Christian Telugu Messeage – ధేవుని సంతోషం

Written by biblesamacharam.com

Updated on:

ధేవుని సంతోషం 

Christian Telugu Messeage

….యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేనానందిచువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు” – యిర్మియా 9:24

 దేవుని బిడ్డలారా, మన యోగ్యతాయోగ్యతలను పట్టించుకోకుండా, నమ్మదగని స్థితిని చూసి కృపనుపసంహరించకుండా ఎన్నో అద్భుతకరమైన మేలులు చేస్తూ, దినదినము నూతనంగా పుట్టు కొచ్చే తన వాత్సల్యమును బట్టి సమయోచితమైన సహాయం చేస్తూ సియోను దరికి మనలను నడిపించుచున్న ప్రేమామయుడైన మన దేవున్ని మనం సంతోషపరచబద్దులమై యున్నాము గదా! అన్ని వేళలా అందరికీ అపరిమితంగా ఉపకారము చేయుచున్న మన దేవుడు మన నుండి ఏమి ఆశించుచున్నాడు అని అంటే ఇంతగా మన పట్ల విడువక కృప చూపుతూ కొన్ని నిర్ధిష్ట సమయాల్లో మేలు కొరకైన గాయములు చేస్తున్న ఆయన న్యాయశీలతను, మొత్తంగా ఆయన గుణాతిశయములను, ఆయన తత్వాన్ని, వైఖరినీ బహు జాగ్రత్తగా, అతి దగ్గరగా పరిశీలిస్తూ ఆయనను తెలుసుకొనుటను బట్టియే, ఎరుగుటను బట్టియే ఆయన ఆనందించువాడై యున్నాడట! ఆమెన్, హల్లెలూయా! గమనించావా ప్రియ చదువరీ, నీ వెవరిని నమ్మి సేవించుచున్నావో, వెంబడించుచున్నావో ఆ దేవున్ని నీవు సరిగా గ్రహించాలంట. పరిశీలనగా తెలసుకోవాలంట. అలా పరిశీలనగా తెలుసుకొనిన నీ గ్రహింపుతో నీ దేవున్ని బట్టి అతిశయించు వాడిగా నీవుండాలంట.అప్పుడే నీ దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఆమెన్! 

 నీవు నా దేవుని బట్టి నీయందు దేవుడు ఆనందించాలని అంటే అతిశయించవలెను. అలా అతిశయించాలంటే నీవు ఆయనను గ్రహించాలి, అర్ధంచేసుకోవాలి, తెలుసుకోవాలి, అందునిమిత్తమే ఆయనను, ఆయన భావాన్ని, స్పందనను, చర్యలను, నిర్ణయాలను, స్వభావమును, కార్యములను, పరిశీలించాలి, తద్వారా వ్యక్తిగతంగా, మరింత లోతుగా నీవు నీ దేవున్ని గ్రహించగలిగితే ఆయన యందు అతిశయిస్తావు. అప్పుడాయన నీయందు ఆనందిస్తాడు. సరిగ్గా ఈ కారణమును బట్టే భక్తులు లేదా విశ్వాసులు తమ దేవుణ్ణి మరింత దగ్గరగా, మరింత లోతుగా పరిశీలిస్తూ గ్రహింప మొదలు పెట్టవలెను. అసలు భక్త హృదయంలో తన ఆరాధ్య దైవము గురించి యింకా తెలుసుకోవాలి అనే తపన ఎంతో సహజంగానే పుట్టాలి. నాకోసమే దిగి వచ్చి, నాకై అన్ని చేసి, ప్రాణం పెట్టి, ఆత్మనిచ్చి, అనుక్షణం నడిపించుచున్న నా ప్రాణ ప్రియుని హృదయం నాకర్ధంకావాలి అనే పవిత్రమైన వాంఛే గనుక లేకపోతే అసలది భక్త హృదయమే కాదంటాను నేను. అయితే విచారకరమైన వాస్తవం ఏంటంటే, ఈనాటి క్రైస్తవ సమాజంలో పెక్కుమందికి అసలీ విధమైన తాపత్రయమే లేకపోవడం కనీసం అట్టి ఆలోచన కూడా రాక పోవడం ఎంతైనా దురదృష్టకరం! నిజానికి చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచిందే ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి అని 1 పేతురు 2:9లో లేఖనం ఘోషించుచుండగా నీవు ప్రచురించవలసిన విషయాలు నీకే తెలియకపోతే…. అసలు తెలుసుకోవాలనే లేకపోతే….ఇక నీ విషయమై ప్రాణం పెట్టిన ప్రియ ప్రభువు ఏం సంతోషిస్తాడు? ఎలా ఆనందిస్తాడు??

 నీవారాధించుచున్న దేవుని గురించిన లోతైన సదవగాహణ నీకు లేకపోతే దుష్టుడగు అపవాది సుళువుగా నిన్ను మోసం చేస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పడగొడతాడు. నీవు చీకటిలో నిలవాల్సిన దుస్థితికి దిగజారుస్తాడు. దరిమిలా నీవనుభవించే క్షోభకు వేరెవ్వరు కారణం కాకపోగా నీవే అవడం నిన్ను మరింత కందిస్తుంది. ఉదాహరణకు ఏదేను తోటలో ఆదాము ని పరిస్థితిని ఒకసారి ఆలోచిద్దాం! హవ్వ ఒంటరిగా విహరిస్తున్నప్పుడు అబద్ధికుడగు అపవాది ఆమె వద్దకు వచ్చి చెప్పిందేమిటి? వాడి ప్రధాన ఆరోపణ ఏంటి? ఏ మాత్రం పరిశీలనగా చూసినా యిట్టే కనిపించే వాస్తవం ఏమంటే – దుష్టుడు మన దేవుని వ్యక్తిత్వం పైనే దాడి చేయ (గోర)డం! ఆనాడు హవ్వతో అపవాది దేవునిపై ఆరోపణలు చేస్తూ – దేవుడు చెప్పినమాట అబద్దం అనీ, నిజానికి మీరు వృద్ధిచెందటం లేదా జ్ఞానం పొందడం దేవుని కెంత మాత్రము ఇష్టంలేదనీ, మీరెప్పుడూ కాలిక్రింద చెప్పులా వుండాలనేది ఆయన అభిమతం అనీ ఎడాపెడా ఆరోపించేస్తుంటే – వెర్రి మొహం వేసుకొని, గుడ్లప్పగించి, నోరెళ్ళబెట్టి ఆసాంతం అడ్డగోలు సోదంతా విని ఎడ్డిగొర్రెలా తలాడించి, తినేసింది, తినిపించేసింది. అసలు మీదేవుడు నిజం చెప్పలేదు, అబద్దం చెప్పారు, నిజంగా మీరు ఎదగాలనే ప్రేమ ఆయనకు లేదు అంటూ ఆయన వ్యక్తిత్వం మీద నీలాపనిందలు వేసేస్తోంటో ఏ మాత్రం యిబ్బంది పడకుండా హాయిగా ఆలకించి, నిజమేనేమోనని ఆయన వ్యక్తిత్తంపైనే అనుమానపడి ఏదెను అనగా సౌఖ్యమును పోగొట్టుకొని బ్రతుకంతా ‘వేదన’ గా మార్చేసుకున్న విషాదవైనానికి అసలైన కారణం ఏంటి? కేవలం ఆయనేంటో, ఆయన గుణమేంటో, వ్యక్తిత్వమేంటో అనే విషయంపై కనీస అవగాహన లేకపోవడమే! ఆయన ప్రేమామయుడనీ నా ఉనికికీ, యింతటి సౌఖ్యానికి కారణం ఆయన ప్రేమేననీ, తన స్వరూపంలో, తన పోలికలో నన్ను చేసికొని, తన ఆత్మనూది, తన మహిమతో కప్పి, తనతో గడపడానికీ దూతలందరినీ కాదని దిగివస్తూ వున్న దేవునికి నా మీద ప్రేమ లేకపోవడం ఏమిటి? ఆయన నా వృద్ధిని, ఎదుగుదలను కాంక్షించకపోవడం ఏమిటి? అనే ఇంగితం కూడా లేకపోవడానికి కారణం ఏమిటి! ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమను గుణాన్ని పరిశీలనగా తెలుసుకొని ఆయన గ్రహించే ప్రయత్నం బొత్తిగా లేక పోవడమే! ఒకవేళ ప్రియ చదువరీ, దేవుణ్ణి పరిశీలనగా చూసి, గ్రహించే అంత సమయం లేదంటారేమో…. అలా అనుకోవడానికి అస్సలు అవకాశమే లేదు. ఎందుకంటే దేవుని వ్యక్తిత్వాన్ని అనుమానించి దేవుని తోటలోనుండి గెంటివేయబడక ముందు ఆదాము హవ్వలు ఏదేనులో కనీసం 100 సం॥ల అయినా వున్నారు. ఆ తర్వాతే ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషాదానికి ముందు దాదాపు 100 సం॥ల కాలావధిలో దేవుడు ఏదేనులో వీరికి తనతో నడుచు భాగ్యమును, సహవసించు భాగ్యమును యిచ్చినా, వారు దానిలో ఆనందించారేగాని అంతటి అలౌకిక ఆనంద కర్తయగు దేవుణ్ణి గ్రహించే ప్రయత్న బొత్తిగా చేయలేదు. అలా దేవుణ్ణి తెలుసుకొనే, గ్రహించే ప్రయత్నం పరిశీలన చేయక పోయినందున ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో జగమెరిగినదే కదా! 

 ఈనాడు కూడా అనేక మంది క్రీస్తు భక్తులు జీవితంలో వస్తున్న ‘కొండలు- లోయలు’ అనుభవాలలో – భక్తుల విశ్వాసం, దేవుని మీద ఉండే ప్రేమ, కృతజ్ఞత కూడా భారీ హెచ్చు తగ్గులకు గురియవుతూ వుండుటకు కారణం, తమ దేవున్ని సరిగ్గా ఎరిగిన వారుగా, గ్రహించిన వారుగా వారు లేకపోవుటే! వీటన్నింటికంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే 1 పేతురు 4:16లో ప్రస్తావించిన ‘అగ్నివంటి మహాశ్రమ’ రానున్న దినాల్లో క్రైస్తవునికి ఎదురైతే క్రీస్తును విడిచిపెట్టే వారంటూ ఎవరైనా అంటే, బలహీనపడి లోకంతో, లయకర్తతో రాజీపడిపోయేవారంటూ ఎవరైనా వుంటే వారు ఖచ్చితంగా తమ దేవుణ్ణి సరిగ్గా ఎరుగని వారూ, గ్రహించని వారై వుంటారు. అదే ఆ శ్రమలోనిలిచి గెలిచేవారు ఎవరు అని చూస్తే ఖచ్చితంగా తమ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకొని, గ్రహించినవారే! దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఆ దినాన శిష్యులు తుఫాను ఘడియలో యేసు దోనెలో నిద్రించుచున్నందున ఎంతో కలవరపడి “మేము నశించిపోవుచున్నాము నీకు చింతలేదా” అంటూ ఆక్రోశించినారు. నిజానికి ఆ అపాయ సమయంలో దోనె మునిగితే మరణం మొదట సంభవించే అవకాశాలు ఎక్కువగా వున్నచోటే యేసు పవళించాడు అంటే జై ఆయన సేద తీరుతున్నాడనే దానికంటే మరణాన్ని ఎదుర్కొనడానికి ఆయన మరణ ముఖ ద్వారాన కావలి యున్నాడన్న సంగతి వారు గ్రహించరైరి. ఆయన వారి గూర్చి చింతించుచున్నాడు గనుకనే మరణ ద్వారాన కావలి వుండి మరణానికి అడ్డుపడి అది తన శిష్యులను తాకకుండా, చేరకుండా మిక్కిలి కీలకమైన భారాన్ని భుజానేసుకుని వారిని సంరక్షిస్తూ వుంటే వారు తద్భిన్నంగా ‘నీకు చింతలేదు’ అంటూ తాము భయపడిపోతూ దేవున్ని ఎంతో బాధపెట్టారు. అందుకే దేవుడు ఒకరు నన్ను పరిశీలనగా తెలుసుకొనినప్పుడు నేనానందించెదనని మాట్లాడుచున్నాడు. 

 బాప్తీస్మమిచ్చు యోహానులా నిరాటంకంగా వాడబడుతున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు యేసును ఒకలా భావించి, అభిమానించి చెరలోకెళ్ళే సరికి, తన కెలాంటి ఉపకారం జరుగకపోయే సరికి చిత్రంగా యేసు మీదున్న నమ్మకం, ఆశలు, అభిప్రాయాలు అన్నీమారిపోయినట్లు కాకుండా అన్ని వేళలా యేసును ఒకేలా ప్రేమించి, ఆరాదించి వెంబడిచగలగాలి అంటే అసలాయన ఎలాంటివాడు అనే విషయాలు నీకు సరిగ్గా తెలిసి వుండాలి. అందుకోసం ఆయననెంతో పరిశీలనగా తెలుసుకోవాలి. దానికైన ఆరాటం, నిరంతరం పోరాటం నీలో ఉండాలి. ఆయన మీద నీకున్న అభిప్రాయం పరిస్థితులను బట్టి మారిపోకూడదు. అసలు ఆధ్యాత్మిక జీవితాలలో దేవునిపై వున్న అభిప్రాయాలు తరచూ మారిపోవడమే బహు అల్పత్వం అనిపించుకుంటుంది. 

 పక్షిరాజు వలె గూడు రేపి తన ప్రజలను రెక్కలపై మోసి, నడిపించే దేవుని ఉన్నత ఉద్దేశం, ప్రేమగల మనస్సు ఎరుగని, గ్రహించని ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొందినప్పుడు (ఎర్రసముద్రం మీదుగా) అరణ్య మార్గాన వాగ్ధాన దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు నిజంగానే ఎంతో అభ్యంతర పడ్డారు. అనవసర ప్రయాస అనుకున్నారు. అలాంటి అభిప్రాయంతో వారు బయలుదేరి వెళ్తుండగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది వారిలో అసహనం కట్టలుతెంచుకుంది. ఈలోపు ఐగుప్తుసేనలు తమను తరుముకుంటూ రావడం చూసారు. అంతే అభద్రతా భావం వారిని నిలువెల్లా వణికించేసింది. దేవుడెందుకు ఈ సముద్రం అడ్డుగా వుందని తెలిసీ ఈ దారికి తీసుకురావాలి?! ఇప్పుడు తరుముచున్న ఫరో సైన్యంనుండి తప్పించుకోనేదెలా?! అంటూ భయాందోళనలతో సగం చచ్చిపోయినట్లు వుంది వారికి,అయితే దేవుని ఉద్దేశం వారిని క్షేమంగా అవతలి ఒడ్డునచేర్చడమే కాదుగాని 400సం లుగా తరుముతున్న శత్రువు మరెన్నటికీ లేకుండా సముద్రంలో చంపివేయడమేనని వారికి తెలియదు గనుక ఎంతో ఆందోళనపడ్డారు. దేవున్ని ఆవేదనకు గురిచేసారు. వారు గాని సాధారణ మార్గంలో ప్రయాణం చేస్తే వారికెప్పటికీ ఐగుప్తు సేనలనుండి ప్రమాదమే వుంటుంది. ఆ శత్రువు మరెన్నటికీ కనిపించకుండా నాశనమైపోవాలంటే ఈ సముద్రమార్గం గుండా తన ప్రజలను నడిపించాలి, వారిని చంపేయాలి. ఏతా వాతా నేచెప్పే దేమిటంటే తమ దేవున్ని ఎరుగని వారే, గ్రహించునిమిత్తం పరిశీలనగా ఆయనను వెదకని, వెంబడించనివారే ఇలా యిబ్బంది పడతారు, దేవుణ్ణి బాధపెడతారు. అందుకే ఆయనను గ్రహించి పరిశీలనగా తెలుసుకొని…. దేవుణ్ణి సంతోషపరచే వారిమిగా వుండాలి.

 యెర్ధానులో యేసు బాప్తీస్మం పొంది ఒడ్డుకు రాగానే తండ్రి అంతగా పరవశించి తను ఆనందించుచున్నానని ప్రకటించడాన్ని గమనిస్తే – యేసు- యోహానుతో మాట్లాడుతూ, అతని అభ్యంతరాలను అంగీకరించక ఒకే ఒక మాట చెప్పాడు. ఏమంటే ఈలాగు చేయుట తండ్రి చిత్తం” అని! దేవునికి స్తోత్రం, హల్లెలూయ! ప్రజలేమనుకుంటారు, అసలు నీ మనస్సులో ఏముంది అని కాకుండా తండ్రి చిత్తమును గూర్చిన చింత ఎవరిలో వుంటుందో వారిలో ఆయన ఆనందించువాడై యుంటాడు. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏమి కోరుతాడు, ఏం చేయ్యమంటున్నాడు అది మొదట ఆ విషయమును తెలుసుకొనే ప్రయత్నం చేయడం అంటే ఓ విధంగా దేవున్నే తెలుసుకునే ఒక ఉన్నత ప్రయత్నం క్రిందికే వస్తుంది. అందుకే తండ్రి ఎంతగానో సంతోషించాడు. 

 ఉదాహరణకు మండుచున్న పొద వద్ద మోషేను పరిశీలిస్తే – దేవుడు తనను తాను, తానెవరో స్పష్టంగా పరిచయం చేసుకున్నప్పటికీ మరలా మోషే – KS ఇశ్రాయేలీయులు అడిగితే ఏం చెప్పాలంటూ తన పేరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఏ మాత్రం ఆయన విసికిపోలేదుగాని ఎంతో ప్రేమతో బదులిచ్చినారు. AS ఎందుకంటే తన్నుతాను ప్రత్యక్షపరచుకొనుటలో, బయలు పర్చుకొనుటలో ఆసక్తి కలిగిన దేవుడు తనను గూర్చి తెలుసుకొనగోరువారియందు నిశ్చయంగా 8 సంతోషించువాడై యున్నాడు. ఆమెన్, హల్లెలూయా! ఈ తరువాత కూడా ఎన్నో ఋజువులు కోరినా, సన్నిధిని కోరినా, మహిమను చూపించమని కోరినా సంతోషంగా సమ్మతించి, అనుగ్రహించి తానందించినవాడు మన దేవుడు. లూకా 19లో జక్కయ్య ఉదంతాన్ని ఒకింత అవలోకిస్తే – ఏ ఇతర అవసరాలు, కారణాలు, సమస్యలు లేకుండా కేవలం యేసును చూడాలనే ఏకైక ఆశతో యదార్ధంగా యధాశక్తి ప్రయత్నించిన జక్కయ్య విషయంలో యేసు ఎంతగానో ఆనందించి నేరుగా అతనున్న స్థలానికే నడిచి వచ్చి, జక్కయ్యా అంటూ అతనిని పేరు పెట్టి పిలిచి, అతని యింటికి వెళ్ళి, అతని బ్రతకులో గొప్ప మార్పును, యింటికి రక్షణను అనుగ్రహించేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా! సహజంగా యేసు వద్దకు వచ్చే జనసమూహాలలో అత్యధిక జనం తమ తమ అవసరాలు, సమస్యలు, ఆకాంక్షలతో కాకుండా ఆయనను చూడాలనే, ఆయనను గూర్చి తెలుసుకోవాలనే ఆయనను వెతుక్కుంటూ వచ్చేవారియందు నా దేవుడు ఆనందించువాడై యున్నాడు. ఆయన స్వయంగా వారియొద్దకు వచ్చి. పేరుపెట్టి పిలచి, వారి యింటిలో అడుగుపెట్టి శాశ్వత ఆశీర్వాదాలను అనుగ్రహించువాడై యున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయ! 

 అంతేగాక తనకు విరోధంగా పరుగులెడుతూ తన్ను హింసుస్తున్న సౌలును దమస్కు మార్గంలో తన దివ్య తేజంతో పడగొడితే కిందపడి, దృష్టి కోల్పోయిన సౌలు “ప్రభువా, నీవెవడవు” అని ప్రశ్నిస్తే, ఏమాత్రం ఉగ్రుడవ్వలేదు సరికదా జవాబిచ్చినాడు. ప్రభువా అని అనడంతో సౌలుకు ఆ వెలుగు దేవుడే అని అర్ధమైనా అంతకు మించి ఆయన గురించి ఏమి తెలియదు గనుక ‘నీవెవడవు’ అనే ప్రశ్న ద్వారా నీ గురించి తెలుసుకొనగోరుచున్నాను అనే ఆకాంక్షను వెలిబుచ్చాడు. ఆ అప్లికేషను దేవుడెంత సీరియస్ గా స్వీకరించాడంటే, తన సమయంలో ఈ వ్యక్తినే ఏకంగా మూడవ ఆకాశానికి, పరదైసుకు తోడుకొని పోయి మునుపెన్నడూ ఎవ్వరికీ యివ్వనన్ని ప్రత్యక్షతలు అతనికిచ్చాడు. 

 గనుక ప్రియ చదువరీ, నీ జీవితంలో కూడా నీ దేవుణ్ణి గ్రహించి, పరిశీలనగా తెలుసుకొనుట ద్వారా అతిశయించుచూ తద్వారా నీ దేవుణ్ణి ఆనందింపజేయుము. పరిశుద్దాత్మ నీకు సహాయం చేయునుగాక. 


Leave a comment