యెషయా గ్రంధం వివరణ| Book of Isaiah-telugu-2023

Written by biblesamacharam.com

Updated on:

యెషయా గ్రంధం వివరణ

Book of Isaiah-telugu

    పాత నిబంధనలోని 17 ప్రవచన గ్రంథాలలో యెషయా గ్రంథం మొదటిది. ప్రత్యేకతలోనూ మొదటి గ్రంథముగా ప్రసిద్ధి చెందింది. యోబు గ్రంథం మొదలుకొని పరమగీతం వరకు గల కావ్య గ్రంథములు ఇశ్రాయేలీయుల పసిడికాలములో రాయబడితే – యెషయా మొదలుకొని మలాకీ వరకు గల ప్రవచన గ్రంథాలు ఇశ్రాయేలీయుల అంధకార కాల ఘట్టంలో రాయబడివున్నాయి.

   ఐక్య ఇశ్రాయేలు – తదుపరి కాలంలో రెండుగా విభాగింపబడ్డాయి. అవి ఉత్తర రాజ్యమూ, దక్షిణ రాజ్యమూ అంటూ విడిపోయాయి. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అనీ, దక్షిణ రాజ్యాన్ని యూదా రాజ్యమూ అని పిలిచారు. ఉత్తర రాజ్యముగా ఏర్పడిన రాజ్యంలో 10 గోత్రాలు ఉండగా, దక్షిణ రాజ్యంగా ఏర్పడిన రాజ్యంలో రెండు గోత్రాలు కలవు. ఉత్తర రాజ్యానికి రాజధాని షోమ్రోను అయితే – దక్షిణ రాజ్యానికి రాజధాని యెరూషలేము.

    అయితే పై రెండు రాజ్యాలు దేవునికి దూరమై, ఆధ్యాత్మికంగా పడిపోయి, విగ్రహారాధన మొదలగు పాపములలో దిగజారినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపి వారితో మాట్లాడాడు. క్రీ.పూ 9వ శతాబ్దము నుంచి క్రీ.పూ. 4వ శతాబ్దము వరకు గల కాలాన్ని ప్రవక్తల కాలముగా పిలుస్తారు.

   పై కాలానికి చెందినవాడే ఈ యెషయా ప్రవక్త. ఆమోజు కుమారుడైన యెషయా రాజవంశీకుడు. యూదా రాజైన యోవాషు మనుమడు. యెషయా అనే పేరుకు యెహోవా రక్షణ, లేదా రక్షించువాడు అని అర్థం. యెషయా ప్రవక్త ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా మరియు మనషే అనే ఐదుగురు యూదా రాజుల కాలంలో ప్రవచన సేవ జరిగించాడు. అతడు మెస్సీయా ప్రవక్త అని పిలువబడుతున్నాడు. కారణం – కీర్తనల గ్రంథం తర్వాత ఎక్కువగా మెస్సీయాను గూర్చిన ప్రవచనాలు వ్రాయబడిన గ్రంథం యెషయా.

   యెషయా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకుగల పుస్తకాలను 16 మంది ప్రవక్తలు రాసారు. ఈ 16 మందిలో నలుగురుని పెద్ద ప్రవక్తలూ అనియు, 12 మందిని చిన్న ప్రవక్తలూ అనియు పిలుస్తారు. వారి గ్రంథాలలోని “ముఖ్యత్వం” ను ఆధారం చేసికొని గాక, వారి ప్రవచన గ్రంథాల “పరిమాణమును” బట్టి, అంటే కొలతను బట్టి పెద్ద ప్రవక్తలూ, చిన్న ప్రవక్తలూ అంటూ పండితులు విభజించారు.

    వీరిలో యెషయా, యిర్మీయా, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము హబక్కూకు మరియు జెఫన్యా మొదలగు 11 మంది ప్రవక్తలు చెరకాలమునకు ముందు జీవించి, ప్రవచించినవారు. యిర్మీయా కాలము మాత్రం కొంత చెర నివాస కాలముగా నున్నట్లు చూస్తాం. 

   దానియేలు, యెహెజ్కేలు మొదలగువారు చెరపట్టబడిన కాలములో సేవ జరిగించారు. హగ్గయి, జెకర్యా, మలాకీ మొదలగువారు చెర అనంతరం ప్రవచించి సేవ చేసారు. 

   క్రీ.పూ. 740 వ సంవత్సరంలో రాజైన ఉజ్జీయా మరణించినప్పట్నించీ (యెషయా 6:1తో పోల్చండి) క్రీ.పూ. 687 లో హిజ్కియా మరణించేంత వరకు యూదా చరిత్రలో 50 సంవత్సరాలకు పైగా యెషయా పరిచర్య కొనసాగింది. యెషయా భార్య కూడ ప్రవక్తినీ అని రాయబడింది. అతనికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని వ్రాయబడింది (యెషయా 7:3; 8:1-4). అతడు దేవుని మహిమను చూచినవాడు. తన పరిచర్యను గూర్చిన ప్రత్యేక పిలుపును దర్శనాన్ని పొందినవాడు (యెషయా 6వ అధ్యాయం, యోహాను 12:41).

    హిజ్కియా వారసుడు, అతని కుమారుడునైన దుష్టుడైన మనప్నే యెషయాను రంపముతో రెండుగా కోయించి చంపినట్లు హెబ్రీ సంప్రదాయం చెబుతోంది. హెబ్రీ 11:37లో చెప్పబడిన సంగతి యెషయాను గూర్చే అని కొందరు పండితులు చెబుతున్నారు.

   యెషయా యెరూషలేములో పలుకుబడి కలిగిన ఒక ఉన్నత వర్గానికి చెందిన కుటుంబములో జన్మించినవాడు. అతడు విద్యావంతుడు. ప్రత్యేక భాష తీరును మరియ వ్యాకరణ తీరును బాగా ఎరిగినవాడు. రాజరికంతో సంబంధాలు కలిగి రాజ్య విదేశాంగ కార్యకలాపాలను గూర్చి యూదా రాజులకు ప్రవచనాత్మకమైన సలహాలనిస్తూ, ఒక కవిగా, ప్రవక్తగా వరాలు కలిగిన వ్యక్తి. రాజ్యానికి సాదృశ్యరూపకమైన సందేశాలను ఇచ్చే పేర్లు గల ఇద్దరు కుమారులు యెషయాకు ఉన్నారు.

    యెషయా – హోషేయ, మీకాల సమకాలికుడు. అష్షూరు సామ్రాజ్యం యొక్క భయానకమైన విస్తరణ, ఇశ్రాయేలు రాజ్య అంతిమ పతనం, యూదా రాజ్యం యొక్క ఆత్మీయ నైతిక పతనకాలంలో అద్భుతమైన ప్రవచన పరిచర్య జరిగించాడు. ఇశ్రాయేలు, సిరియాలకు వ్యతిరేకంగా సహాయం కోసం అష్షూరు వైపు చూడొద్దని యూదా రాజైన ఆహాజును యెషయా హెచ్చరించాడు. క్రీ.పూ 722లో ఇశ్రాయేలు రాజ్యం పతనమైన తర్వాత అష్షూరుకు వ్యతిరేకంగా ఇతర రాజ్యాలతో నిబంధనలు చేసుకోవద్దని యూదా రాజైన హిజ్కియాను హెచ్చరించాడు. ఆ యిద్దరు రాజులకు వారి భద్రత, క్షేమం కొరకై దేవుని మీదనే నమ్మిక ఉంచాలని అతడు చెప్పాడు (7:3-7; 30:1-17).

రాజైన హిజ్కియా కాలంలో అతడు విస్తారమైన ప్రాబల్యాన్ని అనుభవించాడు.

యెషయా గ్రంథం రచనలో 3 రకాల ఉద్దేశాలు కనిపిస్తున్నాయి.

   మొదటిది – వారి పాపం, వారిపైకి రాబోతున్న దేవుని తీర్పు విషయమైన దేవుని వాక్కుతో ప్రవక్త తన స్వంత దేశాన్నీ, ఇతర సమకాలీన రాజ్యాలను హెచ్చరిస్తున్నాడు. 

   రెండవది – తరువాత ప్రత్యక్షతలతో కూడిన దర్శనాలతోనూ, ప్రవచన ఆత్మతోనూ నిండి, భవిష్యత్తులో యూదులు తగిన సమయంలో చెరనుంచి విడుదలై అన్య జనాంగాలకు వెలుగుగా ఉంటారు అనే నిరీక్షణను యెషయా ప్రవచించాడు. 

   మూడవది – దావీదు గోత్రం నుంచి మెస్సీయాను దేవుడు పంపిస్తాడని యెషయా ప్రవచించాడు. ఆ మెస్సీయా ఇచ్చే రక్షణ దేవుని ప్రజలకు పాత, క్రొత్త నిబంధనల కింద గొప్ప నిరీక్షణ కల్గించేలా ఈ భూమిమీదనున్న అన్ని జనాంగాలకు వ్యాపిస్తుంది. 

యెషయా గ్రంథ విశిష్టత విశిష్టతలలోకెల్లా విశిష్టమైనది.

   బైబిలు మరియు యెషయా గ్రంథాల విభజనలో కొన్ని సమాన పోలికలు ఉన్నాయి. బైబిలులో 66 గ్రంథాలున్నాయి – యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకే యెషయా గ్రంథాన్ని పాత నిబంధన చిన్న బైబిలు అని పిలుస్తారు.

   పాత నిబంధనలో 39 గ్రంథాలున్నాయి – అలాగే యెషయా మొదటి విభాగంలో కూడా 39 అధ్యాయాలున్నాయి. పాత నిబంధనలోని 39 గ్రంథాలలో తరుచుగా ధర్మశాస్త్రం మరియు తీర్పును గూర్చి పదే పదే చెప్పబడింది – యెషయా గ్రంథంలోని మొదటి 39 అధ్యాయాలలో ధర్మశాస్త్రం మరియు తీర్పును గూర్చి ప్రవక్త పదే పదే నొక్కి వక్కాణించాడు.

   యెషయా గ్రంథంలోని మిగిలిన 27 అధ్యాయాలు, అనగా 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు గల భాగంలో – కృప మరియు రక్షణను గూర్చి బహు తేటతెల్లముగా తెలియజేసాయి. అలాగే కొత్తనిబంధనలోని 27 పుస్తకాలలో – కృప మరియు రక్షణనుగూర్చే మనం ఎక్కువగా చదువుతాం. క్రొత్త నిబంధన మూలాంశం క్రీస్తే. అలాగే యెషయా గ్రంథంలోని రెండవ భాగం మూలాంశం కూడా క్రీస్తే.

   క్రొత్త నిబంధన బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యతో ప్రారంభించబడుతోంది. అలాగే యెషయా గ్రంథం రెండవ భాగం అయిన 40వ అధ్యాయం బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చిన ప్రవచనంతో ప్రారంభమవుతోంది (యెషయా 40:1,2).

   క్రొత్తనిబంధనలోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం – క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గూర్చిన సందేశంతో ముగించబడితే – యెషయా గ్రంథంలోని చివరి అధ్యాయమైన 66వ అధ్యాయములో కొత్త ఆకాశము, కొత్తభూమిని గూర్చిన ప్రవచనముతో ముగించబడింది (యెషయా 66:22).

    యెషయా గ్రంథం 5వ సువార్త అని కూడ పిలువబడుతుంది. ఎందుకంటే, కొత్తనిబంధనలోని 4 సువార్తల వలెనే యెషయా గ్రంథంలో కూడ – క్రీస్తు జన్మ, ఆయన జీవితం, మరణం మరియు పునరుత్థానములను గూర్చి వ్రాయబడింది.

యెషయా గ్రంథంలో ఏడు నిత్య విషయాలున్నాయి.

  1. నిత్య రక్షణ (యెషయా 45 అధ్యా॥) 2. నిత్య వెలుగు (యెషయా 60 అధ్యా॥) 3. నిత్యానందము (యెషయా 35 అధ్యా॥) 4. నిత్యశక్తి (యెషయా 26 అధ్యా॥) 5. నిత్యకృప (యెషయా 54 అధ్యా॥) 6. నిత్య నిబంధన (యెషయా 55 అధ్యా॥) 7. నిత్య తీర్పు (యెషయా 37 అధ్యా॥).

   యెషయా గ్రంథం మన ప్రభువైన క్రీస్తును మహిమ రాజ్యమునేలు మెస్సీయాగా చూపిస్తోంది. యూదులు మెస్సీయా వచ్చి పరిపాలిస్తాడు అని నమ్ముతున్నారు. అయితే వారు ఆ మెస్సీయా నేరుగా వచ్చి మహిమతో పరిపాలిస్తాడు అని విశ్వసిస్తున్నారు. దావీదు సింహాసనంపై ఆయన ఆసీనుడై పరిపాలించేది వాస్తవమే! అయితే దానికి ముందు ఆ మెస్సీయా సిలువకు వెళ్లవలసి ఉంది. దానిని గూర్చే యెషయా తన గ్రంథంలో 53వ అధ్యాయంలో వర్ణించాడు. మహిమ రాజ్యమునేలు మెస్సీయా పాత్ర సరే సరి! దానికి ముందు ఆ మెస్సీయా సిలువ శ్రమలు భరించే పాత్ర కూడ గ్రంథంలో నొక్కి చెప్పాడు యెషయా.

    సింహాసనంపై కూర్చొని ఏలుబడి చేసే మెస్సీయా పాత్ర ఒకటి ఉంది – దానికి ముందు శిలువకు వెళ్ళే పాత్ర కూడ మరొకటి ఉంది. మెస్సీయ మొదటి రాకడలో – శిలువపాత్ర. మెస్సీయ రెండవ రాకడలో – సింహాసనంపై కూర్చొని ఏలే మహిమ పాత్రలు కలవు. యూదులకు ఇప్పటికీ మింగుడు పడని విషయం ఏమిటంటే – మెస్సీయా వచ్చి మహిమ పాలన చెయ్యాలి గాని, శిలువకు వెళ్ళడమేంటి? శిలువకు వెళ్ళేవాడు సింహాసనం ఎలా ఎక్కుతాడు? ఏం ఎక్కుతాడు? ఇదీ, వారి తొట్రుపాటుకు కారణం. 

   మొదటి, రెండు రాకడలు రెండు కొండలు. మొదటి రాకడ కొండ – కల్వరి కొండ. రెండవ రాకడ కొండ – ఒలీవల కొండ. మెస్సీయా తన మొదటి రాకడలోని ఉద్దేశం కల్వరి కొండపై నెరవేరింది. తన రెండవ రాకడలోని ఉద్దేశాలను నెరవేర్చుకొనుటకు ఆయన ఒలీవల కొండపై కాలుమోపవలసి ఉంది. ఈ రెండు కొండల నడుమ ఓ సువిశాలమైన లోయ ఒకటి ఉంది. అదే సంఘము! 

   యెషయా గ్రంథాన్ని మనం రెండు విభాగాలుగా విభజింపబడిందని చెప్పుకున్నాం కదా! యెషయా గ్రంథం 1 నుండి 39 అధ్యాయాలు మొదటి భాగం. 40 నుంచి 66 వ అధ్యాయం వరకు రెండవ భాగం. యెషయా గ్రంథంలోను, మొత్తం బైబిల్లోను ఉన్న రెండు విభాగాల్లోనూ (క్రొత్త నిబంధన, పాత నిబంధన) క్రీస్తు యొక్క విమోచన కార్యం అంతర్లీనంగా వాటిని కలిపి ఉంచే తాడుగా కన్పిస్తోంది.

యెషయా గ్రంథంలోని మొదటి భాగమును మనం మరల నాలుగు పెద్ద విభాగాలుగా విభజించవచ్చు (అంటే యెషయా 1 నుండి 39 అధ్యాయాలు).

A) 1 నుండి 12 అధ్యాయాలలో – మోసపూరితమైన అభివృద్ధి కాలంలో యూదా జాతి వారి విగ్రహారాధన, లైంగిక అవినీతి, సాంఘిక అన్యాయాలను బట్టి హెచ్చరిస్తూ ప్రవక్త వారిని నిరసించాడు. రాబోయే తీర్పునూ ప్రవచించాడు. దాంతోపాటూ మెస్సీయాను గూర్చి ప్రాముఖ్యమైన ప్రవచనాలూ (ఉదాహరణకు 2:4, 7:14,9:6-7, 11:1-9) చెప్పాడు. ప్రవక్త తన స్వంత పాపం నుంచి ప్రక్షాళనమైన సంగతి మరియు ప్రవచన పరిచర్య కొరకైన దేవుని నియామకం అనే స్వంత సాక్ష్యం కూడా కన్పిస్తాయి.

B) 13 నుంచి 23, అధ్యాయాలలో – యూదా చుట్టూ ఉన్న సమకాలీన రాజ్యాల పాపం, వాటిపైకి రాబోతున్న దేవుని తీర్పులను గురించి మనకు కన్పిస్తోంది.

C) 24 నుంచి 35 అధ్యాయాలలో – భవిష్యత్తులో కలిగే రక్షణ, తీర్పులు గురించిప్రవచన వాగ్దానాలు ఉన్నాయి.

D) 36 నుంచి 39 అధ్యాయాలలో – రాజైన హిజ్కియా జీవితంలో నుంచి ఎంపిక చేయబడిన చరిత్ర కన్పిస్తోంది. దీనిని 2 రాజులు 18:13 – 20:21లో కూడచూడగలం.

   ఇకపోతే, యెషయా గ్రంథంలోని రెండవ భాగం, అనగా 40 నుంచి 66 అధ్యాయాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

   బైబిలంతటిలో అత్యంత గంభీరమైన విషయాలు రెండున్నాయి. ఒకటి – దేవుని గొప్పతనం. రెండవది – ఆయన విమోచన ప్రణాళిక యొక్క వైశాల్యం. ఈ రెండూ యెషయా గ్రంథంలోని రెండవ భాగంలో మహోన్నతంగా కనిపిస్తాయి. ఈ అధ్యాయాలు హిజ్కియా పాలనలోను, ఆ తర్వాత శతాబ్దాల కాలంపాటు దేవుని ప్రజలలో నిరీక్షణను, ఆదరణను కలిగించాయి.

   దేవుని మహిమ శక్తితోనూ, నీతియుక్తమైన, ఫలవంతమైన శేషం ఇశ్రాయేలులోను, ఇతర రాజ్యాలలోను నిలిపి ఉంచుతాననే ఆయన వాగ్దానాలతోనూ ఆ ప్రవచనాలు నిండి ఉన్నాయి. వీటి ద్వారా దేవుని పరిపూర్ణ విమోచనాత్మక ప్రేమ వెల్లడవుతుంది.

   ఈ వాగ్దానాలకూ, వాటి నెరవేర్పుకూ శ్రమలు అనే అంశానికీ సంబంధం ఉంది. యెషయా యొక్క “సేవక గీతాలు” (42:1-4; 49:1-6; 50:4-9; 52:13 – 53:12) లో ఇవి కనిపిస్తూ ఉన్నాయి.       

   యూదులు యొక్క చెర అనుభవాలను దాటి భవిష్యత్తులోని యేసుక్రీస్తు ఆగమనం, ఆయన యొక్క ప్రాయశ్చిత్త మరణాన్ని ఇవి సూచిస్తున్నాయి (53 అధ్యా॥). రాబోయే మెస్సీయా నీతిని కాంతివంతంగా వెలిగేలా చేస్తూ, మండుతున్న ఒక కాగడావలె తన రక్షణను జాతులకు వ్యాపింపజేస్తాడని ప్రవక్త ముందుగానే చెబుతున్నాడు (60-66అధ్యా॥)

   దేవుని మార్గాల పట్ల ప్రజల ఆత్మీయ అంధత్వాన్ని అతడు నిరసిస్తూ, సమస్త విషయాలూ నెరవేరడానికీ దేవుని ప్రజల విజ్ఞాపన ప్రార్థనలూ, వారి ఆత్మీయ వేదనలు అవసరం అంటూ అతడు చెబుతున్నాడు (42:18 – 25; 56:6-8; 62:1-2, 6-7; 66:7-18 తో పోల్చండి).

పనిలో పనిగా యెషయా కాలం నాటి చరిత్రను కూడ కొంత చెప్పుకుందాం.

    దేవుని సార్వభౌమత్వం స్పష్టంగా వెల్లడించబడింది. యెషయా జీవించిన కాలంలో ప్రపంచ చరిత్ర క్లిష్టపరిస్థితులలో ఉన్నది. ఒత్తిడులతో కూడిన పరిస్థితులలో యెషయా దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించగలిగాడు. విశ్వాసులుగా మనం మన జీవిత పరిస్థితులలో దేవుని హస్తాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తిస్తే మనం ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం.

    ఆ దినాలలో ప్రపంచాన్ని కదిలించే సంఘటనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. హఠాత్తు ఉపద్రవాలు మరియు చెలరేగిన హింస ద్వారా దేవుని తీర్పు జరిగించబడింది. సాంఘిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర దిక్కునుంచి అష్షూరు సైన్యాన్ని వ్యూహపరచుకొంటుంది. అప్పటికే ఇశ్రాయేలు వారిని (ఉత్తర రాజ్యం) వారు స్వాధీనం చేసుకున్నారు.

    దక్షిణ రాజ్యాన్ని 1,85,000 మంది అష్షూరు సైన్యం చుట్టుముట్టింది. అప్పుడు యూదా ఎటుతోచని అయోమయ స్థితిలో ఉంది. ఈ పరిస్థితులలో హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించాడు.

   దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రస్తుతం అపూరు యూదాను జయించలేదని సెలవిచ్చాడు. ఆయన యూదాకు మరో అవకాశం ఇచ్చాడు. వారు ఆయన హెచ్చరికను వినాలని కోరాడు. కాని వారు వినలేదు. కాబట్టి దేవుడు జోక్యం చేసుకున్నాడు.

ఆయన జోక్యం చరిత్రలో గొప్ప మార్పులు కలిగించింది. ఈ పరిస్థితులలో లోకం, దేవుడు తన సింహాసనం నుంచి తొలగిపోయాడనీ, లోకాన్ని ఒక ప్రక్కకు త్రోసివేసాడని తలంచింది.

అయితే దేవుడు ఇంకా సింహాసనాసీనుడైయున్నాడని, పాపాన్ని శిక్షిస్తాడని యెషయా స్పష్టం చేసాడు. అంత మాత్రమే కాదు, దేవుడు దేనిని బట్టి దేశాలకు తీర్పు తీరుస్తాడో వివరించాడు.

ఆయనే రాజ్యాలను స్థాపిస్తాడు మరియు కూలదోస్తాడు!

నేటి ప్రపంచ రాజ్యాలన్నీ సాతానువే (1యోహాను 5:19). అయినా దేవుడే వాటిని పరిపాలిస్తాడు (యెషయా 37:16). దేవుడు గొప్ప రాజ్యాలను లేవనెత్తి, సాతాను వాటిని ఉపయోగించేలా అనుమతించాడు. అయితే ఆయన తన ప్రణాళిక చొప్పున ఏ రాజ్యాన్నైనా తొలగించాలనుకొన్నప్పుడు, దానిని నాశనం చేస్తాడు. అలా చరిత్రలో చేశాడు కూడ. ఆయనను అడ్డగించే శక్తి సాతానుకు లేదు. 

ఆయన లోక రాజ్యాలన్నిటిని పరిపాలిస్తాడని నిరూపించడానికీ ఆయన స్వంత జనాంగమైన యూదులే సాక్ష్యం.

యెషయా గ్రంథంలో ఎనిమిది ప్రత్యేకాంశాలు, లేక లక్షణాలు ఉన్నాయి.

  1. ఇది హెబ్రీ పద్య విధానంలో వ్రాయబడి, కవితా మాధుర్యంలోను శక్తిలోను చాతుర్యంలోను ఓ గొప్ప సాహిత్య మణిపూసగా నిలుస్తోంది. యెషయా శైలిలోని పదసంచయాలు మిగిలిన పాత నిబంధన రచయితలు అందరినీ అధిగమించేలాఉన్నాయి.
  2. పాత నిబంధనలోని మిగిలిన గ్రంథాలన్నిటి కంటే అతని ప్రవచనాలు యేసుక్రీస్తు సువార్త యొక్క పూర్తి స్పష్టమైన ప్రత్యక్షతతో నిండియున్నాయి. అందుకే అతణ్ని “సౌవార్తిక ప్రవక్త” అని పిల్చారు.
  3. 53వ అధ్యాయంలో సిలువను గూర్చిన అతని దర్శనం బైబిలు అంతటిలోకీ పాపుల కొరకు యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తార్థ మరణాన్ని గురించిన అతి స్పష్టమైన సవివరమైన ప్రవచనం.
  4. ఇది పాత నిబంధనలోని ప్రవక్తల గ్రంథాలన్నిటిలోకీ బహు వేదాంతపరమైన సమగ్రమైన గ్రంథం. ఇది దేవుని చేత – పరలోకం భూమి మానవసృష్టి మొదలుకొని (ఉదాహరణకు 42:5) చరిత్ర ముగింపు, దేవునిచే నూతన ఆకాశం, నూతన భూమి సృష్టివరకు (ఉదాహరణకు 65:17; 66:22) కొనసాగింది.
  5. దేవుని స్వభావం, ఔన్నత్యం, పరిశుద్ధతల గురించి మరి ఏ ఇతర పాత నిబంధన ప్రవక్తల గ్రంథములలోనూ లేని ప్రత్యక్షత దీనిలో ఉంది. యెషయా వర్ణించిన దేవుడు పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు. మానవుల రాజ్యాలలోని పాపానికీ, దుర్నీతికీ తీర్పు తీర్చేవాడు. దేవుని గురించి యెషయాకు ఇష్టమైన మాటలు “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు”.
  6. “రక్షణ” అనే మాట పాత నిబంధన ప్రవచన గ్రంథాలన్నిటినీ కలిపి చూసినామూడు రెట్లు ఎక్కువగా యెషయా తన గ్రంథంలో వాడాడు. ఇతడు రక్షణ ప్రవక్త. దేవుని రక్షణ యొక్క పూర్తి ఉద్దేశం కేవలం మెస్సీయాకు సంబంధించి మాత్రమే నెరవేరుతుందని యెషయా బయలుపరిచాడు.
  7. ఇశ్రాయేలు చరిత్రలో గతకాలంలో జరిగిన విమోచన సంఘటనలను అతడుతరచుగా ప్రస్తావించాడు (ఉదాహరణకు నిర్గమనం 4:5-6; 11:15; 31:5; 43:16-17). సొదొమ గొమొర్రాల నాశనం (1:9), మిద్యానీయులపై గిద్యోను విజయ వృత్తాంతం (9:4; 10:28; 28:21), ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలోని మోషే ప్రవచనాత్మక గీతాన్ని కూడ అతడు ప్రస్తావించాడు(1:2; 30:17; 43:11,13)
  8. క్రొత్త నిబంధనలో ఎక్కువగా ప్రస్తావించబడిన పాత నిబంధన మూడు గ్రంథాలలో యెషయా ఒకటి. మిగిలిన రెండుగ్రంథాలు – ద్వితీయోపదేశకాండం మరియు కీర్తన గ్రంథాలు.

ఈ గ్రంథంలోని క్రీస్తును గూర్చిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలో ఏ విధంగా నెరవేరాయో కూడ చూడండి!

* మెస్సీయాకు వైతాళికునిగా రానున్న బాప్తిస్మమిచ్చే యోహాను గూర్చి యెషయా ప్రవచించాడు (యెషయా 40:3-5ని మత్తయి 3:1-3తో పోల్చండి)

* ఆయన అవతారం మరియు ఆయన దైవత్వం (యెషయా 7:14ని మత్తయి 1:22 – 23, లూకా 1:34-35తో పోల్చండి. యెషయా 9:6,7ని లూకా 1:32,33, 2:11తో పోల్చండి)

* ఆయన యవ్వనం (యెషయా 7:15-16; 11:1ని లూకా 3:23, 32; అపొ.కా. 13:22-23తో పోల్చండి)

* ఆయన పరిచర్య (యెషయా 11:2-5; 42:1-4; 60:1-3; 61:1ని లూకా 4:17-19,21తో పోల్చండి).

* ఆయన విధేయత (యెషయా 50:5ని హెబ్రీ 5:8తో పోల్చండి)

* ఆయన సందేశం, ఆత్మాభిషేకం (యెషయా 11:2; 42:1; 61:1 ని మత్తయి 12:15-21తో పోల్చండి)

* ఆయన చేసిన అద్భుతాలు (యెషయా 35:5,6ని మత్తయి 11:2-5తో పోల్చండి)

* ఆయన శ్రమలు (యెషయా 50:6ని మత్తయి 26:67; 27:26, 30తో పోల్చండి, యెషయా 53:4,5,11ని, అపొ 8:28 – 33తో పోల్చండి)

* ఆయన పొందిన తిరస్కారం (యెషయా 53:1-3ని లూకా 23:18; యోహాను 1:11, 7:5తో పోల్చండి)

* ఆయన పొందిన అవమానం (యెషయా 52:14ని ఫిలిప్పీ 2:7,8తో పోల్చండి)

* ఆయన ప్రాయశ్చిత్తార్థ మరణం (యెషయా 53:4-12ని రోమా 5:6తో పోల్చండి)

* ఆయన ఆరోహణం (యెషయా 52:13ని ఫిలిప్పీ 2:9-11తో పోల్చండి)

* ఆయన రెండవ రాకడ (యెషయా 26:20, 21ని యూదా 14తో పోల్చండి; యెషయా 61:2,3ని 2థెస్సలోనిక 1:5-12తో పోల్చండి; యెషయా 65:17-25ని, 2 పేతురు 3:18తో పోల్చండి).

 

రచయిత :David paul Garu.


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి కింద క్లిక్ చేయండి

click here

Leave a comment