George White Field Telugu | జార్జి విట్ ఫీల్డ్

Written by biblesamacharam.com

Published on:

జార్జి విట్ ఫీల్డ్

George White Field Telugu

 జార్జి విట్ ఫీల్డ్ 1715 వ సంవత్సరములో డిశంబరు 16వ తేదీన ఇంగ్లాండులోని ‘గ్లోస్టర్’ అను ప్రాంతంలో జన్మించెను. ఈయన తల్లి ఒక పేరు పొందిన హెూటల్కు యజమానురాలు, జార్జి యొక్క రెండేండ్ల వయస్సులోనే అతని తండ్రి చనిపోయెను. ఈయన తల్లి ఈయన పాష్టరు కావాలని కోరేది! కాని, జార్జి మనస్సు నాటకాల మీద ఉండేది. ఇతనికి గంభీరమైన మధురస్వరం ఉండేది. 

 జార్జికి ఆక్స్ఫర్డ్లో చదువుటకు సీటు దొరికినది. అక్కడకు వెళ్ళిన తరువాత ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడటం, ఆలయానికి వెళ్ళడం అనే భక్తి అలవాట్లకు అలవాటు పడినాడు. ఉజ్జీవకర్త అయిన జాన్వెస్లీ సహవాసమునకు చెందిన వారితో తిరుగుచుండెడివాడు. ‘క్రొత్త జన్మ పొందాలి’ అనే సత్యం తెలుసుకొన్నాడు కాని, క్రొత్త జన్మ ఎలా పొందాలో తెలియక తనంతట తానే ఏవేవో ప్రయత్నాలు చేసెడివాడు. గనుక ఫలితం దొరకలేదు. 

 ఒక దినము క్రొత్త నిబంధనలోని సిలువ ధ్యానాలు చదువుచుండగా సిలువ వేయబడిన క్రీస్తు ఆయన కళ్ళముందు ప్రత్యక్షమాయెను. ఆయన హృదయములో ఒక అద్భుతము జరిగి పాపపు ఒప్పుకోలు కలిగినది. ప్రభువైన క్రీస్తును తన హృదయములోనికి ఆహ్వానించి నూతన జన్మ అనుభవమును పొందెను. 

 ఆ దినములలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు వారు అభిషేకించనిదే ఎవరును ప్రసంగించకూడదు. జార్జి 20 సంవత్సరముల వయస్సుగలవాడే అయినప్పటికిని దేవుని ఏర్పాటును బట్టి 1736 లో జూన్ 20వ తేదీన జార్జి విట్ ఫీల్డ్ను ‘డీకన్’గా అభిషేకించారు. జార్జి ఆ మొట్టమొదటి ఆదివారమే బయటకు వెళ్ళి అచ్చటి ఖైదీలకు ప్రార్థన జరిపి దేవుని వాక్యమును అందించెను. ఇట్లు పేదల యొద్ద అతని పరిచర్య ప్రారంభమాయెను. 

 అతి చిన్న వయస్సులోనే జార్జి చేసిన ప్రసంగాలు లండన్ను, అమెరికాను కదిలించెను. అనేకులు ఈయన ప్రసంగాలు విని ఆశ్చర్యపడి క్రీస్తును అంగీకరించి రక్షింపబడిరి. ఈయన ప్రసంగంలోని సారాంశం ‘మరుజన్మ!’ మారు మనస్సును గురించి నొక్కి చెప్పే ఈయన ప్రసంగాలు విని అనేక మంది పాష్టర్లు ఈయనను ఛీదరించుకొని ఈయనపై దుష్ప్రచారము చేయ మొదలు పెట్టిరి. అయినను, మారుమనస్సు పొందుచున్న వారనేకులు ఈయనను హత్తుకొనిరి. 

 అనేక చర్చిలు ఆయనకు మూయబడినప్పటికిని బహిరంగస్థలములలోను, వీథి మూలల్లోను సువార్తను ప్రకటించుచుండెను. ఇంచుమించు 20 వేల మంది వరకు ఈయన కూటములలో ఉండెడివారు. వారిలో అనేక మంది రక్షింపబడు చుండెడివారు. ఇంగ్లాండు, వేల్స్, స్కాట్లాండ్, అమెరికా దేశములలో ఈయన 35 సంవత్సరములు సేవ కొనసాగించెను. ప్రభువు కృప వలన మంచి ప్రసంగించు వరమును పొంది, ఇంగ్లాండులోని గొప్ప ప్రసంగీకులలో ఒకడిగా పేరు పొందినవాడయ్యెను. 

 ఈయన లోతైన ఆధ్యాత్మిక జీవితమును, భక్తిని కలిగినవాడు. ఈయన ప్రసంగములు అగ్నిబాణములవలెను; ఉరుములు, మెరుపులవలెను; వర్షపు జల్లులవలె గద్దింపులతోను, ప్రేమ- ఆదరణలతోను నిండియుండెడివి. సాతానుకు సంతగా ఉన్న స్థలంలో, సింహంలాగా గర్జిస్తూ సాతానుకోరల్లో చిక్కుబడియున్న వెయ్యి ఆత్మలకు పైగా ఒక్క దినాన్నే ప్రభువు దగ్గరకు ప్రార్థన ద్వారా తేగలిగినాడు, ప్రార్థనాపరుడైన ఈ జార్జి విట్ ఫీల్డ్. 

 1748 లో అతని ఆరోగ్యం దెబ్బతిని, గుండెపోటువలన బలహీనుడై నప్పటికిని ప్రసంగాలు చేయటం మానలేదు. రాత్రనక, పగలనక ప్రయాణాల వలన అతని శరీరం కృశించుచుండెను. గాని, కన్నీటితో అతను చేసే ప్రసంగాలు అనేకులను కదిలించేవి. తమను జార్జి పట్టలేనంతగా ప్రేమిస్తున్నాడని అతని ప్రసంగం వినేవాళ్ళకు అర్థమయ్యేది. చెంపలు కన్నీటితో తడవకుండా, తన ఎదుట నున్న మనుష్యుల కోసం వెక్కి వెక్కి ఏడవకుండా ప్రసంగం చేయలేకపోయేవాడు ఈ ప్రేమాపూర్ణుడైన జార్జి విట్ ఫీల్డ్. 

 “నేను ఏడుస్తున్నానని నన్ను విమర్శిస్తున్నారెందుకు? నాశనానికి సిద్ధంగా ఉన్న మీ ఆత్మల విషయం మీరు ఏడవకుండా ఉన్నప్పుడు నేను మీ గురించి ఏడవకుండా ఎలా ఉండగలను? ఏమో! ఒక వేళ మీరు వింటున్నది మీ బ్రతుకులో చివరి ప్రసంగమేమో!! అయినను మీరు ఇంకా చలించకుండా ఉండటం చూచినపుడు, నేను రోదించకుండా ఉండలేను” అనేవాడు. 

 “రాత్రింబగళ్ళు యేసుప్రభువు నన్ను తన ప్రేమతో నింపుచున్నాడు. యేసు ప్రభువు ప్రేమను నేను తలంచునపుడు మూగవాడినైపోవుచున్నాను. నేనెల్లపుడూ పరిశుద్ధాత్మ ఆదరణలో నడుచుచున్నాను” అని ఆయన డైరీలో వ్రాసుకొనెను. సంవత్సరముల తరబడి విట్ఫీల్డ్ భారమైన సేవలో విశ్రాంతి లేక కొనసాగు చుండెను. ఆయనకు ప్రసంగముల మధ్య ఉన్న కొద్ది ఖాళీ సమయమును ప్రయా ణము చేయుటలోను, నడుచుటలోను, ప్రసంగములను సిద్ధపరచు కొనుటలోను వాడెడివాడు. మనుష్యుల ఆధ్యాత్మిక అవసరతలను తీర్చుటకు, వ్యాధిగ్రస్థులను ఆదరించుటకు అనేక ఉత్తరములు వ్రాయుచుండెడివాడు; వారికొరకు ప్రార్థించు చుండెడివాడు. 

 “తుప్పు పట్టడంకంటే, అరిగిపోవడం మేలు” అంటూ ఎంత అనారోగ్య వంతుడౌతున్నా, తాను మరణించే రాత్రివరకూ బోధించడం మానలేదు. “నాకు వేయి జన్మలు, వేయి శరీరాలు ఉంటే ఎంత బాగుండును! వేయి నోళ్లతో క్రీస్తును ప్రకటించేవాడిని” అనేవాడు. “ఈ యాత్ర ఎంత కాలం సాగితే, అంత దూరందాకా ప్రజల్ని మేల్కొలుపుతాను” అంటూ ఆఖరిశ్వాస వరకు ప్రభువు కొరకే ప్రయాసపడి తన 56 వ ఏట అనగా 1770 వ సంవత్సరము అక్టోబర్ 15వ తారీఖు రాత్రి తన ప్రాణాన్ని అప్పగించెను   జార్జి విట్ ఫీల్డ్. 


All Pdf………..Download

Leave a comment