Mary Slessor Biography Telugu – మేరీ స్లెస్సర్ జీవిత చరిత్ర

Written by biblesamacharam.com

Published on:

మేరీ స్లెస్సర్ జీవిత చరిత్ర

Mary Slessor Biography Telugu

 మేరీ స్లెస్సర్ స్కాట్లాండ్ దేశములోని ఆవర్ధన్ పట్టణములో 1848 వ సంవత్సరమున డిశంబరు 2వ తారీఖున ఒక పేద కుటుంబములో జన్మించెను. తండ్రి చెప్పులు కుట్టుకొనేవాడు. తల్లి నూలు మిల్లులో పని చేసేది. తల్లి భక్తి కలిగిన స్త్రీ. గాని తండ్రి త్రాగుడుకు బానిస. వారికి కలిగిన ఏడుగురు సంతానంలో ఈమె రెండవ కుమార్తె. మేరీ తన పదకొండు సంవత్సరముల వయస్సులోనే ఒక నూలు మిల్లులో పనిచేస్తూ ఒక్క పూట మాత్రమే చదువుకొనేది. 

 మేరీ ఒక పరిశుద్ధురాలి సహవాసంలో లోతైన రక్షణానుభవమును పొంది, యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను. ఆమె మారుమనస్సు పొందిన తరువాత తనకున్న కొద్ది చదువుతో బైబిలును, ఆధ్యాత్మిక పుస్తకములను చదువుచుండెడిది. పగలంతా పనిలో, రాత్రి సమయమంతా చదువుటలో శ్రద్ధ వహించేది. మిషనెరీల చరిత్రలు చదివెడిది. 

 అనాగరికులైన ఆఫ్రికా జనుల మధ్యకు మిషనెరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర ఆమెనెంతగానో కదిలించెను. తాను అటువంటి జనుల మధ్య సువార్తను ప్రకటించాలని ఆశించెను. మొదట ఆమె ఉన్న స్థలములో మురికివాడలలో నున్నవారిని ప్రభువులోనికి నడిపించుటకు ప్రయాసపడెను. ఆత్మల రక్షణకై ఆవేదనతో ప్రార్థిస్తూ, సండే స్కూలు టీచర్ బాధ్యతను కూడా వహించెను. 

 1873 లో డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మరణవార్త ఆమెను కలవరపరచెను. అప్పటికి మేరీ వయస్సు కేవలము 24 సంవత్సరములు మాత్రమే. అయినను “తెల్లవారి సమాధి” గా పేరొందిన ఆఫ్రికా దేశమునకు మిషనెరీగా వెళ్ళుటకు తెగించి స్కాట్లాండ్ దేశములో యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చి వారి సహాయంతో 1876 ఆగష్టు 5 న ఆఫ్రికా దేశంలో “కెలబార్” అనే ప్రదేశమునకు ప్రయాణమయ్యెను. 

 మేరీస్లెస్సర్ ఆఫ్రికా దేశములోని స్త్రీలను పరామర్శించుచు, పిల్లలకు విద్య నభ్యసింపజేయుచు, వారి కష్ట సుఖాలను అర్థం చేసుకొంటూ, వారి పట్ల సానుభూతితో వ్యవహరించేది. వారి స్థానిక భాషయైన ‘ఎఫిల్’ ఎంతో ఆసక్తితో నేర్చుకొని కలిసి జీవిస్తూ, వారికి క్రీస్తును గురించి బోధించేది. భయంకరమైన విగ్రహారాధన, నరబలులతో కూడిన, మూర్ఖులైన ఆ జనుల మధ్య, కౄర జంతువులతో నిండియున్న ఆ అడవిలో ప్రభువు కొరకు నిలబడడానికి ఆమె ఎంతగానో ప్రార్థించి, ప్రభువుపై ఆధారపడి జీవించేది. పన్నెండు సంవత్సరములు వారి మధ్య నిర్విరామ కృషి చేసి అనేకులను ప్రభువు పాదములయొద్దకు నడిపించెను. Mary Slessor Biography Telugu

 ఆ తర్వాత ఆమె మరింత భయంకరమైన ‘ఓకోయాంగో” కు వెళ్ళడానికి ఆశించింది. వారియొద్దకు అంతవరకు ఎవరును వెళ్ళలేదు. వారు బహు కౄరులు, మూర్ఖులు, వారు చేసే అమానుష రాక్షసకృత్యాలు వినడానికి కూడా ఎంతో భయంకరముగా యుండేవి. ఎటువంటి దయాదాక్షిణ్యములు లేని, నరమాంస భక్షకులు వారు. అటువంటి వారి మధ్య సేవ చేయుటకు 1888 ఆగష్టు 3వ తేదీన ‘ఎంకేంగే’ అను గ్రామమునకు తాను పెంచుకున్న ఐదుగురు అనాథ బిడ్డలతో బయలుదేరెను. ఆ పన్నెండు సంవత్సరములు ఆమె యొక్క ప్రేమను, దయగల హృదయమును చవిచూచిన ఆ కెలబార్ ప్రజలు ఆమె నరమాంస భక్షకుల మధ్య సేవ చేయుటకు వెళ్ళుచుండగా కన్నీటితో సాగనంపిరి. Mary Slessor Biography Telugu

 మేరీ తాను ఎదుర్కొనబోవు కష్టములను లెక్కచేయక క్రీస్తువైపు చూచుచు ఒక పూరి గుడిసెలో నివాసమేర్పరచుకొని విశ్వాసముతో, పట్టుదల ప్రార్థనలతో పాపులను ప్రేమించి, క్షమించి, రక్షించగల యేసుప్రభువుని గూర్చి చెప్తూ ఉంటే ఆ దుష్టప్రజలు ఆశ్చర్యపోవుచుండిరి. మేరీ స్లెస్సర్ క్రీస్తు ప్రేమతో ఎటువంటి హృదయాన్నైనా అట్లే ఆకర్షించేది. అచ్చటి జనుల హృదయాలలో దేవుడు, కనికరం, జాలి అనే మాటలకు స్థలమే లేకపోయినా వారి హృదయాలను కరిగించి, వారి అజ్ఞాన కార్యములనుండి వారిని తొలగించి వారి నివాసములలో నివసిస్తూ, వారి ఆహారమును భుజిస్తూ ఎండకు ఎండి, వానకు తడుస్తూ సేవ చేసింది ఈ మేరీ స్లైస్సర్. ఒక క్రొవ్వొత్తిలా తాను హరించుకుపోతున్నా, ఇతరులకు వెలుగునిస్తూ క్రీస్తు ప్రేమను చూపించింది. 

 ఈ ఓకోయాంగోలోని ప్రజలు బహు మూర్ఖులు. వీరిలో ఎవరైనా ముఖ్యుడు మరణిస్తే, అతని ఆత్మ శాంతి కొరకు కొందరు మనుష్యులను బలిచ్చేవారు. ఒక భర్త మరణిస్తే, అతని భార్యను లేక కొన్నిసార్లు అతనికున్న ఇద్దరు లేక ముగ్గురు భార్యలను అతనితోపాటే సజీవ సమాధి చేసేవారు. వీరికి కవల పిల్లలు పుడితే అది శాపమని తలంచి ఆ పిల్లలను చంపేసేవారు. ఆ తల్లిని తరిమేవారు లేక చంపేసేవారు. మేరీసెస్సర్ ఇలాంటి మూర్ఖమైన అలవాట్లనుండి వారిని తప్పిస్తూ, అలాంటి వారికి ఆశ్రయమిచ్చెను. 

 పది సంవత్సరములలో ఓకోయాంగో ప్రాంతము పూర్తిగా మారిపోయింది. నరబలులు, దురాచారములు, త్రాగుడు మొదలగు దురలవాట్లు మాని అనేకులు యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆత్మశాంతిని, ఆత్మానందమును పొందిరి. భయంకరమైన ప్రాంతంగా పేరుపొందిన ఓకోయాంగో సమాధాన నిలయంగా మారింది. “మా తగవులు తీర్చండి, మా సమస్యలు పరిష్కరించండి” అంటూ అనేకులు మేరీ యొద్దకు పరుగెత్తుకు వచ్చెడివారు. మేరీ ఓపికతో వారి సమస్యలను విని పరిష్కార మార్గాలను వారి భాషలోనే తెలియజేసెడిది. అప్పటికామె వయస్సు 50 సంవత్సరములు. ఆమె అనేక బలహీనతలకు, కీళ్ళ వాతమునకు గురియయ్యెను. అయినను ఆమె స్వదేశమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకొనక ఒక చక్రాల కుర్చీలో కూర్చొని సేవను కొనసాగించెను. 

 అనేక మంచి పాఠశాలలను, ప్రార్థనా మందిరములను కట్టించినప్పటికి తాను, తనతోనున్న అనాథలతో చిన్న గుడిసెలలో నివసిస్తూ నిరాడంబరముగా యుండేది. అధిక సమయాన్ని ప్రభువు సేవలో వ్యయపరస్తూ ఆదివారము ఇంచుమించు పది మైళ్ళకు పైగా ప్రయాణిస్తూ పన్నెండు స్థలములలో బోధించేది. ఆమె ఈ స్థలంలో పనిచేసిన 40 సంవత్సరములలో కేవలం మూడుసార్లు మాత్రమే బహు కొద్ది సమయం తన దేశానికి వెళ్ళి వచ్చింది. ఆమె మాటలు, జీవితము ఎప్పుడూ క్రీస్తుకే ఘనత తెచ్చునట్లుగా ఉండేవి. “ఈ ఆటవికులు క్రీస్తు శిష్యు లయ్యారంటే ఇది నా ప్రజ్ఞ కాదు: ఇది ప్రభువు కృపే, మరియు మీ ప్రార్థనల ఫలితం. రక్షింపబడిన ఈ ఆత్మల ద్వారా ప్రభువే ఘనపరచబడును గాక!” అంటూ ఉండేది. తరువాత ఆమె అరణ్య ప్రాంతములో ముందుకు సాగుతూ ‘ఐటు’ అనే ప్రాంతములోనికి, ఆ తరువాత మారుమూలల్లో ఉన్న మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించింది. Mary Slessor Biography Telugu

 సమస్త సుఖ సాధనములకు దూరముగా యుండి ఏకాకిగా 40 సంవత్సరములు అహర్నిశలు ఆత్మల రక్షణార్థమై పోరాడి ప్రభువు కొరకై తన జీవితమును వాడిన మహానీయురాలు ఈ వీరనారి. జీవితాంతం వరకు ఆఫ్రికాలోనే పరిచర్య చేయాలని నిశ్చయించుకొనిన ఈమె ఎంతో అనారోగ్యమునకు గురైనను తన స్వదేశమైన స్కాట్లాండ్కు వెళ్ళే తలంపే రానివ్వలేదు. వృద్ధాప్యము వలన కదల్లేని పరిస్థితులు ఏర్పడినప్పటికిని ప్రభువు సేవలోనే ఉండెను. తన చివరి దినములలో పడకలో ఉన్నప్పటికి కూడా పరలోకము గురించి ఆలోచిస్తూ ప్రార్థించుచుండెను. మేరీ 1915 వ సంవత్సరములో జనవరి 13వ తారీఖున తన 67వ యేట అక్కడే తన పోరాటమును ముగించి ప్రభువిచ్చు కిరీటమును పొందుటకు మహిమలో ప్రవేశించెను. Mary Slessor Biography Telugu

 ఆమె మరణించినప్పుడు ఆమె సేవలో ఆమెకు మార్గదర్శిగా ఉండిన ఆమె బైబిలులో ఆమె వ్రాసుకొన్న అనేక వాగ్దానములు ఉండెను. మరియు అనేక సంవత్సరములు ఆమె ప్రభువు పరిచర్యలో కొనసాగినను ఆమె ఈ లోకంలో మిగుల్చుకొన్న ఆస్తి-కొన్ని పాత బట్టలు, పుస్తకములు, ఒక పెద్ద ఉత్తరాల కట్ట! ఆమె పరిచర్య ఎంత నిరాడంబరమైనదో, నిస్వార్థమైనదో మనము గుర్తించవచ్చు! అయితే ఆమె పరలోకములో దేవుడిచ్చు కిరీటమును, సింహాసనమును సంపాదించె ననుటకు సందేహము లేదు. ఆమె నిస్వార్థమైన సేవ ద్వారా మార్పు పొందిన వేలాది మొరటు ప్రజలు ఆమె లేనిలోటుకెంతో విలపించిరి. ఆమె పెంచిన అనాథలు తల్లడిల్లిరి. అయితే ఆమె మరణించినను ఆ పాప దుర్గంధ పూరితమైన ఆ అనాగరిక జనుల మధ్య ఆమె వెదజల్లిన క్రీస్తు పరిమళం ఈనాటికీ పరిమళిస్తూనే ఉంది. పాప చీకటిలో ఆమె వెలిగించిన సువార్త వెలుగు తన ఉజ్వలకాంతిని వెదజల్లుతూనే యుంది. ఆహా! ఈమె ఎంతటి ధన్యజీవి? 


All Pdf……..Download

Leave a comment