Martin Luther biography Telugu – మార్టిన్ లూథర్ జీవిత చరిత్ర

Written by biblesamacharam.com

Published on:

మార్టిన్ లూథర్

Martin Luther biography Telugu

మార్టిన్ 1483 నవంబరు 10న జర్మనీ దేశములోని ‘ఎలిసిలిబెన్’ అను స్థలములో హాన్స్ లూథర్, మార్గరెట్ అను సామాన్య దంపతులకు జన్మించెను. తన 13వ సంవత్సరమున హైస్కూల్లో ప్రవేశించెను. 17 సంవత్సరముల వయస్సులో “ఎర్పుర్ట్” యూనివర్శిటీలో చేరెను. ఈయన “లా” చదువుచుండగా 1505 వ సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకొని చనిపోబోయే సమయంలో “ప్రభువా!! నన్ను రక్షించు, నేను మఠంలో చేరతాను” అని ఒప్పుకొనెను. ఆ తుఫాను నుండి రక్షించబడి, తాను చేసిన మ్రొక్కుబడిని నిలబెట్టుకొనుటకు జర్మనీలోని మఠంలో చేరగోరెను. 

 మార్టిన్ తల్లి తన కుమారుడు లాయర్ కావలెనని కోరెను. కాని మార్టిన్ తాను మ్రొక్కుబడి చేసుకున్న ప్రకారము కేథలిక్ మతగురువు కాగోరెను. లూథర్ ఎక్కువగా ప్రార్థించుచు, సామాన్యమైన వస్త్రములు ధరించుచు, మంచి వాడిలా ఉండాలని ప్రయత్నించుచుండెను. దేవుడు ఉగ్రుడని, అతి పవిత్రుడని, పాపాలను  సహించలేడని భావించిన లూథర్ తన పాపములకు ప్రాయశ్చిత్తముగా శరీరమును నలుగగొట్టుకొనుచు, ఎలాగోలా పరలోకమునకు చేరుకోవాలనుకొనుచుండెను. 

 సున్నితమైన మనస్సాక్షి గలవాడై, లోతైన పాపపు ఒప్పుకోలు కలిగి సమాధానం కోసం ఆశిస్తుండేవాడు. సంఘ ఆచారాల ప్రకారం పాపక్షమాపణ పొందుటకు అన్ని ప్రయత్నములను చేసెను. పాపపు ఒప్పుకోలు ప్రార్థనలు చేయుట, తన్ను తాను దుఃఖపరచుకొనుటయే గాక రోమాకు యాత్రకు కూడా వెళ్ళి వచ్చెను. కాని ప్రయోజనం లేక, స్వనీతి ద్వారా పాపముల నుండి విడుదల పొందుట సాధ్యము కాదని తెలిసికొనెను. మార్టిన్ విటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు, హెబ్రీ భాషలను బాగుగా పఠించెను. ఒక సహోదరుని సలహాతో ఆ దినములలో నిషేధించబడిన బైబిలు గ్రంథాన్ని బాగుగా చదివి, ధ్యానించుట మొదలు పెట్టెను. ఆలాగు 1515వ సం||లో గ్రీకు, హెబ్రీ భాషలలో ఉన్న రోమా పత్రికను చదువుచుండగా “నీతిమంతుడు ‘విశ్వాస మూలముగా జీవించును” అనే మాట లూథర్ జీవిత గమనాన్నే మార్చెను. సువార్తను గ్రహించిన లూథర్ రక్షణ కృప మూలముగానే కాని క్రియ వలన కాదని గ్రహించెను. కృప మేరకు ఆత్మ రక్షణ, సమాధానమును పొందెను. 

 

 ఆ దినములలో ఉన్న రోమన్ కేథలిక్ సంఘ దురాచారములను, ఎదిరించెను. పాపపరిహార పత్రములను అమ్ముట, రుసుము చెల్లించుట ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరలోకమునకు వెళతారు అనుట, తప్పని ఖండించెను. ఫర్గెటరీలో ఉన్న ఆత్మలను పరలోకమునకు పంపించుటకు పోప్కిగాని, మరి ఏ మానవునికి గాని అధికారము లేదని వక్కాణించెను. యేసుక్రీస్తునందు విశ్వాస ముంచుట ద్వారానే మన పాపములు క్షమింపబడగలవు, పరలోకమునకు వెళ్ళగలము అనే సత్యాలను ధైర్యముగా ప్రకటించెను. నిజముగా పశ్చాత్తాపపడు ప్రతివానికి పాపక్షమాపణ, పాపపు డాగు నుండి క్రీస్తులో సంపూర్ణ విమోచన కలుగునని దానికి మనుష్యులిచ్చే పాప నివారణ పత్రములు అవసరము లేదని ప్రకటించెను. పోప్ అధికారము, పాప క్షమాపణ పత్రికలు వాక్యానుసారమైనవి కావని, ప్రార్థన ద్వారానే సంఘము మరల కట్టబడాలని ప్రతి వానికి అర్థమయ్యేలా తాను వ్రాసిన 95 పరిశోధనా పత్రములను 1517 వ సంవత్సరములో జర్మనీలోని ‘విటన్బర్గ్’ ఆలయ ద్వార బంధములకు మేకులతో కొట్టెను. 

 మొదట పోప్ ఈ విషయములను అంతగా పట్టించుకోలేదు. గాని తరువాత వాటి తీవ్రతను గ్రహించి, లూథరన్ను హెచ్చరించి తాను వ్రాసినవన్నీ తప్పని ఒప్పుకొనమనెను. లూథర్ నిరాకరించగా 1520వ సంవత్సరము జూన్ 15న  లూథర్ బహిరంగముగా పోప్ ఇచ్చిన ఆజ్ఞ పత్రాలను, కాథలిక్ కాగితములను 15న లూథరన్ను వెలివేసి అతడు వ్రాసిన వ్రాతలను కాల్చివేయమని ఆజ్ఞ ఇచ్చెను. కాల్చివేసెను. లూథర్ గుర్తించదగిన ధైర్యసాహసములు గలవాడు. ఆయన శత్రువులు ఆయనను వార్మ్స్ (WORMS) అనే స్థలంలో కలిసికొమ్మని పిలిచినప్పుడు, అతని స్నేహితులు ఆటంకపరచినను ఆయన ఆ పట్టణములోని ఇండ్ల మీదనున్న వ్రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించుటకు కుదరదని చెప్పెను. పెంకులన్ని దెయ్యములున్నను నేను పోయెదననెను. ధైర్యముగా అక్కడ తాను వ్రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించుటకు కుదరదని చెప్పెను.

 కాని ఆయన తిరిగి వెళ్లుచుండగా ఆయన స్నేహితులే ఆయనను బంధించి వార్బర్గ్ (WART-BURG) అనే స్థలంలో ఒక సంవత్సరం పాటు ఆయనను దాచిరి. ఆయన శత్రువులు లూథర్ చనిపోయెనని తలంచిరి. కాని లూథర్ ఆ సంవత్సరంలో క్రొత్త నిబంధనను జర్మనీ భాషలోనికి తర్జుమా చేయుటలో నిమగ్నుడయ్యెను. మార్చి 1522లో ఆయన బయటపడిన తరువాత మరలా విటని ్బర్గ్కి వచ్చి ప్రసంగించుటలోను, వ్రాయుటలోను గడిపెను. 

 

 1524లో తాను వ్రాసిన 23 పాటలను ఒక కీర్తన పుస్తకముగా ప్రచురించెను. ప్రతి జర్మనీ దేశస్థుడు చదువునట్లు పూర్తి బైబిల్ను అతి ప్రయాసతో జర్మనీ భాషలోనికి తర్జుమా చేసెను. క్రొత్త నిబంధనను గ్రీకు నుండి మూడు నెలల్లో తర్జుమా చేసెను గాని హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధనను తర్జుమా చేయుటకు 12 సంవత్సరములు పట్టెను. ఆలాగు 1534వ సంవత్సరమున పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి తర్జుమా చేసెను. ఆ మొత్తం బైబిలును జర్మనీ భాషలోనికి అనువదించినవాడు మార్టిన్ లూథర్. “దైవవాక్యాన్ని చేత బట్టిన సామాన్య మానవుడు, దైవవాక్యం లేని మహాబలవంతుడైన పోప్ కన్న అత్యంత బలవంతుడని” చెప్పడమే కాదు, తన జీవితము ద్వారా నెరవేర్చి చూపించెను. 

 ఒక ఆదివారము క్యాజిల్ చర్చిలో మార్టిన్ ప్రసంగించుచు ఒక కథ చెప్పెను. ఒక వ్యక్తి మరణించిన తరువాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరి దేనిని తీసుకొనిపోడు అని చెప్పుటకు ఉదాహరణగా ఈ కథ చెప్పెను. దాని ప్రకారము – ఒకడు మరణించి తనతోపాటు పాపక్షమాపణ పత్రమును తీసుకొని వెళ్ళి నరక ద్వారము వద్దనున్న దయ్యముతో – “ఇది నా పాపక్షమాపణ పత్రము, పరలోకములో ప్రవేశించుటకు నా టిక్కెట్టు యిది. గాని పొరపాటున నేను ఇచ్చటికి పంపించ బడితిని” అని చెప్పుచుండగా, ఆ నరకాగ్ని వేడికి సీలు కరిగిపోయినది. ఆ పత్రము కూడా కాలి బూడిదై పోయినది. “ఆ పత్రం పనికిరాదు, బూడిదై పోయింది” అని చెప్పుచూ దయ్యం అతనిని నరకములోనికి నెట్టినది. 

 లూథర్ కేథలిక్ సంఘాన్ని సంస్కరించగోరెను గాని కేథలిక్ సంఘము అతనిని బహిష్కరించెను. లూథర్ తన జీవితకాలమంతా సంఘ పునరుద్ధరణకు ప్రయాసపడెను. ఎన్నో శ్రమలను, కష్టములను ఎదుర్కొనవలసి వచ్చెను. దేవుని వాక్యమునకు విరోధులైన వారి వలన మాత్రమే కాక తన సొంత స్నేహితుల ద్వారా కూడా మోసగించబడెను. అయినను ప్రభువు కృప వలన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను బయలుపరచెను. తన తండ్రి యొక్క సలహా మేరకు లూథర్ తన 42వ ఏట 24 ఏండ్ల “క్యాథరిన్ ఫాన్ బోరా” ను 1525 లో వివాహము చేసికొనెను., వారికి ఆరుగురు సంతానము కలిగిరి. వారిలో నలుగురు మాత్రము బ్రతికిరి., వారిని చిన్న వయస్సు నుండి ఎంతో భయభక్తులతో పెంచెను. “ఒక చిన్న బిడ్డ చనిపోయినా ఫర్వాలేదు గాని అవిధేయుడుగాను, భక్తిహీనుడుగాను ఒకడు నా యింట్లో పెరుగుట నాకిష్టం లేదని” చెప్పెడివాడు. 

 

 బైబిలును వెలుగులోనికి తెచ్చి సర్వలోకమునకు తెలియజేయుటకు దేవుడు వాడుకున్న పనిముట్టు డాక్టర్ మార్టిన్ లూథర్. ఈయన వృద్ధాప్యము సమీపిస్తున్నప్పటికి, ఆరోగ్యము క్షీణిస్తున్నప్పటికి, తన పనిని కొనసాగిస్తూ ఉండెను. వాక్య పఠనము, రచనలు, ప్రసంగములు, వక్తిగత సేవ, ప్రార్థన, ప్రయాణములు ఈయన సేవలోని భాగములు. ఈయన 1546 ఫిబ్రవరి 18 న తన 62వ సంవత్సరములో తెల్లవారుజాము 3 గంటలకు గుండెపోటుతో మరణించి ప్రభువు సన్నిధికి ఏగెను. 

 లూథర్ మరణించినప్పుడు అతని గురించి ఫిలిప్ మెలాంగన్ ఇలా అన్నాడు- “లూథర్ ముఖ్యమైన, సత్యమైన, అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాడు. నిజమైన పశ్చాత్తాపమంటే ఏంటి? అన్న విషయాన్ని; దేవుని న్యాయమైన తీర్పును ఎదుర్కోలేక వణుకుచున్న పాపికి క్రీస్తులో ఆశ్రయముందన్న సంగతిని వాక్యము నుండి చూసాడు. మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడు అనే పౌలు బోధను అందరికీ అర్థమయ్యేలా వివరించాడు”., 

 మార్టిన్ లూథర్ సంఘకాపరి, ప్రొఫెసర్, మత సంస్కర్త, తండ్రి, గ్రంథకర్త, గీతకర్త, అనువాదకుడు, విశ్వాసము ద్వారా జయమును అనుభవించినవాడు. తన పనిని ముగించి తనను ప్రేమించిన ప్రభువు యొద్దకు చేరెను., “నా పేరు విడిచిపెట్టుడి, మిమ్మును ‘లూథరన్ లు’ అని కాదు, క్రైస్తవులు అని పిలిపించుకొనుడి” అని తనను వెంబడించిన వారిని బ్రతిమాలుకొన్న దీనుడు. క్రైస్తవ ప్రపంచం ఆయనను జ్ఞాపకముంచుకొనక తప్పదు.. 

 


ప్రత్యక్ష గుడారం subjcet కొరకు.. Click Here 

Leave a comment