Jehovah’s witnesses |History ,Beliefs & Facts | Be Aware False doctrine2023

సాక్షులు – చరిత్ర 

Jehovah’s witnesses

           అతని పేరు చార్ల్స్ టేజ్ రసల్, అమెరికాలోని పిట్స్ బర్గ్ 1852 సంవత్సరం జన్మించాడు. ప్రెస్బిటేరియన్ సంఘ సభ్యుడు. అయితే క్రైస్తవ సిద్ధాంతమైన “నిత్య నరకం” అతడిని వేధించింది. కనుక దానిని త్రోసివేసి, సంఘము నుండి బయటపడి 1870లో ఆరుగురు సభ్యులతో స్వంతగా బైబిల్ స్టడీని ప్రారంభించాడు. అక్కడ తన స్వంత సిద్ధాంతాలను నేర్పించేవాడు.

         1879లో “ద వాచ్ టవర్” (కావలికోట) అనే పత్రికను ముద్రించడం మొదలు పెట్టి అందులో బైబిల్ని తన సూత్రాల కనుగుణంగా వక్రీకరించి వివరించడం ప్రారంభించాడు. 1884లో రసల్ “జాయన్ వాచ టవర్ ట్రాక్ట్ సొసైటీ” ని స్థాపించి దాని ద్వారా క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకమైన తన నమ్మకాలను, సిద్ధాంతాలను ప్రచారం చేసాడు. ఈ అబద్దపు మత గుంపు ప్రధాన కేంద్రం న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్లో వుంది. “యెహోవా సాక్షులు” (Jehovah’s witnesses) అన్న పేరుతో ప్రపంచ వ్యాప్తిగా ప్రాకిపోయి క్రైస్తవ సంఘ మంతటిలో ఏ డినామినేషన్లో కూడా లేనంతమంది సభ్యుల్ని కలిగి విపరీతంగా పెరిగిపోయింది ! ప్రస్తుతం అధికారికంగా “ద వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ” అని పిలువబడుతోంది.

              ప్రతిరోజు 1,00,000 పుస్తకాలు, 8,00,000 పత్రికలు అచ్చు వేయబడుతున్నాయి. రెండు ప్రధాన పత్రికలు “ద వాచ్ టవర్” మరియు “అవేక్” 30 భాషల్లోకి తర్జుమా చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేకులకు చేరవేసి వారిని చెరపట్టి విశ్వాస భ్రష్టుల్ని చేస్తున్నారు.

                1916లో రసల్ మరణించాడు. ఆ తరువాత జోసఫ్ ఫ్రాంక్లిన్ రూథర్ఫోర్డ్ దీనికి నాయకుడైయ్యాడు. అతడు ప్రస్తుతం ఈ గుంపుకు వున్న పేరును యెషయా 43:10 నుండి సూచించి “యెహోవా సాక్షులు” అని మార్చాడు. రూథర్ఫోర్డ్ త్వరలోనే అధినేతగా మారి, రసల్ వ్రాతల్ని కొన్నింటిని మార్చివేసి తన అధికారాన్ని స్థాపించుకున్నాడు. అతడు మరింకొన్ని తప్పుడు సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టాడు.

           రూథర్ ఫోర్డ్  మరణానంతరం నాతన్ నోర్ సంస్థకు ప్రెసిడెంట్ గా మారాడు. రూథర్ఫోర్డ్ సభ్యులపై రసల్ ప్రభావాన్ని తగ్గించి తన అధికారాన్ని పెంచుకొన్నట్లే, నోర్ కూడా రూథర్ ఫోర్డ్ ప్రభావాన్ని తొలగించి తనను హెచ్చించుకునే ప్రయత్నం చేసాడు. అతని తరువాత ఫ్రెడ్రిక్ విలియం ఫ్రాంజ్ సొసైటీని నిరంకుశవేత్తగా నడిపాడు. తరువాత దీనికి మిల్టన్ జి. హెన్స్చల్ ప్రెసిడెంట్గా వున్నాడు. ప్రస్తుతం డాన్ ఎడమ్స్ ప్రెసిడెంటుగా చెలామణి అవుతున్నాడు

సాక్షుల నమ్మకాలు.

           1.) ప్రపంచంలో కేవలం ఒకే ఒక నిజమైన మత సంస్థ వుంది. అది వాచ్ టవర్ సొసైటీ.

           2.) విశ్వాసులందరు ఈ ఏకైక నిజమైన మత సంస్థకు లోబడి వుండాలి.

           3.) ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ, తమ ఓటు హక్కును తృణీకరిస్తూ, యుద్ధంలో

                పాల్గొనక, జాతీయ గీతాలు పాడక, క్రిస్మస్-ఈస్టర్లను జరుపుకొనక, తమ స్వంత

                లేక ఇతరుల పుట్టిన దినాలను జరుపుకోకుండా వాటిని నిషేధిస్తారు.

            4.) ప్రాణాలు పోతున్నా రక్తదానం స్వీకరించరు. తమ శరీరభాగాలను వేరే వారికి

                 ట్రాన్స్ ప్లాంట్ (మార్పిడి) కొరకు ఇవ్వరు.

          5.)  క్రీస్తు విరోధి ఓ క్రైస్తవ సేవకుడని నమ్ముతారు.

6.) ప్రకటన గ్రంథములో పేర్కొనబడిన దుష్టమృగం ఐక్యరాజ్యలని, సాతాను

               ప్రొటెస్టంట్ మరియు రోమన్ కెథోలిక్ సంఘాల్ని కంట్రోల్ చేస్తున్నాడని నమ్ముతారు.

          7.) అనేక సార్లు ప్రభువు రెండవ రాకడను గూర్చి తప్పుడు లెక్కలు గట్టారు ! లోకం

             1914, 1918, 1920, 1925, 1942, 1975లో అంతమౌతుందని,

              ప్రవచిస్తువచ్చారు. క్రీస్తు అదృశ్యరూపంలో 1874లో లోకానికి తిరిగి వచ్చాడని,

             ఆయన శరీరధారిగా ఎన్నటికి భూమి మీద అడుగుపెట్టడని నమ్ముతారు.

         8.) విశ్వాసుల్లో రెండు రకాలు – 1,44,000 మంది అభిషిక్తులు మాత్రమే ఆత్మలుగా

            పరలోక ప్రవేశం చేస్తారు! వీరు మాత్రమే క్రొత్త జన్మ అనుభవం గలవారు. మిగతా

            గొప్ప సమూహమంతా పునరుత్థానులై (పునఃసృష్టి) భూమిపై నిరంతరం

             జీవించుటకు అవకాశాన్ని పొందుతారు.Jehovah’s witnesses

సాక్షుల సిద్ధాంతాలు

      త్రిత్వము సాతాను సిద్ధాంతమని దానిని త్రోసిపుచ్చుతారు. యెహోవాను మాత్రమే దేవునిగా గుర్తిస్తారు.

      యేసు క్రీస్తును దేవునిగా అంగీకరించరు. క్రీస్తు ప్రధాన దూతయైన మిఖాయేలు అని, అతడు యెహోవా చేత సృష్టించబడ్డాడని చెబుతారు. యేసు లోకంలోనికి రావడం అవతారం కాదని అది కేవలం యెహోవా నీతి శాస్త్రానికి అనుగుణమైన మానవ మాదిరి మాత్రమే అని వాదిస్తారు. యేసుని నిత్యదేవునిగా భావించరు. లోక సృష్టికర్తగా, మన ప్రధాన యాజకునిగా అంగీకరించరు. వారి స్వంత తర్జుమా అయిన “ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్” బైబిల్లో దేవుని వాక్యమును కుయుక్తితో, వంచనతో, వక్రీకరించి, మార్చివేసి, వారి సిద్ధాంతాలకు అనుగుణంగా తయారుచేసారు. వాచ్ టవర్ నాయకులకు హెబ్రీ, గ్రీకు భాషలు రావు. బైబిల్ పండితుల ఎదుట ఓడిపోయారు అయినా మూర్ఖంగా, మొండిగా వాదనలతో తమ దొంగ బోధలను ప్రచారం చేసారు. (యోహాను సువార్త 1:1)లో “…. వాక్యము దేవుడై యుండెను” అను మాటలను “వాక్యము ఒక దేవుడై యుండెను” అని తారుమారు చేసి యేసు ప్రభువును దేవునిగా కాక సృష్టింపడిన వ్యక్తిగా మార్చారు. ఇది దేవదూషణ!!

    పరిశుద్ధాత్మ వ్యక్తి కాదని, కేవలం యెహోవా శక్తి అని ప్రకటిస్తారు. నరకం లేదని, బైబిల్లో నరకం సమాధిని సూచిస్తుందని వాదిస్తారు. మానవుని ఆత్మ కేవలం శరీరానికి జీవమునిచ్చు “శక్తి” మాత్రమేనని, మరణం తరువాత ఇక ఆత్మ వుండదని, స్పృహ వుండదని, అది నిద్రావస్థ అని బోధిస్తారు. నమ్మకమైన సాక్షులు మరలా యెహోవా చేత పునఃసృష్టి పొందుతారని చెబుతారు. సాతాను, వాని సమూహం మరియు దుష్టులందరు నిత్యశిక్షను అనుభవించరని, కొంతకాలానికి ఇక వునికి లేకుండా నశించిపోతారని నమ్ముతారు.

    యేసు పునరుత్థానం శరీరములో కాదని కేవలం ఆత్మ పునరుత్థానమని, ఇప్పుడు యేసు ఆత్మ మాత్రమే పరలోకంలో వుందని చెబుతారు. ఆయన శరీరం గ్యాస్ గా మారి గాలిలో కలిసిపోయింది లేక వునికి లేకుండా పోయిందని అంటారు. సాక్షులకు “విశ్వాసం,” “నమ్మిక” – “మారుమనస్సు” – “క్రొత్త జన్మ” అన్న పదాలకు అర్థం తెలీదు! కేవలం క్రియల మూలంగానే వారు మోక్షాన్ని సంపాదించుకోవాలి. రక్షణ నిశ్చయత వారికి లేదు! ప్రతి సంవత్సరం యెహోవా సాక్షుల్లో చేరే 2,00,000 మందిని ఈ సాక్షులు సంవత్సరమంతా గృహదర్శనాలు చేసి, కష్టపడి తమ సంస్థలో చేర్పిస్తారు. వారు కూడుకునే స్థలాన్ని “కింగ్డమ్ హాల్” అని అంటారు. జీవితమంతా “వాచ్ టవర్ సొసైటీ” కి కట్టుబడి వుంటారు.

       దేవుని వాక్యానికి వ్యతిరేకమై, వ్యక్తులను ఆధారం చేసుకుని తమ జీవితాలను పణంగా పెట్టే ఈ సాక్షుల కొరకు మనం ప్రార్థించాలి, వారు కూడా మనుష్యులే అయితే మోసపోయిన స్థితిలో వున్నారు. ప్రభువు వారిలో కొంతమందిని తన “సత్యం” చేత “స్వతంత్రుల్ని” చేస్తున్నారు ప్రార్థించండి – ప్రభువు కార్యం చేస్తారు. మీ బైబిల్ని మీరు బాగా చదవండి – వాక్యంలో “వేరు” పారి నాటబడండి అప్పుడు మీకు ప్రమాదం వుండదు! అంతేకాక ఇలాంటి వారికి సరియైన జవాబు చెప్పి నోరు మూయించడమో లేక క్రీస్తు యొద్దకు నడిపించడమో చేయుటకు సమర్థులౌతారు.

Jehovah’s witnesses

Leave a comment

error: dont try to copy others subjcet.