ధేవుడు ఉన్నాడు ?
God Sunday School Story
పిల్లలూ, బావున్నారా? ఎలా ఉన్నారు? గత సంచికలో మీకు చెప్పిన కథ మీకు జ్ఞాపకం ఉందా! మీరు ఆ కథలను మీ స్నేహితులకు చెప్పండి. వారును యేసయ్య బిడ్డలే కదా! ప్రభువు మీయొక్క ప్రయాసను వ్యర్థం చేయరు. తప్పకుండా వారినీ ఆయన దర్శిస్తారు. రక్షణలోనికి నడిపిస్తారు. సరే, మనం కథ చెప్పుకుందామా?
“దేవుడు ఉన్నాడు” అని ఒప్పుకొనే వారిని “ఆస్తికులు” అంటారు కదా! అటువలె “దేవుడు లేడు” అని చెప్పేవారిని “నాస్తికులు” అంటారు. ఇది మీకు తెలిసిన విషయమే కదా పిల్లలూ!
ఒకానొక నాస్తికుడు ఒక పట్టణంలో సభ ఒకటి జరిగించాడు. ఆ సభలో అతడు – “దేవుడు లేడు” అంటూ ఉపన్యసిస్తున్నాడు. అక్కడకు ఆయా మతాల వారు వచ్చారు. అతను ఏం చెబుతాడోనని అందరూ శ్రద్ధగా ఆలకిస్తున్నారు.
“నిజంగా దేవుడు అంటూ ఉంటే మనకందరికీ కనబడాలి కదా! కనబడని దానిని ఉన్నట్లుగా అనుకోవడం భ్రమ. దీనినే ఆస్తికత్వం అంటారు. ఒకసారి ఆ పిచ్చిలో పడితే, ఇక అందులోంచి బయటపడడానికి సరైన మందే లేకపోవడం దురదృష్టకరం. అసలు నిజంగా దేవుడు అంటూ లేడని చిన్న ప్రయోగం ద్వారా ఇప్పుడే నిరూపిస్తాను” అంటూ ఆ నాస్తికుడు తన తల పైకెత్తి చూస్తూ చెప్పాడు.
“ఓ దేవుడా! నువ్వు అంటూ ఉంటే మాకు కనబడు. అలా కనబడటం నీకు చేతకాకపోతే నువ్వు సర్వశక్తిమంతుడవు కావు అని ప్రకటిస్తాం. నేను 30 అంకెలు లెక్కపెట్టేలోపు, కనీసం నన్ను ఈ స్టేజీ మీద నుంచి కిందకు దింపు. నేను చెప్పినట్లు జరిగితే అప్పుడు నిన్ను నమ్ముతాం. లేదా నువ్వు లేవు అని మేము తేల్చేస్తాం” అంటూ అతడు – “ఒకటి, రెండు, మూడు… ఇరవై రెండు… ఇరవై ఐదు…” అని లెక్కపెట్టసాగాడు.
అందరికి ఉత్కంఠ కలిగింది. ఏం జరుగునో అని ఆందోళన చెందసాగారు. ఈ పొగరుబోతుని దేవుడు యే విధంగానైనను అణచివేయాలి అంటూ తమలో తాము ప్రార్థించుచున్నారు.
రోషముతో బిగ్గరగా అరుస్తూ అతడు అంకెలు లెక్కపెడుతున్నాడు. ఆ స్టేజీ అంత ఊపేస్తున్నాడు. నేను దేవుణ్ణి గెలిచేసాను అనే సంభ్రమంలో అటూ ఇటూ గెంతులు పెడుతున్నాడు. ఆ స్టేజీ చివరి అంచుకు వెళ్ళిపోయాడు. అంతలో “ఇరవై ఆ ఏడు” అన్నాడు. ఇంతలో ఎక్కన్నుంచి వచ్చిందో… ఓ కందిరీగ చటుక్కుమని వాని కంటిమీద కుట్టింది.
అంతే – “డాం…” అంటూ స్టేజీ వెనుక అంచు నుండి క్రింద పడిపోయాడు. “ముప్పై” అని లెక్కపెట్టకమునుపే అతడు నేల పడిపోవటం జరిగిపోయింది. పిల్లలూ, వింటున్నారా? ఎంత అద్భుతం!
దేవుడు – “నేను ఉన్నాను” అంటూ కందిరీగ ద్వారా ఋజువు చేసుకొన్నాడు.,
మీరు వెళ్లే స్కూలులో గాని, మీ వీధిలోగాని, మార్కెట్లోగాని రకరకాల పిల్లలూ, మనుషులు మీకు ఎదురు అవుతారు. అందరూ ఒకేలాగ ఉండరు కదా! రకరకాల మనస్థత్వాలు కలిగిన వారూ, నమ్మకాలు గలవారూ మీకు కనబడతారు.
కొందరు విగ్రహాలకు పూజ చేసేవారు, మరికొందరు అసలు దేవుడే లేడు- అదంతా ఒట్టి అబద్ధం అంటూ మాట్లాడేవారిని మీరు చూచేవుంటారు. ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రుల వలన ఆ విధంగా ప్రభావితులు అవుతారు.
అటువంటి వాళ్లు మిమ్ములను చూచి, వ్యంగ్యముగా మాటలాడినను మీరు కోపం తెచ్చుకోకుండా, ఓర్పుతో, సహనముతో తగిన సమయంలో, తగిన సమాధానం చెప్పునట్లుగా మనం ప్రభువును వేడుకోవాలి.
జీవాధిపతియైన మన దేవుణ్ణి మన జీవితాల ద్వారా ఇతరులకు కనుపరచాలి. ఆయన మన ప్రార్థనలు ఏ విధంగా ఆలకించునో… వాటికి ఆయన యే విధముగా జవాబునిచ్చునో… వినయముతో ప్రేమ కలిగి… చిరునవ్వుతో తెలియచేసినట్లయితే… మీరు ఆ ఆత్మను ప్రభువు కొరకు సంపాదించినవారు అవుతారు.
పిల్లలూ, మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రార్ధించటం మర్చిపోకండి!
ప్రత్యక్ష గుడారం గురించి .. click here