John Hide Biography In Telugu – జాన్ హైడ్ జీవిత చరిత్ర

Written by biblesamacharam.com

Published on:

జాన్ హైడ్ జీవిత చరిత్ర

John Hide Biography In Telugu

 అమెరికాలోని “ఇల్లినాస్” రాష్ట్రములోని “కారల్టన్” పట్టణమునందు 1865 నవంబరు 9వ తేదీన జానైడ్ జన్మించెను. ఈయన తల్లిదండ్రులు ప్రార్థనాపరులు. వారి గృహమును ఎల్లప్పుడు ప్రార్థన ద్వారా ప్రభువు సన్నిధితో నింపుకొనుచుండిరి. చిన్న వయస్సు నుండి వారి బిడ్డలను ప్రార్థనలోను, క్రమ శిక్షణలోను పెంచిరి. 

 జాన్ హైడ్ 1892వ సంవత్సరములో మిషనెరీగా భారతదేశమునకు వచ్చెను. ఈయన శారీరకంగా బలహీనుడుగా యుండుటవలన ఈయనను ఎవరూ ఒక మిషనెరీగా భావించలేక పోయిరి. ఈయన చాలా మెల్లగా మాట్లాడేవాడు. మాటలు తడుముకొంటూ మాట్లాడవలసి వచ్చేది. వినికిడి కూడా కొంచెం తక్కువ! గట్టిగా కేకలు వేస్తూ ఉత్సాహముగా పరుగులెత్తి ప్రయాస పడలేక పోయేవాడు. ఎప్పుడూ ప్రశాంతముగా, సాధువుగా యుండే ఈయనను చూచిన వారనేకులు ఇంత శాంతపరుడు మిషనెరీ పని ఏమి చేయగలడు? అనుకొనేవారు. అవును, ఒక మిషనెరీకి ధైర్యసాహసములు, వాగ్దాటి, చురుకుదనము, శరీర ధృఢత్వము ఎంతో అవసరమే కావచ్చును. అయినను జానైడ్ విషయములో అది వేరుగా యున్నది. ఇవేమియు జాన్డ్కు లేకున్నను ఈయనలో యున్న ప్రత్యేకత మోకాళ్ళ ప్రార్థన. 

 మోకాళ్ళపై గంటల తరబడి ప్రార్థించుట ద్వారా జానైడ్ పరలోకపు శక్తిని, ప్రభావమును భూలోకమునకు దింపెడివాడు. ‘నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను’ అన్న పౌలువలె బలహీనుడైన ఈయన దేవుని కొరకు బలమైన కార్యములు చేసెడివాడు. ఈయన ప్రార్థనా గది చెంత నిలుచువారు ఎడతెగని ఈయన ప్రార్థనా విజ్ఞాపనలను, నిట్టూర్పులను గంటల తరబడి వినగలరు. ధారలుగా కారు కన్నీటిని చూడగలరు. అన్న పానములు మాని సమయమును కూడా లెక్కించకుండా ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తూ, విలపిస్తూ తన హృదయమును కుమ్మరించి గోజాడుచుండెడి వాడీ జానైడ్. 

 ఈ రోజులలో కొందరికి ప్రార్థన అలవాటుగా యున్నది. వారు ఏవో అలవాటు ప్రార్థనలు చేస్తూ, ఏదో భక్తి మార్గమును పాటిస్తున్నామని తృప్తి చెందుచున్నారు. కొందరు ప్రార్థనను అభ్యాసముగా ఎంచి అనుదినము ప్రార్థనకు కొంత సమయమును కేటాయించి తరువాత తమ ఇష్టానుసారముగా జీవిస్తుంటారు. కొందరు తమకు కావలసినవి దేవుని దగ్గరనుండి పొందుటకు ప్రార్థనను ఒక మార్గముగా ఎంచుతారు. మరికొందరు ప్రార్థనను ఒక నియమముగా ఎంచి ప్రార్థిస్తారు. కాని జానైడ్ ప్రార్థననే తన జీవితముగా మార్చుకొని ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఉల్లసించేవాడు. ఒంటె మోకాళ్ళ ప్రార్థనావీరుడని ఈయనకు పేరుకలదు. ఎడతెగక మోకరించుటవలన ఆయన మోకాళ్ళు కాయలు కట్టి ఒంటె మోకాళ్ళవలె కనబడెడివి. ఆయన వేసుకొనిన ఫ్యాంట్స్ కూడా మోకాళ్ళ దగ్గర నలిగి చినిగియుండెడివి. 

 మన దేశమునకు మిషనెరీగా వచ్చిన జాన్ హైడ్ అనేక సమస్యలను, కష్టములను ఎదుర్కొనెను. మన దేశములోని ఎండ వేడిమికి తట్టుకొనలేక పోయెడివాడు. మన దేశభాషలు నేర్చుకొనుటలో ఎంతో శ్రద్ధ చూపించినను వినికిడి మందమైనందున, ఎదుటివారి మాటలు తేటగా వినలేక పోయినందున మన దేశభాషలు నేర్చుకొనుట బహు కష్టతరమాయెను. 

 ఎటూతోచని ఈ మిషనెరీ ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యములోని మర్మములు నేర్చుకొనుట ప్రారంభించెను. రాత్రింబగళ్ళు బైబిలు చదివి, పరిశీలించి, ప్రార్థించి ధ్యానించుచుండెడివాడు. అది చూచిన కొందరు “మిషనరీగా వచ్చిన మీరు సువార్త సేవ చేయకుండా ఎప్పుడూ బైబిలు చదువుతూ కూర్చుంటే ఎలాగండి?” అనెడివారు. అందుకాయన దీనంగా నేను బైబిలులోని సువార్తను బోధించడానికి వచ్చాను, నిజమే! అయితే, బోధించుటకు ముందు దేవుని వాక్యమును మొదట నేను సరిగా చదివి అర్థం చేసుకోవద్దా? అనేవాడు. 

 ఒకసారి మన దేశములోని పంజాబ్ రాష్ట్రములో ‘సియల్కోట్’ అను స్థలములో ఉజ్జీవ కూటములో ప్రసంగించుటకు ఆహ్వానించబడిరి. అది ఒక గొప్ప బాధ్యతగా ఎంచిన జానైడ్ తన తోటి దైవదాసులతో కలిసి ఆసక్తిగా ప్రార్థించుటయే కాక దేవుని ఆత్మ ఆ కూటములలో కుమ్మరించబడు నిమిత్తమును, దేవుడు తనను ఒక బలమైన పనిముట్టుగా వాడుకొను నిమిత్తమును 21 దినములు రాత్రింబగళ్ళు దేవుని సముఖమునందు పడియుండెను. నశించిన ఆత్మలు రక్షించబడాలనే భారముతో ప్రార్థించెను. ఆ ఉజ్జీవ కూటములలో మొదటి కూటములో ప్రసంగించవలసిన జానైడ్ తన ప్రార్థనా గదిని విడిచి పెట్టుటకు ఆలస్యమాయెను. 

 ప్రశాంతమైన ఆయన ముఖములో ప్రజలు దేవుని వెలుగును చూడగలిగిరి. ఆయన మెల్లగా లేచి తన ప్రార్ధనానుభవములను కొంతచెప్పి, పాపమును జయించుటకును, జయజీవితము జీవించుటకును యేసుప్రభువు ఏలాగు సహాయము చేయునో వివరిస్తూ ఒక 15 నిమిషములు ప్రసంగించిన తరువాత మనమిక ప్రార్థన చేయుదమని ప్రార్థనకు తలలు వంచిన వెంటనే పరిశుద్ధాత్మ పందిరిలోని ప్రజల మీదికి దిగెను. జనులు దేవుని సన్నిధిలో తమ పాపముల నొప్పుకొనుచు ఏడ్చుచుండిరి. పశ్చాత్తాపముతో కూడిన కేకలతోను, కన్నీటితో కూడిన విజ్ఞాపనలతోను పందిరంతయు నిండెను. 

 ప్రసంగము 15 నిమిషములలో ముగిసింది గాని, ఆ ప్రార్థన కొన్ని గంటలు కొనసాగింది. దాని ఫలితముగా అనేక ప్రార్థనా గుంపులు ప్రారంభమయ్యెను. ప్రజలు లోతైన ఆత్మీయానుభవముతో జయ జీవితమును అనుభవించిరి. ఈనాటి మన ఉజ్జీవ కూటములలో ఇటువంటి ఉజ్జీవము చూడలేక పోవుటకు కారణము ప్రార్థనా లేమియే! పాటలకు, ప్రసంగములకు ఇచ్చిన సమయములో కొంతైనను ప్రార్థనకు ఇవ్వకపోవడము ఎంత విచారం! 

 జాన్ హైడ్ పెద్ద పెద్ద ప్రసంగములను మంచి సామర్ధ్యముతో చేయలేక పోయినా, దేవుని సన్నిధి ప్రజల మధ్యకు తెచ్చు మార్గము ప్రార్ధనేయని గుర్తించ గలిగెను. కాబట్టే తన జీవితములో ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత నిచ్చెను. ప్రార్థన ద్వారా గొప్ప జయములను చూచెను. ఆయన రాత్రింబగళ్ళు ప్రార్థనా గదిని విడువక అన్న పానములు కూడా మరచిపోయెడివాడు. ‘అయ్యా! భోజనమునకు వస్తారా?’ అని అడిగితే ‘ఆకలి లేదు- నన్నింకా కొంచెం సేపు ఆత్మల కొరకు అలమటించనివ్వండి’ అనేవాడు. ఆత్మల భారమును బట్టి చిక్కి, వంగి బలహీనుడై తన గదిలో నేల మీదపడి దొర్లుచూ ప్రార్థించు ఆయనను చూచిన వారు ‘మీ నిమిత్తమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది’ అన్న పౌలు మాటలను జ్ఞాపకం చేసుకొనెడివారు. 

 జాన్ హైడక్కు ప్రభువు సన్నిధిలో ప్రార్థించుచు, స్తుతించుచు, ప్రభువును ఆరాధించుట ప్రథమ పరిచర్యగా యుండెను. దానితోపాటు ‘ప్రభువా! రోజుకొక ఆత్మనైనా ఇమ్ము’ అని ప్రార్థించెడివాడు. ప్రభువు అలాగే ఆత్మలను ఇచ్చుచున్నప్పుడు ‘ప్రభువా! రెండు, మూడు, నాలుగు, అయిదు ఆత్మలను ఇమ్మ’ని ప్రార్థించు కొలది ప్రభువు అనేక ఆత్మలను రక్షించు భాగ్యము నిచ్చెను. 

 మన దేశంలో ఆయన చేసిన సేవంతా కలిపితే 19 సంవత్సరములు మాత్రమే. కాని, అనేక వేల ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించెను. ఈయన సేవలో ప్రాముఖ్యం ప్రార్థన. తరువాతే ప్రసంగము. ఈయన జీవితములో ప్రథమ గురి క్రీస్తును ఆరాధించుట! ఆ తరువాత ఆత్మలను సంపాదించుట. ఈలాగు 19 సంవత్సరములు పలు ప్రాంతములు తిరిగి సేవ చేయుటవలన బలహీనుడాయెను. ఈయన ప్రార్థనలో బహువేదన పడుచుండినందున ఈయన గుండె ఎడమవైపు నుండి కుడివైపుకు జరిగినది. వైద్యులు కొంత విశ్రాంతి తీసుకొన వలయునని ఎంత చెప్పినా ప్రార్థన మానలేదు. నిద్రాహారములు మాని, రాత్రింబగళ్ళు ప్రార్థనా పరిచర్యలో సాగిపోవుచుండెను. “నేను పడక మీద లేవలేని స్థితిలో ఉన్నను; విశ్రాంతికి బదులు విజ్ఞాపన కార్యమును సాగించుచున్నాను. ఆహా! క్రీస్తు యొక్క మాటలలోను, కార్యములలోను ఎంత పరిశుద్ధత యున్నది! క్రీస్తుతో నిత్య ముండుటకు త్వరలో పోవుచున్నాను గదా!” అనుచుండెను. 

 పరిశుద్ధుడుగా, ప్రభువు కిష్టుడుగా యుండుటయే తన జీవిత ధ్యేయముగా చేసుకొనిన హైడ్ తన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రియ రక్షకుని యొద్దకు చేరుటకు ఆశ కలిగి, తన 47 వ ఏట తన పరిచర్యను ముగించి దేవుడిచ్చు మహిమ శరీరము పొందుటకు 1912 ఫిబ్రవరి 17 న పరమ పదించెను. 


All Pdf Files………Download

Leave a comment