నిజంగా యేసుక్రీస్తు సిలువలో మరణించాడా?
Did Jesus Actually Die on the Cross
విమర్శ: యేసుక్రీస్తు సిలువలో మరణించెనని క్రైస్తవులు చెప్పుచుండగా కొందరు ఆయన సిలువలో మరణించలేదనియు, ఆయన మూర్చిల్లి యుండగా ఆయన శిష్యులు ఆయనను సమాధిలో నుండి దొంగిలి యేసు గాయాలను కట్టి ఇండియాకు పంపినట్లు చెప్పుచు, యేసుక్రీస్తు యొక్క సిలువ మరణ పునరుత్థానములు వట్టిదని చెప్పుచున్నారు. గనుక యేసుక్రీస్తు సిలువలో మరణించెనా? లేదా వివరింప మనవి.
జవాబు :ఈనాడు క్రైస్తవ్యమునకు వ్యతిరేకముగా అడుగబడుచున్న ప్రశ్నలలో యొకటి. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము ఆయన మరణము పునరుత్థానము వట్టివని నిరూపించుటకు కంకణము కట్టుకొనిన మహానుభావులు సయితము వారి పరిశోధనల తరువాత సత్యాన్వేషకులుగా సత్యమును గుర్తించి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి యున్నారు. యీ వింత వితండవాదము ఈ రోజు పుట్టింది కాదు. ఆయన మృత్యుంజేయుడైనప్పుడే ప్రారంభించడమైంది.
“వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్ర పోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరి అని చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందర కలుగకుండ చేతుమని చెప్పిరి” (మత్తయి 28:11 – 14). రోమా సైనిక ధళము ఎటువంటిదో, ఎటువంటి వారిని సైనికులనుగా రోమా అంగీకరిస్తోంది? సైన్యక చట్టమేమిటి? చట్టాన్ని ఉల్లంగిస్తే సైనికులకి శిక్ష ఏమిటి? డ్యూటిలో ఉన్న సైనికుడు నిద్రపోవచ్చునా? అట్టి వారికి విధింపబడు శిక్ష యేది? యని వాటిని గూర్చి అందరికీ విధితమే. అయితే ఒకటి మాత్రము అర్ధమైంది. అదేదనగా ఆయన మరణ పునరుత్థానములకు జడిసిన జనం జరిగిన దానిని దాచి పెట్టి శిష్యులు అతనిని ఎత్తికొని పోయిరని చెప్పుటకు సైన్యములకు చాలా (లంచము) ద్రవ్యమునిచ్చి సత్యాన్నికి సమాధి కట్టాలని చూచిన వారికి సమాధి కట్టడమైనది గాని సత్యము సత్యమే గనుక నేటికి సవాలు విసురుతున్నది. యేసుక్రీస్తు యొక్క కుడి ఎడమల వైపు ఇద్దరు బందిపోటు దొంగలున్నారు. వారిద్దరి కాళ్ళను విరగగొట్టారు సైనికులు. కానీ, యేసుక్రీస్తు కాళ్ళనెందుకు విరుగగొట్టలేదు? ఆయన సైనికులకు చుట్టమని కాదు, ఆయన కాళ్ళను కూడ విరుగగొట్ట చూచినపుడు ఆయన మరణించియుండెను.
“కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరుగగొట్టిరి. వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది యుండుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్ళును కారెను”
(యోహాను19:32-34). ఆయనతో కూడ సిలువ వేయబడిన యిద్దరి కాళ్ళను విరుగగొట్టిన రీతిగా ఆయన (యేసు) కాళ్ళను విరుగగొట్టనుద్దేశించి వారు (సైనికులు) వచ్చి చూడగా అప్పటికే ఆయన మృతి పొందియుండెనని సైనికులు చెప్పినను కొందరు నేను పట్టిన కుందేళ్ళకు మూడే కాళ్ళంటే మీరేమి చేయగలరు? సత్యమును సత్యముగా సాటి చెప్పుటలో శక్తి కొలది కృషి చేయుట మన వంతు. అట్టివారికి లేఖనాల ఆధారములు కాక శాస్త్రీయ ఆధారములతో నైన దైవ సమాధానము చెప్పుకొన బద్ధుడనైయున్నాను. ఎందుకనగా ఒక్కరు కూడ అవిశ్వాసిగా మరణించుట ఆ దేవునికైనను నాకైనను యిష్టము లేదు. ఒక సైనికుడు బల్లెము (ఈటె)తో ఆయన ప్రక్కలో పొడిచిన వెంటనే రక్తమును నీళ్ళును కారెను అని వ్రాయబడియున్నది. వైద్య శాస్త్రమును బట్టి చూచినట్లయితే మూడు విధములుగా మరణించిన వారికి రక్తము, జలము కారునని డా॥ జస్టిస్ ప్రభాకర్ MBBS తెలియజేసియున్నారు.
1)సైనాడ్ తినువారికి 2) జల ప్రమాదములో మరణించిన వారికి3) హృదయాందోళన కలిగి బహు దుఃఖముతో గుండె పగులునంతగా కృంగిన వారికి మాత్రమే, రక్తము జలము కారునని ఆయన వ్యక్తము చేసియున్నారు. యేసుక్రీస్తు దినములలో సైనాడ్ కనిపెట్టబడలేదని అందరికి విధితమే. ఆయన సిలువలో ఉండగా సునామి రాలేదన్నది కూడ విదితమే. మూడవ కారణమైన హృదయాందోళన గుండె పగులనంతగా ఆయన క్రుంగి పోయాడు.
“అప్పుడు యేసు-మరణమగునంతగా నా ప్రాణము బహు దుః ఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతో కూడ మెలకువగా నుండుడని వారితో చెప్పి” (మత్తయి 26:38) యేసు అప్పగింపబడు రాత్రి గెత్సేమనే తోటలోని యొక సందర్భమిది. అప్పటికే ఆయన మరణమగునంతగా తన ప్రాణము దుఃఖములో మునిగియున్నదని క్రీస్తు చెప్పిన మాటలను మత్తయి వ్రాసాడు. వైద్యశాస్త్ర ప్రకారముగా గమనించినపుడు గుండె చుట్టు ఉన్న PERICARDIUM పొరకు మరియు గుండెకు మధ్యలో ఓ ద్రవ పదార్దముంటుంది. దీనిని PERICARDIAL – FLUID అందురు. హృదయ భారం, దుఃఖము అధికమైనపుడు గుండె కవాటములు పగిలి రక్తములో కలియును. కావున ప్రభువైన యేసుక్రీస్తు నరజాతి రక్షణార్థమై ఈ లోకానికొచ్చి బలి పశువుగా మారి సిలువకు కొట్టబడి అవివేకముగా యిట్టి చర్యలు చేయుచున్న వీరిని క్షమించమని బిగ్గరగా గుండె కవాటములు పగులునంతగా దుఃఖముతో కేకలు వేసాడు. సైనికుడు ఈటెతో పొడవగానే రక్తము నీళ్ళును కారెను. అనగా ఆయన చనిపోయెను. పగిలిన హృదయంతో మరణించి నందున ఆయన ప్రక్కలో నుండి PERICARDIAL – FLUID కారెను. కావున సిలువలోనే మరణించెనని యిందు మూలముగా మీరు గ్రహించగలరు. క్రీస్తు నందు ప్రియ పాఠకులారా, యేసుక్రీస్తు పునరుత్థానములను గూర్చి వేలాది ఆధారములు కలిగియున్నాను. పరపక్షమందున్న వారు ప్రశ్నించినందున పారి పోవద్దు. పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తున్న మీ కంటే ధన్యుడెవడును వుండడు. యేసు సిలువ వేయబడినది నిజం, సిలువలో చనిపోయినది నిజం. ఆయన మృత్యుంజేయుడై లేచినది నిజం. ఆయన త్వరలో రానున్నది నిజం గనుక సందేహానికి తావీక నేనే మార్గము, సత్యము, జీవము అని సెలవిచ్చిన యేసుని వెంబడించుము. ప్రభువు మిమ్మును దీవించును గాక !
రచయిత : జడ వసంత బాబు గారు,చెన్నై.
ప్రత్యక్ష గుడారం subject నేర్చుకోవడానికి క్లిక్ చేయండి. click here
Praise the lord, good message