనం చూస్తే – క్రైస్తవ్యాన్ని గూర్చి మతం అని ఎక్కడా రాయబడి లేదు. క్రైస్తవ సంఘ విరోధియైన పౌలు అనబడిన సౌలు, ఒకప్పుడు క్రీస్తునూ, క్రీస్తు బిడ్డలనూ ద్వేషిస్తూ హింసపెట్టడమూ చంపడమూ చేస్తుండేవాడు. అతడి గూర్చి రాయబడిన లేఖన భాగంలో – “ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యోరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను” అని రాయబడినది (అపొ. 9:2).
“ఈ మార్గము” అట! క్రైస్తవ్యం – అది ఒక సజీవమైన మార్గమూ! కాని అది మతం కాదు!
యేసుప్రభువు కూడ – “నేనేమార్గమును” అన్నాడు (యోహాను 14:6). నేనే మార్గము అంటే ఎక్కడికి మార్గం? ఎవరికీ మార్గం? – ఇహలోకం నుండి పరలోకమునకు మార్గము! ఎవరికీ మార్గము అంటే – భూమి మీదనున్న సమస్త మానవాళికీ మార్గము! ఏకేశ్వరుడును, స్వయంభవుడును అయ్యున్న సృష్టికర్త మానవాళి యొక్క జన్మకర్మ పాపముల నుంచి విమోచన కల్గించి, మోక్షము అని మనం ఎంతో ప్రీతిగా పిలుచుకుంటున్న ఆ స్వర్గలోకానికీ ఏర్పరచిన, నియమించిన ఏకైకమార్గమే – క్రీస్తు!
క్రీస్తు అంటే ఆచారమూ, సాంప్రదాయమూ, మతమూ… కానే కాదు, సజీవ జీవనం!
మన భారతీయులు ఈ ప్రపంచాన్ని – “వసుదైక కుటుంబము” అని పిల్చారు, నమ్మారు, ఆచరించారు. వసుదైక కుటుంబం అంటే ఏమిటి? ఈ ప్రపంచమే నా కుటుంబం అని అర్థం. ప్రపంచమే నా కుటుంబమూ, నా యిల్లూ అని నమ్మిన దేశం మనది! ప్రపంచమే ఒక కుటుంబము అని మొదట చెప్పిన దేశం మనది కావటం మన భాగ్యం! అంత విశాల హృదయమున్న ఆత్మీయతను సంతరించుకున్న దేశమంటూ ఉన్నదీ అంటే – అది మన భారతదేశం ఒక్కటే!
మరి అలాంటప్పుడు క్రైస్తవ మతం విదేశాలలో నుంచి వచ్చింది. కాబట్టి దానిని మనం నమ్మొద్దు, దానిని ద్వేషిద్దాం, తరిమి కొడదాం అని అనడం అర్థరహితం కాదా? ప్రపంచమే తన కుటుంబం అయిన వానికి క్రైస్తవ్యం విదేశీ మతం ఎట్లైంది?
నేడు మనం ఉపయోగిస్తున్న గడియారం, మొబైల్ ఫోన్, కంప్యూటర్, హీటర్, టి.వి., వాషింగ్ మిషన్, కుక్కర్, ఫ్యాన్, ఫ్రిజ్, ఎయిర్ కండిషనర్, కారు, మిక్సీ, గ్రైండర్, సైకిలు, మోటార్ సైకిలు… ఇవన్నీ ఇండియాలో కనుక్కోలేదు. మనం ఒక ఆస్పత్రికి వెళ్తే – అక్కడ డాక్టర్ ఉపయోగించే పరికరాలన్నీ విదేశాలలో కనుగొనబడినవే. విమానం, రైలు, హెలికాప్టర్, ఇంకా మరెన్నో ఇండియాలో మొదట కనుగొనబడలేదు. అయితే ఇవన్నీ విదేశం వాడు కనుగొన్నాడు – వాటిని మనం వాడకూడదు, వాటిని ద్వేషిద్దాం, నాశనం చేద్దాం అని అనడం లేదే?!
ఈ వస్తువులూ, ఈ పరికరాలూ వాడేటప్పుడూ మనది -వసుదైక కుటుంబం అంటున్నాం! మరి మనం క్రీస్తు విషయంలో మనది వసుదైక కుటుంబమని ఎందుకు అంగీకరించలేక పోతున్నాం? ఇది బ్రిటీష్ వాడి మతం, ఇది అమెరికా వాని మతం అంటూ క్రైస్తవ్యమును ద్వేషించడం తగదు. 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశంలో వ్యాపారం చెయ్యడానికై వచ్చిన తెల్లవారు కాలక్రమేణ మన దేశమును ఆక్రమించి 200 సంవత్సరములు పరిపాలించారు. ఈ 200 సంవత్సరముల కాలంలో అధికార పూర్వకంగా, రాజ్యాంగ బద్ధంగా క్రైస్తవ్యాన్ని ప్రవేశపెట్టలేదు; వారు దానిని అమలు చేయనూలేదు.(Bible Telugu Question Answers)
మిషనరీలు అని చెప్పబడిన కొందరు భక్తులు మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. మానవాళి నాశనమయ్యి నరకానికి పోకుండా, మహిమలోకానికి చేర్చే ఉద్దేశ్యంతో – దేవుని సువార్త సందేశంతో ఈ దేశానికి వచ్చి అష్టకష్టాలు పడి దేవుని రాజ్యాన్ని కట్టారు. అటువంటి సందర్భాలలో ఈ క్రైస్తవత్వము మా యొక్క పరిపాలనకు అడ్డుగా ఉందన్న నెపముతో బ్రిటీష్వారే విలియం కేరీ వంటి అనేకమంది మిషనరీల యొక్క సువార్త సేవకు సంకెళ్ళు వేసారు. ఒక్కమాటలో చెప్పాలంటే – ఆనాడు బ్రిటీష్ వారు మన దేశమును పరిపాలించారంటే – మత వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో వారు పరిపాలించలేదు. ధన సంపదలతో తులతూగుచున్న భారతదేశమును కొల్లగొట్టడానికే వారు ఉద్దేశించారు. మత వ్యాప్తి కాదు – ధన దాహం, రాజ్య కాంక్షతో దహించుకుపోయారు.
క్రైస్తవ మతం విదేశీయులది… యేసుక్రీస్తు అమెరికా దేవుడు… ఇంగ్లీషువారు తీసికొచ్చారని చెప్పడం సమంజసం కాదు. యేసు అమెరికా దేవుడు అని చెప్పడానికి ఆయన అమెరికాలో జన్మించలేదు. మన స్వంత ఖండమైన ఆసియా ఖండంలో… మనం పొరుగు దేశమైన ఇశ్రాయేలు దేశంలో యూదా అనే రాజ వంశంలో జన్మించాడు ఇకపోతే…
భారతదేశానికి క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే వచ్చింది. యేసుప్రభువు శిశ్యులలో ఒకడైన తోమా, క్రీస్తుచే ఆదేశించబడి, మన దేశంలో గుజరాతు ప్రాంతము, కేరళ, తమిళనాడు మొదలగు ప్రాంతాలలో సువార్తను ప్రకటించాడు. క్రీ.శ. 60-70 మధ్య కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రజలను సువార్త వెలుగులోకి తీసుకొచ్చినట్టుగా సంఘ చరిత్ర చెబుతోంది.(Bible Telugu Question Answers)
బ్రిటీష్ వారికి సువార్త ఎప్పుడు అందింది? మనకు మొదటి శతాబ్దంలో సువార్త అందితే – బ్రిటీషు వారికి 3వ శతాబ్దంలో సువార్త అందింది. మనకు ముందు సువార్త అందినదా? బ్రిటీషు వారికి అందినదా? మనకే ముందు సువార్త అందించబడింది.
భారతదేశంలో క్రైస్తవ్యం పురాతనమైనది. అది మొదటి శతాబ్దంలోనే మనకు చేరింది. అంతేగాని – ఇంగ్లీషువాడు దాన్ని పట్టుకొచ్చాడు అని చెప్పడం భావ్యం కాదు! చరిత్ర తెలియని వారు చెప్పే మాటలు అవి!
భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలకు ఎవరెన్ని పరిష్కారాలు సూచించినప్పటికీ, మనిషి మోక్షం చేరడానికి భగవంతుడు సూచించిన ఏకైక మార్గం మాత్రం – క్రీస్తే! కాబట్టి, స్వదేశంలోనే చాలినంత ఆధ్యాత్మికత ఉండగా, విదేశీ “…” మనకెందుకు? అని చెప్పడం తప్పు!
మనిషికి మధ్య ప్రాంతం – బొడ్డు! ఊరికి మధ్య భాగం బొడ్రాయి! భూగోళమంతటికీ బొడ్డు వంటి భాగం – పాలస్తీనా! అక్కడే రక్షకుడు పుట్టాడు. అంటే భూగోళమంతటికీ చాలిన వాడనూ అని… నలుదిక్కుల ప్రజలకు కేక పెడుతున్నాడు… (Bible Telugu Question Answers)
నిన్ను రక్షించువాడను నేనే అంటూ!
ఒకవేళ అమెరికాలో ఎయిడ్స్ (AIDS) కి మందు కనుగొంటే, ఆ మందుని ఇండియాలో పబ్లిసిటీ చేసి ఎయిడ్స్ బాధితుల ప్రాణాలు కాపాడితే తప్పు అవుతుందా??
ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. క్లిక్ హియర్
Good massage sir god bless you all