క్రీస్తు జీవిత చరిత్ర|JESUS LIFE HISTORY TELUGU|PART 2

క్రీస్తు జీవిత చరిత్ర

పార్ట్ 2

JESUS LIFE HISTORY TELUGU  

B : క్రీస్తు జీవిత నేపధ్యము 

క్రీస్తు జీవితమును, ఆయన బోధలను చక్కగా అర్ధం చేసుకొనుటకు ఆయన జీవిత నేపధ్యమును (భౌగోళిక, రాజకీయ మతపరమయిన) గూర్చి తెలుసుకొనుట మంచిది.

1) భౌగోళిక నేపధ్యము. 

క్రీస్తు జన్మించి, జీవించి, సంచరించి, దేవుని వాక్యము ప్రకటించిన ప్రాంతము పేరు పాలస్తీనా. ‘ఫిలిష్తియా’ అను పదము నుండి ఈ పేరు ఉద్భవించినది. ఈ దేశమునకు పడమరగా మధ్యధరా సముద్రము, తూర్పున యోర్దాను నది, ఉత్తరమున లెబనోను, హెర్మోను పర్వతములు, దక్షిణమున యూదయ ప్రాంతములోని పర్వతములు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశము యొక్క పొడవు దాను నుండి బేయర్షెబా వరకు 145 మైళ్ళును, సరాసరి వెడల్పు 50 మైళ్ళ వరకు నుండి 8400 మైళ్ళ వైశాల్యము కలిగి యున్నది. మధ్యధరా సముద్ర తీరమున నున్న ఈ దేశము చిన్నదే గాని ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల అను మూడు ఖండముల మధ్యనున్నది.

ఈ దేశ వాతావరణ పరిస్థితులు వింతగా ఉంటాయి. మన దేశములోని హిమాలయ పర్వతముల మీదనున్నట్లే అచ్చటి హెర్మోను పర్వతములపై నిత్యము మంచు పేరుకొని యుంటుంది. యోర్దాను లోయలో, యెరికో చుట్టు నుండు మైదానములలో మన భారతదేశములో నుండు ఉష్ణమతంటి ఉష్ణ వాతావరణము ఉంటుంది. పాలస్తీనాలోని యితర భాగములలో పై రెండు స్ధితులకు మధ్యస్థముగా నుండు శీతోష్ణస్థితులన్నియు నున్నవి..

పాలస్తీనా దేశమును మూడు ప్రాంతములుగా విభజించవచ్చును. అవి (a) గలియల (b) సమరయ, దెకపొలి, పెరయ (C) యూదయ.

(a) గలిలయ ప్రాంతము : 

గలిలయ ప్రాంతమును ‘ పాలస్తీనా యొక్క సుందరవనము’ అని పిలుస్తారు. ఇది మంచి నీటిపారుదల సౌకర్యములు కలిగిన సారవంతమైన ప్రాంతము, 60 మైళ్ళ పొడవు, 25 మైళ్ళ వెడల్పు గలది. మన ప్రభువైన యేసుక్రీస్తు దినములలో గలిలయ ప్రాంతములో అధిక జనాభా నివసిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతములో అనేక ప్రాముఖ్యమైన రహదారులు ఉన్నాయి (It has been said that Judaea is on the road to nowhere, Galilee is covered with roads to every where). ప్రాముఖ్యమైనది – దమస్కు నుండి దిగువ గలిలయ ప్రాంతమును తాకుతూ కపెర్నహూము (మత్తయి సుంకపు మెట్టు వద్ద కూర్చున్న ప్రాంతము, మార్కు 2:14) గుండా మధ్యధరా సముద్ర తీరప్రాంతమునకు వెళ్ళు రహదారి. గలిలయ ప్రాంత ప్రజలు సాహసమునకు మారుపేరు. జైలో తీయులలోని ప్రముఖులలో అనేకులు గలిలయులే.]

క్రీస్తు జీవితమునకు సంబంధించినంత వరకు గలిలయలోని ముఖ్యప్రాంతములు కొన్నింటిని పరిశీలిద్దాం.

గలిలయ సముద్రము : ఇది గలిలయ ప్రాంతములోని మంచినీటి సరస్సు. 13 మైళ్ళ పొడవు, 8 మైళ్ళ వెడల్పు గలది. విస్తీర్ణమునుబట్టి ఇది సముద్రమని,పిలువబడినప్పటికి నీరు మాత్రం బహుశ్రేష్టమైన మంచినీరుగా ఉండెడిది, ఆరంభములో ఈ సరస్సు కిన్నెరతు సముద్రమని (సంఖ్యా 34:11) పిలువబడినప్పటికి, కాలక్రమేణా గెన్నెసరెతు సరస్సు (లూకా 5:1), గలిలయ సముద్రము, తిబెరయ సముద్రము (యోహాను 6:1,21:1) అను పేరులు కలిగాయి. యోర్దాను నది దీని లోనికి ప్రవహించి మరల బయటకు ప్రవహిస్తుంది. యోర్దాను దీనిలోనికి ప్రవహించి, బయలు వెడలు ప్రాంతములో తప్ప యితర భాగమంతయు సముద్ర మట్టమునకు 1000 అడుగులు ఎత్తుగల పర్వతములచే నావరింపబడియున్నది. దీనిలోని నీరు సముద్ర మట్టమునకు 685 అడుగులు దిగువన ఉండి ఉష్ణమండల ప్రాంతపు వేడిమితో కూడిన వాతావరణముంటుంది. ఈ సముద్రమునకు అతి సమీపమునందే నిరంతరము హిమముతో కప్పబడియుండే హెర్మోను పర్వతము ఉన్నది. ఇంత కొద్ది దూరములోనే అతిశీతల, అత్యుష్ణ వాతావరణ పరిస్థితిలుండుటచే శీతల వాయువులకస్మాత్తుగా పర్వతముల మధ్య నుండి యీ సముద్రము   ఈ సముద్ర తీరమున వెళ్తూ యేసు తన శిష్యులను పిలిచారు (మత్తయి 1: 18-22; మార్కు 1:16-20). దోనె మీద నెక్కి యీ సముద్రతీరమున ప్రజలకు బోధించారు (మత్తయి 13:1-3; మార్కు 4:1). శిష్యులు అద్భుత రీతిగా చేపలు పట్టునట్లు చేసారు (లూకా 5:1-11; యోహాను 21:1-14). కనీసం ఐదుసార్లు ఆదరి నుండి ఈచరికి దాటారు (మార్కు 4:32-36, 5:21. 6:21, 6:45-52, 8:13), ఇట్లు దాటినప్పుడొకసారి తుఫానును నిమ్మళింపచేసారు (మత్తయి 8:23-27; మార్కు 4:35-41). ఒకసారి ఈ సముద్రము పైన నడిచారు (మత్తయి 4:22-23; మార్కు 6:45 – 51; యోహాను 6:15-21).

ఈ. సముద్రమునకు పశ్చిమ తీరమున కొన్ని పట్టణములున్నాయి. వీటిలో కొరాజీను, కపెర్నహూములలో (యిప్పటి టెల్ హామ్) యేసు పరిచర్య చేసారు. యోర్దాను ఈ సముద్రములో ప్రవేశించు చోట బేత్సయిదా అను పట్టణముంది. గలిలయ సముద్రమునకు, 20 మైళ్ళ ఉత్తరముగా ఫిలిప్పుదైన కైసరయ పట్టణముంది (మత్తయి 16:13-20; మార్కు 8:21). గలిలయ ప్రాంతములోని కానాలో యేసు నీళ్ళను ద్రాక్షరసముగా మార్చారు (యోహాను 2:1-10).

నజరేతు : గలిలయ సముద్రమునకు నైఋతి దిశలో యేసు యొక్క ‘స్వదేశము’ (మార్కు 6:1) అని పిలువబడు నజరేతు గ్రామమున్నది. కపెర్నహూము నుండి మధ్యధరా సముద్రమునకు పోవు రాజమార్గము ఈ గ్రామము గుండా వెళుతుంది. నజరేతులో గల కొండల నెక్కినచో గలిలయ ప్రాంతమంతా కనిపిస్తుంది. నజరేతుకు మూడు మైళ్ళ దూరములో యోనా స్వగ్రామమైన గెత్తేపేరు ఉన్నది. పడమరగా పదిమైళ్ల దూరమున ఏలియా బయలు యాజకులను సవాలు చేసి ఆకాశం నుండి అగ్నిని రప్పించిన కర్మెలు పర్వతమున్నది. .

(b) సమరయ, దెకపొలి, పెరయ ప్రాంతములు: 

గలిలయ ప్రాంతమునకు దక్షిణంగా సమరయ ప్రాంతమున్నది. అనేక పర్వతములచే వేరు చేయబడుతున్న పెద్ద పెద్ద లోయలు అనేకములు ఈ ప్రాంతములో ఉన్నాయి. ఆ పర్వతములలో ఏబాలు, గెలి జీము ముఖ్యమయినవి. ఉత్తర రాజ్యము అష్షూరు చెరలోనికి కొనిపోబడిన తరువాత (721 B.C.) మిగిలిన ప్రజలను అష్టూరీయులు వివాహము చేసికొనగా కలిగిన సంతానమయిన సమరయులు ఈ ప్రాంతములో నివసిస్తారు. ఇశ్రాయేలుకు నిజమైన ప్రతినిధులము తామేనని వారు అప్పట్లో భావించేవారు. ఇప్పటికీ వారి భావన అదే. ‘యూదులు సమరయులతో సాంగత్యము చేయరు’ అను మాట నాడు, నేడు కూడా వాస్తవమే కనుక సమరయులు మరొక మందిరమును, యాజక వ్యవస్థను ఏర్పరచుకున్నారు. గెకేజీము పర్వతమును పరిశుద స్థలముగాను, పంచకాండములను పరిశుద్ధ గ్రంథముగా, షెకెమును పరిశుద్ధ పట్టణముగాను భావించేవారు. సమరయలోని సుఖారు అను గ్రామములో (యోహాను 4:5) క్రీస్తు సమరయులకు బోధించారు, రెండు దినములు సమరయుల గ్రామములో బస చేశారు (యోహాను 4:40). సమరయలోని మంచి వారిని మెచ్చుకున్నారు (లూకా 10:25-37, 17:16), సమరయులకు బోధించుటకు ఆరంభములో తన శిష్యులను పంపకున్నను (మత్తయి 10:5), కాలము సంపూర్ణమయినప్పుడు తన శిష్యులు అక్కడికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించారు (అ.కా. 1:8).

గలిలయ నుండి యాత్రికులు పస్కా పండుగ నిమిత్తము యెరూషలేముకు వెళ్ళవలెనంటే సమరయ ప్రాంతమునకు ముందుగా యోర్దానును దాటి తూర్పువైపుకు ప్రయాణించి యూదయ ప్రాంతములోని యెరికోకు ఎదురుగా నున్న చిన్నరేవు వద్ద మరల యోర్దాను దాటి యూదయలో ప్రవేశిస్తారు గాని సమరయ గుండా ప్రయాణం చేయనే చేయరు. ఈ ప్రయాణములో యోర్దానుకు తూర్పున పది గ్రీకు పట్టణముల సముదాయమైన కపాలి (మార్కు 5:20 7:31) సరిహద్దులను తాకుతూ ప్రయాణికులు పెరయలో అడుగుపెడతారు. డెకపొలిలోని ప్రజలు అన్యులైతే పెరయ వారు యూదులు. పెరయ ప్రాంతపు పేరు బైబిలులో కనబడకపోయినప్పటికి, మార్కు 1.1.1 లో ‘ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను’ అని వ్రాయబడుటను బట్టి యేసు తన యెరూషలేము ప్రయాణములో పెరయ ప్రాంతము గుండా ప్రయాణించారని చెప్పగలము.

(c) యూదయ ప్రాంతము: 

తూర్పు నుండి పడమరకు విస్తరించి, లోతైన కాలువలచే విభాగించబడిన ఎత్తైన పీఠభూమే యూదయ ప్రాంతము. 55 తీర ప్రాంతము, తీర మైళ్ళ పొడవు, 30 మైళ్ళ వెడల్పు గలది. యూదయ ప్రాంతమును ఐదు భాగములుగా విభజిస్తారు ప్రాంతమునకు సమీపమున ఉన్న పల్లపు ప్రాంతములు, నెగెబు (దక్షిణ ప్రాంత భూమి), పర్వత ప్రదేశము, అరణ్య ప్రాంతము., చివరి రెండింటిని గూర్చి మాత్రమే మనము ఇక్కడ నేర్చుకుంటాము. పర్వత ప్రాంతమంతా ఎత్తైన పర్వతములతో నిండి ఉంటుంది. ఈ పర్వతములు పీఠభూమి మీద నున్న యెరూషలేము నుండి 2500 అడుగుల ఎత్తు ఉంటాయి. అరణ్య ప్రాంతము పూర్తిగా నిర్జనమైనది మరియు బంజరు భూమి. ఇది మృత సముద్రము వరకు వ్యాపించి యున్నది. బాప్తిస్మమిచ్చు యోహాను ఈ అరణ్యములోనే గడిపాడు. సాతాను చేత శోధించబడుచు యేసు నలువది దినములు అడవి మృగములతో కూడా నుండినది ఈ అరణ్యములోనే (మార్కు 1:13).

యూదయ ప్రాంత ప్రజలందరు యూదులే. రాళ్ళతో నిండియున్న పీఠభూమికి తలమానికమా అన్నట్లు యెరూషలేము పట్టణము, అందులోని మనోహరమైన దేవాలయము ఉంటాయి. దేవాలయమునకు పశ్చిమముగా హేరోదుచే నిర్మించబడిన ప్రేతోర్యమను రాజమందిరమే పిలాతు యొక్క అధికార నివాసము (మార్కు 15:16). యెరూషలేము పట్టణమునకు తూర్పుగా కెద్రోను వాగు ఉంది (యోహాను 18:1). ఈ వాగుకు అడ్డముగా ఏటవాలుగా ఉండు ఒలీవల పర్వతము ఉంది (లూకా 19:37). ఈ పర్వత దిగువ భాగమున గెత్సేమనే వనమున్నది.,

యెరూషలేముకు ఆగ్నేయముగా రెండు మైళ్ళ దూరములో మార్త, మరియల స్వగ్రామమైన బేతనియ ఉంది (యోహాను 11:1). దక్షిణముగా ఆరు మైళ్ళ దూరములో దావీదు పురము అనబడు బేల్లెహేము ఉంది. రాహేలును యాకోబు సమాధి చేసినది, రూతు పంట పొలములో పరిగ ఏరుకున్నది. యేసు జన్మించినది ఈ గ్రామములోనే. ఈశాన్యముగా 15 మైళ్ళ దూరములో జక్కయ్య మేడిచెట్టు ఎక్కిన యెరికో పట్టణమున్నది. ప్రస్తుతం అది ఒక రాళ్ళగుట్ట వలె ఉన్నప్పటికి యేసు ఆ గ్రామములో నుండి ప్రయాణించినప్పుడు వర్ధిల్లిన పట్టణమే.,

2) చారిత్రక నేపధ్యము 

    భౌగోళిక పరిస్థితుల నుండి మనము చరిత్రలోనికి వెళదాము. హేరోదులు, రోమనులు కూడా క్రీస్తు జీవితములో తమ వంతు పాత్ర పోషించారు. కనుక క్రీస్తు కాలములో పాలస్తీనాను పరిపాలించిన రాజులను గూర్చిన కొంత జ్ఞానము కలిగియుండుట, మంచిది.

ముందుగా చెఱ నుండి వచ్చిన తరువాత యూదుల చరిత్రను క్లుప్తంగా పరిశీలిద్దాము. 333 B.C. లో ఇస్సుస్ లో జరిగిన యుద్ధములో అలెగ్జాండరు పర్షియా సామ్రాజ్యమును కూలద్రోసి చక్రవర్తి అయ్యాడు. అతడి మరణం తరూత ఐగుప్తు టాలమీలు, సిరియాను సెల్యూసెడ్లకు మధ్య వివాదమునకు పాలస్తీనా కేంద్రబిందువయ్యింది. అయితే సెల్యూసిడ్లు ఆధిక్యత సంపాదించి పాలస్తీనాలో గ్రీకు సంస్కృతిని వ్యాపింపచేసారు. తరువాత యూదా మతమును నిర్మూలించాలని అంతియోకస్ ఎపిఫేనస్ చేసిన ప్రయత్నము మక్కాబీయుల వీరోచిత ఎదురు దాడి ఫలితంగా విఫలమయ్యింది. హాస్మోనియన్ వంశపు వారైన యాజక రాజుల, పరిపాలనలో తరువాత 80 సంవత్సరములు (143-63 B.C.) యూదులు స్వేచ్ఛననుభవించారు. 63 B.C.లో రోమను చక్రవర్తియైన పొంపే యెరూషలేమును జయించుటతో పాలస్తీనా రోమనుల ఆధీనంలోనికి వెళ్ళింది.

37 B.C. వరకు పాలస్తీనాలోని యూదులు అనేక సమస్యలనెదుర్కొన్నారు. 37 B.C. లో ఎదోమీయుడైన హేరోదు రోమనుల సహాయముతో పాలస్తీనాకు రాజయ్యాడు. ఇతనినే మహాహేరోదు అని పిలుస్తారు. ఆరంభము నుండి యూదులు ఇతనిని వ్యతిరేకించారు. భవన నిర్మాణమంటే అతనికి ఎంతో ఆసక్తి. ఈ ఆసక్తి చేతనే 20B.C. లో మందిర పునర్మిర్మాణమును ఆరంభించాడు. యేసు జన్మించిన సమయములో రాజుగానున్న వాడు, రెండు సంవత్సరములలోపు పిల్లలను సంహరింపనాజ్ఞాపించిన వాడు ఇతడే. 4B.C. లో అతడు మరణించక మునుపు తన కుమారులు ముగ్గురికి మధ్య తాను పాలించిన ప్రాంతము విభాగించబడవలెనని రోమనులతో ఒప్పందం చేసికొన్నాడు. ఈ ఒప్పందం కారణంగా హేరోదు ఆర్కెలాయు యూదయ, సమరయ, ఇదూమయ ప్రాంతములకు, హేరోదు అంతియెపయ గలిలయ, పెరయ ప్రాంతములకు, ఫిలిప్పు ఈశాన్య ప్రాంతములైన ఇతూరయ, త్రకొనితి

హేరోదు ఆర్కెలియు: తండ్రి మరణం తరువాత యూదయ, సమరయ, ఇదూమయ ప్రాంతములకు అధిపతి అయ్యాడు. తండ్రి వలె ఇతడు కూడా బహు క్రూరుడు. ఆర్కెలాయు అధిపతిగా నున్నాడని ఐగుప్తు నుండి వచ్చిన యోసేపు విని మరియను, యేసును బేత్లహేమునకు కాక, స్వప్నమందు దేవునిచే బోధింపబడిన వాడై గలిలయలోని నజరేతుకు తీసుకువెళ్ళాడు (మత్తయి 2:22-23). ఆర్కెలాయు దుష్టపరిపాలనను 10 సంవత్సరములు సహించిన రోమనులు A.D. 6 లో అతనిని పదవీభ్రష్టుని చేసి అతని స్థానములో తమ ప్రతినిధులను నియమించారు. యేసును సిలువకు అప్పగించిన పిలాతు వారిలో ఐదవవాడు.

  హేరోదు అంతియొపయ : సువార్తలలో మనకు ఎక్కువగా అగుపడు హేరోదు ఇతడే. గలిలయ, పెరయ ప్రాంతములకు అధిపతిగా ఒక స్వంత సైన్యమును ఏర్పాటు చేసుకొని తన స్థానమును సుస్థిరం చేసికొన్నాడు. కపెర్నహూములో, శతాధిపతి ఎట్టి సందేహము లేకుండా ఇతడి సైన్యములోని వాడే. ఇతడు 4 B.C. A.D.39 వరకు పరిపాలించాడు. క్రీస్తు ఇతనిని ‘నక్క’ అని పిలిచారు (లూకా 13:31,32). తన తమ్ముడు ఫిలిప్పు యొక్క భార్యయైన హేరోదియను ఉంచుకొనినందున బాప్తిస్మమిచ్చు యోహాను ఇతనిని గద్దించగా కుయుక్తిచే అతనిని చెరసాల పాలు చేసాడు. అతని శిరచ్ఛేదన గావించాడు (మత్తయి 14:1-12; మార్కు 6:14-29, 8:15; లూకా 9:7-9). యేసు గలిలయ నుండి వచ్చినవాడని పిలాతు తెలిసికొని విమర్శ నిమిత్తము ఇతని యొద్దకు పంపాడు. ఆ సమయంలో ఇతడు యేసు ఒక అద్భుతము చేయగా చూడాలని కోరినప్పటికి క్రీస్తు అతనికి ప్రత్యుత్తరమీయలేదు. అప్పుడు ఇతడు యేసును అపహసించి మరల పిలాతు నొద్దకు పంపాడు (లూకా 23:7-12). తాను ఉంచుకొనిన హేరోదియ ప్రేరేపణచే ‘రాజు’ అను బిరుదు కొరకు రోమా పట్టణమునకు వెళ్ళి చక్రవర్తి కోపమునకు గురై గాలు (Gaul) దేశమునకు పరవాసిగా పంపివేయబడి అక్కడే మరణించాడు.,

హేరోమ ఫిలిప్పు: హేరోదు కుమారులందరిలో మంచివాడు. ఇతనికి కూడా నిర్మాణములంటే ఎంతో ఆసక్తి. ఫిలిప్పుదైన కైసరయ, బేత్సయిదా పట్టణములను ఇతడే నిర్మించాడు..

ఏది ఏమయినప్పటికి ఈ సంవత్సరములన్నీ రక్తపాతముతోను, దుఃఖముతోనూ గడచిపోయాయి. హేరోదుల ద్వారా యూదుల మీద పడిన రోమనుల కాడి వారిని ఎంతగానో బాధించింది, యూదులు రోమనులను అర్థం చేసికోలేదు, రోమనులు యూదులను అర్థం చేసికోలేక పోయారు. తత్ఫలితంగా యూదులు ఎన్నో బాధలకు గురయ్యారు. రోమనుల నుండి స్వాతంత్ర్యమును పొందుటను గూర్చి యూదులలో రెండు భావనలు ఉత్పన్నమగుటకు ఈ బాధలు కారణమయ్యాయి. ఒక ప్రక్క జెలోతీయుల వంటి వారు తిరుగుబాటుతో స్వాతంత్ర్యము పొందాలని ప్రయత్నించగా, మరి కొందరు మానవాతీతమైన విడుదల (supernatural deliverance) కొరకు నిరీక్షించారు..

3) మత సంబంధమైన నేపధ్యము:  

     యేసు జన్మించి, జీవించినప్పటి మతపరమయిన పరిస్థితిని అంచనా వేయుటకు యూదా మత ఆరాధన వ్యవస్థలు, యూదా మతములోని వివిధ శాఖల ప్రజలను గూర్చి కొన్ని విషయములను తప్పక గ్రహించాలి.

(a) యూదుల ఆరాధన వ్యవస్థలు : ఆలయము, మహాసభ, మరియు సమాజమందిరములనేవి యూదుల ఆరాధన వ్యవస్థలోని మూడు భాగములు… ‘

(i) ఆలయము : యోరూషలేములోని దేవాలయము ప్రపంచములోని యూదులందరి మతపరమయిన జీవితమునకు కేంద్రబిందువు వంటిది. ఇశ్రాయేలీయులు దేవునిచే ఎంపిక చేయబడ్డారనుటకు ఆలయం ఒక గుర్తు. తన ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారన్న సత్యమును ఆలయం, జ్ఞాపకం చేస్తుంటుంది. ఆలయంలో వంశపారంపర్యమయిన యాజకత్వం ఉండేది. అహరోను కుటుంబీకులు ప్రధానయాజకులుగా ఉండేవారు. యాజకులు 2.4 సమూహములుగా విభజింపబడ్డారు. వారు వంతుల వారీగా ఆలయములో పరిచర్య చేసేవారు (లూకా 1:5). బలులు అర్పించుట వీరి ముఖ్య విధి. ఇశ్రాయేలీయులు మూడు ముఖ్య పండుగలను ఆచరించేవారు. అవి : పస్కా పండుగ, పెంచుకోస్తు పండుగ, గుడారాల పండుగ. ఈ మూడు పండుగల సమయములలో ప్రపంచములోని యూదులందరూ తప్పక యెరూషలేము దేవాలయమునకు వచ్చేవారు

  (ii) మహాసభ : ఇది యూదుల ముఖ్య విమర్శసభ (మత్తయి 26:59; మార్కు 14:55, 15:1; లూకా 22:66). దీనిని మోషే ఆరంభించెనని యూదుల పారంపర్యము వలన తెలియుచున్నది (సంఖ్యా 11:16), కానీ యెహోషాపాతు యెరూషలేములో ఒక విమర్శ సభ ఏర్పాటు చేయుటనుబట్టి (2 దిన. 19:8) ఈ సభ మోషే కాలము నుండి లేదని కొందరు అభిప్రాయపడతారు. క్రొత్త నిబంధన కాలమందు ఈ సభను గూర్చిన సూచనలు మనకు స్పష్టముగా తెలియుచున్నవి. ఈ సభలో మతపరమయిన అక్రమములను విమర్శించేవారు. యూదుల గ్రంథముల ప్రకారము ఈ సభలో 71 మంది సభ్యులుండేవారని తెలియుచున్నది (70 మంది సభికులు, ప్రధానయాజకునితో కలిపి 71 మంది). ప్రధానయాజకులు, పెద్దలు, శాస్త్రులు ఈ సభయందు సభికులని మార్కు 14:53 ద్వారా మనము తెలుసుకొనవచ్చును. అరిమతయివాడగు యోసేపు ఇట్టి సభికులలో ఒకడు (మార్కు 1:43; లూకా 23:50).

ఈ సభకు యూదుల మతపరమయిన అంశముల విషయమై సర్వాధికారము ఉండెడిది (అ.కా 9:2). మహా హేరోదు పరిపాలనానంతరము వీరు రోమా ప్రభుత్వము నుండి యూదయలోని నేరములను విమర్శించి మరణశిక్షను సహితము అమలు చేయు అధికారం పొందిరి’ (మత్తయి 26:3,4; అ.కా. 4:5; 5:20; 22:30). అట్టి అధికారము వీరు కలిగియుండుట చేత బంట్రౌతులు వీరి అధీనమందుండిరి (మత్తయి 26:47). నేరస్థులయిన వారిని పట్టుకొని విచారణ చేయు అధికారమున్నను వారు విధించెడి మరణశిక్షలను రోమా గవర్నరు ఆమోదింపవలసి యుండెను (యోహాను 18:31). ఉదా : దేవదూషణ చేసెనను నేరము మీద క్రీస్తుకు మరణశిక్ష విధించారు (మత్తయి 26:57; యోహాను 19:7). పేతురు యోహానులను క్రీస్తును చంపిన దోషమును మహాసభపై మోపిరను నేరముపై పేతురు యోహానులను విచారణ చేసిరి (అ.కా. 1:5; 22), సైఫను దేవదూషణ చేసెనని తీర్మానించారు (7:27,58). పౌలు ధర్మశాస్త్రమును మీరెనని తీర్పు చెప్పారు (అ.కా. 22:30).

(ii) సమాజ మందిరము : దేవాలయము నిర్మూలించబడి ప్రజలు చెఱలో నున్నప్పుడు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినవి ఈ మందిరములు. క్రొత్త నిబంధన కాలమందు యూదులున్న ప్రతిస్థలమందు ఇవి ఉండేవి. ఎజ్రా నెహెమ్యాల కాలములలో గొప్ప సమాజ మందిరము ఏర్పరచినట్లు యూదుల పారంపర్యము వలన తెలియుచున్నది. ఆ సమాజ మందిరములో 120 మంది సభికులుండేవారు. ఎజ్రా సభకు అధిపతిగా ఉండెను. మోషే ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కాపాడుట వారి విధిగా ఉండెను. సమాజ మందిరములలో బోధించుటకు వారు ప్రత్యేకముగా శాస్త్రులను నియమింపక, బోధించుటకు క్రమశిక్షలను విధించుటకు పెద్దలను నియమించిరి. వారినే సమాజ మందిరపు అధికారులనిరి (అ.కా. 18:8). వీరు ఆరాధనలు జరిపిరి గానీ దేవుని వాక్యమును చదువుటకును (లూకా 4:16), హెచ్చరికలు చేయుటకును (అ.కా. 13:15) ఇతరులను నియమించి ఉండవచ్చును. వీరు కాక గ్రంధపు చుట్టలను బోధకునికి అందించుటకును, వాటి విషయమైన భద్రతకు సేవకులుండిరి (లూకా 4:20). పెద్దల వలన శిక్ష విధింపబడిన వారిని శిక్షించుట ఈ సేవకుల కర్తవ్యమై ఉండెను. అట్టివారిని సమాజ మందిరములలో గానీ, వాటి వద్ద ఉన్న గదిలోగాని శిక్షించేవారు (మత్తయి 10:17; అ.కా. 22:19). నేరస్థులను సమాజ మందిరములలోనికి అనుమతించక వారిని వెలివేసిరి (యోహాను 16:2).

ఆ మందిరములలో గ్రంధపు చుట్టులను పెట్టి చదువుటకు ఒక పీఠమును, చదివిన తరువాత జాగ్రత్త చేయుటకు ఒక పెట్టెయు, పెద్దలు, ధనవంతులు కూర్చుండుటకు బల్లలు మొదలగునవి ఉండెడివి (మత్తయి 23:6; యాకోబు 2:2,3). ప్రతి విశ్రాంతి దినమున ఆరాధన చేయుటకు కూడిరి. ప్రతి వారములోని రెండవ దినమున, ఐదవ దినమున దేవుని వాక్యమును వినుటకు కూడుకొనేవారు. స్త్రీలు, పురుషులు ప్రత్యేకముగా కూర్చునే వారు. మందిరములో ఎవరో ఒకరు ప్రార్ధించేవారు. అవి ముఖ్యముగా ద్వితీ. 6:4-9,11:13-21; సంఖ్యా 15:37-41 ఉన్న వాక్యములను, యూదుల వాడుకలో నున్న 18 ప్రార్థనలను వినియోగించేవారు. ప్రార్ధించునప్పుడు అందరు నిలువబడి (మత్తయి 6:5,11:25) ప్రార్థన ముగింపులో ఆమెన్ అనేవారు. మోషే ధర్మశాస్త్రము నుండి ఒక పాఠమును (అ.కా. 15:21) చదువగా దానికి ముందు, వెనుక స్తుతివాక్యములు చెప్పేవారు. ఆ తరువాత ప్రవక్తల నుండి పాఠమును చదివేవారు (లూకా 4:18,19) ఆ తరువాత దానిని చదివినవారు కానీ, యితరులు కానీ ప్రజలకు తగిన హెచ్చరికలు చేసేవారు (లూకా 4:16-22; అ.కా. 13:15). ఆశీర్వాదముతో ఆరాధన ముగింపబడేది. యాజకుడు సభ యందు ఉండిన యెడల అతడు ఆశీర్వదించేవాడు.

యేసు ప్రభువు తాను సంచరించిన గ్రామములలోని సమాజమందిరములలో బోధించెను (లూకా 4:15, 33,4-4). తన కుమార్తెను బాగుచేయమని క్రీస్తు యొద్దకు వచ్చిన యాయీరు సమాజమందిరపు అధికారియై యుండెను (మార్కు 5:22). యూదులు తాము చెదరిపోయిన అన్యుల దేశములలో కూడా ఇట్టి సమాజమందిరములను నిర్మించిరి. కుప్రలోని సలమిలోను (అ.కా 13:5), పిసిదియ అంతియొకయలోనూ (13:14), ఈకొనియలోను (14:1), థెస్సలొనీకయలోనూ (17:1), బెరయలోనూ (17:10), కొరింథులోను (18:4) సమాజ మందిరములు కలవు.

(b)యూదామత శాఖలు: నాలుగు సువార్తలలో ప్రముఖ పాత్రవహించిన పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, జెలోతీయులు, అను యూదా శాఖలన్నీ క్రీస్తు పుట్టుకకు పూర్వమే ఆరంభమయ్యాయి.

(i) పరిసయ్యులు : పరిసయ్యులనే నామధేయం కలిగిన ఒక వర్గం ప్రథమంగా జాన్ హిర్మానస్ (134-104 B.C.) పాలనలో స్థాపించబడింది. ‘పరిసయ్యుడు’ అనే పదానికి ‘వేరుపడినవాడని’ అర్థం. ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను తుచ తప్పకుండా పాటించాలనే పట్టుదలతో, హెల్లెనిజపు కలుషిత ప్రభావము నుండి దూరముగా తొలగిపోయిన వాడన్నది ఆదిలో దీని అర్థమయి ఉండవచ్చు. “పరిసయ్యులు ఇతరులకంటే భక్తిపరులుగా కనిపించారని, వారు ధర్మశాస్త్రాన్ని ఇతరుల కంటే చక్కగా వివరించగలిగారని” చరిత్రకారుడైన జోసిఫస్ వ్రాసాడు. ఆచారపరమైన పవిత్రతకు సంబంధించిన ఆజ్ఞలను అనుసరించే విషయంలో వారెంతో ఖచ్చితంగా వ్యవహరించేవారు. ఈ కారణం చేత అపవిత్రులౌతారనే భయంతో వారు భోజన సామాగ్రిని, పానీయములను అన్యుల వద్ద ఖరీదు చేసేవారు కాదు.

అంతేకాక పరిసయ్యులు పాపులకు తమ గృహంలో ఆతిధ్యమిచ్చినా, వారి ఇళ్ళలో మాత్రం భోజనం చేయరు, పరిసయ్యుడు పాపికి అతిధ్యమిచ్చే సమయంలో నూతన వస్త్రాలను ధరింప చేస్తారు. ఎందుకంటే పాపం చేసిన వాని దుస్తులు అపవిత్రమయినవి కావచ్చని వారి ఉద్దేశ్యం. గ్రీకు-రోమనుల ప్రభావంచేత మారుతున్న సంస్కృతి గల ప్రపంచంలో ధర్మశాస్త్రం అనుసరించబడాలనే దృఢ నిశ్చయంతో, వివిధ పరిస్థితులకు ధర్మశాస్త్రమును అన్వయింపచేసే, ఆచార, వ్యవహార విధానాన్ని పరిసయ్యులు రూపొందించారు.

క్రీస్తుకు పూర్వం మొదటి శతాబ్దంలో గొప్ప పరపతి కలిగిన ఇద్దరు పరిసయ్య అధ్యాపకులైన హిల్లెల్, షమ్మాయ్లు రెండు విభిన్న ధర్మశాస్త్ర సంప్రదాయాలను ప్రారంభించారు. వారి పేర్లతోనే ఆ సంప్రదాయములను పిలిచేవారు. వీరిలో హిల్లెల్ మితవాది. బీదలపై నిరంతరం దయకలిగిన వాడు. రోమను అధికారం యూదా సనాతత్వంతో అన్యోన్యంగా కలసి మెలసి ఉండగలదని అంగీకరించడానికి వెనుదీయని వాడు. దీనికి విరుద్ధంగా షమ్మాయ్ తన ధర్మశాస్త్రపు వివరణలో ఎంతో నిష్కర్షగా ఉండేవాడు. ఇతని అభిప్రాయాన్ని ఆమోదించిన వారు తుదకు జెలోతీయుల తెగగా ఏర్పడ్డారు. రోమీయులను వీరు ఎదిరించిన కారణముగానే A.D. 70లో యెరూషలేము ధ్వంసమైనది.

పరిసయ్యుల వేదాంతంలో ధర్మశాస్త్రానికి వ్యాఖ్యానంలా ప్రారంభమయిన పారంపర్యాచారం కాలక్రమేణా ధర్మశాస్త్రము యొక్క స్థానమును ఆక్రమించింది. ఈ వాదాన్ని సమర్థించడానికై సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు లిఖిత ధర్మశాస్త్రం లేక టోరా (Torah) తో పాటు మౌఖిక లేక వాచిక ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చారని చెపుతారు. అనుదిన జీవితానికి అంతగా అన్వయించని క్రమబద్ధమైన ధర్మశాస్త్రం కంటే (లిఖితపూర్వకమైన టోరా) ఆచరణలో ఉన్న ధర్మశాస్త్రం (నోటితో చెప్పబడి, ప్రజలు పారంపర్యాయముగా ఆచరిస్తున్నది) సామాన్య ప్రజల జీవితాలను ఎక్కువ ప్రభావితం చేస్తున్నందున, వాచక ధర్మాశాస్త్రాన్ని లిఖిత ధర్మశాస్త్రం కంటే ఎక్కువ నిష్ఠతో ఆచరించాలని మిష్నా (mishna) చెప్పడంతో ఈ వాదపు ప్రసిద్ధి అధికమైనది. ధర్మశాస్త్రంలోని అల్ప విషయాలకు ప్రాధాన్యతనివ్వడం తప్ప పరిసయ్యుల సిద్ధాంతంలో మరేమీ లేదని, ధర్మశాస్త్రం లోని అసలు ఉద్దేశ్యాన్ని పారంపర్యాచారం నిర్లక్ష్యం చేసిందని క్రొత్త నిబంధన ఋజువు చేసింది (మత్తయి 15:3).

సీకొదేము, అరిమతయి’ యోసేపు, గమలియేలు, తార్సువాడైన పౌలు క్రొత్తనిబంధనలో పరిసయ్య పారంపర్యాన్ని ఆచరించిన కొందరు ఘనులు

(ii) సద్దూకయ్యులు : క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు పరిసయ్యులను, సద్దూకయ్యులను పలుమారులు ఒకటిగా చేర్చి ఖండించినప్పటికి యేసుతో వారికున్న విరోధం విషయంలో తప్ప, మరెందులోనూ వారికి ఏకాభిప్రాయం లేదు. సద్దూకయ్యులు యెరూషలేములో ఉన్నత సంపన్న వర్గానికి చెందినవారు. ప్రధాన యాజక పదవికి అర్హులు. రాజకీయ నాయకులతో రాజీపడి పలుకుబడిని, సంపదను కొనితెచ్చే పదవులను సంపాదించేవారు. దేవాలయ నిర్వహణ, సంప్రదాయాలను పాటించడం వారి ప్రత్యేక బాధ్యత. సద్దూకయ్యులు సామాన్య ప్రజల నుండి తమను తాము దూరపరచుకొని ప్రజాదరణను పోగొట్టుకున్నారు..

మోషే ధర్మశాస్త్రం వరకే తమ ప్రామాణికతను పరిమితం చేసుకున్న సద్దూకయ్యులు, ధర్మశాస్త్రాన్ని విభిన్న నూతన పరిస్థితులకు అన్వయించడానికి పరిసయ్యులు చేసిన ప్రయత్నాలను నిరసించారు. సద్దూకయ్యులు పునరుత్థానాన్ని, ఆత్మలను, దేవదూతలను నమ్మరు (మార్కు 12:18; లూకా 20:27; అ.కా. 23:8). వారి విశ్వాసం అస్థిత్వంపై గాక అనేక శూన్యతా వాదాలు, వ్యతిరేక సిద్ధాంతాలతో కూడి ఉన్నందున వారు ఒక దృఢమైన మతసిద్ధాంతాన్ని గానీ, రాజకీయ వ్యవస్థను గానీ స్థాపించలేకపోయారు.

పరిసయ్యులు అన్యమతస్థులను సంతోషముగా తమ మతంలోనికి చేర్చుకొంటే (మత్తయి 23:15) సద్దూకయ వర్గం వారిని నిరాకరించింది. ప్రధానయాజకవర్గపు సభ్యులకు, యెరూషలేము ఉన్నత కుటుంబీకులకు తప్ప మిగిలిన వారికి ఈ శాఖలో సభ్యత్వం లభించేది కాదు. A.D. 70లో దేవాలయం ధ్వంసం చేయబడిన తరువాత సద్దూకయ వర్గం అంతరించింది.

(ii) ఎస్సెనీయులు : మృత సముద్రపు వాయువ్య మూలన ఖుమ్రాన్ (Qumran) వద్దనున్న సన్యాసుల మఠాలలో ఎస్సెనీయులు నివసించినట్లు తెలుస్తుంది. “ఎస్సెనీ’ పదం పలురకాలుగా ఉపయోగించబడినట్లు కనిపిస్తుంది. సన్యాసి జీవితాన్ని అభిలషించే వివిధ తెగలలోని యూదులు పలురకాల మతాచారాలను విశ్వసించి ఆచరించారు. వారందరిని కలిపి ఎస్సెనీయులుగా వ్యవహరించేవారు.

కఠినమైన, నిరాడంబరమైన జీవితాలను గడిపిన ఎస్సెనీయులను గూర్చి ప్రాచీన, రచయితలు ఘనంగా వర్ణించారు. ఈ సమాజ సభ్యులు లేఖనాలనే గాక పలు మతగ్రంథాలను అథ్యయనం చేసారు. సమాజం స్వయంపోషకమైనదిగా ఉండడానికి ప్రతి ఎస్సెనీయుడు కాయకష్టం చేయవలసి వచ్చింది. తమకు ఉన్న దానిని అందరు సమిష్టిగా పంచుకొనేవారు. పై అధికారి ఒకడు ఈ విషయాలను జాగ్రత్తగా పర్యవేక్షించేవాడు. ఎస్సెనీయులు అవివాహితులుగా ఉండేవారని ప్లినీ పేర్కొన్నాడు కానీ వివాహమాడే ఎస్సెనీ జాతి గురించి కూడా జోసిఫస్ ప్రస్తావించాడు. వివాహాన్ని త్యజించిన వర్గాల వారు ఎస్సెనిజపు ఆదర్శాలకు శాశ్వతత్వం కల్పించడానికై బాలురను పసి వయస్సులోనే దత్తత తీసుకొని వాటిని అలవరచేవారు. బానిసత్వాన్ని, యుద్ధాన్ని వారు నిరాకరించారు.ఎస్సెనీయులు అన్యమతస్థులను తమ వర్గంలో చేర్చుకొనే వారు. అయితే అనుభవం లేనివారికి సంపూర్ణసభ్యత్వం లభించాలంటే వారు కొంతకాలం కఠినమైన శిక్షణ పొందవలసి వచ్చేది. వీరు ఎన్నడూ అధిఖ సంఖ్యాకులు కాలేదు. కేవలం 4000 మంది మాత్రమే ఉండేవారని ఫిలో (Philo) పేర్కొన్నాడు.

‘    క్రైస్తవ్యానికి పూర్వపు యూదామతంలో ప్రస్ఫుటమైన అవినీతికి, ఒక ప్రత్యేక సమయంలో తెలియచేయబడిన తీవ్ర నిరసనయే ఎస్సెసీ ఉద్యమమనడంలో సందేహం లేదు. కాలక్రమేణా పలువురు సభ్యులు, పాలస్తీనా సమాజం నుండి వెలుపలికి వచ్చి ఖుమ్రాను వంటి ప్రదేశాలలో ఆత్మీయ శుద్ధీకరణకై ప్రయత్నించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.,

ఎస్సెనీయుల ప్రభావం ఇరవయ్యవ శతాబ్ధం వరకు వ్యాపించింది. సంఘచరిత్ర అధ్యయనంలో మనకు ఈ విషయాలు విశదపడతాయి. వారి ఆచారములలో అనేకం ఆయా క్రైస్తవ శాఖలలోనూ, సనాతన క్యాథలిక్కులకు సంబంధించిన వివిధ వ్యవస్థలలోనూ లీనమయిపోయాయి. వీరి గురించి వ్రాసిన వారందరు వారి కఠిన క్రమశిక్షణను గురించి, ధర్మశాస్త్రాన్ని స్వల్ప మార్పులు కూడా లేకుండా ఆచరించే విధానాన్ని గురించి నొక్కి చెప్పారు. సబ్బాతుదిన విశ్రాంతిని ఆచరించడంలో వారు యూదులందరిని మించిపోయారని జోసీఫస్ వ్రాసాడు. క్రొత్త నిబంధనలో గానీ, యూదుల టాల్ముడ్ లో గానీ వీరిని గూర్చిన ప్రస్తావన కనబడనందున యూదుల జీవన విధానంలో ఎసెనీలు ప్రముఖ పాత్ర నిర్వహించలేదని  విషయం విషదమౌతుంది

ఎస్సెనీయుల నీతి పరాయణత్వం శ్లాఘనీయమే అయినప్పటికి వారి బోధలలోని ధర్మశాస్త్రపరమైన చట్టాలు, వైరాగ్యం, యేసు బోధించి, నడచిన విధానానికి పూర్తిగా విరుద్ధమైనది.,

ధర్మశాస్త్రాన్ని తుచ తప్పకుండా ఆచరించే పరిసయ్యల పరిధిలో గానీ, ఎస్సెనీయుల సన్యాసత్వం, మఠ అభ్యాసాలలో గానీ, లేక సద్దూకయ్యుల ధనార్జనకొరకైన రాజకీయాలలో గాని యేసు చేరలేదు. “సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి” (మార్కు 12:37) అని ఆయనను గూర్చి వ్రాయబడినది.

(iv) ఇతరులు : రాజకీయరంగంలో భిన్నధృవాలుగా మెలిగిన యూదా తెగలైన హేరోదీయులు (మార్కు 3:6; మత్తయి 22:16), జెలోతీయులను (లూకా 6:15) గూర్చి క్రొత్తనిబంధనలో ప్రస్తావించబడినది.

హేరోదీయులు సమాజంలో పరపతి, ఉన్నతస్థానం కలిగిన యూదులు. వీరు హేరోదు రాజుల పాలనకు మద్దతు ఇచ్చారు. తత్ఫలితంగా హేరోదు రాజులను ఆదరించిన రోమనులకు కూడా వీరు మద్దతునిచ్చారు. వీరు పరిసయ్యులతో కలసి రెండు సార్లు యేసుకు వ్యతిరేకంగా ఆలోచన చేశారు (మార్కు 3:6, 12:13). జెలోతీయులు తీవ్రవాద దేశభక్తులు. ఆరునూరైనా రోమును ఎదిరించవలసిందేనని వీరు నిర్ణయించుకున్నారు. వారి మూఢశక్తి ఫలితంగా జరిగిన యుద్ధంలో టైటస్ సైన్యం’ A.D. 70లో యెరూషలేమును, దేవాలయాన్ని ధ్వంసం చేసింది.

ఈ శాఖలు వేటికి చెందక మౌనముగా, ప్రార్ధనాపూర్వకముగా దేవుడనుగ్రహించు రక్షణ కొరకు ఎదురు చూచేవారు కూడా కొందరు లేకపోలేదు (సుమెయోను, అన్నవంటివారు. వీరు ఇతరులతో కలిసి ” ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు… ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము” (యెషయా 25:9) అని ప్రకటించు నిమిత్తము దేవుడు సమస్తమును సిద్ధపరచి తన కుమారుని ఈ లోకమునకు పంపారు. దేవుడు సమస్తమును ఏవిధముగా సిద్ధపరిచారో తరువాతి పాఠములో నేర్చుకుందాము. 


బైబిల్ లో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం క్లిక్ చేయండి 

ప్రత్యక్ష గుడారం గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

 

Leave a comment

error: dont try to copy others subjcet.