నడుము వంగిపోయిన స్త్రీ.
Healing the Woman with a Bent Back
“విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించు చున్నప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి- అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను.” (లూకా 13:10-13)
యేసుక్రీస్తు ఈ భూలోకంలో జీవించిన దినములలో ఆయన పరసంబంధమైన సంగతులను బోధించుటయే గాక; రోగులను స్వస్థపరచెను, దయ్యము పట్టినవారిని విడిపించెను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచుండెను. సమాజమందిరము అనగా అనేకులు కూర్చుండుటకు వీలుపడు ఒక హాలు వంటిది! ఆ సమాజమందిరములో అనేకులు ఉండిరి. అయితే పదునెనిమిది ఏండ్ల నుండి దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. Healing the Woman with a Bent Back
సామాన్యముగా బలహీనురాలని, అబలయని పిలువబడుతున్నది. అందుకే సాతాను అనేకసార్లు స్త్రీలను మోసగించుటకు, ఆవరించుటకు ప్రయత్నిస్తాడు. “మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను” (1 తిమోతి 2:13, 14) అని బైబిలు చెప్పుచున్నది. ఇచ్చట ఈ స్త్రీని పద్దెనిమిది సంవత్సరముల నుండి బలహీనపరచు దయ్యము వేధించుచుండెను.
దయ్యము బలహీనపరచునది! దేవునిచే సృష్టించబడిన మానవుడు సాతాను మాటలు విని, వానికి లోబడినప్పుడు దయ్యము అతనిపై పెత్తనము చెలాయించును. అతనిని బలహీనపరచి శారీరకంగా, మానసికంగా కృంగునట్లును; బ్రతుకుపై విరక్తి చెంది చనిపోవాలనే తలంపులతో నిండియుండునట్లును చేయును. మరికొన్ని సార్లు ఈ బలహీనపరచు దయ్యములు మనుష్యుని శరీరాన్ని వ్యాధులతో, రోగాలతో నింపును. మరికొన్ని దయ్యములు కొందిరిని నెమ్మది, సమాధానం లేని స్థితికి దిగజార్చి మతి స్థిమితం లేకుండా చేయును. దేవుడు నివసించవలసిన మన హృదయములో దేవునికి చోటివ్వనప్పుడు సాతాను జొరబడి మన ఆత్మలను కృంగదీయును. Healing the Woman with a Bent Back
పద్దెనిమిది సంవత్సరముల నుండి అట్టి స్థితికి గురియైన ఈ స్త్రీ నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలువలేకుండెను. దేవుడు మనలను చక్కగా సృష్టించాడు. మనం పరసంబంధమైన వారిగా ఉండునట్లు, తిన్నగా నిలబడునట్లు సృష్టించాడు. అయితే అనేకసార్లు సాతాను మనల్ని కృంగదీసి, లొంగదీసి భూ సంబంధమైన వాటినే చూచునట్లు వంగదీయుచున్నాడు. లోకములోని శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలకు గురియైన వ్యక్తి లోకము మీదనే తన మనస్సు పెట్టుకొని పరమందున్న ప్రభువు వైపు చూడలేక పోతున్నాడు.
అట్టిస్థితిలో ఉన్న ఈ స్త్రీ యేసును గురించి విని, ఆయన తన్ను విడిపించును అని నమ్మి సమాజమందిరములోనికి వచ్చినది. ఆశతో ఆయన మాటలు వింటున్నది. యేసు ఆమె హృదయాంతరింద్రియాలను చూచి; ఆమె స్థితిని, ఆమె అక్కరను ఎరిగి ఆమెను విడిపించుటకు ఆశించి రమ్మని పిలిచాడు. ఆ జనసమూహములో ఆమె ఆ పిలుపుకు లోబడి; నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న తన వికృత ఆకారాన్ని, తన నడకను చూచి ఇతరులు ఎగతాళి చేస్తారేమోనని సిగ్గుపడక ప్రభువు యొద్దకు వచ్చెను. Healing the Woman with a Bent Back
ఈనాడనేకమంది ప్రభువు దగ్గరకు వచ్చి, తమ నిజస్థితిని ఒప్పుకొనుటకు సిగ్గుపడుతున్నారు. అనేకమంది యేసుక్రీస్తును తమ రక్షకునిగా బహిరంగముగా ఒప్పుకొనుటకు భయపడుచున్నారు. “మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును” (మత్తయి 10:33) అని ప్రభువు చెప్పుచున్నాడు. అయితే ఈ స్త్రీ ప్రభువు ముందు నిలిచినప్పుడు, ప్రభువు ఆమెతో అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది యున్నావని చెప్పి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి, దేవుని మహిమపరచెను. (లూకా 13:12, 13)
గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆ స్త్రీ ‘పిచ్చిదానా,’ ‘దయ్యము పట్టిన దానా’, ‘వంకరదానా’, ‘గూనిదానా’ అని ఎన్నో రీతులుగా పిలిపించుకొని; ఎంతోమంది చేత తృణీకరించబడి, అవమానించబడెను. అయితే ప్రభువు ఆమెను ‘అమ్మా’ అని సంబోధించి, ఆమె బలహీనత నుంచి విడిపించెను. ఆమె మీద చేతులుంచగానే, అంతవరకు ఆమెను ఆవరించిన ఆ బలహీనపరచు దయ్యము ఆమెను విడిచి పారిపోయెను. ‘సర్వాధికారము నాకియ్యబడినది’ అని చెప్పిన క్రీస్తు యెదుట ఏ చీకటిశక్తులు, దురాత్మలు నిలబడలేవు. దయ్యము ఆమెను విడిచిన మరుక్షణమే ఆమె చక్కగా నిలబడి దేవుని స్తుతించెను. పద్దెనిమిది సంవత్సరముల నుండి ఆమెలో ఉన్న వంకరతనము యేసుక్రీస్తు ముట్టిన వెంటనే ఒక్కసారి మటుమాయమయ్యెను. Healing the Woman with a Bent Back
ఈ వర్తమానాన్ని శ్రద్ధగా చదువుచున్న ప్రియ పాఠకా! పుట్టుక నుంచి నిన్ను వెంబడిస్తున్న బలహీనతల నుండి, అనేక సంవత్సరాలుగా నీవు లోబడుటయే గాక బానిసవైపోయిన నీ పాపముల నుండి నిన్ను విడిపించుటకు యేసుక్రీస్తు సమర్థుడు. చక్కగా నిలబడిన ఆ స్త్రీ దేవుని స్తుతించెను. అంతవరకు ఆమె జీవితములో సుఖసంతోషాలు లేవు. ఇప్పుడు ఆమె స్తుతి కృతజ్ఞతలతో నిండియున్నది.
అయితే విశ్రాంతి దినమున యేసుప్రభువు స్వస్థపరచెనని అచ్చట ఉన్న సమాజమందిరపు అధికారి కోపపడగా, ప్రభువు వారితో “వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి, తోలుకొనిపోయి, నీళ్లు పెట్టును గదా. ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప దగదా?” (లూకా 13:15,16) అనెను. Healing the Woman with a Bent Back
ప్రభువు ఈ స్త్రీని గురించి ‘పద్దెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె’ అనెను. ఈ స్త్రీ బలహీనపరచు దయ్యము పట్టినప్పుడు కట్టబడిన స్థితిలో నిష్ప్రయోజకురాలిగా ఉండెను. అయితే ప్రభువు ఆమెను విడిపించినప్పుడు ఆమె అబ్రాహాము కుమార్తెగా అనగా విశ్వాసులకు పితరుడైన అబ్రాహాము సంతానముగా, పరలోకరాజ్య వారసురాలిగా మారినది.
ఒక స్త్రీ ఎంత బలహీనురాలైనా తాను ప్రభువు చేతులకు అప్పగించు కొన్నప్పుడు విడిపించబడి, బలపరచబడి, కొనియాడబడును.
బైబిల్ ప్రశ్నలు – సమాధానాలు కొరకు .. click here