sadhu sundar singh encounter with jesus|సాధు సుందర్ సింగ్|Telugu

Written by biblesamacharam.com

Updated on:

sadhusundarsingh

పూర్తి పేరు :

 సాధు సుందర్ సింగ్

జన్మ స్థలం:

భారత దేశంలో రాంపూర్ అనే గ్రామం.

తల్లి తండ్రులు:

సర్థర్ షేక్ సింగ్ దంపతులు.

జననం :1889 సెప్టెంబర్ 3 .

రక్షణానుభవం :

  16 సం వయస్సులో.

సేవ ఫలితం:

  రక్తము కారుచున్న పాదాలతో అనేకులకు

ముఖ్యముగా టిబెట్ ప్రాంత ప్రజలకు సువార్తను

ప్రకటించేను.

sadhusundarsingh

       సాధు సుందర్ సింగ్ 1889 సెప్టెంబర్ 3వ తేదీన పంజాబ్ లోని ‘రాంపూర్’ అనే గ్రామంలో మత వైరాగ్యముతో నిండిన సిక్కు కులమునందు పుట్టెను. ఆయన తండ్రి పాటియాలా సంస్థానమందున్న “రాంపురం” అను పట్టణము నందు ప్రసిద్ధి గాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి. సుందరుడు ఏడేండ్ల వాడైనప్పుడు సంస్కృతములో భగవద్గీతను వల్లించెను. క్రైస్తవ పాఠశాలలో చదువుచున్నప్పటికి ఈయన తన సిక్కు మత వైరాగ్యంతో నిండియుండెను. మతాభిమానముచే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించిన ఇతర బాలురకు                  నాయకుడాయెను. క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్కు ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతడు చించి, కాల్చి వేసెను. 

           అయితే బైబిల్ను కాల్చిన దినము నుండి అతని హృదయములో గొప్ప. కలవరం కలిగెను. నిజదేవుని తెలుసుకోవాలనే తృష్ణ ఆయనలో బయలుదేరెను. ఒక తెల్లవారుజామున లేచి చన్నీళ్ళ స్నానం చేసి గదిలోనికి వెళ్ళి తనకు తెలిసిన దేవుళ్ళన్నిటి పేర ప్రార్థించుట మొదలుపెట్టెను. తనకు ఏ దేవుడు కనిపించక పోగా, తన ప్రార్ధనకు జవాబు రాకపోగా విసిగిన సుందర్ రైలు పట్టాలమీద పరుండి, ఆత్మహత్య చేసుకోదలచెను. కాని చివరగా అసలు దేవుడంటూ ఒకడుంటే నాకు కన్పించమని పట్టుదలతో ప్రార్థించెను. అప్పుడా గది ప్రకాశమానమైన వెలుగుతో నిండెను. ప్రభువైన యేసు యొక్క మహిమగల ముఖము కనిపించెను. మేకులతో గాయపరచబడిన తన హస్తములు చాచి “ప్రియుడా! నీ కొరకు నా ప్రాణము పెట్టితిని, నన్నెందుకు హింసించెదవు?” అన్న ప్రభువు మాటలు వినెను. ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయములో మెరుపులాగా వెలుగు పుట్టెను. పరమానందము కలిగెను. అతని హృదయము మారిపోయెను. గొప్ప సంతోషంతో గంతులు వేయుచు నేను ప్రభువును చూచితిని, యేసుప్రభువే నిజమైన రక్షకుడు అని కేకలు వేసెను. 

            నేను యేసుప్రభువును చూచితిని అనుచు పట్టలేని సంతోషంతో, గంతులు వేయుచు గదిలో నుండి బయటకు వచ్చిన సుందర్సింగ్ను చూసిన అతని తండ్రి ఆశ్చర్యపడి, మూడు దినముల క్రితమే గదా! నీవు బైబిల్ కాల్చితివి మరిప్పుడు నీవు చేయునదేమనగా, సుందర్ – నేను యేసుప్రభువును చూచితిని. నా హృదయములో గొప్ప సమాధానమును పొందితిని. నేను ఇక మీదట ఆయన బిడ్డగా జీవించెదను అనెను. కొంతకాలము సుందర్ సింగ్ మాటలు పెద్దగా పట్టించుకోని తండ్రి, నేను క్రైస్తవుడను అని మాటిమాటికి అనుచున్న సుందర్ తో నీవు యేసును అంగీకరించినచో నా కుమారునిగా ఉండుటకు వీలులేదు. ఈ ఇంటిలో నీకిక స్థానం లేదు పొమ్మనెను. పరలోకపు తండ్రియందు విశ్వాసముంచిన సుందర్ సింగ్ ఇల్లు వదలిపెట్టి, క్రీస్తు సాక్షిగా ఉండుటకు బయలుదేరెను. 

       ఒకరోజు సుందర్ సింగ్ తల్లిదండ్రులు వీడెక్కడున్ననూ ఫలానా వారి కుమారుడని అనిపించుకొని; మాకు, మా కులమునకు సిగ్గు తెచ్చుననుకొని, వీడు చచ్చుటయే మేలని తలంచి, సుందర్ సింగ్ను ప్రేమతో పిలిచి విషము కలిపిన ఆహారమును పెట్టిరి. ఆ ఆహారమును భుజించిన సింగ్ ఒక ఫాదిరిగారి ఇంటి దగ్గరకు వెళ్ళగా అక్కడ స్పృహ తప్పి పడిపోయెను. వెంటనే ఆ ఫాదిరిగారు సుందర్ సింగ్ను తన గృహములోనికి చేర్చుకొని ప్రార్థన చేయగా, ఆ విషము విరిగిపోయెను. ఆ విష ప్రభావము నుండి పూర్తిగా కోలుకొని స్వస్థత పొందెను. తరువాత సుందర్ తన 16వ ఏట, బహిరంగముగా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము పొందెను. ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినప్పటికి యేసుని వెంబడించుటలో వెనుదీయని సుందరి సింగ్, ముందుకే కొనసాగుచు క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుచుండెను. 

      అతనిని ఏదోరీతిగా వెనుకకు లాగవలెనని ప్రయాసపడిన సుందర్ బంధువు ఒకరు ఒకరోజు సుందర్ సింగ్తో ప్రేమగా మాట్లాడి, తన ఇంటికి తీసుకొనివెళ్లి, తన ఆస్తి వివరాలన్నీ వివరముగా తెలియజేసి, తన యొద్దనున్న వెండి బంగారాలన్నీ చూపించి “ఈ ఆస్తి అంతా నీకే! ఈ వెండి బంగారాలన్నీ నీకే ఇస్తాను. అయితే, నీవు చేయవలసిందేమంటే యేసుక్రీస్తును విడిచిపెట్టు! మరల మన సిక్కు కులమును వెంబడించు” అనెను. అందుకు సుందర్ సింగ్ చిరునవ్వుతో “నీ ఆస్తి నీవే ఉంచుకో! నీ వెండి, బంగారములు నా కక్కరలేదు. ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవునిని, ఆయన ఇచ్చు పరలోక రాజ్యమును నేనేలాగు పోగొట్టుకొందును? క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలోనిది ఏదియు అక్కరలేదు” అని ముందుకు సాగిపోయెను. థామస్ కెంపస్ వ్రాసిన “క్రీస్తు అనుకరణ” అను పుస్తక పఠనము సుందర్సింగ్ను ఎంతగానో ప్రభావితం చేసినది. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడు కావాలనే వాంఛతో పరిశుద్ధ పరచబడిన జీవితము కొరకు ఉపవాస ప్రార్థనలు చేసెను. 

      ‘యేసుతో వెళ్ళ నే తీర్మానించితిని-వెనుదీయను; లోకము నా వెనుక, సిలువ నా ముందు; యేసుతో వెళ్ల నే తీర్మానించితిని నే వెనుదీయను!’ అని పాడుచూ బైబిలును, ఒక దుప్పటిని మాత్రము వెంటబెట్టుకొని తన జీవితంలో ముందుకు సాగిపోయెను. హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డలపై కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ, “టిబెట్” ప్రాంతములో మూర్ఖులైన జనులకు, క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించెను. సువార్త సేవలో ఎన్నో కష్టములు, ఎదిరింపులు, శ్రమలు, చివరికి అనేకసార్లు ప్రాణాపాయములు కలిగినను యేసువైపు చూచుచు ముందుకే సాగెను ఈ సుందర్ సింగ్. ఒకసారి నీరు లేని ఒక పాడుబడిన బావిలో పడవేయబడినప్పటికి ప్రభువు మరణము నుండి అతనిని ఆశ్చర్యముగా తప్పించెను. 

        సువార్త ప్రకటన నిషేధింపబడిన నేపాల్లో సుందర్సింగ్ను సువార్త ప్రకటిస్తున్నాడనే నేరంతో పట్టుకొని జైలులో వేసిరి. అక్కడ తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తున్నందున అతని కాలు చేతులు కట్టి, జలగలను తెచ్చి శరీరంపై వేసారు. జలగలు రక్తం పీలుస్తున్నా ఆ బాధలో కూడా ప్రార్థిస్తూ, పాటలు పాడుతున్న సుందర్సింగ్ను పిచ్చివాడనుకొని జైలునుండి పంపేసారు. శ్రమల్లో ఆనందించే నీ భక్తి రహస్యమేమిటని అడిగినప్పుడు నా శ్రమల్లో, బాధల్లో క్రీస్తు సిలువే నాకు ఆదరణ కలుగజేసి నిరీక్షణ నిస్తున్నది. నా కొరకు నా యేసు ప్రభువు పరలోక మహిమను వదలి, సిలువను సహించగా; ఆయన కొరకు ఆత్మలను సంపాదించుటకై నేను నా సిలువను మోయుటలో గొప్పతన మేమీ లేదని చెప్పెడివాడు. 

      కాషాయ అంగీ, తలకు పాగా, గడ్డంతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖములో క్రీస్తు యొక్క తేజస్సు, ప్రేమ, కనికరములు ప్రజ్వలించు చుండెడివి. అనేకులు ఆయనలో క్రీస్తును చూచుచుండిరి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట, దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయుట, యేసుప్రభువు నామంలో అనేక స్వస్థతలు, అద్భుతములు చేయుట ద్వారా అనేకులను ప్రభువువైపు త్రిప్పెను. హిమాలయ పర్వతాలలో కాలినడకన సంచరిస్తూ, అనేక చోట్ల తిరుగుచు గొప్ప పరిచర్య చేసెను. అనేక పట్టణములు, ప్రాంతములు, దేశములు ప్రయాణము చేసి, సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించెను. 

        ఈయన ప్రసంగములు బహు సులభశైలిలో ప్రతివారు గ్రహించుకొన గలుగునట్లు ఉపమానములతో, సువార్త సత్యములతో నిండి యుండెడివి. సుందర్ సింగ్ యొక్క పరిచర్య ప్రభావము భారతదేశపు ఎల్లలు దాటింది. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వరకు ఆయన పయనించి, సువార్తను బోధించెను. పాశ్చాత్య దేశాల భక్తి కేవలం ఇహ సంబంధమైనది గాను, ఆధ్యాత్మిక విలువలు లేనిదిగాను ఉండుట చూచి ఎంతో బాధపడెను. మరియు క్రైస్తవ సంఘములు విభజించబడిన సిద్ధాంతములతో ఉండుటను, ఐక్యత లేకుండుటను చూచి, వ్యసనపడి – “భూలోకములో కలిసి ఉండలేని ఈ క్రైస్తవులు పరలోకములో ఏలాగు కలిసి ఉండగలరు!” అనెను. 

        సువార్త ద్వారములు మూయబడిన టిబెట్ దేశములో సువార్త ప్రకటించుటకు కాలినడకన హిమాలయ కొండలలో ప్రయాణం చేసి అచ్చటి బౌద్ధమతస్థులకు సువార్తను ప్రకటించుటకు భారము కలిగిన సుందర్ సింగ్ అనేకసార్లు వ్యాధిగ్రస్థు డయ్యెను. ఒకసారి ఇంచుమించు మూడు సంవత్సరములు సిమ్లా కొండలలో విశ్రాంతి తీసుకొనవలసిన పరిస్థితి ఏర్పడగా; ఆ సమయములో కొన్ని పుస్తకములను వ్రాసెను. అవి నేటికినీ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నవి. 

        చివరిసారిగా టిబెట్కు ఒంటరిగా కాలినడకన ప్రయాణమైన సుందర్ సింగ్ మరల తిరిగి రాలేదు. ఒకవేళ తాను వెళ్లదలచుకొన్న ప్రాంతానికి వెళ్ళి, అక్కడ సువార్త విరోధుల చేతుల్లో హతసాక్షి ఆయెనో, లేక మార్గంలోనే చనిపోతే దేవుడు మోషేని సమాధి చేసినట్లు, ఆయనను సమాధి చేసెనో, లేక ‘నా రాకడ వరకు అతడు మరణం చూడడు’ అన్నట్లు ఆ హిమాలయ కొండలలో ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేయుచు ఉండెనో మనమెరుగము. అయితే, సుందర్ సింగ్ మన భారత దేశంలో పుట్టి, రక్తము కారుచున్న పాదములు కల్గిన గొప్ప సువార్తికుడుగా పేరు పొంది, క్రీస్తువలె జీవించి అనేక ఆత్మలను సంపాదించెను. “క్రీస్తును లోకానికి ప్రకటించుటయే నా ధ్యేయం” అన్న సుందర్సింగ్ సువార్త కొరకే చివరివరకు పయనించెను. 

15 thoughts on “sadhu sundar singh encounter with jesus|సాధు సుందర్ సింగ్|Telugu”

  1. సాధు సుందర్ సింగ్ గారు చేసిన పరిచర్య మహా అద్భుతం.

    Reply
  2. చాలా బాగుంది మీరు ఇంకా భక్తుల చరిత్రలు ఈ విధంగా పెట్టాలి అని కోరుకుంటున్నాము

    Reply

Leave a comment