సేవలో అభివృద్ధి లేదా?
Sevakula Prasangaalu Telugu
పౌలు మరియు సీల తమ సువార్త దండయాత్రలో భాగముగా అంఫిపొలి, అపొలోనియ పట్టణముల మీదుగా వెళ్లి థెస్సలోనికకు వచ్చారు. యూదుల యొక్క సమాజ మందిరములో మూడు వారములు యేసే క్రీస్తయి యున్నాడు అంటూ లేఖనములలోని దృష్టాంతములను ఎత్తి వారికి ప్రకటించారు.
అనేకులు ప్రభువు యొక్క విశ్వాసములోకి రావడం జరిగింది. పౌలు సీలలను ఓర్చుకోలేని కొంతమంది యూదులు పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేస్తూ యాసోను ఇంటిమీద పడి వారిని జనుల సభ యెదుటికి తీసికొని వచ్చుటకు ప్రయత్నం చేసారు.
అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులును ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు అని థెస్సలోనీక యూదులు సాక్ష్యమిచ్చారు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయములో మనమీ సంగతులను చూస్తాం.
ఒక్క పౌలు, సీలయే కాదు – ఆది అపొస్తలులు అందరును భూలోకాన్ని తలక్రిందులు చేసినవారే. యేసుతో తిరిగినంత కాలం ఆయన చెప్పిన విషయం పెద్దగా బుర్రకెక్కినట్లు కనబడలేదు. గాయాలలో వేలుపెట్టి చూస్తేనే గాని ఆయన పునరుత్థాను డయ్యాడన్న సంగతి వారికి నమ్మబుద్ది కాలేదు. తమ బోధకుడిలాగ దయ్యాలను వెళ్లగొట్టబోయి వాళ్ళవల్ల కాక వెనుతిరిగి వచ్చినవారు వాళ్ళు. నీలాగే నేనును నీళ్ళపై నడుస్తానని నడిచి బొక్క బోర్లపడ్డవాళ్లు ఆ శిష్యులూ. మనుషుల సంగతులనే మనస్కరించి మహిలోని మహిమా విషయాలు మనస్సు పొరల్లోకి కూడ పొరపాటున రానియ్యని విశ్వాస చిరుప్రాయ శిష్యులు వాళ్ళు. మనలో ఎవడు గొప్ప? అంటూ వాదించుకుంటూ లోక వైఖరిని పోలి యుండాలన్న కాంక్షపరులూ ఆ ఆది శిష్యులు! అలాంటి వ్యక్తులు ఇప్పుడు లోకాన్ని తలక్రిందులు చేస్తున్నారు. క్రీస్తుయొక్క పునరుత్థానాన్ని అంతులేని ఆత్మ స్థైర్యముతో అందరు అదిరిపోయేలా ప్రకటిస్తున్నారు ఇప్పుడు. అధికారులూ గవర్నర్లూ దశాధిపతులూ శతాధిపతులూ సహస్రాధిపతులూ ముక్కున వేలేసుకుంటున్నారు.
వేలకు వేలు ప్రజలు ప్రభువు రాజ్యములో చేర్చబడుతున్నారు.
ఈ అనూహ్యమైన మార్పు వారికి ఎలా సంభవించింది? ఇంతగొప్ప శక్తి. ధైర్యము వారిలోకి ఎలా వచ్చాయి? కారణాలు మనం ఊహించలేనంత కష్టమైనవి కావు. అపొస్తలుల కార్యముల గ్రంథం యొక్క ప్రారంభ అధ్యాయాలను తొంగి చూసినట్లయితే విషయాలు విస్తారముగా వచ్చి చేరుతాయి. మొదటిగా వాళ్లు…
ఆత్మశక్తిని పొందారు!
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేంత వరకు యెరూషలేములోనే నిలిచి యుండుమని ప్రభువు చెప్పిన మాటను వారు శిరసావహించారు. పెంతెకోస్తు దినాన అగ్ని నాలుకలతో, అన్యభాషలతో దిగివచ్చిన ఆత్మ అభిషేకమును వారు అనుభవించారు. ఇక ఆరోజు నుంచి ఆత్మ యొక్క అడుగు జాడలలోనే వారు ప్రతీ అడుగు వేసి నడుచుకున్నారు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు అన్న వాగ్దానం వారిపట్ల అక్షరాల నెరవేరింది. ఆ శక్తితోనే వారు నడుం కట్టుకున్నారు. ఆ అభిషేకం వారి మాటల్లోను వారి చేతల్లోను ప్రత్యక్షపరచబడింది. ఓటమి కెరటాలను దాటుకుంటూ గెలుపు తీరాలకు వారు చేరుకున్నారు. Sevakula Prasangaalu Telugu
ఒకప్పుడు వెక్కిరించిన దయ్యాలు ఇప్పుడు గడగడ వణకడం ప్రారంభించాయి. ఇప్పుడు నీడ పడితే చాలు… రోగులు మంచాలు ఎత్తుకొని నడుస్తున్నారు. ఒకప్పుడు లోకం వాళ్లని తలక్రిందులు చేసింది – ఇప్పుడు వారు లోకాన్ని తలక్రిందులు చేస్తున్నారు. అనుమానం ఏమీ లేదు – అది పరిశుద్దాత్మ యొక్క అభిషేకమే. రెండవదిగా వాళ్లు…
ప్రార్థనతో ముందుకు కదలసాగారు!
ప్రార్థనంటే అదేదో మొక్కుబడిగా చేసుకొనే ప్రార్థన కాదు. వారు ప్రార్ధిస్తుంటే వారు కూడియున్న స్థలం కదిలిపోతుంది. వారి ప్రార్ధనలు చెరసాలలను ఆరాధన స్థలాలుగా మార్చివేసాయి. వాటి పునాదులు అదరసాగాయి. బంధకాలు ఊడసాగాయి. తలుపులు తెరుచుకో సాగాయి. భూకంపాలు రాసాగాయి. ఖైదీలు వినసాగారు. వాళ్లకు ఎటుచూసినా ఏ ఆధారమూ లేదు. ఏ దిక్కు నుంచి ఏ విధమైన సహాయము కూడ లేదు. అయితే వారు ప్రార్థనను తమ ఆయుధముగా మార్చుకున్నారు. ఆటంకాలు అన్నిటినీ ప్రార్ధనతోనే ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళారు.
వాళ్ల ప్రార్థనతో భూమి కంపించడమే కాదు. యెరూషలేములో ప్రకంపనలు మొదలయ్యాయి. హండ్రెడ్ పర్సెంట్ వాళ్ల నిరీక్షణ అంతయు ప్రేయరే! ఆ ప్రేయర్ వాళ్లకు దేవుణ్ణి నియర్ చేసింది. అంతేకాదు వారి సమస్యలన్నిటిని క్లియర్ చేసింది. అదే ప్రేయర్తో వారు ఫియర్ లేకుండా అధికారుల ముందు వీరులవలె నడిచారు. Sevakula Prasangaalu Telugu
వాళ్ల పరిచర్య అంత ప్రార్థనలోనే పురుడు పోసుకుంది. ప్రార్థన యొక్క ఊయలలో ఊపందుకుంది- వాళ్ల ఆత్మల సంపాదన! పళ్లు బయటపెట్టి లోకం వాళ్లను భయపెట్టినప్పుడు ప్రార్థనా గదిలోనే వాళ్లు ధైర్యాన్ని పోగుచేసుకున్నారు. వాళ్లు ప్రారంభించిన విడుదల ఉద్యమానికి ప్రార్థనే ఇంధనం అయ్యింది. ప్రార్థనే వాళ్ల హృదయస్పందనకు ఊపిరి అయ్యింది. మతసాంప్రదాయ పునాదుల్ని ప్రార్థనతో పెకలించి పడేశారు. శత్రు సామ్రాజ్యాన్ని ప్రార్థనతోనే పడద్రోసారు. గెత్సెమనే తోటలో రక్తబిందువుల మధ్య తమ నాయకుడు సాతానుని ఓడించిన తీరూ ఆ వైనమూ వీణలా వారి గుండెల్లో మ్రోగుతూ ఉండడం ఇంక వారు మరచిపోలేదు. అంధకార శక్తుల యుద్ధమైనా – ఇంకే యుద్ధమైనా ప్రార్ధనతోనే గెలవాలని వాళ్లకి అర్థమైపోయింది. ఆశ్చర్యం లేదు – సైతాను గుండు పగిలింది; లోకం తోక ముడిచింది. ప్రార్ధన, పవిత్రత, విశ్వాసం అనే మూడంచెల ప్రణాళికతో ముప్పేట దాడి చేసారు. అపజయం అంతులేకుండా పారిపోయింది విజయం సింహనాధం చేసింది వాళ్ల ప్రార్ధనతో. లోకమును తలక్రిందులు చేయడానికి వారు పన్నిన మూడవ వ్యూహం… Sevakula Prasangaalu Telugu
వాళ్లు సాక్షులుగా నిలిచారు!
ప్రభువు వాళ్లను పరిశుద్ధాత్మ శక్తితో నింపింది అందుకే. మీరు సాక్షులై ఉండాలి – అని వారితో ప్రభువు చెప్పాడు. హతసాక్షులు అయ్యేంతవరకు వారు అదే పనిలో కొనసాగారు. సాక్షులంటే ఎవరు? న్యాయస్థానంలో నిలబడి చూసింది చూసినట్టు చెప్పేవారు సాక్షులు. ప్రజా కోర్టులో నిలబడి ఇప్పుడు వాళ్లు చేస్తున్నది అదే. మీరు శిలువ వేసిన యేసును దేవుడు సజీవునిగా లేపాడు. మేము ఆయనను చూసాము. అదే మా ధైర్యము అంటూ నిలబడి చెబుతూ ఉంటే వారి ధైర్యాన్ని చూసి అధికారులంత హడలిపోయారు. Sevakula Prasangaalu Telugu
వాళ్లలా చెబుతుంటే చూస్తూ ఊరకుండలేకపోయారు. వారు ఊరుకున్నా – ఊరుకోక పోయినా మేము చూసింది మాత్రము చెప్పి తీరుతామని వాళ్లు పట్టుబట్టారు. విస్తుబోయి చూసేవారికి అర్థమైన అగ్నిసత్యం ఏమిటంటే – వీళ్లు యేసుతో ఉన్నవారు అని! కొంచెం ఆలస్యంగానైన ఆ సత్యాన్ని వంటబట్టించుకున్నారు అధికారులూ. Sevakula Prasangaalu Telugu
దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? అని ఎదురు ప్రశ్న వేసారు. అందరూ క్రీస్తు చనిపోయాడు అని తుది నిర్ణయానికొస్తుంటే వాళ్లుచూస్తూ ఉండలేకపోయారు. ఎందుకనీ? వాళ్లు పునరుత్థానుడైన ప్రభువును చూసారు గనుక! ఆయన మాటలు విన్నారు గనుక! ఆయనను తాకి చూసారు గనుక! నిదానించి చూశారు గనుక! ఇంక వాళ్ళనెవరు ఆపగలరు? క్రీస్తు పునరుత్థానం వాస్తవం! గ్రామాలు పట్టణాలు నగరాలు రాజధానులు అన్నిటిని క్రీస్తు పునరుత్థాన వార్తతో చుట్టుముట్టారు. ఒకప్పుడు బతికి మృతుడై మరల లేవలేని – లేవని వేలాది వేల్పుల కంటే, మరణపు కోరల్ని పీకి మరణపు గుండెలను చీల్చివేసిన మృత్యుంజయ క్రీస్తునాధుడే మాకు సరిపోయిన వాడని ఆనాటి లోకం జలప్రవాహపు ధారలా తరలి దేవుని చెంతకు వస్తుంటే – వాళ్ల సాక్ష్యం ఎంత బలంగా పనిచేసిందో మీరు ఆలోచించండి! క్రీస్తు పునరుత్థానం వాస్తవం! ప్రియ నేస్తమా, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. లోకాన్ని కదిలించే ఈ సందేశముతో – సేవకుడా ముందుకి వెళ్ళుము. క్రీస్తు సమాధి రాయి జయించి మనకి పునాది రాయి అయ్యాడు. నాటి శిష్యులు బలముగా ముందుకి సాగడంలో వారు మరొక వ్యూహము కల్గియున్నారు. అదేమిటంటే వారు…
కలిసి మెలసి ఉన్నారు!
దర్శనాన్నే కాదు ఆస్తిని కూడా వాళ్ళు కలసి పంచుకున్నారు. కష్టమొచ్చినా సుఖమొచ్చినా కలిసే అనుభవించారు. మనుషులు వేరైనా వాళ్ల మనసులు మాత్రం ఒకటే. వాళ్ల శరీరాలు వేరైనా వాళ్ల హృదయ స్పందన ఒకటే. వాళ్లందరి గమ్యం ఒకటే. ఆ గమ్యం వైపు వారు వెళ్లే మార్గమూ ఒకటే. వాళ్లందరిదీ ఒకటే మాట. ఎందుకంటే సాక్ష్యం చెప్పేవాళ్లంతా ఒకేమాట మీద నిలబడాలి. లేకపోతే సాక్ష్యం బలహీనమైపోతుంది. ఒకరి శ్రమలో ఒకరు పాలుపంచుకున్నారు. ఐక్యతను చెడగొట్టే చీడపురుగులను వాళ్లు సహించలేక పోయారు. పచ్చని సహవాసాన్ని పాడుచేసే సైతాను ఏజంట్లను పాతిపెట్టేశారు. ఒకప్పుడున్న అభిప్రాయభేదాలు ఇప్పుడు వారికి లేవు.
ఏ కుర్చీలో ఎవరు కూర్చోవాలి అన్న మీమాంసను ఎప్పుడో వారు జయించేసారు. పదవులు, హోదాలకు ఇప్పుడు వారు అతీతులు. ఆత్మ కలిగించు ఐక్యతను వాళ్లు తుదిమట్టుకు కాపాడుకున్నారు. ఆత్మ వారిని క్రీస్తు శరీరములోని సాటి అవయవాలుగా చేసిన తర్వాత – అందరు కలిసి ఒక్క శరీరముగా ముందుకెళ్ళారు.
ఒకే భారము, ఒకే దర్శనము కలిగిన సేవకులు అందరును ఒకచోట కేంద్రీకృతమై మోకాళ్లపై నించుంటే- పాతాళ లోకపు ద్వారములు వారి యెదుట నిలువ జాలవు అని ప్రభువు చెప్పిన మాట నిక్కచ్చిగా నెరవేరి తీరుతుంది కదా! సంఘాన్ని చూసి వెక్కిరించడానికి ఇక సైతానుకు చోటు ఉంటుందా? నిలబడ్డానికే వానికి నిలువు నీడ లేనప్పుడు – ఇంక వాడెలా సంఘాన్ని భయపెట్టగలడు? వాడెలా ఎదిరించగలడు? Sevakula Prasangaalu Telugu
నాలుగు ఎద్దులు – సింహం కథ మీకు తెలుసు కదా! ఎద్దులన్నీ బీటి పచ్చికలో కలిసి మెలసి ఉన్నప్పుడు సింహం ఆటలు సాగలేదు. ఆ నాలుగెద్దులకు గడ్డి దగ్గర గొడవొచ్చినప్పుడు, నాలుగు నాలుగు దిక్కులకు చెదిరిపోయాయి. సింహానికి అది అవకాశముగా మారింది. ఆ నాలుగింటిని నాలుగు రోజులలో స్వాహా చేసేసింది. మన బలహీనతే వానికి బలం. మన అనైక్యతే వానికి ఆయుధం. లోకాన్ని తలక్రిందులు చేసినవారు ఆత్మ బంధంలో బంధీలయ్యారు. ఆది శిష్యులు కలిగిన చివరి వ్యూహము ఏమిటంటే… Sevakula Prasangaalu Telugu
వాళ్ళు కష్టాలను శ్రమలను ఓర్చుకున్నారు!
వాళ్ళు నడిచింది పూలబాట కాదు – శిలువబాట. క్రీస్తు మోసినట్లుగా వాళ్ళు శిలువను మోసారు. ముళ్ళు రాళ్లూ వాళ్ల కాళ్ళకు గుచ్చుకున్నాయి. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను అని ప్రభువు ముందే హెచ్చరించాడు. నన్ను చంపుతున్న లోకం మిమ్ములను కూడ వదిలిపెట్టదని కుండ బద్దలు కొట్టాడు. మిమ్మును చంపేవారు మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకొంటారు అని కూడ చెప్పాడు. అయినను వారు సంతోషంగా ముందుకి సాగివెళ్ళారు. ఆయనలాగే అన్నీ సహించారు. పిడిగుద్దులు తిన్నారు. ప్రార్థనలో పురిటి నొప్పులు పడుతూ సంఘాలు కట్టారు.
రాబోయే ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువ మోసిన యేసే వారికి ఆదర్శం. సిలువను సహించి దేవుని సింహాసనం మీద ఆసీనుడైన యేసును చేరుకోవడమే వారి లక్ష్యం. శిలువే శరణం అన్నారు. శిలువ లేనిదే విలువ లేదు – కిరీటం కూడ లేదు అని నమ్మారు. Sevakula Prasangaalu Telugu
ఆ మధ్య ఒక దైవజనుడు ప్రసంగిస్తూ – “క్రైస్తవుడైనవాడు క్రైస్తవుడుగా నుంటే ఆ సరిపోదు. వాడు శిష్యుడు అవ్వాలి. శిష్యుడైన వాడు శిష్యుడుగా నుంటే సరిపోదు శిలువనెత్తుకోవాలి. ఇప్పుడెలాగో సిలువలు లేవు గనుక సమాధిపెట్టె చేయించుకొని మోసుకుంటూ పోవాలి” అన్నాడు. అంటే సేవకుడనబడినవాడు చావుకైన వెనుదిరగకుండ ముందుకు దూసుకునిపోవాలి అని అర్థమన్నమాట.
- శ్రమలే సిరులు అని నమ్మిన ఆది శిష్యులు లోకాన్ని తలక్రిందులు చేయడంలో ఆశ్చర్యం ఏముంది?
- శిలువ సైనికుడా, నీరుగార్చే పరిచర్య నీది కాదు!
- కన్నీటితో కట్టబడిన నిక్కమైన నిండుదనపు పరిచర్య నీది!
- నీల కాంతమయమైన నీతి స్వరూపుని నిశ్చల వాక్కు నీలో ఉంది! నీరాజనాలు పలికే నిజ ఘడియ నీ ముందు వేచి ఉంది!
All Pdf Download…Click Here