దేవుడున్నాడా? తెలుగులో|Does God Exist In Telugu|1

Written by biblesamacharam.com

Published on:

దేవుడున్నాడా ?

Does God Exist In Telugu

        ఆస్తికులు, నాస్తికులు, మానవత వాదులు ఈ విధముగా మూడు వర్గములకు చెందిన వారు ప్రపంచ ప్రజలు. ఆస్తికులు అనగా దేవుడు ఉన్నాడు అని చెప్పువారు. నాస్తికులు అనగా దేవుడు లేడు అని చెప్పువారు. మానవత వాదులు అనగా దేవుడున్నాడో లేడో దాంతో పన్లేదు; మానవ సేవ మాధవుని సేవంటు చెప్పేడి వారు. అయితే వీరిలో ఆస్తికులకు మరియు నాస్తికులకు తరచు వాదోపవాదాలు జరుగుతుంటాయ్! ఎట్లనగా ఒకరు దేవుడు ఉన్నాడని మరియొకడు దేవుడు లేడని తర్కిస్తుంటారు. 

  చార్లెస్ డార్విన్ ఇంగ్లాండ్లో పుట్టి 8 సంవత్సరాలప్పుడే తల్లిని కోల్పోయి తన తోబుట్టులందరిలో బలహీనుడుగా వుండి మానసిక అభివృద్ధి (MentalDevelopment) లేని కారణం చేత తన జీవితమే Tragedy గా మారిపోయింది. చిరు ప్రాయము నుండి శోకము, దుఃఖము, శారీరక, మానసిక బలహీనతలు చేత బాగుగ నలపబడిన చార్లెస్ డార్విన్ తనకున్న చేదైన అనుభవములు ఆయనలో ఒక ప్రశ్నను లేవనెత్తాయి. అసలు దేవుడున్నాడా? ఉంటే నాకెందుకు ఇట్లు సంభవించినది అను ధోరణిలో ఈయన పరిణామ వాదాన్ని ప్రారంభించి దేవుడు లేడు. ఈ విశ్వము తానంతట అదే కలిగింది. పురాతన కాలములో నున్న జీవులు క్రమక్రమముగా మార్పు చెంది నేటికి ఉన్నతమైన ప్రాణులుగా దీనిని పరిణామ వాదమందురు. ఉన్నవని చెప్పుటకు మొదలుపెట్టారు. ఇంగ్లీషులో “Evolution Theory” అంటారు. క్రీ.శ. 19వ శతాబ్దములో చార్లెస్ డార్విన్ సృష్ఠికి కర్త లేడు దేవుడు లేడని చెప్పుటకు పూర్వమే భవిష్యత్ జ్ఞానమెరిగిన దేవుడు తన హృదయానుసారుడైన దావీదు చేత ఈలాగు వ్రాయించాడు. 

     “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేయుదురు. మేలు చేయు వాడొకడును లేడు” (దా.కీర్తన 53:1) అని పలికించి వ్రాయించాడు. ప్రకాశం జిల్లాలో నూకవరమనే ప్రాంతములో దేవుని గూర్చి చెప్పుటకు వెళ్ళినపుడు చార్లెస్ డార్విన్ లాగే 72 సం.లు నిండిన ఒక పెద్ద వయస్సు గల మనుష్యుడు నన్ను పిలచి అబ్బాయ్ నీ వయసు ఎంతని అని అడిగాడు. నేను 23 సం.లు అని చెప్పాను. ఆయన చిరునవ్వు నవ్వి హేళనగా నన్ను చూచి యింత సేపు దేవుడు దేవుడు అన్నావే అసలు దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించాడు ఆ దినాల్లో శాస్త్రీయంగా వివరించే శక్తి నాకు లేదు; అయినను నేనాయనతో అయ్యా బైబిల్లో కీర్తనల గ్రంథముంది. అందులో 14వ అధ్యాయము 1వ వచనములో “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు” అనుందని చెప్పాను. అంతే ఆయన బగ్గున మండిపడి అంటే నాకు బుద్ది లేదంటావా? అని యింకో మారు ప్రశ్నించాడు. అట్లని చెప్పలేదు నాన నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగమంటారా? అనడిగినందుకు ఆయన – ఏంటో అడుగు అన్నాడు. నేను, అయ్యా మీకు బుద్ధి జ్ఞానములున్నాయ్ అయితే వాటిని నాకు చూపిస్తే నేను మీకు దేవుని చూపిస్తాను అని చెప్పాను. దాంతో అట్లయితే దేవుడు ఎట్లున్నాడో చెప్పు తెలుపా? నలుపా? అని ప్రశ్నించాడు. నేనన్నాను అయ్యా గాలి ఉందని నమ్ముచున్నాము. ఆ గాలి ఏ రంగులో ఉన్నదో చెప్పగలరా అని ప్రశాంతముగా అడిగినందుకు ఆ పెద్దాయన నా భుజమును తట్టి బాబూ, 72 సంత్సరాలలో ఎంతో మంది పాస్టర్లను పరుగులెత్తునట్లు చేసాను. అయితే నీవు నా కండ్లు తెరిచావు. ఏదో లోక అతీతమైన శక్తి వుంది యని తెలుస్తోంది యని నిమ్మళించాడు. అప్పుడు ఆ లోకతీతమైన శక్తియే దేవుడని, నేను ఆయనతో చెప్పాను. 

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన పరిణామ వాదమును గూర్చి పరిశీలింతుము. పరీక్షించండి! సత్యాన్ని అన్వేషించుడి!! 

             బ్రిటిష్ మ్యూజియమనకు చెందిన డా॥ఐన్స్టీన్ ఈలాగన్నారు. పరిణామ వాది చెప్పే పదిమాటల్లో తొమ్మిది మాటలు బుద్ధిహీనమైనవి.(Sheer Non-sense)వారు చెప్పేవి వట్టి బూటకమని ఈ మ్యూజియంలో నిరూపింపగలమన్నారు. 

         జీవ శాస్త్రవేత్తయు మరియు ప్రపంచ ఖ్యాతి గాంచిన డా॥ క్లార్ ఏమన్నారంటే; చార్లెస్ డార్విన్ లా మార్కుల పరిణామ వాదం (సిద్ధాంతము) శుద్ధ తప్పని చక్కగా వక్కాణించారు. భౌతిక శాస్త్రజ్ఞుడు మరియు నోబుల్ బహుమతి అందుకొన్న గౌ||రాబర్ట్ మిల్లిడన్ – అయ్యో! పాపం మన శాస్త్రజ్ఞులు పరిణామ సిద్దాంతమును రుజువు చేయుటకు అవస్థలు పడుచున్నారే గాని అది ఎప్పటికిని సాధ్యము కానేరదని రాబర్ట్ మిల్లిడన్ సూచించారు. ప్రొ॥ బీలే – మానవోత్పత్తికి సంబంధించి పరిణామ వాది చెప్పిన దాంట్లో కనీసము కొంచెమైనను శాస్త్రీయముగా రుజువు కనిపించలేదు అన్నారు. యికపోతే మనుష్యుడు కోతి నుండి పుట్టాడని, జంతువు పరిణామమొంది మనుష్యుడైనట్లు ఆయా స్థలములలో బొమ్మలను కూడా మీరు చూచియుంటారు. దీని విషయమై జంతు శాస్త్రజ్ఞులను అడిగి తెలుసుకోవాలి. ఎర్ లింగర్ పట్టణస్థుడైన ఫ్లైజ్ చామన్ ఇతడొక జంతు శాస్త్రజ్ఞుడు. తానేమంటున్నాడో చూద్దాం! – డార్విన్ సిద్దాంతమును బలపరచుటకు ప్రకృతిలో ఆధారమొకటైనను లేదు. మరియు డార్విన్ చెప్పినది విజ్ఞాన శాస్త్ర ఫలితము కాదు కాని అది అతని ఊహా ఫలితమే అని డార్విన్ వింత వాదమును ఖండించాడు. 

     ప్రొ.ప్లెచ్మాన్ చెప్పినదేమనగా పరిణామ సిద్దాంత ప్రక్రియను ప్రయోగాత్మకంగా చూపించుటకు సృష్టిలో ఏమి కనిపించదు. ఇది శాస్త్రీయ పరిశోధన కాక కేవలము డార్విన్ ఊహా ఫలితమని గ్రహించగలమన్నాడు. 

     థామ్సన్ గణిత శాస్త్రజ్ఞుడు డార్విన్ సిద్దాంతమును దిగువ రీతిగా విమర్శించాడు. నేటి శాస్త్రజ్ఞులు భావించిన విధముగా కేవలము జడ ప్రక్రియలు మాత్రమే చాలవని, గణిత శాస్త్రపరంగా నిరూపింపగలమన్నాడు. The Sci- ence And Philosophy అను గ్రంథములో ఈలాగున్నది. పాకృతికమైన దానిని గూర్చి మనకున్నది సంకుచితమైన ధృక్పధమే! మనలో, బయట ఉన్న దేవుని ఉనికిని గుర్తించకుండా చేస్తుంది. 

      ప్రియ సత్యాన్వేషకులారా, పై నివ్వబడిన శాస్త్రజ్ఞులు వివరణ ధోరణి వాదమును బట్టి పరిణామ వాదము ఎంత వరకు అవాస్తవమో అర్ధమైయుంటుందని దేవుని స్తుతించుచున్నాను. డొంక తిరుగుడు తిరిగి వార్ని వీర్ని అడిగేదెందుకు? సరాసరి చార్లెస్ డార్విన్నే అడుగుదామా? ఏమండీ డార్విన్ మీరు చెప్పిన పరిణామ వాదముపై మీ అభిప్రాయము చెప్పండి…. అంటే … ఆయన దిగువ రీతిగా తెలిపాడు. 

     1920 సం॥ము జనవరి మాసం Kings Business అను పత్రికలో దాని ఎడిటర్ ‘క్రీత్ బ్రూక్స్” డార్విన్ తన చివరి దశలో “ఆఖరి మాటలు” అను అంశముపై లాగు వ్రాసాడు. డార్విన్ తన జీవిత ఆఖరి దశలో నిత్య జీవాన్ని పొందవలసిన అవసరతను గుర్తించి “నేను ఏదో నాకు తోచిన వాటిని, సూత్రాలను, (సృష్టికి సంబంధించి) భావాలను తెలియజేస్తే ప్రజలు వాటిని సిద్దాంతములుగా చేసికొనియున్నారు. ప్రజలను పోగుచేసి” యేసుక్రీస్తును గూర్చి వారికి తెలియచేయండి (బోధించండి) అని తెలియజేసాడు.అంతకు పూర్వము Life And Letters లో డార్విన్ ఈలాగన్నాడు. సృష్ఠింపబడిన వాటి విషయములో సహేతుకముగా వివరించడము నా చేతనైన పనికాదు. అయితే నాకు నేను దేవునిపై నమ్మిక లేనివానిగా ఉండిపోతాను. నేను వార్ధక్యములో ఉన్నాను. మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పగల ఆరోగ్యము నాకు లేదన్నాడు. 

     Dr. Croft (Salford University) Do The Life And Death of Charles Darwin అను పుస్తకములో డార్విన్ మరణించుటకు ఆరు నెలలకు ముందు మారుమనస్సు పొంది యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించినట్లు Sir. James Hope గారి భార్యయైన Lady hope (సువార్తికురాలు) ద్వారా దర్శింపబడి దేవుని గూర్చిన విశ్వాసమును పెంచుకొన్నాడు. అయితే లేడి హోప్ అతని దర్శించుటకు వెళ్ళినపుడు తన చేతిలో పరిశుద్ధ గ్రంథము ఉన్నట్లు చూచిన ఆమె నీవు చదువుచున్న పుస్తకము ఏమిటని అడిగినందుకు బైబిల్ పరిశుద్ధగ్రంథములోని హెబ్రీ పుస్తకమును చదువుచున్నాను. “The Royal Book” దీనిలో యేసుక్రీస్తు రక్తము ఎంత శక్తివంతమైనదో గ్రహించగలమన్నాడట డార్విన్. డా॥ క్రాప్ట్ వ్రాసిన ఈ సంగతులను మరల Rev. I. James “Christian Herald” అను పత్రికలో (12-12-1881) వ్యాసముగా ముద్రించి డార్విన్ యొక్క అంతిమ దశలో ఏలాగు దేవుని అంగీకరించాడో వ్రాయడమైంది. సమీపములో చార్లెస్ డార్విన్ పాస్టర్ బీకాన్ కు వ్రాసిన ఉత్తరము కనుగొనబడినది. అందున్న దేమనగా ” పాస్టర్ బీకాన్ మేము విజ్ఞానం ద్వారా యింత కాలము చేయలేని పనిని మీరు చేసారు. అందుకు నా వందనాలు. అదేదనగా మేము మా విజ్ఞాన ఫలితముగా యిప్పటి వరకు ఒక్క త్రాగుబోతును కూడ మార్చలేకపోయాము. అయితే మీరు నా యింటి డాబా మీద మీరు జరిపించిన 30 దినాల బైబిల్ తరగతులు ద్వారా  మా ప్రాంతములో ఉన్న త్రాగుబోతులందరు మారిపోయారు. త్రాగుబోతులను మార్చగల మీ దేవునికి నా వందనము అని అందు గుర్తించియున్నాడు. 

      పరిణామ వాదియైన డార్విన్ తన ఆఖరి ఘడియలో నిజాన్ని గుర్తించి తాను చెప్పినవి ఊహా ఫలితమేనని ఒప్పుకొని చివరకు యేసుక్రీస్తును స్వీకరించి హెబ్రీ గ్రంథమును చదువుచూ ప్రాణము వదిలాడు. పరిణామ వాద కారణ కర్త మారుమనస్సు పొందిన, ఆయన చెప్పిన వాటిని పట్టుకొన్న కొందరు నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళున్నాయని వాదిస్తున్నారు. ఎవరైనను సరే సత్యాన్ని తెలిసికోవాలి అన్న ధృక్పధముతో పరిశీలిస్తే సత్యమును తెలిసికొనగలరు. 

     డార్విన్ మారుమనస్సు తరువాత తన సూత్రాలను సిద్దాంతములను ఆధారంగా చేసికొని వాటిని గట్టిగా పట్టుకొనియున్న కొందరు యిక ఏ హేతువు చేతనైన దేవుడు లేడని వివాదించాలని యోచించుచుండగా 1961వ సం॥లో Yuri Gagarin చంద్రమండలానికి వెళ్ళి వస్తున్నప్పుడు  అతని ఆహ్వానించి మీరు ఆకాశమునకెక్కి చంద్ర మండలములో సంచరించి వచ్చియున్నారు. చంద్రమండలములో దేవుడు, దయ్యము, దేవదూత వీటిలో దేనియైనను చూచారా? అక్కడవి ఉన్నాయని అడిగినందుకుYuri Gagarin దేవుడైనను, దయ్యమైనను, దేవదూతనైనను నేనక్కడ చూడలేదని జవాబు యిచ్చాడు. 1969 సం॥ము జూలై 20న          Neil Armstrong అంతరిక్ష ప్రయాణము చేసి వచ్చాడు. అప్పుడు Yuri Gagarin ను ప్రశ్నించిన ప్రకారమే ఇతనిని ప్రశ్నించగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడ అదే సమాధానము ఇచ్చాడు. ఈలాగు కొందరు చెప్పిన కారణము చేత మరింత ధృఢ నిశ్చయానికొచ్చారు దేవుడు లేడని. దాంతో దేవుడు లేడని వాదించు వారందరు డప్పులు వాయించుకొంటూ ఆకాశమందు కూడ దేవుడు లేడని అంతరిక్ష పరిశోధకులు తెలియజేసియున్నారని ఆస్తికులను అవహేళనగా చూడ నారంభించి విర్రవీగుచున్న సమయములో జేమ్స్ బి. ఇర్విన్ అపొలో -15 లో (1971 జూలై 26) అంతరిక్ష ప్రయాణం చేసి విజయం సాధించాడు. ఈయనను రష్య ఆహ్వానించి గౌ॥జేమ్స్ బి. ఇర్విన్ యిప్పటి వరకు చంద్ర మండలములో విజయం చేసిన వారందరు అక్కడ దేవుడు, దయ్యము, మరియు దేవదూతలు కూడ లేరని చెప్పారు. మీరు వెళ్ళారు కదా మీకెవరైన కనిపించారా? యని హాస్యముగా ప్రశ్నించగా జేమ్స్ బి. ఇర్విన్ పడి పడి నవ్వుచుండగా వారు అసలు మీరు దేవుని అక్కడచూచారా? అనడిగారు అందుకు ఇర్విన్ ఈలాగు చెప్పాడు. నేను ఇదిగో యిక్కడ నున్న చంద్రమండలానికి వెళ్ళి వచ్చినాను. అయితే నా దేవుని సింహాసనము నక్షత్రములకు పైగా వున్నదని పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తోంది. నేనిక్కడనున్న చంద్ర మండలానికెల్లోస్తే అక్కడ దేవుడున్నాడా? యని ప్రశ్నించినపుడు నా కంటే ముందుగా వెళ్ళి వచ్చిన వారైనను నేనైనను ఆ సమాధానమే చెప్పగలమన్నాడు. మరియు ఒకటి లేదు అని చెప్పాలంటే అన్ని చోట్ల (స్థలము)లో వెదకిన తరువాత చెప్పాలి. ఆలాగు కాక మీరు వెదకిన స్థలమునందు లేనందున ఎక్కడను లేడని తీర్మానించుట సరికాదని సూచించాడు James B. Irwin. దాంతో వారి నోళ్ళు మూతబడ్డాయ్! 

     నిజానికి భూమికి, చంద్రునికి, సూర్యునికి, నక్షత్రాలకు మధ్య ఎంతో దూరమున్నది. మనము భూమి నుండి చూచినపుడు సూర్యచంద్ర నక్షత్రములన్నీ ప్రక్క ప్రక్కలో ఉన్నట్టు కనిపిస్తోంది. కాని ఒక్కొక్క దానికి ఎంతో దూరముంటున్నది. భూమి నుండి చంద్రుడు 2,30,000 మైళ్ళ దూరములో ఉన్నాడు. అనగా 3,45,000 కి.మీ. దూరములో ఉన్నాడు. సూర్యుడు భూమి నుండి 9 కోట్ల 30 లక్షల మైళ్ళ దూరములో ఉన్నాడు. ఆలాగే భూమి నుండి నక్షత్రమండలము 198 మిలియన్ల మైళ్ళదూరములో ఉన్నాయని అక్కడి నుండి సూర్యుని చూచునపుడు భూమి కంటే ఎంతో పెద్దదైన సూర్యుడు చిన్న బంతిలా ఉంటుందని హెన్రీ నోవిస్ అన్నారు. 

    నక్షత్రములకు పైన ఉత్తర దిక్కున సభా పర్వతము మీద ఆయన (దేవుని) సింహాసనమున్నది. ఇక్కడ నున్న చంద్ర మండలమునకు వెళ్ళి వచ్చి దేవుడు లేడని నిర్ణయించడము జేమ్స్ బి. ఇర్విన్ అన్నట్టు నిజముగా బుద్దిహీనత వేరేమౌతుంది. సూర్య (కుటుంబము) మండలములోనికి ప్రవేశించుటకు పలు ప్రయత్నము చేసి విఫలులయిన వారు దేవుని లేడని చెప్పుట చెప్పనలవి కానీ హాస్యాస్పదమే. జేమ్స్ బి. ఇర్విన్ యిచ్చిన జవాబు మేరకు ఆ పై ఆ పై చంద్రమండలమునకు వెళ్ళి వచ్చిన వారిని ప్రశ్నించడం మానుకొన్నారు. పరిణామ వాదులు, నాస్తికవాదులు నోరు మెదపకుండునట్లు విజ్ఞానం వారికి సుజ్ఞానం నేర్పింది. దేవుడు లేడనే వారి వాదము వట్టిదని వివరించుకొనిన తరువాత దేవుడున్నాడు అనే దానికూడా చదువరుల దృష్టికి తీసుకురాగలిగితే ప్రయోజనకరముగా ఉంటుందని భావిస్తున్నాను. 

     సర్ ఐజక్ న్యూటన్ కు సహాయకారిగా ఉంటున్న ఒకడు వానికుంటున్న ఆర్ధిక వత్తిడి వలన దేవుడు లేడు; వుంటే కొందరిని ధనికులుగాను, మరి కొందరిని దరిద్రులనుగాను చేయుట ఎందుకు? అట్టి పక్షపాతిగా దేవుడు అనే వాడుండడంటూ తరచు న్యూటన్ గారితో ఆవేదన వ్యక్తం చేస్తుండేవాడు. వీనికి ఏలాగైనను దేవుడు ఉన్నాడని నిరూపించాలని న్యూటన్ ఎంత ప్రయత్నించినను వాడు ఒప్పక దేవుడు లేడు దయ్యము లేదు. ఈ లోకము (విశ్వం) తానంతట అదే పరిణామమొందెనని వివాదిస్తుండేవాడు. ఒక రోజు తనకు సెలవు కావాలని ఒక్క వారము రోజులు న్యూటన్ దగ్గర అనుమతి తీసికొని వెళ్ళాడు. అతని సెలవు దినములు తీరి ఆఫీసుకు వచ్చిన తాను తన గదిని తెరచే సరికి బహు ఆశ్చర్యపోయాడట. దాంతో పాటు న్యూటన్ ఎప్పుడొస్తాడని వేయి కండ్లతో ఎదురు చూస్తుండగా, ఆ దినము న్యూటన్ ఆలస్యముగా కార్యాలయమునకు రాగానే ఈ మనుష్యుడు న్యూటన్ ను చూచి అయ్యా, ఇవి ఎంత చక్కగాను, చూడ ముచ్చటగాను ఉన్నవో చూడుడని తన బల్లపై నున్న నవ గ్రహాలను చూయించి అయ్య వీటిని ఎవరు చేసారు అని ఆశ్చర్యముగా అడిగినందుకు న్యూటన్ నేను కాదని జవాబిచ్చాడు. అందుకతడు – ఒకటి మీరు చెయ్యాలి, లేదంటే నేను చెయ్యాలి. యింకెవ్వరు ఇక్కడికి రాలేరు గదా అని అడిగినందుకు న్యూటన్ నీ బల్లలో ఉన్న కాగితములున్నాయా అని ప్రశ్నించగా లేవండి ఆ కాగితములన్నిటి చేతనే వీటిని చేసియున్నారని చెప్పినందుకు ఆయనతో న్యూటన్ – ఓహో, అలాగా? అట్లయితే బల్ల మీద నున్న కాగితములన్ని వాటంతట అవే ఈలాగు పరిణామం చెంది యుండవచ్చునని వింతగా చెప్పాడట అయితే ఆ మనుష్యుడు – కేవలము కాగితములు వాటంతట అవే పరిణామం చెంది యింత చక్కని గోళములు కాగలవా? అని ప్రశ్నించాడు. అందుకు న్యూటన్ – అంటే, వీటిని ఎవరో చేసియుండాలని నీవంటున్నావ్! అంతేనా? అనగానే అతను తడుము కోకుండ తప్పనిసరిగా వేరే మార్గమే లేదన్నాడట. 

   చాలమంచిది. ఎందుకు ప్రయోజనము కాని ఈ కాగిత గ్రహాలను తప్పనిసరిగా ఒకరు చేసియుండాలని ధృఢముగా వాదించావ్! అయితే వాటి పనులు అవి చేసికొంటూ చక్కగా నరజాతికి ప్రయోజనంగా ఉన్న నిజమైన గ్రహాలను కూడ ఒకరు చేసియుండాలి కదా! యని ప్రశ్నించగా Marlin son మౌనము వహించి న్యూటన్ తో ఈలాగు అన్నాడు – అవును, ఇంత వింత విశ్వమును సృష్టించిన ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది గాని ఆ శక్తికి ఫలానా అని పేరు పెట్టినట్లయితే నేను నమ్మనగా న్యూటన్ – అంతవరకు చాలు సృష్టిని చేసిన ఒక శక్తి ఉందని ఒప్పుకొన్నావు కదా! ఆ శక్తినే సృష్ఠి కర్తని, దేవుడని పిలుస్తారు. కావున గుర్తించిన పేరుతో కాక ఈ సృష్ఠిని సృజించిన దేవా, యని ప్రార్థించుము ఆయనే నీకు దర్శనమిచ్చి నిన్ను దీవిస్తాడని సువార్తను బోధించాడు Sir Isaac Newton. 

      G.D. నాయుడు – జోబ్ జ్ఞాన ప్రకాశం :1973 సం॥లో జోబ్ జ్ఞాన ప్రకాశం (దైవజనుడు) G.D. నాయుడు (నాస్తికుడు) ను కలుసుకొను సందర్భము. అమెరికా నుండి దైవజనులగు జోబ్ నొద్దకు వచ్చిన డా॥ పైలాండ్ (Bible Pandit) ద్వారా కలిగెను. G.D. నాయుడు మరియు డా॥ పైలాండ్ వీరివురు పరిచయులే కావున డా|| పైలాండ్ ఇండియా కొచ్చినపుడు G.D. నాయుడు యింటికెళ్ళుటకు ఆశించగా ప్రేమతో తంగమ్మల్ జాకబ్ మరియు T.V.T సారి యొక్క సహకారముతో G.D. యింటికెల్లడమైంది. యింట కూర్చుండి సంభాషించుచున్నపుడు శ్రీమతి తంగమ్మల్ జాకబ్ను చూచిన G.D. నాయుడు ” ఇది వరకు నీవెంత మంచిగా వున్నావు. యిప్పుడు మీరు చెడిపోయారని అన్నాడు వెంటనే జోబ్ జ్ఞాన ప్రకాశం – ఇది వరకు కంటే యిప్పుడే తాను బాగున్నారు అది ఎట్లని ప్రశ్నించారు GD. నాయుడు. అందుకాయన ఇది వరకు ప్రజాసేవ మాత్రమే చేస్తున్న శ్రీమతి తంగమ్మల్ జాకబ్ యిప్పుడు దైవ సేవ చేస్తూ దైవికముగా ఎంతో బాగున్నదని చెప్పాడు. వెంటనే దేవుడు లేడు గాడిద గుడ్డు లేదని చల్లుమని చంపకు కొట్టినట్టు విస్మరించాడు G.D. నాయుడు, దాంతో దైవజనులు జోబ్ జ్ఞాన ప్రకాశం – అయ్య, మీరు దేవుని నమ్మరా? అని ప్రశ్నించాడు అందుకతడు ఎవరైన సరే దేవుని చూపించగలిగితే నమ్ముతాను. మీరు దేవుడు ఉన్నాడని నిరూపించగలరా? చూపించగలరా? అని మండిపడ్డాడు GD. నాయుడు. నిశ్చయముగా దేవుడు ఉన్నాడని నిరూపించగలనని కొంత సమయము ఊరకుండి తరువాత ఈలాగు అడిగాడట. ఈ చక్కని యింటిని ఎవరు కట్టించారు అనగా నేనే కట్టించాను PLAN అంతయు నాదే అన్నాడు GD. నాయుడు. అందుకు జోబ్ జ్ఞాన ప్రకాశం, నేను యీ యింటిని చూచినపుడు ఇది దానంతట అదే కలిగినట్లుందని చెప్పగా హాస్యముగా నవ్వి దీన్ని నేనే కట్టించానని చెప్పాడు నాయుడు. కేవలము ఒక యిల్లు ఒకని ద్వారా కట్టబడియున్నదంటే యింత గొప్ప ప్రపంచము కూడ ఒకరి ద్వారా కలిగియుండాలి. If there is a design there should be a designer, If there is a law there must be a law giver కాబట్టి ఈ సృష్టి వుందంటే ఈ అద్భుత సృష్ఠిని డిజైన్ చేసిన డిజైనర్ ఒకరుండాలి ఆయననే దేవుడంటారని సమయోచితముగా సువార్తను బోధించాడు రెవ॥ జోబ్ జ్ఞాన ప్రకాశం. 

      1971 సం॥లో జిమ్మ గార్టర్ ఆధ్వర్యములో ఆయుధములు తగ్గింపు సమావేశము వెనిస్ నగరములో జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజ్యములు నుండి ఫ్రెసిడెంట్స్ వచ్చారు. తీవ్రముగా చర్చలు జరుగుచుండగా రష్యా అధ్యక్షులు బ్రెజ్నేవ్ – ఈ దినము లోక శాంతి సమాధానము కొరకు మనమొక నిర్ణయానికి రాకపోతే పరలోకమందున్న దేవుడు క్షమించడని మాటలాడగా జిమ్మి గార్టర్ హల్లేలూయా అని బిగ్గరగా చెప్పుతూ గంతులేసాడు. దాంతో మీరెందుకిట్లు గంతులేస్తున్నారని అడిగినందులకు జిమ్మి గార్టర్ ఈలాగు చెప్పారు – దేవుడు లేడనే రాజ్యాధినేత దేవుడని చెప్పుటయే గాక పరలోకమందున్న దేవుడని చెప్పి నా దేవుని నామమును గూర్చి ప్రస్తావన చేయుట వలన ఉత్సాహించి సంతోషముతో హల్లెలూయా అని చెప్పానని; ఆ సంగతి ఆలాగే తాను రచించిన Keeping Faith Memories of president అనే పుస్తకము గుర్తించాడు. ఆహా! ఎంత అద్భుతము! పరిణామ వాదమును సృష్టించిన చార్లెస్ డార్విన్ సత్యము గుర్తించి దేవుని కలిగి చనిపోయాడు. చంద్రమండలానికి విజయం చేసిన వారిని విచారించి అక్కడ దేవుడు లేడని నాస్తికత్వమును గట్టిగా పట్టుకొనిన రష్యా దేవుని నమ్ముకొనియున్నది. విజ్ఞానానికి విత్తనము వేసిన గొప్ప విజ్ఞాన శాస్త్రజ్ఞుడు సర్ ఇస్సాక్ న్యూటన్ దైవ నమ్మకము కలిగి తనను సమీపించు వారందరికి దేవుని గూర్చి తెలియజేసిన విశ్వాస విజ్ఞాని. ఈయనను ఈలాగు ప్రశ్నించారు మీరు ఎన్నో విజ్ఞాన విధులను కనుగొని యున్నారు. ఆవన్నీ ఎంతో విలువైనవి. కావున మీరెట్లు యిన్ని విజ్ఞాన విధులను కనుగొన్నారని అడిగినందుకు న్యూటన్ – నేను దేవునిపై నమ్మకము కలిగిన వాడను. దేవుడు ఈ లోకాన్ని సృష్టించియుంటే కొన్ని విధులను బట్టి సృష్టించియుంటారు. కావున ఆ విధులకై పరీక్షించాను ఇలాగే కనుగొన్నాను. నేను కనిపెట్టి యున్న విజ్ఞాన విధులన్నిటికి దేవుడు ఉన్నాడు అను నా నమ్మికయేయని సమాధానమిచ్చాడు సర్. ఐజక్ న్యూటన్. 

      “ప్రతియిల్లును ఎవడైన ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టిన వాడు దేవుడే. యింటి కంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు, ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను” (హెబ్రీ 3:3-4). హెబ్రీ గ్రంథకర్త అభిప్రాయములో దేవుని ఉనికి ఎంత చక్కగా ఉన్నదో చూడుడి. “ప్రతి యిల్లును ఒకని చేత కట్టబడును” అనగా ఏ యిల్లును తనకు తానేర్పడేది లేదు. ఆ యిల్లు చిన్నదే గాని పెద్దదే గాని ఒకని చేత కట్టబడాలి. కట్టువాడు లేకుండ కట్టడము రాజాలదు. ఆలాగే సృష్టిలో చూస్తున్న సమస్తమును కట్టి నిర్మించిన వాడు దేవుడే నని చక్కగా వివరించాడు. బైబిల్ గ్రంథము యొక్క గొప్ప తనమును వివరించి వ్రాయుటకు ప్రపంచ గ్రంథములన్నియు చాలవు. పండిట్ కౌంట్ లియోటాల్స్టాయ్ ఈలాగన్నాడు – ప్రస్తుతము సమాజమున్న పరిస్థితులలో బైబిల్ లేకుండా పిల్లలకు విద్య నేర్పుట కష్టతరం మరియు ప్రపంచ మందున్న గ్రంథములన్నిటిలో ఒక్క బైబిల్ మాత్రమే సృష్ఠితో ప్రారంభించబడి సృష్టిని గూర్చిన చక్కని అవగాహనమును ఇస్తుందన్నారు. ఎందుకనగా మిగిలిన ఏ గ్రంథములోను “ఆదియందు “దేవుడు” భూమ్యాకాశములను సృజించెను” (ఆదికాండము1:1) అని ప్రారంభించలేదు గనుక ఎవరికి విద్యను బోధించినను పరిశుద్ధగ్రంథమును గూర్చిన జ్ఞానము కలిగి బోధిస్తే విద్యార్ధులకు త్వరగా గ్రహితమౌతుందని కౌంట్ లియోటాల్ స్టాయ్ అన్నాడు. బైబిల్ సృష్టికి – పరిణామవాదుల సృష్ఠి లెక్కలకు చాలా తేడావున్నది. యించేత కొందరు బైబిల్ యిస్తున్న సృష్ఠిని గూర్చిన వివరణనను విస్మరించారు. దానిని కొంత పరిశీలింతుము. 

       రెండు వందల మిలియన్ల సం॥ల క్రితం జీవి పుట్టినట్లు డార్విన్ ఊహించి తెలుపగా; ఆయన కుమారుడు 57 మిలియన్ల సం||ల క్రితమే జీవి పుట్టిందని వ్రాసాడు. ఇది వారి ఊహా జనితమని అర్థమైనను, కొందరు దీని పురస్కరించుకొని 195 కోట్ల సం॥ల క్రితమే మా మతముందని డప్పు వాయిస్తున్నారు. అయితే హెచ్.బి. వెల్స్ అనే చరిత్ర పరిశోధకుడు                         History Of The World పుస్తకము నందు భూమి మీద మానవుని ఉనికి ఏర్పడి పదివేల సం.ల లోపే వుంటుందని వ్రాస్తున్నాడు. ఆలాంటప్పుడు అనగా మానవుడే లేనప్పుడు మతమెట్లు యుండి యండునో సత్యన్వేషుకులు గ్రహింతురు. ఒక సమావేశములో మాట్లాడటానికి స్వామి వివేకానందుడు ఆహ్వానించబడ్డాడు. ఈయన ఆ సమావేశానికి వెళ్ళి చూచినపుడు అక్కడున్న బేనర్లో No where God అని పెద్ద అక్షరములతో వ్రాసియుండుట గమనించిన స్వామీజీ చిరునవ్వుతో ఇక్కడ No where God అనుంది అయితే Where అను వాక్యములోని ‘W’ ని కొంచెము ఎడము వైపుకు తెండని చెప్పాడు. వారు ఆలాగే ‘W’ ను ‘NO’ ప్రక్కకు జరిపి చూడగా ఈలాగు భావమిచ్చిందట. “Now Here God” దాంతో నాస్తికులందరు చిన్నబోయి తలదించుకొన్నారంట. ఉన్న దేవున్ని లేడని నిరూపించుటకు నాస్తికులు, పరిణామ వాదులు విశ్వ ప్రయత్నాలు చేసినను ఫలితం శూన్యమే. 

        పై వివరణను బట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారిలో మరో వింత వివాదము అదేదనగా “దేవుడు ఉన్నాడు” అయితే దేవుడెవరు? దేవుని గుణాతిశయాలేవి? శాస్త్రీయముగా దేవుడు ఫలానా అని చెప్పగలమా? నిరూపించగలమా? 

      దేవుడెవరు?: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములను అరిషడ్ వర్గములు లేని వాడే దేవుడు. అట్లయినచో యిట్టి కార్యములు లేని పూర్ణ దైవత్వము కలిగిన ఒక్కరిని చూపండి! మతాలలో కనిపించరు, ఒకే ఒక యేసుక్రీస్తులో మాత్రమే అట్టి పరిశుద్ధతను చూడగలము. ఎవరిని నేను విమర్శచేయను. యింకెవరినైన ఆయనతో పోల్చుటకు నాకిష్టము లేదు ఎందుకనగా రవికోటి తేజునితో అగ్గిపుల్ల వెలుగును పోల్చి చూచి నట్లుంటుంది. ఆయన (క్రీస్తు) కు ఆయనే సాటి. యికపోతే వేద గ్రంథాలు, మత గ్రంథాలతో మాకు సంబంధము లేదు. శాస్త్రీయంగా దేవుడుంటే ఆ దేవుడెవరని శాస్త్రీయముగా నిరూపింపగోరుచున్నారా? నిజమే! మానవుల సంఖ్యతో పాటు దేవుళ్ళు సంఖ్య కూడా పెరుగుతూనే వుందికదూ! రోజుకొక క్రొత్త దేవుడు పుడుతున్నాడు. దేవుని సంఘమును హింసిస్తూ క్రీస్తు శిష్యు(అనుచరులను చెరపట్టుచుండిన పౌలు దమస్కు మార్గమున క్రీస్తు ద్వారా దర్శింపబడి సత్యమును తెలిసికొని పౌలుగా మార్చబడి దేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ ఏథెన్సు పట్టణమునకు వెళ్ళినపుడు అక్కడి ప్రజల భక్తి విధానాన్ని చూచి పౌలు ఆశ్చర్య పడి వారితో ఈలాగంటాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనమును చూడుడి. “నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను దాని మీద – తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగియున్నారో దానినే నేను మీకు ప్రచుర పరచుచున్నాను” అనుంది. 

      బహు దేవతారాధికులగు ఏథెన్సు పట్టణస్తులు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బలిపీఠమును కట్టి మానుకొనక యింకొక బటిపీఠము ను కట్టి దానిపై “తెలియబడని దేవునికి” అని చెక్కించియున్నారు. దేవుడు ఒక్కడే అన్న కనీసపు జ్ఞానం లేని ప్రజలు; బహు దేవతారాధన తప్పు అని తెలియక, ఒక వేళ తమకు తెలియని దేవుడు ఒకడుండి ఆయన కోపము వారి మీద రగులుకొనకూడదని భావించి ఆ బలి పీఠముపై ఆలాగు చెక్కించిరి. దాని చూచిన భక్త పౌలు ఆ తెలియబడని దేవుని గూర్చి ప్రచురించెదనని ప్రభువైన క్రీస్తును గూర్చి సువార్తను బోధించాడు. ఆ క్రమములోనే (ఏథెన్సు ప్రజలను పోలి) ఈనాడు విద్యావంతులు సహితం అమాయకత్వముగా భక్తి విధానమును కొనసాగిస్తున్నారు. వీరి అవివేకము ను చూచిన మహా మేధావి “తందై పెరియార్” కడవులై పడైత్తవనుం అందక్కడవుళై ఆరాధిక్కిరవనే ముట్టాల్” అని అన్నాడు. అట్లనగా “దేవుని సృజించినవాడు, ఆ దేవుని పూజించువాడే బుద్ధిహీనుడు” అని అర్ధము. ఈయన ఒక సభలో ఈలాగు మాటలాడి యింటికి వెళ్ళి పోయాడు. ఉదయం మేకొ చూచే సరికి ఏథెన్సు ప్రజలను పోలి బహు దేవుళ్ళను ఆరాధించువారు ఆయన యింటిని ముట్టడించియున్నారు. వీరిని చూచిన “తందైపెరియార్” నెమ్మదిగా పలుకరించి ఏంటి యింత ఉదయాన వచ్చి యున్నారని అడిగారు. అందుకు వారు రాత్రి కాలమందు సభలో మీరేమన్నారు? దేవుడు లేడు, దేవుని పూజించువాడు బుద్ధిహీనుడని అన్నారే మరి ప్రపంచములో కోట్లాది మంది దేవునిపై నమ్మకము కలిగి ఆరాధిస్తుండగా అంతమంది మీ దృష్టిలో బుద్ధిశూన్యులా? అని ప్రశ్నించినందుకు ఆయన అన్నారు – నా మాటల్ని మీరు అపార్ధము చేసికొని యున్నారు. “దేవుని సృజించినవాడు ఆ దేవుని పూజించువాడే బుద్ధిహీనుడని” చెప్పానని అనినందులకు వారు మరల ఆవేశపరులు కాగ, ఆయన వారిని ఈలాగు అడిగాడు. దేవుడు మనుష్యులను చేసాడా? మనుష్యుడు దేవుని చేసారా? వెంటనే వారు – దేవుడే మనుష్యులను ఈ సృష్ఠిని చేసాడని జవాబిచ్చారు. అప్పుడాయన – నేను అదే అన్నాను దేవుని సృజించిన వాడు అనగా మనుష్యుడు చమత్కారముగా తన చేతులతో మలచి వాటికి దేవుడు అని పేరు పెట్టి వారి చేతులతో సృజించిన వాటినే పూజించుచుండగా అట్టి వారిని బుద్ధిహీనులని అన్నాను. కావున మనుష్యుడు సృజించిన వాటిని పూజింపక, మిమ్మును పుట్టించిన వాడు ఎవడని తెలిసికొని పూజింపుడని చెప్పానని ఆయన అన్నప్పుడు వారందరూ మారు మాట్లాడకుండ మౌనులైనారు. 

      నిర్మించిన నిజ దేవుడు ఎవరని శాస్త్రీయంగా కనిపెట్టగలమని పరిశోధించి చూచినపుడు జర్మని దేశానికి చెందిన Dr. H.V. హవీట ఈలాగన్నాడు. మానవుడు శ్వాసించునపుడు రెండు అక్షరముల ధ్వని వస్తోంది. శ్వాసను పీల్చినపుడు “ఈ” అనియు విడుచునపుడు “షు” అనియు ధ్వనించుచున్నవి. అనగా నరుని నాసికలోని శ్వాస “ఈషు” అను ధ్వని నిస్తుందని శాస్త్రీయంగా నిర్ధారణ చేసాడు. “ఈషు” అనగా నే(మి)వరు? యేసు యొక్క నిజమైన పేరు అసలు పెట్టబడిన పేరు “ఈషు” సిలువలో కనిపించే INRI లో మొదటి “I” ఈషు అనబడు ఆయన పేరును సూచించుచున్నది. తర్జుమా చేయువారు పేర్లను కూడ తర్జుమా చేసారు. JESUS అనియు, యేసనియు, ఇయేసు (తమిళ్) అనియు, ఈసా అనియు తర్జుమా చేసినారు. ఏది ఏమైనను ఏసు అను “ఈషు” నామమే ప్రతి నాసికలో ప్రతిధ్వనిస్తోంది. కావున ఈయన (యేసు)ను నీ వద్దనుకొంటే ఆయన పేరు నీలో లేకుండ చేసికొనుము. ఆయన పేరు నీలో లేకుండ చేయాలనుకుంటే నీ నాసిక రంధ్రములను బిగించి వెయ్యాలి. అట్లయిదు నిమిషాలు చేసావంటే? మన్నయినదే మరల మన్నైపోవునన్న వాక్యము నీ యెడల త్వరగా నెరవేరుతుంది. శాస్త్రీయంగా పరీక్షించి సత్యాన్ని అన్వేషించిన మీదట ఆలోచించుటెందుకు! యేసే ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుము నీవు రక్షింపబడుదువు.


ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.. క్లిక్ హియర్ 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted