Psalms – కీర్తనల గ్రంధము వివరణ – Psalms Explanation Telugu

Written by biblesamacharam.com

Published on:

కీర్తనల గ్రంధము వివరణ.

Psalms Explanation Telugu

  ఈ గ్రంథంలో క్రీస్తు – సర్వములో సర్వమైనవాడు! రాబోవు అభిషిక్తుడైన రాజు (మెస్సీయా) 

  పరిశుద్ధ గ్రంథమును మనం ఒక వ్యక్తితో పోల్చినట్లయితే, ఆ వ్యక్తి హృదయము లో నుంచి లేచు సంగీతం వలె “కీర్తనల గ్రంథం” ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మిక్కిలి పెద్ద పుస్తకము మరియు ఎక్కువగా ధ్యానము చేయబడునది ఈ పుస్తకమే. ఈ కీర్తనలు మానవ అనుభవాలలో వ్యక్తిగతమైన వాటినీ మరియు అనుదిన జీవితముతో సంబంధం కలిగిన సమస్త భాగములను తాకుచున్నాయి. 

   వాద్య సంగీతం మీద దేవుణ్ణి స్తుతిస్తూ పాడదగినదాన్ని “కీర్తన” అంటారు. అలాంటి 150 కీర్తనల సంకలనం బైబిల్లోని కీర్తనల గ్రంథం. బైబిల్లోని మిగిలిన గ్రంథాల్లాగా ఈ కీర్తనలను ఆదినుంచి అంతం వరకు వరుసక్రమంలోనే చదవాలి అన్న నిమయం ఏమీ లేదు. ఎందుకంటే ఒక కథలో అధ్యాయం తర్వాత అధ్యాయం చదివితేగాని దాని భావం ఆధ్యంతం ఏమిటో తెలియదు. కాని ఈ కీర్తనలు దేనికదే వ్యక్తిగతమైన కీర్తనలూ పద్యాలూ కనుక వరుసగా చదివితేనే తాత్పర్యం తెలుస్తుందను కోడానికి లేదు. 

  మొత్తం కీర్తనల్లో వివిధ రకాలైనవి ఉన్నాయి. ఎలాగంటే కొన్ని ఆనందాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తుండగా, మరికొన్ని బాధను సందిగ్ధతను వెల్లడిస్తాయి. ఇవి ఆయా రచయితల వ్యక్తిగత జీవితాల్లోని పరిస్థితుల ప్రభావం నుంచి పుట్టుకొచ్చాయి (ఉదాహరణకు కీర్తనలు 3,75). 

  ఆయా పరిస్థితుల్లో, సమస్యల్లో వాటిని మొదటిగా రాసి ఆ తర్వాత మళ్లీ వాటిని సరిచేసి తిరగరాశారు. మరికొన్ని సందర్భాల్లో అందరికీ ఉపయోగకరంగా ఉండాలని వాటిని సరిచేసి, విస్తరించి రాసివుంటారు (ఉదాహరణకు కీర్తన 54). మరికొన్ని అందరి బహిరంగ ఆరాధనార్థం దేవాలయ పండుగల్లో ఉపయోగించడానికి ప్రత్యేకంగా రాసినవి (ఉదాహరణకు కీర్తన 38). మరికొన్ని జాతీయ సందర్భాలైన రాజుల పట్టాభిషేకం, జైత్రయాత్రల సమయంలో, రాజుల వివాహ సమయాల్లో రాసినవి (ఉదాహరణకు కీర్తన 2,18,45).  Psalms Explanation Telugu

   అనేక కీర్తనలకు శీర్షికను, ఆ రచయిత పేరును లేక ఎవరి రచనల్లో నుంచి దానిని సంకలనం చేశారో వివరించారు. కీర్తనల గ్రంథంలోని నూటయాభై కీర్తనల్లో దాదాపు సగం, అనగా 73 కీర్తనలకు దావీదే రచయిత అని వివరించారు. దావీదు గొప్ప రచయిత, సంగీతకారుడు లేక గాయకుడు (1సమూయేలు 16:23, 2 సమూయేలు 1:17-27, 23:1). అంతేగాక దేవాలయ ఆరాధనల కొరకు ఆస్థాన గాయకులను, సంగీత నిలయ విద్వాంసులను ఏర్పరచిన వాడుగా గుర్తింపు పొందాడు (1దిన 15:16 – 28, 16:7). 

   అసలు స్తుతి ఆరాధనకు వ్యాకరణం ఇచ్చినవాడే దావీదు! దేవుని పరిశుద్ధాత్మ శక్తి యొక్క విస్పోటనం చెందే రహస్యాన్ని ఎరిగినవాడు దావీదు! బహుశ అతని వంటి ఆరాధన వీరుడు ఉండడు కాబోలు! గొర్రెల దొడ్డిలోంచి సింహాసనం వరకు నడిపించింది దావీదు యొక్క స్తుతి ఆరాధనయే! దేవుని శక్తి రహస్యం ఎరిగినవాడు గనుకనే తన కీర్తనల్లో ఆరాధన పరిమళాలు గుప్పుమంటున్నాయి. Psalms Explanation Telugu

   దేవాలయ సంగీత గాయక విద్వాంసులు లేవీయులు. లేవి సంతానమైన గెరోను, కహాతు, మెరారి అనే కుమారులను బట్టి ఆ గాయక బృందాలను మూడు వర్గాలుగా దావీదు ఏర్పాటు చేశాడు. గెర్షనీయులు ఆసాపు ఆధ్వర్యంలోను, కహతీయులు హేమాను (కోరహు కుమారులలో ఒకడు) ఆధ్వర్యంలోను, మెరారీయులు ఏతాను ఆధ్వర్యంలోనూ ఉండేవారు (1దిన. 6:1, 31:48, 15:19; 2దిన 5:12). ఆసాపు ఒక ప్రవక్త (2దిన 29:30). మిగిలిన యిద్దరు అంటే హేమాను, ఏతానులు వారు పుట్టిన స్థలాన్ని బట్టి ఎజ్రాహీయులుగా ప్రసిద్ధి చెందారు (1రాజులు 4:31). ఆసాపు పేరున పన్నెండు కీర్తనలు వున్నాయి (కీర్తన 50,73-83). హేమాను పేరున ఒకటి (కీర్తన 88). ఏతాను పేరున ఒకటి (కీర్తన 89) వున్నాయి. Psalms Explanation Telugu

  సొలొమోను పేరు రెండు కీర్తనలకు వుంది. ఆ రెండు కీర్తనలు అతని జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయి (కీర్తన 72, 127). సంకలనాలన్నింటిలోనూ మోషే రచించినది పురాతనమైనదని ప్రసిద్ధి గాంచినది (కీర్తన 90). Psalms Explanation Telugu

  కీర్తనలు చదివేటప్పుడు అవి పద్య కవిత్వానికి సంబంధించినవని, అవి హీబ్రూ భాషా కవిత్వమన్న సంగతి మనసులో ఉంచుకోవాలి. మామూలుగా యితర భాషల్లోని కవిత్వ లక్షణాలైన లయ, ప్రాసల నియమం హీబ్రూ కవిత్వానికి లేదు. అది సమతుల్యమైన పదాల, వాక్యాల నియమాన్ని అనుసరిస్తుంది. కాబట్టి హీబ్రూ కవిత్వాన్ని యితర భాషల్లోకి అనువదించేటప్పుడు దాని శైలి, ప్రాసలను కొంతవరకు పాటించగలిగి ఉండాలి. ఏమైనప్పటికీ హీబ్రూ కవిత్వ లక్షణాన్ని పాఠకుడు అర్థం చేసుకోగలిగితే ఆ కవి రాసినదేమిటో అతడు గ్రహించగలడు. Psalms Explanation Telugu

  సహజంగా హీబ్రూ కవి రెండు సమాంతర పదాల్లో తన భావాన్ని వెల్లడిస్తాడు. రెండో పాదంలో అదే భావాన్ని మరో రూపంలో వెల్లడిస్తాడు (ఉదా. కీర్తన 27:1). కొన్నిసార్లు తన భావాన్ని రెండు కథనాలుగా లేక రెండు అంశాలుగా వివరిస్తాడు కవి. అలాంటి విధానంలో మొదటి పాదంలో సత్యాన్ని చెప్పి రెండో పాదంలో దాని వ్యతిరేకతను వివరిస్తాడు (ఉదా: కీర్తన 37:9) లేక ఒక వినతిని వివరిస్తాడు (ఉదా కీర్తన 103:13). మరికొన్ని సందర్భాల్లో తన అంశాన్ని దానికి సంబంధించిన కథనాలు లేక అంశాలుగా వివరిస్తాడు (ఉదా: కీర్తన 4:3-5) Psalms Explanation Telugu

  కీర్తనలను చదివే పాఠకుడు ఒక్కొక్క పాఠాన్ని, లేక వాక్యాన్ని గురించి అధిక వివరణకు వెళ్తే, లేక దాని ఆంతర్యమేమిటని దాన్నే తీవ్రంగా దర్శించడానికి ప్రయత్నిస్తే అసలు భావాన్నే తప్పుగా అర్థం చేసుకొనే వీలుంది. కాబట్టి ఒక వచనం మొత్తాన్ని ఒకే భావంగా గుర్తించి అర్థం చేసుకోవాలి. ఎక్కువ కీర్తనల్లో ఒక వచనం పల్లవిగా పునరావృతం అయ్యే స్వభావం ఉంది (ఉదా: కీర్తన 42:5, 11; 46:7,11; 49:12,20). 

   బైబిల్లో ఏ భాగాన్నైనా చదువుతున్నప్పుడు ఆ రచయిత సూచించిన సందర్భాలను అర్థం చేసుకొన్న పాఠకుడు ఆ భాగాన్ని బాగానే అవగాహన చేసుకోగలడు. ఇదే భావం కీర్తనలు చదవడంలో కూడా అన్వయిస్తుంది. ప్రతి కీర్తనా రచయిత తానొక అర్థంలో దాన్ని రాసి ఉంటాడు. అది రాసేటప్పుడు ఆ రచయితను ప్రేరేపించిన పరిశుద్ధాత్మే, యిప్పుడు చదివే పాఠకుని కూడా ఆ పురాతన పదాన్ని నేటి పరిస్థితులకు అన్వయించి స్ఫురింపజేస్తాడు. ఈ అవగాహన దేవున్ని ఇంకా బాగా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోడానికి సహాయం చేస్తుంది. Psalms Explanation Telugu

   మరో విశేషం ఏమిటంటే పాత నిబంధన రచయితలు రాసిన వాటిలో గ్రహించలేని సత్యాలను కొత్త నిబంధన రచయితలు గ్రహించారని వివరంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇశ్రాయేలీయుల యెడల దేవుని ఉద్దేశాల నెరవేర్పు – యేసుక్రీస్తు అని కొత్త నిబంధన రచయితలు ప్రత్యక్షంగా చూశారు గనుక పాత నిబంధన రచయితల కంటే వీరికి ఆ అవగాహన స్పష్టంగా నున్నట్లు అర్థమవుతోంది. పాత నిబంధన భాగాలు ఇశ్రాయేలీయుల చరిత్రలోని సంఘటనలనే విశదపరుస్తుండగా కొత్త నిబంధన రచయితలు వాటిని యేసుక్రీస్తుకు అన్వయించారు (కీర్తన 68:17,18 వచనాలను, ఎఫెసీ 1:18-23, 4:8-10 వచనాలతో పోల్చి చూడండి). దేవుడు తన ప్రజలకు ఉద్దేశించిన ఆదర్శాల మూర్తిమత్వమే యేసుక్రీస్తు (కీర్తన 89:3-4 వచనాలను, లూకా 1:32-33 వచనాలతో పోల్చి చూడండి.) Psalms Explanation Telugu

  ఇశ్రాయేలీయులందరూ ఒక జాతిగా, వారి రాజులు కూడా దేవుడు వారికి ఉద్దేశించిన చాలా విషయాలను నెరవేర్చడంలో తప్పిపోయారు. అయినప్పటికీ దేవుడు ఎంచుకున్న రాజు పాలనలో శత్రువులు నాశనమవుతారనీ, నీతి స్థాపించబడుతుందని నిరీక్షణతో ఎదురుచూశారు. Psalms Explanation Telugu

   ఇశ్రాయేలీయుల సంపూర్ణ సాదృశ్యమైన యేసుక్రీస్తు వారి శ్రమల్లో పాలిభాగస్తుడై పాపాత్ములకు వ్యతిరేకమైన దేవుని సమస్త ఉగ్రతను భరించాడు (కీర్తన 22:1-8 వచనాలను, మత్తయి 27:39-46 వచనాలతో పోల్చండి) అయినా ఇశ్రాయేలీయులు ఎప్పుడూ ఎదురుచూడని లేక ఊహించని విజయాలను సాధించి, ఆయన ఎన్నో కృపలను తీసుకొనివచ్చాడు (కీర్తన 22:19-31 వచనాలను ఫిలిప్పీ 2:7-11, ప్రకటన 5:9-14 వచనాలతో పోల్చి చూడండి. మరియు కీర్తన 2:1,11 వచనాలను అపొ. 4:25 – 31; 13:33 – 34 వచనాలతో పోల్చి చూడండి) Psalms Explanation Telugu

  దేవునికి, ఆయన ప్రజలకు వున్న సంబంధాన్ని బట్టి పాత నిబంధన కాలంలోని దైవభక్తిగల వారి శ్రమలూ క్రీస్తు అనుభవించే శ్రమలుగా భావించారు. 

  అలాగే క్రైస్తవుల కాలంలో వారనుభవించిన శ్రమలను క్రీస్తు శ్రమలతో పాలి భాగస్తులు అవడముగా భావించారు (2కొరింథీ 1:5, ఫిలిప్పీ 3:10 చూడండి). అలాగే పాత నిబంధన కాలంలో దైవభక్తిగలవారి విజయాలు క్రీస్తు పొందే విజయాలుగా భావించారు. Psalms Explanation Telugu

  కొత్త నిబంధన రచయితలు యేసుక్రీస్తులో పాత నిబంధన నెరవేరింది అని చెప్పినప్పుడు ఆ నెరవేర్పు కేవలం ఎవరో ఊహించిన సంభవాలు జరగడం కాదు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వివిధ చరిత్రల ద్వారా మానవులందరికీ ఆయన ఉద్దేశించిన సమస్తమైనవీ యేసుక్రీస్తులో పరిసమాప్తమయ్యాయి. 

  మెస్సీయకు సంబంధించిన కీర్తనలు కూడా కీర్తనల గ్రంథంలో మనం చూడగలం. 

  “మెస్సీయ” అనేది హీబ్రూ భాషాపదం. దానికి అభిషిక్తుడు అని అర్థం. రాజులను, యాజకులను (కొన్నిసార్లు ప్రవక్తలను కూడా) వారి నియామకానికి గుర్తుగా నూనెతో అభిషేకించారు. Psalms Explanation Telugu

   ఇశ్రాయేలీయులకు మహానాయకునిగా, మహా రక్షకునిగా, విమోచకునిగా, మహారాజుగా, యాజకునిగా దేవుడు పంపించేవానిని మెస్సీయ అని పిలుస్తారు. కొత్త నిబంధనలో రాయబడిన గ్రీకు భాషలో క్రీస్తు అనేది దీనికి సమానార్థకం. యేసు, ఆయన శిష్యులు పాలస్తీనాలోని యూదులు మాట్లాడే స్థానిక భాషలో మాట్లాడేవారు. గనుక వారు “మెస్సీయ” అన్న పదాన్ని ఉపయోగించారు. కాని సువార్త గ్రంథాలు గ్రీకు భాషలో రాశారు. కనుక బైబిల్లో “క్రీస్తు” అన్న పదప్రయోగం కనిపిస్తుంది (మత్తయి 22:42; యోహాను 7:41-42) 

   క్రీస్తుకు అన్వయిస్తూ కీర్తనాకారుడు రాసిన కీర్తనలు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న రాజులో ఉండే ఆదర్శాలను వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల ప్రతినిధి అయిన రాజును కొన్నిసార్లు దేవుని కుమారుడని పిలుస్తారు (కీర్తన 2:7ను నిర్గమ 4:22, 2సమూయేలు 7:14తో పోల్చండి) అలాగే దేవుని ప్రతినిధిని దేవుడని పిల్చారు (ఉదా: కీర్తన 45:6ను కీర్తన 82:6, యోహాను 10:34తో పోల్చి చూడండి). Psalms Explanation Telugu

  మోషే క్రీస్తుకు ముందు 1500 ఏండ్లకు ముందు ఉన్నవాడు. 90వ కీర్తన మోషే రాసినట్లు మనం చూస్తాం. 126వ కీర్తన చెర తరువాత వ్రాయబడిన కీర్తన; వారు చెరనుంచి విడుదల పొంది… క్రీస్తుకి ముందు ఇంచుమించు 500 ఏండ్లు. అలాగైతే 1000 సం ల కాలంలో ఆయా భక్తులు వ్రాసిన కీర్తనలు సమకూర్చబడెనని అర్థమవుతోంది. 

  కీర్తనల గ్రంథం 5 స్కంధములుగా విభజింపబడినది! ఒక్కొక్క స్కంధము ఒక స్తుతితో ముగింపబడుచున్నది. 150వ కీర్తన 5వ స్కంధమునకును మరియు మొత్తము కీర్తనలకును ముగింపుగా ఉంటున్నది. ఈ కీర్తనల్లో దేవుని ఆరాధనయే ప్రధానమైనది. అదియే మనకు ముఖ్యాంశముగా కనిపించుచున్నది. 

   ఆరాధన – అది దేవుణ్ణి తృప్తిపర్చగలిగే అంశమై యున్నది. Psalms Explanation Telugu

మొదటి స్కంధము :- 

  • ఇందులో 1నుంచి 41వ కీర్తన వరకు ఉన్నాయి
  • ముఖ్య రచయిత – దావీదు కనిపిస్తాడు
  • సారాంశం – ఆరాధన పాటలు
  • ముఖ్యాంశం – సంతోషము మరియు పరిశుద్ధత!
  • యెహోవా అనుమాటకు బదులు “ప్రభువు” అనుమాట వాడబడినది
  • ఆదికాండముతో ఈ స్కంధం సంబంధం కల్గియున్నది – సృష్టి, మానవుడు అనే అంశం గోచరమవుతోంది.
  • దేవుని స్తుతి ముగింపు – కీర్తన 41:13
  • ఈ స్కంధాన్ని కూర్పు చేసినవాడు – దావీదు
  • కూర్పు చేయబడిన కాలము – క్రీ. పూ. 1020-970
  • కీర్తనల సంఖ్య – 41

ద్వితీయ స్కంధము : 

  • ఇందులో 42 నుంచి 72 వరకు గల కీర్తనలు కలవు
  • ముఖ్య రచయితలు – దావీదు, కోరహు కుమారులు
  • సారాంశం – దేశభక్తి కలిసిన స్తుతి పాటలు
  • ముఖ్యాంశం – శ్రమలూ మరియు విజయములు!
  • ఈ స్కంధంలో – “ఎలోహిమ్” అనగా, దేవుడు అనుమాట వాడబడింది.
  • నిర్గమ కాండముతో ఈ స్కంధం పోలిక వర్ణన కలిగియున్నది – స్వాతంత్ర్యము, విమోచన అనునది సూచన ప్రాయముగా కనిపిస్తుంది.
  • దేవుని స్తుతి ముగింపు72:18,19 
  • కూర్పు చేసినవారు – హిజ్కియా, లేక యోషీయా కావచ్చు
  • కూర్పుచేయబడిన కాలము – క్రీ.పూ. 970-610
  • కీర్తనల సంఖ్య – 31 

తృతీయ స్కంధము :- 

  • ఇందులో 73 నుంచి 89వరకు గల కీర్తనలు కలవు
  • ముఖ్య రచయితలు – ఆసాపు, కోరహు కుమారులు
  • సారాంశం – దేశభక్తి కలిసిన స్తుతి పాటలు
  • ముఖ్యాంశం – అంధకారము మరియు వెలుగు!
  • లేవీయకాండముతో ఈ స్కంధం కల్గిన పోలిక ఏమిటంటే – పరిశుద్ధ ఆలయముమరియు ఆరాధన 
  • దేవుని స్తుతి ముగింపు – 89:52
  • కూర్పు చేసినవారు – హిజ్కియా, లేక యోషీయా కావచ్చు
  • కూర్పు చేయబడిన కాలము – క్రీ.పూ. 970–610
  • కీర్తనల సంఖ్య – 17

చతుర్థ స్కంధము :- 

  • ఇందులో 90 నుంచి 106 వరకు గల కీర్తనలు కలవు
  • ముఖ్య రచయితలు – తెలియబడని వారు
  • సారాంశము – స్తుతి పాటలు
  • ముఖ్యాంశం – అపకారము మరియు ఉపకారము; ప్రార్థనకు మరియు స్తుతికి సంబంధించినవి ఎక్కువ కలవు.
  • సంఖ్యాకాండముతో ఈ స్కంధం కల్గిన పోలిక ఏమిటంటే – అరణ్యములో తిరుగులాడిన అనుభవాలు ఇందులో కనిపిస్తాయి.
  • దేవుని స్తుతి ముగింపు – 106:48
  • కూర్పు చేసినవారు – ఎజ్రా, లేక నెహెమ్యా
  • కూర్పు చేయబడిన కాలము – క్రీ. పూ. 430 వరకు
  • కీర్తనల సంఖ్య – 17

పంచమ స్కంధము :- 

  • ఇందులో 107 నుంచి 150 వరకు గల కీర్తనలు కలవు
  • ముఖ్యరచయితలు – దావీదు మరియు తెలియబడనివారు
  • సారాంశము – స్తుతి పాటలు
  • ముఖ్యాంశము – కృతజ్ఞత, స్తుతి చెల్లించుట! చాలావరకు మెట్లు మెట్లుగాఉన్నాయి. 
  • ద్వితీయోపదేశకాండముతో ఈ స్కంధం కల్గిన పోలిక ఏమిటంటే – దేవునివాక్యము మరియు స్తుతి ఇందులో కనిపిస్తాయి. 
  • దేవుని స్తుతి ముగింపు – 150:1-6
  • కూర్పు చేసినవారు – ఎజ్రా, లేక నెహెమ్యా
  • కూర్పుచేయబడిన కాలము – క్రీ.పూ. 430 వరకు
  • కీర్తనల సంఖ్య – 44

దావీదు రాసిన కీర్తనలు : 

  3-9; 11-32; 34-41; 51-65; 68-70; 86; 101;108-110; 122; 124; 131; 138-145 ఈ కీర్తనలలో గొర్రెల కాపరిగా, సంగీతకారుడుగా, యోధుడుగా, రాజుగా దావీదు తన అనుభవాలు రాశాడు. 2,95 కీర్తనలు కూడా దావీదే రాసియుంటాడని అభిప్రాయం ఉంది. దావీదు అనగా యెహోవాకు ప్రియుడు అని అర్ధం! (అపొ. 4:25, హెబ్రీ 4:7) 

ఆసాపు రాసిన కీర్తనలు : 

  50; 73-81; ఆసాపు అనగా సమకూర్చువాడు అని అర్థం. ఆసాపు యాజకుడు, ప్రధాన గాయకుడు. ఇతడు పాటలను సేకరించేవాడుగా ఉన్నాడు. 

కోరహు కుమారులు రాసినవి : 

వీరు 10 కీర్తనలు రాశారు, 42; 44-49; 84; 85; 87 

వీరు గాయకులూ కీర్తనాకారులూ 

సొలొమోను రాసిన కీర్తనలు : 

కీర్తనలు 72, 127; సొలొమోను మహాజ్ఞాని. భూపతులందరిలోకెల్లా అతని వంటి జ్ఞాని ఎవ్వరు లేరు. సొలొమోను అనగా సమాధానము అని అర్థం.

మోషే రాసిన కీర్తన : 

  కీర్తన 90; మోషే దేవునిచే ఏర్పాటు చేయబడిన నాయకుడు; ఐగుప్తునుంచి దేవుని ప్రజలను విడిపించిన విమోచకుడు! సీనాయి కొండమీద ప్రజల నిమిత్తము ధర్మశాస్త్రమును పొందినవాడు! 

హేమాను రాసిన కీర్తన : 

కీర్తన 88; హేమాను అనగా “విశ్వసనీయమైన” అని అర్థం. ఇతడు ఒక జ్ఞాని (1రాజు. 4:31) 

ఏతాను రాసిన కీర్తన : : 

కీర్తన 89 ఏతాను అనుమాటకు “సహించు” అని అర్థం. ఇతడును మరొక జ్ఞాని (1రాజులు 4:31) 

పేరు తెలియని కీర్తనలు : 

 అవి 1, 10, 33, 43, 66, 67, 71, 91-100, 104-107, 111–121, 123, 125, 126, 128-130, 132, 134-137, 146-150 ఈ కీర్తనల్లో కొన్ని ఎజ్రా రాసి యుంటాడని పండితులు అభిప్రాయపడుచున్నారు. Psalms Explanation Telugu

ఈ కీర్తనల గ్రంథం క్రీస్తును సర్వములో సర్వమైయున్నాడు అనే సత్యాన్ని చూపిస్తుంది. క్రీస్తును గూర్చి కొన్ని సంగతులు మీకు తెలియజేస్తున్నాం! దయచేసి చూడండి! 

ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత – కీర్తనలలో నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని సెలవిచ్చాడు (లూకా 24:44)

  1. ఆయన అవతారము – కీర్తన 40:6-8 ని హెబ్రీ 10:5-9 తో సరిపోల్చండి.
  2. ఆయనకున్న భోధించువరం – కీర్తన 45:2 ని లూకా 4:22 తో సరిపోల్చండి.
  3. ఆయన పొందిన అభిషేకం – కీర్తన 45:6-7 ని హెబ్రీ 1:8,9 తో సరిపోల్చండి.
  4. ఆయన దైవత్వం గూర్చి – కీర్తన 45:6 ని హెబ్రీ 1:8 తో సరిపోల్చండి.
  5. ఆయన దేవాలయం శుద్ధీకరించుట – కీర్తన 69:9 ని యోహాను 2:17 తోసరిపోల్చండి. 
  1. ఆయనపై పగబట్టుట – కీర్తన 69:4 ని యోహాను 15:25 తో సరిపోల్చండి.
  2. ఆయన సొంత ఇంటివారే ఆయన యందు విశ్వాసముంచకపోవుట – కీర్తన69:8 ని యోహాను 7:3-5 తో సరిపోల్చండి. 
  1. మట్టలాదివారము రోజు బాలురు కేకలు వేయుటను గూర్చి – కీర్తన 8:2 నిమత్తయి 21:16 తో సరిపోల్చండి. 
  1. ఆయనను అప్పగించే విషయమును గూర్చి – కీర్తన 41:9 ని యోహాను13:18,19 తో సరిపోల్చండి. 

 

  1. ఆయన సిలువపై పెట్టిన కేకను గూర్చి – కీర్తన 22:1

–  యూదులు ఆయనను అపహసించుటను గూర్చి – కీర్తన 22:7 

– ఆయన కాళ్ళు, చేతులు మేకులతో గ్రుచ్చబడుటను గూర్చి – కీర్తన 22:16 

– అంగీ కొరకు చీట్లు వేయుటను గూర్చి – కీర్తన 22:18 

పై సంగతులను యోహాను 19:23, 24 తో పోల్చండి. 

  1. ఆయన పునరుత్థానము గూర్చి – కీర్తన 16:9 – 10 ని అపొ. 2:24 – 31తో సరిపోల్చండి. 
  1. ఆయన లేచిన తర్వాత ఆరోహణుడగుటను గూర్చి – కీర్తన 68:18 ని ఎఫెసీ  4:8-10 తో సరిపోల్చండి. 
  1. లేచిన క్రీస్తు ప్రధాన యాజకునిగా నియమించబడుటను గూర్చి – కీర్తన 2:7 ని హెబ్రీ 1:5, 5:5, అపొ. 13:33 అను వాక్య భాగాలతో సరిపోల్చండి.
  1. క్రీస్తు లేపబడినప్పుడే దేవుని కుమారునిగా నిరూపింపబడుటను గూర్చి – కీర్తన2:7 ని రోమా 1:1-7 తో సరిపోల్చండి. 
  1. యూదులకు మళ్లీ కనబడుటను గూర్చి – కీర్తన 118:26 ని మత్తయి 23:38, 39 తో సరిపోల్చండి. 

 

  1. అంతట వెయ్యి ఏండ్లు రాజ్యం ఏలుటను గూర్చి – 2,8, 24, 72, 89, 102,

    110 కీర్తనలు చాలా గంభీరంగా తెలియజేస్తున్నాయి. 

కొందరు భక్తులు కీర్తనల గ్రంథాన్ని గూర్చి యీ విధంగా వ్యాఖ్యానించారు… 

  ఆది సంఘపితరుడైన జెరోమ్ – “అరకదున్నువాడూ, కోతకోయువాడూ, పడవ నడుపువాడూ, పసులు కాయువాడూ అందరును దావీదు కీర్తనలు పాడుచున్నారు” అన్నాడు. బాసిలి అనే పండితుడు – “కీర్తనల గ్రంథమందు సంపూర్ణ వేదాంతము కలదు” అన్నాడు. 

గ్రీకులు – “కీర్తనలు లేఖనాల యొక్క ఉద్యానవనములు” అన్నారు. 

సిబ్బె “లేఖనమును మానవ శరీరముతో పోలిస్తే, కీర్తనలు మానవ హృదయముగా మనం పిల్చుకొనవచ్చును” అన్నాడు. 

స్పర్జన్ – “దావీదు కీర్తనలు, దావీదు యొక్క ధనాగారమునై యున్నవి” అన్నాడు. 

  ఈ కీర్తనలను ఉదయకాలము రోజుకొక్కటి చొప్పున మనం చదివినచో జుంటి తేనె ధారలను జుర్రుకున్నవారమవుతాం! కొండతేనెతో తృప్తినొందిన అనుభూతి పొందుతాం! క్రొవ్వు మెదడు దొరికినట్టుగా బలం పొందుతాం! శత్రువును సవాలు చేసి ఎదిరించగలుగుతాం! 

   ప్రియులారా! దేవుని దృష్టికి మిగుల విలువగలది – ఆరాధన! పరలోకమును పరవశింపజేయగల శక్తి ఆరాధనకు ఉంది. ప్రార్థన వేళలు ఆరాధన సమయాలుగా మారనియ్యండి! అద్భుతాలు జరిగే ఏకైక సమయమే – ఆరాధన! 

కీర్తనీయుడైన నీ దేవునికి నీ కీర్తన కావాలి! 

పౌలు సీలల కీర్తనలు రోమా చెరసాల పునాదులను అదరగొడితే, నీ కీర్తనలు పాతాళ రాజ్యపునాదులనే అదరగొట్టేంత శక్తిగలవై యున్నవని నీవెప్పుడు మర్చిపోవద్దు!!! 


ప్రత్యక్ష గుడారం గూర్చి నేర్చుకోవడానికి క్లిక్ చేయండి. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

1 thought on “Psalms – కీర్తనల గ్రంధము వివరణ – Psalms Explanation Telugu”

  1. చాలా చక్కగా, క్లుప్తంగా కీర్తనల గ్రంధం గురించి తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదములు. ఇంకా ఒక్కొక్క కీర్తన గురించి ప్రత్యేకముగా, వివరముగా ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. 👏👏

    Reply

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted