చనిపోయిన వారు దయ్యాలుగా మారతారా|CHANIPOYINA VAARU DAYYALUGAA MAARATHAARA|1

చనిపోయిన వారు దయ్యాలుగా మారతారా?

CHANIPOYINA VAARU DAYYALUGAA MAARATHAARA

       ప్రశ్న : ఈ మధ్య మా మందిరానికి ఒక దైవజనుడు వచ్చాడు. అతను వాక్యం చెబుతూ – చనిపోయిన వారు దయ్యాలు అవుతారు అని చెప్పాడు. అప్పట్నించీ నాకు అది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి తోడు మా యింటిదగ్గర్లో ఒక సోదరికి దయ్యం పట్టింది. మా పాస్టర్ గార్ని దయ్యం వెళ్లగొట్టుటకు పిల్చారు. ఆయన ప్రార్థించాడు. ఆ దయ్యం ఆ కేకలు వేస్తూ – “నేను వెళ్లను, ఈమె నాకు నచ్చింది” అంటూ ఏడుస్తూ వుంది. “నువ్వు ఎవరివీ? ఎక్కన్నుంచి వచ్చావు?” అని అడిగారు పాస్టర్ గారు. “నేను పాపమ్మని. నాకు ఇద్దరు పిల్లలు. మాది ఈ ఊరే. నాకు ఈమె కావాలి. మేమిద్దరం స్నేహితులం” అంటూ మాట్లాడసాగింది. దీనితో నాకు అనుమానం బలపడింది. ఎందుకంటే, కొన్ని రోజుల క్రితం పాపమ్మ అనే స్త్రీ కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని చనిపోయింది. అసలు చనిపోయిన మనుషులు దయ్యాలుగా మారతారా? దయచేసి జవాబివ్వండి. 

జవాబు : పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు – లాజరు గాధ మనకు తెలిసిందే. ప్రభువు అది ఒక ఉపమానముగా చెప్పలేదు. అది లోగడ జరిగిన సంగతి. ప్రభువు అది చెప్పుచున్నప్పుడు కూడా (పాతాళంలో) జరుగుతూ ఉన్న విషయముగా ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం చదువుచున్నప్పుడును ధనవంతుడు మరియు లాజరూ వారివారి స్థితిగతులను అనుభవిస్తూ ఉన్నారు. ఇది మీరు చూడకపోయినను పాతాళంలో “ఇప్పుడు” జరుగుతుంది. 

       లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వ వచనం వరకు గల ఈ స్టోరీలో – ధనవంతుని పాపాల జాబితా ఏమీ రాసిలేదు. వ్యభిచారి అనీ, దొంగ అనీ, నరహంతకుడు అని, త్రాగుబోతు అనీ, తిట్టుబోతు అనీ… ఏదీ రాయబడిలేదు. అతడు పాతాళానికి వెళ్లిపోయాడు. అగ్ని జ్వాలలో యాతనపడుతూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఉన్నాడు. గుక్కెడు మంచి నీళ్ల కోసం మొర్రపెట్టుకుంటున్నాడు. అతడు ఏ తప్పు చేస్తే, అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు? తండ్రివైన అబ్రాహామా, నా యందు కనికరపడుము అంటూ వేసిన కేకలకు అబ్రాహాము బదులిస్తూ – “కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి” అంటూ నేరస్థాపన చేస్తున్నాడు. 

        ధనవంతుడు చేసిన పాపమల్లా ఏమిటంటే “ఇష్టమైనట్టు సుఖము అనుభవించుటయే” అదీ, అతడు చేసిన పాపము! ఆ ఒక్కమాటలో సకల వ్యసనాలూ… సమస్త పాపములూ… దోషము… దుష్టత్వము.. దుర్మార్గమూ అన్నీ మేళవింపబడి ఉన్నాయి. తనకిష్టమైనట్టు నడిచేవాడు ఇక దేవుని మాటేమి వింటాడు? దేవుని ఆజ్ఞలు ఎలా పాటిస్తాడు? గేటు ముందు పడిపోయి, కురుపులతో అవస్థపడుతూ, పురుగులు గల దేహాన్ని నాకుతూ ఉన్న కుక్కలను గద్దించి, గుక్కెడు మంచినీళ్లు లాజరుకు ఇయ్యలేదు ఈ ధనవంతుడు… నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్న దైవ ఆజ్ఞను మర్చిపోయాడు. తన శరీర కోరికలను తృప్తిపరచుకోవడం కోసం సుఖ భోగాలను స్వర్గ సీమగా భావించాడు. సుఖమనునది శరీరానికేగా? శరీరము ఎప్పుడు సుఖపడుతుంది? దాని కోరిక తీరినప్పుడు మాత్రమే శరీరం సుఖపడుతోంది. అంటే ఈ ధనికుడు – ఒక వ్యభిచారి అన్నమాట! 

     ఒక్కమాటలో తేలింది ఏమిటంటే – ఈ ధనవంతుడు మహాత్ముడుకాడు – మహా పాపాత్ముడు. మరి ఇంత ఘోరపాపాత్ముడైన ఈ ధనవంతుడు దయ్యముగా మారలేదేం? 

         అతడు తాను జరిగించిన క్రియల ఫలమును అనుభవించుటకై పాతాళానికి వెళ్లిపోయాడు. అతడు భూమ్మీద మనుషులను బాధపెట్టుటకు దయ్యముగా మారలేదు. పాపియైన ప్రతీ మనుష్యుని విషయంలో ఇదే న్యాయము, ఇదే సూత్రము వర్తిస్తుంది! 

వారు దయ్యాలుగా మారిపోరు, అలా జరిగేందుకు అవకాశం కూడా లేదు. 

       దయ్యాలు అనేవి ప్రత్యేక విభాగానికి చెందినవి. గడిచిపోయిన యుగంలో, అంటే మానవయుగానికి ముందున్న యుగములో ఎంతో బాగా ఆధిక్యతలో ఉన్న లూసీఫర్ అనే ప్రధాన దూతకు హఠాత్తుగా దుర్భుద్ధి పుట్టింది. దేవునికన్నా అత్యధికంగా పై స్థానంలో ఉండిపోవాలనుకున్నాడు. తన హృదయంలో ఆ ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు ఆలోచన గ్రహించి వాని యొక్క స్థానము నుండి వానిని త్రోసివేసాడు. లూసీఫర్ పరలోకం నుంచి త్రోయబడ్డాడు. వానితో పాటు వానిని బలపరచిన కొందరు దూతలు కూడా త్రోయబడ్డారు. (చూడండి – యెషయా 14:12-15) 

        అలా త్రోయబడిన ఆ గుంపే దేవునికి వ్యతిరేకముగా పనిచేయడం ప్రారంభించారు. దేవుని పని పాడుచేయడానికి ఆకాశమండలములో తిరుగుతున్నారు (ఎఫెసీ 6:12). ఆ విధంగా పడిపోయిన దూతలు – దురాత్మలుగాను, దయ్యాలుగాను, అపవిత్రాత్మలుగాను మారిపోయి పిలువబడుతూ ఉన్నారు. ఈ దురాత్మలకు, దురాత్మల సైన్యానికీ రాజు లూసీఫర్, అంటే సాతాను అన్నమాట. 

        సాతానుకి నాయకుడిగా, రాజుగా ఉండాలనే వాని ఆలోచన. పరలోకంలో దేవుని కన్నా పైగా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు చీకటి సైన్యాలను సాతాను పరిపాలిస్తున్నాడు. వాని యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే – పరలోకపు తండ్రిని బాధపెట్టడం, ఆయన హృదయానికి బాధ కల్గించడం, ఆయన పని పాడు చేయడం. 

       అయితే పరలోకపు తండ్రి హృదయాన్ని బాధపెట్టాలంటే, ఆయన అధికముగా ప్రేమించుచున్న మానవులను నాశనం చేయగలిగితే, దేవుణ్ణి బాధపెట్టడం తేలిక అవుతోంది. మన బిడ్డలకు జబ్బు చేస్తే, ఏ తండ్రైనా సంతోషించగలడా? ఆ విధంగా అన్నమాట.! 

     వాడు (సాతాను) డైరెక్టుగా దేవుణ్ణి ఢీకొనలేక, మన ద్వారా దేవుణ్ణి ఢీకొనాలని అనుకుంటున్నాడు. మనం బాధపడితే దేవుడు బాధపడతాడు. మనం ఏడిస్తే దేవుడు దు:ఖపడతాడు – కాబట్టి వాని గురి అంతా మనపైనే ఉంచడం జరిగింది. 

       అయితే విషయానికి వద్దాం. చనిపోయిన వారి కొందరి పేరిట దయ్యాలు మనుష్యులను ఆవరిస్తాయి. దయ్యము దయ్యమే. అయితే అది – కొన్నిరోజుల క్రితం చనిపోయిన ఒక వ్యక్తి పేరుతో మరొక వ్యక్తిని ఆవరిస్తుంది. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మనం ప్రభువైన యేసు నామమున ప్రార్థించగానే మనం ఎరిగిన, మనకు తెలిసిన పేరును ఏదో ఒకటి చెబుతోంది. ఆమె ఎవరోకాదు నేనే అంటోంది. మేమిద్దరం ఒకప్పుడు బాగా కలిసి ఉన్నాం అని చెబుతోంది. మనం ఆ మాట విని నిజంగానే కిరోసిన్ పోసుకొని చనిపోయిన పాపమ్మ దయ్యం అయిపోయిందేమో అని నమ్మేస్తాం. గడచిన యుగంలో దేవునిపై తిరుగుబాటు చేసిన దూతలు గదా ఈనాటి దయ్యాలు! దేవుడు వాటిని త్రోసేసినప్పుడు తన మహిమను వాటిలో నుంచి తీసివేయలేదు. ఆ దేవుని మహిమతోనే అవి త్రోసివేయబడి దయ్యాలుగా మారిపోయాయి. కాబట్టి మనుషులను గురించి కాస్తో కూస్తో కొన్ని సంగతులు ఎరిగి ఉంటాయి. దాని ఆధారంగా చనిపోయిన కొందరి మనుషుల పేరుతో వచ్చి… మరో మనిషిని ఆవరించి… ఏ పేరుతో వచ్చిందో ఏ ఆ వ్యక్తి యొక్క చరిత్ర నాలుగు ముక్కలు చెబుతుంది. 

అంతటితో మనం – అదుగో, పలాని ఆమె దయ్యమైపోయింది అని చెప్పుకుంటాం. 

మీరు చెప్పిన పాపమ్మ దయ్యముగా మారలేదు. మరెవరినో ఆవరించనూ లేదు. పాపమ్మ అనే పేరుతో పడిపోయిన దూత (దయ్యం) వచ్చింది! అంతే!! 


బైబిల్లో అనేక ప్రశ్నల కోసం క్లిక్ చేయండి .

visit our chanel click here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

2 thoughts on “చనిపోయిన వారు దయ్యాలుగా మారతారా|CHANIPOYINA VAARU DAYYALUGAA MAARATHAARA|1”

Leave a comment

error: dont try to copy others subjcet.