Christian Telugu Message Pdf – ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు1

Written by biblesamacharam.com

Updated on:

ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు 

Christian Telugu Message Pdf

 మరణమును జయించి తిరిగి లేచుట గొప్ప అద్భుతము. పునరుత్థానము అను మాట క్రొత్త నిబంధనలో 104 సార్లు వ్రాయబడెను. లేఖనముల ప్రకారము ఆయన మూడవ దినమున లేపబడెను (1 కొరి 15:4). మరణమును జయించి ప్రభువు విజయుడాయెను. మరణపు ముల్లును విరచెను (1 కొరి 15:55). త్రాచుపాము కోరలను తీసివేసినచో మనము కూడ దానిని మెడలో వేసికొని తిరుగగలము. తేలు యొక్క కొండెను విరచినచో చిన్న పిల్లలు కూడా దానిని త్రాడు కట్టి ఆడించగలరు. ఆవిధముగానే ప్రభువు మరణమును జయించి నిరర్థకము చేసియున్నారు. 

 అందువలన పౌలు భక్తుడు “నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము” అని యేసు అనుచున్నాడు (ఫిలిప్పీ 1:21). ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలందరు సుగంధ ద్రవ్యములు ప్రభువు శరీరమునకు పూయుటకు క్రీస్తు సమాధి యొద్దకు వచ్చిరి. ఆ సమయములో ఇద్దరు ప్రకాశమైన దూతలు వారితో సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుచున్నారు? అని మాట్లాడిరి (లూకా 24:5). మరణము ఆయనను బంధించి యుంచలేకపోయెను. ప్రభువు మరణమును జయిస్తారు అని ఆదికాండములో ప్రవచనమున్నది. “అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదువు” (ఆది. 3:15). అనగా ప్రభువు మరణమును జయించినప్పుడు, పునరుత్థానుడైనప్పుడు సాతాను తల చితుక త్రొక్కబడెను. క్రీస్తు నలుబది దినములు శ్రమపడలేదు గాని, పునరుత్థానుడైన తదుపరి నలువది దినములు వారికి అగపడెను (అ.కా 1:3). ఆయన 11 సార్లు తన ప్రత్యక్షతను అగుపరచెను. 

  1. మగ్దలేనే మరియకు- యోహాను 20:11-18
  2. తక్కిన స్త్రీలకు మత్తయి 28:1 – 10
  3. ఎమ్మాయి శిష్యులకు లూకా 24:13-22
  4. పేతురుకు లూకా 24:34
  5. 10 మంది అపొస్తలులకు-యోహాను 20:19-25
  6. 11 మందికి -యోహాను 20:26-29
  7. తిబెరియ సముద్రము దగ్గర – యోహాను 21:1 – 14
  8. 500 మందికి – 1 కొరింథి 15:6
  9. ఒలీవ కొండ మీద – మత్తయి 28:16
  10. ఆరోహణమైనప్పుడు – లూకా 24:44-53
  11. సౌలుకు-అ.కా 9:5 

ప్రభువు పత్మాసు ద్వీపములో యోహానుకు దర్శనమిస్తూ “ఇదిగో యుగయుగములు సజీవుడైయున్నాను” (ప్రకటన 1:18) అని నుడివెను.

సజీవుడైన క్రీస్తు చేసిన కార్యములు

అ) భయమును తొలగించెను 

 తనయందు విశ్వాసముంచిన స్త్రీలకు భయమును, అనుమానమును తొలగించెను. అందుకే భయపడకుడి అను వాగ్దానమును ఇచ్చెను (మత్త 28:5). భయము పాపమువలన కలుగుచున్నది. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు భయపడి దాగుకొనిరి (ఆది. 3:10). సహోదరుడా నీవు పాపము చేసినప్పుడు భయపడుదువు. చిన్నతనములో నేను తప్పుచేసినప్పుడు మంచము క్రింద దాగుకొనెడివాడను. దొంగలు, నరహంతకులు భయపడుదురు. దుష్టుడు భయపడి పారిపోవును. అయితే నీతిమంతుడు సింహమువలె యుండును (సామె 28:1). మనుష్యులు మరణమునకు భయపడుదురు. 

 ఒక స్త్రీ తన భర్తమీద దెబ్బలాడి చనిపోవుటకు బావి దగ్గరకు వచ్చెను. అయితే ఆ బావిలో కప్పలను చూచి భయపడి వెనుకకు తిరిగి వచ్చెను. ప్రాణము అంటే భయమే గదా! ఆయన సిలువ మరణము ద్వారా మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని ఓడించి మరణ భయముచేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించెను (హెబ్రీ 2:15). 

 మగ్దలేనే మరియ నేను ప్రభువును చూచితిని అని శిష్యులకు చెప్పెను. అయినను వారు యూదులకు భయపడి యింటి తలుపులు మూసియుండిరి. ప్రభువుతో 3 1/2 సం||లు సహవాసము చేసినప్పటికి వారిలో భయము పోలేదు. మనము కూడ ప్రభువును నమ్మినప్పటికి భయపడుచుందుము. సమాజమునకు, బంధువులకు భయపడుదుము. దావీదు సౌలుకు భయపడలేదు. నేనెవరికి భయపడుదును? అని అనుచున్నాడు. ఎందుకనగా ప్రభువు తనకు వెలుగు, రక్షణ అయి యున్నాడు (కీర్త 27:1). హతసాక్షులైన దేవుని బిడ్డలు మరణమునకు భయపడలేదు. తమ ప్రభువు సజీవుడని వారు ఎరుగుదురు. సోదరీ, సోదరుడా! ప్రభువును బట్టి ధైర్యముగా ఉన్నావా? నేను ఒక పర్యాయము వాక్యము చెప్పుచుండగా ఒకడు కత్తిపట్టుకొని నామీదికి వచ్చెను. అయినను నేను భయపడలేదు. ప్రభువు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు (రోమా 8:31). మరికొంతమంది దయ్యములకు భయపడుదురు. అయితే దయ్యములు దేవుని బిడ్డలకు భయపడును (లూకా 10:20). భయపడుతున్న శిష్యులకు ప్రభువు ధైర్యము చెప్పెను. మీకు సమాధానము కలుగును గాక అని చెప్పెను (యోహా 20:19). 

ఆ) సజీవుడైన క్రీస్తు కన్నులు తెరచెను: (లూకా 24:31) 

 ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్న శిష్యులు ప్రభువును గూర్చి మాటలాడుకొనుచు వెళ్ళుచుండగా ప్రభువు వారితో నడచెను. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అనేకసార్లు మనము ప్రభువును గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితిని కలిగియున్నాము. వాక్యమును చదువుచు, పాటలుపాడుచు, చర్చికి వెళ్ళుచున్నప్పటికి కన్నులు తెరవబడుటలేదు. యుగసంబంధమైన దేవత (సాతాను) మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించుచున్నాడు (2 కొరింథి 4:4). అనేకులు నిజదేవుని గుర్తించక వ్యర్థమైన వాటిని ఆరాధించుచున్నారు. 

 యేసుప్రభువు సముద్రము మీద నడచి వస్తున్నప్పుడు శిష్యులు భూతమని తలంచిరి (మార్కు 6:49). ఈనాడు చాలా మందికి నిజదేవుడు భూతముగాను, భూతములు దేవునిగా కనబడుచున్నారు. ఎంత విచారము! పరిశుద్ధత, సత్యము, ప్రేమ, నీతి, కనికరము ఎవరిలో కనబడుచున్నవో ఆయనే నిజదేవుడు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడు (రోమా 9:5). పాపము మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయుచున్నది. ఎఫెసీయులు ఒకప్పుడు గ్రుడ్డితనము కలిగియున్నారు. వారు అర్తెమి దేవతను ఆరాధించువారు. దేవతలు కష్టార్జితమును, పశువులను, గొట్టెలను, కుమారులను మ్రింగివేయుచున్నవి (యిర్మి 3:24). దైవజనుడైన పౌలు ఆ పట్టణములో సువార్త అందించినప్పుడు, చేతులతో చేయబడినవి దైవములు కావని ఆయన చెప్పినప్పుడు అనేకుల మనోనేత్రములు తెరువబడెను (ఎఫెసీ 1:17). ప్రియ సోదరుడా! నీ మనో నేత్రము వెలిగించబడినదా? 

 హాగరు కన్నులు ప్రభువు తెరచెను (ఆది 21:19). బెయేర్షబా అరణ్యములో నీళ్ళులేక తన కుమారుడు మరణ స్థితిలో ఉండగా ఆమె ఎలుగెత్తి ఏడ్చెను. వాక్యము అనే నీరు లేనట్లయిన ఆత్మ మరణము సంభవించును గదా! అందువలన దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అని ప్రభువు పిలచుచున్నారు (యెష 55:1). సహోదరుడా నీకు ఆత్మ సంబంధమైన దప్పికయున్నదా? గాలి, నీరు, ఆహారము జీవనాధారము. సమరయ స్త్రీ శరీర సంబంధమైన దాహముతో యాకోబు బావి దగ్గరకు వచ్చెను. 

 అయితే ప్రభువు ఆమె యొక్క ఆత్మసంబంధమైన దాహము తీర్చెను. తాను చేసిన పాపము తనకు అర్థమైనది. మెస్సయ్యను గుర్తించింది. హాగరు కన్నీరు విడచినప్పుడు ఆమె కన్నులు తెరవబడెను. స్నేహితుడా! నీ హృదయమును ప్రభువు దగ్గర క్రుమ్మరించితివా? నీవు చేసిన పాపములకై పశ్చాత్తాపపడుచున్నావా? దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును (2 కొరింథి 7:10). హాగరు కన్నులు తెరువబడినపుడు నీళ్ళ ఊట చూచెను. మన ప్రభువు జీవజలముల ఊట (యిర్మి 2:13). 

 యోనాతాను ఫిలిష్తీయులతో యుద్ధము చేయగా ఫిలిష్తీయులు ఓడిపోయిరి. తదుపరి తన చేతికఱ్ఱ కొనను తేనెపట్టులో ముంచి తినగా అతని కన్నులు ప్రకాశించెను (1 సమూ 14:27). యోనాతాను జయించెను. తనతో ఉన్నవారిని ధైర్యపరచెను. గొప్ప రక్షణ కలుగజేసెను (1 సమూ 14:45). నీ కన్నులు ప్రకాశించినపుడు నీవును జయించగలవు. శత్రువైన సాతాను విజృంభించుచున్నాడు. వానిని జయించవలెను. విశ్వాసయాత్రలో అనేకులను బలపరచి ప్రోత్సహించవలసియున్నాము. అంతమాత్రమేగాక ఇతరులను రక్షణలోనికి నడపబలసి యున్నాను అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి (యూదా 23వ). రక్షింపబడుట రక్షించుట కొరకే అని విలియంబూత్ అను దైవజనుడు చెప్పెను. యోనాతాను, క్రీస్తుకు ముంగుర్తుగా యున్నాడు. ఆయన మనకు గొప్ప రక్షణ కలుగజేసెను (హెబ్రీ 2:3). ప్రభువు రొట్టెను విరచి ఎమ్మాయి శిష్యులకు ఇచ్చినపుడు వారి కన్నులు తెరవబడెను (లూకా 24:30-31). ప్రభువు సిలువ దగ్గరకు వచ్చినపుడు మాత్రమే మన కన్నులు తెరవబడగలవు. 

ఇ) సజీవుడైన క్రీస్తు బలపరచును: 

 ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరిగియున్నానని పౌలుగారు చెప్పిరి (ఫిలిప్పీ 3:11). పూర్వము దూషకుడు, హానికరుడైన సౌలు పౌలుగా మారెను (1 తిమో”1:12). దమస్కు గేటు దగ్గర ప్రభువు మాట్లాడినపుడు రక్షింపబడెను. అప్పటివరకు యేసు మరణించాడని, ఆయన తిరిగి లేవలేదని సౌలు తలంచెను. ఎప్పుడైతే ప్రభువు మాట్లాడగా ప్రభువా నీవు ఎవరవు? అనుచున్నాడు. అవును ప్రభువు సజీవుడు. అక్కడే సౌలు యేసును ఎరిగియున్నాడు. ఆ దర్శనమునకు అవిధేయుడు కాలేదు (అ॥కా 26:19). సింహములాంటి వాడు గొఱ్ఱపిల్లగా మారాడు. సౌలు అను మాటకు పెద్దవాడు అని అర్థము. పౌలు అనగా చిన్నవాడు. అందువలన చిన్నబిడ్డవలె ప్రభువా నేనేమి చేయవలెను అని అనుచున్నాడు (అ॥కా 22:10). 

 ఆహా! ఎంత అద్భుతమైన మార్పు. యేసుప్రభువు యొక్క శక్తి గల నామములో దొంగలు, త్రాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, అక్రమస్థులు, అన్యాయస్థులు మార్పుచెందుచున్నారు. పునరుత్థాన బలము వలన సౌలు నీతిమంతుడాయెను. ప్రియుడా! నీవు పాపపు కట్లనుండి విడుదల పొందియున్నావా? పునరుత్థానబలము వలన ఆయన మిషనరీ ప్రయాణములు చేసెను. 

  1. క్రీస్తును పోలి నడిచెను : (1 కొరింథి 11:1)

అవును రక్షింపబడినవారు క్రీస్తును పోలి నడువవలెను. లోకమును పోలి నడువకూడదు. కొంతమంది సినిమా యాక్టర్లను పోలి నడుచుదురు. అది ఎంతో భయంకరము. కాకి వంకరగా నడచును. పావురము అందముగా నడచును. సోదరుడా నీవు ఏరీతిగా నడుచుచున్నావు? ప్రియులైన పిల్లలవలె దేవుని పోలి నడువవలెను (ఎఫెసీ 5:1). హనోకు దేవునితో 300 సం లు నడిచెను. దేవుడతనిని పరలోకమునకు తీసుకొని వెళ్ళెను (ఆది 5:24). నీ గమ్యము పరలోకమేనా? 

  1. ప్రభువును సంతోషపరచెను : (1 థెస్స 2:4)

పునరుత్థాన బలము ఎరిగినవారు ప్రభువును సంతోష పెట్టుదురు. పౌలు ప్రతి విషయములో ప్రభువును సంతోషపరచెను. మనుష్యులను సంతోషపరచలేదు. అందువలన ఆయన ఎన్నో శ్రమలు అనుభవించెను. ఈ దినములలో రక్షింపబడినవారు సహితము పరిశు ద్దాత్మను దుఃఖపరచుచున్నారు. లోకపు మెప్పుకోరి పరిశు ద్ధాత్మకు వ్యతిరేకముగా ప్రవర్తించుచున్నారు (ఎఫెసీ 4:30). ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మొ॥వి ప్రభువుకు దుఃఖము కలుగజేయును. ప్రియ స్నేహితుడా! నీవు ప్రభువును సంతోషపరచుచున్నావా? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును (సామె 10:1). ప్రభువు కొరకు నీవు కనిపెట్టి ప్రార్థించి ప్రభువునందు భయభక్తులు కలిగియున్నచో ఆయన నీయందు ఆనందించును (కీర్త 147:11). 

3) తన ప్రాణము ఇచ్చుటకు సిద్దపడెను: (అ॥కా 21:13) 

 పునరుత్థాన బలము ఎరిగిన వారు ప్రాణమునిచ్చుటకు వెనుకాడరు. పౌలు యేసు నామము కొరకు ప్రాణమునిచ్చుటకు సిద్ధపడెను. ప్రాణమును ప్రియమైనదిగా ఆయన ఎంచుకొనలేదు (అ॥కా 20:24). 

 సువార్త నిమిత్తము ఆయన రోమా చెరలో వేయబడెను. తన చివరి పత్రిక తిమోతికి వ్రాసెను. “నా పరుగు కడ ముట్టించితిని” (2 తిమోతి 4:7). ప్రాణమునిచ్చుటకు ఆయన భయపడలేదు. మొదటి శతాబ్దకాలములో పౌలు రోమా పట్టణములో శిరచ్చేదనము చేయబడెను. డయోక్లీషియన్ అను రోమా చక్రవర్తి కాలములో ఆయన హతసాక్షియాయెను. “హత సాక్షుల రక్తము సంఘమునకు విత్తనము” వంటిది అని టర్టులియన్ చెప్పెను. 

 ప్రభువు మన కొరకు తన ప్రాణమును ఇచ్చెను. మనమును ప్రాణమునియ్య బద్ధులమైయున్నాము. పౌలు భక్తుడు శిరచ్ఛేదనము చేయబడినపుడు ఆయన ముఖము ప్రకాశించెను. ఆయనను కత్తితో నరికిన వ్యక్తి ఆయన ముఖములో ఉన్న ప్రకాశతను చూచి ఆశ్చర్యపడి క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించెను. ఆహా! ఎంత అద్భుతము. ఆయన మరణిస్తూ కూడ ఒక ఆత్మను రక్షించెను. నీవును అట్టి సమర్పణ కలిగియున్నావా? ఈస్టరు సందర్భముగా మనమును సజీవుడైన క్రీస్తును వెంబడించి ముందుకు సాగుదము. ప్రభువు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!! 

Christian Telugu Message Pdf Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf  Christian Telugu Message Pdf 


బైబిల్ ప్రశ్నలు – జవాబులు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted