నీవు అంజూరపు చెట్టువా? ముండ్లపొదవా?
Christian Message Telugu
“ఒక మనుష్యుని ద్రాక్షా తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు. గనుక అతడు – ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, గాని యేమియు దొరకలేదు. దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షాతోటమాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి, యెరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేనియెడల నరికించి వేయుమని అతనితో చెప్పెను” (లూకా 13:6-9).
తోట యజమాని దేవాది దేవుడైన తండ్రి. ఆయన తోటలో మనల్ని నాటాడు. మనలో ఫలాలు చూడాలని, మనం ఫలించాలని. మన ప్రభువైన యేసుక్రీస్తును తోటమాలిగా వుంచాడు. ఈ తోటమాలియైన యేసయ్య తండ్రికి మన బలహీనతల నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. పై వాక్యాలలో ఫలించని చెట్టు “అంజూరపు చెట్టు”. ఈ చెట్టును గురించి ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాడు మన యేసయ్య ఎందుకని? రకరకాల గుణాలు గల చెట్లు వున్నాయి. 3 కాని అంజూరపు చెట్టులో వున్న ప్రత్యేకత ఏమిటి?
యేసుప్రభువు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రుడ్డివానిని చూచాడు. అక్కడున్న వారు వానిని ముట్టి బాగుచేయాలని ఆయనను కోరారు. కాని యేసుప్రభువు వారి ముందు అతనిని బాగు చేయలేదు. ఊరి బయటికి తీసుకొని వెళ్ళి అతనిని ముట్టి బాగుచేసి, నీకు ఏమి కనిపించుచున్నది? అని అడిగాడు. అయ్యా చెట్లు నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి, అని అన్నాడు. యేసుప్రభువు మరలా ముట్టినప్పుడు చెట్లు చెట్లుగానే కనబడ్డాయి. మనుష్యులు మనుష్యుల్లాగానే కనబడ్డారు. యేసయ్య మనలను చూసే అదే చూపు కొన్ని క్షణాలు అతనికి వచ్చినట్లు మనము చదువుచున్నాము.
బాప్తీన్మమిచ్చు యోహాను అనేకులు బాప్తీస్మము పొందవచ్చుట చూచి “సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది. గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును” అని అన్నాడు (మత్తయి 3:7-10).
మరొకరి బలహీనతలను ప్రచారము చేయదు
దేవుడు తోటను వేశాడు. ఆ తోటలో ఆదాము, హవ్వలు దేవుని మహిమను కోల్పోయి దిగంబరులయ్యారు. వారి దిగంబరత్వమును కప్పుకోవడానికి అంజూరపు చెట్ల ఆకులు వాడారు. మనం కూడా ఈ అంజూరపు చెట్టు స్వభావం గలవారమైతే మన గురించి యేసయ్య విజ్ఞాపన చేస్తారు. ఇతరుల బలహీనతలను చూచి నలుగురితో చెప్పి వారిని నవ్వుల పాలు చేయకుండా వాళ్ళ బలహీనతలను గూర్చి ప్రార్థించి వారికి సహకరించగలిగితే ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు.
“తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును, యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజముల మీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి. వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దిసమొలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలిసికొని – కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును” అని అన్నాడు (ఆది. 9:20-25). తండ్రిని అవమాన పరచిన వాని సంతతి తరతరాలు శాపానికి గురైపోయినట్లు వ్రాయబడి వుంది. అంటే ఇతరుల పాపములను కప్పమని అర్థం కాదు. పాపాలు ఒప్పుకొని విడిచి పెట్టాలి. ఇతరుల పాపాల్ని గుర్తించినప్పుడు అందరికి తెలియజేస్తే నీవు చింత చెట్టులాగా, లేక రేగు చెట్టులాగా మారిపోతావు. కొందరి జీవితాలు చింత, వేప చెట్టులాగా వుంటాయి. వాళ్ళలో పులుపు చావదు, చేదు చావదు. మనము బ్రతికి వున్నామంటే మనకొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నారు, గనుక కాపాడబడుచున్నాము. నీవు అంజూరపు చెట్టువై వున్నంతకాలము యేసయ్య నీ కొరకు విజ్ఞాపన చేయకుండా వుండలేడని ఇందును బట్టి తెలుస్తుంది.
ఆదరణ కలిగించేది
“సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షబా వరకును తమ తమ ద్రాక్షచెట్లక్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి” (I రాజులు 4:25).
ఆ రోజుల్లో అంజూరపు చెట్ల క్రింద ప్రజలు నెమ్మదిగా జీవించుచున్నారని బైబిల్ చెప్తున్నది. అంజూరపు చెట్టు నీడలో ఆదరణ కలిగి ప్రజలు క్షేమముగా వున్నారు. నీవు మారుమనస్సు పొంది, బాప్తీస్మము తీసికొని, పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన తరువాత నీ వ్యక్తిగత జీవితం ద్వారా ఇతరులకు ఆదరణ కలుగుతుందా? హిజ్కియా రాజుకు మరణకరమైన రోగము కలుగగా… అతడు తన ముఖమును గోడతట్టుకు త్రిప్పుకొని కన్నీళ్ళు విడుచుచూ యెహోవాను ప్రార్థించెను.
“పిమ్మట యెషయా – అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను” (II రాజులు 20:7).
హిజ్కియాకు పదిహేనేండ్ల ఆయుష్షు పొడిగింపబడెను. పుండ్లను మాన్పు రోగ నిరోధక శక్తి ఆ పండులో ఉంది. ప్రజలు నెమ్మదిగా వుండునట్లు అనారోగ్యంతో వున్న వారికి ఆరోగ్యం కలుగునట్లు అంజూరపు చెట్ల నీడకు వస్తారు. హోసన్నా మందిరము మీకు అంజూరపు చెట్టులాంటిది. ఆ నీడకు వచ్చిన వారికి ఆదరణ, స్వస్థత కలుగుతుంది. గాయపరచబడిన వారి గాయాన్ని రేపుతూ వుంటారు కొందరు. అలాంటి వారి కొరకు యేసయ్య విజ్ఞాపన చేయరు. నీ దగ్గరకు వచ్చిన వారికి నీవు నెమ్మదిని కలుగజేసి ఆదరణ నిచ్చే చెట్టువైతే, నీవు స్వస్థత పొంది ఆ స్వస్థత గురించి ఇతరులకు చెప్పగలిగినట్లయితే అంజూరపు యెడ కట్టినట్లవుతుంది, ఆయుష్షు పెరుగుతుంది. ఆదరణ కలిగించు స్వభావం నీకున్నట్లయితే నీ కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తూ వుంటాడు.
నాకు తెలిసిన ఒకామెకు ఒక ఊపిరితిత్తి కుళ్ళిపోయి, రెండవది కూడా కుళ్ళిపోతున్న సమయంలో ఆసుపత్రికి వెళ్తూ ప్రార్థన చేయించుకున్నది. అక్కడ ఆసుపత్రికి వెళ్ళి పాత ఎక్సరే ఇస్తే, ఆ డాక్టర్లు మేము మరలా ఎక్సరే తీస్తాము అని ఎక్సరే తీసి, నీ ఊపిరితిత్తులు కుళ్ళి పోలేదు బాగున్నాయి అని చెప్పారు. ఆమె ఆసుపత్రికి వెళ్లేటప్పుడు బ్రతుకుతానని నమ్మకంలేక అన్ని అప్పగింతలు అప్పగించి వెళ్లింది. కాని ఆసుపత్రికి వచ్చాక ఏమి లేదని తేలింది. ఆమె అంటుంది, యేసుప్రభువు నన్ను బాగుచేశాడని. దైవసేవకులు దేవుని వాక్యం చెప్పారు. వాక్యం వినిన తరువాత విశ్వాసం కలిగింది. ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నన్ను బాగుచేశాడు. నా ఆయుష్షు పెరిగింది. తరువాత ఆమె నా దగ్గరకు వచ్చి అయ్యా! ఆ రోజు మీరు నా గాయాన్ని రేపే మాటలు మాట్లాడలేదు. ఆదరణ కలిగించే వాక్యం చెప్పారు ఆ వాక్యాలే నన్ను స్వస్థపరచాయి అని చెప్పింది.
“మధ్య రాత్రివేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచు నుండిరి. ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు| పారిపోయిరనుకొని, కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పాలు – నీవు ఏ హానియు చేసికొనవద్దు. మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను” (అపొ.కా. 16:25-28).
వారు ప్రార్థిస్తే జైలు పునాదులు కదిలాయి. కాని జైలు పడిపోలేదు. మనం కూడా అలా ప్రార్థన చేయాలి. తలుపులు తెరుచుకున్నాయి కాని ఒక్క ఖైదీ కూడా బయటికి పోలేదు. వారు ప్రభువును స్తుతిస్తూ వుంటే ఖయిదీలంతా ఆలకిస్తూ వున్నారు. వారి హృదయాలకు ఆదరణ కలిగింది. రోగాలతో ఆత్మహత్యకు తెగించిన వాళ్ళకు నీ మాటలు, నీ పాటలు, నీ సాక్ష్యం అంజూరపు యెడలవలె ఆదరణ కలిగించాలి. ఆ మధ్యరాత్రి వేళ జైలు అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములు కడిగి అతడును, అతని యింటివారందరు బాప్తీస్మము పొందిరి. నీ కళ్ళముందు నశించిపోయే ప్రజలు కనబడుచున్నారు. వారి కొరకు నీవేమి చేస్తున్నావు? వారికి ఆదరణ ఇచ్చేవాడిగా వున్నావా? లేక వారి గాయాలు రేపుచున్నావా? నీవు ఇతరుల గాయాలు కట్టినట్లయితే నీ కొరకే కాదు, నీ కుటుంబస్థుల కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తాడు. నీ కుటుంబమంతా రక్షణ పొంది, ఆనందంగా మందిరానికి వస్తారు. నీ మాటలు ఇతరులకు ఆదరణగా వుంటాయి.
మాధుర్యాన్ని పంచుతుంది
“అప్పుడు చెట్లు – నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టునడుగగా అంజూరపు చెట్టు – చెట్ల మీద రాజునై యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను” (న్యాయాధి. 9:10,11).
అంజూరపు చెట్టు తనలో వున్న మాధుర్యాన్ని పంచుతాను గాని మిమ్మును ఏలుటకు రానని వాటికి చెప్పుచున్నది. లోక సంబంధులను, ఆత్మ సంబంధులను తేలికగా గుర్తించవచ్చు. దేవుని ప్రజలు యేసుక్రీస్తులో వున్న మాధుర్యాన్ని ఇతరులకు పంచిపెడతారు.
“అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్లపొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన యెడల రండి నా నీడను ఆశ్రయించుడి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను, దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను” ……. (న్యాయాధి. 9:14-15).
ముండ్ల చెట్లక్రింద ముండ్లుంటాయి. దాని దగ్గరకు ఎవరు వెళ్తారు? ఆ పొద అంటుంది, నాలో నుండి ఆదరణ కాదు అగ్ని బయలుదేరుతుంది అని. మన మనస్సులో ఏదైతే ఉంటుందో అదే బయట పడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయములో మాధుర్యముండాలి. ఆ మాధుర్యం మన ప్రభువైన యేసుక్రీస్తు. దానిని ఇతరులకు పంచే అనుభవం కలిగి వుండాలి. నీవు ముళ్లపొద లాగా వుంటే ఇంకొక సంవత్సరము దానిని వుంచు అని యేసయ్య అనడు, గొడ్డలి తీసుకొని నరికి తగులబెట్టమంటాడు. నీవు ఇంకా ఫలించని చెట్లవలె అగ్నికి సిద్ధముగా, న్యాయతీరుకు సిద్ధముగా వున్నావా? నీ జీవితంలో ఆత్మఫలాలు ఫలించకపోతే భూమి వ్యర్థమవుతుంది, కనుక నరికి వేయండి అని అనకముందే నీ జీవితాన్ని సరిచేసుకోవడం ఎంతైనా మంచిది.
నీవు అంజూరపు చెట్టువై ఫలించి, అభివృద్ధి చెందాలని, నీ కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తూ, నీ పాదులు బాగుగా త్రవ్వి దేవుని వాక్యమనే ఎరువు చేత నీ జీవితాన్ని బలపరచి బాగా ఫలింపజేయాలని కోరుకుంటున్నాడు.
Christian Message Telugu Christian Message Telugu Christian Message Telugu Christian Message Telugu Christian Message Telugu Christian Message Telugu Christian Message Telugu Christian Message Telugu
బైబిల్ ప్రశ్నలు – జవాబులు .. click here