స్మిత్ విగ్గిల్స్ వర్త్.
Smith Wigglesworth Biography in Telugu
స్మిత్ విగ్గిల్స్ వర్త్ ఇంగ్లాండు దేశమందు 1859 జూలై 10 వ తేదీన ఒక నిరుపేద కుటుంబములో జన్మించెను. చిన్న వయసులోనే పనికి వెళ్ళుచున్నందున స్కూలుకి వెళ్ళి చదువుకోలేకపోయెను. పెద్దవాడైన తర్వాత సంతకం చేయడం మాత్రం నేర్చుకొనెను. తన ఎనిమిది సంవత్సరముల వయస్సులో వాళ్ల నాయ నమ్మతో పాటు ఒక సువార్త మీటింగ్కి వెళ్ళి యేసుక్రీస్తుకు తన హృదయమును అప్పగించుకొనెను. అప్పటినుండి ఇతరులను కూడా రక్షణలోనికి నడపాలనే ఆశ అతనికి కలిగెను. మొదటిగా తన తల్లిని రక్షణలోనికి నడిపించుకొనెను.
1882 వ సంవత్సరములో పాలీ అనే భక్తి, సామర్థ్యములు కలిగిన స్త్రీని వివాహము చేసుకొనెను. చదువుకున్న తన భార్య ద్వారా స్మిత్ కూడా బైబిల్ చదువుట నేర్చుకొనెను. స్మిత్ ప్రసంగించుచున్నప్పుడు అతనికి నత్తి ఉండుటవలన, సరిగా చదువుకోనందున, వాగ్ధాటిలేని మూలాన, అతని ప్రసంగం వినువారు విసుగుకొనుచుండెడివారు. అయితే నిరుత్సాహ పడని స్మిత్ ప్రార్థనాపరురాలైన తన భార్యతో పాటు పిల్లల మధ్య సేవ ప్రారంభించి వారికి బైబిల్ కథలు నేర్పించి రక్షణలోనికి నడిపించెడివాడు. కొన్నిసార్లు స్మిత్ భార్య అయిన పాలీ ఆయన పక్షమున ప్రసంగించెడిది.
అయితే స్మిత్-నత్తి పెదవులు గల మోషేను వాడుకున్న దేవా! ఆది అపొస్తలులపై నీ ఆత్మను కుమ్మరించి వాక్ శక్తిని ఇచ్చిన దేవా! నన్ను బలపరచవా? నన్నును వాడుకొనవా? అని చేసిన ప్రార్థనా ఫలితముగా ఆత్మ నింపుదలను పొందెను. అద్భుతముగా దేవుడాయనకు శక్తినిచ్చి ప్రసంగించుటకు వాడుకొనెను. పాపులు రక్షించబడుట, దయ్యములు పట్టిన వారు విడిపించబడుట ఆయన సేవలో కనబడెను. ఒక రోజు బస్లో వెళ్ళుచున్నప్పుడు స్మిత్ నోరు తెరచి బిగ్గరగా సువార్తను ప్రకటించెను. ఆ ప్రసంగము విన్న ఆ బస్ లోని వారందరు కన్నీరు కార్చి పశ్చాత్తాప పడిరి. స్మిత్ వారందరి కొరకు చేతులుంచి ప్రార్థించెను.
స్మిత్ విగ్గిల్స్వర్త్ త్వరగా కోపపడే తత్వం కలిగినవాడు కాని ప్రభువు సన్నిధిలో గోజాడి ప్రార్ధించగా ప్రభువు అతనిని సాత్వికునిగా మార్చెను. స్మిత్ దీనుడు, నిరాడంబరజీవి. తాను కోరుకొంటే ఆడంబరముగా జీవించవచ్చును. గాని తన సమస్తమును ప్రభువుకు సమర్పించి సాధారణమైన, శుభ్రమైన వస్త్రములను ధరించి, గంభీరముగాను, పరిశుద్ధునిగాను జీవించెను. స్మిత్ విగ్గిల్స్ ప్రభువుపై గాఢమైన ప్రేమను, ప్రజలపై కనికరమును కలిగియుండెడివాడు.
ప్రతి 15 నిమిషముల కొకసారి బైబిల్ చదువకపోయినచో నేనుండలేను. బైబిల్ లేనిదే నా వస్త్రధారణ సంపూర్తి అయినట్లు నేను తలంచను, అని స్మిత్ మాటి మాటికి అనేవాడు. రోజుకు ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు అని ఆయనను అడిగినప్పుడు, “నేను దినమెల్లా ప్రార్థనలోనే ఉన్నాను. ప్రతి అరగంటకు ఒకసారి అయినా మోకరించి ప్రార్థించకుండా నేను ఉండలేను. ప్రార్థనే నా జీవితం. ప్రార్థనే నా ఊపిరి” అని అంటుండేవాడు. ప్రార్థనా భారాలతో ఆయనకు అందిన ప్రతి ఉత్తరాన్ని చదివి మనుష్యుల కష్టములను, పాపబంధకములను గురించి గ్రహించి, వారిపై ప్రేమతో, హృదయం పగిలినవాడై కన్నీటితో వారికొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు.
ఒకసారి రైలులో ప్రయాణించి వెళ్ళుచున్నప్పుడు వ్యాధిగ్రస్థులైన ఒక తల్లిని, బిడ్డను చూచెను. మీ వ్యాధికి నా దగ్గర మంచి మందున్నది అని స్మిత్ చెప్పినప్పుడు,
అయ్యా! ఆ మందు మాకివ్వండి అని వారు అడిగిరి. అప్పుడు స్మిత్ తన సంచిలో నుంచి బైబిల్ తీసి (నిర్గమ 15:26) చదివి వారికొరకు ప్రార్థించెను. వెంటనే వారు స్వస్థత పొందిరి. ఈలాగు దేవుడు ఆయనను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు, మనుష్యులను రక్షణలోనికి నడిపించుటకు వాడుకొనుచుండెను.
అకస్మాత్తుగా 1913వ సంవత్సరము జనవరి 1వ తేదీన స్మిత్ సతీమణి అయిన పాలీ నూతన సంవత్సరపు ఆరాధనలో ప్రసంగించుచున్నప్పుడే హఠాత్తుగా మరణించెను. ఈ సంగతి తెలుసుకొన్న స్మిత్ యేసునామంలో మరణాన్ని గద్దించి తన భార్యను బ్రతికించుకొనెను. అయితే బ్రతికి కూర్చున్న భార్య నన్ను ఎందుకు పిలిచారు. నేను ఈ లోకంలో నా పరిచర్యను ముగించుకొన్నాను. నా ప్రభువు నన్ను పిలుచుచున్నాడు నన్ను పోనివ్వండి అనెను. అయితే స్మిత్ ఇంకనూ ఆమె జీవము కొరకు దేవునితో పోరాడుచుండగా, “కుమారుడా! నీ భార్య ఈ లోకంలో తన పరుగును కడముట్టించెను. నేను ఆమెను చేర్చుకొనుచున్నాను” అన్న దేవుని మెల్లని స్వరం విని తన భార్యను దేవునికి అప్పగించెను.
ఆ తర్వాత తన 72 వ సంవత్సరంలో తన ఆయుష్షు పూర్తి అయినట్లు ప్రభువు బయలు పరచెను. గాని స్మిత్, “ప్రభువా! ఇంకా ఎంతోమంది నశించుచున్నారు. ఇంకా నేను నీ కొరకు చేయవలసిన పని ఎంతో ఉంది. హిజ్కియాను కనికరించినట్లుగా నాకును ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్షు నిచ్చునట్లు కనికరించుమ”ని గోజాడి ప్రార్థించెను. ఆయన ప్రార్థనవినిన ప్రభువు మరొక 15 సంవత్సరములు కంటి చూపు తగ్గకుండా, ఒక్క పన్ను కూడా ఊడకుండా స్మితన్ను కాపాడి అతనిని వాడుకొనెను.
ఆయన ఫలభరితమైన పరిచర్యకు, ఆత్మ కార్యములకు ముఖ్య కారణములు – ఆయన దేవుని వాక్యమును అధికముగా ప్రేమించి, పఠించి, ధ్యానించువాడు; తన స్వంతశక్తి మీద ఆధారపడక, దేవునిపై అచంచల విశ్వాసము కలిగియుండెడి వాడు; ఆయన సువార్తసేవతో పాటు సువార్తికులను సమకూర్చి వారందరు ఎల్లప్పుడు ఐక్యత గలిగి ఏకమనస్సుతో పరిచర్య చేయాలని, అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలను చూడగలమని చెప్పుచుండెడివాడు.
ఆలాగు ఆయన వృద్ధాప్యములో అనగా దేవుడు ఇచ్చిన కృపాకాల ఆయష్షుతో కలిపి 88 సంవత్సరములు యుద్ధవీరునివలె జీవించి, 1947 వ సంత్సరము మార్చి 12 వ తేదీన ప్రభువు సన్నిధికి వెడలి పోయెను.
All Pdf……..Download