డి.యల్. మూడీ.
d-l-moody-telugu
డి.యల్. మూడీ అమెరికాలోని మసాచూసెట్స్ ప్రాంతానికి చెందిన నార్త్ ఫీల్డ్ ఒక సామాన్యమైన కుటుంబంలో 1837 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించెను. చిన్న వయస్సులోనే ఈయన తండ్రి ఎడ్విన్ మూడీ మరణించుట వలన, భక్తి కల్గిన బెట్స్ అనే ఈయన తల్లి ఎంతో కష్టపడి పనిచేసి బిడ్డలను పెంచనారంభించెను. కుటుంబ పరిస్థితులను బట్టి మూడీ చిన్న వయస్సులోనే చదువుకు స్వస్తి చెప్పి, పొరుగువాని ఆవులు మేపుట ద్వారా కొంత డబ్బు సంపాదించి, తల్లికి సహకరించు చుండెను.
ఇంచుమించు 17 సంవత్సరముల వయస్సులో బోస్టన్ అనే ప్రాంతానికి వెళ్ళి అచ్చట ఉన్న తన మేనమామ చెప్పుల దుకాణములో పనికి కుదిరెను. ఆ సమయములో ఎడ్వర్డ్ కింబెల్ అనే సండేస్కూలు టీచర్ టీచర్ ద్వారా యేసుని గురించిన సువార్తను విని ఆత్మ రక్షణ యొక్క ఆవశ్యకతను గుర్తించి, పాపములను ఒప్పుకొని, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించెను.
తన రక్షణ అనుభవమును గూర్చి మూడీ ఇలా వ్రాసుకున్నాడు. “నేను రక్షించబడిన ఉదయం ఇంటి నుండి బయటకు రాగా నాకు అంతా క్రొత్తగా కనిపించెను. సూర్యుడు మరింత తేజస్సుతో ప్రజ్వలిస్తూ నన్ను చూసి నవ్వుచున్నట్లు అనిపించెను. చెట్లమీద పక్షులు స్తుతిగీతాలు పాడుచున్నట్లు, సర్వసృష్టి నా రక్షణ విషయమై ఆనందించుచున్నట్లు అనిపించెను. ఇది నేను మరువలేని అనుభవము.” యౌవనకాలంలో రక్షించబడ్డ డి. యల్. మూడీ తాను రక్షించబడ్డ వెంటనే ఈ గొప్ప రక్షణను ఇతరులకు కూడా అందించ ఆశించెను. ప్రతి ఆదివారం తనతో పాటు కనీసం ఐదుగుర్ని అయినా ఆలయానికి తీసుకొనివెళ్ళేవాడు. అంతేగాక వీథుల్లో అల్లరిగా తిరిగే పిల్లలందర్ని సమకూర్చి యేసుప్రభువును గూర్చి చెప్పేవాడు. ఆ తరువాత మురికివాడలలో నివసించే పేదల యొద్దకు వెళ్ళి, త్రాగుడుకు, వ్యభిచారమునకు, మరనేక రకములైన దురలవాట్లకు లోనైన జనులకు యేసుక్రీస్తు ఇచ్చే విడుదలను గురించి చెప్పి, ప్రార్థించి వారిని ప్రభువు బిడ్డలుగా మార్చేవాడు. ఈలాగు 3 సంవత్సరాల్లో ఇంచుమించు 1000 మందిని సమకూర్చ గలిగెను.
1862లో మూడీ “ఎమ్మా రేవెల్” అను కన్యకను వివాహము చేసుకొనెను. ప్రభువు వారికి ముగ్గురు బిడ్డలను అనుగ్రహించెను. అప్పటికి మూడీ చేయుచున్న చెప్పుల వ్యాపారం బాగా వృద్ధిలోనికి వచ్చెను గాని ఆత్మలను సంపాదించాలనే అతని ఆరాటం వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెట్టి యేసుప్రభువు సేవ చేయుటకు సమర్పించుకొనునట్లు చేసెను. ఆర్థికమైన ఇబ్బందులు కలిగినప్పటికిని మనుష్యులను ఆశ్రయింపక దేవునియందు విశ్వాసం ఉంచినందున దేవుడే ఆయన పరిచర్యను దీవించి, అభివృద్ధి పరచెను. మూడీ, దేవుని సన్నిధిలో అనేక గంటలు ప్రార్థించి, అనేక సంగతులను సేకరించి, తన వర్తమానమును అందించేవాడు.
డి.యల్. మూడీగారి జీవితము ద్వారా మనము నేర్చుకొనవలసిన మొదటి సంగతి- ఆయనలో ఉన్న ఆత్మల సంపాదన కొరకైన ఆరాటం! రెండవది- ఆయనలో ఉన్న తగ్గింపు! ఒకరోజు వర్తమానము అయిన తర్వాత ఒకతను వచ్చి “నీవు బహిరంగ కూటములలో బోధించుటకు తగవు. నీ భాషలో అనేక వ్యాకరణ దోషములున్నవి” అని కఠినంగా అన్నాడు. అందుకు మూడీగారు కోపగించుకొనక బహు దీనతతో “అవునండీ! చిన్నతనంలో నాకున్న పేదరికాన్ని బట్టి నేను ఎక్కువ విద్యను అభ్యసించుటకు అవకాశం దొరకలేదు. అయినను నాకున్న కొద్ది విద్యాజ్ఞానమును ఉపయోగించి, దేవుని ప్రేమను వివరించుటకు ప్రయత్నించు చున్నాను. మీకు వ్యాకరణం బాగా తెలుసు గదా! మరి మీరు దేవునికి సమర్పించుకొని సువార్త ప్రకటించవచ్చు గదా!” అని అనగా అవతల వ్యక్తి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయెను. d-l-moody-telugu
ఒకరోజు మూడీ ప్రసంగం ముగించిన వెంటనే ఒకాయన పరుగెత్తుకొని వచ్చి “ఆహా! ఎంత గొప్పగా ప్రసంగము చేసారండి” అని కరచాలనము చేయగా, మూడీ, “సోదరా! నేను వేదిక దిగక ముందే సాతాను ఈ మాటలు చెప్పినది. నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపినవానిదే. నేను కేవలము ఆయన వాక్యమును వినిపించే బూరను మాత్రమే” అనెను. మూడీ విమర్శకు కృంగెడివాడు కాదు; పొగడ్తలకు పొంగెడివాడు కాదు. “దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న ఒక వ్యక్తి జీవితములో అతని ద్వారా, అతని కొరకు, దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేయునో ఇంకనూ లోకము చూడలేదు. నేను సంపూర్ణముగా దేవునికి సమర్పించు కొన్న వ్యక్తిగా ఉండి, దేవుని గొప్ప కార్యాలను చూడాలనుంది” అని మాటిమాటికి చెప్పెడివాడు. d-l-moody-telugu
ఒకరోజు రాత్రి చికాగోలో మూడీ దేవుని ఆలయములో క్రీస్తు ఇచ్చు రక్షణ గురించి మంచి వర్తమానమును అందించిన తరువాత, “ఈ క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తారా? తృణీకరిస్తారా? మీరే నిశ్చయించుకొని వచ్చే ఆదివారం తెలియజేయండి” అని చెప్పి ఆరాధన ముగించెను. కాని, ఆ రాత్రి గొప్ప అగ్ని ప్రమాదం సంభవించి ఆ ఆలయము, ఆరోజున మీటింగులో ఉన్న అనేకుల గృహములు కాలిపోయినందున అనేకులు చనిపోయిరి. మూడీ – ‘అయ్యో! ఈ రోజే క్రీస్తును అంగీకరించండి’ అని నేను బోధించియుంటే అనేకులు క్రీస్తును అంగీకరించి యుందురు గదా! అప్పుడు వారు చనిపోయినప్పటికి దేవుని రాజ్య వారసులై యుండి యుందురు గదా! అని గ్రహించి; అప్పటి నుండి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని ప్రకటించుట మొదలు పెట్టెను. మూడీ ఈలాగు తనను, తన బోధను దిద్దుకొనుచు దేవునికి ఇష్టమైన, యోగ్యమైన సేవను చేయుటలో ముందుకు సాగుచుండెను.
ఈలాగు మూడీ భక్తుడు తన జీవిత కాలములో రేడియో, టి.వి. సహాయము లేకుండానే ఇంచుమించు ఒక కోటిమందికి సువార్తను అందించెనని అంచనా వేసారు! అంతేగాక మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ను, పుస్తక శాలలను స్థాపించెను. మాస పత్రికను కూడా నడిపించెను. ఇంకను అనేక రీతులుగా ఆయన ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడెను. “నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం” అంటూ ఒకరోజు మూడీ చనిపోయాడనే ప్రకటన మీరు పేపరులో చదువుతారు గాని దానిని మీరు నమ్మకండి. 1837 లో పుట్టిన నా మట్టి శరీరము మట్టయిపోయినా 1855 లో తిరిగి పుట్టిన నా ఆత్మ నిరంతరము పరలోక రాజ్యములో జీవించును” అనెడివాడు. d-l-moody-telugu
ఈలాగున 44 సంవత్సరములు ప్రభువు సేవలో అరిగిపోయిన మూడీ తన మరణపడకపై ఉండి, “ఆహా! ఇదే నా విజయమ్ము. ఇదే నా పట్టాభిషేకపు సుదినము” అని తన చివరి మాటలు చెప్పి 1898 డిశంబరు 22న ప్రభువు సన్నిధికేగి ప్రభువు ఇచ్చు బహుమానము పొందెను. d-l-moody-telugu
All Pdf….Download