విలాప వాక్యములు వివరణ | Lamentations Explanation In Telugu 25

Written by biblesamacharam.com

Published on:

విలాప వాక్యములు. 

Lamentations Explanation In Telugu

పరిశుద్ధ గ్రంథంలో యిది   – 25వ గ్రంథము 

అధ్యాయాలు                       –   5 

వచనాలు                               – 154 

ప్రవచనాలు                             – 2

ప్రశ్నలు                                   – 13 

ఆజ్ఞలు                                     – 3 

హెచ్చరికలు                            – 2 

గ్రంథకర్త                            – యిర్మీయా

కాలము                          – క్రీ.పూ. 586-585

ముఖ్య స్థలము                – యెరూషలేము

ముఖ్యమైన వచనాలు    – 2:5,6,11; 3:22,23 

ముఖ్యాంశము            –  ప్రస్తుత విలాపము- భవిష్యత్ నిరీక్షణ

ముఖ్యమైన మనుష్యులు –  యిర్మీయా, యెరూషలేము ప్రజలు

ముఖ్యమైన అధ్యాయము – 3వ అధ్యాయము 

      దేవునికి అవిధేయులగుట అనేది నాశనమునకు దారి తీయునని – దేవుని ప్రజల శ్రమానుభవములు దేవుని హృదయాన్ని మిక్కిలి బాధించునని ఈ గ్రంథము తెలియజేస్తుంది. బబులోను దేశస్తులు యెరూషలేమును పాడుచేసి – ప్రజలను హతమార్చి కొందరిని బబులోనుకు చెరపట్టుకుని బానిసలుగా చేసుకొనిన సందర్భమును విలాపవాక్యములు తెలియజేస్తాయి. Lamentations Explanation In Telugu

      ఒక గొప్ప పట్టణము యొక్క ప్రలాపముగ విలాపవాక్యముల గ్రంథము బయలుపడుతోంది. ఒక కాలమందు యూదుల గొప్పతనముతో నిండిన యెరూషలేము పట్టణము బబులోను వారి దండయాత్రచే ఇసుక దిబ్బగా మార్చబడుటను బట్టి దైవజనుడైన యిర్మీయా శోక తప్తుడై ప్రలాపించి ఏడ్చిన ఏడ్పులే – విలాప వాక్యములు! శోకిస్తూ శోకంలో పల్కిన మాటలు – విలాప వాక్యములు! ఒక మహానగరం యొక్క ఘోషలాగ విలాపవాక్యములు కనబడతాయి. 

   యెరూషలేము ముట్టడి సమయంలో యిర్మీయా ఆ పట్టణంలోనే ఉన్నాడు. ప్రజలనుభవించిన కష్టాలకు అతడే ప్రత్యక్షసాక్షి. 

    “విలాప వాక్యములు” అనే ఈ గ్రంథం పేరు పాత నిబంధన గ్రీకు, లాటిన్ భాషలలో ఉన్న “యిర్మీయా విలాపములు” అనే ఉపశీర్షిక నుంచి గ్రహించబడింది. 

    హెబ్రీ పాత నిబంధనలోని 3వ భాగములో 5 చుట్టలు ఉంటాయి. అందులో ఈ విలాప వాక్యములు అనే ఈ గ్రంథం ఒకటై యున్నది. హెబ్రీ పాతనిబంధనను యూదులు “హగియోగ్రఫా” అని పిలుస్తారు. హగియోగ్రఫా అంటే, పరిశుద్ధ రచనలు అని అర్థం. 3వ భాగంలోని తక్కిన 4 చుట్టలు ఏమిటంటే – రూతు, ఎస్తేరు, ప్రసంగి, పరమగీతములు అన్నమాట! Lamentations Explanation In Telugu

     యూదులు తమ మతాచార క్రమంలో నియమించబడిన కొన్ని ప్రత్యేక సమయాల్లో ఈ 5 గ్రంథాలను చదివేవారు. విలాప వాక్యములను వారు “అబ్” అనే నెలలో 9వ రోజున చదువుతారు. యెరూషలేము విధ్వంసాన్ని జ్ఞాపకం చేసుకొనే సమయమని వారు ఈలాగు చదువుతారు. మన కేలండర్ ప్రకారమైతే జూలై మధ్య భాగం వస్తుంది. “సెప్టువజింట్” బైబిల్ అనువాదంలో ఈ గ్రంథాన్ని యిర్మీయా గ్రంథం తర్వాత ఉంచారు. ఈ క్రమాన్నే మనం ఈనాడు మన బైబిలులో చూస్తున్నాం. 

     యెరూషలేము యొక్క విషాదకరమైన వినాశనాన్ని గురించి తాను పొందిన అపరిమితమైన దు:ఖం, మనోవేదనను వెల్లడి చేయడానికి యిర్మీయా 5 విలాపాలను రచించాడు. వాటిలో ఇమిడియున్న సంగతులు 3 ఉన్నాయి. ఒకటి – దావీదు రాజరికం యొక్క అవమానకరమైన ముగింపు; రెండు – నగర ప్రాకారాలు, దేవాలయం. రాజమందిరం, నగరం పూర్తిగా విధ్వంసం కావడం; మూడు – శేషించిన వారిలో ఎక్కువమంది దూరపు బబులోనుకు ఎంతో విషాదకరమైన రీతిలో కొనిపోబడటం. Lamentations Explanation In Telugu

     సెప్టువజింట్ (Septaugint), లాటిన్ వల్గేట్ (Latin Vulgate) అనువాదాలలో ఈ గ్రంథాన్ని గూర్చిన ఉపశీర్షికలో – “ఈ విలాపవాక్యాలలో యిర్మీయా కూర్చొని యెరూషలేమును గూర్చి దు:ఖిస్తూ విలపించాడు” అని చెప్పబడింది. ఇది దగ్గర బంధువు మరణించినప్పుడు అతని సమాధి దగ్గర విలపిస్తున్న వ్యక్తి దు:ఖంలా ఉంది. 

    ఈ విలాపానికీ, ఈ విషాదానికీ కారణం – యూదా ప్రజలూ, వారి పాలకులూ. ఇది శతాబ్దాల తరబడి వీరు దేవునిపై చేసిన తిరుగుబాటు ఫలితం. ఎదురు చూసిన దినం రానే వచ్చింది. అదెంతో భయంకరమైనది. యిర్మీయా ఈ విలాప వాక్యములలో దేవుడు తన మార్గాలన్నిటిలో ఎంతో నీతిమంతుడని అంగీకరిస్తున్నాడు. అంతేకాదు – ఆయనలో నిరీక్షించే ప్రజల పట్ల కనికరం, జాలి కలిగినవాడని కూడా స్పష్టం చేస్తున్నాడు (3:22-23,32). 

     ఆ విధంగా విలాపవాక్యములు యూదా ప్రజలకు వారి నిరాశలో నిరీక్షణ కలిగించి వారిపైకి అప్పుడు వచ్చిన తీర్పును దాటి ముందు ముందు తన ప్రజలకు దేవుడు కలిగించే పునరుద్ధరణను కూడా గ్రహించేలా చేస్తున్నది. 

        ఈ విలాపవాక్యముల గ్రంథం పరిశీలనను కొద్దిసేపు మనం చూద్దాం. 

          ఈ గ్రంథంలో 5 విలాపాలు ఉన్నాయి. ప్రతిదీ దేనికదే సంపూర్ణంగా ఉన్నాయి. మొదటిది (1వ అధ్యాయం) – యెరూషలేము యొక్క వినాశనాన్ని బట్టి, దాని మూలంగా తనలో కలిగిన మనో వేదనను బట్టి ప్రవక్త చేసిన విలాపాన్ని వర్ణిస్తుంది. ఒక్కోసారి అతని విలాపం అక్షరాలా యెరూషలేము పట్టణమే విలపిస్తున్నట్లుగా ఉంటుంది. (1:12-22). 

    తన రెండవ విలాపంలో దేవునిపై తిరుగుబాటు చేస్తూ పశ్చాత్తాపం చెందడానికి నిరాకరించే ప్రజలపైకి వచ్చిన దేవుని ఉగ్రత కారణంగానే ఆ విధ్వంసం వచ్చిందని చెబుతున్నాడు. యూదా యొక్క శత్రువులే దేవుని తీర్పుకు సాధనాలు. మన జీవితంలో కూడా దేవునికి లోబడకపోతే రకరకాల ఆపదల గుండ మనం వెళ్లవలసి ఉంటుంది. 

      మూడవ విలాపంలో (3వ అధ్యాయం) – దేవుడు నిజంగా కనికరం గలవాడనీ, నమ్మకస్తుడనీ, తనపై నిరీక్షణ ఉంచే ప్రజల పట్ల ఎంతో మంచివాడని జ్ఞాపకం చేసుకోవలసిందిగా దేశాన్ని యిర్మీయా కోరుతున్నాడు. 

    నాలుగవ విలాపంలో (4వ అధ్యాయం) – ముందటి మూడు విజయాలనే పునరుద్ఘాటిస్తున్నాడు. 

     ఐదవ విలాపంలో (5వ అధ్యాయం) – ప్రవక్త యూదా పాపాన్ని, కనికరం పొందాల్సిన అవసరతనూ అంగీకరిస్తూ దేవుడు తన ప్రజలను పునరుద్ధరించి తన ఆపేక్షను వారిపట్ల చూపవలసిందిగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు. 

     ఈ గ్రంథంలోని 5 విలాపాలు – 5 అధ్యాయాలు. ఒక్క 3వ అధ్యాయం తప్ప మిగిలినవన్నీ 22 వచనాలను కల్గియున్నాయి. 3వ అధ్యాయంలో 66 వచనాలు ఉన్నాయి. (బైబిలులో 66 గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 66 వచనాలు ఉన్నాయి). 3వ అధ్యాయం మాత్రం మూడు రెట్లు – అంటే 66 వచనాలను కలిగి వున్నది. ఈ 66 వచనాలలో మూడు ఇరవై రెండ్లు ఉన్నాయి (3×22=66); 1,2,4,5 అధ్యాయాలు 22 వచనాలు చొప్పున ఉన్నాయి. ఇంగ్లీషులో 26 అక్షరాలు ఎలాగు ఉన్నాయో – హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. 

     1,2,4,5 అధ్యాయాలు అక్షర క్రమంలో రాయబడ్డాయి. అంటే ప్రతి వచనం హెబ్రీ భాషలో ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమై చివరి అక్షరంతో ముగించబడతాయి. హెబ్రీ భాషలో మొదటి అక్షరం – “ఆలెఫ్” (Aleph) నుంచి చివరి అక్షరమైన “టౌ” వరకు కొనసాగుతాయి. 119వ కీర్తన కూడా ఇదే విధంగా 22 అక్షరాల క్రింద కొన్ని కొన్నిలేఖన భాగాలు విభజింపబడి స్పష్టంగా రాయబడి వున్నది. మీరు దయచేసి చూడండి. 

     3వ అధ్యాయంలోనైతే ప్రతి 3 వచనాల కూటమికి ఒక్కొక్క హీబ్రూ అక్షరాన్ని వాడటం జరిగింది. ఈ విధంగా అక్షర క్రమంలో రాయడం మనకు అవి సులభంగా గుర్తుంచుకోడానికి వీలు కలిగించడం మాత్రమే కాక, ఆ విలాపాలు సంపూర్తి అయినాయని సూచిస్తున్నాయి (హీబ్రూలో “ఆలెఫ్” నుంచి “టౌ” వరకు). ఈ విధంగా ఒక విధమైన చట్రంలో తన విలాపాలను బిగించటం ద్వారా ప్రవక్త ఇక ముగింపు లేకుండా విలపిస్తూనే ఉండటం నుంచి నిరోధించాడు.Lamentations Explanation In Telugu  

     ప్రియ స్నేహితులారా! విలాపాలకూ, దుఃఖాలకూ ముగింపు ఉంది. యూదుల దేశ బహిష్కరణకూ ప్రవాసానికీ ముగింపు ఉంది. యెరూషలేము కూడా ఒకానొక దినాన్న తిరిగి కట్టబడుతుంది. నీ కష్టాలకూ, వేదనలకూ ముగింపు ఉంది. ఒక దినము నీవు మహిమతో కట్టబడతావు. Lamentations Explanation In Telugu 

     విలాప వాక్యముల గ్రంథం, దుఃఖ భరితంగా ప్రారంభమైనప్పటికీ (1:1-2), దాని ముగింపు మాత్రం పశ్చాత్తాపం, పునరుద్ధరణను గూర్చి నిరీక్షణతో కూడిన మాటలతో నిండి వుంది (5:16-22). క్రొత్త నిబంధనలో ఈ గ్రంథాన్ని గురించిన ప్రసక్తి లేదుగాని కొన్ని సూచనప్రాయమైన విషయాలు మాత్రం పేర్కొనబడ్డాయి (విలాప 1:15ను – ప్రక 14:19 తోనూ; 2:1ని – మత్తయి 5:35తోనూ; 3:30ని – మత్తయి 5:39తోనూ; 3:45ని – 1 కొరింథీ 4:13తోను పోల్చి చూడండి).Lamentations Explanation In Telugu  

    40 సంవత్సరాలకు పైగా యెరూషలేముకు వచ్చే తీర్పును గూర్చి ప్రవచనమును, హెచ్చరికలను యిచ్చిన ప్రవక్తగా యిర్మీయా కనబడ్తున్నాడు. క్రీ.పూ. 586లో నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసిన తర్వాత, తన హెచ్చరికలను అశ్రద్ధ చేసిన యూదులను నిర్లక్ష్యపరచి నేరము మోపడానికీ యిర్మీయా ప్రయత్నించలేదు. అదే సమయంలో యెరూషలేము దుస్థితిని చూసి వేదనతో చలించిపోయాడు. ఈ విధంగా తన దేశ ప్రజలతో ఏకీభవించాడు. కఠినమైన మాటలు ప్రకటించటానికి దేవునిచే నియమింపబడిన ప్రవక్త యొక్క కోమల హృదయమును మనం చూడవచ్చు. Lamentations Explanation In Telugu 

ప్రభువైన యేసు విలపించు ప్రవక్తగా ఈ గ్రంథంలో చిత్రీకరించబడ్డాడు. ఆరు శతాబ్దముల తర్వాత యేసుప్రభువు అలాగే ‘ యెరూషలేమును చూచి విలపించాడు (మత్తయి 23:25; లూకా 19:41). యిర్మీయా ప్రభువైన యేసువలె దు:ఖా ‘ క్రాంతుడుగానూ, తన సొంతవారిచే తృణీకరింపబడిన వాడుగాను ఉన్నాడు. 

     ప్రభువును శిలువ వేసిన కల్వరి కొండపైన పచ్చికతో కప్పబడిన గుట్టను నేడు “యిర్మీయా పీఠము” అని పిలుస్తారట. అక్కడ యిర్మీయా కూర్చొని విలాపగీతములు రచించాడని భక్తిగల యూదులు నేడు నమ్ముతున్నారు. ప్రతి శుక్రవారమునాడు యూదులు విలాపగోడవద్ద నిల్చొని ఈ గీతములను దుఃఖముతో ఆలపించెదరు.Lamentations Explanation In Telugu 

    యిర్మీయా యాజకుడు గనుక ప్రజల పాపమును తన స్వంత పాపముగా ఎంచుకున్నాడు. నేడు దేవుని సమాజమైన సంఘము ఆనాటి యెరూషలేమువలె శిధిలావస్థలో ఉన్నది. ప్రతి విశ్వాసి లేచి దేవుని కొరకు తేజరిల్లవలసి ఉన్నది. దిగజారిపోయిన నేటి సంఘము కొరకై మనం యిర్మీయా వలె విలపించి విజ్ఞాపన చేయవలసి ఉన్నది. Lamentations Explanation In Telugu

    క్రీస్తునందు ప్రియులారా! సమస్తమూ దేవుని ఆధీనములో ఉన్నాయి. దేవుని తీర్పు న్యాయవంతమైనది. శిక్షను సహనంతో భరించాలి. మనం మన హృదయాలను పరీక్షించుకొని, పాపాన్ని విడిచి, దేవునివైపు తిరిగి క్షమించమని అడిగితే ఆయన క్షమించి తిరిగి ఆత్మీయ ఉజ్జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు నిత్యుడు. ఎన్నటికీ ఆయన మారనివాడు. మనం ఆయన ప్రజలం. ఆయన మనల్ని ఎన్నటికీ మరచిపోడు. అవమానం పాలైన చోటే ఆశీర్వాదము – ఆదరణ లభిస్తుంది. 

    యెరూషలేము పాడైపోయింది – అయితే భవిష్యత్తులో తిరిగి మహిమతో కట్టబడుననే నిరీక్షణతో గ్రంథం ముగింపులోకి మనల్ని నడిపిస్తుంది. తిరిగి కట్టేది దేవుడే. ఇది ఆయనే చూచుకొంటాడు. ఎటువంటి ఉపద్రవములైనా దేవుడు తన పనిని జరపకుండా ఆటంకపరచలేవు. దుఃఖ పరిస్థితులు నీవు ఎదుర్కొన్నప్పుడు విశ్వాసము కోల్పోకుండా నిరీక్షణతో దేవునియందు స్థిరముగా నిలిచి పో!Lamentations Explanation In Telugu 

      కఠినమైన పరిస్థితులే – నీ జీవితంలో దేవుని ప్రేమ పూర్వకమైన కార్యములు నీలో జరుగుటకు నడిపిస్తాయి. 

                               అదొక క్రొత్త ఉషోదయములా అనిపిస్తుంది!!! Lamentations Explanation In Telugu


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. క్లిక్ హియర్ 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted