రాజు విందు – వధువు పొంధు
Song Of Solomon Telugu
“రాజు విందుకు కూర్చుండియుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు” (పరమగీతము 1:12- 13).
పై వాక్యమునందు రాజు అని చెప్పబడినది ఇంకెవరోకాదు పరమ కుమారుడైన క్రీస్తే, ఆ రాజు విందు క్రీస్తు విందును గూర్చియేనని తెలియును గదా!
రాజు అను బిరుదును యేసుక్రీస్తునకు కలదు. అది ఆయనకు చెందినదే. యోహాను 18:36లో నా రాజ్యము ఈలోక సంబంధ మైనది కాదని చెప్పుచున్నాడు అనగా “నా రాజ్యము” అని ప్రభువు చెప్పుచు న్నాడంటే ఆయనకు రాజ్యమున్నదని అర్ధమగుచున్నది. రాజ్యమున్నది గనుక ఆయన మనరాజై యున్నాడు. అంతమాత్రమేగాక 1తిమోతి 6:15లో యేసుక్రీస్తు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువని పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు గనుక భూపతులకు అధిపతియైన క్రీస్తే ఆ రాజు.
ఈయన సామాన్యమైన రాజుకాదు ఆయన నమ్మి విశ్వసించిన వారిని, నీతి పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకొను వారిని రాజులను గాను మరియు యాజకులనుగాను చేయునని 1 పేతురు 2:9లో చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు రాజుగా ఉండుటయే కాక తనను ఆశ్రయించిన పరిశుద్ధులను కూడా యాజకులనుగా, రాజులుగా చేయును గనుక ఈయనే గొప్పరాజు, రాజాధిరాజు. యే రాజు పాలించని విధముగా 1000సం||లు సమస్త రాజ్యాలను శాంతి సమాధానాలతో పాలించనైయున్న మహారాజు యేసురాజు.
రాజు విందు : రాజు వందంటే గొప్పవిందుగా ఉంటుంది, ఆ విందులో నీకు పొందు ఉంటుందా? విందులు పలు విధములుగా ఉన్నవి. అయితే విందులో పాలు పొందు విధము నీకున్నదా?
పెండ్లి విందు : రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లివస్త్రములు ధరించుకొనని యొకని చూచి స్నేహితుడా, పెండ్లివస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివి? అని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపట చీకటి లోనికి త్రోసివేయుడని అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పనివారితో చెప్పెను” (మత్తయి 22:12-13). చూచారా? విందని చిందులేస్తున్నారేమో, జాగ్రత్త సూమీ! పెండ్లి వస్త్రాలు లేకుండా రాజు పెండ్లి విందుకు రాజారావు, పరమవరుడైన క్రీస్తు జతపడుటకును, ఆ విందులో పాలుపొందుటకును నీకు పెండ్లి అనగా సిద్ధపాటు వస్త్రాలు కావాల్సియున్నది. యెషయా 61అ॥ నందు ఆత్మీయ వస్త్రములతో నిన్ను నీవు అలంకరించు కొనవా? స్తుతివస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము మొదలగు వస్త్రము లేకయే నీవు విందుకొచ్చిన యెడల నీకు అనుమతి యుండదు. మరియు సరియైన సిద్ధపాటు లేకుండా మురికి బట్టలతో విందుకొచ్చిన యెడల వారి కాలుచేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోయబడునట్లు శాసించును.
అందుకని రాజరిక వస్త్రాలు కాదు, అక్షరార్ధకమై మురికికాదు యెషయా 61:6లో గమనించినచో అక్కడీలాగు వ్రాయబడి యున్నది. “మేమందరము అపవిత్రుల వంటివారమైతిమి, మా నీతిక్రియలన్నియు మురికి గుడ్డలాయెను” అనుంది, అనగా నీతియనే వస్త్రమునకు అవినీతి, స్వనీతి అనే మురికి కాకుండా చూచుకొన్న పక్షమున నీవు నిశ్చముగా రాజువిందులో పాలుపొంద గలవు. యోబు భక్తుడు చెప్పగలిగినట్లు నీవు చెప్పగలిగితే ఆ రాజు పెండ్లివిందులో నీవుండగలవు.
యోబు ఏమన్నాడో గమనించండి! “నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను” (యోబు 29:14).
ఆహా! నీ నీతి, నీ న్యాయము మురికికాక పిల్ల రక్తము కడుగబడి తెల్లగా (పరిశుద్ధముగా) ఉన్నయెడల నీవు ఆ విందులో నుందువు. లేనియెడల పాతాళములో యొక మూలకు త్రోసివేయ బడుదువు. కావున నీ మురికి వస్త్రాలు తీసివేయబడి ప్రశస్త వస్త్రాలు ధరించాలంటే ఏమిచెయ్యాలి ఆలోచించు చున్నావా? భయపడకుము మనస్సుంటే మార్గ ముంటుంది. యేసుక్రీస్తు యొక ఉపమాన మందు తప్పిపోయిన కుమారుని గూర్చి చెబుతూ, ఆ చిన్నకుమారుడు, తన తప్పును గుర్తించి తండ్రి ఇంటిని జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ కోరాడు.
“అప్పుడు ఆ కుమారుడు అతనితో – తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, నీ యెదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదనెను. అయితే తండ్రీ తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించండి” (లూకా 15:21 – 22 ) అని చెప్పి విందును యేర్పాటు చేసెను.
ఆ ప్రకారము చిన్న (తప్పిపోయిన) కుమారుడు తప్పిదములను నెరిగి పశ్చాత్తాప పడినట్లు నిజమైన మారుమనస్సు నిజమైన పశ్చాత్తాపము, పరలోకమునకు విరోధముగా నీ యెదుట పాపము చేసితిమని ఒప్పుకొనే మంచి మనస్సు నీకున్నచో పరమతండ్రియైన దేవుడు నీకు ప్రశస్త వస్త్రములను తొడిగించి, రాజరికమునకు గుర్తుగా ఒంగరమును పెట్టి రాజు విందులోనికి నిన్ను తీసుకొనిపోగలడు.
ప్రభు (భోజనం) విందు: “కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని, త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు” (1కొరింథీ 11:28,29).
ఈ దినములలో ప్రభువు (విందు) భోజనములో పాలుగొనుచున్న క్రైస్తవులు ఏలాగు పాల్గొనుచున్నారోగానీ పౌలు చాలా ఇక్కగా వ్రాయుచున్నాడు.
ప్రభువురాత్రి భోజనము (విందులో) పాల్గొనువారెల్లరు ప్రభువు యొక్క పాత్రలో చేయు వేయుటకు ముందుగా ప్రతిఒక్కరు తన్నుతాను పరీక్ష చేసికొనవలెను, లేకుంటే వారికి శిక్షావిధి కలుగుతుంది. శాపస్తుందని బైబిలు చెబుతుంటే, ప్రతిమనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనుట లేదుగానీ ఎదుటివానిని పరీక్షించుచు – వీడు ప్రభువు భోజనమునకు వచ్చియున్నాడే ఇది (అది) ఎంత భయంకరమైనది. సేవకులు ఎందుకు దానికి రొట్టె ద్రాక్షారసమిచ్చుచున్నారని ఎదుటివారిని నెపములు ఎంచుచుందురు. సేవకుని అనడానికి ఎవనికి అధికారము లేదు, అప్పగింపబోవు యూదాకును, అబద్ధమాడైయున్న పేతురుకును తన్ను విడిచి పారిపోనైయున్న ఇతర శిష్యులకును యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షారసము ఇవ్వలేదా? ఆ ప్రకారమే దైవనుడు ఇష్టపడే వారికందరికిస్తాడు. అయితే పాత్రలో చేయివేయువారు, ప్రభువు యొక్క శరీరమనియు ప్రభువుయొక్క రక్తమనియు వివేచించి చేయి వేయకూడదు గనుక పాత్రలో చేయివేయువారు తన్నుతాను పరీక్షించుకొని యోగ్యముగా చేయి వేయవలెను సుమీ!
“కాబట్టి అయోగ్యము ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు, రక్తమును గూర్చియు అపరాధియగును” (1కొరింథీ 11:27).
ప్రియపాఠకా! నీవేలాగు పాల్గొంటు న్నావు? సంఘకాపరి ఇస్తున్నారు, తీసుకోవాలి, ప్రభువు భోజనములో కలిసికొనకపోతే తోటి విశ్వాసులు నన్నుగూర్చి ఏమనుకొంటారోయని, పరిశుద్దత లేకుండా పాలుపంచుకొనుట వలన నిన్నుబట్టి నీకుటుంబము కూడా శాపమునకు మరియు దేవుని కోపమునకు గురికావల్సి వస్తుంది సుమీ! అట్టివారిని గూర్చి మాటలాడు చున్న పౌలు ఈలాగంటున్నాడు. “మీరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యముకాదు” (2కొరింథీ 11:20).
అయితే వధువు సంఘానికి సాదృశ్యమైన షూలమ్మితి రాజు విందులో కూర్చుండగా తన (సంఘము) యొక్క సువాసన పరిమళించు నట్లు తెలియజేఉంది. అనగా ఆ రాజైన ప్రభువు యొక్క విందులో కూర్చుండ గలిగిన పరిశుద్ధత తాను కలిగియున్నానని సాక్ష్య మిస్తుంది. నీవును ఆలాగు చెప్పుటకును ఆయన విందులో పాలుపొందుటకును అర్హత కలిగియున్నావా? యోగ్యత, పరిశుద్ధత కలిగియుండువారే ప్రభువు (భోజన) విందులో పాల్గొందుటకు అర్హులు.
పస్కా విందు యేసు – పేతురును, యోహానను చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచు డని వారిని పంపెను. వారు – మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్ళకుండా మోసికొని పోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోని అతని వెంటవెళ్లి నేను నా శిష్యులతో కూడా భుజించుటకు విడిది గదియెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి” (లూకా 22:8 -11).
పస్కావిందు పాల్గొందుట గొప్ప విషయ ముకాదు, పేతురును, యోహానును ఆయనను అడిగారు. మేమెక్కడ సిద్దము చెయ్యాలని, అందుకాయన ఎక్కడో ఒకచోట సిద్ధము చేయమని చెప్పలేదు, ఆనవాలు చెప్పి పట్టణములోనికి వెళ్ళండి. వెళ్ళినపుడు నీళ్ళకుండతో ఒకడు మీకు కనిపిస్తాడు, వానియింట సిద్ధము చేయండని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు.
బైబిలునందు పలువిధములైన కుండలు న్నాయి – వాటిని గూర్చి క్లుప్తముగా పరిశీలింతుము : 2రాజులు 4:40లో కుండలో విషమున్నదని ఎలీషా శిష్యులు చెప్పుచున్నారు. కీర్తన 31:12లో దావీదు నేను ఓటికుండవంటివాడనైతిని అని అంటున్నాడు. యోహాను 4వ అ॥నందు సమరయ స్త్రీ కుండ పగిలియున్నట్లు గమనించగలము.
కుండ అనగా మానవునికే సాదృశ్యము. ఎట్లనగా దేవుడు పరమకుమ్మరియై యున్నాడు. కావున కుండనబడిన నరునిలో విషముండరాదు, మరియు ఓటి తనము పగుళ్ళు ఉండరాదు. ఎందుకనగా వాక్యమను ఉదకము పోసినపుడు కుండలో నిలువ చేసికోవాలేగానీ, వాక్యమనే జలాలు కారిపోకూడదు. అట్టికుండలున్న వారు ప్రభురాత్రి భోజనము ఇవ్వకూడదు, సిద్ధము చేయకూడదు. ఒకవేళ వారుచేసిన అట్టి స్థలములలో పుచ్చుకొనకూడదు. అందుకే యేసుక్రీస్తు – నీళ్ళకుండ మోసికొని పోవుచున్న వానియింట సిద్ధము చేయమని చెప్పాడు.
పరీక్షించుము! చదువరీ, నీ కుండలో విషమున్నదా? లేదా పగుళ్ళు (ఓటితనం ఉన్నదా?) లేదా జీవజలములైయున్న క్రీస్తును నీ కుండలో కలిగియున్నావా?
షూలమ్మితి ఆ స్థితిని కలిగియున్నందు వలననే రాజు విందులో కూర్చుండియుండగా నా సువాసన పరిమళించెనని వక్కానించ గలిగింది.
ఆత్మీయ సంఘము, వధువు సంఘము, ఎత్తబడిన సంఘము పై నేర్చుకొనిన విందుల్లో పాల్గొనుటకు తగిన పెండ్లి వస్త్రాలు, యోగ్యత మరియు జీవజలాలను కుండ నిండుగా కలిగిన అనుభవము కావలెను. లేకుంటే అలవరచుకొని ఆయత్తపడుము, దేవుడు మిమ్ము దీవించును గాక!
All Pdf………….Download
రాజు అని చెప్పబడిన ప్రతి చోట క్రీస్తే అనుకోవాలా???