Bible-History-Telugu|బైబిల్-చరిత్ర-తెలుగులో2023

Bible-History-Telugu|బైబిల్-చరిత్ర-తెలుగులో2023

Bible-History-Telugu|బైబిల్-చరిత్ర-తెలుగులో

 

బైబిల్ ఆవిర్భావం.

దైవావేశంవలన కలిగినది

           వేరువేరు రచయితలు వ్రాసిన విభిన్న పుస్తకాలు ఉన్న బైబిల్ ఒక చిన్న గ్రంథాలయం వంటిది. వీరు సుమారు 1500 వందల సంవత్సరాల కాల వ్యవధిలో వేరువేరు కాలాల్లో వేరువేరు దేశాల్లో వేరువేరు సందర్భాల్లో జీవించారు మానవజాతి పట్ల దేవుని సంకల్పం వెల్లడి కావడం వీరి రచనల్లో ఉన్న సాధారణ అంశం. ఈ సంకల్పాన్ని హెబ్రీ పత్రిక రచయిత పూర్వకాలమందు దేవుడు  నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన మిత్రులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో బాటలాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను (హెబ్రీ1:1,2) అని సంక్షిప్తంగా వివరించాడు. మానవజాతి దేవునితో పునర్ ఐక్యత పొందవలసిన అవసరతను మానవులు సాటివారితో సామరస్యంగా ఉండవలసిన అవసరతను చాలా స్పష్టంగా వివరించే బైబిలు మానవజాతికి ఆయన అనుగ్రహించిన దివ్య సందేశం ఏసుక్రీస్తు ద్వారా పరిపూర్తి చేయబడిన రక్షణ ప్రణాళిక గురించి బైబిలు ఉద్గాటిస్తుంది కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీటి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది (2తిమేతి3:16-17) అని సంగ్రహంగా వివరించాడు బైబిలు దివ్య ప్రేరితమైన దేవుని వాక్యం.

బైబిలు భాషలు.

       బైబిలు 66 వేరువేరు పుస్తకాల సమాహారం బైబుల్లోని పాత నిబంధనలో యూదులేఖనాలు 39 పుస్తకాలున్నాయి; మిగిలిన 27 పుస్తకాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. హెబ్రీ అరామాయిక్ హెబ్రీ మాండలికం మరియు గ్రీకు భాషల్లో ఏదో ఒక దానిలో ఈ పుస్తకాల రచన జరిగింది. ఏవో కొన్ని పుస్తకభాగాలైన (ఎజ్రా 4:8-16,18 మరియు 7:12-26; యేబు10:11,దానియేలు2:4-7 వంటివి అరామాయిక్ భాషలో వ్రాయబడ్డాయి. పాత నిబంధనలోని మిగిలిన పుస్తకాలన్నీ హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. యేసు కాలంలోనూ మరియు ఆది సంఘం కాలంలోనూ ప్రధాన భాషగా ఉన్న గ్రీకు భాషలో క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ రాయడం జరిగింది.

మౌఖిక సందేశం.

          దేవుడు హెబ్రీ జాతి పట్ల జరిగించిన యావత్ కార్యాలను పాత నిబంధన వివరిస్తుంది మౌఖిక పారంపర్యం అని నేడు మనం పిలుస్తున్న ప్రక్రియ చాలా కాలంగా హెబ్రీ ప్రజల చరిత్రకు సజీవ రూపాన్ని ఇచ్చింది వర్ణనల ద్వారా మరియు పాటల ద్వారా వారి చరిత్ర ఒక తరం నుండి మరొక తరానికి అందించబడింది ఈ విధంగా చరిత్ర ఒక తరం తర్వాత మరొక తరానికి అందడంలో మౌఖిక సందేశం ప్రముఖ పాత్ర పోషించింది క్రొత్త నిబంధన తొలి రోజుల్లో అపోస్తలులు శిష్యులు యేసు క్రీస్తు గురించి తమ అనుభవాన్ని మౌఖిక సందేశాల ద్వారా వివరించడాన్ని మనం గమనించగలం క్రొత్త నిబంధనలోని సువార్తలు మొదట్లో మౌఖిక సందేశాలే.

లిఖిత సందేశం.

        కాలక్రమంలో పశ్చిమసియాలోని మానవ సమాజం అక్షరాల లిపిని రూపొందించాయి అది సుమారు క్రీస్తు పూర్వం 1800 కాలం నేర్చుకోవడానికి మరియు ఉపయోగించడానికి ఈ లిపి సులువుగా ఉండడంతో ప్రజలు చారిత్రక సంఘటనల వర్ణనల్ని పాటల్ని మరియు  ప్రవచనాల్ని లిఖించడం ప్రారంభించారు. తర్వాత ఇవే బైబిల్లో భాగమయ్యాయి. ప్రజలు వీటిని రెల్లునుండి చేసిన పాపిరస్ అనే అట్టలమీద మరియు వెల్లమ్ అనే చదునుచేసినట్టి ఎండిన జంతు చర్మాలమీద లిఖించారు. ఇవి చాలా పొడుగైనవి గనక వీటిని గుండ్రంగా చుట్టి భద్రపర్చేవారు. వీటిని “గ్రంథపు చుట్టలు” అని పిలిచేవారు. అయితే పాత నిబంధనలోని అన్ని పుస్తకాలు ఏక కాలంలో వ్రాయబడలేదు. ఈ పుస్తకాల్ని వ్రాయడానికి అనేక శతాబ్దాలు పట్టింది. ఒక సారి వీటిని వ్రాయడం ప్రారంభించిన తర్వాత, వాటి నకళ్లను మళ్లీ మళ్లీ వ్రాయవలసిన అవసరత ఏర్పడింది. కారణం, గ్రంథపు చుట్టల్ని విప్పి, చదివి, వాటిని చుట్టి పెట్టడంవలన అవి పాతబడిపోయి కొంతకాలానికి చదవడానికి ఉపయోగపడేవి కావు. లేఖనాల వ్రాతపతులకు నకళ్లు వ్రాసేవారిని “శాస్త్రులు” అని పిలిచేవారు. కొన్నిసార్లు శాస్త్రుల్లో ఎవరో ఒకరు బిగ్గరగా చదువుతుండగా అనేకమంది శాస్త్రులు నకళ్లు వ్రాసేవారు. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వ్రాతపతుల్లో అతి ప్రాచీనమైన కొన్ని నకళ్లు నేటికీ భద్రంగా వున్నాయి. ఇవి యెరూషలేం, లండన్, పారిస్, డబ్లిన్, న్యూయార్క్, షికాగో, ఫిలదెల్ఫియ, యానోర్బర్, మిషిగాన్ నగరాల్లోని పురావస్తు ప్రదర్శన శాలలు మరియు గ్రంథాలయాల్లో వున్నాయి.

యూదు లేఖనాల సేకరణ

        పాత నిబంధనలోని వివిధ పుస్తకాలు  ఏకగ్రంథంగా సేకరించబడక మునుపు చాలా కాలం అవి విడి విడిగానే వుండేవి. యోషీయా రాజు కాలంలో దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరకడంతో (2దిన 34:15) దివ్యావేశంవలన కలిగిన లేఖనాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే వివిధ పుస్తకాల్ని సేకరించడం, మరియు వాటికి సరైన గుర్తింపు నివ్వడం యూదులు బబులోను చెరనుండి తిరిగి వచ్చిన తర్వాతనే జరిగింది. యూదు లేఖనాల్లోని పుస్తకాల్ని ఎప్పుడు తుదిరూపంలోనికి సంగ్రహపర్చారో కచ్చితంగా తెలుసుకోడం సాధ్యం కాదు. యూదు లేఖనాల్లో కొన్ని క్రీస్తు పూర్వం 1300నాటివి; అయితే వీటిని సంగ్రహపర్చి సమగ్రమైన రూపంలోకి తీసుకు రావడం సుమారుగా క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలో ప్రారంభమై వుండవచ్చు. సుమారుగా క్రీస్తు శకం 90 సంవత్సరంలో పాలస్తీనాకు చెందిన యూదులు జామ్నియాలో సమావేశమై హెబ్రీ లేఖనాల్లో ముప్పయి తొమ్మిది పుస్తకాలుండాలని సాధికారికంగా ఆమోదించారు. ఈ ముప్పయి తొమ్మిది పుస్తకాలే బైబిల్లోని పాత నిబంధన

క్రొత్త నిబంధన పుస్తకాలు

        క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఆరాధనకు సమావేశమైనప్పుడు హెబ్రీ లేఖనాలనుండి కొన్ని భాగాలను చదివేవారు. ఇది యూదుల ఆచారం. యేసు గురించి ప్రత్యక్షంగా తెలిసినవారు ఆయన జీవితం గురించి మరియు ఆయన బోధలగురించి మాట్లాడేవారు. అయితే రెండవ తరం క్రైస్తవులకొరకు మరియు  భావితరాలకు లిఖిత పూర్వకమైన లేఖనప్రతి అనివార్యమయ్యింది. అపొస్తలులు శిష్యులు సువార్తలను, తాము జరిగించిన కార్యాలను మరియు ఇతర పత్రికలను వ్రాయడం ప్రారంభించారు. రోమా సామ్రాజ్యంలో ప్రపంచభాషగా పేరొందిన గ్రీకు భాషలో క్రొత్త నిబంధనలోని పుస్తకాలను వ్రాయడం జరిగింది. వీటిని క్రీస్తు శకం 45-95 మధ్య కాలంలో వ్రాశారు. ఇవి ఒకరి దగ్గరనుండి మరొకరికి అందేవి; వీటిని ఏక పుస్తకంగానో లేక పత్రికగానో చదువుకొనేవారు. దాదాపుగా మూడు వందల సంవత్సరాలపాటు (క్రీస్తు శకం 100 – 400) ఆదిసంఘంలోని నాయకుల్లో క్రొత్త నిబంధన పుస్తకాల్లో    ఏయే వాటిని పవిత్ర లేఖనాలుగా గుర్తించి వాటికి హెబ్రీ లేఖనాల స్థాయినివ్వాలనే విషయంమీద తర్జనభర్జనలు జరిగేవి. క్రీస్తు శకం 367 సంవత్సరంలో అలెగ్జాండ్రియ బిషప్పుగా వున్న అతనేషియస్ ఇరవై ఏడు పుస్తకాల్ని పుస్తకాల్ని  పవిత్ర లేఖనాలుగా ప్రతిపాదిస్తూ క్రైస్తవులందరూ వీటిని ఆమోదించాలని ప్రకటన విడుదల చేశాడు. బిషప్ అతనేషియస్ ప్రతిపాదించిన ఇరవై ఏడు పుస్తకాలు అప్పటికే క్రైస్తవ సంఘాల్లో ప్రజాదరణపొంది వాడుకలో వున్న పుస్తకాలే. రోమ్ (క్రీ.శ.382), హిప్పో (క్రీ.శ.393), మరియు కార్తేజ్ (క్రీ.శ.397) లలో జరిగిన క్రైస్తవ సంఘ నాయకుల సమావేశాలు బిషప్ అతనేషియస్ నిర్ణయాన్ని ధృవీకరించాయి. ఈ ఇరవై యేడు పుస్తకాలనే నేడు మనం క్రొత్త నిబంధన అని పిలుస్తున్నాం.

బైబిల్లోని వివిధ సాహిత్యరీతులు

        ఒక్కొక్క సాహిత్యరీతిలో ఎన్నో గ్రంథాలుంటాయి. ఏదైనా ఒక ఉపకరణాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే నియమావళి ఆ ఉపకరణానికి సంబంధించిన సాంకేతిక భాషలో వుంటుంది. వుంటుంది. పద్యంలో యతి ప్రాసలుంటాయి. ఏ  నిబద్ధతకు లోబడని గేయాలు కూడ వుంటాయి. చరిత్ర గ్రంథాల్లో చారిత్రక సందర్భాల వివరణ కన్పిస్తుంది. గ్రంథం ఏ కోవకు చెందుతుందో అనే దాని మీద ఆ గ్రంథం రచనాశైలి కూడ ఆధారపడి వుంటుంది  బైబిలు ఒక పెద్ద గ్రంథం. దీంట్లో వివిధ సాహిత్య శైలుల్లో రాసిన వివిధ రచనలు వున్నాయి. విభిన్న శైలుల్లో వున్న బైబిలు గ్రంథం పాఠకుల్లో మరింత  ఉత్సుకతను కల్గించి వారికో సవాలుగా నిలుస్తుంది.బైబిలును అధ్యయనం చేసేటప్పుడు ప్రతి పుస్తకాన్ని చదవడంతో బాటు ఆ పుస్తకం రచనాశైలిని కూడ పరికించడం చాలా ముఖ్యం. రచయిత ఉద్దేశాలను తెలుసుకోవడానికి రచనాశైలి వుపకరిస్తుంది. ఉదా : 1 సమూ 1:1-28 చూడండి. ఈ వాక్యభాగాన్ని            1 సమూ 2:1-10 లోని వాక్యభాగంతో పోల్చి చూడండి. ఒకే పుస్తకంలో వేర్వేరు రచనాశైలులు కన్పిస్తాయి. మొదటి భాగం గద్యం (వచనం); రెండవ భాగం పద్యరూపంలో వున్న కీర్తన లేక ప్రార్థన. పాఠకులు పుస్తకం ఉద్దేశాన్ని గ్రహించడంలో ఈ మార్పు సహాయపడ్తుంది. క్రొత్త నిబంధన నుంచి మరో క్లుప్తమైన ఉదాహరణ : యేసు జనన వృత్తాంతం. లూకా 2:1-21లో  యేసు జననం గురించి ఎన్నో వివరాలు సంఘటనలు కన్పిస్తాయి. ఇందుకు భిన్నంగా యోహాను సువార్తలో యేసు జననం గురించి ఏ ప్రస్తావనా కన్పించదు. ప్రతిగా, యేసు వాక్యము అని, నిజమైన వెలుగు అని, ఆయన శరీరధారి అయ్యాడని సూచించే కావ్యవర్ణన కన్పిస్తుంది (1:1-14). యేసు ఎవరనే ఆలోచనలను ఈ వివిధ సాహిత్య రీతులు ఎలా ప్రభావితం చేస్తాయి? సువార్త రచయితలు తమ సువారల్లో యేసు జననం గురించి ఆయన మూర్తిమత్వం వ్యక్తిత్వం గురించి వివిధ అంశాలను ఎందుకు వక్కాణించారు? ఒక్కొక్క రచయిత తన ఉద్దేశాలను ఏ శైలిలో చెప్పాడనే సంగతి కూడ బైబిలు ఏం బోధిస్తుందో తెలుసుకోవడానికి క్రొత్త మార్గాలను చూపిస్తుంది.బైబిల్లో వివిధ సాహిత్య రీతులు వున్నాయి. కొన్ని పుస్తకాలు ఆద్యంతం ఒకే సాహిత్య శైలిలో వున్నాయి. వీటిలో ముఖ్యమైనవి : ఆజ్ఞలు విధులు చరిత్ర పద్యం కీర్తనలు జ్ఞానసాహిత్యం సామెతలు సువార్తలు పత్రికలు దర్శనసాహిత్యం. కొన్ని పుస్తకాల్లో విభిన్న సాహిత్య శైలులు కన్పిస్తాయి. వీటిల్లో వర్ణన ప్రార్థన ఉపమానాలు ప్రవచనాలు (దేవోక్తులు) వంశావళులు ముఖ్యమైనవి.

 ఆజ్ఞలు, కట్టడలు, న్యాయవిధులు : అనేక ప్రాచీన పశ్చిమాసియా సంస్కృతుల్లో ప్రతి సంస్కృ  తిలోనూ వేర్వేరుగా న్యాయవిధివిధానాలుండేవి (చట్టాలు). వీటిలో బబులోను అధిపతి హమ్మూరాబి (క్రీ.పూ. 1792-1750) ఆధ్వర్యంలో అమలులోనికి వచ్చిన శిక్షాస్మృతి బాగా ప్రసిద్ధి చెందింది. యూదు లేఖనాలలోని (పాత నిబంధన) మొదటి ఐదు గ్రంథాలను

         పంచగ్రంథాలు లేక పంచకాండాలు లేక ధర్మశాస్త్రం (తోరా) అని పిలుస్తారు. ఈ గ్రంథాల్లో ధర్మవిధులతోబాటు మరెన్నో విషయాలు కూడ వున్నాయి. ఈ ధర్మవిధుల్లో నిషేధాజ్ఞలు (చేయకూడదు), అనుసరించదగిన ఆజ్ఞలు (చేయవలెను) వున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించడం ఒకరిపట్ల ఒకరు యథార్థంగా ప్రవర్తించడం ధర్మశాస్త్రం ముఖ్యోద్దేశం. బైబిల్లో ముఖ్యమైన ధర్మవిధులు ‘పది ఆజ్ఞలు’ (నిర్గమ 20:1-17; ద్వితీ 5:6-21). ఇతర ఉదాహరణలు : నిర్గమ 21:1-23:19; లేవీయ 1:1- 7:36; సంఖ్యా 6:1-21; 35:16-34; ద్వితీ 14:3-17:7; యాకోబు 4:11,12.

        చరిత్ర : పాత నిబంధనలోని చరిత్ర గ్రంథాలు ఇశ్రాయేలీయులు క్రీ.పూ. 1250లో కనాను దేశంలో స్థిరపడినప్పటినుంచి క్రీ.పూ. 587లో యెరూషలేం పతనం వరకు గల చరిత్రను వివరిస్తాయి. ఈ గ్రంథాల్లో ప్రముఖ ప్రవక్తలైన ఏలీయా ఎలీషా జరిగించిన అద్భుతకార్యాలు ఇశ్రాయేలును యూదాను పరిపాలించిన రాజుల కార్యాలు            (దావీదు సొలొమోనుతో సహా) కన్పిస్తాయి. క్రీ.పూ. 931లో ఇశ్రాయేలు దేశం రెండుగా వేరైపోయిన తర్వాత జరిగిన సంఘటనల వివరాలు కూడ ఈ చరిత్ర గ్రంథాల్లో కన్పిస్తాయి. యెహోషువ, 1,2 రాజులు గ్రంథాలు పాతనిబంధనలోని చరిత్ర గ్రంథాలు. క్రొత్తనిబంధనలోని అపొస్తలుల కార్యములు ఆది క్రైస్తవసంఘచరిత్రను తెలియజేస్తుంది.

పద్యం, కీర్తనలు : విభిన్న రీతులున్న పెద్ద విభాగమిది. యోబు కీర్తనలు పరమగీతము గ్రంథాల్లో పద్యశైలి కన్పిస్తుంది. బైబిల్లో కొన్ని ప్రాచీన స్తుతిగీతాలు (కీర్తనలు) పద్య శైలిలో వున్నాయి. కీర్తనల్లో అధికభాగం ఆరాధనలో వుపయోగపడినవే. కొన్ని కీర్తనలు వాస్తవానికి ప్రార్థనలే. ప్రవక్తల సందేశాలు కూడ కొన్ని చోట్ల పద్యశైలిలో వున్నాయి. హెబ్రీ పద్యాన్ని అనువదించడం అంత సులభం కాదు. మూలభాషలో ఉన్న శక్తిమంతమైన అర్థాన్ని పరిభాషను అనువాదంలో ప్రతిబింబించడం మామూలు విషయం కాదు. ఒకే భావాన్ని రెండు సామ్యాలతో (పోలికలతో) వర్ణించడం హెబ్రీ పద్యం విశిష్టత. కీర్తన 22:9,10 వచనాలు ఈ వర్ణనకు చక్కని వుదాహరణ. పాత నిబంధనలోని మరి కొన్ని ఉదాహరణలు : నిర్గమ 15:1-18; యోబు 22:21-30; కీర్తన 23; యెషయా 5:1-7; యోనా 2:2-9, క్రొత్త నిబంధనలో కూడ పద్య శైలి కన్పిస్తుంది. లూకా 1:46-55; ఫిలిప్పీ 2:6-11; ప్రకటన 15:3,4 పద్య శైలికి చక్కని వుదాహరణ.

జ్ఞానయుక్తమైన సూక్తులు, సామెతలు : పాత నిబంధనలో మరో పెద్ద విభాగమిది. ఆరాధనా ప్రకరణంలో పద్యం కీర్తనలు కథ వంటి విభిన్న శైలులు కన్పిస్తాయి. లోకం గురించి దేవుని గురించి మనుషుల గతి గురించి వివేచన (ఇంగిత జ్ఞానం) కలిగించే సామెతలు సూక్తులు ఒక విశిష్టమైన శైలిలో వుంటాయి. జ్ఞానయుక్తమైన సామెతలు సూక్తులు సామెతలు గ్రంథంలోనే కాక బైబిల్లోని యితర గ్రంథాల్లో కూడ కన్పిస్తాయి. ప్రసంగి యోబు గ్రంథాల్లో తాత్వికధోరణితో బాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు కూడ వున్నాయి. జ్ఞానసాహిత్యంలో ఇశ్రాయేలు చరిత్ర వివరాలు కన్పించవు. అయితే, నైతికత గురించి మానవ జీవితంలోని కఠినమైన వాస్తవాల గురించి వివిధ సవాళ్లు ఈ గ్రంథాల్లో కన్పిస్తాయి. జ్ఞానసాహిత్యంలోని కొన్ని గ్రంథాలను అత్యంత జ్ఞాని ఇశ్రాయేలు రాజు సొలొమోను రచించినట్లు చెబుతుంటారు. బహుశా వీటిల్లో కొన్ని సొలొమోను మరణా నంతరం అతని పేరు మీద వ్రాసిన గౌరవార్థ రచనలై వుండవచ్చు. యిప్పటి వరకు ప్రస్తావించిన వాటితో బాటు కీర్తన 1, కీర్తన 37లను కూడ జ్ఞానసాహిత్యానికి చక్కని ఉదాహరణలుగా చెప్పవచ్చు. జ్ఞాన సాహిత్యం క్రొత్త నిబంధనలో కూడ ప్రముఖంగా కన్పిస్తుంది. పర్వత ప్రసంగం (మత్తయి 5-7 అధ్యాయాలు); యాకోబు 3:2-8; 4:13-17 వచనాలు క్రొత్త నిబంధనలోని జ్ఞానసాహిత్యానికి సోదాహరణలు.

    సువార్తలు : క్రొత్త నిబంధనలోని మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలు యేసు జీవితం గురించి ఆయన బోధల గురించి వివరిస్తాయి. వీటిని సువార్తలు అని పిలుస్తారు. ఇవాంజెలియన్ అనే గ్రీకు పదానికి గాడ్స్పెల్ అనే ప్రాచీన ఆంగ్లపదం సూటి అయిన అనువాదం. గాడ్ స్పెల్ అనే పదం నుంచి గాస్పెల్ అనే పదం వచ్చింది. గాస్పెల్ అంటేసువార్త అని అర్థం.

పత్రికలు : క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు యింకా యితరులు రాసిన పత్రికలు వున్నాయి. యివి క్రీస్తు శకం మొదటి శతాబ్దపు గ్రీకు లేఖరచనాశైలిలో రాసిన పత్రికలు. రచయిత పరిచయం పత్రిక ప్రారంభంలో కన్పిస్తుంది (ఉదా : రోమా 1:1,2-7). ఆ తర్వాత, పత్రికను ఎవరికి వ్రాశారో వారి ప్రస్తావన, శుభవచనం కన్పిస్తాయి (ఉదా : రోమా 1:2-7). పత్రికలో ప్రధాన భాగం సందేశం (ఉదా : రోమా 1:16-15:35). పౌలు పత్రికల్లో చాలా వాటిల్లో శుభవచనం తర్వాత కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన వుంటుంది (ఉదా : రోమా 1:8-15). అంతిమ శుభ వచనంతో ఆశీర్వాదంతో పత్రిక ముగుస్తుంది (ఉదా : రోమా 16:1-27). ప్రతి పత్రికలో ప్రార్థనలు ఉపదేశాలు బోధ జ్ఞానసాహిత్యం హెచ్చరికలు ఆరాధనాగీతాలు (లేక, కీర్తనలు) వ్యక్తిగత సమాచారం వంటి విభిన్నరీతులు కన్పిస్తాయి. క్రొత్త నిబంధనలో పత్రికలు విభాగంలో కన్పించే కొన్ని రచనలు క్రైస్తవులందరికి వర్తించే సాధారణాంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తాయి.

      హెబ్రీ పత్రిక యిటువంటి సాధారణ పత్రిక. చిన్నాఆసియాలోని ఏడు సంఘాలకు రాసిన క్లుప్త పత్రికలు ప్రకటన 2,3 అధ్యాయాల్లో వున్నాయి. క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యములు ప్రకటన గ్రంథాల మధ్య పత్రికలు విభాగం కన్పిస్తుంది.

దర్శన సాహిత్యం : అపొకలిప్సిస్ అనే గ్రీకు పదం బయలుపరచు లేక తెరతీయు అనే అర్థాన్నిస్తుంది. ఈ సాహిత్యాన్ని కొన్నిసార్లు ప్రవచన సాహిత్యం అని కూడ పిలుస్తారు. ప్రవచనం లాగా దర్శన సాహిత్యం కూడ భవిష్యత్కాలంలో జరగబోయే సంఘటనలను తెలియజేస్తుంది. అయితే, దర్శన సాహిత్యం విశిష్టత వేరు. ఉదా : దర్శన సాహిత్యం దేవుని నుంచి కలిగిన దర్శనాలను వివరిస్తుంది. నిగూఢమైన అర్థాలను స్ఫురింపచేసే మృగాలు రంగులు సంఖ్యలు మొదలైన సాదృశ్యాలు, యెహోవా దినము గురించి ప్రవచనాలు సాధారణంగా దర్శనసాహిత్యంలో ప్రాముఖ్యంగా వుంటాయి. దేవుని ప్రజలు అనుభవించిన గడ్డు పరిస్థితుల్లో వ్రాసిన రచనలే దర్శన సాహిత్యం. దేవునిపట్ల విశ్వాస్యత చూపినవారికి ఆయన తోడుగా వుంటాడనే నిరీక్షణాస్పదమైన ఆశాభావం దర్శన సాహిత్యంలో ప్రధానంగా కన్పిస్తుంది. దానియేలు, ప్రకటన గ్రంథాలు దర్శనసాహిత్యానికి మచ్చుతునకలు.

                బైబిల్లో వివిధ రచనా శైలులు

       గద్యం (వచనం) : వర్ణన వివరణ వచనంలో ప్రధానభాగాలు. వ్యక్తుల గురించి చరిత్ర గురించి వర్ణన వచనంలో కన్పిస్తుంది. వచనంలో సంభాషణ అనే మరో రచనాశైలి కూడ కన్పిస్తుంది. బైబిల్లో చాలా భాగం వచనంలో వుంటుంది. గద్యరచనలో కథ లేక ఇతివృత్తం ప్రముఖమైంది. కొన్ని ఇతివృత్తాలు క్లుప్తంగా కేవలం కొన్ని అధ్యాయాలకే పరిమితమై వుంటాయి. ఉదా : నోవహు (ఆది 6-10); యోసేపు (ఆది 37:1-47:26). మరికొన్ని గ్రంథాల్లో గ్రంథమంతటా ఒకే ఒక వృత్తాంతం వుంటుంది (ఉదా: రూతు ఎస్తేరు). సువార్తలు యేసు జీవితం గురించి ఆయన మరణపునరుత్థానాల గురించి వివరిస్తాయి. అయితే, సువార్తల్లో మరికొన్ని కథనాలు కూడ వున్నాయి. ఉదా: బాప్తిస్మమిచ్చు యోహాను (మత్తయి 3:1-17; 11:1-19; 14:1-12). అపొస్తలుల కార్యములు గ్రంథం పేతురు గురించి పౌలు గురించి యేసుక్రీస్తు సందేశాన్ని ప్రకటించిన యితర శిష్యుల గురించి తెలియజేస్తుంది.

     ప్రార్థనలు : ప్రార్థనలు గద్యంలోనూ పద్యంలోనూ వుంటాయి. దేవునితో సంభాషించడమే ప్రార్థన. ఇదే ప్రార్థన విశిష్టత. కీర్తనలు గ్రంథంలో పద్యరూపంలో వున్న ప్రార్థనలు కన్పిస్తాయి. కొన్ని కీర్తనలు బహిరంగ ఆరాధనలో దేవుని సహాయాన్ని అర్థిస్తూ చేసిన ప్రార్థనలు (కీర్తన 79; 80); మరికొన్ని కీర్తనలు పంట కోత సమయంలో చెల్లించే కృతజ్ఞతాస్తుతులు (కీర్తన 126); మరి కొన్ని కీర్తనలు క్రొత్త రాజు అభిషేక కార్యక్రమానికి సంబంధించినవి (కీర్తన 21); కొన్ని కీర్తనలు విచారాన్ని వెలిబుచ్చుతూ సహాయాన్ని అర్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ క్షమాపణ కొరకు వేడుకుంటూ చేసిన వ్యక్తిగత ప్రార్థనలు (కీర్తన 12; 51; 120; 138). ప్రార్థనలు బైబిలు అంతటా కన్పిస్తాయి (కొన్ని ఉదాహరణలు: ఆది 18:27, 28; నిర్గమ 17:4; న్యాయాధి 5:2-31; 1 సమూ 2:1-10; 1 రాజులు 3:6-9; యోనా 2:2-9; లూకా 11:2-4; 22:42; యోహాను 17:1-26; రోమా 16:25-27; హెబ్రీ 13:21). అన్నిటి కంటె ముఖ్యమైంది యేసు శిష్యులకు నేర్పిన ప్రార్ధన (మత్తయి 6:9-13).

ప్రవచనాలు: పాత నిబంధనలో మరో ప్రధానభాగం ప్రవచన సందేశాలు (లేక దేవోక్తులు). యెహోవా వాక్కు లేక యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే పదాలతో ప్రవచనాలు ప్రారంభమౌతాయి. అనగా, ప్రవక్త పలికే సందేశం ప్రవక్త స్వంత సందేశం కాదని దేవుని వద్ద నుంచి వచ్చిన సందేశాన్నే ప్రవక్త పలుకుతున్నాడని అర్థం. ప్రవచన సందేశాలు పలుచోట్ల హెబ్రీ పద్యశైలిలో వున్నాయి. పద్యంలో సాధారణంగా కనిపించే భాషాలంకారాలు (ముఖ్యంగా సామ్యం, లేక పోలిక) ప్రవచనాల్లో కూడ కన్పిస్తాయి. పాత నిబంధన గ్రంథంలోని ప్రవచన గ్రంథాలు ప్రవక్త గురించి అతని పరిచర్య గురించి ప్రవక్తకు దేవునివద్ద నుంచి వచ్చిన సందేశాలు) తెలియజేస్తాయి. పాత నిబంధనలో వైవిధ్యభరితమైన ప్రవచనాలకు యెషయా 1:2-31; 10:24-27; యిర్మీయా 2; యెహెజ్కేలు 36:22-32; ఆమోసు 5:4-27; జెకర్యా 9:1-17 చక్కని వుదాహరణలు. క్రొత్త నిబంధనలో కూడ ప్రవచన సందేశాలు కన్పిస్తాయి. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసు గురించి వున్న ప్రవచనాలు క్రొత్త నిబంధనలో ముఖ్యమైన ప్రవచనాలు (మత్తయి 3:1-12; 24:1-31). 2 పేతురు 3:8-13 కూడ చూడండి.

         ఉపమానాలు : దేవుని గురించి ఆయన రాజ్యం గురించి ముఖ్యమైన సత్యాలను దైనందిన జీవితంలో అందరికి బాగా తెలిసిన విషయాలతో పోల్చి చెప్పే చిన్న కథలే ఉపమానాలు. యేసు ఉపమానాల ద్వారా దైవసత్యాలను బోధించినట్లు సువార్తలు తెలియజేస్తున్నాయి. ఉపమానాలు క్లుప్తంగానైనా (మత్తయి 13:44-48), లేక వివిధ పాత్రలతో లేక సాదృశ్యాలతో పెద్దవైనా కావచ్చు (లూకా 10:30-37; 15:11-32). ఉపమానాలు అన్న చిన్న వ్యాసం కూడ చూడండి.

        వంశావళులు (కుటుంబ పట్టికలు) : బైబిల్లో సుదీర్ఘమైన వంశావళులు కన్పిస్తాయి. ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖుల కుటుంబ చరిత్రను ఈ వంశావళులు తెలియజేస్తాయి. మత్తయి సువార్త ప్రారంభంలో కన్పించే వంశావళి యేసు దావీదు వంశం నుంచి వచ్చాడని తెలియజేస్తుంది (మత్తయి 1:1-17). యేసు దావీదు వంశీయుడని, ప్రవక్తల ప్రవచనాల ప్రకారం లోకాన్ని రక్షించడానికి వచ్చిన అభిషిక్తుడని తెలియజేయడానికి మత్తయి సువార్త రచయిత ఈ వంశావళిని పేర్కొన్నాడు. పితరుల పట్టికలను బైబిల్లో ఎందుకు చేర్చారో అన్ని సందర్భాల్లో స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు ప్రాచీన పశ్చిమాసియా ప్రజలకు బంధుత్వాలు ముఖ్యమని వీటిని బట్టి తెలుస్తుంది. కొన్ని వంశావళులు పేర్ల పట్టికలు ఆది 5:1-32; 1 దిన 1-8; ఎజ్రా 8:2-14లలో వున్నాయి.Bible-History-Telugu

Bible-History-Telugu|బైబిల్-చరిత్ర-తెలుగులో

 

 

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

2 thoughts on “Bible-History-Telugu|బైబిల్-చరిత్ర-తెలుగులో2023”

Leave a comment

error: dont try to copy others subjcet.