తూర్పు గుమ్మము-Golden Gate -The Messiah Gate-Sign Jesus Coming

తూర్పు గుమ్మము

Golden Gate -The Messiah Gate

బైబిలు దేవుని గ్రంథం. మానవ హస్త ప్రమేయం అందులో రవ్వంతైనా కానరాదు. అది చెప్పిన మాటలు అమోఘం! అత్యద్భుతం! ఆశ్చర్యకరం! 

 అది అన్ని పుస్తకాల వంటిది కాదు. అందులో నీ బతుకూ, నా బతుకూ పూసగుచ్చినట్టూ, పొల్లుపోకుండా రాయబడివుంది. నేనెవరిని? నేను ఎక్కన్నించి వచ్చాను? ఎక్కడికెళ్తున్నాను? ఎలా బతుకుతున్నాను? ఎవరు బతికిస్తున్నారు? ఇత్యాది సంగతులకు జవాబు తెలుసుకోవాలంటే, బైబిలు చదవాల్సిందే! అది మన బ్రతుకు పుస్తకం! 

 బైబిలును గూర్చి బైబిల్ ఏమంటుందంటే, “ఇది మీకు నిరర్థకమైన మాటకాదు” (ద్వితీ. 33:47). ఇది నిరర్థకమైన (అర్థంలేని) మాట కాకపోటానికి కారణం ఏమిటి? అది ఖచ్చితముగా, ముమ్మాటికీ దేవుని మాట కాబట్టి! మానవ మస్తిష్కంలోంచి రాయబడిన ఊహాగానాల గ్రంథం కాదు బైబిలు. అంటే, ఇది “పౌరషేయం” కాదు. ఇది “అపౌరషేయం” అన్నమాట! ఒక పౌరుని ప్రమేయంతో కాకుండా దేవుని స్వహస్తాలతో లిఖించబడినదీ గ్రంథం! 

 ఇందులో “ప్రపంచ భవిష్యత్తు” వుంది. దేవుడు చెప్పినవి చెప్పినట్లే ఎలా నెరవేరాయో, పరిశీలించి చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. “ఆదిలో నున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు?” అంటూ దేవుడు సవాలు విసిరాడు (యెషయా 44:7). 

పై వచనం వెలుగులో ఒక చారిత్రక సత్యాన్ని తెలుసుకుందాం రండి! 

యెరూషలేము కోట గోడయొక్క తూర్పు ద్వారమును గూర్చిన సంగతి అది! ఈ ద్వారం “దేవుడు పలకగా అది జరుగును దానిని ఎవరూ రద్దు చేయలేరు” అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. 

యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము (తూర్పు గుమ్మము) ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింప కుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే వుండును” అని రాయబడింది. 

ప్రియులారా! ఒక అద్భుతమైన వాస్తవం ఏమిటంటే, యెరూషలేము లోని ఈ తూర్పు ద్వారము ఇప్పటికీ మూయబడి వుంది. దీనిని ఎవరూ తెరువలేకపోతున్నారు. తెరవాలని చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. ఎవరివల్లా కాలేదు! ఇక ముందు కాదు కూడ! 

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఈ తూర్పు ద్వారమును తెరచుటకు తురుష్కులు, అంటే టర్కీవారు శతవిధాల ప్రయత్నం చేశారు. వారలా, ప్రయత్నాలు సాగిస్తూండగా టర్కీ బ్రిటీష్ వాళ్ళ చేతిలో ఘోర పరాజయం పొందింది. దాంతో ఆ భూభాగం బ్రిటీష్ వారి వశమై పోయింది. అంతటితో తూర్పు ద్వారాన్ని తెరవాలన్న టర్కీవారి ఆలోచనలన్నీ నెరవేరకుండా పోయాయి. 

ఒకవేళ, ఆ రోజు టర్కీవారు తూర్పు ద్వారాన్ని గనుక తెరిస్తే యెహెజ్కేలు ద్వారా పలుకబడిన “దేవుని మాట” అబద్ధమైపోయి వుండేది. “సత్యవేదమూ” “సత్యదేవుడూ” అనే మాటలు తలక్రిందులై వుండేవి. కాని, అలాగు జరగటానికి దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే, యెహెజ్కేలుకు ఆ మాట చెప్పిన దేవుడు, ఈనాటికీ జీవించివున్నాడు కాబట్టి! 

అంతటితో తూర్పు ద్వారాన్ని తెరవాలన్న ఆలోచనలకు తెరపడలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కూడా తూర్పు ద్వారాన్ని తెరవాలన్న ప్రయత్నాలు జరిగాయి. 

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ దేశాల భౌగోళిక స్వరూపం మారిపోయింది. జర్మనీ వంటి దేశాలు కొంత భూభాగాన్ని పోగొట్టుకున్నాయి. అలాగే టర్కీ విషయంలోనూ జరిగింది. అప్పటిదాకా సిరియాతో కలిసి వుండిన పాలస్తీనా విభాగింపబడి “ఇశ్రాయేలు దేశం”గా రూపుదిద్దుకుంది. 1948 మే 15న ఇశ్రాయేలు స్వాతంత్ర్యాన్ని పొందింది. 

అంతా బానే వుంది కాని అప్పటి పాలస్తీనా విభజనలో యెరూషలేములోని తూర్పు ద్వారం వున్న ప్రాంతం అరబ్బుల చేతికి వచ్చింది. అరబ్బులకు దేవుని ప్రవచనాలతో పనేంటి? – “పాపం, యెహెజ్కేలు గారితో ఈ ద్వారం మూయబడే వుంటుందని చెప్పాట్ట దేవుడు. మనం ఈ ద్వారాన్ని తెరచి ఆయన్నెందుకు అబద్దీకుని చేయాలి? మనం ఈ ద్వారం జోలికే పోవద్దు” అనుకుంటారా అరబ్బులు? ఎంత మాత్రమూ అనుకోరు. అసలు, అలాంటి పట్టింపే వుండదు వారికి. 

1967 దాకా బానే వుంది. పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. అంతలో ఎక్కన్నించి వచ్చి పడ్డాడో గాని అరబ్బు వ్యాపారి హుస్సేను రాజు రంగంలోకి దిగాడు. అధికారం వుంది. ధనబలం వుంది. తన మాట వేదవాక్కు ఆజ్ఞాపిస్తే పనులన్నీ చిటికెలో జరిగిపోతాయి. 

వ్యాపార సౌలభ్యం కోసం, తూర్పు ద్వారాన్ని తెరవాలని సన్నాహాలు సిద్ధం చేసుకున్నాడు. ఎవరూ ఇంతవరకు చేయలేని… చేయరాదని… చెప్పబడిన దానిని నేను చేసి చరిత్రలో పరాక్రమము గల జయశాలిగా నిలిచిపోతాను అనుకున్నాడు. 

ఇక, ద్వారం తెరవటమే పని! అందుకుగానూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏం జరుగబోతుందోనన్న ఉత్కంఠభరితమైన పరిస్థితి ప్రజలను కమ్ముకుంది. చరిత్రను అరచేతిలో నుంచుకుని నడిపిస్తున్న దేవుడు రంగంలోకి దిగొచ్చాడు. అంతే… 

“అరబ్బులకూ ఇశ్రాయేలీయులకూ యుద్ధం మొదలైంది” 

ఘోరమైన రణభూమిగా మారింది. హోరా హోరీగా సాగిన యుద్ధం ఆరు రోజుల పాటు జరిగింది. వెస్ట్ బాంక్తో సహా, తూర్పు ద్వారం వున్న ప్రాంతాన్ని అరబ్బులనించీ స్వాధీనం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు! అరబ్బుల రాజు హుస్సేన్ తుస్సుమన్నాడు. అతడు తూర్పు ద్వారాన్ని తెరవక ముందే కన్నుమూసాడు. ఆ రోజు మొదలూ ఈ రోజుదాక తూర్పు ద్వారం వున్న ప్రాంతం ఇశ్రాయేలీయుల వశంలోనే వుండిపోయింది. 

ప్రియులారా! దేవుని మాట ఎన్నడు అబద్ధం కాదు, కావటానికి వీల్లేదు. ఇదంతా యాదృచ్ఛికంగా, కాకతాళీయంగా జరిగిందా? కాదు! దీని వెనుక దేవుని హస్తం వుంది! 

అసలు, తూర్పు ద్వారం తెరవాలని అరబ్బురాజు ప్రయత్నం మొదలుపెట్టగానే యుద్ధం రావటం ఏమిటి? పోనీ, యుద్ధం వస్తే వచ్చింది – యుద్ధంలో సంఖ్యకు ఎక్కువ వున్న అరబ్బులు ఓడిపోవటం ఏమిటి? ఆ భూభాగం ఇశ్రాయేలువారి స్వాధీనం కావటం ఏమిటి? ఆ ద్వారాన్ని తెరవాలన్న వారి ప్రయత్నాలన్నీనూ భంగపాటు కావటం ఏమిటి? లోగడ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే తురుష్కులు కూడా ఇదే రీతిగా ద్వారం తెరిచే సమయంలో అది బ్రిటీష్ వారి చేతిలో ఓడిపోయి ద్వారాన్ని తెరచే పనిలేకుండా పోవటం ఏమిటి? 

ఇదంతా ఏదో అనుకోకుండా జరిగిందనిపిస్తోందా? లేకపోతే, దేవుడే దీని వెనుక పని చేస్తున్నాడనిపిస్తోందా? చెప్పండి! ఒక సంవత్సరం కాదు, రెండు కాదు, రెండువేల అయిదు వందల ఏండ్ల నుంచి ఈ ద్వారము మూయబడేవుంది. ఈ సుదీర్ఘకాల వ్యవధిలో అనేక మతాలకు చెందిన రాజులు వచ్చారు… పోయారు! ప్రభుత్వాలూ మారాయి. ద్వారము తెరిచే పని ఎవరివల్లా కాలేదు. 

యూదులు క్రీ.శ. 70లోనే దేశం నుంచి తరుమబడి ప్రపంచ దేశాల్లో తలదాచుకున్నారు. మొన్నటి వరకు వారికొక దేశమంటూ లేకుండా ఆయా దేశాల్లో పరదేశులుగా బతికారు. ఈ నేపధ్యంలో ఇశ్రాయేలు దేశాన్ని రోమన్లూ, బైజాంటియన్లూ, తురుష్కులూ, క్రూసేడర్లూ, బ్రిటీష్ వాళ్లూ, అరబ్బులూ ఎంతోమంది పరిపాలించారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఎంతోమంది పాలకులు మారినా ఆ ద్వారాన్ని మాత్రం ఎవ్వరూ తెరవలేకపోయారు.

 అలా తెరవాలని ప్రయత్నం చేసిన ప్రతివాడు లేకుండా పోయాడు.

“దేవునిపై తిరుగుబాటు ప్రాణానికే పెనుముప్పు” అన్న కఠోర సత్యం ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టయింది! 

బైబిలు “దేవుని మాట!” – నిన్ను ధన్యుణ్ణి చేసే బాట అందులో వుంది! 

కాలాలు మారవచ్చు – కవుల కవిత్వం కనుమరుగు కావచ్చు. కల్పితాల కథ కాదు, బైబిలు కథనం! నిక్కముగా అక్షర సత్యం! కాలగర్భంలో కలిసిపోయారు క్రీస్తు విరోధులు నిరోధించ  పూనుకున్నవాడు మట్టిపాలయ్యాడు!  తస్మాత్! జాగ్రత్త… 


All Pdf Files…..Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “తూర్పు గుమ్మము-Golden Gate -The Messiah Gate-Sign Jesus Coming”

Leave a comment

error: dont try to copy others subjcet.