George Muller biography in Telugu – జార్జ్ ముల్లర్ జీవిత చరిత్ర

జార్జిముల్లర్

George Muller biography in Telugu

 జార్జిముల్లర్ ప్రష్యా దేశమందలి ‘క్రోప్ స్టేట్ ‘ అను పట్టణములో 1805వ : సంవత్సరము సెప్టెంబరు 27 వ తేదీన జన్మించెను. అతని తండ్రి ఎక్సైజు కలెక్టరుగా పని చేయుచుండెను. ఆయన లోకస్థుడు. కనుక పిల్లలను గారాబముగా పెంచుచు, విస్తారమైన డబ్బు వారికి యిచ్చుచుండెను. అందువలన బాల్యములోనే ముల్లర్ అనేక దురలవాట్లకు లోనయ్యెను. 

ముల్లర్కు పది సంవత్సరముల వయస్సు నిండునప్పటికి అతని తండ్రి అతనిని ఒక లూథరన్ మతగురువుగా సిద్ధపరచే స్కూలులో చేర్పించాలని ఆశించెను. కాని, ముల్లర్ తన సొంత మార్గములో తిరుగుచు దొంగగాను, అబద్ధికుడుగాను, మోసగాడిగాను తయారయ్యెను. 14 సంవత్సరముల వయస్సు నిండునప్పటికే నవలలు చదువుట, పేకాడుట, త్రాగుట వంటి దురలవాట్లకు బానిసైపోయెను. చివరకు తన తల్లి మరణ పడక మీదున్న రాత్రి కూడా త్రాగుచు, వీధులలో తిరుగుచుండెను. 

16 సంవత్సరముల వయస్సు వచ్చునప్పటికి మరింత అపవిత్రమైన జీవితములో మునిగిపోయి, ఖరీదైన హెూటల్స్కి వెళ్ళి, తిని, త్రాగి ఆనందించు చుండెను. అనేకసార్లు హెూటళ్ళలో నుండి బిల్లు చెల్లించకుండా పారిపోవుచుండగా పట్టబడి చెఱసాలలో ఉంచబడెను. తండ్రి అనేకసార్లు కఠినంగా శిక్షించెను గాని ప్రయోజనము లేకపోయెను. ముల్లర్ మంచిగా జీవించవలెనని ఆశించెను. అయితే, అప్పటికే పాపబంధకములతో కట్టబడియున్నందున అప్పులు చేయుట, తాకట్టు పెట్టుట, దొంగతనములను చేయుట ద్వారా డబ్బు సంపాదించి తన పాపపు ఇచ్ఛలను తీర్చుకొనుచుండెను. 

1825 లో ‘నార్ధసన్’ అను స్థలమునకు వెళ్ళి ఫ్రెంచి, జర్మనీ, లాటిన్ భాషలను నేర్చుకొనుటకు రెండున్నర సంవత్సరములు కృషి చేసెను. కాని, అక్కడ కూడా అప్పులు చేయుచు, మద్యపానము చేయుచు తన జీవితమును పాడు చేసుకొనుచుండెను. ఒకసారి బీటా అను తన స్నేహితునితో వినోదయాత్రకు స్విట్జర్లాండు వెళ్ళెను. అక్కడ కొండలను, కోనలను చూచి, ఆనందించి స్విష్ మద్యమును సేవించి, ఉల్లాసము పొందుదామనుకొనెను. 

అక్కడ డాక్టర్ వెంగర్ అను ఒక భక్తిపరుడుండెను. ఆయన ఇంట ప్రతి శనివారము ప్రార్థనా కూడికలు జరుగుచుండేవి. బీటా, ముల్లర్లు ఒక స్నేహితుని ద్వారా ఆ ప్రార్థనా కూడికకు ఆహ్వానించబడిరి. ముల్లర్ అయిష్టతతోనే ఆ చిన్న కూటమునకు వెళ్ళినప్పటికి, అక్కడ వారి ప్రేమను చూచి, ఆశ్చర్యపోయెను. వారు ఒక పాట పాడిన తరువాత మోకరించి ప్రార్థించుచుండగా ముల్లర్ కూడా కదిలించబడి తానును మోకాళ్ళమీద పడెను. 

ముల్లర్ మొట్టమొదటిసారిగా నోరు తెరచి ప్రార్థించుట మొదలు పెట్టెను. దేవుని ఆత్మ అతనిని స్పందింపజేసెను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తరువాత ముల్లర్ మోకరించి దేవుని సన్నిధిలో తన దోషములన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపపడెను. అది 1825 వ సంవత్సరము, ముల్లర్ తిరిగి జన్మించిన సంవత్సరము. ముల్లర్ ఎంతో దుష్టుడుగా జీవించినప్పటికి, తన ఇరవైయ్యవ ఏటనే ప్రభువు అతనిని దర్శించెను. ఆ తరువాత ముల్లర్ క్రమముగా ప్రతి శనివారము ప్రార్థనా కూటములకు వెళ్ళుట ద్వారా మిషనెరీలను, దైవసేవకులను హెచ్చరించు పత్రికలను చదువుట ద్వారా భక్తిలో ఎదుగుచుండెను.  George Muller biography in Telugu

ఒక రోజు ప్రార్థనాకూటము నందు ‘హెర్మన్బల్’ అను ఒక యౌవనస్థుడు ధనికుడైన జర్మన్ వ్యాపారస్థుని కుమారుడై యుండియు, క్రీస్తుకొరకు సమస్తమును విడిచిపెట్టి పోలాండ్లోని యూదుల మధ్యకు మిషనెరీగా వెళ్ళుటకు సమర్పించుకొనిన సంగతి వినెను. ముల్లర్ కూడా పురికొల్పబడి- ప్రభువా! నీవు ఏ స్థలమునకు నన్ను మిషనెరీగా పంపినను వెళ్ళుటకు నేను సిద్ధముగా యున్నానని ప్రభువుకు సమర్పించుకొనెను. మిషనెరీ తర్ఫీదు కొరకు జర్మన్ మిషనెరీ ట్రైనింగ్ సెంటర్లో చేరుటకు నిర్ణయించుకొనెను. అయితే, అతని తండ్రి లోకస్థుడైనందున ముల్లర్ డబ్బు సంపాదించే పాదిరిగా ఉండుటకు అనుమతించెను గాని, మిషనెరీగా ఉండుటకు ఇష్టపడలేదు. అయినను నేను దేవునికి వాగ్దానము చేసిన రీతిగా నా సేవ యెచ్చట అవసరమో అచ్చటనే మిషనరీ సేవ చేయుదునని ముల్లర్ ఖండితముగా చెప్పెను. 

ముల్లర్ అప్పటి నుండి తన తండ్రి సహాయముపై ఆధారపడక, దేవునిపై ఆధారపడెను. డా. తోలక్ సిఫారసు మేరకు అమెరికా నుండి వచ్చిన ముగ్గురు మిషనెరీలు జార్జి ముల్లర్ యొద్ద జర్మన్ భాష నేర్చుకొనుచు, ఆయనకు ద్రవ్యమిచ్చు చుండిరి. ముల్లర్ ఆ ధన సహాయముతో తన విద్యను కొనసాగించెను.  George Muller biography in Telugu

ముల్లర్ ఒక రోమన్ కేథలిక్ కన్యకను వివాహమాడవలెనని అంతకు ముందు తలంచెను. కాని, ఆ విషయమై తాను ప్రార్థించినపుడు అది దైవ చిత్తము కాదని గ్రహించి, తన హృదయములో విగ్రహమువలె ఉన్న ఆమెను ప్రభువు పాదముల యొద్ద విడిచిపెట్టెను. త్వరగా ఏదో ఒక దేశమునకు మిషనెరీగా వెళ్ళవలెనని కంగారుపడినను విఫలుడవుచుండెను. అందువలన దేవుడు నన్ను ఇంకనూ కనిపెట్టమని, సిద్ధపడమని చెప్పుచున్నాడని గ్రహించి ఎక్కువగా ప్రార్థనయందును, బైబిలు పఠనమునందును సమయము గడుపుచు; విశ్వాసము నందు, దీనత్వము నందు ఎదుగుచు; “నేనే ఇంకనూ అనేక విషయములను నేర్చుకొనవలసి యుండగా, నేనెట్లు ఇతరులకు బోధించగలను?” అని వాపోయెను. 

ముల్లర్ కరపత్రములను, సువార్తపత్రికలను తీసుకొని, పది పదిహేను మైళ్ళు నడిచివెళ్ళి పంచిపెట్టుచుండెను. కొన్నిసార్లు తన సాక్ష్యమును చెప్పుచుండెను. ఒకసారి ఒక సంఘములో ప్రసంగించమని కోరగా, వ్రాసుకొనిన ప్రసంగమును అతికష్టముగా వల్లించెను. కాని, అతడు తృప్తి చెందలేదు. ఆ తర్వాత ప్రభువు పాదముల యొద్ద మోకరించి, వర్తమానములను పొందుట నేర్చుకొనెను. దేవుడు ఆయనను ఇంగ్లాండులో సేవకు ఏర్పరచుకొనెను. గనుక ఇతర దేశములకు మిషనెరీగా వెళ్ళుటకు ప్రయత్నములు చేసినను విఫలుడాయెను. 

ముల్లర్ 1829 లో తన 27వ ఏట ఇంగ్లాండుకు చేరెను. అక్కడ అతడు శరీరరీతిగా బలహీనుడైనను మరింత ఆధ్యాత్మిక బలమును పొందెను. అక్కడ వేదాంత కళాశాలలో ప్రవేశించి హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథమును దినమునకు 12 గంటలు చొప్పున పఠించుచుండెను. మోకాళ్ళపై దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు లోతైన మర్మములను ఆయనకు బయలుపరచుచుండెను. 1830 లో ముల్లర్ ‘టిన్మత్’ అను స్థలమునకు చేరెను. అక్కడ ఆయనను ఒక ఆలయమునకు సంఘకాపరిగా ఉండవలెనని కొందరు కోరిరి. కాని, ఒక్కచోట స్థిరముగా ఉండి సువార్తను ప్రకటించుట కాక, ఆయా స్థలములలో సంచారముచేసి వాక్యమును ప్రకటించుట తన యెడల దేవుని చిత్తమని తెలుసుకొని దేవుడు మరియొక చోటు చూపించువరకు ఇక్కడే ఉండెదననెను. George Muller biography in Telugu

టిమ్మత్ అను స్థలములో సంఘ కాపరిగా ఉండుటకు ఒప్పుకొనిన జార్జి ముల్లర్ జీతము తీసుకొనుటకు ఇష్టపడక ఆ ఆలయములో నున్న వెనుక గోడకు ఒక చిన్న పెట్టెను అమర్చి, మీ కానుకలను ఈ పెట్టెలో వేయుడని బోర్డు పెట్టెను. హెచ్చుగా ఇచ్చువారు అతిశయింపకుండునట్లును, స్వల్పముగా ఇచ్చువారు సిగ్గు పడక యుండునట్లును ప్రభువే ప్రతివారిని పరీక్షించి, వారు హృదయపూర్వకముగా ఇచ్చిన దానిని బట్టి ప్రతిఫలము ఇచ్చుటకును అనుకూలముగా యుండెను. ఆ సంఘస్థులు తన అక్కరను తీర్చినను, తీర్చకుండినను వారి మధ్య సేవచేయుదునని వారి ధనము కొరకు కాక, వారి ఆత్మల రక్షణాభివృద్ధి నిమిత్తమై అక్కడ సేవ చేయుదునని చెప్పెను.  George Muller biography in Telugu

ముల్లర్ 1830 అక్టోబర్ 7 వ తేదీన ప్రభువు చిత్తములో ‘మేరీగ్రోల్స్’ అనే కన్యకను వివాహమాడెను. ఆమె యోగ్యురాలై, ఆయనకు సరియైన సహకారిగా, దేవుని సేవలో ముందుకు సాగుటకు చేదోడు, వాదోడుగా నుండెను. 

ముల్లర్ ప్రార్ధనయందు, బైబిలు పఠనమునందు ఎక్కువ సమయమును గడుపుచు, ప్రతి విషయములో దేవుని చిత్తమును తెలుసుకొనుట నేర్చుకొను చుండెను. అట్లు ప్రార్థించుచుండగా దేవుడు తనను బ్రిస్టల్ నగరమునకు నడిపించు చుండెనని తెలుసుకొని 1832 మే 23 వ తేదీన అచ్చటకు వెళ్ళెను. 1832 సెప్టెంబరు 17 వ తేదీన ముల్లర్ దంపతులకు ఒక కుమార్తె జన్మించెను. ఆమెక లిడియా అను పేరు పెట్టిరి. 

ముల్లర్ దేవుని వాక్యమును ఎంతగానో ప్రేమించి 200 సార్లు బైబిలును చదివెను. ఒక దినము ఆయన అట్లు బైబిలు చదువుచుండగా కీర్తనలు 68:5లోని “తండ్రి లేనివారికి తండ్రి” అనుమాట ఆయన హృదయమును పట్టుకొనెను. దేవుడు తనను తండ్రి లేనివారికి తండ్రిగా ఉండాలని కోరుచున్నాడని గ్రహించి, ప్రార్ధించి ఒక అనాథ ఆశ్రమమును స్థాపించవలెనని ఆశించి, 150 మంది బిడ్డలతో ఒక అద్దె గృహములో ఆశ్రమమును ప్రారంభించెను. దేవుడు తన పరిచర్యను ఆశీర్వదిస్తుండగా ఆ ఆశ్రమము దినదినాభివృద్ధి పొందుచుండెను. 

ముల్లర్ తన 35వ సంవత్సరములో ప్రవేశించినప్పటికిని, చిన్నబిడ్డ మనస్తత్త్వమును కలిగి, తన పరమ తండ్రిపై విశ్వాసముంచుచు, బైబిలు పఠనము నందు ఆసక్తి, దేవుని పరిచర్యయందు చురుకుదనము కలిగి; దేవుని డబ్బు విషయములో నమ్మకత్వమును, క్రీస్తు కొరకు త్యాగము చేయుటయును, అనాథులపట్ల ప్రేమను కలిగి పరిచర్యలో ముందుకు సాగుచుండెను. 

మొదటి ఆశ్రమమును తెరచిన ఏడు నెలలకే రెండవ ఆశ్రమమును తెరచెను. మరొక సంవత్సరములో మూడవ ఆశ్రమమును మగపిల్లల కొరకు తెరచెను. త్వరలోనే మరొక రెండు ఆశ్రమములను తెరచెను. మొత్తం అయిదు ఆశ్రమములలో ఉండిన అనేకమంది పిల్లలను ముల్లర్, ఆయన సతీమణి తమ కన్నబిడ్డలవలె చూచుకొనుచుండిరి. శరణాలయ అవసరముల నిమిత్తము, పిల్లల ఆహారము నిమిత్తము ఎప్పుడును ముల్లర్ ఏ నరుని కోరలేదు, అప్పులు చేయలేదు. కాని, ప్రతి అవసరతను దేవుని ముందు పెట్టి, ఆశ్చర్యమైన దేవుని సహాయమును పొందెను. అట్లు ఆయన పొందిన ప్రార్ధనా జవాబులు ఎన్నెన్నో! ప్రభువు కొద్దికాలములోనే అనాథ ఆశ్రమములకు సొంత గృహముల నిచ్చెను. 150 మంది అనాథ పిల్లలతో ప్రారంభించి, ఆ అనాథ ఆశ్రమములో పెరిగిన 10,000 మంది పిల్లలకు జార్జి ముల్లర్ తండ్రిగా నుండెను.  George Muller biography in Telugu

40 సంవత్సరములు ముల్లర్కు ఎంతో చేదోడు వాదోడుగా ఉండిన అతని భార్య 1870 ఫిబ్రవరి 6 వ తేదీన ప్రభువు సన్నిధికి వెడలిపోయెను. ఆమె అంత్య క్రియల సందర్భముగా ముల్లర్ కీర్తనలు 119:68 పై ప్రసంగించెను. 

ముల్లర్ తన వృద్ధాప్యములో ఇట్లనెడి వాడు “నేను 20 సంవత్సరముల 5 నెలలు పాపములో జీవించిన తరువాత క్రీస్తును తెలుసుకొని మారుమనస్సు పొందితిని. తరువాత ఇప్పటికి 69 సంవత్సరముల 4 నెలలు దేవునితో నడచుచు మరల ఎప్పుడూ పాత పాపములవైపు తిరుగలేదు.” “మీరు వృద్ధాప్యములో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుటకు కారణమే” మని ఆయనను అడిగినపుడు ఆయన ఇట్లు సమాధానమిచ్చెను- “1. నా మనస్సాక్షిని దేవుని యెదుట, మనుష్యుల యెదుట నిర్మలముగా కాపాడుకొనుచుంటిని. 2. దేవుని వాక్యమును ఎంతో ప్రేమించి రాత్రింబగళ్ళు ధ్యానించుచుంటిని. అది బలమైనదిగా నన్ను నూతన పరచుచున్నది. 3. దేవునియందును, ఆయన సేవయందును ఎల్లప్పుడు ఆనందించు చుంటిని.” 

ముల్లర్ తన కుమార్తె లిడియాను ‘జిమ్రిట్’ అను విశ్వాసికిచ్చి వివాహము చేసెను. తదుపరి ముల్లర్ కూడా దేవుని సేవలో సహాయకారిగా ఉండుటకు ‘సూసన్నాగ్రేస్’ అను విశ్వాసిని వివాహము చేసుకొనెను. 70 ఏండ్ల వయస్సులో ముల్లర్ తన భార్యయైన సూసన్నా గ్రేస్తో కలిసి యూరప్, అమెరికా, ఆసియా ఖండాలలో అనేక మిషనెరీ యాత్రలు చేసెను. 2,00,000 మైళ్ళు ప్రయాణించి 42 దేశములలో, అనేక భాషలలో ప్రసంగించెను. ఆలాగు తనకు 90 సంవత్సరముల వయస్సు వచ్చువరకు సువార్త సేవ చేయుచు వచ్చుచుండెను. ఆలాగు సువార్త చెప్పుచు ముల్లర్ ఏడుసార్లు లోకమంతటిని తిరిగి వచ్చెను. తన జీవితములో మూడు మిలియన్ల ప్రజలకు సువార్తను అందించెను.  George Muller biography in Telugu

ముల్లర్ ప్రార్థనా భారములన్నియు వ్రాసియుంచుకొనెడివాడు. ఆయన జీవిత చివరి దినములలో ఇట్లు చెప్పెను – “25 వేల ప్రార్థనలకు ప్రభువు జవాబిచ్చెను. ఇద్దరి మారుమనస్సు కొరకు దగ్గరదగ్గర 60 సంవత్సరములు ప్రార్థన చేసాను.” ముల్లర్ తన జీవిత దినములలో ఇంచుమించు లక్షమంది పిల్లలను తన స్కూలులో చదివించెను. పదివేలమంది అనాథులను పోషించెను. అనేక వేల బైబిళ్ళను, క్రొత్త నిబంధనలను పంచిపెట్టెను. 1895 జనవరి 13 వ తారీఖున ఆయన సతీమణియైన సూసన్నాగ్రేస్ ప్రభువు సన్నిధి కేగెను. అప్పుడు ముల్లర్కు 90 సంవత్సరముల వయస్సు. శారీరకంగా బలహీనుడైనను ఇంకనూ దేవుని వాక్యము నందించుచు, అనాథాశ్రమ పనులను చూసుకొనుచు ప్రభువు సన్నిధిలో ప్రార్థించి, ఆదరణ పొందుచుండెను. 

ముల్లర్ మరణ దినమునకు ముందు దినము వరకు శరణాలయమునకు సంబంధించిన అనేక ఉత్తరములను వ్రాసెను. తన 93 వ ఏట, ఆయన చనిపోవు దినము రాత్రి కూడా II కొరింథి 5:1 వాక్యముపై ప్రసంగించి, పడకకు చేరి, ఆ రాత్రే ప్రభువు సన్నిధికేగెను. 1898 మార్చి 10 వ తేదీ ఉదయం నిశ్చలంగా పడకపైయున్న ఆయన శరీరమును కనుగొనిరి. George Muller biography in Telugu


All Pdf Files Download….Click Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: dont try to copy others subjcet.