సంచులండీ సంచులు!
Sevakula Prasangaalu Telugu
జోక్ ఉందా? తమాషా కాదు. మన దైనందిన జీవితంలో కొన్ని సంచులు వాడతాం. అది దేని కొరకైన కానివ్వండి. సంచితో కొంచెమైన అనుభవాలు మనకు ఉండి ఉంటాయి. బైబిల్లోని కొన్ని సంచి సంగతులు చూద్దాం!
1.) తూనికె రాళ్లసంచి.
(ద్వితీయోపదేశకాండము) 25:13
13.హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.
25:13-16 లేవీ 19:35-37; సామెత 11:1; 20:23. ఇలాంటి వంచన, అక్రమ కార్యాలు దేవునికి అసహ్యం.
(తూనికె రాళ్లు తెలుసుగదండీ? మనం తూచేందుకు వాడతాం. కొందరు వ్యాపారులు మోసం చేయడానికి, చూడ్డానికి రెండూ ఒకలాగే ఉన్న రాళ్లు వాడుతారు గాని వాటిలో హెచ్చుతగ్గులుంటాయి. మనవాడైనా మందివాడైనా – వాడు ఎవడైనా ఒకే న్యాయం గల తూనికె రాయిని వాడాలి. మన గుంపైనా మంది గుంపైనా ఒకే న్యాయం, అనగా సరియైన తూనికె రాయినే వాడాలి. అది మంచిది. మంచిని పెంచే భలే మంచిది!)
2.) గుళకరాళ్ల సంచి 1సమూయేలు 17:49
(గుళకరాళ్లను గురి చూసి విసరడంలో యువ దావీదుకి సాటియైన వారే లేరు. ఉపవాసపు చిక్కంలో ప్రార్థననే రాయిని గురిచూసి గొల్యాతుకు కొడితే – బొక్కబోర్ల పడిపోడా? ప్రార్థనే నీ ఆయుధం – ప్రభువే నీ విజయం!)
3. పాపాల సంచి.
(యోబు గ్రంథము) 14:17
17.నా అతిక్రమము సంచిలో ముద్రింపబడియున్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు.
(విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి సంచిలో వేసుకుంటారు. అది ఎకౌంటు అనే సంచండోయ్. సంచిలో దాచుకుంటారు. అలాగే పాపాలు చేసి బయట మంచిగా నీతిగా అగపడే వారి యొక్క పాపాలు దేవుడు సంచిలో దాస్తూన్నాడు. లెక్కలప్పుడు తొక్కతీస్తాడు! జాగ్రత్త! ఒప్పుకో – శిక్షనుంచి తప్పుకో!)
4.) దోపుడు సంచి.
(సామెతలు) 1:14
14.నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.
(దగా, దౌర్జన్యాలతో ధన్యులను ధరణి నుంచి తరిమేయాలని – మోసం చేసో, ఒకన్ని గాయపర్చో, ఏమైనా చేసో… గ్యాంగ్ తయారయ్యి గూడుపుఠాని నడిపి దొరికిన సొమ్మంతా ఒక్క సంచిలో వేసి సమానంగా పంచుకుందాం అనుకుంటారు. అలాంటి వందల గుంపుల మందలో నీవు కలవద్దు. చెఱసాల పాలు కావద్దు)
5.) చిల్లు సంచి.
(హగ్గయి) 1:6
6.మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
1:6 తమను తామే కేంద్రంగా చేసుకొనే ఫలితం ఇదే – కాయకష్టం వల్ల వారికి దక్కేది కొంచెమే. వారు పేదరికంలో కృంగిపోతున్నారు. వారి డబ్బు సంచులకు రంధ్రాలున్నట్టు ఉంది. ఎంత త్వరగా డబ్బు సంపాదిస్తే అంత త్వరగా దాన్ని ఖర్చు పెట్టవలసి వస్తున్నది. తన పనిని ఉపేక్షించిన పాపానికి దేవుడు వారినిలా శిక్షిస్తున్నాడు.
(దేవునికి ఇచ్చేది ఇవ్వకుండా, ఆయన పరిచర్యలో పాలు పొందకుండా, ఎంజాయ్ పేరుతో ఎంచక్క సాగిపోవాలని అనుకుంటున్నావేమో… నీ సంచికి చిల్లు పడింది – ఒకసారి చూసుకో! కొందరు ఎన్నో వృథా ఖర్చులు చేస్తారు. కాని దేవునికి చస్తే ఇవ్వరు – దానమైతే చెయ్యం కాని దండగైతే కడతాం అనే మూర్ఖ మనస్సుల మనుషులను మార్చేదెలా? వారిని ఓర్చేదెలా? రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, దేవునికియ్యని వారి సొమ్ముకూడా నేలపాలు అవుతోంది. ఎటు పోవాల్సింది అటే పోతుంది)
6.) సొమ్ము సంచి.
(సామెతలు) 7:20
20.అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
(కపటం గల వేశ్య బుద్ధిలేని పడుచువాన్ని పట్టుకొని లాలన మాటలతో వానిని పడగొట్టి – పురుషుడు ఇంటలేడు. సొమ్ము సంచి చేతబట్టుకొని దూరము వెళ్లాడు అంటోంది. సొమ్ముసంచి పట్టుకొని వెళ్లాడంటే – అతడు బిజినెస్ మేన్ అయ్యుండాలి. కొందరికి ఎలా సంపాదించాలి అని ఆశేగాని ఇంటివారిని, వారి నడతలను కనిపెడదాం, పట్టించుకుందాం అనే ఆలోచనే రాదు. సంచిలో సొమ్ము నింపుకొని వచ్చేసరికి ఇంట్లోని ఇల్లాలు గల్లంతుకావడం చూసి గొల్లున ఏడ్చి కన్నీళ్లు విడ్చి బాధపడితే బతుకునకు శాంతి కల్గునా? సంతోషం మిగులునా?)
VII. జీవపు సంచి (మూట) – 1సమూయేలు 25:29
(అబీగయీలు దావీదుతో – ఏలినవాడా! నీ ప్రాణాన్ని తీయుటకు ఎవడైన ఉద్దేశిస్తే, నీ ప్రాణము దేవుని యొద్ద జీవపు మూటలో కట్టబడుతుంది అంటుంది. ఈ లోకంలో ఏ శత్రువైనా కానీ, ఏ శోధనైనా కానీ, ఏ పరిస్థితియైనా నీకెదురైతే – నీవు భయపడనక్కరలేదు. ఎందుకంటే, నీ ప్రాణం దేవుని సంచిలో భద్రంగా ఉంది. విశ్వాసికి ఇంతకన్న ధైర్యం ఏం కావాలి?)
- రకరకాల సంచులు చూశాం. నీ మనస్సనే సంచిలో ఏమేమి దాయుచున్నావు? వెండి బంగారాలున్న సంచికన్నా, నీ మనస్సులో మంచి మాటలూ, బుద్ధిగల మాటలూ, దేవుని వాక్యం ఉండడం ఎంత మంచిది?!
All Pdf…………Download