యోసేపు కుమారులు – Sons of Joseph – Christian Telugu Messages – Bible

యోసేపు కుమారులు  (ఆది 41:50-52) 

Sons of Joseph

 యోసేపు యాకోబునకు పదకొండవ కుమారుడు. యోసేపు చరిత్ర విశ్వాసుల జీవితమునకు అలాగే యవ్వనులైన వారికి గొప్ప సవాలుగా యున్నది. పా. ని. లోని యోసేపు క్రొ.ని లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా యున్నాడు. యోసేపు తండ్రికి ప్రియ కుమారుడుగా ఉండి తన అన్నలచేత 20 వెండి నాణెములకు అమ్మబడెను. అయినను ప్రభువు అతనికి తోడైయుండి ఐగుప్తు దేశమునకు అధిపతిగా చేసెను (అ.కా. 7:9-10). అక్కడ యోసేపునకు ఇద్దరు కుమారులు కలిగిరి. పెద్దకుమారుని పేరు మనష్హే. చిన్న కుమారుని పేరు ఎఫ్రాయిము. 

 మనష్హే: ఆది 41:51. మనష్హే అనగా మరచుట అని అర్ధము. ఈ పేరు యోసేపు ఒక మంచి అర్థముతో పెట్టెను. దేవుడు నా సమస్త బాధను, అన్నలు చేసిన కీడును మరచిపోవునట్లు చేసెను అని ఈ పేరు పెట్టెను. మన పిల్లలకు మనము అర్థముతో కూడిన పేరులు పెట్టవలెను. నా గ్రామములో ఒక తండ్రి తన ఇద్దరు కుమారులకు పెద్ద అబద్ధము, చిన్న అబద్ధము అను పేరులు పెట్టెను. వారు ఇప్పటికి అబద్ధములాడుచు తిరుగుచున్నారు. మరికొంత మంది అయితే వారి పిల్లలకు చనిపోయినవారి తల్లిదండ్రుల పేర్లు లేక బంధువుల పేర్లు పెట్టుదురు. యోసేపు బాధలు కీడులు మరచిపోయాడు. నీవు రక్షింపబడినప్పుడు శ్రమలు వచ్చును. సద్భక్తితో బ్రదుకువారికి హింసలు వచ్చును (2 తిమో 3:12). అయినను ప్రభువు యోసేపునకు తోడుగా యున్నాడు. యదార్థవంతులకు ఆయన తోడుగా యుండును (సామె 3:32). ఆశీర్వాదము పొందవలెనంటే పాపమును ఒప్పుకోవాలి, విడచిపెట్టాలి. మరచిపోవాలి. 

 ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడచినప్పటికి వారు ఐగుప్తును మరువలేదు (సంఖ్య 11:5). మాటిమాటికి వారు ఐగుప్తును జ్ఞాపకం చేసుకొనిరి. ఐగుప్తులో మేము దోసకాయలు, ఉల్లిగడ్డలు, కీరకాయలు, ఉచితముగా తిన్నాము అని గొప్పలు చెప్పుకొనుచున్నారు. వాస్తవముగా వారు ఐగుప్తులో దెబ్బలు తిన్నారు. ఫరో వారిని హింసించాడు. ఈ దినములలో కొంతమంది డాంభికులు బయలుదేరారు. వారు ఎంతసేపు తమ్మును గూర్చి గొప్పగా లేనివి ఉన్నట్లుగా గొప్పలు చెప్పుదురు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు (కీర్తన 5:5). వారు ఐగుప్తును తమతో తీసుకువెళ్ళిరి. సహోదరుడా! నీవు ప్రభువును వెంబడించుచున్నప్పటికి పాపమును నీవెంట తీసుకు వెళ్ళుచున్నావా? ప్రభువును రుచిచూచిన తదుపరి సమస్త దుష్టత్వమును, వేషధారణను, కపటమును, అసూయ, దూషణ మాటలను మానవలసియున్నావు (1 పేతు 2:1-3). లోతు భార్య సాదొమను మరువలేదు (ఆది 19:26). వెనుకకు తిరిగి ఉప్పు స్తంభమాయెను. నీవు లోతు భార్యవలె లోకమువైపు తిరిగి కుటుంబమునకు, దేవునికి దుఃఖకరముగా యున్నావా? పరిశీలించుకొనుము. నీతిమంతుడు విశ్వాసములముగా జీవించునుగాని వెనుదీయడు (హెబ్రీ 10:38). అయితే ప్రభువు బిడ్డలు కొన్ని మరువకూడదు. మొదటిగా ప్రభువును మర్చిపోకూడదు (ద్వితి.కా. 32:18). ఆయన మన సృష్టికర్త. రెండవది చేసిన మేలు మరువకూడదు. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసికొనెను (ఆది 41:9). దేవుని ధర్మశాస్త్రమును మరువకూడదు (కీర్త 119:153). 

 ఎఫ్రాయిము (ఆది.కా. 41:52) : ఎఫ్రాయిము అను మాటకు అభివృద్ధి అని అర్థము. దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని ఎఫ్రాయము అను పేరు పెట్టెను. పాపము నుండి, మరలి దానిని మర్చిపోయినపుడు మనము అభివృద్ధి పొందగలము. దేవునియందు భయభక్తులు గలిగిన కుటుంబములను ప్రభువు అభివృద్ధి చేయును (కీర్త 115:14). యాకోబు కుటుంబము తమ్మును తాము శుచిపర్చుకొని, అన్యదేవతలను పారవేసి బేతేలుకు వెళ్ళినపుడు అభివృద్ధి పొందెను (ఆది 35:11). చాలామంది విశ్వాసులు రక్షించబడినప్పటికి లోక స్నేహము, ధనాపేక్ష మరియు శరీరాశలు విడువనందున అభివృద్ధి పొందలేకపోవుచున్నారు. పరిశుద్ధ గ్రంథములో ఏయే విషయములలో మనము అభివృద్ధి పొందవలెనో తెలుపబడియున్నది. Sons of Joseph

 దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి (కొలస్పై 1:12) : జ్ఞానము రెండు రకములు. ఒకటి లోక జ్ఞానము. దానినే భూసంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము వంటిది (యాకోబు 3:15). మనుష్యులు లోక జ్ఞానమును సంపాదించి ఒకరిని ఒకరు మోసము చేసుకొనుచున్నారు. పెద్ద ఉద్యోగి చిన్న ఉద్యోగిని మోసపర్చుచున్నాడు. సాతాను పెద్ద మోసగాడు. ఆదిలో వాడు హవ్వను మోసగించెను (॥ కొరి 11:3). కొంతమంది ధన మోసములో పడుదురు. ఒక ట్రావెల్ ఏజెంటు అమాయకుడైన ఒక వ్యక్తికి కువైట్ ఎరచూపి రూ. 70,000/- లు నీవు ఇచ్చినచో కువైట్లో నీకు నెలకు రూ.50,000/- జీతము ఇచ్చునని అబద్ధము చెప్పెను. చివరకు డబ్బు తీసుకొని ముంబాయి నుండి హైదరాబాద్ వచ్చు విమానము ఎక్కించెను. ఎంత మోసము. అయితే మనము దేవుని జ్ఞానములో అభివృద్ధి పొందవలెను. దేవుని జ్ఞానముతో జీవితమనే గృహమును కట్టగలము (సామె 14:1). జ్ఞానమనగా ప్రభువునందు భయభక్తులు గలిగి యుండుటయే (యోబు 28:28). అంతమాత్రమేగాక జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని (సామె 11:30) లో వ్రాయబడెను. నీటిలో మునిగేవానిని రక్షించాలంటే జ్ఞానము కావాలి. అగ్నిలో కాలుచున్న వానిని రక్షించాలంటే జ్ఞానము అవసరము. పాపములో వున్న వ్యక్తిని బయటకు లాగాలి అంటే దేవుని జ్ఞానముతో నింపబడాలి (యూదా 23వ వచనం). సోదరి సోదరుడా ! జ్ఞానముతో అభివృద్ధి పొందుచున్నావా?  Sons of Joseph

 ప్రేమలో అభివృద్ధి (1 థెస్స 3:13): నిజమైన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా హృదయములో కుమ్మరించబడును (రోమా 5:5). ఈ అనుభవము గలవారు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుదురు (హెబ్రి 1:9). అబ్రహాము తన కుమారుని కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించెను. 

 దావీదు తనను చంపుటకు వెదకుచున్న సౌలు రాజు చేతికి దొరికినప్పుడు కంఠమును కోయకుండా పై వస్త్రమును కోసెను (1 సమూ 24:4). శత్రువుని సహితము ప్రేమించుట దేవుని ప్రేమయే గదా! అయితే లోకములో యవ్వనస్థులు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుచున్నారు. అది చెడు ప్రేమ. ఫిబ్రవరి 14వ తేది వేలంటైన్స్ డే జరుపుకున్నారు. అది ప్రేమికుల దినము అనుచున్నారు. వాస్తవముగా రోమా చక్రవర్తియైన క్లాడియస్-॥ తన సైన్యమునకు వివాహము చేసుకొనకూడదని ఆజ్ఞనిచ్చెను. అయితే భక్తుడైన వేలంటైన్స్ దానిని ప్రతిఘటించెను. అప్పుడా చక్రవర్తి వేలంటైన్స్న హత్య చేయించెను. వివాహ విలువ, కుటుంబ సంఘీ భావమునును ఆ దినము తెలుపుచున్నది. నిజమైన ప్రేమ దేవుని ప్రేమించుటతో, తల్లిదండ్రులను ప్రేమించుటతో భర్త తన భార్యను ప్రేమించుటతో, దేవుని మందిరము, సంఘమును ప్రేమించుటతో ముడిపడి యున్నది (కీర్త 26:8). Sons of Joseph

 విశ్వాసములో అభివృద్ధి (2 థెస్స 1:3) : విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దేవునికి ఇష్టుడై యుండాలంటే విశ్వాసము కలిగి యుండాలి (హెబ్రి 11:6). ఆవగింజ యంత విశ్వాసము ఉండుట ద్వారా గొప్ప కార్యములు సాధించగలము. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లు ఈ దినములలో విశ్వాసులలో విశ్వాసము ఉండుట లేదు. అందువలన విశ్వాసులు తమ్మును తాము పరీక్షించుకొనవలెను. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నారు                (2కొరి13:5),హుమెనైయు, అలెక్సండ్రు విశ్వాస విషయమై ఓడబద్దలైపోయినవారివలె ఉన్నారు (1 తిమో 1:19-20). ఓడ బద్దలైనప్పుడు సరుకు సముద్రము పాలు అగునట్లుగా అనేకులు లోకములో కలసిపోయారు. Sons of Joseph

విశ్వాసము వలన కలుగు లాభములు : 

 1. విశ్వాసము వలన రక్షణ కలుగును (ఎఫెసీ 2:8)
 2. విశ్వాసమువలన స్వస్థత కలుగును (మార్కు 5:34)
 3. విశ్వాసము వలన సమస్యలు తొలగును (మత్త 17:21)
 4. విశ్వాసమువలన బలము కలుగును (రోమా 4:21)
 5. విశ్వాసమువలన పవిత్ర పర్చబడుట (అ.కా. 15:9) 
 6. విశ్వాసమువలన సాతానును జయించుట (1 పేతు 5:9) 
 7. విశ్వాసమువలన ప్రభువు పనిచేయగలము (1 థెస్స 1:2) 

 సేవలో అభివృద్ధి (1 తిమో 4:15) : తిమోతి ఒక మంచి సువార్తికుడు. మరియు లుస్త్ర, ఈ కొనియ సంఘముల ద్వారా మంచి పేరు పొందినవాడు (అ.కా. 16:2). గొప్ప ఐశ్వర్యము కంటె మంచి పేరు మేలు అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది (సామె 22:1). చాలామందికి మంచి పేరులుండునుగాని మంచి ప్రవర్తన వుండదు. ఒక మనుష్యుని గొప్పతనము అతని ప్రవర్తన మీద ఆధారపడి యుండును. రూతు యోగ్యురాలని బెల్లెహేములో జనులందరు ఎరుగుదురు (రూతు 3:11). ప్రియుడా ! నిన్ను గూర్చి లోకము, మరియు నీవు వెళ్ళుచున్న సంఘము ఏమి చెప్పుచున్నారు? భక్తిగల దైవజనుడని ఎలీషాను గూర్చి ఘానేమీయురాలు సాక్ష్యమిచ్చెను (2 రాజు 4:9). నీ సేవా జీవితములో మంచి సాక్ష్యమున్నదా ? గత 27 సం||లుగా మా సేవలో సాక్ష్యమును కాపాడుకొనుచున్నాము. ప్రభువు, సేవకుల పనిని పరీక్షించును. కొంతమంది సేవకులు తమ సేవను గడ్డివామువలె ప్రభువు ముందు పేర్చుదురు. మరికొంతమంది బంగారము, వెలగల రాళ్ళతో కట్టిన పనిని పెట్టుదురు. అయితే ప్రభువు అగ్ని వేసినపుడు గడ్డివాము కాలిపోవును. అది ఎత్తుగా కనబడును. అయినను అది లేకపోవును. బంగారము వెలగల రాళ్ళుతో కట్టిన పనినిచ్చును (1 కొరి 3:12). దైవసేవ కూడా నీ పని నిలుచునట్లు సిద్ధపరచుచున్నావా? తిమోతి సేవలో అభివృద్ధి పొందెను. Sons of Joseph

* తిమోతి అనగా దేవుని ఘన పర్చెను (సామె 3:9)

 • * నిజమైన కుమారుడు (1 తిమో 1:2) 
 • * ప్రియ కుమారుడు (2 తిమో 1:1, ఎఫెసీ 5:1)
 • * నమ్మకమైన కుమారుడు (1 కొరి 4:17)
 • * మంచి మనస్సాక్షి గలవాడు (1 తిమో 1:18)
 • * మంచి పరిచారకుడు (1 తిమో 4:6) 
 • * కన్నీటి ప్రార్ధన చేయువాడు (॥ తిమో 1:3)
 • * నిష్కపటమైన విశ్వాసము గలవాడు (॥ తిమో 1:5)
 • * పరిశుద్ధ లేఖనములను ఎరిగినవాడు (॥ తిమో 3:15)
 • * ప్రభువు కొరకు ప్రయాసపడినవాడు (॥ తిమో 4:2)
 • * ఆత్మలను రక్షణలోనికి నడిపినవాడు (1 తిమో 4:16) 

ఇట్టి అభివృద్ధిని ప్రభువు మీకు ఇచ్చునుగాక ! 


Pdf Filrs Download కొరకు …. క్లిక్ హియర్ 

Leave a comment

error: dont try to copy others subjcet.