పరమగీతము గ్రంధం.
Song of Solomon Book Telugu
హెబ్రీ భాషలో ఈ గ్రంథమునకు “షిర్ హా షిరిం” అని పేరు కలదు. “సర్వోన్నతమైన గీతము” అని దానికి అర్థం. (Song of Songs) పాటలకే పాట ఇది. 1 రాజులు 4:32లో వ్రాయబడిన దానిని బట్టి సొలొమోను 1005 కీర్తనలు రచించాడని ఉంది. ఇట్టి కీర్తనలన్నిటికంటే “పరమగీతము” అగ్రగణ్యమైనది.
ఆత్మ సంబంధమైన జీవితం చేయువారే ఈ పవిత్ర గ్రంథాన్ని అర్థంచేసుకోగలరు. శరీరానుసారులకు ఇది కామపూరిత కలాపాలతో కూడినదిగా తోచును. యూదులకు యిది మహా పవిత్ర గ్రంథం! యూదులు పరమగీతమును పస్కా పండుగలో 8వ దినమున చదువుతారు.
పరమగీతము యూదుల యొక్క మత జీవితంలో ఎంతో ప్రాముఖ్యత గాంచినది.
సొలొమోను రాసిన సామెతలు, ప్రసంగి మరియు పరమగీతములను పండితులు మోషే యొక్క ప్రత్యక్ష గుడారమునకు పోలుస్తారు. గుడారానికీ ఆవరణం, పరిశుద్ధ స్థలం మరియు అతి పరిశుద్ధ స్థలములు ఉంటాయి. ఆవరణానికీ సామెతలనూ, పరిశుద్ధ స్థలానికీ ప్రసంగినీ, అతి పరిశుద్ధ స్థలానికీ పరమగీతమును పండితులు పోల్చి వర్ణిస్తారు.
ఈ గ్రంథము మనకు థియోలజీని నేర్పుటకు ఉద్దేశింపబడలేదు గాని ప్రియుని యొక్క ప్రేమను మరియు ప్రియురాలి ప్రేమను మన కళ్ళకు కట్టినట్టు చూపెడుతోంది.
ఈ పుస్తకం సొలొమోనుకీ, అతని ప్రియురాలికీ మధ్య నడచిన ప్రేమ పాటలా కన్పిస్తుంది. ప్రియుడు సొలొమోను – ప్రియురాలు షూలమ్మితీ అను ఓ కన్యక.
ఈ గ్రంథంలో 8 అధ్యాయాలలో దాదాపు 15 రకాల జంతువులు, 21 రకాల వృక్షాల ప్రస్తావన వుంది. ఈ రెండు రకాలను సొలొమోను ఎంతో పరిశోధించి తాను రాసిన అనేక గీతాలలో ఉదహరించాడు (1రాజులు 4:33). ఇశ్రాయేలు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రస్తావన దాదాపు ఈ గ్రంథంలో ఉంది. దీని ద్వారా ఉత్తర దక్షిణ దేశాలుగా ఇశ్రాయేలు చీలిపోకముందే ఈ గ్రంథ రచన సాగిందని గ్రహించవచ్చు.
సొలొమోను షూలమ్మితీల మధ్యసాగిన ప్రేమాయణం – అది క్రీస్తుకూ, ఆయన వధువైన సంఘానికీ మధ్యగల ప్రేమకూ సాదృశ్యం. కాబట్టి ఎవరైనను ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు అదే మనస్సుతో, ఆ పవిత్రమైన ప్రేమతోనే చదివి అర్థం చేసుకోవాలి. ఈ పరమ గీతములో సొలొమోను షూలమ్మితీని గ్రామాలలో ఉండే ఒక సాధారణ యువతిగా, అందగత్తెగా, ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా అభివర్ణించాడు. ఒక వ్యక్తి తనమొదటి ప్రేమకు కట్టుబడి ఉండే విధంగా సొలొమోను షూలమ్మితికీ మానసికంగా ఎంతో లోతైన విధంగా కట్టుబడి ఉన్నాడు. Song of Solomon Book Telugu
ఈ గ్రంథము – ఒక నాటకంలోని దృశ్యములు ఉండి, ఏ విధంగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటారో ఆ విధంగా ఉంది. ముఖ్యముగా ఈ పరమగీతములో ముగ్గురు ముఖ్య వ్యక్తులు సంభాషించుచున్నట్టుగా అర్థమవుతోంది.
- వధువు, లేక పెండ్లి కుమార్తె – షూలమ్మితీ
- రాజు, లేక పెండ్లి కుమారుడు- సొలొమోను
- ఒక పల్లవిలాగ మాట్లాడేది – యెరూషలేం కుమార్తెలు
ఇందులో ఎవరు ఎప్పుడు మాట్లాడుచున్నారో గమనించినట్లయితే నాటకంలోని పాత్రధారులను గమనించుచు ముందుకు సాగిపోవచ్చును.
ఈ క్రింద పాత్రధారులు ఈ గీతములో చూడవచ్చు. ఇవి న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో మనం చూడవచ్చును
“పరమ గీతముపై హెచ్. ఎ. ఐరన్సైడ్ అనే భక్తుడు ఈ క్రింద విధముగా వ్యాఖ్యానం చేసాడు.
సొలొమోనుకి ఎఫ్రాయిము దేశంలోని కొండమీద ఒక ద్రాక్షతోట ఉన్నది. అది ఉత్తర యెరూషలేమునకు 56 కి.మీ దూరంలో కలదు (8:11). ఒక తల్లి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగిన కుటుంబానికీ ఈ తోటను కాపుకిచ్చాడు (1:6). అందులో ఒక కుమార్తె పేరు షూలమ్మితి (6:13). ఆమెకు ఓ చెల్లెలూ ఉన్నది (8:1).
షూలమ్మితీ సహోదరులు మారు తల్లి యొక్క సంతానం కావడంతో చిన్నదైన షూలమ్మితికీ ద్రాక్షతోట కాపుకాసే భారమైన పని అప్పగించారు. ఆమె తన పనివల్ల తన సౌందర్యాన్ని గూర్చి జాగ్రత్తపడలేదు. ఆమె ద్రాక్షతోటను పాడుచేయు గుంటనక్కలను పట్టుకొనుటకు, మందలను మేపుటకు ఎల్లప్పుడూ ఎండలో ఉన్నందున ఆమె ముఖము నల్లగా మాడిపోయింది. Song of Solomon Book Telugu
ఒకరోజు మారువేషము వేసుకొన్న అందమైన సొలొమోను రాజు ఆ తోటకు వచ్చాడు. అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె పట్ల శ్రద్ధ చూపించాడు. గాని ఆమె నల్లని ముఖము చూచి కొంత అసహ్యించుకున్నాడు. అయితే నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను అని ఆమె చెప్పిన వివరణను బట్టి సంతృప్తి చెందాడు.
ఆమె అతణ్ని గొర్రెల కాపరి అనుకొని, గొట్టెలు ఎలా ఉన్నాయి? అని అడిగింది (1:7). అందుకతడు ప్రేమగా మాట్లాడి ఆమెకు కొన్ని బహుమానములు ఇస్తానని వాగ్దానం చేసాడు (1:11).
అతడు ఆమె హృదయాన్ని ఆకర్షించుకొని మరల వస్తానని చెప్పి వెళ్లిపోయెను. ఆ తరువాత ఆమె అతని రాకకై ఎదురుచూస్తూ, కలలు కంటూ అతడు వచ్చినట్లు, తన దగ్గరలోనే ఉన్నట్లు కలలు కనేది (3:1). చివరికతడు రాజఠీవితో వచ్చి ఆమెను పెండ్లి కుమార్తెగా తీసుకెళ్లదలచెను (3:6,7).
అలాగే పాపులమైన మన కొరకు పరలోకపు దైవత్వాన్ని విడిచి మంచి కాపరిగా వచ్చిన యేసుప్రభువు మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చాడు. ఇక ఆయన ఆర్భాటముతో రారాజుగా బూరధ్వనులతో వచ్చి ఆయనతో పాటు మనలను తీసుకొని వెళ్తాడు. ఇదే ఈ గ్రంథంలోని అంతరార్థము!
ఈ గ్రంథంలోని ఉద్దేశ్యం ఏమిటంటే – వివాహ సంబంధంలోని ఆనందాన్ని ఘనతనూ తెలియజేయడానికై పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి పరిశుద్ధ లేఖనాలలో చోటు చేసుకుంది. ఆదికాండములో మానవ పతనానికీ పూర్వమే మానవ సంబంధాలలో వివాహ బంధము చోటు చేసుకుంది (ఆది. 2:18 – 25)
మానవ జీవితంలో ఈ ప్రాముఖ్యమైన అనుభవాన్ని, లేదా అంశాన్ని పాపం కలుషితం చేసినప్పటికీ, ఈ అంశాన్ని పవిత్రంగా, ఆనందంగా, పరిపూర్ణంగా అనుభవించ వచ్చు అని మనం తెలుసుకునేందుకు దేవుడు కోరుచున్నాడు.
పరమగీతము రెండు విపరీత వాదనల మధ్య ఒక సరియైన ఆదర్శాన్ని చూపిస్తుంది. ఒకటి – అక్రమమైన కామ సంబంధాల కొరకు వివాహములోని ప్రేమను వదులుకోవడం! (ఉదాహరణకు స్వలింగ సంపర్కం లాంటివి).
రెండవది – కామ సంబంధాల విషయంలో సన్యాసం పుచ్చుకోవటమే సరైన క్రైస్తవ విధానమని పొరబడటం! ఇది వైవాహిక సంబంధంలో ఉండే శారీరక ప్రేమలోని శ్రేష్ఠత్వాన్ని నిరాకరిస్తుంది. Song of Solomon Book Telugu
పరమగీతములోని విషయాన్ని విభజించి వివరించడం అంత తేలిక కాదు. మీరు ఈ గ్రంథాన్ని పరిశీలించి చూస్తే ఏమర్థమవుతుందో తెలుసా? మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు క్రమమైన రీతిలో తార్కికంగా సాగటానికీ బదులు ఈ పుస్తకం “ప్రేమ” అనే ప్రధాన అంశం చుట్టూ ఒక దానితో మరొకటి కలుసుకుంటూ ఉండే సందేశాల వలయాలతో సాగిపోతూ ఉంటుంది.
పాటగా చూసినట్లయితే దీనిలో 6 పద్యాలు (లేక చరణాలు) ఉన్నాయి 1) 1:2−2:7, 2) 2:8-3:5 3) 3:6-5:1 4) 5:2-6:3 5)6:4-8:4) 6) 8:5–14.
ప్రతి ఒక్క పద్యమూ సొలొమోనుకూ మరియు అతని వధువుకూ మధ్యగల వైవాహిక ప్రేమను మరియు వివాహానికి ముందు నిరీక్షణను వివరిస్తుంది.
వధువు కన్యత్వాన్ని “మూయబడిన ఉద్యానవనం” గా సొలొమోను అభివర్ణించాడు. అలాగే వివాహం జరగడాన్ని “తనకిష్టమైన ఫలములను భుజించడానికీ ఉద్యానవనమునకు వేంచేయడము”గా వివరించాడు (4:12; 5:1). ఎక్కువ సంభాషణలు ప్రియుడైన సొలొమోనుకూ, ప్రియురాలైన వధువుకూ మరియు వధూవరుల స్నేహితులకు (యెరూషలేం కుమార్తెలు) మధ్య జరిగినవే.
వధువూ వరుడూ కలిసి ఉన్నప్పుడు వారి ఆశలు నెరవేరాయి. వారు వేరైనప్పుడు ఒకరి కోసం మరొకరు విరహం అనుభవించారు. పరమగీతం సాహిత్య ఉత్కర్ష 8:6-7 వచనాలలో ఉంది.
బైబిల్లో కేవలం వధూవరుల మధ్య ఉండే ప్రత్యేకమైన ప్రేమను వివరించే ఏకైక పుస్తకం ఇది! ఈ గ్రంథమంతటా వివాహానికి ముందు ఉండే నిరీక్షణ, వివాహంలోని ప్రేమ, క్రొత్తగా వివాహం అయిన వారి ఆనందం గూర్చి కవి వర్ణించాడు. ఇదొక సాహిత్య కళాఖండం. దీనిలో ఎక్కువగా ప్రకృతి నుంచి స్వీకరించిన లైంగిక సుఖానికీ చెందిన కల్పనలు మర్మంగా ఉన్నాయి. బైబిలు కాలాలలో పవిత్రంగా, నీతిగా ఎంచబడిన వైవాహిక శృంగార ప్రేమలోని భావోద్రేకాల్ని, ప్రభావాన్ని, సౌందర్యాన్నీ ఈ పుస్తకం వివిధ రూపక అలంకారాలతోను, వర్ణనలతోను వివరిస్తోంది. క్రొత్త నిబంధనలో ఎలాంటి ప్రస్తావన లేని అతికొద్ది పాత నిబంధన పుస్తకాలలో ఇదొకటి. దేవుని ప్రస్తావనే లేని రెండు పాత నిబంధన పుస్తకాలలో ఇది ఒకటి (మరొకటి ఎస్తేరు). కొన్ని వ్రాత ప్రతులలో దేవుని ప్రస్తావన ఉంది (8:6).
పరమగీతంలోని ప్రేమ క్రమ క్రమంగా పెరిగి వేరుపారి హృదయాంతరంగమున పాదుకుని, ప్రేమామృతసారమును ఒలికింపజేసి, ఒక భక్తున్ని పరవశుని చేసి విజయవంతమైన విశ్వాస ప్రేమాశిఖరమునకు ఎక్కించి – మనకొరకు రక్తమును కార్చిన గొట్టెపిల్ల వివాహ దినము కొరకైన ఆశనూ, కోరికనూ దీక్షతో వీక్షింపజేస్తోంది. ఇట్టి ప్రేమ రాబోయే పరమ వివాహ మహోత్సవమునకు కొంత ఛాయమాత్రమే!
పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుణ్ణి పొగడుతూ ఆరాధించడం మనం ఇందులో చూస్తాం. ప్రభువు యెడల మన హృదయంలో ప్రేమ ఉప్పొంగి పెల్లుబికినప్పుడు, ఆరాధన దానంతటదే మన నోటిలోంచి వస్తుంది. అధికమైన ప్రేమతో మన పెండ్లి కుమారుడైన ప్రభువును ప్రేమిద్దాం. Song of Solomon Book Telugu
మరే ఇతరవ్యక్తినీ, ఇతర ప్రేమలను అనుమతించని ప్రత్యేకమైన తీవ్రమైన వ్యక్తిగత ప్రేమను మన పెండ్లి కుమారుడు కోరుచున్నాడు.
పరమ గీతం చిట్ట చివరిలో వధువు అంటోంది – “నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన యిర్రివలె ఉండుము” అంటే – త్వరపడి రమ్ము! ప్రియుడా రమ్ము అని అర్థము. ప్రకటన 22:20లో కూడా వధువు అనబడే సంఘము – ప్రభువైన యేసూ, రమ్ము అంటోంది. క్రీస్తును త్వరగా రమ్మని ఆర్పజాలని ప్రేమచేత మరులుగొలుపబడినదై యథార్థముగా పిలుస్తోంది. Song of Solomon Book Telugu
పరిశుద్ధ వధువు పెండ్లి కుమారుడైన ప్రభువును ముఖాముఖిగా కలుసుకోవడం ఎంత భాగ్యము! ఒకరోజు వస్తుంది – ఆయనతో మనం ఏకమై ప్రేమలో లీనమవుతాం. ఏ భేదమూ లేదు – ఆయన స్వాస్థ్యము మనది! మనము ఆయనవారము!! Song of Solomon Book Telugu
నా ఆత్మతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలినిగా చేసుకుంటున్నాను అంటూ మనతో పల్కే శుభ ఘడియ ఆసన్నమవుతోంది… ఓ పెళ్ళి కుమార్తె నీవు సిద్ధమేనా???
66 పుస్తకాల వివరణ కోసం… క్లిక్ హియర్