Is baptism necessary for salvation |బాప్తిస్మం తప్పనిసరిగా పొందాలా?|5

Written by biblesamacharam.com

Updated on:

బాప్తిస్మం తప్పనిసరిగా పొందాలా?

Is baptism necessary for salvation

ప్రశ్న : నీటి బాప్తిస్మం తప్పనిసరిగా పొందాలా? బాప్తిస్మం లేకుండా రక్షణ పొందలేమా? బాప్తిస్మం పొందితే తప్ప రక్షణ లేదనుకుంటే శిలువ మీది దొంగ బాప్తిస్మం పొందలేదుగా. మరి ఆయనెలా పరదైసుకి వెళ్లాడు?

    జవాబు : క్రొత్త నిబంధన బోధ ప్రకారం బాప్తిస్మం తప్పనిసరి పొందాలి. నీటి బాప్తిస్మం ఇష్టమైతే తీసుకోవడం, ఇష్టం కాకపోతే మానేయవలసింది కాదు. అది ఏ మానవుని చేతను, ఏ సంఘము చేతను కనిపెట్టబడింది కాదు.తండ్రియైన దేవుడు దీనిని నియమించాడు (యోహాను 1:33). కుమారుడైన దేవుడు దీనిని ఆజ్ఞాపించాడు (మత్తయి 28:19). పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేరేపించ బడిన ఆది అపోస్తులులు బాప్తిస్మం పొందవలసిందిగా ఆజ్ఞాపించారు (అపొ. 2:38). ఆది సంఘం క్రమం తప్పకుండా దీనిని పాటించింది (బైబిలు తీసి చదవండి – అపొ. 2:41; 8:12; 9:8; 10:47)

   ఆ మాటకొస్తే అసలు బాప్తిస్మం పొందనవసరములేని వ్యక్తి కేవలం మన ప్రభువు మాత్రమే. అయినను మన ప్రభువు బాప్తిస్మము నకు విధేయుడయ్యాడు. “నీతి యావత్తు ఈలాగు నెరవేర్చబడ వలెను” అన్నాడు. ఆపుటకు ప్రయత్నించిన యోహాను ఆశ్చర్య పోయాడు. బాప్తిస్మం పొంది నీళ్లలోంచి ఒడ్డుకు వచ్చినప్పుడు – “నీ యందు నేనానందిచుచున్నానని” తండ్రి సాక్ష్యం పలికాడు. ఈ విధంగా బాప్తిస్మం అనేది విధేయతకు సూచనగా మారిపోయింది.

కొంతమంది – “దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. దర్శనాలు చూస్తున్నాను. కానుకలూ దశమభాగాలు ఇస్తున్నాను. దేవుడంటే నాకు వల్లమాలిన ప్రేమ. ఇంక నేను బాప్తిస్మము పొందకపోతే ఏమిటి?” అని అంటారు.

    ఒక్క సంగతి గుర్తుంచుకోండి – నీ ఆత్మీయ అనుభవాలు నీటి బాప్తిస్మానికీ ప్రత్యామ్నాయం కాలేవు! కొర్నేలీ యొక్క ధర్మకార్యములూ, ప్రార్ధనలూ దేవుని సన్నిధికి చేరాయి. పేతురు ప్రసంగిస్తుంటే పరిశుద్ధాత్మ పొందుకొని అన్యభాషలు మాట్లాడాడు. అయినప్పటికీ అతడు బాప్తిస్మం పొందవలెనని పేతురు ఆజ్ఞాపించాడు (అపొ.కా. 10:1,2, 45-48).

     బాప్తిస్మం పొందుటకు ముందు – నీవు నమ్మాలి (మార్కు 16:16). క్రీస్తును నీ ప్రభువు అని, రక్షకుడు అని నమ్మాలి. రెండవది – మారుమనసు పొందాలి (అపొ.కా. 2:38). మూడవది – ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి (అపొ.కా. 22:16). ఏం ప్రార్థించాలి? గత నీ పాపములు ఒప్పుకుంటూ ప్రార్థించాలి. ఆ తర్వాత బాప్తిస్మం పొందాలి. అది వాక్య క్రమం! రక్షణ క్రమం!

    పేతురు వ్రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 20,21 వచనాలలో – “ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది” అని చెప్పబడింది.

దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షిస్తుంది అట! అర్థమైందా లేఖన ఘోష!

    ఇకపోతే, శిలువమీది దొంగ సంగతి అంటారా! క్రూరుల మధ్య కల్వరి కొండమీద సిలువలో వ్రేలాడుతున్నాడు. “అయ్యలారా! నన్ను శిలువ మీద నుంచి దించండి, బాప్తిస్మం పొందేసి మళ్లొస్తాను” అని అన్నాడనుకోండి. వాని మీద జాలిపడి దించుతారా ఎవరైనా? ఎవరూ దించరు. వాడు చివరి ఘడియలలో ఉన్నాడు. రక్షకున్ని కలుసుకుంది అప్పుడే. వాడు బాప్తిస్మం పొందేందుకు అవకాశమే లేదు. కాబట్టి బాప్తిస్మం పొందనవసరం లేకుండా ఆ విషయంలో వాడు కన్సెక్షన్ పొందాడు. మరి మనం?

బాప్తిస్మం పొందకుండా పరలోకం చేరేందుకు నువ్వేమైనా శిలువకింది దొంగవా??


ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. click here 

Leave a comment