Prasangam tayaree Telugu – ప్రసంగం తయారీకి కావాల్సిన 6 సూత్రాలు

Written by biblesamacharam.com

Published on:

ప్రసంగం తయారీకి కావాల్సిన 6 సూత్రాలు.

Prasangam tayaree Telugu

 బైబిలు చదివేటప్పుడు తప్పకుండా అడగవలసిన ముఖ్యమైన ప్రశ్నకు జవాబును పొందడానికి సాయపడే పునాదిని ఇక్కడ నిర్మిస్తున్నాము. “ఎప్పుడు?” అనేదే ఆ ప్రశ్న. మనం బైబిలును అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా “సత్య వాక్యమును సరిగా” విభజించడానికి (2 తిమోతి 2:15) అవసరమైన ప్రశ్నలకు అస్తమానం జవాబులు వెదుకుతూ ఉంటాము. మన ప్రశ్నలన్నిటినీ దేవుడు తన చెంతకు తీసుకు రమ్మంటున్నాడు (మత్తయి 7:7-8).

 ప్రతి వచనంలోనూ మనం అడగవలసిన ప్రాథమికమైన ప్రశ్నలు ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనే సాధారణ ప్రశ్నలే. క్రైస్తవ జీవితం గురించిన రెండు మౌలికమైన ప్రశ్నలను మనసులో ఉంచుకొని వీటికి జవాబులు పరిశీలించాలి. ఇవి మన యేసుక్రీస్తు ప్రభువుతో మరింత సన్నిహితమైన వ్యక్తిగత నడకకు మనకెలా సహాయపడతాయి? (ఫిలిప్పీ 3:10). మనం ఎలా జీవించాలి? (యోహాను 7:17). 

A. ప్రతి వచనం కోసమూ ఆరు ప్రాథమిక ప్రశ్నలు 

1.) “ఎవరు?” 

“ఎవరు?” అనే ప్రశ్న అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నదెవరు? మాట్లాడుతున్నది ఎవరితో అని తెలుసుకోగోరుతున్నాము. ఆది 22:2 లో ఒక ఉదాహరణ. అతని ఏకైక కుమారుని తనకు బలిగా అర్పించమని దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఈ సన్నివేశంలో దేవుడు వేరెవరితోనో గాక అబ్రాహాముతో నేరుగా మాట్లాడాడు. కాబట్టి వాక్యం వినేవారుగా ఆ ఆజ్ఞకు మనం బద్ధులం కాదు. 

2.) “ఏమిటి?” 

 ఈ ప్రశ్న అక్కడ చెబుతున్నదాని వాస్తవికతను ఎత్తి చూపుతున్నది. ప్రకటన 5లో యేసుక్రీస్తును ‘గొర్రెపిల్ల’ అనడం కనిపిస్తున్నది. అంటే ఆయన బొచ్చుతో ఉండి నాలుగు కాళ్ళున్న జంతువని కాదు. ఇది పాపం కోసం ఆయన బలి అయిపోయిన సంగతినే సూచిస్తున్నది (యోహాను 1:29). ఇది వాస్తవం. 

3.) “ఎప్పుడు?” 

 “ఎప్పుడు?” అన్న ప్రశ్న ఒక వాక్యభాగం సూచిస్తున్న సమయ పరిస్థితి తెలుపుతుంది. ఉదాహరణకు అబ్రాహాము తన సవతి చెల్లెలు శారాని వివాహమాడడం అక్రమంగా అనిపించవచ్చు. అయితే మోషే ధర్మశాస్త్రం రాకమునుపు ఇలాటి వివాహం జరిగిందని పఠిత అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. ధర్మశాస్త్రంలో ఇలాటి వివాహాలు నిషేధించారు. ధర్మశాస్త్రం లేనప్పుడు ఇలాటి వ్యక్తిగత పాపం ఒక సమస్య కాదు (రోమా 4:15). అబ్రాహము విషయంలో ఇలాంటి రక్త సంబంధిని వివాహమాడడం పాపం కాదు. ‘ఎప్పుడు?’ అనే ప్రశ్నకు స్పష్టమైన జవాబు పూర్తి అవగాహనకు చాలా కీలకం. 

4.) “ఎక్కడ?” 

ఒక వాక్యభాగం భౌగోళికంగా ఏ ప్రాంతాల, ఏ సంస్కృతిలో రాయబడిందో ‘ఎక్కడ’ కంపెందెడు అనే ప్రశ్న సూచిస్తుంది. తరచుగా బైబిల్లో ‘యెరూషలేమునకు ఎక్కిపోయి’ వంటి 3- T. పదబంధాలు కనిపిస్తాయి. అనేక సంస్కృతుల్లో ఎక్కిపోవడం అంటే ఉత్తర దిశగా ప్రయాణించడం అని అర్థం. అయితే ఇక్కడ బైబిలు ఉద్దేశం ఎత్తు ప్రదేశానికి వెళ్ళడమే తప్ప దిశ గురించి కాదు. యేసు గలిలయ నుండి బయలుదేరి యెరూషలేముకు వెళ్తున్నాడంటే ఆయన నిజానికి దక్షిణానికి పయనిస్తున్నాడు. అయితే పైపైకి ఎత్తు ప్రదేశాలకు వెళ్తున్నాడు. 

5.) “ఎందుకు?” 

‘ఎందుకు?” అనేది తరచుగా జవాబివ్వడానికి కష్టమైన ప్రశ్న. ఎక్కువసార్లు వేరే వాక్యభాగాలు చదవడం ద్వారా జవాబు లభిస్తుంది. యెషయా 7:14లో ఉన్న “కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును” అనే వాక్యభాగాన్ని చదివితే కన్యక ఎందుకు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబుగా “దేవుడు అలా జరగాలని ఉద్దేశించాడు” అని జవాబు చెప్పవచ్చు. అయితే అది సరైన జవాబే అయినా పూర్తి జవాబు కాదు. 

దీనికి జవాబు వెదుకుతుండగా మనం రోమా 5లోని వాక్యభాగం చూడవచ్చు. మానవజాతిపై ఆదాము పాపం ఎలాంటి ప్రభావం చూపిందో అక్కడ తెలుస్తుంది. ఆదాము ద్వారా మానవజాతికి చెందిన ప్రతివానికీ పాప స్వభావం సంక్రమించింది. యేసుకు మానవమాత్రుడైన తండ్రి ఉన్నట్టయితే ఆయనకు కూడా పాప స్వభావం ఉండేది. ఈ విషయంలో “ఎందుకు?” అనే ప్రశ్నకు జవాబు పాప పరిహారం చెల్లించడానికి క్రీస్తుకు ఉన్న అర్హతల దృష్ట్యా చాలా కీలకం. 

6.) “ఎలా?” 

‘ఎలా?’ అనే ప్రశ్నకు కూడా కొన్నిసార్లు జవాబు కష్టం. “యేసు నీటిపై ఎలా నడిచాడు?” అని అడిగామనుకోండి. ఆయన పరిశుద్ధాత్మపై ఆధారపడ్డాడు (లూకా 4:18) అని చెప్పి ఊరుకోవలసి వస్తుంది. “మానవజాతికి స్వంతగా నిర్ణయించుకునే అధికారం ఉన్నప్పుడు దేవుడు చరిత్రను ఎలా అదుపు చేయగలడు? అని అడగవచ్చు. దీనికి జవాబు అంత సులభం కాదు. దీనిని తరువాత అధ్యయనం చేద్దాము. 

B.) రెండు ప్రాముఖ్యమైన వ్యక్తిగత ప్రశ్నలు 

 1.) మనం యేసుక్రీస్తు ప్రభువుతో మరింత సన్నిహిత సంబంధం ఏర్పడేందుకు ఇదెలా తోడ్పడుతుంది? 

 మనం అడగదగిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. దేవుని వాక్య పఠన ద్వారా మనం సంపాదించిన జ్ఞానాన్ని మన విశ్వాసానికి జోడించాలి (హెబ్రీ 11:6). తద్వారా ప్రభువుతో మన సంబంధం ఎదుగుతుంది. దేవుని వాక్యం నిర్దోషమైనదిగా, ఆధారపడినదిగా మనం ఎంచి నమ్మకముంచాలి. తత్ఫలితంగా ప్రభువుతో సంబంధం ఆయన ప్రేమలో పునాదులు కలిగి, మానవ అవగాహనకు మించి ఉంటుంది. అపొస్తలుడు పౌలు ఎఫెసీ 3:14 -19 లో దీనినే స్పష్టంగా చెప్పాడు. 

“ఈ హేతువు చేత పరలోకమునందును, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి యెదుట నేను మోకాళ్లూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్దులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను.” 

 దేవుని వాక్కును కేవలం మేధోసంబంధమైన కారణాలతో, దేవుని పట్ల, ఇతరుల పట్ల ప్రేమలో ఎదగడం కోసం కాకుండా పఠిస్తున్నట్టయితే (మార్కు 12:29-31) మనం అహంకారులంగా మారుతున్నామన్నమాట (1 కొరింథీ 8:1). ఈ భూమిపై ఉన్న వారందరికంటే ఎక్కువగా దైవశాస్త్రం ఎరిగియున్న అపొస్తలుడు పౌలు (2 కొరింథీ 12:1-4), “ఆయనను ఎరుగు నిమిత్తము” (ఫిలిప్పీ 3:10) అనడంలో తనకున్న కోరికలన్నిటిలోకీ అతి ప్రాముఖ్యమైన దానిని వ్యక్తపరిచాడు. పరిసయ్యుడుగా పౌలు ఇంతకుముందే మేధో సంబంధమైన ప్రయాణాలు జరిగించాడు. కాని ఇప్పుడు క్రైస్తవుడుగా సజీవ దేవునితో అత్యంత ప్రధానమైన సంబంధాన్ని వెంటాడడం ఆరంభించాడు. 

దేవుని వాగ్దానాల కోసం చూడండి. “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, జ్ఞానమందును అభివృద్ధి” పొందగలిగేలా (2 పేతురు 3:18) వాటిపై నమ్మకముంచండి. 

  2.మనమెలా జీవించాలి? 

మనం పఠిస్తున్న వచనాలను మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టాక అది మన దైనందిన జీవితానికి ఎలా అన్వయిస్తుందో అర్థం చేసుకోవాలి. హెబ్రీ 12:1-3 లో ‘టికెట్ . ఈ విషయం గురించి చక్కగా రాసి ఉంది. 1,2 వచనాలు ఇలా చెబుతున్నాయి, 

“ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి యున్నందున మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడైయున్నాడు.” 

ఈ రెండు వచనాలలో హీబ్రూ పత్రిక రచయిత ఎన్నుకొన్న పదచిత్రం పరుగు పందెం. కూర్చుని ఉన్న జనం చూస్తూ ఉన్నారు (11వ అధ్యాయంలో ఉన్న వీరులు). పరుగు పందెంలో దూరం వెళ్ళాలి. వేగం కూడా అవసరం. గెలిచిన వ్యక్తికి గౌరవనీయమైన స్థానం దక్కుతుంది. తనకు బరువుగా ఉండే వాటన్నిటినీ, తూలి పడేలా చేసే అడ్డంకులన్నింటినీ అతడు వదిలించుకుంటాడు. అతని కన్నులు గురి మీదనే ఉంటాయి. అక్కడ ఆ పందెం ఇప్పటికే ముగించినవాడు (యేసుక్రీస్తు) నిలబడి ఉన్నాడు. తనకు కలగనున్న ఆనందం ఎలాంటి అలసటనైనా అధిగమిస్తుంది. కాబట్టి పందెగాడు సహిస్తాడు. 

3 వ వచనంలో ఇలా రాయడం ద్వారా పై రెండు వచనాలను మన జీవితాలకు అన్వయిస్తాడు, 

“మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.” 

మనం క్రీస్తు నిమిత్తం పరీక్షలను, వ్యతిరేకతలను, నొప్పిని, వేదనను, అవమానాన్నీ, అప్రతిష్ఠనూ ఎదుర్కొంటున్నప్పుడు మన నాయకుణ్ణి మనసులోకి తెచ్చుకుని ఆయన మూలంగా ప్రోత్సాహం పొందాలి. ” మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను” (హెబ్రీ 4:15) అని గ్రహించాలి. 

c.) అన్ని ప్రశ్నలకూ జవాబు చెప్పలేకపోతే ఏం? 

ప్రశ్నలు, వాటి జవాబులు ప్రాముఖ్యమే. అయితే సజీవ దేవునితో మన సంబంధం విశ్వాసంపై ఆధారపడిందని మనం గుర్తుంచుకోవాలి (ఎఫెసీ 2:8-9; కొలస్సీ 2:6). ఈ జీవిత కాలంలో మనం వెదికే జవాబులన్నీ మనకు లభించవు. అయితే మన ప్రశ్నలన్నిటికీ ఒకానొక సమయంలో జవాబు దొరుకుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు (1 కొరింథీ 13:12). మనలను జీవితంలో నడిపించడానికి సరిపడినంత సమాచారం లేఖనాలలో ఉంది. 


 

1 thought on “Prasangam tayaree Telugu – ప్రసంగం తయారీకి కావాల్సిన 6 సూత్రాలు”

Leave a comment