Did Jesus Christ come to India?యేసుక్రీస్తు భారతదేశం వచ్చాడా?|telugu christian nessege |2023

యేసుక్రీస్తు భారతదేశం వచ్చారా?

Did Jesus Christ come to India?

    ప్రస్తుత ప్రపంచంలో కోట్లాదిమంది యొక్క నిరీక్షణకు ఆలంబన, విశ్వాసానికి మూలం మరియు ఆధ్యాత్మిక బలం ప్రభువైన యేసుక్రీస్తు. జగద్రక్షకుని జనన, మరణ, పునరుత్థానములు మానవుని ప్రశ్నలకు సమస్యలకు అద్భుత సమాధానాలు. క్రీస్తు ప్రభువును గుండెల్లోకి ఆహ్వానించిన వారు అనుభవిస్తున్న ఆనందాన్ని వర్ణించడానికి భాష చాలదు. దయామయుని ప్రసన్న వదనం ఒక్కసారి వీక్షిస్తే చాలు… జీవితం ధన్యం. వీనులకు విందులు చేసే యేసయ్య బోధల ద్వారా అనేక జీవితాలు పావనమయ్యాయి. మహోన్నతుని దివ్య నామ స్మరణ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది. కలువరి సిలువలో చిందించబడిన రుధిరము సర్వ పాపాలకు పరిహారము. తేజోమానమైన ఆయన స్పర్శ ప్రతీ రుగ్మతను దూరం చేస్తుంది. రుచి చూసిన వారు మాత్రమే మహిమాన్వితమైన ఆయన ఔన్నత్యం గూర్చి గళమెత్తి చెప్పగలరు. 

    అయితే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు ఈనాడు చాలామంది యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో ఏ ఒక్కరి మీద జరుగనంత భయంకరమైన దాడి ఆయన మీద జరుగుచున్నది. ఆయన మహోన్నత జీవితాన్ని ప్రశ్నించేవారు కొందరైతే, ఆయన ఉనికినే ప్రశ్నించేవారు మరికొందరు. ఈనాటి మన భారతీయులు కూడా యేసుప్రభుకి అంత గొప్పదనం కలుగడానికి కారణం మేమే అని చెప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు భారతదేశం వచ్చి అనేక విషయాలు ఇక్కడే నేర్చుకుని ఇశ్రాయేలు దేశంలో వాటిని ప్రకటించాడని అనేకమంది వాదిస్తున్నారు. 

     ఇంటర్నెట్లో గానీ, న్యూస్ పేపర్లలో గానీ ఎక్కడ చూసినా యేసుక్రీస్తు జీవనం12-30 సం॥రాల వయస్సు వరకు బైబిల్లో ఎక్కడ లేదు గనుక ఆ సమయంలో ఆయన భారతదేశం వచ్చారనే వార్త వినబడుతుంది. చాలా మంది హైందవ పెద్దలు కూడా ఇదొక ప్రాముఖ్యమైన అంశంగా వారి యొక్క వెబ్సైట్లలో పొందుపరచడం ఒకింత విచారాన్ని కలిగిస్తుంది. కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడని పాంప్లెట్స్ ప్రింట్ చేస్తూ పల్లెల్లో, గ్రామాలలో కూడా పంచిపెడుతూ క్రైస్తవ సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు భారతదేశ ఆగమనం గూర్చి జరుగుచున్న అసత్య ప్రచారంలో వారు చేస్తున్న ఆరోపణలను గమనిద్దాం! 

   అసత్య ప్రచారం 1: యేసుక్రీస్తు 12-30 సం॥ల వయస్సు మధ్య భారతదేశంలోనే ఉన్నాడు (MISSING YEARS OF JESUS CHRIST). బైబిల్లో యేసుక్రీస్తు 12 సం॥ల వయస్సుకు ముందు జీవితం మరియు 30 స.ల తరువాత నుండి సేవా జీవితం వ్రాయబడియుంది. మధ్యలో 18 సం.ల జీవితం భారతదేశంలోనే గడిచింది. బైబిల్ రచయితలు ఈ విషయాన్ని దాచిపెట్టారు. 

    అసత్య ప్రచారం 2: “యేసుక్రీస్తు భారతదేశాన్ని దర్శించి కొంతమంది హైందవ మత పెద్దలను కలుసుకొని హిందుత్వం యొక్క గొప్పతనాన్ని అర్ధం చేసుకున్నారు”. ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించి, ఆశ్రమాలలో జీవించి హైందవ మత పెద్దల దగ్గర జ్ఞానయోగం సంపాదించారు. 

అసత్య ప్రచారం 3: హైందవ పెద్దల దగ్గర జ్ఞానము సంపాదించుకుని భారతదేశంలోని తక్కువ కులస్థులకు, నిమ్న జాతులవారికి సువార్త అనగా దేవుని గురించి బోధించుచున్నప్పుడు కొంతమంది అగ్రకులస్థులు యేసుప్రభువును బెదిరించినప్పుడు ఆయన భయపడి పారిపోయి కొంతమంది బౌద్ధ బిక్షువుల దగ్గర బుద్ధుని బోధలు విని శాంతిగా జీవించారు. 

   అసత్య ప్రచారం 4:  భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని నలంద యూనివర్సిటీలో ఏకధాటిగా 16 సం॥లు బుద్దుని బోధలపై అధ్యయనం చేసి తర్వాత సరాసరి యెరూషలేము వెళ్ళి శాంతి బోధలు చేసాడు. ఇంతటి మహత్కరమైన బోధలు కేవలం బౌద్ధమతం వల్లనే సాధ్యం.

    అసత్య ప్రచారం 5: యేసుక్రీస్తు నిలువ వేయబడినప్పుడు సిలువలో ఆయన స్పృహ తప్పి పడిపోగా రోమన్ సైనికులందరూ ఆయన చనిపోయాడని తలంచారు. వెంటనే ఆయన దేహమును క్రిందకు దింపి కొన్ని సుగంధద్రవ్యాలు పూయగానే ఆయన లేచి మగ్దలేనే మరియను వెంటబెట్టుకుని పోయి ఆమెను వివాహమాడి బిడ్డలను కని తన 120వ యేట చనిపోయారు. యేసుక్రీస్తు సమాధి కాశ్మీర్లో ఉన్నది. మరియమ్మ సమాధి ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది. 

       పైన ప్రస్తావించబడిన అసత్య ప్రచారాలను నిశితంగా పరిశీలిస్తే యేసుక్రీస్తు              12-30 సం.లు మధ్యకాలంలోనూ మరియు సిలువ వేయబడిన తర్వాత కూడా భారతదేశం వచ్చి అందరివలె సామాన్య మనిషిగా తన 120వ యేట చనిపోయాడని కొందరు నమ్ముతున్నారు. అసలు సిలువలో చనిపోలేదని వాదించడం ద్వారా తమ మతమే గొప్పదని ప్రకటించుకోవాలని అనేకమంది ప్రయత్నిస్తున్నారు. 

      అసత్య ప్రచారం ఏవిధంగా వీగిపోయిందో తెలుసుకొనే ముందు యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడు అనే అంశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకుందాం…

  1. లూయిస్ జకోలియట్ (1869)
  2. నికోలస్ నోటోవిచ్ (1890)
  3. మిర్జా గులామ్ అహ్మద్ (1899)
  4.  లెవీ డౌలింగ్ (1908)
  5. ఎరిక్ లుడెన్ డార్ఫ్ (1930)
  6. హాల్గర్ కర్టన్ (1984)

వీటితో పాటుగా ఈ అంశానికి సంబంధించిన కొన్ని పుస్తకాలను కూడా తెలుసుకుందాం… 

  1. Lost Years of Jesus Christ – ELIZABETH CLARE
  2. Jesus lived in India – HOLGER KERSTEN
  3. The Unknown life of Jesus Christ – NOTOVITCH
  4. Aquarian Gospel of Jesus Christ – LEVI H DOWLING
  5. The Jesus Mystery – JANET BOCK
  6. Jesus in India – MIRZA GULAM AHMAD

    యేసుక్రీస్తు దైవత్వం మీద బురదజల్లే ఈ పుస్తకాలు కొన్ని వేలల్లో అమ్ముడవుతున్నాయి. క్రైస్తవ వ్యతిరేకులైన వారందరు ఇలాంటి పుస్తకాలు కొని చాలా శ్రద్ధగా చదువుచున్నారు. ఇలాంటి పుస్తకాలు కొన్నివేలు వచ్చినా… నిజమైన విశ్వాసి యొక్క విశ్వాసాన్ని ఒక్క శాతం కూడా తగ్గించలేవు. కారణమేమంటే యేసుప్రభువునందలి విశ్వాసం లోక సంబంధమైన పుస్తకాల మీద ఆధారపడింది కాదు… అది వ్యక్తిగత అనుభవం. ఒక వ్యక్తి యేసుప్రభువు యొక్క శక్తిని, ప్రేమను రుచిచూసిన తర్వాత వెనుకకు మళ్ళే అవకాశమే లేదు. అయితే, నూతనంగా ప్రభువును తెలుసుకొని అప్పుడప్పుడే ఎదుగుచున్న వారికి ఈలాంటి పుస్తకాలు అనుమానాలు, ఆందోళనలు కలిగించవచ్చును. 

    ఈ మాటలు చదువుచున్న మీకునూ ఒకవేళ ఈ విషయమై అనుమానముంటే ఆ అనుమానాలను నివృత్తి చేయుటయే మా లక్ష్యం. యేసుక్రీస్తు కాశ్మీర్ రాలేదని, ఎలాంటి హిందూ, బౌద్దమతాశ్రమాలలో ఆయన నేర్చుకోలేదు అనే సత్యాన్ని మీకు వివరించుటయే మా మీద ఉన్న బాధ్యత. మీలో వున్న నిరీక్షణకు, విశ్వాసమునకు గల హేతువు అడుగుచున్నప్పుడు సాత్వీకంతోనూ, జ్ఞానంతోనూ సమాధానం చెప్పండి అని పరిశుద్ధ గ్రంధము తెలియచేస్తుంది. 

    యేసుప్రభువుపై బురద జల్లడం అనేది ప్రస్తుత కాలంలోనే కాదు… ఎప్పటి నుండో జరుగుచున్నదే. యేసుక్రీస్తును గూర్చి ఇన్ని ప్రశ్నలు కాదు…ఎప్పటి వేయుచున్నను క్రైస్తవులు సమాధానం చెప్పలేకపోవుచున్నారు గనుక మేము చేసే ప్రచారమంతా నిజమే అని కొందరు భావిస్తున్నారు. అయితే దేవుని బిడ్డలు శాంతిని కోరుకునేవారు, సహన శీలురు గనుకనే ఎప్పటికైనా వారే సత్యాన్ని గ్రహిస్తారని ఎదురుచూస్తున్నారు తప్ప సమాధానం చెప్పలేక కాదు. ఒకవేళ ఇటువంటి ఆరోపణలు వేరే మతాల మీదనో, మత నాయకుల మీదనో వేస్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి అనేది నిర్ద్వందం. కొన్ని సం.ల క్రితం ఒక ప్రముఖ మత నాయకుని మీద కార్టూన్ వేసినందుకు ఎన్నో గొడవలు, అల్లర్లు జరిగినాయి. కానీ, యేసుప్రభువు మీద ఇన్ని ఆరోపణలు మోపుతున్నా ఎందుకు క్రైస్తవులు మౌనంగా ఉంటుంన్నారంటే…” నీ శత్రువుని ప్రేమించి, వారి కొరకు ప్రార్ధించమని’ ప్రభువైన యేసు తెలియచేశారు గనుక. 

    విచిత్రమేమంటే పైన పేర్కొనబడిన కొన్ని పుస్తకాలను మనం గమనిస్తే వాటి రచయితలందరూ విదేశీయులే. వాటిని అనేకమంది భారతీయ హైందవ మతపెద్దలు, స్వామీజీలు, బాబాలు వారియొక్క సొంత వెబ్సైట్లలో మొదటి పేజీల్లో పొందుపరిచారు. భగవంతులుగా పిలిపించుకొన్న అనేకమంది కూడా యేసుక్రీస్తుపై బురదచల్లే కార్యక్రమాన్ని తమ భుజాలకెత్తుకున్నారు. వారిలో ఆచార్య రజనీష్ (ఓషో), సత్యసాయిబాబా, ఇంకా అనేకులు ఉండడం పెద్దగా ఆశ్యర్యపోయే విషయమేమీకాదు. 

       భారతదేశంలో ఓ పేరు గాంచిన మత పెద్ద యేసుక్రీస్తును గూర్చి తన పుస్తకాల్లో, వెబ్సైట్లో చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నవి. 

      “యేసుక్రీస్తు భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి అనేక మంది మత పెద్దల నొద్ద జ్ఞానమును, సనాతన ధర్మ విశేషాలను నేర్చుకుని తిరిగి ఇశ్రాయేలు దేశం వెళ్ళి అక్కడ బోధించారు. హిమాలయాల్లో యేసుక్రీస్తు యోగా ఉపనిషత్తులను అధ్యయనం నేర్చుకున్నారు. బెనారస్ లో చేశారు.ఒరిస్సాలోని ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన గోవర్ధన మఠంలోనే యేసుక్రీస్తు చాలాకాలం వుండి ఎంతో మనం నేర్చుకున్నారు. ఇక్కడ నేర్చుకున్న బోధలు, ఉపనిషత్తులు యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలో బోధించారు తప్ప ఆయన గొప్పదనమేమి లేదు”. 

    పైన తెలియచేసినట్టుగా యేసుక్రీస్తు భారతదేశంలో ఇన్ని ప్రాంతాల్లో తిరిగినట్టు, సంచరించినట్టు ఒక్క చారిత్రక ఆధారం కూడా లేదు. ఒరిస్సాలోని పూరీలో యేసు గోవర్ధన మఠంలో ఉన్నాడనేది ఆరోపణ అయితే ఆ మఠం ఎవరి ద్వారా, ఎప్పుడు ప్రారంభించబడిందో తెలుసుకుంటే నిజం తెలుస్తుంది. శ్రీశ్రీశ్రీ ఆదికవి శంకరాచార్యుల వారి శిష్యులు పెట్టిన వెబ్సైట్ ద్వారా చరిత్ర గమనిస్తే ఆది శంకరాచార్యులు క్రీ.శ 758-821 మధ్యకాలంలో వున్నట్లు. ఆకాలంలోనే గోవర్ధన మఠం ప్రారంభించినట్లు తెలుస్తుంది. చరిత్ర మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభువు సశరీరుడుగా ప్రత్యక్షమై, భూమ్మీద సంచరించారు. మొదటి శతాబ్దపు వ్యక్తి తొమ్మిదో శతాబ్దానికి చెందిన మఠంలో నివశించాడు అని చెప్పే వక్రబుద్ధికి ఏ పేరు పెట్టవచ్చో పాఠకులే నిర్ణయించాలి. 

          భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన మరొక స్వామీజీ చేస్తున్న ఆరోపణను కూడా గమనిద్దాం! 

      “యేసుక్రీస్తు వారణాసి, రాజగృహ తదితర పుణ్యక్షేత్రాలు దర్శించి యోగా నేర్చుకొని హిందు మరియు బౌద్ధమతములలోని విషయాలను నేర్చుకున్నారు. క్రైస్తవ్యమనేది హిందూమతము నుండి ఉద్భవించినది. ఆయన బోధల సారమంతా ఈ రెండు మతాలకు చెందినదే.” 

     పైమాటల ప్రకారం క్రైస్తవ్యం, హిందుత్వం, బౌద్ధమతం ఒక్కటేనట. యేసు క్రీస్తు బోధలన్నీ హిందూ, బౌద్ధ మతాల్లోనివేనట. అదే నిజమని మన దేశస్థులు నమ్మితే క్రైస్తవ్యమును అణచివేయాలని దాడులు ఎందుకు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బిల్లులు ఎందుకుప్రవేశపెడుతున్నారు. వాస్తవాన్ని నిశితంగా పరిశీలన చేస్తే క్రైస్తవ్యం, హిందూత్వం ఎప్పటికి ఒకటి కావు. క్రైస్తవ్యం హిందుత్వం నుండి వచ్చినది కాదు. హిందూ మతంలో ప్రాముఖ్యంగా బహు దేవతారాధన మరియు ప్రకృతి ఆరాధనకు పెద్దపీట కలదు. ప్రకృతి యందలి ప్రతీ దానిని ఆరాధించే పద్ధతి. కానీ క్రైస్తవ్యంలో ఒక్కడైయున్న దేవున్ని మాత్రమే ఆరాధిస్తారు. క్రైస్తవ్యానికి హిందు మతానికి చాలా విషయాలలో వ్యత్యాసము స్పష్టంగా కనబడుతుంది.

      ఇక బుద్ధిజం దగ్గరకు వస్తే దానికి క్రైస్తవ్యానికి ఎంతో వ్యత్యాసము కనబడుతుంది. నేపాల్ అనే దేశంలో లుంబిని నగరంలో కపిలవస్తు అనే ప్రాంతంలో గౌతమ బుద్ధుడు రాజగృహంలో జన్మించాడు. ఏ కష్టం తెలీకుండా పెరిగిన ఈయన యౌవ్వన ప్రాయంలో ఎదురైన మూడు పరిస్థితులు ఇతనిని ఆలోచింపచేసాయి. కురుపులతో నింపబడి అనారోగ్యంతో బాధపడే వ్యక్తి, నడుం వంగిపోయిన వృద్ధుడు, శవ పేటిక ఎదురువచ్చినప్పుడు జీవిత రహస్యం కోసం ఆలోచించాడు. బోధి వృక్షం క్రింద తపస్సు చేసిన కొంత కాలానికి తాను వెలుగించబడినాడని ప్రచారం చేసుకొని శిష్యులకు తన బోధలనందించడం మొదలుపెట్టాడు. అలా గౌతమ బుద్ధుడు 45 సం.ల పాటు బోధించాడు. ఆయన చనిపోయిన 400 సం ల తర్వాత ఆయన శిష్యులు గౌతముని బోధలన్ని “హినాయాన” పేరుతో పాలీ భాషలో గ్రంథస్థం చేశారు. ఆ తరువాత కొన్ని సం॥లకు అనగా క్రీ॥శ 2 వ శతాబ్ధంలో అదే గ్రంథాన్ని “మహాయాన” పేరుతో సంస్కృతంలో వ్రాశారు. ఒకసారి ఒక శిష్యుడు దేవుడున్నాడా? అని ప్రశ్నిస్తే బుద్ధుడు సమాధానం చెప్పలేదట. కేవలం భూమి మీద శాంతిగా బ్రతకడానికి చేయబడిన ఉపదేశాలు బుద్ధిజంలో కనబడతాయి. దేవుడు లేడు అని నమ్మిన సిద్ధార్ధుని ఆ తదుపరి కాలంలో దేవుణ్ణి చేసేశారు. అయితే క్రైస్తవ్యంలో ఇహలోక దీవెనలు పొందుకొనే మార్గంతో పాటు నిత్యజీవాన్ని ఎలా పొందుకోగలము… రక్షకుడైన యేసుక్రీస్తు సర్వ పాప పరిహారాన్ని ఎలా చేశారు అనే విషయాలు స్పష్టంగా కనబడుతాయి. కనుక ఎప్పటికీ క్రైస్తవ్యం, బుద్ధిజం ఒకటి కాలేవు 

    మరికొంతమంది స్వామీజీలు ఏకబిగిన చేస్తున్న మరొక ప్రచారాన్ని ఈ సందర్భములో మనము గమనించాలి. అందరు అనుకుంటున్నట్లుగా యేసుక్రీస్తు వారణాసి, హరిద్వార్ వంటి ప్రాంతాలకు రాలేదు… బీహార్ రాష్ట్రంలోని పాట్నా యందలి నలంద విశ్వవిద్యాలయంలో 16 సం॥ ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు అనేది వీరి విడ్డూర వాదన. ఎవరైన నలంద విద్యాలయంలో విద్యనభ్యసింపగోరినచో ఏకకాలమున 16 సం లు అక్కడనే యుండవలెను. అందువలన యేసుక్రీస్తు 12 నుండి 30 వరకు ఇక్కడే ఉండి విద్యాభ్యాసం చేశారని అబద్ధాలు సృష్టించారు. ఈ నలంద విశ్వవిద్యాలయం గూర్చిన కొన్ని చారిత్రక ఆధారాలు మనం గమనిస్తే నిజానిజాలు బయటపడతాయి. 

    నలంద విద్యాలయం బీహారికి సుమారు 55 మైళ్ళ దూరంలో నున్న పాట్నా నగరమునందు బౌద్ధ కేంద్రంగావున్నది. కుమారగుప్త (415-455 ఎ.డి) అనే రాజు ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి తరగతులు నిర్వహించాడు. ఇది 427 ఎ.డి నుండి 197 ఎ.డి వరకు కొనసాగించబడింది. 5వ శతాబ్ధంలో ప్రారంభించబడిన యూనివర్సిటీలో మొదటి శతాబ్దానికి చెందిన యేసుక్రీస్తు ఎలా వుండగలరు? ఎలా చదువగలరు ? అంతేకాకుండా, యేసుక్రీస్తు యోగా నేర్చుకుని సిలువపై యోగా చేసి ఎన్ని గాయాలు, దెబ్బలు అనుభవించినా యోగా ప్రభావం వలన బ్రతికినాడని చాలా ఛమత్కార కథలు, కథనాలు చెప్తున్నారు. 

     యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చారు అనే అంశానికి పునాది వేసిన వారిలో అత్యంత ప్రథముడు నికోలస్ నోటోవిచ్. ఆయన ఒక రష్యన్ జర్నలిస్ట్. 1887 వ సం॥లో భారతదేశం యొక్క పద్ధతులను ప్రాముఖ్యంగా హిందూమతం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు తెలుసుకోవాలని, అధ్యయన విషయమై భారతదేశం వచ్చాడు. అనేక సం॥లు ఇక్కడే అధ్యయనాలు చేసి తిరిగి వెళ్ళిపోయేముందు యేసు క్రీస్తు ప్రభువు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

     టిబెట్లోని “హెమిస్” అనే కొండ ప్రాంతంలోని ఒక బౌద్ధ బిక్షువును కలిసానని, ఆ భిక్షువు పాలీ భాషలో వ్రాయబడిన కొన్ని వ్రాతప్రతులను అందజేశాడని అందులో యేసును గూర్చిన సమాచారం అనగా యేసుక్రీస్తు భారతదేశం వచ్చారని, దానికి నిదర్శనాలున్నాయని చెప్పాడు. పాలీ భాషలో వ్రాయబడిన విషయాలన్నీ తర్జుమా చేసానని ‘THE UN- KNOWN LIFE OF JESUS’ అనే పుస్తకంలో రాసాడు. అంతటితోనే కాకుండా ఈ నోటోవిచ్ బౌద్ధ ఆశ్రమంలోని బౌద్ధ భిక్షువుల నాయకుని కలిసినప్పుడు ఆయన కొన్ని పత్రాలు, గ్రంథాలు ఇచ్చాడట. అందులో “ఈసా” అనే పేరు మీద గ్రంథాలు వుండటంతో యేసుక్రీస్తు ఖచ్చితంగా భారతదేశం వచ్చారని, ఇక్కడే అనేక విషయాలు నేర్చుకుని, ఆ తదుపరి ఇశ్రాయేలు దేశంలో వాటిని బోధించాడని నికోలస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని మరియు అనేక హైందవ పెద్దలు తమదైన శైలిలో పుస్తకాలు రాసి యేసుక్రీస్తు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైన విదేశీయుడు మన దేశానికి వచ్చి క్రీస్తును ప్రకటిస్తుంటే ఇది విదేశీ మతమని, పరాయిదని విమర్శలు గుప్పించేమనవాళ్ళు…నికోలస్ నోటోవిచ్ అనే విదేశీయుడు చెప్పిన ఈ విషయాన్ని ఎలా ప్రామాణికంగా చేసుకొనుచున్నారు? అంటే ఇష్టమైన దానిని ఎవ్వరు చెప్పినా ఫర్వాలేదు అంగీకరిస్తారు… లేదంటే విమర్శిస్తారు దీనినే అవకాశవాదం అంటారు.

     రామకృష్ణ పరమహంస దగ్గర వుండే శిష్యులలో ఇద్దరు అబేద్యానంద, త్రిగుణాతీతానందలు 18 వ సం॥లో టిబెట్ లోని లహాసా ప్రాంతంలోని బౌద్ధ భిక్షువుల నాయకుని కలుసుకుని నికోలస్ నోటోవిచ్ మాటలు, అతని పరిశోధనలు సరియైనవేనా అని అడిగితే ఆయన అవును అని చెప్పారట. అప్పటి నుండి మరింత విస్తృతంగా ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ వారు కూడా కొనసాగారు. 

     చరిత్ర ప్రకారం బుద్దిజం టిబెట్కు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుంటే నికోలస్ వాదన సత్యమో కాదో తెలుస్తుంది. క్రీ॥శ 7 వ శతాబ్ధంలో అప్పటి రాజు కింగ్ స్టారెన్ గాంపో (ఎ.డి 700) బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మత పుస్తకాలను టిబెట్కు పరిచయం చేసాడు. అంటే అంతకుముందు టిబెట్లో బుద్ధిజం లేదన్నమాట. టిబెట్లో బుద్దిజమే లేనప్పుడు యేసు ప్రభువు ఎవరి దగ్గర విద్యాభ్యాసం చేసుంటారు? మొదటి శతాబ్దంలో టిబెట్ బౌద్ధాశ్రమాలే లేనప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్పడం అబద్దం కాకపోతే మరేమిటి? వాస్తవానికి మొదటి శతాబ్దంలో టిబెట్లో “బాస్ మతం” చెలామణిలో యుండేది. దీనికి బుద్దిజమ్కు ఏమాత్రం సంబంధం లేదు. 

    తరువాతి కాలంలో నికోలస్ నోటోవిచ్ చేసిన అధ్యయనాలలో ఎంతవరకు వాస్తవమో తెలుసుకొనుటకు ఆర్చిబాల్డ్ డగ్లస్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు ప్రారంభించారు. ఏ ప్రాంతంలో అయితే నికోలస్ నోటోవిచ్కు పాలీ భాషలో వ్రాయబడిన వ్రాతప్రతులు లభించాయని తెలియజేశాడో ఆ బుద్ధాశ్రమమునకు వెళ్ళి అక్కడి భిక్షువుల నాయకుని కలుసుకొనినప్పుడు ఆ భిక్షు నాయకుడు చెప్పిన మాటలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాయి. అసలు “నికోలస్ నోటోవిచ్” అనే వ్యక్తి తమ ప్రాంతానికి రాలేదని అక్కడ పాలీ భాషలో వ్రాయబడిన ఏ వ్రాతప్రతులను ఆయన సేకరించలేదని ఆయన తెలియజేసాడు. ఆర్చిబాల్డ్ డగ్లస్ ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయగా ఎన్నో కథనాలు ప్రచురించిన నోటోవిచ్ నుండి గానీ, ఆయన అనుచరులనుండి గాని ఏ మాత్రం సమాధానం రాలేదు. వాస్తవాలు, నిజాలు బయటపడినప్పుడు ఏ ఒక్కరు దానికి వ్యతిరేకముగా నిలువలేరు కదా! దీనితో ఈ కధలన్నీ నికోలస్ తన పేరుప్రఖ్యాతుల కొరకు యేసుక్రీస్తుపై బురదజల్లే ప్రయత్నంలో భాగమేనని, అతని మాటలన్నియు బూటకపుమాటలేనని ప్రపంచానికి అర్థమైంది. ఈ విషయాలు జరిగిన తర్వాత నోటోవిచ్ కూడా సత్యాన్ని అంగీకరించక తప్పలేదు. 

యేసుక్రీస్తు భారతదేశం రాలేదు

అనడానికి బైబిల్ లో ఉన్న ఋజువులు

      యేసుక్రీస్తు కాశ్మీర్ రాలేదు అనే విషయాన్ని గురించి బైబిల్ ఏమి చెబుతుందో శ్రద్ధగా గమనించి వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఎందుకనగా, ప్రస్తుత ప్రపంచంలో బైబిల్ గ్రంథరాజ్యంగా పిలువబడుతుంది. సృష్టి ఆది మొదలుకొని జరిగిన సంగతులన్నిటిని బైబిల్లో స్పష్టంగా చూడగలము. అందులో వ్రాయబడిన విషయాలన్నీ సత్యానికి ప్రామాణికంగా కనబడుచున్నవి. అందును బట్టి బైబిల్ను ఒక్క మాటలో చెప్పాలంటే… The Bible is the History and the Bible is the mystery. బైబిల్ చరిత్ర మరియు మర్మము. 

1. బైబిల్లో లో ఉన్న సువార్తలలో ఎక్కడా ఈ విషయం ప్రస్థావించబడలేదు

      బైబిల్లో లోని క్రొత్త నిబంధనలో 4 సువార్తలు కలవు. అవేమనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నలుగురు సువార్తికులు యేసుక్రీస్తును ఆయా రీతులుగా పరిచయం చేశారు. మత్తయి యేసుక్రీస్తును రాజుగా, మార్కు పరిచారకునిగా, లూకా మనుష్యకుమారునిగా మరియు యోహాను దైవకుమారునిగా పరిచయం చేశారు. 

     వీరందరు యేసుక్రీస్తు యొక్క జననం, దివ్య బోధలు, అద్భుత కార్యములు మరియు మరణ పునరుత్థానములను గూర్చి చాలా స్పష్టంగా వ్రాసినారు. అయితే ఎక్కడ కూడా యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చారని ప్రస్తావించలేదు. 

    యేసుక్రీస్తు 12 సం వయస్సు నుండి 30 సం॥ వయస్సు వరకు ఇశ్రాయేలు దేశంలోనే వున్నారనుటకు బైబిల్లో లో అనేకమైన వాక్యాధారములు కలవు. ఇశ్రాయేలు దేశాన్ని యూదయ, సమరయ, గలిలయ అను 3 భాగాలుగా విభజించవచ్చు. యేసుక్రీస్తు యూదయలో జన్మించి గలిలయలోని నజరేతు అనే ప్రాంతంలోనే 12 నుండి 30 సం ల వరకు నివసించినట్లు లేఖనాధారములున్నవి. 

     లూకా 2:52 “యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్థిల్లుచుండెను. 

     ఆ పై వచనం కూడా చదివితే ఆయన నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి యుండెను అని వ్రాయబడియుంది. యేసు 12 యేళ్ళ ప్రాయంలో యెరూషలేమునందలి శాస్త్రులతో, పరిసయ్యులతో వాదించెను. ఆ తర్వాత “యేను బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 సం వయస్సు గలవాడు” ( లూకా 3:23)

      యేసుక్రీస్తు 12 నుండి 30 వరకు ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నారు అని చెప్పడానికి ఓ అద్భుత వచనం… లూకా 4:16 – ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళి ….ఇక్కడ వాడుక చొప్పున అనే మాటను గమనించాలి. వాడుక అనగా క్రమంగా చేసే పని, లేదా అలవాటుగా చేసే పని. యేసుక్రీస్తు నజరేతులోనే ఉంటూ ప్రతి విశ్రాంతి దినమున బోధింప సాగెను. ఇది ఆయన రెగ్యులర్గా చేయు పని. దీనిని బట్టి అర్థమవుతుంది ఆయన కాశ్మీర్ రాలేదు, నజరేతులోనే యుండి తల్లిదండ్రులకు లోబడుతూ, ఆ ప్రాంత ప్రజల దయను సంపాదించుకొనుచూ జీవించినారు అని. యేసుక్రీస్తును గూర్చిన వివరణ బైబిల్ నందలి కేవలం 4 సువార్తలయందు మాత్రమే కాక 5000 మంది సువార్తికులు వ్రాసిన సువార్తలయందు కూడా పొందుపరచబడినది. మరియు క్రొత్త నిబంధనకు సంబంధించిన 25,000 మూలప్రతులు ఇప్పటికిని భూమి మీద అందుబాటులో వున్నవి. అయితే ఏ సువార్తలో గానీ, ఏ మూలప్రతిలో గానీ యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చారని వ్రాయబడలేదు. 

     ఈ సువార్త గ్రంథాలు ఎప్పుడు రచించబడినవి అని అనేకులకు అనుమానం రావచ్చు. వాటిని మేమెలా నమ్మగలము అని ప్రశ్నించవచ్చు. ఈనాడు ప్రపంచంలో మతగ్రంథాలు, గొప్ప గ్రంథాలుగా పిలువబడుచున్న పుస్తకాలన్నియు సంఘటనలు జరిగిపోయిన కొన్ని వందల సం॥ల తర్వాత గ్రంథస్థం చేయబడినవి. వాటిలో ఏ మాత్రమును ఖచ్చితత్వం లేదు. కానీ, ఈ సువార్తలు, మరియు బైబిల్ నందలి మిగిలిన పత్రికలు దాదాపుగా యేసుక్రీస్తు చనిపోయి పునరుత్థానుడై పరలోకమునకు ఆరోహణమైన 20 నుండి 40 సం॥ లోపే వ్రాయబడినవి. 

      మత్తయి మరియు మార్కు సువార్తలు యేసుక్రీస్తు ఆరోహణమైన 20సం॥ లోపే వ్రాయబడినవి. లూకా, యోహాను సువార్తలు మరియు పౌలు 14 పత్రికలు, పేతురు పత్రికలు మరియు మిగతా పత్రికలన్నియు క్రీ॥శ 70 లోపే వ్రాయబడ్డాయి. ఎందుకంటే క్రీ.శ 70 వ సం॥లో రోమన్ చక్రవర్తి టైటస్ యెరూషలేములో భయంకరమైన వధ, హింస కల్గించినాడు. ఈ కాలంలోనే అనేకులు హతసాక్షులుగా చనిపోయారు. ఈ విషయాన్ని ఏ సువార్తికుడు ప్రస్థావించలేదు కాబట్టి సువార్తలు, పత్రికలు ఈ సంఘటనకు ముందే  వ్రాయబడ్డాయి అని మనం గమనించాలి. ఇంతటి ఖచ్చితత్వాన్ని, చారిత్రాత్మకాధారాలు కలిగిన బైబిల్ నందు ఎక్కడా కూడా యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చారు అనే విషయం 

2. బైబిల్ గ్రంధకర్తయైన పరిశుద్ధాత్ముడు ఏ విషయాన్ని దాచిపెట్టలేదు

    బైబిల్ గ్రంథం 1600 సం॥ చరిత్ర కలిగి సుమారు 40 మంది వ్యక్తులచేత వ్రాయబడినది. అంతమంది గ్రంథకర్తలు వ్రాసిననూ వ్రాయించినవాడు మాత్రం దేవుడే. దేవుడు తన ఆత్మద్వారా ప్రవక్తలను ప్రేరేపించి ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. పరిశుద్దాత్ముడు ఒక వ్యక్తిని గూర్చి గాని, విషయాన్ని గూర్చి గాని ప్రస్తావించినప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా వ్రాయించినాడే గాని దాచిపెట్టి మరుగు చేయలేదు. ఒక వ్యక్తిలోని మంచి లక్షణాలు మాత్రమే కాకుండా చెడును కూడా చాలా స్పష్టంగా వ్రాయించాడు. మెట్టుకు కొన్ని విషయాలు గమనిద్దాం….. 

     విశ్వాసులకు తండ్రిగా, ఆశీర్వాదకారకునిగా, దేవుని స్నేహితునిగా పిలువబడిన అబ్రాహామును గూర్చిన చిన్న తప్పిదమును కూడా బయలుపరిచాడు. అనగా అబ్రాహాము యొక్క గొప్పతనమే కాదు కానీ అతని పొరపాటును కూడా చూపించాడు. ఇశ్రాయేలీయులనందరినీ నడిపించుటకు సామర్థ్యం గల నాయకునిగా దేవునిచే ఎన్నుకోబడిన, ఎంచబడిన మోషే విషయంలో కూడా దేవుడు పక్షపాతం చూపలేదు. అంతగా వాడబడిన మోషే ఒక విషయంలో కానిమాట మాట్లాడినందుకు దేవుడు ఆ విషయాన్ని కూడా బయలుపరిచినాడు. దేవుని హృదయానుసారునిగా పేరొందిన దావీదు ఒక స్త్రీ విషయంలో చేసిన అతిక్రమమును కూడా దేవుడు తెలియజేశాడు. 

     ఇలా ఒక వ్యక్తి మంచినే గాక వారిలోనున్న తప్పిదాలను కూడా చూపించి తానెంత పవిత్రుడో, ఖచ్చితమైనవాడో తెలియపరచుకున్నాడు పరిశుద్దాత్ముడు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 2 సం ల వయస్సులో ఉన్నవారందరిని చంపివేయాలన్న హేరోదు ఆజ్ఞ వలన మరియ, యోసేపు మరియు యేసుక్రీస్తు లు ఐగుప్తుకు వెళ్ళి 2 సంలు ఉన్నారని అంత ఖచ్చితంగా రాయించిన పరిశుద్ధాత్ముడు… యేసుక్రీస్తు ఒకవేళ 18 సం॥లు అనగా 12- 30 సం లు కాశ్మీరు వచ్చియుంటే ఖచ్చితంగా బైబిల్ లో వ్రాయించేవారే కదా!

3. అనంత జ్ఞాన సంపన్నుడు మరొకరి యొద్ద జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు 

    యేసుక్రీస్తుకు కాశ్మీర్ లేదా భారతదేశంలోని అనేక ప్రాంతాలు దర్శించి జ్ఞానం సంపాదించవలసిన అవసరం లేదు. ఆయన జ్ఞానము అపరిమితం. యేసుక్రీస్తు యొక్క ఆనాటి శాస్త్రులు, జ్ఞానులే జ్ఞానం, ప్రజ్ఞను చూచి ఆశ్చర్యపోయారు ( లూకా 2:42-47). ఆయన ఆలోచనశక్తి, అధికబుద్ధిని అనుగ్రహించువాడు (యెషయా 28:29). ఇలాంటి దేవునికి మానవ జ్ఞానం సంపాదించుకోవలసిన అవసరం ఏముంది? మానవుని జ్ఞానం పరిమితులు గలది. యేసుక్రీస్తు 2000 సం లు క్రితం ఈలోకానికి సశరీరునిగా, నరావతారునిగా వచ్చారేగాని వాస్తవానికి ఆయన సృష్టికి ముందే ఉన్నారు. అబ్రాహాము కంటే ముందున్నవాడు (యోహాను 8:58). ఎందుకంటే ఆయనే సృష్టికర్త. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈలాంటి సృష్టికర్తయైన దేవునికి మానవుని పరిమిత జ్ఞానం నేర్చుకోవలసిన అవసరం లేదు. 

4. యేసు క్రీస్తు భారతదేశం వెళ్తారు అనే ఒక్క ప్రవచనం కూడా బైబిల్లో లేదు

     యేసుక్రీస్తు కాశ్మీరు రాలేదు అనుటకు మరియొక బైబిల్ ఆధారం బైబిల్లో వ్రాయబడిన ప్రవచనములే. బైబిల్ నందు గల 1600 సం॥ల చరిత్రలో అనేకమంది ప్రవక్తలు కలరు. పాతనింబంధనలో యేసుక్రీస్తు యొక్క జీవితమును గూర్చి అందలి ప్రతీ సందర్భమును గూర్చి ప్రవక్తలు ప్రవచించారు. యేసుక్రీస్తు కన్యకకు జన్మిస్తాడని, యూదయ బెత్లహేములో జన్మిస్తాడని, ఆ సమయంలో రామాలో అంగలార్పు ఆ వినబడునని, యేసుప్రభు మరణం, పునరుత్థానం మరియు రెండవరాకడ ఇత్యాది విషయాల గూర్చి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. మొత్తం బైబిల్ లో సుమారు 2500 ప్రవచనాలు వుండగా అందులో ఇప్పటికే 2000 ప్రవచనాల నెరవేర్పు జరిగింది. ఇంకా 500 ప్రవచనాలు నెరవేరవలసి యున్నవి. వాటిలో యేసుక్రీస్తు మొదటి ఆగమనం గూర్చి చెప్పబడిన 109 ప్రవచనాలు తు.చ తప్పకుండా నెరవేరాయి. అయితే ఇన్ని ప్రవచనాలలో ఏ ఒక్కటైనా యేసుక్రీస్తు కాశ్మీర్ వస్తారని లేదు. ఒకవేళ యేసు భారతదేశం వచ్చియుంటే విషయానికి సంబంధించిన ప్రవచనం ఖచ్చితంగా పాత నిబంధనలో ఉండి తీరాల్సిందే. 

5. యేసు క్రీస్తు కాశ్మీరు రాలేదు అనడానికి ఆయన బోధలే సాక్ష్యము

    యేసుక్రీస్తు కాశ్మీర్ రాలేదనుటకు గల మరియొక వాక్యాధారము యేసుక్రీస్తు చేసిన బోధలే.. ఈలోకంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు అద్భుతమైన, ఉజ్జీవమైన మానవజీవిత పరమార్ధమును తెలియజేయు బోధలు చేసారు. పరలోక విషయాలు, దేవుని సంగతులు భూలోకవిషయాలతో పోల్చి ఉపమాన రీతిగా శిష్యులకు, ఆనాటి ప్రజలకు బోధించెను. ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో బోధలు చేసారు. అయితే ఆచరణలో పెట్టకుండానే వాటిని బోధించేవారు. అందుకనే వారి బోధలు వారితోనే అంతమైపోయాయి. ఒకవేళ యేసుక్రీస్తు 18 సం.లు కాశ్మీర్ వచ్చి అక్కడి పద్ధతులు, ఆచారాలు, యోగా, జ్ఞానం నేర్చుకున్నట్లయితే వాటినే శిష్యులకు, ప్రజలకు బోధించి వుండేవారు. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు. ఆయన బోధలలో ఎక్కువగా పాతనిబంధనలోని అనేకమైన పరిస్థితులను గూర్చి, వ్యక్తులను గూర్చి మాట్లాడారు కానీ ఎక్కడా హిందూమతం గూర్చిగానీ, బుద్ధిజం గూర్చిగానీ, యోగా గూర్చిగానీ మాట్లాడలేదు. కారణం ఆయన కాశ్మీర్ వెళ్ళలేదు కాబట్టి. ఏనాడు కూడా ఆయన తన బోధలలో కాశ్మీర్ను గూర్చిన ప్రస్తావన తేలేదు. 

6. యేసు క్రీస్తును విమర్శించిన శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఈవిషయాన్ని ప్రస్తావించలేదు.

    ఎంతోమంది ఆయనను వెంబడిస్తూవుండేవారు. స్వస్థతలకొరకు, ఆయన మాటలు వినడానికి కొందరు, ఆయనను చూడడానికి కొందరు వస్తూండేవారు. మరికొందరైతే ప్రశ్నలువేసి ఏదోరకంగా అవమానపరచవలెనని వస్తూండేవారు. అయితే యేసుక్రీస్తు తనదైన శైలిలో వారికి సమాధానమిచ్చుట ద్వారా వారేమియు మాట్లాడలేకయుండెడివారు. అయితే ఆ కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుండేవారు. దానికి కారణం అనేకులు యేసయ్యను అభిమానిస్తూ, ప్రేమిస్తూ ఆయన వెంబడి వెళ్ళడమే. అలాంటి శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఏనాడూ తమ మాటల్లో కూడా యేసుక్రీస్తు కాశ్మీర్ వెళ్ళి 18 సంలు అక్కడే వుండి జ్ఞానం నేర్చుకున్నారు అని చెప్పలేదు. ఒకవేళ యేసుక్రీస్తు నిజంగా ఆ 18 సం॥లు కాశ్మీర్లో ఉండినట్లయితే ఖచ్చితంగా అదే అదనుగా చేసుకొని శాస్త్రులు, పరిసయ్యులు కనీసం 3 1/2 సం లు కూడా పరిచర్య చేయనిచ్చెడివారు కాదు. కానీ వారి మాటల్లో ఎన్నడు ఆ ప్రస్తావన రాలేదు.

7. ఆనాటి ప్రజల సాక్ష్యాలే యేసు కాశ్మీరు రాలేదనడానికి నిదర్శనాలు

    మార్కు 6:2-4 లో విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి – ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.

   ఈ వచనం నుండి ఒక విషయం గమనించాలి. అదేమంటే తన ఈ తండ్రియైన యోసేపు యొక్క వృత్తి పనిలో యేసుక్రీస్తు సహకరిస్తూ, వారి మధ్యే పెరిగాడు. ఇప్పటికీ నజరేతులో యోసేపు పని చేసిన స్థలం, మరియ గృహం మొదలగు ఆధారాలున్నాయి. ఇలాంటి నజరేతువాడైన యేసుక్రీస్తు బోధలు అంగీకరించడానికి అభ్యంతరపడినారంటేనే అర్ధమౌతుంది యేసయ్య కాశ్మీర్ వెళ్ళలేదు నజరేతులోనే ప్రజల మధ్యలోనే నివసించినాడని. అందును బట్టే “ప్రవక్త తన స్వంత దేశములో ఘనుడు కాడు” అని చెప్పవలసి వచ్చెను.

8. ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారులెవ్వరు ఈ విషయాన్ని వ్రాయలేదు

   అయితే బైబిల్ క్రైస్తవుల పుస్తకమనో, ఏదో కారణం చేత నమ్మలేని వారు మొదటి, రెండవ శతాబ్దాలకు చెందిన కొంతమంది చరిత్రకారుల అభిప్రాయాలను నిశితంగా పరిశీలిస్తే సత్యం అవగాహనకు వస్తుంది. యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చారని ఏ చరిత్రకారుడు కూడా తమ పుస్తకాలలో ప్రస్తావించలేదు. అలాంటి గొప్ప చరిత్రకారులలో కొందరిని గమనిద్దాం. 

1. ఫ్లావియస్ జోసిఫస్ (37-100 ఎ.డి)

   ఈయన యూదా చరిత్రకారుడు. అయినప్పటికీ రోమన్ ప్రభుత్వంలో ముగ్గురు చక్రవర్తుల దగ్గర పనిచేసినాడు. అనేక చారిత్రక గ్రంథాలు వ్రాశాడు. అందులో యేసుక్రీస్తు జీవితం గూర్చి కూడా వ్రాశాడు. కానీ ఎక్కడా కూడా యేసుక్రీస్తు కాశ్మీర్ పర్యటన ప్రస్తావించలేదు. 

2. టాసిటస్ (56–117 ఎ.డి)

   ఈయన రోమన్ గవర్నమెంట్లో సెనేటర్గా పనిచేస్తూ అనేక చరిత్ర గ్రంథాలు వ్రాశాడు. 

3. సుటోనియస్ (69-130 ఎ.డి)

   ఈయన రోమన్ సామ్రాజ్యంలో చరిత్రకారుడు. రోమన్ చరిత్రకారుల బయోగ్రఫీలను, మరికొన్ని పుస్తకాలను వ్రాసినాడు. జూలియస్ సీజర్ నుండి డోమీషియన్ వంటి అనేక రోమన్ చక్రవర్తుల జీవితాలను తన గ్రంథాలలో వ్రాశాడు. 

4. ప్లినీ ద యంగర్ (61-112 ఎ.డి)

     ఈయన ట్రాజన్ అనే రాజు దగ్గర మెజిస్ట్రేట్ పనిచేసి చరిత్రను తన గ్రంథాలలో పదిలపరిచినాడు.

5. లూసియన్ (125-180 ఎ.డి) 

    ఈయనను అస్సీరియన్ నోవలిస్ట్ అని పిలుస్తారు. గ్రీకు చరిత్రకారుడైన ఈ వ్యక్తి గ్రీకు రాజుల చరిత్ర, గ్రీకు దేశ చరిత్రను వ్రాశాడు. 

6. ఎపిక్టస్ (55–135 ఎ.డి)

ఈయన గ్రీకు దేశమునకు చెందిన చరిత్రకారుడు. గ్రీకు ఫిలాసఫర్.

7. గాలెనస్ (130-200 ఎ.డి)  

ఈయన టర్కీ దేశానికి చెందిన ఫిజీషియన్, సర్జన్ మరియు ఫిలాసఫర్. టర్కీదేశానికి చెందిన చరిత్రను ఈయన పొందుపరిచినాడు. 

8. యుబియస్ (263-339 ఎ.డి)

   ఈయన రెండు పుస్తకాలను వ్రాసి చరిత్రను పొందుపరిచినాడు. 1.Demonstration of the Gospel 2. Preparation of Gospel.

     మొదటి రెండు శతాబ్దాలలో ఉన్న చరిత్రకారులెవ్వరూ కూడా యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చాడని ప్రస్తావించలేదు. 

యేసు క్రీస్తు సిలువ నుండి తప్పించుకొని భారతదేశం వచ్చి కాశ్మీరులో

తల దాచుకున్నారా? ఇప్పుడు కాశ్మీరులో ఉన్న సమాధి ఎవరిది? 

   ఇంతవరకు మనం చదివిన అంశాలన్నింటిని బట్టి యేసుక్రీస్తు 12 నుండి 30 సం.ల వరకు కాశ్మీర్ రాలేదని మనకు తెలియుచున్నది. అయితే ప్రపంచంలో చెలామణిలో ఉన్న ఈ విషయాలను సమర్ధించగలిగిన సరైన వాస్తవాలు లేవు గనుక మరియొక వాదన ప్రపంచంలోకి తీసుకువచ్చినారు అదేమంటే, యేసుక్రీస్తు సిలువపై చనిపోలేదు… ఆయన ఎన్ని దెబ్బలు అనుభవించినా అవన్నియు సహించుకుని తర్వాత సిలువ నుండి దిగి భారతదేశానికి వచ్చి 120 సం॥లు బ్రతికినాడు. కాశ్మీర్లోనే యేసుక్రీస్తు సమాధి కూడా కలదు అని కొందరు వాదిస్తున్నారు. అసలు ఈ సిద్ధాంతానికి మూలపురుషుడు హోల్గర్ కిల్స్టన్. “JESUS LIVED IN INDIA” అనే ఈ పుస్తకమును ఈయన వ్రాసి ఇత్యాది అవాస్తవాలను పొందుపరిచి ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకాలను విడుదల చేసారు. భారతదేశంలోని కాశ్మీర్లో యేసుక్రీస్తు సమాధి ఉ న్నదని, పాకిస్తాన్ లోని ముర్రే అనే ప్రాంతంలో తల్లియైన మరియ సమాధి ఉందని వ్రాయడమే గాక బైబిల్లో వ్రాయబడిన వాగ్దాన భూమి కాశ్మీరే అని వ్రాసుకొంటూ వచ్చాడు. 

     ఇదే అంశాన్ని పైకి లేవనెత్తిన మరియొక వ్యక్తి మిర్జా గులామ్ అహ్మద్. ఈయన అహ్మదీయ ముస్లిమ్ జమాత్ అనే సంస్థను 1989వ సం లో ప్రారంభించాడు. ముస్లింలందరు తమను పరిపాలించే ఒక మెస్సయ్య లేదా మెహదీ వస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి ఆ మెహదీ తనేనని పరిచయం చేసుకొని కొంతమంది శిష్యులను ఏర్పాటుచేసుకున్నాడు. ఈయన బోధలకు అనేకులు ఆకర్షితులై ఆ సంస్థలో చేరారు. ఈయన యేసుక్రీస్తు గుణగణాలన్ని తనలో కలిగియున్నాడని చెప్పుకొనేవాడు. ఇలా ఆకర్షింపబడిన వారిలో మసూద్ అనే వ్యక్తి ఎంతో ప్రభావితుడైనాడు. కానీ, తర్వాత దినములలో గులామ్ బోధలలో తప్పులున్నాయని తెలియజేయ ప్రయత్నం చేశాడు. అప్పుడు గులామ్ యొక్క అనుచరులు మసూదు చంప ప్రయత్నించగా ఈయన అమెరికాకు వెళ్ళి ఒక పుస్తకాన్ని వ్రాశాడు. ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలతో నింపబడిన గులామ్ బోధలను ముస్లిమ్ వర్గంవారే అంగీకరించలేదు. ఇలాంటి వ్యక్తి “JESUS IN INDIA” అనే పేరున ఒక పుస్తకం వ్రాసి అందులో యేసుక్రీస్తు సమాధి కాశ్మీర్లో ఉన్నదని చెప్పాడు. 

   ఇలా అనేకమంది సెలవిస్తున్నట్లుగా యేసుక్రీస్తు సమాధి నిజంగా కాశ్మీరులో ఉందా? లేకపోతే కాశ్మీర్లోని ఈ సమాధి ఎవరిది? 

     కాశ్మీర్లోని శ్రీనగర్ నందు రోజబుల్ షైన్ ప్రాంతమునందు రెండు సమాధులు కలవు. ఈ సమాధులు యేసుప్రభువునకు సంబంధించినవి కావు. అందులో ఒకటి మధ్యయుగానికి చెందిన మహ్మదీయ మత నాయకుడు జియారతి హజరత్ యూజ్ఞసూఫ్. ఇతనిని యూస్ అసూఫ్ అనియు, రోజ్బాల్ అనియు పిలుస్తారు. మరియొక సమాధి క్రీ.శ 400 సం॥లకు చెందిన మీర్ సయ్యిద్ నజీరుద్దీన్ అనే ప్రవక్త యొక్క సమాధి. అయితే, యేసుప్రభువు సమాధి అని ప్రపంచానికి చాటి చెప్పి ఈ ప్రాంతాన్ని టూరిజమ్ స్పాట్గా చేసి ధనార్జన చేయాలని 1924వ సం॥లో ఫిదా హస్నాయిన్ అనే వ్యక్తి ఈ రకమైన ప్రచారం మొదలు పెట్టాడు తప్ప ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. 

    హోల్గర్ కిరన్ అనే వ్యక్తి నోటోవిచ్ యొక్క పుస్తకాలను ఆధారం చేసుకొని కేవలం రెండు వారాలు మాత్రమే కాశ్మీర్ లో పర్యటించి ఈలాంటి అసత్య విషయాలను, పుస్తకాలను చేస్తే అవి ఎంత వరకు నిజాలుగా ఉండగలవు. మార్చి 27, 2010వ సం॥లో బిబిసి అనే అంతర్జాతీయ ఛానెల్లో శామ్ మిల్లర్ అనే వ్యక్తి హోల్డర్ యొక్క పరిశోధనలన్నీ అవాస్తవాలని బహిరంగంగా చెప్పినాడు. 

       ప్రభువునందు ప్రియులారా ! చివరగా నేను చెప్పాలనుకొంటున్న విషయమేమంటే ఈ శీర్షికను బాగా చదవండి… సత్యాన్ని గ్రహించండి… అనేకులతో చర్చించండి… ఈ విషయంలో వాదించేవారికి సమాధానం చెప్పండి. 

యెరూషలేములోని యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఆయన నరావతారిగా నున్న కాలమంతా ఇశ్రాయేలులోనే ఉండి మన కొరకు మరణించి మరణం నుండి తిరిగి లేచి, మనకొరకు మరలా రాబోవుచున్నారు. హల్లెలూయ! 


if you want to know about false prophets please click here

 

 

 

 

 

 

 

                              

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1 thought on “Did Jesus Christ come to India?యేసుక్రీస్తు భారతదేశం వచ్చాడా?|telugu christian nessege |2023”

Leave a comment

error: dont try to copy others subjcet.