క్రైస్తవులు యోగా చేయవచ్చా?
Should Christians Do Yoga Telugu
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బహుగా జనాదరణ పొందుతున్న ఏకైక విధానం యోగా! పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులు వయోభేదం లేకుండా అందరు దాని వైపు ఆకర్షించబడుతున్నారు. అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా ప్రబలిపోయింది యోగా. గత పది సంవత్సరాల్లో యోగా గూర్చి చాలా ప్రచారం జరిగింది. అంతేకాదు దానికి తగిన ఫలం కూడా కనబడుతోంది! స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, జిమ్స్, కమ్యూనిటీ హాల్స్, పార్క్, ఆఫీసులు, వైఎమ్సిఎ, వైడబ్యుసిఎ, అధ్యాత్మిక కేంద్రాలు, స్పోర్ట్స్ సెంటర్స్ మరియు రాజకీయ పార్టీ ఆఫీసుల్లో యోగా బాగా పుంజుకుంటోంది. బ్రిటన్లో కొన్ని చర్చీలు యోగా కేంద్రాలుగా మారాయి. యోగా ప్రజల జీవితంలో ప్రధాన స్థానం కొరకు ప్రయత్నిస్తోంది. వైద్యం కొరకు డాక్టరు దగ్గరకు వెళితే వారు మందులతో పాటు “యోగా”ని కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలకు మూడవ తరగతి నుండే యోగా నేర్పుతున్నారు.
కొందరికి యోగా ఫ్యాషన్ మరి కొందరికి యోగా పాషన్గా మారిపోయింది!!
పుస్తకాలు, పత్రికలు, టి.వి. షోలు, యోగా కేంద్రాలు, ఉచిత యోగా శిక్షణలు యోగాను బాగా పెంపొందించాయి. పతాంజలి యోగీ పీఠ్ అధినేత ప్రముఖ యోగా గురు స్వామి రాందేవ్ ప్రపంచమంతా “యోగామయం” చేయాలని కంకణం కట్టుకున్నాడు! యోగా ద్వారా అద్భుతాలు జరుగుతాయని శారీరక మానసిక లాభాలు చేకూరుతాయని ప్రకటిస్తున్నారు. బరువు తగ్గడానికి, రోగ నివారణకు, స్ట్రెస్ అరికట్టడానికి, రిలాక్స్ అవ్వడానికి, దేహ పరిశ్రమకు చక్కని విధానం యోగా అని ప్రచారం జరుగుతోంది. అందరితోపాటు ఎందరో క్రైస్తవులు మరియు వారి పిల్లలు కూడా బహు జోరుగా, హుషారుగా యోగా చేస్తున్నారు. యోగా చేయడం వలన చాలా హాయిగా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఇంతకీ క్రైస్తవులు యోగా చేయవచ్చా? యోగా అంటే ఏమిటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకున్నారా? లేదు కదూ!? చదవండి మరి. యోగా హిందుమతం నుండి ఉద్భవించినది. దాదాపు 5000 సంవత్సరాలుగా యోగా ఉనికిలో ఉన్నట్లు మత గ్రంథాలు తెలుపుతున్నాయి. క్రీ.శ. 150లో పతాంజలి అను హైందవ గురువు యోగాను బాగా ప్రసిద్ధి చేశాడు. పతాంజలి రచించిన “యోగా సూత్రాలు” యోగాకు సంబంధించిన వాటిలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. “యోగా” ఒక సంస్కృత పదం. దాని అర్థం “కాడి” (Yoke) లేక “కలయిక” (Union)! యోగా ద్వారా ఒక వ్యక్తి ఆత్మను పరమాత్మ లేక బ్రహ్మతో కలుపుటయే పరమార్థం! మనుష్య ఆత్మ దేవునిలో “లీనమై” పోవుటే!!
పతాంజలి యోగాను క్రమబద్దీకరించి దానిని ఎనిమిది శాఖలుగా చేసాడు. దానినే “అష్టాంగ యోగా” అంటారు. “అష్ట” అనగా “ఎనిమిది”, “అంగ” అనగా “అంగములు” అని అర్థం. అవి అజ్ఞానం నుండి జ్ఞానోదయమునకు నడిపే ఎనిమిది మెట్లుగా పరిగణించబడుతున్నాయి. 1. యమ (నిగ్రహం) 2. నియమ (మత ఆచారములు) 3. ఆసన (ఆసనాలు) 4. ప్రాణాయామ (శ్వాస అభ్యాసాలు) 5. ప్రత్యాహర (ఇంద్రియ నిగ్రహం) 6. ధారణ (ఏకాగ్రత) 7. ధ్యాన (ధ్యానం) 8. సమాధి (జ్ఞానోదయం). ఈ మెట్ల పై పయనం బ్రహ్మతో కలయికకు దారి తీస్తోంది. యోగా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో బహిర్గతమౌతోంది! “యోగా మూలోపదేశం మానవుని నిజమైన స్వభావం దైవికమైనది అన్నదే” అని స్వామి అజయ ఓసారి పేర్కొన్నారు. ఇది బైబిల్లో లో మానవుని గూర్చి వ్రాయబడిన దానికి భిన్నమైనది! యోగా ద్వారా మానవుడు సృష్టిపై తన అధికారం కలిగి యుండగలడని నేర్పబడుతోంది. పతాంజలి యొక్క యోగా సూత్రాలపై వ్యాఖ్యానిస్తూ స్వామి వివేకానంద, “యోగి యొక్క లక్ష్యం సృష్టిని అదుపు చేయడం, సర్వలోకాన్ని తన అధీనంలోకి చేసుకోవడమే” అని అన్నారు. యోగా “మనస్సును అదుపు చేయు శాస్త్రము” (Science of Mind control) అని స్వామి యోగానంద పేర్కొన్నారు. యోగాలో ప్రస్తుతం బాగా ప్రచారంలో ఉన్నది రాజాయోగాకు సంబంధించిన “హతయోగా.” ఈ హతయోగాను శారీరక యోగా (Physical Yoga) అని అంటారు. హతయోగాలో ప్రధానమైనవి రెండు – 1. ఆసన 2. ప్రాణయామ. ఆసనలో అనేక ఆసనాలు వ్యాయామ రూపంలో ఉంటాయి. ప్రాణయామ శ్వాస నియంత్రణకు సంబంధించినది.
హతయోగాలో అనేక ఆసనాలు (Postures) ధ్యానానికి తోడ్పడుటకు మరియు తీవ్రమైన మానసిక అభ్యాసాల కొరకు శరీరమును ధృడ పరుచుటకు దోహదపడుతాయి. తుదకు దేవుడితో కలయికకు దారితీస్తాయి. “క్రమశిక్షణతో కూడిన క్రియ, స్వయం పఠన మరియు పరమేశ్వరుని సమర్పణ యోగాలోని నియమాలు” అని యోగా సూత్రాలు 11:1 తెలుపుతోంది. యోగా పూర్తిగా హిందుమతంతో ముడిపడి వుంది! యోగాను హిందుమతం నుండి వేరు చేయడం చేపను నీటి నుండి వేరు చేయడం లాంటిదే! యోగా ద్వారా మానవుడు తన బంధకంలో నుండి విముక్తి పొంది పరమాత్మలో లీనమైపోగలడని చెబుతున్నారు. యోగా, ధ్యానం మరియు శ్వాస అదుపు చేయడం (Breath control) ద్వారా మానవుడు విముక్తిని లేక విమోచనను పొందగలడా? యోగా సిద్దాంతం మానవుడు తన అంతరాత్మలో దైవికమని కాని పై శరీరం మరియు వ్యక్తిత్వం కేవలం “మాయ” అని నేర్పతోంది. అవి అతనిని తనలోని దైవత్వమునుండి వేరు చేస్తున్నాయని బోధిస్తుంది. కనుక యోగా యొక్క గురి మానవునిలో “మాయ”లా ఉన్న వెలుపలి వ్యక్తిత్వాన్ని పడగొట్టడమే (Dismantle)! తద్వారా తాను లోపలి దైవత్వమును వెలికి తీయగలడు. యోగా పండితులు ప్యూర్టోన్ మరియు మిల్లర్, “యోగా ద్వారా మెళ్ళిగా మానవుని వ్యక్తిత్వాన్ని పడగొట్టి తుదకు నిర్మూలము చేయడం జరుగుతుంది. యోగా ప్రతి “అంగ” ము ద్వారా “మానవుడు” అని మనం పిలుచుకునే వాడు మరికొంత పడగొట్టబడుచున్నాడు” అని పేర్కొన్నారు! నిజానికి ఈ పద్ధతులు మానవుని మోసం చేసి, మభ్యపెట్టి వానిని పూర్తిగా బంధించేస్తున్నాయి.
ఆసనాలతో ప్రారంభమై ఆ తదుపరి ఆధ్యాత్మిక ధ్యానంలోనికి దిగుతుంది. ఆసనాలు వేసే సమయంలో ధ్యానించమని కోరతారు. “మనస్సును పూర్తిగా ఖాళీగా” చేసుకుని ఏ ఆలోచనకు తావు ఇవ్వకుండా ఉంచమని నేర్పుతారు. యోగా ధ్యానాలు “మనస్సును ఖాళీ”గా చేసి పెడితే క్రైస్తవ్యం ధ్యానం మన “మనస్సు నిండా” దేవుని వాక్యమును నింపి దానిని ధ్యానించేట్టు చేస్తుంది! ఏది క్షేమకరమో ఇట్టే అర్థమౌతోంది. ప్రాణయామ కొన్ని సంధర్భాల్లో ప్రమాదకరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానిని సరిగ్గాచేయని వారికి వాటిల్లే ప్రమాదం గూర్చి హతయోగా ప్రదీపిక 2:15 హెచ్చరిస్తోంది, “సింహాలు, ఏనుగులు మరియు పులులను సాధు పరిచినట్లే, ప్రాణ (అనగా శ్వాస లేక ఊపిరి)ను అదుపులో ఉంచాలి. లేని ఎడల అది సాధకుని చంపగలదు.” స్లో పాయిజన్ ఇది పని చేసి హానికరమైన స్థితిలోనికి నడుపుతుంది. యోగా మాదకద్రవ్యంలా మానవ మేథస్సు పై ప్రభావం చూపుతుంది. అపవాదికి చోటు ఇవ్వడానికి పూర్తి ఆస్కారం ఉంది! “యోగా కేవలం శారీరక లేక మానసిక వ్యాయామం కాదు అది ఆత్మీయ అభ్యాసమై యుంది” అని యోగా ప్రముఖుడు రిచర్డ్ హిట్టల్మాన్ వ్రాశాడు! యోగా క్రైస్తవులకు ఏ మాత్రము మేలుకరము కాదు. దేవుని వాక్యం మనకు ప్రతి విషయంలో వివేచన కలిగి ప్రవర్తించమని హెచ్చరిస్తోంది. “సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి” (1థెస్స 5:21) అని వ్రాయబడినది. ఈ కాలపు క్రైస్తవులకు ఈ లక్షణం బొత్తిగా లోపించింది. అందుకే ఎటుపడితే అటు కొట్టుకుపోతున్నారు (ఎఫెసీ 4:14),
యోగా మనలను “నిజదేవుని” యొద్దకు నడిపించదు. సత్యమైన సజీవునితో “కలయిక”కు తోడ్పడదు. యోగా యేసు క్రీస్తుని కూడా గొప్ప గురువులుగా పేరు పొందిన బుద్ధ, శ్రీకృష్ణ మరియు మోహమ్మదులతో ఒకటి చేస్తోంది. దేవుని యొద్దకు చేరేందుకు అనేక మార్గాలు కలవని, అన్ని మంచివేనని యోగా నేర్పుతోంది! “నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” (యోహాను 14:6) యేసు పలికిన మాటలు మరువకూడదు! బంధకాలలో నుండి బయట పడాలంటే ఆశ్రయించాల్సింది యోగాను కాదు మనం ఆశ్రయించాల్సింది ప్రభువైన యేసు క్రీస్తును! “ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును” (మత్తయి 11:28) ఎంత గొప్ప ఆహ్వానం!! మనముండాల్సింది అనామకుని కాడి క్రింద కాదు మనముండాల్సింది ఆ అద్వితీయ నాథుడైన యేసు కాడి క్రింత (మత్తయి 11:29-30). యేసు కాడి తప్ప లోకములోని ప్రతి కాడి భారమైనది మరియు నాశనకరమైనది! ఎద్దు మీద కాడి మోపినప్పుడు మొదట్లో అది తేలికగా ఉంటుంది, కాని బండిలో బరువులు నింపినప్పుడు దాని భారం తెలుస్తుంది. యోగా కూడా మొదట్లో ఉల్లాసంగా, హాయిగా ఉంటుంది కాని ఆ తరువాత అది ఆత్మపై విపరీతమైన బరువుగా మారుతుంది!
మనము లీనమౌవ్వాల్సింది యేసు క్రీస్తులో, “నా యందు నిలిచి యుండుడి, మీ యందు నేనును నిలిచియుందును” (యోహాను 15:4). ఒక వేళ క్రైస్తవులు యోగాలో శాంతిని మరియు హాయిని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటే వారు లోకమిచ్చే శాంతికొరకు అశాశ్వితమైన కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు, యేసుక్రీస్తు మార్గమును కాదు. (యోహాను 14:27) మన యెదుట సత్యమును పెడుతోంది “శాంతిని మీ కనుగ్రహించి వెళ్ళుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుట లేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి”.
యోగా వలన కలిగే ఫలము ఏమిటి ? భ్రమ, కృత్రిమ శాంతి, క్షణికపు హాయి, కొంత ఆరోగ్యము కాని జరిగే నష్టం నిత్యమైనది మరియు నాశనకరమైనది! యేసు క్రీస్తు అనుగ్రహించు నిజమైన శాంతి క్రైస్తవుని అన్ని పరిస్థితులలో నెమ్మదితో నిలబెడుతుంది. కేవలం వ్యాయామం లేక ధ్యానం చేసేటప్పుడు మాత్రమే కాదు!
మనం కోరుకోవాల్సింది యోగాను కాదు యేసును. మనం నేర్చుకోవాల్సింది యోగా ద్వారా కాదు యేసు ద్వారా!
Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu Should Christians Do Yoga Telugu
More Bible Question And Answers…….click Here