నడక (WALK)
Bible Telugu Messeages
మానవ జీవితములో నడక ప్రాముఖ్యమైనది. అది ప్రభువు అనుగ్రహించిన వరము. ఎంతోమంది కాళ్ళు లేక నడువలేని వారు చింతించుచున్నారు. వారు కాళ్ళు ఉన్న వారిని చూచి వ్యసనపడుచున్నారు. ఈ లోకంలో ఎంతోమంది కాళ్ళు లేనివారుగా, అంగవైకల్యముతో పుట్టుచున్నారు. ఎంత విచారము ! నడుచుట అనేది ఒక ఆధిక్యత. ఒలింపిక్స్ ఆటలలో నడచుట, పరుగెత్తుట అను పోటీలు పెట్టి అందులో విజయం సాధించినవారికి బంగారు పతకములు ఇచ్చుదురు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైన డా॥ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిగారు 2004లో ఆంధ్రప్రదేశ్ అంతట పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను, మన్ననలను పొంది మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనేకులు గుడులను గోపురములకు నడచి వెళ్ళుదురు. నేపాల్ దేశస్థుడైన టెన్సింగ్ నార్కే నడచుకుంటు ఎవరెస్టు శిఖరమును అధిరోహించాడు. ప్రస్తుత దినములలో ఆరోగ్యముగా ఉండాలంటే ఉదయకాలమున నడవాలని (వాకింగ్) డాక్టర్లు చెప్పుచున్నారు. నడచుటలో ఆరోగ్యము, ఆనందమున్నది. అయితే బాహ్యమైన నడకకంటే ఆధ్యాత్మికమైన నడక ఎంతో శ్రేష్టమైనది. నడక ప్రవర్తనను సూచించుచున్నది. మనము దేవునితో నడవాలని ఆశపడితే, ప్రభువు కూడా మనతో నడవాలని ఆశించుచున్నారు. ఎమ్మాయి గ్రామమునకు వెళ్ళుచున్న ఆ ఇద్దరు శిష్యులతో ప్రభువు నడిచెను (లూకా 24:15). పరిశుద్ధ గ్రంథములో కొన్ని నడకలు గూర్చి వ్రాయబడి యున్నవి. వాటిని గూర్చి ధ్యానించుదము.
1.) పరిశుద్ధమైన నడక (ఆది.కా. 17:1)
“నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవైయుండుము” ప్రభువు ఇచ్చట అబ్రాముతో మాట్లాడుచున్నాడు. అబ్రాము పిలువబడినప్పుడు ఊరు అను పట్టణములో ఉన్నాడు. అది మెసపుతోమియా దేశములో యున్నది (అది.కా 7:2). దానిని కల్దీయ దేశము అని కూడ అందురు (నెహె 9:7). ప్రభువు అబ్రాముతో నీ తండ్రి ఇంటిని, బంధువులను, దేశమును విడచిపెట్టుమని చెప్పెను. అతడు వాటిని విడిచి పెట్టినప్పుడు ప్రభువు అతనిని ఆశీర్వదించెను. నీవు కూడ విడచిపెట్టవలసిన వాటిని విడిచిన యెడల దీవింప బడుదువు. మనము కార్బన్ డయాక్సైడ్ విడచిన ఎడల ఆక్సిజన్ను పీల్చుకొనగలము. ఆక్సిజన్ ద్వారా మనము బ్రదుకగలము. పాపమును విడచిపెట్టకుండా ఏ వ్యక్తి ఆశీర్వాదము పొందలేడు. “కోపము, దుష్టత్వము, మీ నోట బూతులు విసర్జించుడి” (కొలస్సీ 3:8). ఒక వ్యాపారి తన బుట్టలో గారెలు, వడలు, బజ్జీలు వేసుకొని సంతకు తీసుకెళ్ళుటకు బయలు దేరినప్పుడు మార్గమధ్యంలో ఒక కోతి అతనిని బెదిరించి బుట్టలోనున్న తినుబండారములను కొన్నింటిని తిని మిగతావాటిని చెల్లాచెదురు చేసి పారిపోయెడిది. దాంతో ఆ వ్యాపారి ఎంతో నష్టపోయాడు. కోతికి ఒక లక్షణముండును, అది ఏది పట్టుకొనినను త్వరగా విడిచి పెట్టదు. ఆ వ్యాపారి కోతికి బుద్ధి చెప్పుటకై ఒకరోజు తన బుట్టలో బొగ్గులతో ఎర్రగా కాల్చిన నిప్పులను ఉంచి సంతకు వెళ్ళుచుండెను. యధావిధిగా ఆ కోతి బుట్టలోనున్న నిప్పులను పట్టుకొనెను. దాని చేతులు, శరీరము కాలి చనిపోయెను. ప్రియ సోదరీ, సోదరుడా ! పాపమును విడువనిచో నరకము తప్పదు. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాని విడువవలెను (యోబు 11:14).
అబ్రాము పరిశుద్ధముగా, నిందారహితుడై యుండవలెనని హెచ్చరించ బడుచున్నాడు. అబ్రాము మీద ఒక నింద యున్నది. తన భార్యయైన శారయి ప్రేరేపణ వలన హాగరుతో పాపము చేసెను (ఆది 16:2). కొంతమంది భార్యలు భర్తలను చెడగొట్టుదురు. అవినీతి కార్యములకై ప్రోత్సహించుదురు. అట్టివారు తమ ఇంటిని కూల్చివేయుదురు. “Wife should not be Knife, Wife should be Life” హవ్వ ఆదామును చెడగొట్టెను. మీకాలు తన భర్తయైన దావీదు ప్రాణమును రక్షించెను (1 సమూ 19:11). సోదరీ ! నీ భర్తకు విధేయురాలవై ఆయన ఆత్మరక్షణకు అభివృద్ధికి తోడ్పడుచున్నావా? అబ్రాము హాగరుతో చేసిన తప్పిదము వలన ఈనాటికి ఇష్మాయేలీయులకు (అరబ్బులకు) ఇశ్రాయేలీయులకు (యూదులకు) యుద్ధములు జరుగుచున్నవి. అందుకే మన ప్రభువు ప్రతి వ్యక్తిలో పరిశుద్ధతను కోరుచున్నాడు. ఎందుకనగా ఆయన పరిశు ద్ధుడు (లేవీ 19:2, 1 పేతు 1:14). రక్షింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధముగా జీవించాలి. పరిశు ద్ధాత్మతో నీవు నింపబడుట ద్వారా నీవు పరిశుద్ధముగా జీవించగలవు (2 థెస్స 2:13).
2.) అందమైన నడక (పర.గీ 7:1)
“నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడచుచున్నావు” రాజైన సొలొమోను పరమగీతము అను గ్రంథమును వ్రాసెను. షూలమ్మీతిని రాజకుమారి పుత్రికా అని సంభోదించుచున్నాడు. ప్రభువునందు విశ్వసించినవారు రాజులైన యాజక సమూహముగా చేయబడిరి (1 పేతు 2:9). పౌలు సౌలుగా ఉన్నప్పుడు నేనెంత దౌర్భాగ్యుడను అని చెప్పుకొనెను (రోమా 7:24). హానికరుడు, హింసకుడు, దూషకుడు (1 తిమో 1:12). ప్రభువును అంగీకరించకముందు మనము దరిద్రులము. అయితే మారుమనస్సు పొందినట్లయిన ప్రభువు రాజకుమారుడుగా, రాజకుమార్తెగా మనలను చేయుచున్నాడు. కొడుకులు, కూతుళ్ళు అనిపించుకొనుట కంటె శ్రేష్ఠమైన పేరు పెట్టుచున్నాడు (యెష 56:5). నేను ఒక పర్యాయము రైలులో ప్రయాణించు చున్నప్పుడు మీరు ఎవరని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. వెంటనే నేను రాజకుమారుడనని చెప్పాను. నేను రాజువలె ఆయన యొద్దకు వెళ్ళెదనని యోబు చెప్పుచున్నారు (యోబు 31:37). ఈమె పాదరక్షలతో ఎంతో అందముగా నడచుచున్నది. సినిమాలో నటించువారు అందముగా నడుచుదురు. కాని వారిని అనుకరించువారు చెడిపోవుదురు. కాకి వంకరగా నడచును. పావురము అందముగా తిన్నగా నడచును. ఈ లోకస్థులు మూర్ఖమైన వక్రజనముగాని దేవుని బిడ్డలు నిరపరాధులు, అనింద్యులు (ఫిలిప్పీ 2:14-15). ప్రియుడా నీవు ఏ గుంపులో యున్నావు? పాదరక్షలు లేకుండా అందముగా నడువలేము. అనగా సమాధానము, సిద్ధమనస్సు అను జోడు తొడుగుకొనవలెను (ఎఫెసీ 6:15).
రక్షింపబడిన వారు దేవునితో మరియు అందరితో సమాధానము కలిగి యుందురు (రోమా 5:1, హెబ్రీ 12:4). సమాధానము లేకుండా నీవు భక్తి జీవితమును కొనసాగించలేవు. కొంతమంది భార్యాభర్తలు సమాధానముగా ఉండరు. వారు ఎల్లప్పుడు పోట్లాడుకొందురు. హైదరాబాద్లో రిటైర్డ్ అయిన ఇద్దరు భార్యాభర్తలున్నారు. వారు ఇరువురు చెరియొక బిల్డింగ్ కట్టుకొనిరి. వారు ఎవరి బిల్డింగ్ మీదవారు నిలువబడి ఒకరిని ఒకరు తిట్టుకొందురు. కొన్ని క్రైస్తవ సంఘములలో సమాధానము లేదు. ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేయుదురు. ఆఖరుకు సంఘకాపరిపై కూడా తిరుగుబాటు చేయుదురు. చివరకు అది పోలీస్టేషన్ వరకు వెళ్ళును. ఎంత విచారము. కాబట్టి విశ్వాసులు సమాధానమను బంధము చేత ముడివేయబడవలెను (ఎఫెసీ 4:1). రెండవదిగా సిద్ధమనస్సు అను జోడు తొడుగుకొనవలెను.
విశ్వాసులైనవారు ఎప్పటికప్పుడు సిద్ధపడవలెను. వారు Evready Battery Light వలె ఉండ వలెనని వాచ్మెన్ నీ అను దైవజనుడు చెప్పాడు. ప్రభువు వచ్చేసరికి నీవు సిద్ధపడి ఉండాలి. అనేకులు యోనావలె నిద్రబోతులుగా ఉన్నారు (యోనా 1:6). సోమరితనము ఎంతో భయంకరమైన పాపము. సోమరితనము 3 విధములుగా యున్నది.
- ఎ. శరీర సంబంధమైనది : ప్రభువు పని చేయనివ్వదు
- బి: మనో సంబంధమైనది : వాక్యము ధ్యానించనివ్వదు
- సి. ఆత్మసంబంధమైనది : ప్రార్థన చేయనివ్వదు
ప్రియమైన సోదరుడా, సోదరీ నీవు సోమరిగాయున్నచో నీ ఆత్మీయ జీవితము చల్లారి పోవును. నీవు నిష్ప్రయోజకుడుగా మారెదవు. నీవలన ప్రభువు ఆత్మ దుఃఖపడును. సోమరీ చీమలు యొద్దకు వెళ్ళుము. మనము యోహాను వలె మండుచున్న దీపము వలె ఉండవలెను (యోహా 5:35). ప్రభువు చెప్పిన పదిమంది కన్యకల ఉపమానములో సిద్ధపడియున్నవారు పెండ్లి విందు లోనికి వెళ్ళిరి అని వ్రాయబడింది (మత్త 25:10). వారు తమ సిద్దెలలో నూనె నింపుకొని యుండిరి. నీ హృదయము ప్రభువు వాక్యముతో నింపబడవలెను (కొలస్సీ 3:16).
వాక్యము నిన్ను పాపము నుండి భద్రపర్చును (కీర్త 119:11) వాక్యము సర్వశరీరమునకు ఆరోగ్యమిచ్చును (సామె 4:22) వాక్యము ఆనందమిచ్చును (కీర్త 1:2) వాక్యము బాధలో నెమ్మది కలిగించును (కీర్త 119:50) వాక్యము గొప్ప లాభము కలిగించును (కీర్త 19:11).
రెండవదిగా నీ హృదయము పరిశుద్ధాత్మతో నింపబడవలెను (అపొ.కా 4:31). ఈ దినములలో అనేకమంది పరిశుద్ధాత్మను ఒకసారి పొందితే చాలు అనుకొందురు. కాని దినదినము నీవు పరిశుద్ధాత్మతో నింపబడవలెను. భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉన్నట్లు లేకపోతే లేనట్లు అని కొందురు. భాషలు కేవలము కృపావరములలో ఒకటియైయున్నవి. పరిశుద్ధాత్మ నింపుదలకు భాషలు మాత్రమే సూచన కాదు. విశ్వాసులు కొందరు భాషలు మాట్లాడుదురు మరియు బూతులు కూడా మాట్లాడుదురు. అట్టివారిలో దురాత్మ యుండును. ఉద్రేకము కాదు గాని ఉజ్జీవము మనకు అవసరము. ఆత్మనింపుదల గలవారిలో దేవుని ప్రేమ ఉండును (రోమా 5:5). ప్రభువు యెహెజ్కేలుతో “నీవు సిద్ధపడుము, నీతో కలసియున్న సమూహమును సిద్ధపర్చుము అని చెప్పారు (యెహె 38:7). సమరయ స్త్రీ తాను సిద్ధపడి సుఖారు గ్రామమంతటిని సిద్ధపర్చెను. ప్రియుడా నీ కుటుంబమును, గ్రామమును, పట్టణమును సిద్ధపర్చుచున్నావా? నశించుచున్న ఆత్మలను ప్రభువు యొద్దకు తెచ్చుచున్నావా? యిర్మీయా వలె కన్నీటితో ప్రార్థించుచున్నావా? అది యే అందమైన నడక.
3.) సహవాసపు నడక (ఆది 5:22)
హనోకు 300 సం॥లు దేవునితో నడిచెను. ఇతడు షేతు వంశావళిలో నుండి వచ్చెను. హనోకు అనగా ప్రతిష్ఠింపబడినవాడు అని అర్ధము. ప్రభువుతో నీవు సహవాసము చేయుటకు ముందుగా నీవు నీ జీవితమును ప్రభువుకు ప్రతిష్ఠించవలెను. నీ హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించవలెను (1 పేతు 3:16). నీ హృదయములో ప్రభువు లేనిచో సాతాను శరీరాశ, నేత్రాశ, జీవపుడంబముతో నింపును. హనోకు మెతూషెలను కనిన తరువాత దేవునితో నడిచెను. మెతూషెల అను మాటకు ఈటె గలవాడు అని అర్థము. ఈటె దేవుని వాక్యమునకు సూచన (హెబ్రీ 4:12). నీ బిడ్డలకు నీవు వాక్యమును ఇవ్వవలెను. వాక్యము ద్వారా వారు ఆశీర్వాదమును అభివృద్ధిని పొందెదరు. మా కుమార్తెకు, ఇద్దరు కుమారులకు మేము వాక్యము నిచ్చితిమి. వారు దైవసేవకులైరి. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు ధనము నిచ్చుదురు. అది వారిని పాడుచేయును. హనోకు తన కుమారునికి వాక్యము అను ఈటెను ఇచ్చెను. హనోకు ప్రభువుతో సహవాసము కల్గియుండెను. “ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆలాగున మేలు కలుగును” (యోబు 22:21).
అబ్రాహాము దేవుని స్నేహితుడని పిలువబడెను (యాకో 2:23). ఎన్నో మేలులు పొందెను. ఆయన సంతానము ఆకాశ నక్షత్రములవలె వృద్ధి చెందెను. నీవు ప్రభువుతో స్నేహము చేయుట ద్వారా పిల్లలు లేని కొరత తీరును. ఆర్ధికముగా నీవు అభివృద్ధి చెందెదవు (కీర్త 113:9, ద్వితీ. కా. 28:1). ప్రభువు నిన్ను స్వస్థపర్చును (సామె 3:8). హనోకు కుమారులను కుమార్తెలను కనెను. అనగా ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ప్రభువు కుటుంబమును కట్టును. విశ్వాసులు, సేవకులు అనబడువారు వివాహము చేసికొని ప్రభువుకు ఘనత తీసికొని రావలెను. వివాహము నిషేధించుట అనునది దయ్యముల బోధ (1తిమో 4:3). దేవుని సంఘమును నడిపించువాడు ఏకపత్ని పురుషుడుగా యుండవలెను (1 తిమో 3:1). అనేకమంది యవ్వనులు వివాహమును నిషేధించుచు దేవుని సేవలో ప్రవేశించుచున్నారు. చివరకు శోధనలలో పడి ప్రభువు నామమునకు అవమానము తెచ్చుచున్నారు. అట్టివారి విషయము జాగ్రత్తగా ఉండవలెను.
హనోకు కుమారులను కుమార్తెలను కనెను అనగా ఆత్మీయ బిడ్డలను కనుటను సూచించుచున్నది. రక్షించబడుట రక్షించుట కొరకే యని జనరల్ విలియమ్ బూత్ అనే దైవజనుడు చెప్పారు. రాహేలు యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము లేనియెడల నేను చచ్చెదను అనెను (ఆది 30:1). ఆత్మల కొరకై ఆవేదన అవసరము. ఆత్మలను నాకిమ్ము లేని ఎడల నా ఆత్మను తీసికొనుము అని ప్రార్థనాపరుడైన హైడ్ చెప్పెను. ఆత్మీయ జీవితములో ఈ మూడు విధములుగా నడిచి ప్రభువును మహిమపర్చుదము. ప్రభువు అట్టి కృప కృపావార్త సభ్యులకు అనుగ్రహించును గాక ! హల్లెలూయ.
అబద్ద బోధకుల గురించి…………Click Here