Deuteronomy-ద్వితీయోపదేశకాండము వివరణ-Deuteronomy Explanation Telugu 4

Written by biblesamacharam.com

Updated on:

 ద్వితీయోపదేశకాండము వివరణ.

Deuteronomy Explanation Telugu

ఈ గ్రంథ ఉద్దేశం ఏమిటి? దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన చేసిన వాటిని మరల జ్ఞాపకం చేయటం … వారిని ప్రోత్సహించటం … పునఃప్రతిష్ట చేయటం! 

ద్వితీయోపదేశ కాండము మహా నాయకుని తుది పలుకులు! మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక ఏ విషయంలో మనుషులు మనల్ని గుర్తు పెట్టుకుంటారు? మన గురించి ఏం చెప్పుకుంటారు? 

ఈ గ్రంథంలో మహా నాయకుడు మోషే తన జాతినుద్దేశించి చేసిన ఉపదేశాలూ, అంతిమ వచనాలూ వున్నాయి. తాను వారిని విడిచిపోయే సమయం ఆసన్నమైనదని ఎరిగిన దైవజనుడు… ఆ ప్రజలు అంతకుముందు దేవునితో చేసుకొన్న నిబంధనను వారికి గుర్తుచేస్తూ దాన్నుంచి కుడి ఎడమలకు తొలగరాదని గట్టిగా హెచ్చరించాడు. ఈ ఉపదేశాలు విన్న వారిలో చాలామంది నిబంధన జరిగిన సమయంలో ఇంకా పుట్టలేదు. Deuteronomy Explanation Telugu

నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో దేవుడు కనుపరచిన విశ్వాస్యతా… ఆ జాతికి ఉన్న మహోజ్వల వారసత్వం… వారిది కానున్న కనాను దేశ సౌభాగ్యం ఈ ఉపదేశాలలో సాక్షాత్కరిస్తున్నాయి. 

దీన్నుంచి మనం నేర్చుకొనేది ఏమిటి? భావి తరాల వారికి, మన సంతానానికి, నేటి యువలోకానికి దేవుడు చేసిన కార్యాలను వివరించటం అనేది మనమీదున్న గురుతరమైన బాధ్యత! ఇది, ఈ గ్రంథంలో కనిపిస్తున్న సత్యం! 

ద్వితీయోపదేశ కాండం యొక్క సారాంశం ఏమిటంటే… 

వాగ్దాన దేశం కనుచూపు మేరలో కనబడుతూండగా అందులో ప్రవేశించే అర్హత పోగొట్టుకొని మోషే నాయకులనూ, ప్రజల ప్రధానులనూ పిలిచి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసి, వారిని పురికొల్పాడు. Deuteronomy Explanation Telugu

మొదటిగా – మోషే వారి గతాన్ని జ్ఞాపకం చేసికొమ్మని వారిని అభ్యర్ధించాడు. లేకపోతే మరచిపోయే ప్రమాదం ఉంది (ద్వితీ 1:1-4:43 వరకు) · 

రెండవదిగా – దేవుడు ఆజ్ఞలు చెవినిబెట్టి, వాటిని పాటించుమని వారిని బ్రతిమాలాడు. తద్వారా వారు ఎంతో క్షేమాభివృద్ధిని అనుభవిస్తారని నొక్కి వక్కాణించాడు (4:44 – 26: 19 వరకు) 

మూడవదిగా – మీ ఎదుట జీవమూ, మేలూ, మరణమూ, కీడూ వుంది. మీరేది కోరుకుంటారో కోరుకోండి అంటూ వారికి సవాలు విసిరాడు (27:1- 30:20). 

ఆ విధంగా మోషే మొదట తనను తాను దేవుని చేతులకు అప్పగించుకుని, ప్రజలను కూడ అప్పగించాడు. నిజంగా మోషే మహా నాయకుడు! మహా సాత్వికుడు! దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన దైవజనుడు! 

 గ్రీకు భాషలో ఉపయోగించిన “డ్యూటెర్ నోమాను” అనే పదమును బట్టి ఈ గ్రంథానికి ద్వితీయోపదేశకాండము అనే పేరొచ్చింది. డ్యూటెర్ నోమాను అంటే “రెండవ ధర్మశాస్త్రము” అని అర్థం. 

హెబ్రీ భాషలో ఈ గ్రంథము “హాట్టేబరీమ్” అను పదముతో ప్రారంభం అవుతుంది. హాట్టేబరీమ్ అంటే “వచనములూ” లేదా “మాటలూ” అని అర్థం. ఈ హెబ్రీ పదమే ఈ గ్రంథం యొక్క పేరుగా మారింది. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్ర వచనములేనని ఈ పదం సూచిస్తోంది. 

సీనాయి పర్వతం మీద ఇయ్యబడిన ధర్మశాస్త్రమునూ మరల పలకటాన్ని బట్టి ఈ గ్రంథమునకు ద్వితీయోపదేశకాండము అని పేరు కలగటం ఔచిత్యమే! అరణ్యంలో అవిధేయతను బట్టి చనిపోతారు అని చెప్పిన వారు చనిపోగా, వారికి బదులుగా పుట్టిన వారి పిల్లలకు మోషే తిరిగి ఉపదేశం ఇచ్చాడు. మొదటి ఉపదేశం పొందినవారు అవిశ్వాసులై అరణ్యంలో రాలిపోయారు (సంఖ్యాకాండము 26:63-65). 

దేవుణ్ణి నమ్మక రాలిపోయిన వారి సంతతికి మోషే చెప్పిన ఉపదేశం ఇది.! రెండవ సారి చెప్పబడింది కాబట్టి “ద్వితీయోపదేశకాండం” అయ్యింది. “ద్వితీయ” అనగా సంస్కృతంలో “రెండవది” అని అర్థం. నిలిచినవారు స్థిరంగా నిలబడాలనే ఉద్ధేశముతో మోషే రెండవసారి ఇచ్చిన ఉపదేశమే ద్వితీయోపదేశ కాండముగా బైబిల్లో స్థానం సంపాదించుకొన్నది. Deuteronomy Explanation Telugu

ఒక ముఖ్య విషయం ఏమిటంటే, 34 అధ్యాయములు కలిగిన ఈ గ్రంథము యొక్క కాలపరిమాణము ఇంచుమించు, కేవలం రెండునెలలు మాత్రమే! గమనించండి. 

ద్వితీ 1:4లో -“నలువదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించిన దంతయు వారితో చెప్పెను” అని వుంది. “నలువదియవ సంవత్సరము పదకొండవ నెల మొదటి తేది” అట! 

అలాగే, యెహోషువ గ్రంథం 4:19 ని చూస్తే – “మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి ఎక్కివచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగిరి” అని రాయబడింది. “మొదటి నెల, పదవ దినం” ఈ మాటలూ గమనించండి. 

ఇది, ఎన్నవ సంవత్సరం మొదటి నెలా? అనుమానం లేదు – 41వ సంవత్సరం మొదటి నెల, పదోరోజూ! మోషే బోధించటం ప్రారంభించింది మొదలూ, ప్రజలు యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగిన కాలం నాటికి రెండు నెలల పది రోజులు అన్నమాట! 

ఈ రెండు నెలల పదిరోజుల కాలమె ద్వితీయోపదేశకాండం యొక్క కాలపరిమాణం! 

రెండు నెలల్లో మోషే ప్రజలను సిద్ధపరుస్తూ, తాను సిద్ధపడుతూ గడిపాడు. ఈ రెణెల్ల కాలంలో ప్రజలు ఉజ్జీవింపబడ్డారు. కనానీయుల భూమిని స్వాధీనం చేసుకొనేందుకై యుద్ధ సన్నద్ధులయ్యారు. Deuteronomy 

ఈ గ్రంథంలో ఉపదేశం ఏమిటంటే… 

  • – యెహోవాయే ఏకైక, సత్య దేవుడు-ఆయనకు సాటి ఎవరు లేరు, ఏది లేదు  (3:24) 
  • – ఇశ్రాయేలీయులు దేవుడెన్నుకొన్న జనాంగం-అందుకు వారి యోగ్యత కారణం కాదు – (10:15) 
  • – లేవీయులు దేవుని యాజకులు – ఈనాడు క్రీస్తునందు మనం రాజులైన యాజక సమూహం! – (10:8) 
  • –  దేవునికి లోబడటం ఆశీర్వాదానికి నాంది – విధేయులు “అధములు” కారనే సత్యం ఇందులో వుంది ! – (4:1) 
  • – బాహ్య భక్తి ముఖ్యం కాదు – అసలు, భక్తి అన్నది హృదయంనుంచే రావాలి. అది ప్రేమలో పుట్టిన భక్తి! (6:5) 
  • –  యే మనుష్యుడూ తిరస్కరింపదగినవాడు కాడు – నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అనే సూత్రం ఇందులో వుంది! – (10:9, 20) 
  • –  ధర్మశాస్త్రం గైకొన్నవానికి దీవెనలు – లేకుంటే, శాపాలూ అంటుందీ గ్రంథ ఉపదేశం – (28:1-14, 15-68). 

ప్రియులారా! మనం కన్నవాటినీ విన్నవాటినీ ఎప్పుడు మరచిపోకూడదు. వాటిని ఇతరులకు చెప్పటం కోసం కొన్నిమారులు ప్రభువు మనకు అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు. మోషే రెణ్ణాల్లో ఈ లోకాన్ని వదలిపెట్టి పరమకానానుకు చేరుకోబోతున్నాడు. ఆ తక్కువ టైంలోనే నూతన తరానికి … జరిగినవి, జరుగుతూన్నవి, జరుగబోవునవి చెప్పాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటోంది ప్రసంగి గ్రంథం! ఈ మాట ప్రకారం మన నాయకుడైన మోషే జీవితానికి చక్కని ముగింపు ఉంది! మరి, మన జీవితానికి ఇలాంటి ముగింపు వుంటుందా? Deuteronomy Explanation Telugu

ఆయన ఘనమైన కార్యములు విన్న ప్రజలూ ప్రభువునందు బలం పొందుకున్నారు. ఎలాగు నడుచుకోవాలో తెలుసుకున్నారు. ఈ రోజు నువ్వూ నేనూ మనందరమూ ప్రభువుకు సాక్షులమే! యేసు కొరకే పుట్టిన భూజనులం! కాబట్టి… 

సిద్ధపడదాం – అనేకులను సిద్ధపర్చుదాం! 

స్థిరంగా ఉందాం – సడలిన మోకాళ్లను బలపర్చుదాం!! 

ఇంతవరకు కాచింది ఆయన కృపే గాని – మన యోగ్యతలు కాదని జ్ఞాపకం చేసుకుందాం!!! 


ప్రత్యక్ష గుడారం నేర్చుకోవడానికి క్లిక్ చేయండి…Click Here

Leave a comment