క్రైస్తవులు ధరించే వస్త్రధారణ ఎలా ఉండాలి|Bible Question-Answers In Telugu|1

క్రైస్తవులు ధరించే వస్త్రధారణ ఎలా ఉండాలి.

Bible Question-Answers In Telugu

ప్రశ్న : క్రైస్తవులు ధరించే వస్త్రధారణ ఎలా ఉండాలి? దానిని గురించి బైబిలు ఏమైన బోధిస్తుందా? తెలియజేయగలరు! 

       జవాబు : దేవుడు ఆదామవ్వలను సృజించినప్పుడు వారు మహిమ వస్త్రములతో చుట్టబడ్డారు. మహిమనే ఒక వస్త్రముగా ధరించుకున్నారన్న మాట. నేటి ప్రపంచంలో మనం ఎరిగిన “సిగ్గు” అప్పుడు వారు ఎరుగరు, అది వారికి తెలీదు. నేటి మన స్థితిలాంటి స్థితి అప్పటిలో వారికి లేదు. అప్పటిలో అంటే, వారు “వద్దు” అన్న ఫలం తిని ఆజ్ఞను అతిక్రమించక ముందున్న స్థితి. ఆ స్థితిలో… ఆ కాల ఘట్టంలో వారికి మహిమయే ఒక వస్త్రముగా ఉంది గనుక, నేడు మన మెరిగిన సిగ్గులాంటి సిగ్గు వారికి తెలీదు. 

      దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారికి జ్ఞాన నేత్రాలు తెరవబడ్డాయి. ఈ విషయమై – “అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను, వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి” అంటూ లేఖనం తెలియజేస్తుంది. వారు వస్త్రాలు లేకపోవుట అవమానకరమని సిగ్గుతో చెట్టుచాటున దాగుకున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ దేవుడు – చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెనని ఆదికాండము 3:21 చెబుతోంది. 

     ఇక్కడ మనం ఒక పదం యొక్క మూలార్థమును తెలుసుకోవాలి. పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడిందని దాదాపుగా మనకందరికీ తెలుసు. అయితే ఆదికాండము 3:21లోని “చొక్కాయిలు” అనే మాటను హీబ్రూలో ఆలోచిస్తే – “కెతోనెత్” అని రాయబడింది. దీనికి సరైన భాషానువాదం చేస్తే – “వదులుగా నున్న పొడవైన వస్త్రములో పూర్తిగా దాచి ఉంచడం” అనే అర్థం వస్తుంది. దేవుడు ఆదామవ్వలకు తన శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వదులైన వస్త్రాలను కుట్టించి ఇచ్చాడు. ఇవి బిగుతైన వస్త్రాలు కాదు. వదులుగా నున్న వస్త్రాలు! 

     పురుషుని శరీరాకృతి వేరు, స్త్రీయొక్క శరీరాకృతి వేరు. కాబట్టి దేవుడు స్త్రీకి సంబంధించిన వస్త్రాలు స్త్రీలకూ – పురుషునికి సంబంధించిన వస్త్రాలు పురుషులకూ ఇచ్చాడు. అందును బట్టే – స్త్రీ, పురుష వేషము వేసుకొనకూడదు; పురుషుడు, స్త్రీ వేషమును ధరింపకూడదు అన్నాడు (ద్వితీ. 22:5). మొదటి తిమోతి పత్రిక 2:9లో – తగుమాత్రపు వస్త్రములచేత … అలంకరించుకొనవలెను అని పౌలుగారు రాసారు. ఇక్కడ “తగు మాత్రపు” అనే మాటకు గ్రీకు బైబిలులో రాయబడిన పదం – “కోస్మియోస్ కటస్టోల్!” 

     కోస్మియోస్ కటస్టోల్ అంటే “ఎంత మాత్రమును అశ్లీలతలేని సఖ్యత కలిగిన వస్త్రధారణ” అని అర్థం. శరీరాకృతిని స్పష్టంగా చూపించే అశ్లీలమైన వస్త్రధారణ దేవునికి అసహ్యము అంటూ పై లేఖనాల గూఢార్థమును బట్టి మనకు తెలుస్తోంది. సాతాను మానవజాతిని పాపముతో చెరపట్టాడు. ఎన్నో పాపములూ…. అందులో బలమైనది – వ్యభిచారం. ఎదుటివారికి ఆకర్షణీయముగా కనిపించాలనే కోరిక… దానితో రకరకాల వస్త్రధారణలు వచ్చి చేరాయి… శరీరంలోని మరుగుగా నుండవలసిన అవయవాలు వలలాంటి అల్లిక వస్త్రధారణలో నుంచి సభ్యసమాజం యొక్క కళ్లు చెరిపేస్తున్నాయి. దాంతో కామం మోహం రెచ్చిపోతున్నాయి. పచ్చని కాపురాలు పుచ్చిపోతున్నాయి. 

   దేవుడు “అవును” అని చెప్పిన దానిని “కాదు” అని చెప్పడమే సాతాను భాష. శరీరమును కప్పి ఉంచే వదులుగా నున్న వస్త్రాలు నీతికి నైతిక విలువలకు నిలయాలు అని దేవుడు చెబితే- అలా కాదు, బిగుతుగా నున్న బట్టలు ధరించు- లోపలి భాగాలు చూపించు… వస్త్రం తొడుక్కున్నను తొడుక్కోలేదు అన్నట్టు… ఎదుటివారి కన్నులను చెమర్చు… ఇదీ, సాతాను మాట తీరు. 

     వ్యభిచారులూ, సినిమా హీరో హీరోయిన్లు అసభ్య వస్త్రధారణతో లోకాన్ని మత్తెక్కించారు. మత్తులో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు క్రైస్తవ సంఘాలలో అమ్మాయిలూ లోకాశలతో ఊగిసలాడుతున్నారు. ఒకప్పుడు అశ్లీలమని భావించిన బట్టలు నేడు లేటెస్ట్ ఫ్యాషన్గా మారిపోయాయి. వీటికున్న క్రేజ్ అంత ఇంత కాదు. 

     వీపంతా కనిపించే బ్లౌజ్లూ, స్లీవ్స్ డ్రెస్లూ వేసుకొని శిలువకు అవమానం తెచ్చి పెడుతున్న వైనాలూ, జీన్స్, టీ-షర్ట్లు, చున్నీలేని టాప్డేసుకొని టిక్టాక్గా జోరుగా హోరెత్తించి పాడే పాటల గందరగోళాలూ, స్కిన్లైట్లూ, కాళ్ళను అంటిపెట్టు కుని అసభ్యంగా కనిపించే లెగ్గిన్లూ… ఇవన్నీ వాక్యానుసారమేనండోయ్ అని మీరు నిజాయితీగా గుండెపై చేయివేసి చెప్పగలరా? వీటిద్వారా సమాజం చక్కగా సజావుగా సాగిపోగలదు అని భరోసా ఇయ్యగలరా? చెప్పండి! 

    తాము ఏదో లేటెస్ట్ ఫ్యాషన్ అనుసరిస్తున్నట్లు అనుకుంటున్నారు గాని, వాస్తవానికి సాతాను తన మాయలతో భ్రమ కలిగించి ఆత్మీయ నేత్రాలకు అంధత్వం కలుగజేశాడు. స్త్రీ వేషమునూ – పురుష వేషమును మిళితం చేసి క్రింద జీన్ ప్యాంట్ ధరించి, పైన పంజాబీ టాప్లు ధరిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న ప్రతి క్రొత్త (చెత్త) మోడల్ డ్రస్సులూ మొదట క్రైస్తవులే ధరిస్తున్నారు. దీనివలన సంఘానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అసభ్య వస్త్రాలతో సభ్య సమాజమును చెడగొడుతున్న వారిని గాను క్రైస్తవుల మీద ఇతర మతస్తులు ముద్రవేశారు. భారతీయ సాంప్రదాయాలను మంట గలిపారు అంటూ మనలను దూషిస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

      అమ్మాయిల వెంటబడే పోకిరీలు పార్కులకూ, కాలేజీ ప్రాంగణాలకు వెళతారు. అయితే ఇప్పుడు సీన్ మారింది – వాళ్లు క్రైస్తవ మందిరాల వరకూ వస్తున్నారు. కారణం – మన ప్రవర్తన – అసభ్య వస్త్రధారణ. లోపలి కోరికే బయట బహిర్గతమవుతుంది. కాబట్టి ఎంతో భక్తిపరులం అని మనమెంత మురిసిపోతున్నా… మన వేషభాషల బాగోతాల తీరు చూసి- వీరూ మా బోటివారే అనుకుంటున్నారు లోకస్తులూ! 

     దీనికంతటికి కారణం – క్రైస్తవ యువతులనే మనం నిందించుదామా? కానేకాదు! క్రైస్తవ యువకులు కూడా దీని విషయంలో పాలిభాగస్తులైయున్నారు. లోకపు పోకడలను అనుసరిస్తూ చెడిపోతున్నారు. సినిమా స్టార్స్ను అనుకరిస్తూ తామేదో పెద్ద హీరోలమై పోయాం అనుకుంటూ దేవుని వాక్యానికి అవిధేయులవుతున్నారు! కండలు కనిపించే లాంటి షర్టులూ, క్రిందకు జారిపోతున్నట్టు ఉండే లోయెస్ట్ ప్యాంటులూ… యిలా ఎన్నో ఆకర్షణీయమైన వస్త్రధారణచేత, కేవలం మనుష్యులను సంతోషపరిచే సినీ తారలను రోల్మెడల్గా చేసుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీ దృష్టికి “మంచి” అనే అనిపిస్తుందా? 

     అమ్మాయిల యొక్క వస్త్రధారణ వలన యువకులు ఏ విధంగా శోధింపబడుతున్నారో అలాగే యువకుల వస్త్రధారణ వలన అమ్మాయిలూ శోధింపబడ్తున్నారు. “తన సహోదరులకు ఆటంకముగా ఉండే దేనిని కూడ చేయవద్దు” అని బైబిలు మనకు బోధిస్తుంటే – మన వస్త్రధారణలతో ఇతరుల పరిశుద్ధ జీవితాలకు అవరోధం, ఆటంకం, అంతరాయం కలిగించి ఎంజాయ్ చేస్తున్నాం. క్రైస్తవులారా! ఇది మనకు తగదు! (రోమా 14:13) 

     ఒకప్పుడు సభ్యతగల వస్త్రధారణకు విలువనిచ్చిన క్రైస్తవులూ, విదేశీ సంస్కృతులను వెంబడించి మోజు పడిపోయి, వాటికి ఆకర్షింపబడి – చెడిపోయిన క్రైస్తవ దేశాల అసభ్యతను అరువు తెచ్చుకొని ఇప్పటికే తీరని నష్టాలను కొనితెచ్చుకున్నాం. ఇందు విషయమై లేఖనం ఏమి చెబుతుందో విందాం – “అన్యదేశస్థులవలె వస్త్రములు వేసుకొను వారినందరిని నేను శిక్షింతును” (జెఫన్యా 1:8). విన్నారా ఆ మాటలూ? 

      “హెచ్చువాటియందు మనస్సుంచక తక్కువ వాటిపై మనస్సు ఉంచుడి” అని రోమా 12:16 చెబుతోంది. కాబట్టి ఖరీదైన వాటిని కాక, చీప్ అండ్ బెస్ట్లో చక్కని దుస్తులను కొనుగోలు చేద్దాం! బీదలైన వారిని జ్ఞాపకం చేసుకుందాం! పౌలు తిమోతికి రాయుచూ – “అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము” అని హితవు పలికాడు (2తిమోతి 4:5) 

గతంలో నీవెలా వున్నా – నేడు మితంగా ఉండు! 

 హెచ్చువాటి జోలి లేక – వాక్యానికి అచ్చు బోసినట్లు ఉండు!! 

   లోకాచారమును వదిలిపెట్టు – గాచారమును తరిమికొట్టు!! 

     అంధుడివి కాక – మందకు మాదిరివై యుండు!!!! 

రచయిత : David  Paul Garu.

All Credits Reserved To Respective Oweners.


 ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి. క్లిక్ హియర్ 

Leave a comment

error: dont try to copy others subjcet.