Daniel – దానియేలు గ్రంథ వివరణ – Daniel Bible Books Explanation in Telugu

దానియేలు గ్రంధం.

Daniel Bible Books Explanation in Telugu

ఎవరికి వ్రాయబడింది?   సమస్త దేవుని ప్రజలకు మరియు బబులోనులో ఖైదీలుగా నున్నవారందరికీ. 

  బైబిలులో నాలుగో వంతు గ్రంథాలు ప్రవచనాత్మకమైనవి. వాటియందు భవిష్యత్తులో జరుగబోయే విషయాలను గూర్చి వ్రాయబడ్డాయి. ఈ ప్రవచనాలు ఆ కాలంలోజరిగే వాటినే గాక, 1/5వ భాగం – జరుగబోయే వాటిని గూర్చి చెప్పబడ్డాయి. అందులో ఎక్కువ భాగం ఆ గ్రంథాలు వ్రాయబడిన తదుపరి కాలంలో నెరవేర్చబడ్డాయి. ఇంకా నెరవేర్చబడవలసినవి చాలా ఉన్నాయి. అలాంటి గ్రంథాలలో దానియేలు గ్రంథం ఒకటి! 

  తెలుగు అనువాదంలోను, ఆంగ్లంలోను, సెప్టూజెంట్లోను మరియు వల్గేటులోను దానియేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం తర్వాత అమర్చబడింది. కాని హెబ్రీయుల లేఖనమైన “తనక్”లో ఎస్తేరు ఎజ్రా గ్రంథాల మధ్య దానియేలు గ్రంథం సమకూర్చబడింది. తనకు మూడు భాగాలుగా విభజిస్తారు. 1. తోరా (పంచ కాండాలు) 2. నెవియిమ్ (ప్రవక్తలు), 3. కెతూవిమ్ (దివ్యరచనలు) 

  దానియేలు గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఆ కాలము నాటి చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే దానియేలు కాలములో జరిగిన సంఘటనల వివరణలు మనం తెలుసుకోవచ్చు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు గల రెండవ భాగంలో – రాబోవు సంఘటనల యొక్క ప్రవచనాత్మకమైన సంగతులకు ప్రాధాన్యత ఇవ్వబడింది. Daniel Bible Books Explanation in Telugu

  దానియేలు 7:1,2 ప్రకారం దానియేలే ఈ గ్రంథ రచయిత. దానియేలు రాజవంశస్తుడు (దాని. 1:3,6). అతడు జ్ఞాన వివేకాలు కలిగిన సౌందర్యవంతుడు (దాని. 1:4). కోరేషు ఏలుబడిలో 3వ సంవత్సరం వరకు జీవించినవాడు ఈ దానియేలు (దాని. 10:1). క్రీ.పూ. 605లో బహుశ దానియేలు 12 నుంచి 16 సంవత్సరాల వయస్సులో బబులోనుకు చెరపట్టబడ్డాడు. అంటే 80 సంవత్సరాలకు పైగా జీవించాడు. 

  దానియేలు రాజైన హిజ్కియా వంశస్తుడని జోసీఫస్ అనే చరిత్రకారుడు రాశాడు. 2రాజులు 20:18లోని ప్రవచనం నెరవేరునట్లు అతడు బబులోనుకు కొనిపోబడ్డాడు. అతనితోపాటు హనన్య (షద్రకు), మిషాయేలు (మేషాకు), అజర్యా (అబెద్నెగో) లు బానిసలుగా బబులోనుకు కొనిపోబడ్డారు. ఇశ్రాయేలు ప్రాంతం యొక్క రాజ్య పరిపాలనలో ఉపయోగించుకోడానికి వారికి పరిపాలనా పద్ధతులను మెళకువలను, మరి ముఖ్యంగా కల్దీయ భాషా సంస్కృతిని నేర్చుకోవడానికి మూడు సంవత్సరాల తర్భీతు ఇవ్వబడింది. నెబుకద్నెజరు చక్రవర్తి వారికి సమృద్ధియైన రాజులు తినే ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చినప్పటికీ, దానియేలును అతని స్నేహితులును ధర్మశాస్త్రంలో నిషేధింపబడిన ఆహారమును, అన్యదేవతలకు బలి అర్పించబడిన మాంసమును తినకూడదని తీర్మానించుకున్నారు. మూడు సంవత్సరముల అనంతరం వారు తమ కోర్సులో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై రాజు యెదుట జరిగిన ఇంటర్వ్యూలో చక్రవర్తి మెప్పు పొందారు (దాని. 1:18-20). యోసేపు వలె కలల భావం చెప్పడంలో దానియేలు దిట్ట. 

  నెబుకద్నెజరు తర్వాత వచ్చిన “మెరోదాక్” రాజుకాలంలో దానియేలుకు అంతగా గుర్తింపు లేకుండా పోయింది. తర్వాత నెబుకద్నెజరు కుమార్తెయైన “నిటోక్రిస్” యొక్క కుమారుడైన బెల్షస్సరు పరిపాలన చివరిలో తిరిగి గుర్తింపు పొందాడు (దాని. 5:12). బబులోను రాజ్య పతనం తర్వాత – మదీయ, పారశీక రాజ్యంలో ప్రధానమంత్రిగా నియమింపబడ్డాడు (దాని. 6:2). పరస్పరం కలహించుకుంటూ శత్రువులైన బబులోను మాదీయ పారశీక రాజుల మన్నన పొందడం దేవుడు దానియేలుకు ఇచ్చిన కృప. 

  యూదులు తమ దేశానికి తిరిగి వెళ్లవచ్చుననే ఆజ్ఞ కోరేషు ఇవ్వడంలో దానియేలు పాత్ర తప్పక ఉండే ఉంటుంది. స్పెయిన్ దేశానికి చెందిన యూదా రబ్బీ బెంజమిన్ క్రీ.శ. 1160 నుంచి 1173 వరకు ఐరోపా, ఆసియా, ఆఫ్రికా దేశాలు పర్యటించాడు. ఆయన వ్రాసిన పుస్తకం 1543వ సంవత్సరంలో ముద్రింపబడింది. దీని ప్రకారం కుజెస్తాన్ (బైబిల్లోని ఏలాము ప్రాంతం) నుంచి 4 మైళ్ల దూరంలో సుసాను పట్టణం, అహష్వేరోషు రాజభవన శిధిలాలు ఉన్నాయని అక్కడ దానియేలు సమాధి ఉందని, దానిని తాను దర్శించానని రాశాడు. దానిని యూదులూ ముస్లిమ్లూ పవిత్రంగా పరిగణించేవారని చెప్పాడు. చరిత్రకారుడైన జోసీఫస్ రాతల ప్రకారం – మాదీయ ప్రాంతంలోని “ఎక్బతాన” ప్రాంతాలలో “దేవుని ప్రియుడు” అన్న బిరుదుతో ఒక సుందరమైన స్మారక స్థూపం దానియేలు కొరకు నిర్మించబడినట్లుగా చెప్పాడు. 

  దానియేలు గ్రంథం రెండు భాషలలో రాయబడింది 1. దానియేలు 1:1 నుంచి 2:4 (ఎ) వరకు మరియు 8 నుంచి 12 అధ్యాయాలు హెబ్రీ భాషలో రాయబడ్డాయి. 2. దానియేలు 2:4 (బి) నుంచి 7:28 వరకు అరామిక్ భాషలో వ్రాయబడింది. దానియేలు కాలంలో అరమేయిక్ భాష ప్రపంచ వ్యాప్తంగా – ముఖ్యంగా వర్తకులచే వాడబడిన భాషగా గుర్తింపు పొందినది. Daniel Bible Books Explanation in Telugu

దానియేలు గ్రంథంలో రెండు అంశాలున్నాయి. 

మొదటి అంశం ఏమిటంటే – ప్రపంచ రాజ్యాల విషయంలో దేవుని ప్రణాళిక! ఆ ప్రణాళిక దానియేలు 2:4 (బి) నుంచి 7:28 వరకు గల భాగంలో రాయబడి వుంది. అందుకే ప్రపంచ వాణిజ్య మరియు లౌకిక భాషయైన అరమేయిక్లో అది వ్రాయబడింది. 

రెండవ అంశము ఏమిటింటే – ప్రపంచ రాజ్యాలపై ఇశ్రాయేలు ప్రభావం! ఈ అంశం దానియేలు 1:1 నుంచి దానియేలు 2:4 (ఎ) వరకు మరియు దానియేలు 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు రాయబడింది. 

  ఈ గ్రంథంలోని ఐక్యత బహు సుందరమైనది. వేర్వేరు భాషలు వాడబడినా, వేర్వేరు రాజ్యాల ప్రస్తావన ఉన్నా, దేవుని ప్రణాళిక అనే అంశం అన్నింటా ఒక పూలదండలో దారం లాగా కలుపుతోంది. దేవుడు సార్వభౌముడు, అన్ని పరిస్థితులపై, అన్ని రాజ్యాలపై అధికారం గలవాడుగా ఈ గ్రంథం చిత్రీకరిస్తోంది. ఆయన సార్వభౌముడుగా అబ్రహాము మరియు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నిబంధనలను కాపాడువాడుగా దానియేలు గ్రంథం బోధిస్తోంది! Daniel Bible Books Explanation in Telugu

ఒకసారి ఈ దానియేలు గ్రంథరచనకు దారితీసిన నేపథ్యాన్ని కూడా ఆలోచిద్దాం! 

అష్షూరు రాజ్యం యొక్క పట్టణమైన నీనెవె మరియు మాదీయ ప్రాంతాలు క్రీ.పూ. 612వ సంవత్సరములో బబులోను వారికి వశమయ్యాయి. అప్పుడు కొందరు అష్షూరీయులు అష్షూరు బాలిత్ అనేవాని నాయకత్వంలో పశ్చిమాన ఉన్న హారాసుకు వెళ్లి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అప్పుడు బబులోను రాజైన నెబోప్లాస్సర్ మాదీయుల సహాయం తీసుకొని అష్షూరీయులను వెంటాడాడు. అప్పుడు అష్షూరీయులు హారానును బబులోను వారికి వదిలేసి ఇంకా పశ్చిమానికి వెళ్లిపోయారు. అంటే యూఫ్రటీసు నదివైపు పారిపోయారన్నమాట! 

  అష్షూరీయులు అవమానంతో కృంగిపోయారు. దాంతో మరల బబులోను వారిమీదికి ఎదురుదాడికి దిగాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు అష్షూరీయులు ఐగుప్తు రాజైన రెండవ ఫరో నెకోను సహాయం అర్థించారు. ఫరోనెకో ఓ.కే. అన్నాడు. అతడు అష్షూరీయులను కలవడానికి వెళ్తుండగా యూదా రాజైన యోషీయా – బబులోను వారి మెప్పు పొందడానికీ ఫరోనెకోను మెగిద్దో వద్ద అడ్డగించాడు, కాని ఓడిపోయాడు (2రాజులు 23:28-30, 2దిన. 35:24). 

  అప్పుడు ఫరోనెకో అష్షూరీయులతో కలిసి హారాను దగ్గర బబులోనీయులను ముట్టడించాడు – అక్కడ జరిగిన ఘోర యుద్ధములో ఫరోనెకో ఓడిపోయాడు. అప్పటి నుంచీ ఐగుప్తు వారికిని, బబులోను వారికిని పోరాటం కొనసాగుతూ వచ్చింది. 

  క్రీ.పూ. 605లో బబులోను రాకుమారుడైన నెబుకద్నెజరు కర్కెమీషుయొద్ద ఐగుప్తీయులతో తలపడి క్రీ.పూ. 605వ సంవత్సరంలో మే – జూన్ నెలల్లో ఓడించి సిరియా, పాలస్తీనా వైపుకు కదిలాడు. ఆ విధంగా యూదా రాజ్యం నెబుకద్నెజరుతో యుద్ధానికి తలపడ వలసి వచ్చింది. 

  ఈ లోగా రాజైన నెబోప్లాస్సర్ చనిపోయాడు. అప్పుడు నెబుకద్నెజరు బయట యుద్దాలతో తలమునకలై యున్నాడు. వెంటనే అతడు ఈ మరణవార్త తెలుసుకొని బబులోనుకు వెళ్లి రాజుగా అభిషేకింపబడి యూదా రాజ్యంపైకి దండెత్తడానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలోనే దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నగోలను బందీలుగా తీసుకునివెళ్లాడు. తర్వాత అతడు బబులోనుకు వెళ్లి 43 సంవత్సరాలు రాజ్యం చేశాడు. 

  క్రీ.పూ. 597వ సంవత్సరంలో యెహోయాకీము తిరుగుబాటు చేశాడు. అప్పుడు నెబుకద్నెజరు వెళ్లి తిరుగుబాటుని అణచివేసి పదివేలమందిని బందీలుగా తీసుకువెళ్లాడు. వారిలో ప్రవక్తయైన యెహెజ్కేలు కూడా ఉన్నాడు (యెహెజ్కేలు 1:1-3, 2 రాజులు 24:8,20, 283. 36:6-10). 

  క్రీ.పూ. 586లో మూడవసారి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి, పట్టణ ప్రాకారాలను కూల్చివేసాడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని, పట్టణాన్ని నేలమట్టం గావించాడు. అనేకమంది యూదులు చనిపోయారు. మిగిలినవారు బానిసలుగా బబులోనుకు చెరలోనికి వెళ్లిపోయారు (2రాజులు 25:1-7, యిర్మీయా 34:1-7; 39:1-7; 52:2-11). Daniel Bible Books Explanation in Telugu

  క్రీ.పూ. 539లో – మాదీయ పారశీక చక్రవర్తియైన కోరేషు బబులోనును ఓడించాడు. తన సామ్రాజ్యమును ఏర్పాటు చేశాడు. కోరేషు చక్రవర్తి తన రాజ్యములో నున్న పరదేశులైన యూదులను తమ దేశానికి వెళ్లడానికి అనుమతించాడు. ఆ విధంగా క్రీపూ. 538 సంవత్సరంలో 50,000 మంది యూదులూ ఎజ్రా నాయకత్వంలో తమ దేశానికి వెళ్లి దేవాలయమును నిర్మించుకున్నారు (2దిన. 36:22-23, ఎజ్రా 1:1-4). ఇది దానియేలు ప్రార్థనకు దేవుడు చేసిన కార్యమై యున్నది దాని 9:4-19). దేవాలయము క్రీ.పూ. 515వ సంవత్సరంలో పూర్తయింది. మొదట నెబుకద్నెజరు క్రీ.పూ. 605లో యూదాను ముట్టడించాడు. క్రీ.పూ. 536లో యూదావారికి వచ్చిన విడుదల వరకు 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆ విధంగా యిర్మీయా 25:11-12లో దేవుడు పలికిన ప్రవచనం అక్షరాల నెరవేరింది. 

  లేఖనాలలో ప్రతీ అంశానికి సంబంధించిన ఒక జతపక్షి ఉంటుంది (యెషయా 34:16, 28:13). అలాగే దానియేలు గ్రంథానికి కూడా జతపక్షి లాంటి గ్రంథం ఒకటుంది. అది ప్రకటన గ్రంథం. ఈ రెండు గ్రంథాలకు ఆశ్చర్యకరమైన పోలికలు మనం చూడొచ్చు.

 1. దానియేలు గ్రంథం ప్రవచన గ్రంథం!

             – ప్రకటన గ్రంథము కూడా ప్రవచన గ్రంథం! 

 1. పాత నిబంధనలో దానియేలు

          27వ పుస్తకం! – క్రొత్త నిబంధనలో ప్రకటన 27వ పుస్తకం! 

 1. దానియేలు 1వ అధ్యాయంలో పది దినములు పరీక్ష కలదు!

           – ప్రకటనలో కూడా 2వ అధ్యాయంలో పది దినముల శ్రమ కలదు! 

 1. దానియేలు 2,7 అధ్యాయాలలో నాలుగు రాజ్యములను గూర్చి కలదు!

           – ప్రకటన 13:1,2లో నాలుగు రాజ్యాలను గూర్చి కలదు! 

 1. దానియేలు 2:44లో “క్రీస్తు రాజ్యము” గూర్చి చెప్పబడింది!

          – ప్రకటన 11:15లో కూడా “క్రీస్తురాజ్యము”ను గూర్చి చెప్పబడింది!

 1. దానియేలు 3వ అధ్యాయంలో ప్రతిమకు మ్రొక్కని వారిని అగ్నిగుండంలోపడేసారు!

           -ప్రకటనలో ప్రతిమకు మ్రొక్కనివారు శిరచ్ఛేదనం చేయుట కలదు-13:14,15. 

 1. ప్రతిమకు మ్రొక్కని యూదులు కలరు – దానియేలు 3:17,18.

            – ప్రకటనలో కూడా యూదులు ప్రతిమకు మ్రొక్కలేదు – 14:12. 

 1. దానియేలులో బబులోను నాశనం గూర్చి రాయబడింది – 5వ అధ్యాయం

           – ప్రకటనలో బబులోను కూలిపోవుటను గూర్చిన వివరణ ఉంది18వ అధ్యాయం.

 1. దానియేలును హింసించగా, దేవుడు కాపాడిన విధం ఉన్నది – 6వ అధ్యాయం. 

              – ప్రకటనలో ఘటసర్పము ఇశ్రాయేలును హింసించగా దేవుడు కాపాడిన  విధము ఉంది . 12వ అ॥ 

 1. నాలుగు మృగములు గూర్చి రాయబడింది – దానియేలు 7వ అధ్యాయం.

           ఒకే మృగములో నాలుగు పోలికలు ఉన్నాయి – ప్రకటన 13:1,2. 

 1. దానియేలులో క్రూరముఖము గలవాని గూర్చి రాయబడి ఉంది – 8:23

           – ప్రకటనలో కూడ క్రూరమృగము గూర్చి చెప్పబడింది – 13:19

 1. దానియేలులో 70 వారములను గూర్చి రాయబడింది – 9:24,25.

        – ప్రకటన 70వ వారమును గూర్చిన బోధతో నిండియుంది.

 1. దానియేలులో క్రీస్తు ప్రత్యక్షతను గూర్చి రాయబడింది – 10:5-9.

       – ప్రకటనలో పునరుత్థాన క్రీస్తు ప్రత్యక్షత గూర్చి చెప్పబడింది – 1:9-20. 

 1. దేవున్ని యెరిగినవారు గొప్ప కార్యములు చేయుదురని ఉంది – దాని. 11:32. 

         – దేవుని సాక్షులు గొప్ప కార్యములు చేసినట్లు ప్రకటన చెప్తుంది 11:3-13.

 1. సార్వత్రిక పునరుత్థానములను గూర్చి ప్రవచించబడింది – 12:1,2.

         – ప్రకటనలో కూడా పునరుత్థానములను గూర్చి ప్రవచించబడింది– 20:5,6.

 1. గ్రంథము ముద్రింపబడినట్లు రాయబడింది – 12:4

          – ప్రకటనలో గ్రంథము విప్పబడిన విషయం రాయబడింది-5:1-5, 22:10.

 1. ప్రకటన గ్రంథమునకు తాళపు చెవి – దానియేలు గ్రంథం!

         – దానియేలు గ్రంథమునకు తాళపు చెవి – ప్రకటన గ్రంథము! 

  దానియేలు అను పేరుకు దేవుడు న్యాయాధిపతి అని అర్థం. దానియేలును గూర్చి మనకు తెలిసినదంతా ఈ గ్రంథం నుంచే మనం నేర్చుకుంటాం. యెహెజ్కేలు 14:14-20ని పోల్చి చూడండి. దానియేలు రాజైన హిజ్కియా వంశస్తుడని 2 రాజులు 20:17, 18 మరియు యెషయా 39:6,7 వచనాలను బట్టి అనేకమంది బైబిలు పండితులు అభిప్రాయపడుతున్నారు. 

  యెరూషలేములో ఉన్నత కుటుంబానికి చెందినవాడై యుంటాడు (దాని. 1:3-6). ఎందుకంటే నెబుకద్నెజరు తన రాజాస్థానంలోకి సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారిని ఎంచుకొనడు (దాని. 1:4,17). రాజాస్థానంలో పని చేయాలంటే ఆ దినాలలో సాధారణంగా ఒక వ్యక్తిని నపుంసకుడిగా మార్చేవారు. 2రాజులు 20:18, దానియేలు 1:3ను బట్టి దానియేలును మరియు అతని ముగ్గురు స్నేహితులను బబులోనులో నపుంసకులుగా చేసి ఉంటారు అనేది అనేకమంది బైబిలు పండితులు నమ్ముతున్నారు. మత్తయి 19:12ను కూడా మీరు చదవగలరు. Daniel Bible Books Explanation in Telugu

దానియేలు జీవితంలో మూడు ప్రాముఖ్యతలను మనం గమనించవచ్చు. 

 1. దానియేలు ఒక ఉద్దేశ్యం గల వ్యక్తి. దేవుని వాక్యానికి విధేయత

            చూపించాలన్నదే అతని ప్రధానమైన ఉద్దేశం (దాని.1:8,6:10, 1యోహాను 3:3) 

 1. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు (దాని. 2:17 – 23, 6:10, 9:3 – 19)

            అతని ప్రార్థన ముందు రాజుల శాసనాలు పనిచేయకుండా వీగిపోయాయి. 

 1. దానియేలు ప్రవచించేవాడై యున్నాడు. దానియేలు ప్రవచనాలన్నిటిని ఒక మనిషి యొక్క అస్థిపంజరానికి పోలిస్తే, 2వ అధ్యాయంలోని ప్రతిమ మరియు 7వ అధ్యాయంలోని జంతువులను గూర్చిన ప్రవచనాలు వెన్నెముక లాంటివి. 9వ అధ్యాయంలోని 70 వారాలను గూర్చిన ప్రవచనం వెన్నెముకలో చక్కగా అమర్చబడిన ప్రక్కటెముక ల్లాంటివి.

 దానియేలూ – యోసేపు మరియు ఎస్తేరులాగ ఒక సంకల్పం ప్రకారం, దేవుని మహిమార్థం బబులోను చెఱకు ముందుగా పంపబడ్డాడు. 

  మానవ చరిత్ర అంతటిలో దేవుడు చేసిన అద్భుతాలను బైబిల్లో 5 కాలాలుగా విభజించి చెప్పడం జరిగింది. అందులో దానియేలు గ్రంథం 3వ స్థానాన్ని వహించింది. 

 1. మోషే మరియు యెహోషువల కాలం
 2. ఏలీయా మరియు ఎలీషాల కాలం
 3. దానియేలు కాలం.
 4. క్రీస్తుయొక్క కాలం.
 5. క్రీస్తుయొక్క అపొస్తలుల కాలం (ఆదిమ సంఘ కాలం)Daniel Bible Books Explanation in Telugu

  దానియేలు గ్రంథం బైబిలులోని ఇతర గ్రంథాలన్నీ అర్థం చేసుకోడానికి సహాయపడుతుంది. దానియేలు గ్రంథానికి వేరుగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దేవుని సార్వత్రిక, సార్వభౌమత్వాన్ని తెలిపే ఈ గ్రంథంలో ప్రవచనాలు చరిత్రతో పాటు కలిపి అల్లినట్లుగా ఉంటాయి. అంతమాత్రమే గాక అన్యుల కాలం గూర్చి (దాని.12:4, లూకా 21:24); అంత్యకాలం గూర్చి (8:17); క్రీస్తు విరోధిని గూర్చి పాత నిబంధనలోని మరే గ్రంథంలోను చెప్పబడనంత వివరంగా దానియేలు గ్రంథంలో రాయబడింది. 

  దానియేలు గ్రంథం ఆత్మీయ విషయాలనే గాక, నేటి ప్రపంచ రాజకీయ వ్యవస్థను కూడా వివరిస్తోంది. “ప్రపంచాన్ని ఎవరు ఏలుతారు?” అనే ప్రశ్నకు ఈ గ్రంథం జవాబిస్తోంది. డా॥జి. క్యాంప్బెల్ అనే బైబిలు పండితుడు ఈ గ్రంథ సారాంశాన్నంతా – “ఈ లోక ప్రభుత్వంలో దేవుని స్థిరమైన ప్రభుత్వం” అని వర్ణించాడు. 

దేవుని రాజ్యం, వెయ్యేండ్ల పాలన, శాశ్వత భవిష్యత్తును గూర్చి తెలిపే ఈ గ్రంథం ఈ ప్రపంచం యొక్క భవిష్యత్ స్థితికి అద్దం పట్టినట్లుగా చూపిస్తోంది. 

  దానియేలు గ్రంథాన్ని రెండు ప్రధాన భాగాలు చేయవచ్చు అని మనం చెప్పుకున్నాం. మొదటి భాగంలో చరిత్రకు సంబంధించిన అంశాలు వెలుగు చూస్తాయి; రెండవ భాగంలో ప్రవచనాత్మక అంశాలు వెలుగు చూస్తాయి. ఈ రెండు భాగాలను – “ప్రవచన వెలుగుతో కూడిన చారిత్రాత్మక రాత్రి” మరియు “చారిత్రాత్మక రాత్రిలో ప్రవచనాత్మక వెలుగు” అని కూడా బైబిల్ స్కాలర్స్ వర్ణిస్తారు. 

  1వ అధ్యాయంలో – యూదా రాజ్యం క్షీణించిపోవడం, యెరూషలేము పతనం కావడం, దానియేలు అతని స్నేహితులూ బబులోనుకు కొనిపోబడడం చూస్తాం. తమ జీవితంలో దేవుడు లేనివారు విచ్చలవిడిగా ఆహార పదార్థాలు తింటూ, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో దానియేలూ అతని బృందం వాటిని తృణీకరించి తమ ప్రతిష్టతను కాపాడుకున్నారు. త్రాగుబోతులూ తిండిబోతుల మధ్య దేవుని బిడ్డల నిషే గెలిచింది (దాని. 1:8-15). 

2వ అధ్యాయంలో – బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి లోహాలతో కూడిన ప్రతిమ నెబుకద్నెజరు కలలోకి రావడం… దానియేలు ఆ కలకు భావం చెప్పడం ఇందులో రాసి ఉంది. ప్రపంచాన్ని ఏలే ప్రపంచ ప్రభుత్వాలను గూర్చిన వివరణ ముందే దేవుడు తెలియజేశాడు. కలభావం చెప్పడంతో విగ్రహారాధనకు సంబంధించిన మంత్రగాండ్లకూ – దైవజ్ఞానానికీ మధ్య తలెత్తిన ఘర్షణలో దైవజ్ఞానం గెలవడం మనం చూస్తాం. Daniel Bible Books Explanation in Telugu

3వ అధ్యాయంలో – తన రాజ్యంలోని అందరూ తన ప్రతిమకు సాగిలపడాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ బంగారు ప్రతిమకు మ్రొక్కనందున ముగ్గురు హెబ్రీ యువకులను అగ్నిగుండంలో పడేసాడు. దేవుని పట్ల తమ భక్తి జీవితానికి వ్యతిరేకంగా విగ్రహారాధన ఆత్మ లేచి ఘర్షణకు దిగింది. ఆ ఘర్షణలో దేవుని పట్ల స్వామి భక్తే గెలిచింది (దాని. 3:1-30) 

4వ అధ్యాయంలో – గొప్ప వృక్షమును గూర్చిన నెబకద్నెజరు కల – దాని నెరవేర్పు మనం చూస్తాం. దేవుని సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా లేచిన నెబుకద్నెజరు అహమును అదరగొట్టి, పిచ్చివాన్ని చేసి, అడవులకు తరిమించి గడ్డిమేసే విధంగా దేవుడు చర్యలు తీసుకున్నాడు. ఈ పోరాటంలో అహం ఓడింది – దేవుని న్యాయవిధి గెలిచింది. 

5వ అధ్యాయంలో – దేవాలయం నుంచి తెచ్చిన పవిత్ర వస్తువులకు వ్యతిరేకంగా – ఒక త్రాగుబోతు రాజుయొక్క భక్తి రాహిత్యము బుసలు కొట్టి పడగ విప్పగా – గోడపై దేవుడు అతని తీర్పు రాసి, పదవీ భ్రష్టునిగా చేశాడు. ఇందులోను దేవుని మారని నియమాలే విజయాన్ని సాధించాయి. 

6వ అధ్యాయంలో – మాదీయుడైన దర్యావేషును పూజించాలన్న ఆజ్ఞ చేయబడింది. దానియేలు సింహపు బోనులో వేయబడ్డాడు. అసూయ పూరితమైన కుట్రలో తన బిడ్డల పట్ల దేవుని భద్రతే గెలిచింది. సింహాల నోళ్లు మూయబడ్డాయి. శత్రువులు సింహాల కడుపులోకి వెళ్లిపోయారు. 

7వ అధ్యాయంలో – అన్యుల కాలములోని నాలుగు రాజ్యాలకు సంబంధించిన దానియేలు దర్శనం యొక్క వివరం ఉంది. నాలుగు మృగాలు – అనగా, బబులోను, మాదీయ పారశీక, గ్రీకు మరియు రోమ్ అనే మహా సామ్రాజ్యాలు గూర్చి మనం అర్థం చేసుకోవచ్చు. వీటి వెంటే మెస్సీయ రాకడ దర్శనం ఉన్నది. 

8వ అధ్యాయంలో – గొట్టెపిల్ల, మేకపోతు మరియు చిన్న కొమ్మును గూర్చిన దానియేలు దర్శనం ఉంది. మాదీయ పారశీక, గ్రీకు రాజ్యముల చరిత్ర ఒక మృగం ప్రత్యక్షముతో కనిపిస్తోంది. 

9వ అధ్యాయంలో – దానియేలు ప్రార్థన, మెస్సీయ రాకడ సమయం గూర్చిన ప్రవచనం ఉన్నది. 70 వారములను గూర్చిన అద్భుతమైన ప్రవచనం అంత్యకాలము వరకు పొడిగించబడిన వైనం సుందరంగా కనిపిస్తుంది. Daniel Bible Books Explanation in Telugu

10వ అధ్యాయంలో – దానియేలు దర్శనం నిమిత్తం – ప్రార్థన ద్వారా సిద్ధపరచబడిన సంగతి కలదు. పరలోక దూత యొక్క ప్రత్యక్షత కూడ ఇందులో రాయబడి ఉంది. 

11వ అధ్యాయంలో – చిన్న కొమ్మును సూచించే పారశీకులూ గ్రీకులను గూర్చిన చారిత్రాత్మక ప్రవచనమూ అద్భుతంగా వర్ణించబడింది. క్రీస్తు విరోధిని సూచించే మరో చిన్న కొమ్ము వృత్తాంతము కూడా రాయబడింది. 

12వ అధ్యాయంలో – రాబోవు దినాలలో ఇశ్రాయేలును గూర్చిన వివరాలు మహాశ్రమలూ, పునరుత్థానమూ, బహుమానాలూ, అంత్య దినాలను గూర్చిన తుది పలుకులు చర్చించబడ్డాయి. Daniel Bible Books Explanation in Telugu

గ్రంథ విభజన

దానియేలు – చారిత్రక నేపధ్యం – 1:1-21

 1. బబులోను చెఱకు వెళ్లిన దానియేలూ అతని స్నేహితులు…. 1:1-7
 2. బబులోనులో దానియేలూ అతని స్నేహితుల యొక్క ప్రతిష్ట……1:8-16
 3. రాజ ఆస్థానంలో దానియేలుకూ అతని స్నేహితులకు పదోన్నతి..1:17-21

రాజ్యాలపైన దేవుని సార్వభౌమాధికారమును గూర్చి దానియేలు సందేశం– 2:1-7:28 

 1. నెబుకద్నెజరుకు వచ్చిన ప్రవచనాత్మక స్వప్నం – దాని భావాన్ని చెప్పిన దానియేలు ….. 2:1-49
 1. బంగారు ప్రతిమ – మండుతున్న అగ్నిగుండం…. 3:1-30
 2. నెబుకద్నెజరు యొక్క కల-దాని నెరవేర్పు …… …. 4:1-37 
 3. బెల్షస్సరు విందు – బబులోను పతనం… 5:1-31
 4. ప్రార్థించే దానియేలు – సింహముల గుహలో దూత… 6:1-28
 5. నాలుగు సామ్రాజ్యాలు – మహావృద్దుని గూర్చి దానియేలుకు వచ్చిన స్వప్నం… 7:1-28

III. ఇశ్రాయేలు రాజ్యాన్ని గూర్చి దానియేలుకు కలిగిన దర్శనాలు – 8:1-12:13 

 1. పొట్టేలు, మేకపోతు, చిన్న కొమ్ములను గూర్చి దానియేలుకు కలిగినదర్శనం …..8:1-27 
 1. పునరుద్ధరణకై దానియేలు విజ్ఞాపన – 70 వారాలను గూర్చినదర్శనం – 9:1-27 
 1. ఇశ్రాయేలు భవిష్యత్తును గూర్చి దానియేలుకు కలిగిన దర్శనం 10:1-12:13 

ఎ. దేవుడు దానియేలుకు బయలుపర్చిన సత్యం, అతన్ని దర్శించిన దూత    ……. 10:1-11:1 

బి. పర్షియా, గ్రీసును గూర్చిన ప్రత్యక్షత …. 11:2-4 

సి. ఐగుప్తు, సిరియాను గూర్చిన ప్రత్యక్షత….. 11:5-35 

డి. దేశాలను గూర్చి, రానున్న క్రీస్తు విరోధిని గూర్చి కలిగిన ప్రత్యక్షత.. 11:36–45 

ఇ. అంత్య దినాల సంఘటనలపై ప్రవచనాత్మక ప్రత్యక్షత….. ….. 12:1-13 

  అన్య జనముల మధ్య, బొత్తిగా దేవుణ్ణి ఎరుగని వారి మధ్య తమ విశ్వాసాన్ని, పరిశుద్ధతను, సాక్ష్యమును ఏ విధంగా భక్తులు కాపాడుకున్నారో ఈ దానియేలు గ్రంథం వివరిస్తోంది. ఎక్కడను, ఏ విధముగాను, లోకముతో రాజీపడకుండా తమ్మును తాము కాపాడుకొనిన భక్తులు ఎక్కడున్నను దేవుడు వారిని ఉన్నత స్థానాలపై ఉంచుతాడనే ఆత్మీయ దర్శనం ఈ గ్రంథమందు కనిపిస్తోంది. దేవుడు సర్వాధికారి – సార్వభౌముడు – ఆయన ఆధిపత్యము క్రింద సమస్తమును పనిచేస్తాయి అనే సుందర సత్యం విశ్వాసులమైన మనల్ని ఉత్తేజింపజేస్తుంది. ఏది ఏమైన ఈ గ్రంథం తెలియజెప్పేది ఏమిటంటే… “ఆయన నీ యెడల ఒక ఉద్దేశ్యం కలిగియున్నాడు” అనునదియే!! 


ప్రత్యక్ష గుడారం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి .. click హియర్ 

1 thought on “Daniel – దానియేలు గ్రంథ వివరణ – Daniel Bible Books Explanation in Telugu”

 1. ప్రైస్ ది లార్డ్ సార్
  మీరు పంపుతున్న ఈ అంశాలు చాలా ఆధ్యాత్మికంగా ఉపయోగకరంగా ఉన్నాయి తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  Reply

Leave a comment

error: dont try to copy others subjcet.