జేమ్స్ హడ్సన్ టేలర్
Hudson Taylor Life and Ministry Telugu
జేమ్స్ హడ్సన్ టేలర్ 1832 మే 21వ తేదీన ఇంగ్లాండ్లోని “యారూశైగి” అనే స్థలంలో జన్మించెను. “ప్రథమ ఫలము నాది” అన్న ప్రభువు మాటలకు విధేయతగా హడ్సన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే ఇతనిని దేవుని సేవకు సమర్పించిరి. అయితే హడ్సన్ చిన్నప్పట్నుంచి చాలా బలహీనుడిగా ఉండేవాడు. అందువల్ల ఇతడు పాఠశాలకు కూడా వెళ్ళక ఇంటివద్ద చదువుకొనుచుండెను. అయినను నాలుగు సంవత్సరముల వయస్సులోనే తండ్రి వద్ద హెబ్రీ అక్షరములను నేర్చు కొనెను. ఈయన తల్లిదండ్రులు చిన్నప్పట్నుంచి ఈయనను భక్తిలో పెంచుచుండిరి. అందువల్ల హడ్సన్ చిన్నప్పుడే “నేను పెద్దవాడనైన తర్వాత చైనా దేశంకు మిషనెరీగా వెళ్తాను” అంటుండేవాడు.
చైనా దేశంలోని ప్రజలు మూర్ఖపు ఆచారాలతో విసిగిపోయి యున్నారు; యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్త వారికి ఎంతో అవసరము అను విషయాలను విశదీకరించి, పీటర్ పారే వ్రాసిన పుస్తకాన్ని హడ్సన్ చదివిన తర్వాత మరింత ఆశతో చైనా దేశానికి వెళ్లగోరెను.
తన 14 సంవత్సరముల వయస్సులో పాఠశాలకు వెళ్లుట ప్రారంభించెను. పాఠశాల వాతావరణం అతని భక్తి జీవితాన్ని దిగజార్చెను. చిన్నప్పుడే దేవునికి సమర్పించబడిన ఈ కుమారుడు బాల్యములోనే రక్షించబడాలనే భారంతో ఈయన తల్లి, చెల్లి ప్రార్థించేవారు. ఒకరోజు వారు మోకాళ్ళూని, హడ్సన్ రక్షణ కొరకు భారంతో ప్రార్థించుచుండగా, ఆ ప్రార్థనకు జవాబుగా ఇంచుమించు 80 మైళ్ళ దూరంలో ఉన్న హడ్సన్ “సమాప్తమైనది” అనే కరపత్రికను చదువుచుండెను. దేవుని ఆత్మ ఆయనను ఆవరించగా, తన పాపాల కొరకు పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందెను.
ఆ తర్వాత తన 17 వ సంవత్సరములో “ప్రభువా నా జీవితం విషయమై నీ చిత్తం ఏమని” ప్రార్థించుచుండగా; “నా కొరకు చైనా దేశం వెళ్ళుము” అనే స్వరాన్ని వినెను. అప్పటి నుండి మిషనెరీ సేవకు తన్ను తాను సిద్ధపరచుకొనెను. చైనా భాష నేర్చుకొనుచు, చైనా భాషలో ఉన్న లూకా సువార్తను గంటల తరబడి చదువుచుండేవాడు. కఠినమైన శరీర శ్రమలను అలవర్చుకొని, ఎటువంటి సుఖాసక్తులకు స్థలమియ్యక, తన్ను తాను క్రమపరచుకొంటూ ప్రతి పని తానే చేయుట నేర్చుకొనెను. చైనా దేశంలో మిషనరీగా ఉండుటకు వైద్య విద్యను కూడా నేర్చుకొనుటకు కాలేజీలో చేరెను. అక్కడ తాను ఎదుర్కొన్న కష్టాలు, పేదరికము ప్రభువుకు మరింత సన్నిహితమవుటకు సహాయపడెను. ఆదాయములో మూడువంతులు దేవునికి ఇచ్చి, ప్రతిరోజు కాలేజీకి 8 మైళ్ళు నడచి వెళ్ళుచు; ఉదయం, రాత్రి ఒక రొట్టె ముక్క తిని సరిపెట్టుకొనేవాడు.
చివరికి దేవుని పిలుపుకు లోబడి తన 22 వ ఏట అనగా 1853 లో ఒక ఓడలో బయలుదేరి 5 1/2 నెలలు సముద్రంలో ప్రయాణించి “షాంగై” పట్టణం చేరెను. అయితే చైనాలో అది యుద్ధ సమయం అయినందున సువార్తను ప్రకటించుటకు అవకాశం లేకపోయెను. అయినను నిరుత్సాహపడక దినమునకు 5 గంటలు చైనా భాషను నేర్చుకొంటూ “అందరికి అన్ని విధములవాడనై యుంటిని” అన్న పౌలువలె, హడ్సన్ చైనా జాతీయ, వేష, భాషలను అనుసరించెను. వైద్యం చేయుట ద్వారా కొందరికి సువార్తను ప్రకటించెను. నివసించుటకు సరియైన ఇల్లు, తినుటకు ఆహారము లేకపోయినందున ఆరోగ్యము క్షీణించుచున్నప్పటికి, “ప్రభువు నన్ను ఒక్కొక్క అడుగే నడిపిస్తున్నాడు; ఆయన సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంతో అడిగినప్పుడు, ఆయన సమస్తమును ఇచ్చుచున్నాడు” అని అనెడివాడు.
ఒక దినము చైనాలో ఉన్న “మేరీడైర్” అను క్రైస్తవ ఉపాధ్యాయురాలిని కలిసికొనెను. ఆమె కూడా చైనాలో క్రీస్తు కొరకు నిలబడెను. పెద్దల అంగీకారం ప్రకారంగా దేవుని చిత్తములో ఆమెను వివాహము చేసికొనెను. వీరు యిరువురు కలిసి రోగుల సేవ, వాక్య పరిచర్య చేయుచుండిరి. విస్తారమైన సేవ, ప్రయాణముల వలన హడ్సన్ ఆరోగ్యము దెబ్బతినెను. 7 సంవత్సరముల సేవ తర్వాత అనారోగ్యుడైన హడ్సన్ విశ్రాంతి కొరకు, చికిత్స కొరకు ఇంగ్లాండు చేరెను.
లండన్ లో ఉండగా తాను సమయమును వృథా చేయక చైనా దేశపు పటమును తన గదిలో గోడకు తగిలించుకొని, అప్పటి ఆ దేశములోని 11 రాష్ట్రముల కొరకు, 38 కోట్ల జనుల కొరకు ప్రార్థించుచుండెడివాడు. ఆ దేశమునకు 24 మంది మిషనెరీలు కావాలని భారముతో ప్రార్థించి “చైనా ఇన్లాండ్ మిషన్”ను ప్రారంభించెను. ప్రార్థనా ఫలితంగా 11 నెలల తర్వాత 16 మంది మిషనెరీలతో మరల చైనాకు బయలుదేరెను. దేవుడు వారి సేవను అభివృద్ధి పరచెను. చైనా-ఇన్లాండ్ మిషన్ను స్థాపించిన 20 సంవత్సరములకు అందులో 225 మంది మిషనెరీలు పనిచేయుచుండిరి.
సేవలో అభివృద్ధి సాధించిన హడ్సన్ వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలను భరించెను. 12 సంవత్సరములు ఆయన సేవలో ఆయనకు తోడుగా ఉన్న ఆయన భార్య మేరీడైర్, వారి ముగ్గురు కుమార్తెలు ఆ దేశములోని అనారోగ్య పరిస్థితులను బట్టి మరణించారు. తన వెన్నెముక గాయమై కొన్ని నెలలు పడకలో ఉండవలసి వచ్చెను. పడకలో ఉండి కూడా చైనా కొరకు ప్రార్థించేవాడు. తను ప్రారంభించిన సేవ కొరకు ఎవరినీ ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ అర్థించలేదు గాని ప్రతి అవసరతను ప్రభువుకి తెలియజేసేవాడు. “దేవుని చిత్తములో చేసిన దేవుని సేవకు దేవుని సహాయము తక్కువ కాదు” అని అనుచుండెడివాడు.
ఈ మిషనెరీ 1905 వ సంవత్సరములో 11 వ సారి చైనాకు బయలుదేరాడు. నూతనముగా సేవ ప్రారంభించిన రాష్ట్ర రాజధాని చంగ్ అనే పట్టణంలో సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించెను.
ఒకసారి హడ్సన్ టేలర్ను ఒకరు “నీలాంటి వాడు ఇంతటి గొప్ప కార్యాలను సాధించడానికి ఎలా సాధ్యమయ్యింది?” అని ప్రశ్నించారట! అందు కాయన ఎంతో నమ్రతతో, “ఆ ప్రభువు ఎంత శక్తిమంతుడో, నేనెంత బలహీనుడనో నిరూ పించేందుకు ఆయనే తన కృప ద్వారా బలహీనుడనైన నావలన ఆయన బలమైన కార్యములు జరిగించెను” అని జవాబు ఇచ్చెను.
చివరికి 1905 లో డిసెంబరు 22 న ఈ దైవజనుడు చైనా దేశములో మరణించి ప్రభువు సన్నిధికేగి ప్రభువు ఇచ్చు బహుమానమును పొందెను.
All Pdf….Click Here