దేవుని చిత్తమునకు లోబడిన రిబ్కా
STORY OF REBECCA Telugu
“అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను”. (ఆదికాండము 24:15)
అబ్రాహాము దేవుని పిలుపుకు లోబడి, ఆయన వాగ్దానాలను నమ్మి దేవుని వెంబడించినందున దేవుడతనిని బహుగా ఆశీర్వదించెను. అతడు వెండి బంగారములు, పశుసంపద గలవాడై బహు ధనవంతుడాయెను (ఆదికాండము 13:2). అయినను ధనమును కాక దేవునిని ప్రేమించిన అబ్రాహాము మరింత ఆశీర్వదించబడి, తన నిండు వృద్ధాప్యములో ఇస్సాకును వాగ్దాన పుత్రునిగా పొందెను. ఇస్సాకుకు యుక్త వయస్సు వచ్చినప్పుడు అబ్రాహాము అతనికి వివాహము చేయగోరెను.
తన ఆస్తి అంతటికి ఏకైక వారసుడైన ఇస్సాకుకు తగినటువంటి సహకారిగా ఉండుటకు దేవుడు ఏర్పరచిన స్త్రీని కనుగొనగోరెను. నేడనేకులు వారి కుమారులకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు అందమైన స్త్రీ కోసం, ఆస్తిపాస్తులు కలిగినవారి కోసం, కట్నకానుకలు ఎక్కువ ఇవ్వగలవారి కోసము వెదకుచున్నారు. అయితే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమనియు (సామెతలు 31:30); ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదనియు (సామెతలు 11:4) గ్రహించకున్నారు.
ధనవంతుడైన అబ్రాహాము తన కంటె ధనవంతుడైన వాని కుమార్తె కావలెనని కోరుకొనలేదు గాని; గుణవతియైన, యోగ్యురాలైన యువతిని కనుగొనుటకు ఆశించెను. ఎందుకంటే “గుణవతియైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటె అమూల్యమైనది” (సామెతలు 31:10); “యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము” (సామెతలు 12:4) అని బైబిలు చెప్పుచున్నది.
అబ్రాహాము తన ప్రధాన సేవకుడును, ప్రార్థనాపరుడునైన ఎలీయెజెరును పిలిచి; నీవు ప్రార్ధనా పూర్వకముగా వెళ్ళి, నా కుమారునికి తగిన యువతిని కనుగొనుమని పంపెను. పది ఒంటెల మీద అనేక బహుమానాలను వేసికొని బయలుదేరిన ఎలీయెజెరు 550 మైళ్ళ దూరం ప్రయాణం చేసి, హారాను అను పట్టణము చేరుకొనెను. అచ్చట బావి దగ్గర నీళ్ళు చేదుచున్న అనేకమంది యువతులను చూచెను.
మోకరించిన ఎలీయెజెరు, ‘దేవా! ఈ స్థలమునకు నన్ను నడిపించితివి. ఇస్సాకుకు భార్యగా ఏర్పరచుకొనిన స్త్రీని చూపుమ’ని ప్రార్థించి, తన మనస్సులో ఈ అనుకొనెను, ‘నేను దాహమున కడుగగా త్రాగుము అని నాకు నీళ్ళు యే నాతో ఉన్న ఈ ఒంటెలను కూడా త్రాగనిమ్మని ఏ యువతి (ఆదికాండము 24:43, 44). ఎలీయెజెరు నీళ్ళు అడుగగా, రిబ్కా అనే యువతి అతనికి నీళ్ళు ఇచ్చుటయే గాక; అతని ఒంటెలకు నీళ్ళు చేదిపోసెను. దేవుని స్తుతించిన ఆ సేవకుడు ఆ యువతిని వివరములు అడుగగా, ఆమె తన తండ్రి ఇంటివారి వివరములు చెప్పెను.
“ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు” (ఆదికాండము 24:16) అని బైబిలు చెప్పుచున్నది. రిబ్కా బహిరంగముగాను, అంతరంగములోను కూడా సౌందర్యవంతురాలు! ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. వివాహమునకు ముఖ్యమైన యోగ్యత – పరిశుద్ధత! కన్యత్వాన్ని పోగొట్టుకొన్న వనితల వివాహాలలో ఆశీర్వాదం ఉండదు. రిబ్కా క్రొత్తవారిని ప్రేమతో పలకరించి, ఆతిథ్యమిచ్చే యువతి! ఒక ఒంటె ఇంచుమించు ఏడు కడవల నీళ్ళు త్రాగునట! పది ఒంటెలకు నీళ్ళు తోడి పోసిందంటే, ఆమె కష్టపడి పనిచేసే స్త్రీ అని తెలియుచున్నది. ఈమెలో ఉన్న ఈ మంచి గుణములు కోట్ల రూపాయల కట్నకానుకల కంటె శ్రేష్ఠమైనవి!
ప్రియ తల్లిదండ్రులారా! మీరు ఎటువంటి యువతులను మీ ఇంటి కోడళ్ళుగా తెచ్చుకొనదలచుకొంటున్నారు? “వివేకము లేని సుందర స్త్రీ, పంది ముక్కున నున్న బంగారు కమ్మివంటిది” (సామెతలు 11:22) అని; “గయ్యాళితో పెద్ద యింట నుండుట కంటె మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు” (సామెతలు 21:9) అని మీరెరుగరా? “సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము” (సామెతలు 19:14). “జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును” (సామెతలు 14:1). “యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును” (సామెతలు 31:30). గనుక కట్న కానుకలకు ప్రాముఖ్యత నివ్వక, దేవుని చిత్తమును కనుగొని మీ బిడ్డలకు వివాహము చేయండి! అప్పుడు దీవెన కలుగును.
రిబ్కా వివాహ జీవితమునకు తగిన రీతిలో ఆ ఇంటిలో ఎదిగినది. ఆమె తన్ను తాను పవిత్రంగా కాపాడుకొనుటే కాక; కష్టపడి పనిచేయుట, తల్లిదండ్రులకు లోబడుట, అతిథులను గౌరవించుట నేర్చుకొన్నది. ఆమె వెలిచూపును బట్టి కాక, విశ్వాసమును బట్టి నడుచుకొనునదిగా ఉండెను. కాబట్టే తన కాబోయే భర్తను, కనీసం మామను చూడలేకపోయినను; దేవుడు నాకు మేలైనది ఇచ్చును అని విశ్వాసంతో తన తల్లిదండ్రులను విడిచి ముందుకు సాగెను.
ఈనాడనేక వివాహాలు పెళ్ళిచూపులతో ఆగక; వివాహం చేసుకోబోయేవారు వివాహానికి ముందే ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు, తిరుగుచు, తర్కించుకొనుచు అన్నివిధాలా నచ్చితేనే పెండ్లి చేసుకొందాం అని అనుకొంటున్నారు. అనేకసార్లు అటువంటి పెళ్ళిళ్ళు కూడా విఫలమౌతున్నాయి. అయితే వివాహ విషయంలో దేవుని చిత్తం చేసేవారికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, వారి కుటుంబం కట్టబడుతుంది, ఆశీర్వదించబడుతుంది.
రిబ్కా ఆ స్థలము చేరునప్పటికి పొలములో ధ్యానము చేయుచున్న ఇస్సాకు కనబడెను. అతనిని చూడగానే రిబ్కా ముసుగు వేసుకొని, ఒంటె మీద నుండి దిగెను. అది ఆమె అణకువను, విధేయతను చూపించుచున్నది. “భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి” (కొలొస్స 3:18) అని దేవుని వాక్యము హెచ్చరించు చున్నది గదా!
“అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా, ఆమె అతని భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను” (ఆదికాండము 24:67). ‘భర్తలారా, మీ సొంత శరీరములను వలె మీ భార్యలను ప్రేమించుడి’ (ఎఫెసీ 5:28) అని బైబిల్ చెప్పుచున్నది గదా! ఈనాడనేకులు పెళ్ళి చేసుకొని, ప్రేమించుటకు బదులు; ప్రేమించి పెళ్ళి చేసు కొంటున్నారు. అయితే పెళ్ళికి ముందున్న ఆ ప్రేమ కేవలం ఆకర్షణ వలన వచ్చిన యిష్టమే గాని, పెండ్లియైన తరువాత ఒకరి కొరకు ఒకరు జీవించుట ద్వారానే నిజమైన ప్రేమను పొందగలరు!
అవును, పెండ్లికి ముందు యువతీ యువకుల మధ్య ఉండేది నిజమైన ప్రేమ కాదు గాని; ఒక విధమైన ఇష్టము లేక ఇచ్ఛ! సమ్సోను ఫిలిష్తీయులలో ఒకతెను చూచి, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకిచ్చి పెండ్లి చేయమని కోరుకొనెను (న్యాయాధిపతులు 14:2-4). దేవుని చిత్తమునకు, తల్లిదండ్రులకు వ్యతిరేకముగా చేసుకొన్న ఆ పెండ్లి బహు త్వరలోనే విచ్ఛిన్నము కాగా; అతని బ్రతుకు వేశ్యల పాలాయెను. అయ్యో! బలవంతుడైన సమ్సోను బానిసైపోయెను.
యౌవనుడా, యావనురాలా, జాగ్రత్త! ఇస్సాకు పెండ్లి చేసుకొనిన తరువాత భార్యను ప్రేమించెను. ఆమెలోని లోపాలు సహించెను. ఆమెను అన్ని రీతులా ఆదరించెను. అదే నిజమైన వివాహ బంధము! ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ఆమెను త్రోసివేయక, ఆమె కొరకు ప్రార్థించెను (ఆదికాండము 25:21). దేవుడప్పుడు వారికి ఇద్దరు కవల పిల్లలను ఇచ్చెను. వారి కుటుంబము దీవించబడెను.
STORY OF REBECCA Telugu STORY OF REBECCA Telugu STORY OF REBECCA Telugu STORY OF REBECCA Telugu STORY OF REBECCA Telugu STORY OF REBECCA Telugu STORY OF REBECCA Telugu STORY OF REBECCA Telugu
బైబిల్ ప్రశ్నలు – జవాబులు కొరకు .. click here