డా.ఇడా స్కడ్డర్ జీవిత చరిత్ర.
వేళ్లూరు వైద్య కళాశాల స్థాపకురాలు
ida scudder life story in telugu
ఒక రాత్రి వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు 19 ఏండ్ల ఇడా స్కడ్డర్ యొక్క భవిష్యత్ కలలను చెదరగొట్టి మిగతా డెబ్బది సంవత్సరములు జీవించుటకు ఒక ఉద్దేశ్యము ఆమెలో కలిగించెను. ఆ రోజు జరిగిన అనుభవముల ద్వారా దేవుడు ఆమెతో ఎంతో నాటకీయముగా మాటలాడెను. ఆమె ఎంచుకొనవలసిన మార్గమును దేవుడు తనకు స్పష్టముగా తెలియజేయుచున్నాడని ఆమె గ్రహించెను.
1890 లో దక్షిణ ఇండియా నందు మిషనరీలుగా ఉన్న తన తల్లిదండ్రులను దర్శించుటకు వచ్చిన ఆమెకు మహిళా వైద్యుల యొక్క అవసరత ఎంతో ప్రాముఖ్యముగా తోచెను. అప్పటిలో మిషన్ డాక్టర్గా ఉన్న ఆమె తండ్రి వద్దకు ఒక దినము ముగ్గురు వ్యక్తులు ప్రసవవేదనతో బాధపడుచున్న యుక్తవయస్సులో ఉన్న తమ భార్యలను తెచ్చిరి. వారు బ్రాహ్మణ, ముస్లిమ్ మరియు హిందూ మతమునకు చెందినవారు. కాని అక్కడ మహిళా వైద్యురాలు లేనందున ఆయనతో వైద్యము చేయించుకొనుటకు ముగ్గురునూ తిరస్కరించిరి. బ్రాహ్మణుడైన వ్యక్తి ఇడాస్కడ్డర్తో ఈ విధముగా పలికెను. ‘వేరొక పురుషుడు నా భార్యను చూచేకంటే ఆమె మరణించుటే ఉత్తమము’. ఆ ముగ్గురు స్త్రీలు మరుసటి దినమున మరణించిరి. ఇడా యొక్క హృదయము వారికి సహాయము చేయవలెనని ఎంతో ఆశించినను వారికి ఏమీచేయలేని అశక్తురాలై ఉండుట ఆమెను కృంగదీసింది. ఆమె వెంటనే ప్రతిస్పందించినది. ఆమె తన తల్లిదండ్రులతో ‘నేను వైద్య విద్యను అభ్యసించుటకు అమెరికా వెళ్ళుచున్నాను, నేను తిరిగి వచ్చి ఇండియాలోని మహిళలకు సహాయము చేయవలెనని నిశ్చయించుకొంటిని’ అని పలికెను.
వైద్య విద్యార్థినిగా స్కడ్డర్ :
ఇడా స్కడ్డర్ ఎంతో గొప్ప చరిత్ర కలిగి మిషనరీ డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు గల కుటుంబములో నుండి వచ్చినది. 1891లో ఆమె తాతగారు అమెరికా నుండి ఇండియాకు మొట్టమొదటి మెడికల్ మిషనరీగా వచ్చిరి. అప్పటి నుండి వారి కుటుంబములో 30 మంది వరకు డాక్టర్లుగా పరిచర్య చేసిరి. ఆమె తండ్రి ఆర్కాట్ మిషన్ (Arcot Mission) తరుపున పనిచేసెను. అది అతని ముగ్గురు సహోదరులచే స్థాపించబడినది. ఇడా తన తండ్రి యొక్క అడుగుజాడలలోనే నడుచుటకు ఇష్టపడినది. తమ చర్చివారి సహాయముచే 1895లో ఫిలడెల్ఫియా (Philadelphia) లోని మహిళా వైద్య కళాశాల నందు చేరినది. కాని తన చివరి సంవత్సరములో కార్నెల్మెడికల్ కళాశాల (Cornell Medical College) నకు మారినది. తన విద్యపూర్తి అయిన వెంటనే తన తండ్రివద్ద కొంతకాలము పనిచేయుట ద్వారా ప్రయోగాత్మకమైన అభ్యాసము చేసినది. ఆ దినములలో ఆమె తండ్రి కలరాకు టీకా మందులు తయారుచేయు ప్రక్రియలో ఉండెను.
ఆమె యొక్క ఉద్దేశ్యమును తెలిసికొనిన మిషన్వారు ఆమెను అంతకుమునుపు ఆమె తండ్రి పనిచేసిన వెల్లూరు నందు మహిళల నిమిత్తమై ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయవలెనని కోరిరి. ఆ సమయములో కేవలము మహిళా వైద్యురాలి వద్ద మాత్రమే వైద్యమును స్వీకరించుటకు అనేక వేలమంది హిందువులు, ముస్లింలు వేచి యుండిరి. కనుక ఆసుపత్రి ఆరంభించుట ఎంతో అవసరమై వుండెను. ఇడా తనకు అవసరమైనంత ధనమును చందాల ద్వారా ప్రోగుచేసి 1899లో వెల్లూరునకు వెళ్ళెను.
వైద్యురాలిగా ప్రజల యొక్క అభిమానమును చూరగొనుట తేలికైన పనికాదు. ఆమె ఇండియాకు వచ్చిన కొన్ని దినములలోనే ఆమె తండ్రి మరణించెను. క్రొత్తగా ఏర్పరచిన వైద్యశాల బాధ్యతను ఎటువంటి సహాయము లేకుండా ఆమె ఒంటరిగా చేపట్టెను. ప్రజలు చాలాకాలము వరకు ఆమె వద్ద చికిత్స చేయించుకొనుటకు సుముఖత చూపలేదు. చాలా దినముల తరువాత ఆమె బంగ్లాకు ఒక రోగి వైద్యము కొరకై వచ్చెను. ఆ తరువాత 2 వారములలో అనేక మంది టి.బి, టైఫాయిడ్, అల్సర్, కళ్ళవ్యాధులు, కాన్సర్ మరియు కుష్టు రోగులు చికిత్స నిమిత్తమై రాసాగిరి. కలరా మరియు మలేరియా సాధారణముగా వచ్చు వ్యాధులైనప్పటికి వాటిని నివారణ చేయు అవకాశములు ఎక్కువగా ఉన్నది.
అనేక వ్యాధులకు మూలకారణము పోషకాహార లోపము, అధిక జనాభా మరియు పరిశుభ్రత లోపము. వీనికి తోడు మూఢనమ్మకాలు, నాటువైద్యము, ప్రజల అజ్ఞానము వంటి అనేక కారణములు వారి చావునకు దారితీసెడివి. జ్ఞానము కల్గి, సంపన్న వర్గాలకు చెందిన హైందవులు కూడా భయాలకు, వెలివేతకు గురి అయ్యేవారు. అనేకమంది నాటువైద్యము వాడుచూ నిర్లక్ష్యము చూపెడివారు. కొన్ని పండుగల సమయములలో రోగులు వైద్యము నిమిత్తము ఆసుపత్రికి వచ్చుట మానివేసెడివారు.
స్త్రీలకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పరచుట:
వెల్లూరు నందు స్త్రీలకు ప్రత్యేక ఆసుపత్రి 1902 సెప్టెంబరులో ప్రారంభించబడెను. దానికి ముఖ్య పోషకురాలిగా ఉండిన Mary Tabe Schell పేరున దానిని ఆరంభించిరి. మొదటిలో 30 పడకలతో రెండు వార్డులుగా చేసిరి. ఒక వార్డులో పేదలైన రోగులను ఉచితముగా చేర్చుకొనిరి. మరి యొకటి ధనికవర్గ ప్రజలకు కేటాయించుటద్వారా ధనసహాయమును పొందగలిగిరి. స్థానిక స్త్రీ అయిన సలోమి (Salomi) అను ఒక సహాయకురాలిని ఏర్పాటుచేసుకొని ఇడా 20 పెద్ద ఆపరేషన్లు, 420 చిన్న ఆపరేషన్లు చేసి మొదటి సంవత్సరములోనే 12,539 రోగులకు వైద్య సేవలందించెను.
ఆ సమయములో ఆమె రెండు కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొనెను. మొదటిది కరువు పది సంవత్సరములు వరుసగా వర్షాలు లేని కారణముచే కరువు సంభవించెను. రెండవది ప్లేగు వ్యాధి. నాలుగువందల ప్రజలు 3 వారాల లోపే మరణించిరి. స్థానికులు అనేకులు తమ ఇళ్ళను వదలి Kale అను మరణదేవతను పూజించుటకును, స్వస్థత కొరకు ప్రార్థించుటకు వెళ్ళిపోయిరి. 2 సంత్సరాల తరువాత ఆసుపత్రి 42 పడకలతో విస్తరింపబడెను. ఇడాకు సహాయకులుగా మరియొక డాక్టరు, శిక్షణ పొందిన నర్సు చేరిరి. తరువాత ఆమెకు సహాయము చేయుటకు పదకొండు మంది ఇండియా దేశపు స్త్రీలు వచ్చిరి. వారందరికి నర్సులుగా వుండుటకు శిక్షణ నిచ్చెను. ఆ సమయములో ఆమె రెండు లక్ష్యములను తన ముందు ఉంచుకొనినది. నర్సులకు శిక్షణ నిచ్చుటకై ఒక స్కూలును ఏర్పరచుట, గ్రామాలలో వైద్య సేవలందించుటకు ఒక కార్యక్రమమును రూపొందించుట. అమెరికాకు సెలవుల నిమిత్తమై వెళ్ళినపుడు ఆమె నర్సింగ్ స్కూలకు కావలసిన నిధిని సమకూర్చెను. ఆమె మొదటిగా 15 మంది విద్యార్థినులతో దానిని ప్రారంభించెను. నాలుగేళ్ళల్లో ఆసుపత్రినందు 18 మంది నర్సులు శిక్షణ పొందినవారై ఉండిరి. ఆమెకు బహుమానముగా వచ్చిన కారులో ఆమె గ్రామములను క్రమముగా దర్శించెడిది. మొదటిలో భయపడినప్పటికిని, గ్రామస్థులు ఈ సదుపాయమును ఉపయోగించుకొనుటకు ఆసక్తి చూపిరి. కొన్ని గుర్తింబడిన స్థలాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసెడిది. అనేక రకాల వ్యాధులతో ప్రజలు చికిత్సకై వచ్చెడివారు. అందరూ ప్రార్థనా పూర్వకముగా, ప్రేమతో వైద్యమును పొందగలిగేవారు. ధనిక వర్గ ప్రజలు కూడా ఆమెవద్దకు వచ్చుటకు ఇష్టపడిరి. ప్రజలకు ఆమె చేయు సేవలకు ఆశ్చర్యపడి ఒక గ్రామస్థుడు ఆమెను ‘అవతార్’ విష్ణుదేవుని యొక్క అవతారముగా భావించెను. తరుచుగా ఆమె గ్రామముల మధ్య ఆగి అత్యవసరతలో ఉన్న ప్రజలకు సహాయము చేసెడెది. అనారోగ్యముతో బాధపడుచున్నవారికి పరిచర్య చేసెడిది. అనేకమార్లు ఇడా ఆపరేషన్ బల్లను రోడ్డు ప్రక్కగా నిలిపి విజయవంతముగా వారికి గల వ్యాధికి చికిత్స చేసెడిది. వారు కృతజ్ఞతగా ఆమెకు ఏదో ఒక బహుమానమును ధన లేక వస్తురూపములో ఇచ్చెడివారు.
మెడికల్ కళాశాల ఏర్పాటు:
మెడికల్ స్కూలును ప్రారంభించవలెనను ఆలోచన ఆమెకు కలిగెను. కాని భారతస్త్రీలే వైద్యవిద్య నభ్యసించుటకు వారి మత నిబంధనలు అంగీకరించునో లేదో అని సందేహించెను. కాని ఆమె యొక్క ప్రణాళికలు అనుమతించబడి ఆమెనే మొదటి ప్రిన్సిపాల్గా నియమించిరి. కాని 1914లో యుద్ధము వలన కొంతకాలము ఈ ప్రతిపాదన వెనుకపడెను. చివరకు 1915లో మెడికల్ స్కూల్ను ప్రారంభించిరి. 17 మంది విద్యార్థినిలుగా చేరిరి. వారిలో ముగ్గురు తరువాత మానివేసిరి. చివరకు 6గురు మాత్రమే డిగ్రీని పొందగలిగిరి. ఈ ఫలితములు మిగతా పురుషులు కళాశాలలకంటె ఎంతో మెరుగైనవిగా ఉండెను.
వెల్లూరు హాస్పిటల్ను క్రమముగా అభివృద్ధి పరచిరి. అనేక వార్డులను నెలకొల్పిరి. 1924లో డాక్టర్ ఇడా ఆసుపత్రి భవనమును కొరకై పట్టణము వెలుపల రెండు వందల ఎకరముల స్థలమును కొని దానిని పునర్మించవలెనను తన ఆలోచన నెరవేరుటకై బహుగా ప్రయాసపడెను. 1928 మార్చి నెలలో మద్రాసు గవర్నర్ గారిచే శంఖుస్థాపన జరిగెను. ఈ దినమున నూతన భవన సముదాయము 1300 పడకలచే, పరిశోధనా భవనములు, 14 థియేటర్లు కలిగిన Operating Complex మరియు క్రొత్త Schell నేత్ర వైద్యశాలలో అనేకమంది రోగులకు వైద్యసేవలు అందించుచున్నది.
మెడికల్ స్కూలును కాలేజిగా పునరుద్దరించుట ఆమె యొక్క స్వప్నము. దీనివలన లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ డిప్లొమా స్థానములో డిగ్రీలను పొందవచ్చును. ఈ విధమైన మార్పు అత్యవసరమైనది. ఎందుకనగా గవర్నమెంట్ వారు డిప్లొమా కోర్సును అనుమతించరాదని నిర్ణయము తీసికొనిరి. ఈ ప్రణాళికకు మిషను బోర్డు వారిలో అనేకులు వ్యతిరేకతను చూపినప్పటికిని అమెరికాలోని సభ్యులు కొందరు దాని ఆవశ్యకతను గుర్తించిరి. ఇడా యొక్క స్నేహితులలో అనేకమంది ఆమె యొక్క పోరాటమునకు వ్యతిరేకత చూపిరి. అనేక సంవత్సరములు చర్చనీయాంశముగా మారిన పిమ్మట చివరకు 1942 లో మహిళా డిగ్రీ కళాశాలకు అనుమతి లభించెను. 1947లో ఈ నూతన కళాశాల మద్రాసు యొక్క గుర్తింపును పొందినది. తరువాత పురుషులను కూడా అనుమతించిరి. ఈనాడు అక్కడ 80 గుర్తింపు పొందిన శిక్షణా కార్యక్రమములు, పారామెడికల్, నర్సింగ్ మరియు మెడిల్ రంగాలలో నిర్వహింపబడుచున్నవి.
ముగింపు:
ఈ దినమున వెల్లూరు ప్రపంచ ప్రఖ్యాతి పొందినది. ప్రపంచ నలుమూలల నుండి వైద్యులు ఇక్కడకు వచ్చి నూతన వైద్య విధానాలలో అనేక వైద్య మెళకువలలో శిక్షణ పొందసాగిరి. డాక్టర్ ఇడా తన పదవి నుండి రిటైర్మెంట్ తీసుకొనిన పిమ్మట కూడా ఆమె అక్కడ జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమములో ఎంతో చురుకుగా పాల్గొనినది. ఆమె నడుపు మంగళవారపు బైబిల్ తరగతులు కూడా కొనసాగింపబడినవి. 1960 మే నెలలో తన 90వ యేట ఆమె మరణించెను. డాక్టరుగా ఎంతో అంకితముగా దేవుని సేవను చేసిన ఆమె జీవితము క్రైస్తవ మహిళలందరికీ ఆదర్శనీయమైనది.
ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి.
Wikipedia more about క్లిక్ హియర్
Great testimony